ప్రజాగేయం

| సాహిత్యం | వ్యాసాలు

ప్రజాగేయం

- చెరబండరాజు | 02.07.2020 05:44:29pm(విరసం పాట రాసి, పాడి ప్రజలలోకి తీసుకుపోవాలని మధన పడుతున్న రోజులలో ʹప్రజా గేయం అంటే ఏమిటి ? అని ఆప్పటికే ఎన్నో పాటలు రాసిన చెరబండరాజు తన పాటల ప్రస్తావన కూడా లేకుండ రాసిన వ్యాసం. రచనా కాలం- 1972. చెరబండరాజు వర్ధంతి సంధర్బంగా)

జానపద గేయాలు జనపదాలకు, పామరులకు సంబంధించినవంటారు సరికొత్త వాగమశాసనులు.

శాస్త్రోక్తంగా వాటిని స్త్రీల పాటలు, పిల్లల పాటలు, శ్రామిక గీతాలు, సరసాలుగా విభజించి పుస్తకాలు రాసుకుంటారు భాషోద్ధారకులు.

యేల పాటలు, పడవ పదాలు, దంపుళ్ళపాటలు, మేలుకొలుపులు, వీర గాధలు, శృంగార గీతాలు, లాలిపాటలుగా విభాగించి సాహిత్య సేవ చేస్తారు మధుర సాహితీ ప్రియులు, మధురత్వాన్ని ఆస్వాదించడమే జీవిత పరమార్థంగా భావించే వాళ్ళు ,

ప్రజా గేయాల పేరుతో, అత్తా కోడళ్ళ సంవాదాలు, ప్రేయసీ ప్రియుల సరససల్లాపాలు , విరహగీతాలు, విన్నపాలు ప్రసారం చేసి వినోదం కలిగిస్తాయి రేడియోలు.

జానపద గీతం అనగానే శృంగారం, బూతు మినహా మరొకటి లేదనే అభిప్రాయం కలిగించిన ʹసహృదయులు" సాహిత్య వీధులలో విజయ ధ్వజం ఇంకా ఎగరవేస్తూనే వున్నారు.

కవి సమ్మేళనాలలో, పాఠ్య గ్రంధాలలో ఈ గేయాలకు పీఠం లేదు. పాడే కవులకు ఆదరణ లేదు. సాహిత్య రంగంలో సముచిత స్థానమూ లేదు.

ఇలా ఎందుకు జరుగుతోంది ?

ఒక వైపు జానపదగేయ వాజ్మయాన్ని వొప్పుకుంటూనే మరో వైపు హృదయ పూర్వకంగా వాటిని ఆమోదించక పోవడమే. అది పామర వాజ్మయంగా కొట్టి వేయడమే.

వేమన గూడా ఛందస్సు వొదిలి అవే భావాల్ని, కోపాల్ని సంఘంకుళ్ళు మీద తిరగబడి, దాని కీళ్ళు విరగొట్టే జానపద గేయాలే అల్లి వుండినట్లయితే అతనూ వేలాది అనామక కవులో కలిసిపోయేవాడేనని నా అనుమానం.

కాని భక్తి తత్వం బోధించిన కొందరు వాగ్గేయకారులకి, జీవితం బుద్బుద ప్రాయం అని పలాయనత్వం బోధించిన తాత్వికులకి సాహిత్యంలో , జన జీవితంలో స్థానం వుంది. మనం కొంత సూక్ష్మంగా ఆలోచిస్తే వారికి, వారిభావాలకు సాహిత్య స్థాయి ఎందుకువుందో బోధపడకపోదు.

దోపిడీవర్గాలకు కొమ్ముకాయడమే ఆ కారణం.

అంటే మన సాహిత్యాన్ని ఇప్పటికీ బహిరంగంగా శ్రామిక వర్గాన్ని పామరుల కింద లెక్కగట్టే పిలక పండితులే ఏలుతున్నారన్న మాట.

వ్యాకరణం, అలంకారశాస్త్రం వొప్పిందే భాషగా, కవిత్వంగా పరిగణించే పండితులు చేసిన సాహిత్య ద్రోహం వేళ్ళు ఊడబెరికే దుస్సాహసం తప్ప మరొకటి కాకుండా పోయింది.

పామరుడు = అజ్ఞాని, నీచుడు, అల్పుడు. మూర్ఖుడు, హీనుడు.

ఇదే నిఘంటువులలోని పామర శబ్దం..

శ్రామికుల్ని హేళన చేసే సహృదయ సాహితీ వేత్తల సంస్కారం ఇంతకన్నా ఎదగక పోవడం అనూహ్యమేమీ గాదు. అది వారి వర్గస్వభావం. చదువుకున్న వారు, సహృదయులు, వారు సృషించిన సాహిత్యాన్ని మెచ్చుకునేవారు సంస్కారవంతులు అవుతున్నారంటే, చదువులేని జానపదులు హృదయమే లేని వారుగా వొప్పుకోవలసి వస్తోంది.

జానపదులంటే పల్లెల్లో నివసించేవారు.

రేయింబవళ్లు పట్టెడన్నంకోసం రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులు.

పండితుల భాషలో వీళ్ళు పామరులు , ఆదే పామరుల దృష్టిలో వీళ్లేమవుతారో ఆ మేధావులకే వొదిలేద్దాం .

జానపద గేయాల్ని ప్రజా గేయాలు అని కూడా పిలుస్తున్నారు. పిలవటం వరకు ఎవరికీ పేచీ వుండనక్కర్లేదు.

ప్రజలకు నిర్వచనం ఇవ్వటంలో సరి అయిన అవగాహన లోపించడమే బాధాకరం.

దేశం ఎంత వ్యవసాయిక మైనా ఇవ్వాళ కార్మికుల సంఖ్యేం తక్కువది కాదు.

మతం పేర, దేవుడి పేర, కర్మ సిద్ధాంతం పేర, వర్ణాశ్రమ ధర్మాల పేర భావాల దృష్ట్యా ప్రత్యక్షంగా పై వారు చేస్తున్న మోసాలకు గురి అవుతున్నది. ఈ శ్రామికులే.

భౌతికంగా వాళ్ళ శ్రమకు తగిన ఫలితం అందడం లేదు. పెట్టుబడిదారులు వాళ్ళని పనిముట్లుగా చూస్తున్నారేగానీ వ్యక్తిత్వం వున్న మనుషులుగా సంఘంలో గౌరవ ప్రదమైన స్థానమిచ్చిగాదు.

పల్లెల్లో భూస్వాములు , ధనిక రైతులు అప్పులిచ్చి అయిదారేండ్ల పసి పిల్లలనుండి, అరవై ఏళ్ళ వృద్ధుల వరకు వస్తువులుగా, యంత్రాలుగా వాళ్ళని కొనుక్కుంటున్నారు.

ఏ దేశ సౌభాగ్యానికయినా ఈ శ్రామికు లే జీవగర్రలు , వాళ్ళే నిజమైన ప్రజలు.

కాని కొల్లగొట్టబడుతున్నది వారే.

పొట్టపోసుకోవడానికే అష్టకష్టాలు పడే వాళ్ళకు వాళ్ళ బిడ్డలకు విద్యా గంధం లేక పోవడం వల్ల నీచులు , మూర్ఖులు, అజ్ఞానులు, అల్పులు అవుతున్నారు.

నాగరికత బలిసిన నాజూకు ముక్కులు ఆ ప్రజల పై మాలిన్యాన్ని చూసి, పగిలిపోవచ్చు.

ఊగిసలాడే మధ్య తరగతి మేధావులు వాళ్ళని అసహ్యించుకోవచ్చు.

ఏ పొలానికో, కర్మాగారానికో ధారపోసిన రక్తం, చెమటగా మారి కంపు కొట్టొచ్చు. దారిద్ర్యం వల్ల, తీరిక లేమి వల్ల అవి దూరంగాక పోవచ్చు. నిజానికి హృదయనున్న వాళ్ళు, నిర్మల మనస్కులు వాళ్లే. శ్రమైక జీవులతో మనసా వాచా తాదాత్మ్యం పొందిన వారెవరూ వారిని అసహ్యించుకోరు. అలా అసహ్యించుకునే నీచుల్నే ఆసహ్యించుకునే ఆరోగ్యకరమైన అలనాటును పెంచుకుంటారు.

అందుకే ఈనాడు జానపద గేయాల్ని ప్రతి గేయాలుగా, శ్రామిక గీతాలుగా పిలవాల్సివుంది.

ఏ పేరుతో పిలిస్తే ఏం అనొచ్చు. పేరు పేరులో పేరుకు పోయిన వర్గ ప్రయోజనం బయటికి లాగాలంటే అలా పిలవక తప్పదు.

ఈ గేయాలలోనూ మొదటే చెప్పుకున్నట్లు బాల సాహిత్యాది వర్గీకరణ పుండొచ్చు. కాని ఆ పాటల్లో అంతర్వాహినిగా మళ్ళీ అనంత దోపిడీ తత్వం ప్రవహించ గూడదు.

ఉదాహరణకు ʹచెమ్మ ఆట" అనే ఈ పాట చూడండి.

"కొండకు పూలు జుట్టమే
అమ్మ నన్ను
గోపాల కృష్ణుడనావే

పతాకాలు నాకు వెయ్యమే
అమ్మ నన్ను
ఆయోధ్య రాముడనావే

కుచ్నులా జడలు వెయ్యవే
అమ్మ నన్ను
కూర్మావతారు డనావే

పట్టు పంచెలు నాకు కట్టవే
అమ్మ నన్ను
పార్వతీ తనయుడనవే"

ఇది బహుళ ప్రచారంలో వున్న పాట. నేర్చుకున్న సినిమా గీతాల్ని మరిచిపోతారుగాని, ఇటువంటి గేయాల్ని విన్నవారు, పాడుకున్నవారు సామాన్యంగా ఎవరూ మరిచిపోరు. దేవుని భావనకు రాబోయే తరాల్ని బలిపెట్టకుండా వుండాలంటే ఇలాంటి వాటి జోలికి పోము. కాని విద్యా విషయాలు, ప్రసంగాలు , సినిమాలు చుట్టూ వాతావరణం మంచివి మింగేయడానికే పొంచి వున్నాయి. పిల్లల పెంపకంలో కావలసిన జాగ్రత్తలు తీసుకోవడమో, గ్రామీక సాహిత్యం వైపు మనసు మళ్ళించే ప్రయత్నాలు చేయడమో జరిగితే ఈ కుళ్ళ నుండి తప్పించు కునే అవకాశం వుంది.

ఇది చూడండి

"వానాలు కురవాలి
వరిచేలు పండాలి
బుడుగో బుడుగో
మా గాదె నిండాలి
మా దాసి దంచాలి"

అయితే ఈ పాట మేమంతా కడుపారా తినాలనే భావనను కలిగిస్తోంది. దాసత్వం మీద దండయాత్ర చేయాల్సిన మేధావులు సామాజిక పరిణామ స్పృహను కోల్పోగూడదనే కోరిక.

"ఆఁ ! మన పిచ్చిగాని, ఈ రోజులలో ఇవి ఎవరు నేర్పిస్తున్నారు. ఏవరు పాడుతున్నారు" అనడం కూడా కద్దు.

కాని పాఠ్య పుస్తకాలలో, బాలలగేయాల్లో ఇవి చూస్తూనే వున్నాం. ఇంకా ఇలాంటి గేయాలు జీవించి వున్నాయంటే, పిల్లలు పాడుకుంటూ వున్నారంటే, దోపిడి రక్షకులదే పై చేయి అని గుర్తించాలి .

కథలలో అయితే పాత్రల స్వభావాల్ని స్పష్టం చేస్తూ ఈ మాటలు, ఈ కట్టుబాట్లలాంటివి రాయొచ్చు.

కవి తానే ఒక పాత్ర అయి చెప్పుతుండడం వల్ల అతని నిజాయతీని శంకించాల్సి వస్తోంది.

అప్పుడప్పుడు ఆయా పత్రికలలో వెలువడే పాటలు ఇవే భావాల్నికలిగి వుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

స్త్రీల పాటల విషయంలో అడగనేవదు. పురుషులు వినడానికే చెవి యొగ్గరు. కాని స్త్రీలు ఇలాంటి గేయాన్ని పేరంటాలలో పాడుతూనే వుంటారు.

పాడితే పాడుకోని అంటూ మనం పూర్కుంటూనే వుంటాం. అదే పురుషులైతే విరుచుకుపడతాం. ఇక్కడ స్త్రీల విషయంలో చూపుతున్న ఉదారత్వం చాటున ఒక జాతి బలి అవుతున్నదనే సంగతి గుర్తించం.

నాగస్వరానికి నాట్యం చేసే నాగుబాము లా జానపదగేయానికి తల ఒగ్గేది మొదట స్త్రీలే.

స్త్రీ ఎంతకాలమైతే ఈ అశాస్త్రీయ విధానాల్నుండి తప్పుకోదో అంత కాలం వరకు జాతికి విముక్తి లేదు.

" కొందరికి భయం భయు
వారికంటె పసిపిల్లలు నయం నయం"

ʹకష్టజీవులం మేము కమ్యూనిస్టులు

ఔనన్నా కాదన్నా అదే ఇస్టులం"

అమరకవి సుబ్బారావు పాణిగ్రాహి గాక ఇవి ఎవరు రాయగలరు ? ఇలాంటి గేయానికున్న జీవం మరే కవితా ప్రక్రియకు లేదని అందరూ వొప్పుకు తీరాల్సిందే.

పెన్నూ గన్నూ చేతబటి పీడిత ప్రజల పక్షాన నిలబడి బతికి నన్నాళ్ళూ భారత శ్రామిక వర్గం గర్వించే జముకల కథలు చెప్పిన ఆ భారత రత్నాన్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది.

మనుషుల్ని మాయం చెయ్యొచ్చు. నామరూపాల్లేకుండా నరికి కుప్ప లెయ్యొచ్చు. కాని ప్రజాసాహిత్యాన్ని ఏం చేయగలరు ? అందుకే పాణిగ్రాహి పాటలు జీవించి వున్నాయి. అతని గీతాలు రేపిన ఎరుపు శ్రీకాకుళంలోనే గాదు యావద్భారతంలో యువతరం గుండెల్లో కంచుకోటలు కట్టుకుంటోంది,

ʹమార్చ్ʹ "ఝంఝ " వచన కవితా సంకలనాన్ని ప్రభుత్వం ని షేధంచింది. ప్రభుత్వం తానా అంటే కోర్టులు తందానా అనడం వర్గ సమాజంలో సహజమే,

ఈనాడు విప్లవ కవితను ప్రజాబాహుళ్యం ఆదరిస్తుందనడానికి అవి అమ్ముడయిన తీరే విదర్శనం.

అయితే, అంతటితో ప్రజాకవిత్వాన్ని అందించగలిగానని విప్లవ రచయితల సంఘం తృప్తి పడాల్సిన స్థితిలో లేదు. కావ్య నాయకుడు సామాన్యుడయినాడు. కావ్య భాష కవితా ప్రక్రియ మాత్రం మధ్యతరగతి చట్రం నుండి విడివడి రాలేదు.

ఒక చారిత్రక మలుపులో చెలరేగిన సంఘటనలు అందర్నీ ఆకర్షించవచ్చు. కొత్తొక వింతగా అందరూ ఆ పుస్తకాల్ని కొని వుండవచ్చు. ప్రవాహం వేగం తగ్గి మైదాన ప్రాంతంలో మెల్లగా నడచినట్టు విరసం కూడా ఆ పరిస్థితిలోనే సాగుతుండవచ్చు. వాస్తవం, ఆదరణ, కట్టుబాటు బయటపడేది, ప్రజలలోకి వెళ్ళగలగడానికి , సిరత్వం పొందడానికి కావలసిన సరంజామా సమ కూర్చుకోవలసింది ఇప్పుడే.

కదనరంగం మధ్యలో నించొని గళమెత్తి పాడినప్పుడే విరసానికి సార్థకత. రానున్న గడ్డురోజులకు అది సిద్ధం కావలసి వుంది.

ఈ దృష్టితో చూసినప్పుడు ప్రజా గేయ రచన ప్రయత్నదశ ఇంకా దాటలేదు.

విరసం ఆవిర్భావం తరువాత యం. కె. సుగమ బాబు ʹసురీడు " యం. సుధాకర్ సంకలనకర్తగా బతుకుబాటల కొక్కొరొకోʹ అనే రెండు ప్రజా గేయసంపుటాలు వెలువడినాయి.

ʹసూరీడుʹ పూర్తిగా ప్రజా భాషలో రాయడానికి చేసిన ప్రయత్నం .

ʹసత్తే న్నిరా నేను
నాకు సావే లేదు
సూరీణిరా నేను
నాకు సీకటి లేదు"

అంటూ ఈ సంపుటి గళం విప్పింది. కత్తితో కోసినట్లు ప్రజల హృదయాల్లోకి ఈ గేయాలు చొచ్చుకుపోతాయి. కారణం ప్రజల బాధలు, కన్నీళ్ళు , స్పష్టంగా ఇందులో చోటు చేసుకున్నాయి.

భాష అక్కడక్కడ కుంటినడక నడిచినా, గేయాల్లోని వాడితనం దాన్ని మరిపిస్తుంది.

ʹకొక్కొరొకోʹ లో ప్రజలు పాడుకోవడానికి, ప్రజాగేయాలుగా నిలువడానికి కొన్నింటికి ఆస్కారం లేకపోలేదు.

మండే నిజాల కుంపటి ఈ ʹకొక్కొరోకోʹ. ఈ గీతాలు విన్న ప్రజలు స్పందించకుండా వుండలేరు. ఇవి మత్తుమందు చల్లవు. ఓదార్చపు

అవి నడుస్తాయి. నడిపిస్తాయి. సమకాలీన ప్రజాసాహిత్యానికి అవి పతాకలు.

కాని ఇలాంటి సంకలనాలు ఎన్ని వచ్చినా ఒక సాంస్కృతిక సంస్థ వాటిని ప్రజల్లోకి తీసుకుపోలేకపోతే బండల మీద వాన కురిసినట్లే అవుతోంది.

పొలాలకు నీళ్ళు వెళ్ళడానికి కాలువలు ఎలా కావాలో ప్రజా గేయాలకు గళాలు కావాలి.

విరసం ఆ పని చేయాల్సి వుంది.

అయితే, ఈ రెండు సంపుటాల్లో విరసం వాళ్ళున్నా అవి విరసం ప్రచురణలు కావు. వ్యకులుగా చేస్తున్న కృషినుండి విరసం, విరసం నుండి వ్యక్తులు ప్రేరణ పొంది ఎక్కడికక్కడ వందల సంఖ్యలో సంకలనాలు రావలసిందే. ప్రస్తుతం జరుగుతున్నది. అదే ఇతరేతర ఏమయినా మంచి గేయ సంకలనాలు వచ్చినా విరసం కళాకారులు గళమెత్తి పొడవలసిందే

ఈనాడు. విప్లవ రచనకు కాక సాహిత్యంలో దేనికి స్థానముంది ? ప్రయోజనం వుంది ?

ప్రజాగేయాల రచనలో కవి బాధ్యత పెరుగుతుందే గాని తరగదు, ఎవరో పాడుకుంటారని, ఎవరో సమీక్షించి మెచ్చుకుంటే చాలు ననే వ్యాధి నుండి తనను తాను రక్షించుకుంటూ ఆ గీతాల ప్రచారానికి పూసుకోవాలి.

రాసిన వాళ్ళందరూ పాడక పోవచ్చు .

పాటగాళ్ళు ప్రయత్నిస్తే రాయకపోరు.

ప్రజల భాషలో రాస్తే చాలు ప్రజా గేయ మవుతోంది అనుకోవడం తప్పుడు అంచనాగానే కనిపిస్తోంది.

ʹవచ్చా పచ్చగ పెరిగి పండి ఒరిగున్నాను
ప్రజకూ నన్నందించ రావా - నా రైతు
ప్రబలమౌ కరు వాపలేవా
కార్తీక మాసాన కరువంత భరియించి
కళ్ళ ఊపిరి నిలిపియున్నా - నా రైతా
ప్రజకూ సన్నందించ రావా"

చేయి తిరిగిన రచన యిది. అలాగే గరిమెళ్ళవారి ʹమా కొద్దీ తెల్ల దొరతనము" కూడా.

హృదయాల్ని కదిలించే ఈ గేయాలు సరళమైన భాషలోనే రాయబడి ప్రజాదరణ పొందగలిగాయి. ప్రజల్ని కదిలించాయి .

జానపద కవిత్వానికి సాహిత్యస్థాయి కొరవడుతుందని కొందరు విజ్ఞులు అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. మాండిలికాలు ఆడొస్తాయంటున్నారు. -

అక్కడక్కడ కొన్ని పదాలు కొరుకుడు పడక పోవచ్చునుగాని గేయార్థం తప్పకుండా బోధపడుతుంది.

" సినిమా పాటలు ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయి. ప్రజాదరణ పొందిన ఎన్ని గేయాలు ప్రజల నోళ్ళలో మెదలుతున్నాయి" అనే సందేహం కూడా లేకపోలేదు.

కానీ, ప్రజా గేయాలకు ఆ ప్రమాదం వుండదనే నా నమ్మకం. ఎందు కంటే వీటి ఉద్దేశ్యం వేరు. ప్రాతిపదిక వేరు. సంగీతంతో సంబంధం లేకుండా సజీవంగా శాశ్వతంగా నిలిచేవి ఈ ప్రజా గేయాలే,

ముందెన్నడూ లేనంతగా ఇవాళ కవిత్వం కర్మాగారాల్లోని సరుకుల్లా ఉత్పత్తి అవుతుంది. కవిత్వం ఉద్భవించాల్సిందే గాని ఉత్పత్తి అయ్యే పదార్థం కాదు. ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఇంత సాహిత్యం నేను సృష్టించాల్సి వుంది అనుకోవడం వ్యాపార మనసత్వంలోని అంతర్భాగమే. రచయితకు ఒక ప్రణాళిక ఉండవలసిందే కాని రచించడం, అచ్చు వేయడం వరకే నా పని అనుకోవడం పొరపాటు. ఒక రచనను ప్రజలలోకి తీసుకు పోవడం ఎటా అని తపన వుండాలి. దానికో ప్రణాళిక వుండాలి. అదే చాలా ముఖ్యమైనది. అట్లాంటివారే ప్రజా రచయితలు కాగలుగుతారు. ప్రజలకు న్యాయం చేయగలుగుతారు.

మరి ఉత్పత్తి ఎందుకన్నానంటే, శ్రామికుల భోజనాల్లోకి ఆ ఉత్పత్తులు ఎలా చేరడం లేదో, అలాగే ప్రజల పేరుతో వెలువడుతున్న కవిత్వం కూడా వారికి చేరడం లేదు. అందుకే అది "ఉత్పత్తి అవుతుంది.

అభ్యుదయ సాహిత్యోద్యమం, ప్రజానాట్యమండలి కవికీ, జనసామాన్యా నికి ఒక వంతెన నిర్మించింది. కవులూ ప్రజలూ ఆ వంతెన మీద కొంత కాలం పరుగులు పెట్టారు.

నినాదాలనీ, కళా విలువలనీ వారు ʹనన్నంటుకోకు నా మాలకాకిʹ అనే తత్వంతో బయల్దేరలేదు. మేం శాశ్వతంగా, కళావిలువలతో వొప్పి సలారే గీతాలే రాస్తామని గిరిగీసుకున్నట్లు లేదు.

ప్రజా హృదయాల స్పందనకు మించిన కళా కేంద్రాలు, శాశ్వత విలువలు ఎక్కడున్నాయి ?

ʹనైజాము సర్కరోడా
నాజీల మించి నోడా
నీ గోరి కడ్తం కొడుకో
నైజాము సర్క రోడాʹ

ఈ గీతం రాసిన కవి ధన్యుడు. ఇప్పటికీ తెలంగాణ మారుమూల వల్లెల్లో కూడా ఇది మార్ర్మోగుతూనే వుంటుంది. ఆనాటి నైజాం నిరంకుశత్వానికి, వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అవిభక్త కమ్యూనిస్టు కార్యకర్తలు పాడుకున్న ఈ పాటలో ఎంత వరకు వుందో, సహజత్వముందో, జీవముందో అర్థమవుతోంది.

ఆనాటి తెలంగాణా రైతాంగా సాయుధ పోరాటంలో ఇలా ఎన్ని కవితలో, ఎందరు కవులో !

ఆనాడు శత్రువు ప్రత్యక్షంగా కనిపించాడు. వాడి దురాగతాలు తుపాకి గుండై గుండెల్ని చీల్చాయి. ఈనాడు అలా కాదు. మన అందరి మధ్యలోంచి మన లోలోంచి శత్రువులు పుట్టుకొస్తారు. అంతర్యుద్ధమే వస్తుంది. అందుకు పీడిత ప్రజలు సమాయత్తం కావాలి. ఈ స్పృహ కవికీ అవసరం.

పాట పాలమీగడ వంటిది. వెన్నెల చల్లదనం లాంటిది. రెండంచుల కత్తి పదును లాంటిది. కష్టజీవి వెచ్చని కన్నీటి బొట్లు లాంటిది. పచ్చని పైరులాంలాంటిది. వేసవి చురకల్లాంటిది. అందుకే శ్రామికుల జీవితాలలో దానికి భాగ స్వామ్యం.

ఈ దుర్మార్గపు దోపిడి ప్రభుత్వంలో కవికి కావలసినన్ని కవితా వస్తువులు, సోషలిజం మంత్రాల్ని, అరిగిన రికార్డు ఉపన్యాసాల్ని, బూటకపు ఎన్నికల్ని, పత్రికల రేడియోరి మోసపు ప్రచారాల్ని, ప్రజా పోరాటాల్ని, నిత్య జీవితంలో శ్రామికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఆరాటాల్ని, భయాల్ని, అద్దం పట్టినట్లు చూపడానికి బలమైన సాధనం ప్రజాగేయం.

అన్నిటికన్నా ముఖ్యం దానికి ఉద్యమస్వరూపం ఇవ్వాలి. అందుకోసం కవులు ఈ క్రింది మార్గాన్ని చేపట్టాల్సి వుంటుందేమో !

1. ʹమేము వచన కవిత్వ మే రాస్తాంʹ అనే కూపస్థమండూక తత్వాన్ని మానెయ్యాలి

2. నేను ప్రజలకోసం రాస్తున్నాననే స్పృహతో అతి సామాన్యమైన పదజాలాన్నే వాడాలి. ప్రజల భాషను సొంతం చేసుకోవాలి.

3. తమ తమ ఉపన్యాసాల్లో, వ్యాసాల్లో ప్రజాగేయాల్నే ఎక్కువగా, అవసరంగా ఉటంకించాలి.

4 వచన కవితతో పాటు, గేయాల్ని కరపత్రాలుగా వేసి చొరవతో, భయసందేహాలు వొదిలి తానొక ఉద్యమ చోదకుణ్ననే నైతిక బాధ్యతతో, విశ్వాసంతో ప్రజల్లోకి వెళ్ళాలి. పంచాలి. పాడాలి.

5. తన పాఠకులు శ్రామికులే నన్న విషయం ముందుగా గుర్తించాలి.

(అరుణతార జులై 1982 సంచిక నుంచి)

No. of visitors : 360
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •