మానవ సంబంధాలను కదిలించే ʹమార్కెట్ గాలిʹ గురించిన కథ ʹరమాదేవి కొడుకుʹ

| సాహిత్యం | క‌థ‌లు

మానవ సంబంధాలను కదిలించే ʹమార్కెట్ గాలిʹ గురించిన కథ ʹరమాదేవి కొడుకుʹ

- పలమనేరు బాలాజీ | 01.07.2020 10:53:30pm

మార్కెట్ మాయాజాలం తాలూకు ʹమార్కెట్ గాలి ʹ మానవ సంబంధాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించిన కథ డాక్టర్ కె. సుభాషిణి గారి " రమాదేవి కొడుకు". ఈ కథ విరసం వారి కథల పంట 3 కథాసంకలనం (2015)లో ఉన్నది. అంతకంటే ముందు చినుకు మాసపత్రికలో (2014 ఆగస్టు)ఈ కథ ప్రచురితమైంది. మంచి ప్రారంభం ఎప్పుడూ కథకు బలాన్నిస్తుంది. కథను చదవటానికి పాఠకుడు ఇష్టపడటానికి, ఉత్సాహం చూపించడానికి వీలుగా కథలో ప్రారంభం పాఠకుడిని సులభంగా కథ లోకి తీసుకెళ్తుంది. ప్రారంభంలోనే ప్రధాన పాత్ర తాలూకు మూడ్ ను రచయిత పాఠకుడికి తెలియజేయడం ద్వారా కథకుడు కథావరణం లోకి సునాయాసంగా ప్రవేశించ గలుగుతాడు.

ఈ కథలో రమాదేవి మనస్తత్వాన్ని పరిస్థితులకు అనుగుణంగా మారే ఆమె మాటల్ని ఆలోచనల్ని ప్రవర్తనని అభిప్రాయాలను రచయిత్రి ప్రతిభావంతంగా కథలో చూపించారు.ఆమె భయాలు ఆమె అభద్రత, ఆలోచనలు, ఆందోళన,ఆశలు,కోరికలు ఎప్పటికప్పుడు మారే ఆమె ఆలోచనాధోరణి సహా ఈ కథలో చూడవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజాన్ని విధ్వంసం చేస్తూ, మరో రకంగా సమాజాన్ని పునర్మిమిస్తున్న మార్కెట్ మాయాజాలం గురించిన కథ ఇది. జీవితాల్లో అన్ని మార్పులకు కారణం అవుతున్న, జీవిత గమ్యం, గమనాలను మారుస్తున్న మార్కెట్ గాలికి సంబంధించిన కథ ఇది. కథ చదువుతున్నంత సేపు కథ చదివిన తర్వాత కూడా ఈ మార్కెట్ గాలి పాఠకులను వదిలిపెట్టదు.ఒక ఒంటరి మహిళ నలుగురిలో ఉద్యోగం చేస్తూ తనను తాను కాపాడుకోవడానికి ఎన్ని బాధలు పడుతుందో, కొడుకును మంచి మార్గంలో పెట్టడానికి, ఒక బతుకు దారి చూపించడానికి అనునిత్యం ఎంత తాపత్రయ పడుతుందో రమాదేవిలో చూడవచ్చు. కథ చదువుతున్నంత సేపు పాఠకుడు రమాదేవిలో తనను చూసుకోవటం కానీ తనలో రమాదేవిని చూసుకోవడం కానీ జరుగుతుందంటే ఒక పాత్రలో అంతగా లీనమయ్యేలా శక్తివంతంగా సుభాషిణి గారు పాత్రచిత్రణ చేయడం ఈ కథలో ప్రత్యేకం. అనేకమంది ఒంటరి నడివయసు మహిళల్లో గూడు కట్టుకున్న అభద్రతా భావానికి, ఎట్లాగైనా సమాజంలో ఉన్నత కుటుంబంగా, మంచిగా నిలబడాలని,తన పైన ఎలాంటి అపవాదు రాకుండా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని, నీతిగా నిజాయితీగా నిలబడాలనీ, ఎవరి దగ్గర దేనికి చేతులు చాపకూడదనీ, ఎవరు ఎన్ని రకాలుగా బ్రతిమలాడినా తను మిగిల్చిన సొమ్ము ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని, తన డబ్బు ఎప్పుడూ పోగొట్టుకోకూడదని, ఉన్నంతలో గుట్టుగా బతకాలని, కొడుకును ప్రయోజకుడ్ని చేయాలని , నలుగురిలో గుర్తింపు పొందాలనీ అనుకునే మధ్యతరగతి మనస్తత్వానికి చక్కటి ప్రతీక రమాదేవి.

ʹదీన్ని పొరబాటు అనల్నా ల్యాక గ్రహపాటు అనుకకోవాల్నాʹ కొన్ని రోజులుగా అనుకున్న మాటల్నే పదే పదే అనుకుంటోంది రమాదేవి. గ్రహపాటు అని అనిపించినప్పుడు ʹనా టైమ్ బాగలేక ఇట్లు అయితాండాదేమో.... అయినా నా టైమ్ ఎప్పుడు బాగుంది గనకʹ అని దిగులు పడి తనకు సంబంధించిన వాళ్లనందరిని వరుసగా గుర్తు చేసుకుంటుంది రమాదేవి. పదో తరగతి చదువుతుండగానే పెండ్లి చేసిన తండ్రిని, పిల్లలను తనకు వదిలేసి అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయిన భర్తను, ఇప్పుడు తనను అప్పుల పాలు చేస్తున్న కొడుకును అందరికీ వరుస పెట్టి తిట్టడం మొదలు పెడుతుంది. అంతలోనే ʹఇది గుడ్డిగా ఈ నా కొడుకు మాటలు నమ్మితిʹ... అని తనను తాను తిట్టుకోవడం మొదలైన ఉక్రోషం కొడుకు మీద కోపంగా మారిపోతుంది.

ఇంట్లో పని చేసుకోడానికీ, ఆఫీసులో రోజుకు పదిసార్లు మెట్లెక్కి దిగడానికైనా బలవంతంగా నాలుగు ముద్దలు మింగుతోంది. రమాదేవి. నీళ్లకోసమో, టీ కోసమో లేకపోతే ఫైల్స్ అటూ ఇటూ ఇచ్చి రావడానికో ఆఫీసులో రెండంతస్తుల బిల్డింగ్ ఎక్కి దిగుతూనే ఉంటుంది రమాదేవి. ఈ మధ్య కాలంలో కంటినిండా నిద్ర లేదు రమాదేవికి, ఎప్పుడూ కలత నిద్రే.

చదువు మానిపించి ,పెండ్లి చేస్తామని ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఏడ్చిన ఏడుపు,భర్త చనిపోయినప్పుడు ఏడ్చిన ఏడుపు ఇప్పుడయితే రావటం లేదు కాని దిగులు భయంతో తల్లడిల్లిపోతోంది. ఒకవైపు కొడుకు మీద ఉన్న ప్రేమ, ఇంకొకవైపు కొడుకు మీద పట్టరానంతంగా వస్తున్న కోపం రెండింటి మద్య నలిగిపోతోంది రమాదేవి.

ʹ ఎట్లన్నా పోనీ... ఎంతకని పోరాడేది.. ఎన్ని తిప్పలని పడేది. వాడు అడగడం,ఎనకా ముందు చూసుకోకుండా వాని చేతుల్లో పెట్టడం... వాడు ఆడింది ఆట పాడింది పాట అయిపోయా...! ఆయన పోయినాక ఎంత మంది చుట్టాలు ఇంటికి వచ్చేటోళ్లు ? ఎట్ల డబ్బులు అడిగేటోళ్లు..?ఏనాడు ఒక్కరికి ఒక వంద రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు...! అందరూ ఎన్నెన్ని మాటలు అనుకునేవాళ్లో..!ʹ

బంధువులు తన గురించి మాట్లాడే మాటలు రమాదేవి ఎప్పుడూ మరిచిపోదు. ఆమె చాలా గట్టిదని, ఒకే ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టదని, ఒకరిని అడగదని, ఇంకొకరికి ఒక రూపాయి రాల్చదని వాళ్ళు అనే మాటలు ఆమెకు తెలుసు. అందుకనే ఆమె బంధువులను చాలా దూరం పెట్టింది.

ఇక్కడ భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడానికి సమాజం భయపడుతోందో ఆ భయాన్ని రచయిత్రి రమాదేవి మాటల్లో చెబుతుంది. ఇప్పుడున్న సమాజంలో వ్యవసాయం చేసే యువరైతుకు అమ్మాయిని ఇవ్వటానికి అమ్మాయి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. రైతుకు అప్పు ఇవ్వడానికి సమాజం సిద్ధంగా లేదు. భారతీయ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం సంక్షోభాలు రైతు పట్ల సమాజం చూపించే నిరాదరణను రచయిత్రి ప్రతిభావంతంగా ఒక్కమాటలో చెబుతుంది.

రమాదేవికి ఆటు పుట్టింటి వైపు చూసినా, ఇటు అత్తింటి వైపు చూసినా బంధువులందరూ దాదాపు రైతులే. రైతులకు అప్పు ఇస్తే వాళ్లను మరింతగా అప్పుల పాలు చేసినట్టవుతుందని, హైగా వాళ్లకిస్తే వడ్ది కాదు కదా అసలు కూడా రాబట్టుకోలేను అని రమాదేవికి గాఢమైన నమ్మకం. -అంటుంది రచయిత్రి.

బంధువులు ఎవరైనా మాట సహాయమో లేక చేయి సహాయమో చేసిన వారయితే, వాళ్లు ఇంటికి వచ్చినప్పుడు అరకేజి శనగ బేడలు ఉడకబెట్టి బెల్లం వేసి రుబ్బి భక్షాలు చేసి పెట్టేది. ఒకవేళ వాళ్లు ఆదివారం పూట కూడా నిలిచిపోతే మెత్తటి, పలుచటి జొన్న రొట్టెలు పొంగేలా చేసి అందులోకి కోడిపులుసు చేసిపెట్టేది. కారం మసాలా బాగా దట్టించి వండేది. అది అంత వరకే. వాళ్ళు ఎవరూ మళ్ళీ అప్పు అడగకుండా ఇద్దరు బిడ్డలతో తను పడుతున్న ఇబ్బందులను వారికి చెప్పుకు వచ్చేది.

పెద్ద పెద్ద అట్ట పెట్టెల్లో కంప్యూటర్, స్కానరూ, ప్రింటర్, ఇన్వర్టర్.. తెచ్చి ఇంట్లో పెట్టేసిన కొడుకు దిలీప్ ను రమాదేవి ఎందుకు ఆఫీస్ మూసేసావని ప్రశ్నిస్తుంది.

లక్షలు పెట్టుబడి మొత్తం పోగొట్టుకొని ఇప్పుడు ఇలా చేస్తే ,ఎలా నిలబడాలని నిలదీస్తుంది. ఆమె కోపం ,ఆమె బాధ ,ఆమె భయం కొడుకుకు నచ్చవు.

ʹమళ్లీ నస మొదలు పెట్టింది. చెప్తే అర్థం కాదు.స్వతహాగా తెలుసుకోలేదు. అన్నిటికి భయమే. ముందుకే పోనియ్యదు... ఈమెభయంతోనూ, చాదస్తంతోనూ చస్తున్నా. మొత్తానికి మహా తల్లి ఎట్ల పుట్టిందో. మా నాన్న ఎట్లా భరించినాడో ఈమెను. ఖర్చు పెట్టే దమ్ము లేదు.. సంపాయించే తెలివి తేటలు లేవు... ఉండేటివి ఖర్చు కాకుంటే చాలు ఈమెకు. కానీ మళ్లీ కొడుకు బాగుండాల.. మంచి పొజిషన్ లో ఉండాల.. డబ్బులు సంపాదించాల.. సుఖ పడాల.. వూరికే కోరిక ఉంటే సరిపోతుందా? ఏందో ఈమె, ఈమె లాజిక్ , ఈమె ఆలోచనలు..! ఈవిడ మారే రకం కూడా కాదు. ఫ్యాన్ వేసుకుంటేనే ఎందుకు అనవసరంగా కరెంట్ దండగ అనే ఈమె ఇంగ జీవితంలో ఏ.సి. పెట్టిస్తుందనేది కలలో మాటే.డొక్కు డబ్బా కూలర్ ఒకటి ఏడ్చింది ఇంట్లో. ఇంక అందరికి అదే. అక్కా బావా వస్తే వాళ్లకు కూడా అదే గతి.రేపు నా పెండ్లి అయినాక దీంతోనే అడ్జస్ట్ అవ్వమంటాది గ్యారెంటీగా. వీళ్ళ మాదిరిగా అన్నిటికి సర్దుకొని బతికే ఖర్మ ఏం పట్టింది. వంద రూపాయలు ఖర్చు చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తే ఇంక జీవితంలో ఏం ఎంజాయ్ చేస్తాం.అందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తుండారు..! డబ్బులు సంపాదించాలా.. ఎంజాయ్ చేయాలా.. గీసి గీసిఖర్చు పెట్టే అమ్మకేం తెలుసు ఎంజాయ్ చేయడం అంటే ఏందో..ఒగరికియ్యదు. తనకూ ఖర్చు పెట్టుకోదుʹ ఇది కొడుకు అంతరంగం. అతన్ని బాగా అర్థం చేసుకుంది కనుకే రమాదేవి అతడికి నచ్చ చెప్తుంది. ఆమె బాధ ఆమె ఆవేశం ఆమె మాటల్లోనే.. విందాం.

" వాళ్లు ఇంత ఇచ్చినారు.వీళ్లు ఇంత సంపాయిచ్చినారు అని చెప్తాన్నావ్ బానే ఉంది... అందరికీ కలిసి రావద్దూ.. వ్యాపారం అంటే మాటలా.. పొద్దున లేసిన దగ్గర నుండి అబద్దాలు చెప్తానే వుండాలా!ఎవరు దొరుకుతారా ఎవరి నెత్తిన చేతులు పెడ్తామా అని ఎతుకు తండాలా ..!అట్లయితేనే నెగ్గుకు రాగలవు... మనట్లా వాళ్ల చాత యాడ యితాది? ఇంజనీరింగ్ చదివితివి.యాడో ఒక చోట ఉద్యోగం చూసుకో అని నెత్తిన నోరు పెట్టుకోని చెప్తి.. ఏదో ఉన్న కాటికి వున్నిందుము. అప్పు సప్పు ల్యాకుండా ఆడపిల్ల పెండ్లి చేస్తిమి. నీ సదువు కూడా ఏం ఇబ్బంది లేకుండా అయిపోయా.. అంతో ఇంతో మిగిలిండేది తీస్కపోయి కంప్యూటర్ సెంటర్ పెడితివి.కాలేజీలు పని చేయించుకుంటా యి అంటివి, వాళ్లు ఎవరూ నిన్ను అడగడం లేదని ,యావో కోచింగులూ, కోర్సులూ అని మొదలుపెడ్తివి .. దాండ్లకు డిమాండ్ పడిపోయిందని, ఎవరూ చేరడం లేదని వద్దనుకుంటివి. మళ్లీ ఇంకా ఏందో యానిమేషన్ అంటివి. నా శక్తికొద్ది ఆ లోను ఈ లోనూ పెట్టి, చీటి పాడి నీ చేతిలో పెడ్తి..అదికూడా ఎత్తి పాయా.. తర్వాత పాత సినిమాలను కలర్లలోకి మార్చాలా ..దీనికి తిరుగే ఉండదు అంటివి.సరే ఉండేది ఎప్పటికైనా నీకే కదా! ఉంచుకుంటే ఉంచుకో లేదా ఖర్చు పెట్టుకో అన్నట్టు పి.ఎఫ్.లోనూ పెట్టి తీసి ఇస్తి. ఇన్ని చేస్తివి బానే ఉంది. మొదలు పెట్టేతప్పుడు ఏం చెప్తివి ...!మూడు లక్షలు పెడితే చాలుమా.మూడు నెలల్లో యొబై వేలు ఆదాయం ఉంటుంది. ఖర్చులన్నీ పోనూ ఎంత లేదన్నా కనీసం నెలకు ముప్పై వేలు మిగులుతుంది అంటివి..ఏదీ? ఆఫీసుకు రెంట్ కోసం కూడా నా జీతంలోదే యియ్యాల్సి వచ్చింది... మధ్యలో అడ్డం రావద్దు నన్ను చెప్పనీ... కొడుకు బాగుపడాలనే ప్రతి తల్లి కోరుకుంటాది. ఇప్పుడు ఇంకా కావాలా అంటే నేను యాన్నుండి తెచ్చి యియ్యాల్నో నువ్వే చెప్పు.."

ఈ కథలో కీలకమైన సందర్భం ఇదే .ఎప్పుడూ పెద్దగా మాట్లాడని తల్లి అంత సుదీర్ఘంగా మాట్లాడేసరికి దిలీప్ ఆశ్చర్యపోతాడు. అందుకే ఆమె మాటకు ఎదురు చెప్పడు. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే తల్లి రెచ్చిపోతుందేమో అని భయపడతాడు. తన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఎంత ఆలోచించినా తనను తాను సమర్దించుకుంటాడు.

అప్పుడప్పుడు దిలీప్ ఇంటికి రాకుండా వాళ్ళ ఫ్రెండ్ రూములో ఉండటం మామూలే.ఏదో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ పనులు ఉన్నాయని సాకులు చెప్పేవాడు.

ఒక్కొక్కసారి ఆ మాటల్ని నమ్మేది.. ఒక్కొక్కసారి వీళ్ళందరూ ఒక రూములో చేరి ఏం చేస్తుంటారో అని కొడుకు మీద అనుమానంగా కూడా ఉండేది.

మగపిల్లలందరు ఒక చోట చేరితే ఏం చేస్తుంటారో రమాదేవి ఎప్పుడూ చూడలేదు

తల్లులకు పిల్లల పైన ఉండే నమ్మకాన్ని, భయాన్ని, అనుమానాన్ని కూడా ఒక్క వాక్యంలో రచయిత్రి ప్రతిభావంతంగా చూపించింది.కథను అర్థం చేసుకోవాలనుకునే పాఠకుడు కథలో రచయిత్రి సూచించిన విషయాలను జాగ్రత్తగా గమనించగలిగితే కథాంశం త్వరితగతిన అర్థం అవుతుంది.పాత్రల మనస్తత్వ చిత్రణతో బాటు, మనుషుల్ని ఆడించే మార్కెట్ మాయాజాలం గురించి మొత్తం కథంతా తల్లి కొడుకుల సంభాషణ ద్వారా, సంఘర్షణ ద్వారానే రచయిత్రి చెబుతుంది. ఇదే ఈ కథకు బలాన్ని చేకూర్చింది.

కొడుకు ఎక్కడైనా తాగుతున్నాడడేమో అనే భయం ఒక పక్క ఉండేది రమాదేవికి. అదే మాట చెప్పిన మరిదితో మాత్రం వాదించి తన కొడుకు మంచివాడని వెనకేసుకు వస్తుంది. తండ్రి లేని కొడుకు అని చిన్నగా నచ్చచెప్పాలని అనుకొని తాగి చెడిపోయిన పిల్లల గురించి పరోక్షంగా హెచ్చరికగా కొడుకుకు చెప్పేది.

ఎంతైనా నా దిలీప్ ది ఖర్చుకు వెనుకాడని చెయ్యి. రమాదేవి ఎంత పొదుపరో ,దిలీప్ అంత ఖర్చు పెట్టే మనిషి.

అంతగా ఏదీ కుదరకపోతే తను ఏ ప్రైవేట్ స్కూల్లోనో పని చేస్తే మూడు నాలుగు వేలు జీతం వస్తుంది అని అంటాడు దిలీప్.ఆ మాటలు ఆమెను నొప్పిస్తాయి. ఇంత కష్టపడింది, ఇంత ఖర్చు పెట్టిందీ ఎందుకు అని ఆలోచిస్తుంది. ఒక చిన్న ఆశ మళ్లీ ఆమెలో కలుగుతుంది. ఇదే చివరి సారి అంటున్నాడు కదా సహాయం చేద్దామని అనుకుంటుంది. ఏదేమైనా ఇల్లు ఉంది కదా ఇంకా పదహైదు సంవత్సరాల సర్వీసు ఉంది కదా, పెన్షన్ వస్తుంది. ఏదేమైనా నా కొడుకు తనను సాకే అవసరం ఎప్పుడూ ఉండదు. జీవితకాలమంతా ఈ నా కొడుకును భరించుకుంటే చాలు అని అనుకుంటుంది. తల్లిగా వానికి ఎంత చేయాలో అంత కంటే ఎక్కువ చేశాను ఇంకా కొడుకుగా వాడు ఎంత చేయాలో వాడే అర్థం చేసుకోవాలి.తనకు ఏమీ చేయకపోయినా వాని బతుకు వాడు బతికి నలుగురికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు ఇంకేమీ వద్దు అని అనుకుంటుంది.

ఇప్పుడు ఉన్నఫలంగా ఆఫీసు మూసేస్తే అంతా నష్టమే కదా .అంతా అమ్మితే కూడా యాభై అరవై వేలు చేతికి వస్తాయి అంటాడు ..ఉత్త పుణ్యానికి సంవత్సరానికి ఏడు లక్షలకు పైగా దుంపనాశనం అయిపోయిందే అని బాధపడుతుంది. మళ్లీ కొడుకు మాటలతో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఏదో తెగింపు ఆమెలో కనబడుతుంది.రమాదేవికి మనసులో ఎక్కడో ఏ మూలో చిన్న ఆశ పనిచేస్తుంది.

కథ ముగింపు ఇలా ఉంది.!

రమాదేవికి ఉన్నట్టుండి వాళ్ల పెద్దమ్మ కొడుకు అన్న మాటలు గుర్తుకు వచ్చినాయి.

" సీడ్ పత్తికి మార్కెట్టులో రేట్ బాగుందంట అకయా... అప్పోసప్పో చేసి అదే ఏచ్చాన్నా... దెబ్బతో ఈసారి అప్పులన్నీ తీరిపోతాయి.."

విరక్తిగా నవ్వుకుంది.

ʹరేట్ బాగుంది అని వేయడం, తీరా పంట చేతికొచ్చాకా రేట్ దబాల్న పడిపోవడం... వీళ్లకేం తిక్క అనుకుంటాంటిని. తిక్క వాళ్లకే కాదు వీనికి కూడా ఎక్కినట్టుంది.

మార్కెట్టులో దీనికి బాగా డిమాండ్ వుంది అంటాడు.. అంటే వాళ్ళకెవరికో వీడు చేసిన పని నచ్చాలా, వాళ్లకు ఆ పని అవసరం ఉండాలా.. అప్పుడు వీనికి పని ఇస్తారు. అట్లయితేనే వీడు బయట పడేది... ఓయమ్మొయ్... చానా కథ ఉందే. గాలిలో దీపం పెట్టినాం.. మార్కెట్ గాలి దయచూపితే బయటబడ్తాం..
లేకుంటే మాత్రం నిలువునా కూరుకుపోతాం...ʹ

ఇదీ కథ.

వ్యాపారం అనే బురదగుంటలోకి ఒకసారి దిగినాక మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. మధ్యతరగతి మనుషులు ఎన్నో ఆశలతో వ్యాపారంలోకి ఏదో సాధించాలని అడుగు పెడతారు. ఇంజినీరింగ్ చదివి ఏదో ఒక ఉద్యోగం చూసుకోకుండా సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న దిలీప్ ఆశలు ఏ విధంగా మార్కెట్ గాలికి కదిలిపోతున్నాయో కథలో స్పష్టంగా ఉంది. మార్కెట్ మాయాజాలం
అత్యంత వేగంగా మధ్యతరగతి మనుషుల జీవితాలను ఎంతగా కల్లోల పరుస్తుందో, మానవ సంబంధాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో ఈ కథ చెబుతుంది.

ఏదో సాధించి తీరాలనే తపనతో ఉన్న దిలీప్ తన లక్ష్యాన్ని సాధించ గలుగుతాడా? జీవితంలో నిలబడ గలుగుతాడా అని చెప్పేది కాలం కాదు, మార్కెట్ గాలి మాత్రమే.

సమాజంలోని అనేక అసమానతలకు, సంఘర్షణలకు ,మానవ సంబంధాల విచ్ఛిన్నతకు , అనేక ఆత్మహత్యలకు కారణం ఈ మార్కెట్ గాలి.
మానవసంబంధాలలోని సున్నితత్వాన్ని, అనేక సంఘర్షణలను, మార్కెట్ మాయాజాలాన్ని, మొత్తంగా ఒక నవలలో చెప్పాల్సిన కథాంశాన్ని కథలో చెప్పటం రచయిత్రి సాధించిన విజయం.

ఈ కథ చదువుతున్నంత సేపు అనేక పొరలు విడిపోతాయి. సత్యం బోధపడుతుంది. ఎంత నిరాశామయ పరిస్థితుల్లోనైనా ఎన్ని ఓటములలో అయినా మళ్లీ ఎట్లాగైనా చిగురించే ఒక చిన్న ఆశ మనిషిని బ్రతికిస్తుంది. అదే మనిషిని ముందుకు నడిపిస్తుంది. రేపటి పైన ఆశతో ఆ తల్లి, ఆ కొడుకు మళ్లీ సాహసవంతంగా మరో ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు.

కొడుకును తల్లి అర్థం చేసుకున్న విధంగా, తల్లి బాధను కూడా కొడుకు అర్థం చేసుకోగలిగితే ఆ తల్లి బిడ్డల మధ్య అనుబంధం ఎప్పటికీ చిగురిస్తూనే ఉంటుంది.

ఈ కథ కేవలం రమాదేవి కథ కాదు. కేవలం దిలీప్ కథ కాదు. అనేక తల్లుల అనేక కొడుకుల కథ ఇది. మధ్యతరగతి జీవుల వ్యధ ఇది. ఇదొక మానవసంబంధాల కథ. మార్కెట్ మాయాజాలం తాలూకు మార్కెట్ గాలి ఏమిటో, అనేక క నిజాలను తెలియజేసే ఒక మంచి కథ.!No. of visitors : 380
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

పలమనేరు బాలాజీ | 02.08.2020 04:14:44pm

కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •