నలబై వసంతాల దండకారణ్యం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

నలబై వసంతాల దండకారణ్యం

- పి. శంకర్ | 05.07.2020 04:12:52pm

భారత విప్లవోద్యమాన్ని 1972 తరువాత తిరిగి బలోపేతం చేయడానికి విప్లవకారులు ప్రయత్నాలు చేపట్టారు. ముందుగా నక్సల్బరీ విప్లవోద్యమ వెనుకంజకు గల కారణాలను సమీక్షించారు. ఆ గుణపాఠాలపై ఆధారపడి చేసిన బృహత్ కృషిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) ఆంధ్రప్రదేశ్ ʹవిప్లవానికి బాటʹ పేరుతో నూతన వ్యూహం-ఎత్తుగడలను రూపొందించుకుంది. అప్పటికే నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాల ప్రభావంతో విప్లవోద్యమం వైపు ఆకర్షితులైన యువతపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అప్పటి ఉత్తర తెలంగాణ జిల్లాలలో వ్యవసాయ విప్లవోద్యమ నిర్మాణానికి పునాదులు వేసింది. దేశంలో నానాటికి పెరుగుతున్న ఫాసిస్టు ఇందిరా ఎమర్జెన్సీ వ్యతిరేక పవనాలతో సరిగ్గా అదే సమయానికి కేంద్రం అత్యవసర పరిస్థితిని ఎత్తేయక తప్పలేదు. ఆ అనుకూల పరిస్థితులలో ʹవిప్లవానికి బాటʹ అమలుకు దృఢ సంకల్పంతో పార్టీ నాయకత్వం కృషి చేసింది. ఫలితంగా, అనతి కాలంలోనే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో కరుడు కట్టిన భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటాలు వెల్లువెత్తాయి. ఆ పోరాటాలను నూతన ఎత్తులకు పురోగమింపచేసే కృషిలో భాగంగా 1980లో ʹగెరిల్లాజోన్ʹ డాకుమెంటు వెలుగు చూసింది. సీ.పీ.ఐ. (ఎమ్.ఎల్.) ʹపీపుల్స్ వార్ʹ అవతరించింది.

గెరిల్లాజోన్ డాక్యుమెంటు అందించిన గైడెన్స్ లో విప్లవోద్యమం, తనకు అప్పటికే ఎంతో కొంత పరిచయం ఉన్న సరిహద్దులలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల విశాల అటవీ ప్రాంతానికి దండకారణ్యం దారులు పరిచి విప్లవోద్యమ విస్తరణకు పూనుకుంది. అవి 1980 జూన్- జూలై మాసాలు! అప్పటి నుండి ప్రస్తుత 2020 జూన్ వరకు గడచిన నాలుగు దశాబ్దాల దండకారణ్య విప్లవోద్యమ కృషిలో అసువులు బాసిన దాదాపు మూడున్నర వేలకు పైగా కామ్రేడ్సును ముందుగా వినమ్రంగా విప్లవ జోహార్లర్పిదాం. 1980 నవంబర్ 2న మహారాష్ట్ర సరిహద్దు గ్రామం ʹముయ్యబోయినపేటʹలో అసువులు బాసిన సింగరేణి కార్మికవర్గ పుత్రుడు కామ్రేడ్ పెద్ది శంకర్ మొదలు 2019 డిసెంబర్ 7న అనారోగ్యంతో అసువులు బాసిన తొలితరం గెరిల్లా, వర్తమాన కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ రావుల శ్రీనివాస్ (రామన్న), 2020 మే మొదటి వారంలో శతృవుతో సాహసంగా తలపడుతూ తమ ప్రాణాలర్పించిన దండకారణ్య తొలితరం ఉద్యమ ముద్దు బిడ్డ కామ్రేడ్స్ సృజన (జైనీ ఆర్కి) తోపాటు అశోక్, కృష్ణ, సబిత, ప్రమీల, అభిలాష్ ల వరకు ఆ మట్టి తొలుచుకు పుట్టిన ప్రజావీరులందరినీ పేరు పేరున స్మరించుకొని వారి ఆశయాల సాధనకై తుదివరకూ పోరాడుతామని ఈ వేడుకల సందర్భంగా శపధం చేద్దాం. దండకారణ్య ఉద్యమాన్ని ప్రారంభ కష్టాలలో, బాలారిష్టాలలో కాపాడి గట్టిపరిచి ప్రజాపునాది నిర్మాణంలో విప్లవాదర్శాలతో ఎంతో గొప్ప పాత్రను పోషించిన కామ్రేడ్ సత్యంరెడ్డి నుండి మొదలై ఆ ఉద్యమానికి నిన్నటివరకు నాయకత్వం వహించి తీవ్ర అనారోగ్య పరిస్థితులలో ప్రభుత్వ అక్రమ నిర్బంధంలో ఉన్న కామ్రేడ్స్ నర్మదా (నిర్మలా), కిరన్ (సత్యనారాయణ)ల వరకూ అనేక మంది దండకారణ్యం కోసం అహర్నిశలు కృషి చేసి ప్రమాదకర పరిస్థితులలో జైలు పాలైన వారందరినీ 40 వసంతాల ఉద్యమ వేడుకల సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారి విడుదలకై శక్తివంచన లేకుండా కృషి చేద్దాం.

దేశంలోని నేటి ఐదు రాష్ట్రాల కూడలిలోని అడవులలోకి దండకారణ్యం - దీర్ఘకాల ప్రజాయుద్ధ పంధాలో నలుబై వసంతాల క్రితం 35 మందితో ఏడు గెరిల్లా దళాలు చేరుకున్నాయి. విప్లవోద్యమ ప్రచారం, ప్రజల సంఘటితీకరణ ప్రధాన కర్తవ్యాలుగా చేరిన సాయుధ విప్లవకారులు (గెరిల్లాలు) దోపిడీ పాలకవర్గాల పోలీసుల నుండి ఆత్మరక్షణ చేసుకుంటూనే తొలుత అడవుల సర్వే జరిపారు. ప్రారంభంలో అనేక సమస్యలను-తిండి, భాష, నడక, శతృవర్గాల దాడులు-అధిగమించి పేద, భూమిలేని ఆదివాసుల అభిమానాన్ని చూరగొన్నారు. సాగు భూముల కోసం అటవీ భూముల స్వాధీనంతో పాటు వెదురు, తునికి ఆకు కోత కూలీ రేట్ల పెంపుదల పోరాటం; ఫారెస్టు, రెవెన్యూ అధికారుల వెట్టి, దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సంఘటితమై ప్రజా పోరాటాలు చేపట్టారు. దుష్ట ఆదివాసీ తెగ పెద్దల అక్రమాలకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలిచారు. తొలినాళ్లలో పోలీసులతో చేరిన శతృవర్గాలు ప్రజలలో సృష్టించిన భయాందోళనల వాతావరణాన్ని తొలగిస్తూనే గెరిల్లాలు అంకితభావంతో అలుపెరుగని కృషి చేశారు. వారి కృషికి విప్లవాభివందనాలు.

దండకారణ్యం దట్టమైన, విశాల అడవులు, కొండలతో కూడుకొని ఉండడమే కాకుండా అమూల్యమైన అనేక రకాల ప్రకృతి వనరులున్నాయి. దండకారణ్యంలో కోయలు (గోండులు) ప్రధానమైన తెగగా లేదా రూపొందుతున్న జాతిగా ఉన్నారు. కాగా కోందులు, కొండరెడ్లు, మన్నె కోయ, హల్బా, ప్రధాన్, బతరా, గోవారీ మున్నగు పలు ఇతర తెగలూ ఉన్నాయి. దండకారణ్యంలో ఆదివాసీలతో పాటు వివిధ పేర్లతో దళితులు ప్రధానంగా మహర్ (నేతకాని)లు కాపులు (జాడి కాపులంటారు) దాదాపు అంతటా ఉన్నారు. గైరాదివాసీ వ్యాపారులూ ఉన్నారు. వీరికి తోడుగా 1970లలో లక్షల సంఖ్యలో శరణార్థులుగా చేరిన బంగ్లాదేశ్ కు చెందిన ʹహిందూʹ (అధికశాతం దళితులు) ప్రజలున్నారు.

మన్యం సహ దండకారణ్యమంతా అనాదిగా ప్రజా తిరుగుబాట్లకు పుట్టినిల్లు. బ్రిటిష్ వారి దోపిడీ దౌర్జన్యాలను, వలసాధిపత్యాన్ని ఎదిరించిన తొలి ప్రజా తిరుగుబాట్లలో బస్తర్ పరాల్ కోట గేంద్ సింగ్ కొనసాగించిన గెరిల్లా యుద్ధం చరిత్రకు ఎక్కింది. ఆ తరువాతి ఉద్యమాలలో గడ్చిరోలీ సడ్మెక్ బాబూరావు, బస్తర్ గుండాదూర్, మన్యం అల్లూరి సీతారామరాజు, ఆదిలాబాదు కొంరం భీంల నాయకత్వంలో నడిచినవి నేటికి ఆ వీర ప్రజలకు ప్రేరణాదాయకమే! చరిత్రలో దోపిడీ పాలకవర్గాలు మరుగునపడేసిన వీరయోధుల వారసులుగా మనం పోరాడితీరాలనీ తొలినుండి విప్లవకారులు ఆ ప్రజాయోధుల త్యాగాలను ఎత్తిపడుతున్నారు. దానితో ఇపుడు అనివార్యంగా పాలకవర్గాలు సైతం వారిని ఓవైపు స్తుతిస్తూ మరోవైపు అహింస పాటపాడుతూ వారి వారసులైన ప్రజలను అణచివేస్తున్నారు. నలుబై ఏళ్ల దండకారణ్య విప్లవోద్యమం మట్టి పొరలలో దాగిన చారిత్రికవీరుల త్యాగాలను వెలుగుమయం చేయడంలో సఫలమైంది.

విప్లవోద్యమ ప్రారంభానికి ముందే పాత బస్తర్ జిల్లాలో ఆగ్నేయంగా ఉన్న బైలాడిల్లా కొండలలో ఇనుప గనుల తవ్వకాలను ఎన్.ఎం.డీ.సీ. జపాన్ వారి కోసం ప్రజలను ఊచకోత కోసి ప్రారంభించింది. గత నలుబై ఏళ్లుగా ఆ తవ్వకాలు కొనసాగుతూ కొండలను నేలమట్టం చేశాయి. ఆ చేదు అనుభవంతో విప్లవపార్టీ నాయకత్వంలో గత నాలుగు దశాబ్దాలుగా విప్లవ ప్రజానీకం తమ జీవితాలను అస్థిత్వాన్ని సవాలు చేసే తవ్వకాలకు వ్యతిరేకంగా జీవన్మరణ పోరాటాలు కొనసాగిస్తున్నారు.

దండకారణ్యం వ్యాపితంగా అన్ని రకాల తెగల ఆదివాసీ పీడిత ప్రజలు విప్లవకారులను ప్రాణంలా చూసుకుంటూ వారి నాయకత్వంలో సంఘటితపడి సమరశీల పోరాటాలలోకి దిగడం దోపిడీ పాలకవర్గాలకు కునుకు పట్టనివ్వలేదు. దానితో మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు పాశవికమైన అణచివేత చర్యలకు దిగాయి. మన్యంలో పదుల సంఖ్యలో ఆదివాసీ ప్రజల పూరిళ్లను మంటలకు ఆహుతి చేశారు. మిగితా రెండు రాష్ట్రాలలో పెద్దెత్తున అరెస్టులు, తప్పుడు కేసులలో ప్రజలను జైలుకు పంపడంతో పాటు విప్లవకారులను బూటకపు ఎదురు కాల్పులలో హత్య చేయడం మొదలైంది. ప్రభుత్వ అటవీశాఖ వారు అత్యంత దౌర్జన్యంగా ప్రజల సాగు భూములను పట్టాలు లేవనే పేరుతో తిరిగి స్వాధీనం చేసుకోసాగారు. స్త్రీ-పురుషులకు సమాన పనిలో అసమాన కూలీ, స్త్రీలపై ఉద్యోగుల లైంగిక దోపిడీ, ప్రభుత్వ ప్రైవేట్ వెట్టి చాకిరీని ఎదిరించిన ప్రజలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. తొలినాళ్లలో ప్రజలు పోరాడి సాధించుకున్న విజయాలను అన్ని ప్రాంతాలలోని పేపర్ మిల్లుల యాజమాన్యాలు-దళారీ నిరంకుశ పెట్టుబడిదారులు-భారత రాజ్యంతో కుమ్మకై వమ్ము చేయడానికి సిద్ధమయ్యారు. తునికాకు కాంట్రాక్టర్ల నుండి నక్సలైట్లు నిధులు దండుకుంటున్నారనీ మహారాష్ట్రలో ప్రభుత్వం వారిని అడవులలోకి అనుమతించడాన్ని నిలిపివేసింది. ప్రభుత్వ పోలీసు దాడులు ఉన్నత స్థాయిలో సాగుతుండగా ప్రజలు ప్రతిఘటించక తప్పని అనివార్య స్థితి ఆంధ్ర అడవులలో ముందుకు వచ్చింది. విప్లవ గెరిల్లాలు రాజ్య శక్తులను ఎదుర్కోవడమే ప్రధాన కర్తవ్యంగా మారింది. పర్యవసానంగా, 1987 వరకు విశాల దండకారణ్యం ఒక గెరిల్లా జోన్‌గా ఉనికిలోకి వచ్చింది.

విప్లవోద్యమంలో ప్రజలు ఉన్నత స్థాయిలో సంఘటిత పడసాగారు. దండకారణ్య వ్యాపితంగా ప్రజా సంఘాలు ముఖ్యంగా రైతు కూలీలు, మహిళలు రాష్ట్ర స్థాయి నాయకత్వాలను ఎన్నుకొని వాటి మార్గదర్శకత్వంలో పని చేయసాగారు. కరువు వ్యతిరేక పోరాటాలలో కదిలిన ప్రజానీకం నూతన రూపాలలో కరువు దాడులు నిర్వహించారు. ఉద్యమంలో పెరుగుతున్న ప్రజల భాగస్వామ్యం, వారిని అణచడానికి నిరంకుశ ప్రభుత్వాలు చేపడుతున్న హింసాత్మక చర్యలను వెల్లడిస్తూ విశాల పీడిత ప్రజల సంఘీభావాన్ని కూడగట్టుకోవడానికి హిందీలో ʹప్రభాత్ʹ పత్రిక ప్రారంభమైంది.

దండకారణ్య ఉద్యమంపై ఆధారపడి నూతన ప్రాంతాల విస్తరణకు ఉత్తరానికి భండారా, బాలాఘాట్ జిల్లాలకు మార్గాలు తెరచుకున్నాయి. అప్పటివరకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చిన ʹఫారెస్టు లైజాన్ కమిటీʹ స్థానంలో దండకారణ్య పార్టీ మహాసభ జరిగి ʹఫారెస్టు కమిటీʹ ఏర్పడింది.

దండకారణ్య విప్లవోద్యమం ఉన్నత స్థాయికి ఎదగడంతో ప్రభుత్వ పోలీసు వర్గాలు ద్విముఖ వ్యూహంతో పని చేయ ప్రారంభించాయి. కేంద్రం ఉద్యమ రాష్ట్రాలలోని ఖాకీబలగాలను సైనికంగా సమన్వయించడానికి పూనుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం 1991లో ʹస్పెషల్ ఆక్షన్ ప్లాన్ʹను చేపట్టి 1992లో స్థానిక యువకులతో ʹక్రాక్ కమాండోస్ʹ (సి)-60 బలగాలను రూపొందించింది. వాళ్లు 1991-94 మధ్య గఢ్చిరోలీలో ఎన్నడెరుగని స్థాయిలో ఉద్యమం పై విరుచుకపడ్డారు. యేడాది కాలంలోనే 60మంది విప్లవకారులను ప్రధానంగా విప్లవ ప్రజాసంఘాలలో సంఘటితపడిన ఆదివాసీ యువతను బూటకపు ఎన్ కౌంటర్లలో కాల్చిచంపారు. మధ్యప్రదేశ్ లోని బస్తర్ లో ʹరాత్ వాలాʹ పేరుతో నూతన బలగాలు ఉనికిలోకి వచ్చాయి. అక్కడ ప్రజా ఉద్యమ నాయకుడు చాప లచ్చుమన్నను మాయం చేశారు. అడవుల గాలింపు చర్యల కోసం ʹఅపరేషన్ మంథన్ʹ, ʹఆపరేషన్ దంతెశ్వరీʹ తదితర పేర్లతో సైనిక కెంపెయిన్లు కొనసాగించడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో అర్థసైనిక బలగాలు అప్పటికే దిగి అక్కడ స్వైరవిహారం చేయసాగాయి. 1987 వరకు ఆంధ్రప్రదేశ్ లో అమలవుతూ వచ్చిన శతృ అణచివేత చర్యలలో 1991నాటికి మొత్తం దండకారణ్య వ్యాపితంగా సారూపత్య సంతరించుకున్నదని విప్లవోద్యమం అంచనా వేసింది.

గ్రామాలలో విప్లవ ప్రజా సంఘాలు సంఘటితం కావడంతో పాటు వాటిలో నుండి చురుకైన, అంకితభావం గలిగిన రాజకీయంగా చైతన్యవంతులవుతున్న కార్యకర్తలు ఉన్నత స్థాయిలో ఎక్కడికక్కడే పునాదిస్థాయిలో కార్మికవర్గ అగ్రగామి దళ ప్రాతినిధ్య యునిట్లు (సెల్) సంఘటితం అవుతున్నారు. గ్రామాలలో ʹసంఘాలదే అధికారంʹ లేదా ʹదున్నే వారికే భూమి, రైతాంగ కమిటీలకే అధికారంʹ నడుస్తోంది. దుష్ట తెగ పెత్తందార్లలో, భూస్వాములలో ఒక సెక్షన్ (బురద వడ్డె, గోవిందరావులాంటి వాళ్లు) ప్రజల చేతులలో మట్టి గరువగా, మరో సెక్షన్ ఉద్యమం ముందు లొంగిపోయింది. జనజాగరన్ అభియాన్ పేరుతో 1991లో చేపట్టిన విప్లవ ప్రతీఘాతుక తొలి కెంపెయిన్ బస్తర్ లో దాదాపు మూడు మాసాలలో ఓటమిపాలైంది. గ్రామాలలో ఉన్నతస్థాయిలో ప్రత్యామ్నాయ ప్రజారాజ్యాధికార సంస్థ (నాలుగు వర్గాల రాజ్యాధికార అంగాలు) ఆవశ్యకత ముందుకు వచ్చింది.

దేశవ్యాప్త ఉద్యమ పరిస్థితులను అంచనా వేసిన విప్లవోద్యమం దండకారణ్య ఉద్యమం ముందు ఉన్నత స్థాయి గెరిల్లా జోన్ నిర్మాణ కర్తవ్యాన్ని ఉంచింది. దండకారణ్య ఉద్యమ భూభాగాన్ని మూడుగా విభజించి ఆదిలాబాద్ జిల్లాను ఉత్తర తెలంగాణలో, మన్యం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసి బస్తర్, గఢ్చిరోలీలతో కూడిన విశాల అటవీ ప్రాంతాలకు తోడు నూతన విస్తరణ ప్రాంతం బాలాఘాటను జతచేసి దండకారణ్యంగా 1995లో స్థిరీకరించింది. అప్పటికే దేశంలో నాలుగేళ్లగా ʹసరళీకృత ఆర్థిక విధానాలుʹ (నియో లిబరల్) పేరుతో ప్రారంభమైన సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలతో వ్యవస్థగత మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

విప్లవ ప్రజల ప్రత్యామ్నాయ రాజ్యాధికార సంస్థలు ʹగ్రామరాజ్య కమిటీʹ పేరుతో ప్రారంభమయ్యాయి. ఉద్యమ ప్రారంభంలో దోపిడీ ప్రభుత్వ పట్టాల కోసం రైతాంగాన్ని సమీకరించి పోరాటాలకు కదలించిన చోట అటవీ భూములు స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్న రైతులకు గ్రామరాజ్య కమిటీల ద్వారా భూముల కొలతలు చేపట్టి స్త్రీ-పురుషుల ఉమ్మడి పేర్లతో భూమి పట్టాల పంపిణీ ప్రారంభమైంది. భూముల పట్టాలు మహిళల పేర్లతోనూ ఇస్తూండడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దానినే అనుకరించసాగింది. వ్యవసాయ విప్లవ సంస్కరణలలో భాగంగా అనేక గ్రామాలలో సాగు భూములకు నీటిపారుదల, పశువులకు తాగునీటి వ్యవస్థతోపాటు ప్రజట జీవన ప్రమాణాలు పెంచడంలో భాగంగా చేపల పెంపకం, తోటల పెంపకం కూడా మొదలైంది. నిన్నటివరకు ʹదున్నేవారికే భూమి, రైతాంగ కమిటీలకే అధికారంʹ నినాదంతో సాగిన ఉద్యమం ఇప్పుడు ఆ భూములను రక్షించుకోవడానికి ʹదున్నేవారికే భూమి, గ్రామ రాజ్య కమిటీలకే సర్వాధికారాలుʹ నినాదాన్ని చేపట్టింది. ఉద్యమంలో పెంపొందుతున్న మహిళల పాత్రను విశాల ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి ʹపోరుమహిళʹ (సంఘరత్ మహిళ) 1996 నాటికి వెలుగు చూసింది.

దేశంలోని పలు ఆదివాసీ ప్రాంతాలలో పటిష్టమవుతూ పెంపొందుతొన్న ప్రజా ఉద్యమాన్ని లబ్ది ప్రతిష్ట బుద్ధిజీవులు సహ అనేక మంది అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వం ముందు ఆదివాసీ ప్రాంతాలలో పంచాయితీ వ్యవస్థ విస్తరణపై అనేక మార్పులను సిఫారసు చేసిన నేపధ్యంలో భారత రాజ్యాంగానికి చేసిన 73వ సవరణతో ʹపెసా చట్టం 1996 డిశంబర్ 24న రూపొందింది. విప్లవోద్యమం కాకుండా భారత రాజ్యాంగం ద్వారానే ప్రజల సమస్యలకు పరిష్కారం అనే భ్రమలతో వారు ఈ కసరత్తుకు దిగారు. ప్రభుత్వ చిరు సంస్కరణలకు భిన్నంగా ఉద్యమ అణచివేతలో భాగంగా బస్తర్ లో రెండవ విడుత జనజాగరన్ అభియాను ప్రారంభించిన్పటికీ విప్లవోద్యమం వర్గ ప్రాతిపదికపై నిర్దాక్షిణ్యంగా కొద్ది మాసాలలోనే దానిని అణచివేసింది.

దేశంలో వివిధ శక్తులను ఆకర్షిస్తున్న శంకర్ గుహ నియోగి నాయకత్వంలో 1997-98 నాటికి బలపడిన ʹఛత్తీస్ గఢ్ ముక్తి మోర్చాʹ లాంటి సంస్కరణవాద కార్మిక సంఘాల నైజాన్ని వెల్లడిచేస్తూ రాజ్యాధికార లక్ష్యంతో శ్రామికులను విప్లవోద్యమంలో సంఘటితం చేయడానికి పార్టీ నడుం బిగించింది. విశాల శ్రామిక కేంద్రంగా ముందుకు వచ్చిన రాయపుర్, దుర్గ్, రాజనంద్ గాం జిల్లాల కార్మిక ప్రాంతాలలో ఆర్గనైజేషనను పటిష్టం చేసే చర్యలు చోటు చేసుకున్నాయి. మరోవైపు దండకారణ్యంలో దేశంలోని నిజమైన విప్లవకారుల ఐక్యతలో భాగంగా 1997లో సీ.పీ.ఐ. (ఎమ్.ఎల్.) (పీ.డబ్ల్యు .) సీ.పీ.ఐ. (ఎమ్.ఎల్.) (పీ.యూ.)ల విలీనం జరిగింది.

1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో మధ్య ప్రావిన్స్, బేరర్లతో కూడిన మధ్యప్రదేశ్ నాగపుర్ రాజధానిగా ఉనికిలోకి వచ్చింది. అప్పుటి విధానసభ సభ్యుడైన లాల్ శ్యాం షాహ్ 1955లో ప్రతిపాదించిన ʹగోండ్వానాʹ బదులు నాలుగునర దశాబ్దాల తరువాత 2000 నవంబర్ 1నాడు ʹప్రత్యేక ఛత్తీస్ గఢ్ʹ రాష్ట్రం ఏర్పడింది. నూతన రాష్ట్ర నిర్మాణాన్ని ఆహ్వానిస్తూనే బస్తర్ ప్రజలు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఈ దేశంలో 6లక్షల జనాభా కలిగిన సిక్కిం ఒక రాష్ట్రం అయినపుడు, 30 లక్షలు పైబడిన జనాభాతోనున్న తమ ఆదివాసీ బహుళ బస్తర్ ను కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని నినదించారు. కానీ అపార ప్రాకృతిక వనరులున్న బస్తర్‌ను మినహయించి ప్రత్యేక ఛత్తీస్ గఢ్ నిర్మాణానికి పాలక వర్గాలు ససేమిరా అన్నాయి. ఆదివాసులకు కనీసం స్వయం పాలిత ప్రాంతాలనైనా అవి ఏర్పర్చలేదు. దేశంలోని ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాలలో అమలు చేస్తామని మురిపించిన పెసా అమలు అటక్కింది. కానీ మరోవైపు విప్లవోద్యమంలో నిజమైన ప్రజా పాలనా కేంద్రాలుగా గెరిల్లా జోన్లలో గెరిల్లా బేసుల నిర్మాణానికి విప్లవోద్యమం పిలుపునిచ్చింది. వాటి రక్షణ కోసం దేశ విప్లవోద్యమంలో తొలిసారి 2000 డిసెంబర్ 2న పీ.జీ.ఏ. (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) ఏర్పడింది. ఆనాటికి దేశంలోని రాజకీయ పార్టీల పరిస్థితి ఎంత అస్థిరంగా మారిందంటే వాటిలో ఏ ఒక్కటి కూడా గతంలో లాగా కేంద్రంలో ఏకపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పర్చలేక పోతున్నాయి. కేంద్రంలో కూటములతో కూడిన అస్థిర ప్రభుత్వాలు ఏర్పడక తప్పని అనిశ్చిత స్థితులు తలెత్తాయి.

విప్లవ కార్యాచరణలో ప్రతిఘటన సహ కార్యక్రమాలన్నీ కేంపెయిన్ల రూపంలోనే చేపట్టాలనే నూతన అవగాహన పెంపొందింది. వందలాది ఆదివాసీ యువత సాయుధమయ్యారు. మన దేశంలో విప్లవం దళితులతో పాటు తక్షణం ఆ వర్గాలకే కావాలి. వారు విప్లవోద్యమంలో పాల్గొని, దోపిడీ వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలతో పోరాడాలంటే వారు సుశిక్షితులు కాకుండా సాధ్యం కాదు. సమాజంలో అప్పటి వరకు వారు కనీస విద్యకు నోచుకోనివారే! భారత రాజ్యాంగంలో పేర్కొన్న నిర్భంధ విద్య, మాతృభాషలో విద్యా బోధన ఆదివాసుల విషయంలో హుళక్కే అయింది. కాబట్టి వారికి వారి మాతృభాషలో రాజకీయ, పాఠశాల విద్యా బోధన అత్యవసర సమస్యగా ముందుకు వచ్చి పార్టీ 1997లో ఒక ప్రత్యేక కరిక్యులం రూపొందించి గోండీలో ప్రారంభించిన విద్యా బోధనకు తోడుగా జనతన సర్కార్ల నిర్మాణం, అభివృద్ధితో పాఠశాల విద్యా విభాగం వికాసం చెందింది. నూతన భర్తీలలో నుండి ఎంపిక చేసిన శక్తుల కోసం మొదట ఆరు మాసాలతో కూడిన ʹప్రాథమిక కమ్యూనిస్టు శిక్షణా పాఠశాలʹ (బీసీటీఎస్), 2009 వరకు ఉన్నత స్థాయి కేడర్ల రాజకీయ విద్యా బోధనకై విప్లవోద్యమం నిర్మించిన ʹరీపోస్ʹ (రీజియన్ పొలిటికల్ స్కూల్) దండకారణ్య కేడర్లకు చాలా ఉపయోగపడింది.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో టాటా, జిందల్, ఎస్సార్ లాంటి అనేక దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ శక్తులు ఎమ్.ఎన్.సీ.లతో కలసి ప్రాకృతిక వనరులను కొల్లగొట్టుక పోవడానికి నూతన రాష్ట్ర ప్రభుత్వంతో అనేక ఎమ్.ఓ.యూ.లు కుదుర్చుకున్నాయి. గతంలో రెండు విడుతల జనజాగరన్ అభియాన్లను ముందుండి నడిపిన కర్కోటకపు ఆదివాసీ భూస్వామి మహేంద్రకర్మ రాష్ట్రంలో పరిశ్రమల శాఖామాత్యుడు అయ్యాడు. ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో అమలు పరచాల్సిన ఆదివాసీ గ్రామసభలను పోలీసుల తుపాకుల నీడలో నిరంకుశ అధికారులు దౌర్జన్యంతో దోపిడీ శక్తుల కోసం కాగితాలపై సృష్టించారు. అయినప్పటికీ వనరుల తరలింపుకు విప్లవోద్యమం వారికి పెను ఆటంకంగా నిల్చి ప్రజల విస్థాపనను అడ్డుకుంది.

2003 నవంబరులో ప్రత్యేక ఛతిస్ ఘడ్ విధాన సభ ఎన్నికలు జరిగి కాషాయ శక్తుల భాజపా గద్దెనెక్కింది. దానికి కొద్ది ముందు కాంగ్రెస్ జోగి సర్కార్ 2003 మార్చ్ లో దండకారణ్యంలోని బస్తర్ లో తొలిసారి అర్థసైనిక బలగాలను దింపింది. మరోవైపు దేశంలోని రెండు విప్లవ స్రవంతులు సమైక్యమై సరండా అడవులలో ʹభారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ʹ ఏర్పడింది. ఈ గొప్ప విప్లవకర పరిణామాలతో భారత పాలకవర్గాలు బెంబేలు పడిపోయాయి. నూతనంగా ఆవిర్భవించిన సీ.పీ.ఐ. (మావోయిస్టు) పార్టీని 2005లో దేశ అంతరంగిక భద్రతకు ఏకైక అతి పెద్ద ప్రమాదకర శక్తిగా కేంద్రం ప్రకటించడం, ప్రధాన ఉద్యమ ప్రాంతాలలో ముఖ్యంగా దండకారణ్యంలో ʹసల్వాజుడుంʹ (సామూహిక వేట), ఝార్కండ్ లో ʹసేంద్రʹ పేర్లతో ʹశ్వేత ఉగ్రవాద దాడిʹ కెంపెయిన్ దీర్ఘకాల వ్యూహాంతో ప్రారంభం కావడం యాదృశ్చికం ఏమీ కాదు. భారత దోపిడీ పాలకవర్గాల నమ్మకబంటు మహేంద్రకర్మ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు, అర్ధ సైనిక, సైనిక అధికారుల కనుసన్నలలో భీభత్స వాతావరణాన్ని సృష్టించి ఆదివాసీ సమాజాన్ని నిలువునా చీల్చారు. మూడు ముక్కలైన ఆదివాసీ సమాజంలో మెజార్టీ ప్రజలు విప్లవోద్యమంతో దృఢంగా నిలబడి ఫాసిస్టు సల్వాజుడుం దాడులను అసమాన త్యాగాలతో ఎదుర్కొని 2009నాటికి దానిని ఓడించారు. ఒక సెక్షన్ ప్రజలు తెలంగాణకు తరలివెళ్లగా, మరో సెక్షన్ సల్వాజుడుం నెలకొల్పిన నిర్బంధ శిబిరాలలోకి బలవంతంగా తరలించబడ్డారు. అయితే సల్వాజుడుం ఓటమితో శిబిరాలలోని మెజార్టీ ప్రజలు సంతోషించి విప్లవపార్టీ పిలుపుతో మళ్లీ తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

పాలకులు పోలీసులూ ఆశించిన ఫలితాలు ఇవ్వకుండా సల్వాజుడుం బ్యాక్ ఫైర్ కావడంతో భారత పాలకవర్గాలు మరింత ఉన్నత స్థాయిలో, విస్తృత పరిధిలో యావత్ దేశవ్యాపిత మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని అప్రకటిత ʹఆపరేషన్ గ్రీన్ హంట్ʹను మరింత దీర్ఘకాల పథకంతో రూపొందించి 2009 మధ్య నుండి అమలులోకి తెచ్చారు.

దండకారణ్యంలోని అన్ని డివిజన్లలో ఏరియా స్థాయిలో జనతన సర్కార్లు ఏర్పడి మెరుగ్గా పని చేస్తున్న చోట, ప్రజాపునాదిపై ఆధారపడి డివిజన్ స్థాయిలో కూడా అవి ఏర్పడడం ప్రారంభమైంది. 2004లో ఉత్తరాన ఆర్.కే.బీ., (రాజనంద్ గావ్, కాంకేర్, దుర్గ్) దక్షిణాన దర్భా ప్రాంతాలకు విస్తరించిన విప్లవోద్యమం రాష్ట్రంలోని పలు ముఖ్య పట్టణాలకు, శ్రామిక జనాభా కలగిన కేంద్రాలకు చేరువయ్యింది. దండకారణ్యంలో పశ్చిమాన గల గఢ్చిరోలీ డివిజన్ ఉద్యమం 2006లో రెండు డివిజన్లుగా అభివృద్ధి చెందింది. అయితే, పొరుగున ఉన్న మహారాష్ట్ర విప్లవోద్యమ అవసరాల రీత్యా విప్లవోద్యమం 2001లో దండకారణ్యంలోని గఢ్చిరోలీకి చెందిన కొంత ప్రాంతంతో పాటు బాలాఘాట్ డివిజన్‌ను అందులో భాగం చేసింది. ఆ వరుసనే తూర్పు, మధ్య రీజియన్లలోని విశాల గెరిల్లా జోన్ల మధ్య అనుసంధానానికి సరండా, దండకారణ్య గెరిల్లాజోన్లపై ఆధారపడి 2007 మార్చ్ లో వ్యూహత్మక పథకంలో భాగంగా ఒడిశాను కేంద్రం చేసుకొని నూతన విస్తరణకు పునాదులు పడ్డాయి. ఇవన్నీ ప్రభుత్వం రూపొందించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ ను శక్తిమంతంగా ఎదుర్కోవడానికి ఎంతగానో దోహదపడినాయి.

దీర్ఘకాల ప్రజాయుద్ధ పంధాలో ʹవిజయం , ఓటమి, అంతిమంగా విజయంʹ అనే అవగాహనలోని సారాన్ని గ్రహించిన కేడర్లు నష్టాలను, పారుబోతుతనాన్ని అరికడుతూ విప్లవోద్యమ నిర్మాణాలను పటిష్ట పరచుకుంటూ విశాల ప్రజా రాశులలోకి మరింత లోతుగా వెళ్లడానికి ʹఫీల్డ్ స్టడీʹ పేరుతో నాయకత్వ కమిటీలకు శిక్షణా కార్యక్రమం మొదలైంది. వీటన్నింటికి తోడుగా విప్లవోద్యమం నూతన పోరాట రంగాలనూ ఎన్నుకున్నది. చట్టబద్ద పోరాటాలను చేపట్టింది. విప్లవ పోరాటాల ఫలితంగా దోపిడీ పాలక వర్గాలు ప్రవేశపెట్టిన చట్టాలలోని ʹమానవముఖాన్నిʹ ఎంచుకొని ఆచరణలో ప్రజలను సమీకరించి దాని వికృతత్వాన్ని విప్లవోద్యమం ఎండగట్టింది. ఉదారవాద మేధావులు ముందుకు తెచ్చిన పెసా గ్రామసభలు ʹజల్-జంగల్-జమీన్ʹ నినాదాన్ని ప్రభుత్వాలు ఎలా బుట్టదాఖలా చేస్తున్నాయో చట్టాల బూటకత్వాన్ని ప్రజలకు తేటతెల్లం చేయడానికి విప్లవోద్యమం జరిపిన కృషిలో నూతన సామాజిక శక్తులు కదిలివచ్చాయి. ఇలాంటి అనేక చర్యలతో ప్రతికూల పరిస్థితులలోని అనుకూలతలను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యమాన్ని నిలబెట్టుకోవడం ఆనాటికి ఒక విజయంగానే భావించాలి.

ప్రభుత్వం దీర్ఘకాల పథకంతో చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ కు గడువు దగ్గర పడుతున్నా కొద్దీ దండకారణ్య విప్లవోద్యమాన్ని అది సమూలంగా నిర్మూలించలేకపోవడంతో, అందులో భాగంగానే నూతన పేర్లతో నిర్దిష్ట లక్ష్యాలతో దూకుడును, తీవ్రతను పోలీసు వర్గాలు పెంచాయి. మిషన్-2016 పేరుతో మొదలైన పోలీసుల దాడులు ప్రధానంగా ప్రగతిశీల, ప్రజాస్వామ్య, ఉదారవాద మేధావులను లక్ష్యంగా చేసుకున్నాయి. సామాజిక కార్యకర్త బేలా భాటియా, ల్ పాత్రికేయురాలు మాలినీ సుబ్రహ్మణ్యం, సోనీసోడి, ప్రముఖ గాంధేయవాది హిమాంశుకుమార్ వంటి అనేక మందిని లక్ష్యంగా చేసుకొని పోలీసు డి.ఐ.జీ., ఎస్.ఆర్.పీ. కల్లూరి ʹఅగ్నిʹ పేరుతో కొనసాగించిన దాడులు ఖాకీల పైశాచికత్వానికి నిలువుటద్దంలా నిలిచాయి. తక్షణం వాటికి జవాబుగా ప్రజాహిత శక్తులు ʹపానీʹని ముందుకు తెచ్చాయి. కామ్రేడ్ లెనిన్ వందేళ్ల క్రితమే చెప్పినట్టు శతృవర్గాలే విప్లవం వైపు నూతన మిత్రశక్తులను కూడగడుతాయన్నది ఆచరణలో సల్వాజుడుం వ్యతిరేక కెంపెయిన్ నాటి నుండి అనుభవంలోకి వస్తోంది.

ఆదివాసీ ప్రజలపై సాగుతున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ దాడులను ప్రపంచ ప్రఖ్యాత రచయిత యాన్ మిర్డాల్, బుక్కర్ ప్రైజ్ విజేత అరుంధతీరాయ్, రాంచందర్ గుహ, నందినీ సుందర్, బీడీశర్మ, బాలగోపాల్ సహ హక్కుల సంఘాల కార్యకర్తలు, దేశ, విదేశీ స్వచ్ఛంద సంస్థలు వివిధ రూపాలలో ఖండించాయి. ఫిలిప్పైన్స్ కమ్యూనిస్టు పార్టీ ఆ దేశంలో నెల రోజుల కెంపెయిన్ చేపట్టి ఓ.జీ. హెచ్.ను ఎండగట్టి భారత ప్రజాయుద్దానికి తన సంఘీభావాన్ని తెలిపింది. 2011లోనే అంతర్జాతీయంగా వివిధ దేశాల విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, శక్తులతో కలసి భారత ప్రజాయుద్ధ సంఘీభావ కమిటీ ఏర్పడింది. ʹనూతన విప్లవోద్యమాలకు ఆ పోరాటం విప్లవ వెలుగులను ప్రసరిస్తుంది, వారి పోరాటం మనది, ఎందుకంటే మనమంతా ఒకే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగంʹఅనే అవగాహణతో వారు సంఘీభావోద్యమానికి నడుం బిగించారు.

యావత్ భారత విప్లవోద్యమంలో భాగంగా దండకారణ్య ఉద్యమాన్ని కాపాడుకోవడానికి దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలలో నూతనంగా యుద్ధ క్షేత్రాలను ప్రారంభించడానికి ఎమ్.ఎమ్.సీ. (మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్ గఢ్)ల సరిహద్దు ప్రాంతానికి దండకారణ్య బలగాలతో విప్లవోద్యమం విస్తరించింది.

2014లో కేంద్రంలో గద్దెనెక్కిన హిందుత్వ శక్తులు దేశ పాలక, పోలీసు వర్గాలు యేళ్ల తరబడిగా ఎన్ని రకాల వ్యూహాలు, ఎత్తుగడలు చేపడుతున్నప్పటికీ అవి ఏదో ఒక స్థాయిలో వ్యతిరేక ఫలితాలే ఇస్తుండడంతో 2017 మేలో పాత వ్యూహాలను సమీక్షించి నూతన వ్యూహం ʹసమాధాన్ʹను ఐదేళ్ల కాలవ్యవధితో రూపొందించారు.

ఈ వ్యూహం ద్వారా మావోయిస్టు రహిత నవ భారతాన్ని నిర్మించే తమ లక్ష్యాన్ని 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించాడు. అలాగే పట్టణాలలో వివిధ వృత్తులలో, ప్రజల మధ్య ఉంటూ అనేక సామాజిక, రాజకీయ కార్యక్రమాలలో పాలుపంచుకునే లబ్దప్రతిష్ట ఆలోచనాపరులు, కళాకారులు, హక్కుల కార్యకర్తలు, రచయితలు, పాత్రికేయులు, న్యాయవాదులు, మేధావులు తమ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడాన్ని జీర్ణం చేసుకోలేకపోతూ వారందరినీ ʹఅర్బన్ నక్సల్స్ʹ లేదా ʹహాఫ్ నక్సల్స్ʹ అనే నూతన పదప్రయోగంతో అరెస్టు చేసి వారిపై అనేక తీవ్రమైన ఆరోపణలు చేస్తూ జైలుపాలు చేయడం పెరిగింది.

మరోవైపు నందిగ్రాం మార్గంలో లోహండి గూడా నుండి టాటా ప్లాంట్ ను ఎత్తివేయించడంలో సఫలీకృతమైన ప్రజలు నూతన రూపాలలో వేల సంఖ్యలో ఏకమై ʹపోలీసు క్యాంపులను ఎత్తివేయాలనీ, జల్-జంగల్- జమీన్ పై తమదే అధికారంʹ అంటూ వాటి రక్షణకోసం, అమూల్య వనరులను కాపాడుకోవడానికి, విస్తాపనకు వ్యతిరేకంగా చేపడుతున్న పడల్ డీ (పెసా) ప్రజాపోరాటాలు పెల్లుబుకుతున్నాయి. అయితే, 1917 మెక్సికో విప్లవం కల్పించిన ఎజిడో (అడవి పై ఆదివాసీ సమూహాలకు కల్పించిన సామూహిక హక్కు) హక్కులను అక్కడి అధ్యక్షుడు సామ్రాజ్యవాద నియో లిబరల్ విధానాల వకాల్తాదారు సలీనా 1991లో ఓ నూతన చట్టం చేసి కబలించిన విషయాన్ని పథల్ గడీ ఆందోళనకారులు గుర్తుంచుకోవాలి. మన దేశంలో కూడా మోదీ ఆ బాటే నడుస్తున్నాడు.

కేంద్రంలో బ్రాహ్మణీయ శక్తులు గద్దెనెక్కిననాటినుండి దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2008లో రూపొందిన నూతన అటవీ చట్టాన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన పాలకులు 2019 ఫిబ్రవరిలో భూములకు పట్టాలు లేవనే పేరుతో అడవులనుండి లక్షలాది ఆదివాసులను బేదఖల్ చేయించడానికి సుప్రీంకోర్టు చే ఉత్తర్వులు వెలువరింపచేశారు. దానికి ముందు 2018 మార్చ్ లో సుప్రీంకోర్టు ʹదళిత ఆదివాసీ అత్యాచార నిరోధక చట్టాన్నిʹ సవరింప చేశారు. కానీ దండకారణ్య ప్రజలు ఈ రెండు సందర్భాలలో తమ వ్యతిరేకతను ప్రకటించారు. 2019 చివర్లో మత ప్రాతిపదికపై రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని, దాని వెన్నంటి ముందుకు వచ్చిన జాతీయ పౌరసత్వ సూచీ, జాతీయ జనాభా సూచీని దండకారణ్య ఆదివాసులు ʹతాము హైందవులం కామంటూʹ వ్యతిరేకించారు.

2020 మార్చ్ నుండి నోవెల్ కొరోనా వైరస్ ʹకోవిడ్-19ʹ విజృంభణతో దేశాన్ని పాలకవర్గాలు తీపి కబుర్లతో ప్రజలను గాలికి వదిలి లాక్ డౌన్లతో అతలాకుతలం చేస్తున్నారు. గతంలో అధికోత్పత్తి సంక్షోభాలలో సరుకులను కళ్లముందే నాశనం చేసి కృత్రిమమైన కరువును సృష్టించి ఆర్థిక మాంద్య పరిస్థితుల నుండి తాత్కాలికంగా గట్టెక్కె విధానాలను అలవర్చుకున్న దోపిడీ పాలకవర్గాలు నేటి 21వ శతాబ్దంలో అలాంటి ప్రత్యక్ష విధ్వంసకర పద్దతులు చెల్లవని అతి తెలివితో నెలల తరబడి లాక్ డౌన్లను ప్రకటించి పేద ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. వైరస్ ప్రాణాంతకమని తీవ్ర భయ వాతావరణాన్ని సృష్టించి భౌతిక దూరం కాకుండా సామాజిక దూరం పేరుతో ప్రజలను వెలివేస్తూ ఎవరి ఇళ్లకు వారిని బందీలు చేస్తూ తమ ఫాసిస్టు చర్యలకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించడానికి పీపీపీ పేరుతో లక్షల కోట్ల ప్రజానిధులు ఘరానా కార్పోరేటు వర్గాల కోసం విడుదల చేస్తున్నారు. మరోవైపు పోలీసులు పాలకుల సామాజిక దూరాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను కొరోనా గురించి జాగరూకులను చేస్తున్న విప్లవకారుల ఏరివేతకు అడవులలో గాలింపు తాండవం కొనసాగిస్తున్నారు. దండకారణ్య ఉద్యమం పోలీసుల ధోరణిని నిర్ద్వంద్వంగా ఖండించింది. వారి గాలింపు చర్యలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతిఘటన చర్యలకు పూనుకొని ప్రజలను విప్లవోన్ముఖులను చేస్తోంది.

నాలుగు దశాబ్దాల దండకారణ్య విప్లవోద్యమ నేలలో చల్లిన పోరు విత్తనాలు అనేకం మొలకెత్తి, ఏపుగా ఎదిగి, పోరాట ఫలాలను అధికాధికంగా అందిస్తూ యావద్దేశానికి విస్తరింప చేసినవాళ్లలో కొందరు ఈ సందర్భంగా భౌతికంగా మన మధ్య లేరు. ఉద్యమం పట్ల విశ్వాసం సడిలి మడిమ తిప్పిన కొందరు శతృవుముందు లొంగిపోయారు. నిన్నటి వరకు మనతో కలిసి ʹసమాధాన్ʹను ఎదిరించిన మన ఉద్యమ సహచరులు ( కామ్రేడ్స్ ఇన్ ఆర్మ్స్) కొందరు సమరంలో వీరమరణం పొంది ఇకపై దానిని ఓడించే కర్తవ్యాన్నే కాదు, అలాంటి ʹసమాధాన్ʹలు మరెన్ని ముందుకు వచ్చినా ఈ దేశ విముక్తి మార్గంలో దృఢంగా వాటిని ఎదుర్కొంటూ దుష్ట హిందుత్వ శక్తుల ʹశ్రేష్ట భారతʹ స్వప్నాలను చిత్తు చేస్తూ భారత నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని జయప్రదం చేసి ప్రపంచ సోషలిస్టు విప్లవానికి బాటలు వేయాలనే సందేశాన్ని తమ రక్త తర్పనం ద్వారా మనకందిస్తున్నారు. ఆ దారిలో నిజాయితీగా, నిర్భయంగా, నిబ్బరంగా, నిర్దిష్ట పరిస్థితుల అధ్యయనంతో తగిన ఎత్తుగడలు చేపడుతూ మున్ముందుకు పోవడానికి నాలుగు దశాబ్దాల వేడుకల సందర్భంగా మరోసారి ప్రతిన బూనుదాం.

No. of visitors : 1179
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అవి స్వప్నాలు కావు వాస్తవాలు

పి.శంకర్‌ | 03.07.2018 02:10:57pm

రచయిత తన స్నేహితులతో కలిసి సారాయి చుక్కలు సేవిస్తూ పున్నమి రాత్రులలో మాడియా నృత్యాలను తిలకించే రచన ఆమె కలం నుండి రావడం జనతన సర్కార్లున్న చోటే సాధ్యం.....
...ఇంకా చదవండి

ʹసమాధాన్‌ʹ ప్రజల దగ్గర ఉంది - అయిదు వసంతాల ప్రతిఘటనారావం

యూసఫ్‌బీ | 21.05.2017 07:26:22pm

మావోయిస్టు మూలాలు విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలనేది అసలు అర్థం. కానీ పాలకులకు ఒక విషయం తెలియడం లేదు. మావోయిస్టుల మూలాలు ఈ దేశ దోపిడీ ఉత్ప......
...ఇంకా చదవండి

Make True Their Dreams

sankar | 03.07.2018 02:16:09pm

Only then her dream can come true. Let us fight united for a natural life of the tribals and make true their dreams for the same......
...ఇంకా చదవండి

కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు

చ‌ర‌ణ్‌ | 16.06.2018 12:42:29am

మావోయిజం అంత‌మైతే బస్తర్ బెటాలియాన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒక నెల రొండు నెలల్లోనే నాలుగు బెటాలియాన్ల‌ అర్థసైనిక ద‌ళాలు బస్తర్ ప్రాంతానికి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •