ʹరాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంʹ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని రాజ్యాంగవాదులు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. తమ ʹలక్ష్యʹ సాధనలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారా? లేక సంక్షోభ స్వభావాన్నే తెలుసుకోలేకపోతున్నారా? అనే సందేహం కలుగుతోంది. రాజ్యాంగ రూపకల్పనలోనే ఉన్న సవాళ్ల సంగతి అలా ఉంచితే, గత కొన్ని దశాబ్దాలుగా ఈ సంక్షోభం ముదిరిపోయింది. సంఘ్ పరివార్ అధికారంలోకి వచ్చాక తీవ్రమైనమాట నిజమే. అంత మాత్రాన ఇది ఇప్పుడు మొదలైంది కాదు.
సొంత ఆస్తి హక్కు రాజ్యాంగంలో భాగం కావడమంటే దోపిడీ రాజ్యాంగబద్ధం కావడమే. దోపిడీని రాజ్యాంగం చట్టబద్ధం చేయడమే కాదు, నాన్ ఇష్యూ చేసింది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ప్రకటించుకున్న ఆదర్శాలకు, దాని వాస్తవ పునాదికి వైరుధ్యం ఇక్కడ ఉన్నది. దోపిడీ అనేది అధికారిక ప్రక్రియ అయ్యాక నిత్యం అనేక తలాల్లో అది ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం ఇదే. తరచూ రాజ్యాంగంలోని అద్భుతమైన ఆదర్శాలు, ఆదేశిక సూత్రాలు, విలువలు, హక్కులు అన్నీ భంగపడుతూ ఉండటం యాదృశ్చికం కాదు. ఏదో ఒకానొక పార్టీ, ఒకానొక నాయకుడు, నాయకురాలు కారణమని సరిపెట్టుకోలేం. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి తేడా ఉన్నమాట నిజమే. అయితే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సంక్షోభానికి మనం అనుభవిస్తున్న ʹరాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమేʹ మూలం.
ఈ మౌలిక విషయాన్ని అందుకోగల విశ్లేషణ పరికరాలు రాజ్యాంగవాదుల దగ్గర ఎలాగూ ఉండవు. అందువల్ల సంక్షోభం ఎన్నెన్ని రూపాల్లో విస్తరించినా వాళ్లు చూసీ చూడనట్లు వదిలేస్తారు. పైగా రాజ్యాంగవాదానికి కొత్త అంచులు పదును పెడుతూ ఉంటారు. వాళ్లు ఇలాంటి ఎన్ని విన్యాసాలు చేసినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తనలోని డొల్లతనాన్ని దాపరికరం లేకుండా ప్రదర్శిస్తూనే ఉంటుంది. నిజానికి అది ఈ వ్యవస్థ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆర్థిక రాజకీయ రంగాల్లోనే కాదు, సాంఘిక సాంస్కృతిక రంగాల్లో భారత సమాజం ముందున్న సవాళ్లను అది బాహాటంగా చాటుకుంటూ ఉంటుంది.
ఉదాహరణకు దేశంలో తరచూ భావప్రకటనా స్వేచ్చ భంగపడుతోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వమే దీనికి కారణమని చెప్పవచ్చు. కానీ అలా ఓ మాట అని వదిలేయడానికి లేదు. ప్రజలకు రాజకీయాలు నెరపే స్వేచ్ఛ లేకపోవడంగా దీన్ని చూడాలి.
రాజకీయాలంటే అధికార, ప్రతిపక్ష రాజకీయాలే అని రాజ్యాంగంలో ఎక్కడా రాసి ఉండకపోవచ్చు. కానీ పౌరుల రాజకీయ స్వేచ్ఛ అంటే ఏదో ఒక ఎన్నికల పార్టీతో ఉండటం అని ఇన్నేళ్ల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం కామన్ సెన్స్ గా మార్చేసింది. దీంతో ఆధునిక రాజకీయ ప్రపంచం నుంచి అరువు తెచ్చుకున్న భావప్రకటనా స్వేచ్ఛ లేదా రాజకీయ స్వేచ్ఛ రాజ్యాంగంలో అక్షరాలకే పరిమితమయ్యాయి. మనం భరిస్తున్న ఈ రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యానికి ఆ అక్షరాల అర్థం కూడా తెలియదు. ఆధునిక యుగంలో, రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మధ్య డిఫరెన్షియేషన్ ఉంటుందని అనుకుంటాం. అలా ఉండాలి కూడా.
కానీ ఆచరణలో అన్ని వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్ల రాజకీయ నిర్ణయాల ప్రకారం నడుస్తుంటాయి. ఆ మధ్య బీజేపీ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తోందనే ఉ దారవాదులు ఆందోళన పడ్డారు. అవి ఉనికిలో ఉన్నాయని ఆనందించినా, ధ్వంసమైపోయాయని ఆందోళన చెందినా సారాంశంలో పాలకుల రాజకీయ నిర్ణయాల ప్రకారం నడచుకోవడమే. ఈ రాజకీయ నిర్ణయాలకు సాంస్కృతిక కోణం కూడా ఉంది. అతి ప్రాచీన నిరంకుశ భావాలను, ప్రతీకలను పునర్జీవింపజేసి పాలకులు తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. రాజ్యాంగంలోని విలువలకు వీటి ద్వారా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ అనాగరిక ధోరణికి, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ఆధునిక ప్రజాస్వామిక విలువకు మధ్య ఉన్న వైరుధాన్ని ʹరాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంʹ ఎదుర్కొంటోంది.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాజ్యాంగంలోని అన్ని హక్కులు, విలువలు ఆచరణలో ఇలాంటి దుస్థితిలోనే ఉన్నాయి. అన్ని వ్యవస్థల మీద నిరంకుశ రాజకీయ పెత్తనం కొనసాగే సమాజంలో రాజ్యాంగంలోని ఏ విలువలకూ దిక్కు ఉండదు. అసలు వ్యవస్థలు వేర్వేరుగా బైటికి కనిపిస్తుంటాయి. ఆ మేరకు ఆధునిక ప్రజాస్వామ్యం అని అనుకోవాల్సిందే. ఈ వైరుధ్యం జన జీవితంలో అడుగడుగునా కనిపిస్తుంటుంది. అన్ని వ్యవస్థల పని తీరులో ఇది ఉంటుంది. ప్రతి వ్యవస్థకు తనదైన నియమ నిబంధనలు, పని తీరు ఉండవచ్చు. కానీ అవేవీ అమలులో ఉండవు. అన్ని వ్యవస్థలు ఒకరో ఇద్దరో అధికార మదాంధుల కనుసన్నల్లో పని చేస్తుంటాయి. ఈ స్థితి మన రాజకీయార్థిక వ్యవస్థ స్వభావంతో, మన నాగరికత, సాంఘిక జగత్తులతో సంబంధం లేనిది కాదు.
ఇదంతా పండిత చర్చతో తేలేది కాదు. వాస్తవికత ఎలా ఉన్నదో అనుక్షణం తెలిసిపోయేదే. దీన్ని వివరించుకోగల ఉదాహరణ భీమా కొరేగావ్ కేసు. అది మావోయిస్టు రాజకీయాల మీద అణచివేత అని అనుకొనేవారు ఉన్నారు. అది పాక్షిక సత్యం మాత్రమే. ఒక వేళ అదే పూర్తి సత్యమని అనుకున్నా ఈ కేసు పూర్వాపరాలు మన వ్యవస్థ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పట్టిస్తుంది. మన దేశంలోని ఆధునికత వికాస క్రమాన్ని అర్థం చేసుకోడానికి మచ్చుతునకలాంటి ఉదాహరణ ఇది.
డా.వినాయక్ సేన్ కేసు దగ్గరి నుంచి జిఎన్ సాయిబాబ తదితరుల కేసు, భీమా కొరేగావ్ కేసులను పరిశీలిస్తే ఆధునిక యుగంలో, రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ, జైళ్లు, కోర్టులు అనే అతి ముఖ్యమైన మూడు వ్యవస్థల పనితీరు తెలుస్తుంది. ఈ మూడింటికీ వాటి వాటి నియమ నిబంధనలు ఉన్నాయి. పని పద్దతులు ఉన్నాయి. కానీ అవేవీ నిజం కాదు. నిజం ఏమంటే ఎన్ఐఏ మాత్రమే వాటిని నడుపుతోంది. జైలు, కోర్టు డమ్మీ అయిపోయి ఎన్ఐఏ అధికారులు మాత్రమే దేశంలో పని చేస్తున్నారు. అమిత్ షా, అజిత్ దోవల్ ఎట్లా నడిపిస్తే అట్లా ఎన్ఐఏ పనిచేస్తుంది.
మనుషుల ఆలోచనలపై దాడి చేసేందుకు ఇలాంటి సంస్థలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తని ప్రజాస్వామ్యం మనది. అందుకే భీమాకొరేగావ్ కేసులో ఆలోచనాపరులకు బెయిలు ఇవ్వకపోవడమే కాదు, కనీసం వాళ్లకు వైద్యం అందే పరిస్థితి కూడా లేకుండా పోయింది. బెయిలు ఇవ్వడానికి ఉండే న్యాయబద్ధతను, కరోనా విపత్తులోని ప్రత్యేకతను పరిగణలోని తీసుకోకుండా ఎన్ఐఏ ఏం చెబితే దాన్నే కోర్టు తీర్పుగా చెబుతోంది. జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం తమ బాధ్యత అని జైలు అధికారులు కనీసంగా పట్టించుకోవడం లేదు. ఎన్ఐఏ ఏం చెబితే అది జైలు అధికారులు చేస్తున్నారు. సాయిబాబ, వరవరరావు ఆరోగ్యం విషయంలో న్యాయస్థానం, జైలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్ఐఏ కనుసన్నల్లో నిస్సిగ్గుగా నడుచుకుంటున్నాయి. ఖైదీలకు కనీస వైద్య సౌకర్యాలు కల్పించకుండా మృత్యువు దిశగా తీసికెళ్లాలనే కుట్రపూరితంగా ఎస్ఏఏ వ్యవహరిస్తోంది. మోదీ, అమిత్ షా రాజకీయ నిర్ణయం మేరకే ఎన్ఐఏ ఇట్లా పని చేస్తుంది.
ఈ స్థితిని ఇంకా ముందుకు తీసికెళ్లి తాజాగా భీమా కొరేగావ్ కేసులో దేశవ్యాప్తంగా ఐదుగురికి విచారణ నోటీసులు ఇచ్చారు. ప్రొ. సాయిబాబ విడుదల కమిటీ బాధ్యుడు ఢిల్లీ ప్రొ. హనిబాబు, కబీర్ కళామంచ్ కు చెందిన ముగ్గురు కార్యకర్తలకు, విరసం కార్యవర్గ సభ్యుడు కా. క్రాంతికి ఈ నోటీసులు అందాయి. రెండు రోజుల కింద హైదరాబాదుకు వచ్చిన ముంబై ఎన్ఐఏ అధికారులు క్రాంతిని రోజంతా విచారించారు. తిరిగి ఈ నెల 24న ముంబై రావాలని నోటీసు ఇచ్చారు. రెండు రోజులపాటు ఆయన ఇంటి మీదికి వెళ్లి ఆయన తల్లిని భయాందోళనకు గురి చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 13వ తేదీన ప్రొ. ఆనంద్ తేల్ తుంబ్లే, ప్రముఖ పాత్రికేయుడు గౌతంనవల్కాలను అరెస్టు చేశారు. ఇప్పుడు విచారణ నోటీసుల పేరుతో ఈ వేధింపులు ఆరంభించారు. ఈ కరోనా విపత్తులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వీళ్లు ముంబై వెళ్లవలసి ఉన్నది. ఇట్లా మరో విడత భీమా కొరేగావ్ కేసును తిరగదోడి ఇంకా అనేక మందికి చుట్టడానికి ఎన్ఐఏ సన్నాహం చేస్తోంది. నేరం జరగక్కర్లేదు. సాక్ష్యాలు ఉండనవసరం లేదు. విచారణ, బెయిలు, కనీస వైద్య సదుపాయాలు ఏమీ లేకుండా చీకటి కొట్లో బంధించేయగదు. పురాతన యుగపు శిక్షాస్మృతి కంటే భిన్నమైనది కాదిది. ఒక వ్యవస్థ సక్రమంగా పని చేయకుంటే మరో వ్యవస్థను ఆశ్రయించే అవకాశం కూడా లేదు. అన్ని రాజకీయ నిర్ణయాల ప్రకారం పని చేస్తుంటాయి. ఇది మన వ్యవస్థ, నాగరికతా క్రమాలను పట్టించే స్వభావం.
ఇది మనుషులను నిర్బంధించే కుట్ర మాత్రమే కాదు. ఆలోచనలను హత్య చేసే అతి దుర్మార్గమైన ఫాసిస్టు చర్య. ఇలాంటి పనులన్నీ మన పాలకులు రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యం పేరుతోనే చేస్తున్నారు. అత్యున్నత ఆదర్శాలను ప్రకటించుకున్న రాజ్యాంగం ప్రమాణంగానే ఇవన్నీ చేస్తున్నారు. రాజ్యాంగంలోని అక్షర ఆదర్శాలకు, మన సమాజ వాస్తవ స్థితికి మధ్య ఉన్న వైరుధ్యానికి ఈ ఘటనలు నిదర్శనం. ఉదారవాద భావాల గురించి, రాజ్యాంగబద్ధ సంస్కరణల గురించి పండిత చర్చలు చేసేవారిని మన దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్య స్వభావాన్ని అసలైన కోణంలో చూడమని ఉద్బోధిస్తున్న సందర్భం ఇది. దీన్ని ఫలానా రాజకీయ విశ్వాసాల మీద పాలకుల వ్యతిరేకతగా చూస్తామా? భావజాల వైరంగానే చూస్తామా? కేవలం ఫాసిస్టు లక్షణంగా చూస్తామా? మన వ్యవస్థలోని పరిణామాలు, నాగరికతా వికాసం ఆచరణలో ఎలా ఉన్నదీ దీన్నుంచి తెలుసుకుంటామా? అనేది తేల్చుకోవాల్సిందే. ముఖ్యంగా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని ఆశిస్తున్న వాళ్లంతా ఈ వాస్తవ స్థితి విసురుతున్న సవాళ్లను గుర్తిస్తే బాగుండు.
Type in English and Press Space to Convert in Telugu |
వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల...... |
రైతు - నీళ్లురైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం...... |
ఈ తీసివేతలు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా......... |
ఆజాదీ కశ్మీర్ : చల్లారని ప్రజల ఆకాంక్షకాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........ |
జీవిత కవిత్వం విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్ పద్ధతులకు వ... |
వివేక్ స్మృతిలో...వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు....... |
భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమేఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి...... |
కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్ దేశస్థుల స్వేచ్ఛ గు... |
మానవ హననంగా మారిన రాజ్యహింస ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం....... |
నాగపూర్ వర్సెస్ దండకారణ్యందండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |