అమరుల బంధుమిత్రుల సంఘం వ్యవస్థాపక కో కన్వీనర్ కా. నర్సన్న స్మృతిలో..
అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా జూలై 18 ఏబీఎంఎస్ ఆవిర్భావ దినాన్ని జరుపుకుందాం
ఈ జూలై 18 అమరుల బంధుమిత్రుల సంఘం పద్దెనిమిదో ఆవిర్భావ దినం. సంస్థ నిర్మాణానికి కృషి చేసి, వ్యవస్థాపన కో కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించిన కొడకంచి నర్సన్న ఈ నెల 4వ తేదీన అనారోగ్యంతో అమరుడయ్యాడు. ఆయన కుమారుడు వేణు విప్లవోద్యమంలో పని చేస్తూ 2001 జనవరి 23న బూటకపు ఎన్ కౌంటర్లో అమరుడయ్యాడు. ఆ రోజుల్లో ఎన్ కౌంటర్లలో అమరులైన వీరుల శవాల స్వాధీనం, స్థూప నిర్మాణం, సంస్మరణ సభల నిర్వహణకు అమరుల కుటుంబాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ బిడ్డలను కాల్చేయడమేగాక, అనాథ శవాలుగా పోలీసులే కాల్చేసే స్థితి ఉండకూడదని అమరుల తల్లిదండ్రులు అనుకున్నారు. నర్సన్న అందులో భాగమయ్యాడు. 2002 జులై 18న ఈ ప్రయత్నాలు ముందుకు వచ్చి హైదరాబాదులో అమరుల కుటుంబాలతో ఒక సభ జరిగింది. అక్కడ ఒక కమిటీ ఏర్పడింది. దానికి కో కన్వీనర్‌గా నర్సన్న ఎన్నికయ్యాడు. అమరుడు వేణు (రావణ) తండ్రిగా ఆయన అమరుల బంధుమిత్రుల సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ చివరి దాకా కొనసాగాడు. ఆయన మరణం కుటుంబానికి, ఏబీఎంఎస్ కే కాక అమరుల కుటుంబాలకు వ్యక్తిగతంగా కూడా బాధాకరం.
ఏడేళ్ల కింద ఇదే జులై 4న గంటి ప్రసాదాన్ని నెల్లూరులో ప్రభుత్వ కిరాయి వ్యక్తులు హత్య చేశారు. ఆయన ఏబీఎంఎస్ గౌరవాధ్యక్షుడిగా, కార్యవర్గ సభ్యుడిగా పని చేశాడు. ఇలా ఏబీఎంఎస్ నిర్మాణంలో పని చేసిన వాళ్లు, అమరుల తల్లిదండ్రులు ఈ పద్దెనిమిదేళ్లలో ఎందరో చనిపోయారు. వీరిలో 2019 అక్టోబర్ 28న సింగరేణి కార్మికోద్యమ నాయకుడు అమరుడు సమ్మిరెడ్డి (రమాకాంత్) తల్లి ప్రమీలమ్మ అమరురాలైంది. ఆమె చాలా కాలం ఏబీఎంఎస్ కార్యవర్గ సభ్యురాలిగా పని చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న పోతనపల్లి జయమ్మ అనారోగ్యంతో అమరురాలైంది. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట తరానికి చెందిన ఆమె ఏబీఎంఎస్ సభ్యురాలు. బంధుమిత్రుల సంఘం వరంగల్ జిల్లా కమిటీ సభ్యురాలు ఊర్మిళ సహచరుడు, కుటుంబసభ్యులను ఈ ఏడాది మార్చిలో అక్రమంగా అరెస్టు చేసి జెయిలుకు పంపారు. అమరుల శవాల స్వాధీనం, స్థూప నిర్మాణం కోసం కేసులు, అణచివేత అనుభవించిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఏబీఎంఎస్ పని చేస్తోంది.
ఈ పద్దెనిమిదేళ్లలో ప్రతి జూలై 18న సికింద్రాబాదులోని సుభాష్ నగర్ స్థూపం దగ్గరికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమరుల కుటుంబ సభ్యులు, మిత్రులు, విప్లవాభిమానులు వచ్చి సభ నిర్వహించే పోరాట సంప్రదాయం కొనసాగుతోంది. ఈసారి కరోనా వైరస్ తీవ్రత వల్ల ఈ కార్యక్రమం నిర్వహించలేకపోతున్నాం. లా డౌన్ వల్ల ప్రజల కార్యక్రమాలు ఆగిపోయాయేగాని పాలకుల దుర్మార్గాలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు గతం కంటే ఈ కరోనా కాలంలో వేగంగా తీసుకొస్తున్నారు. అట్లాగే ప్రజా ఉద్యమాల మీద నిర్బంధాన్ని తీవ్రం చేసింది. దేశ వ్యాప్తంగా ఉద్యమ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. గ్రామాల మీద దాడులు, వేధింపులు, అరెస్టులతో పాటు ఎన్కౌంటర్ హత్యలు కొనసాగుతున్నాయి. వందలాది మంది సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుల మీద అక్రమంగా ఊపా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఈ కరోనా కాలంలోనే ప్రముఖ మేధావులు ఆనంద్ తేల్ తుంబ్లే, గౌతం నవల్కాలను భీమా కొరేవావ్ కేసులో అరెస్టు చేశారు. ఇదే కేసులో అరెస్టయి కా. వరవరరావు జైల్లో ఉన్నారు. ఏబీఎంఎస్ ఏర్పడ్డాక ప్రతి ఆవిర్భావ సభకు హాజరయ్యే వరవరరావు లేకుండానే గత జూలై 18 జరిగిపోయింది. వయోభారం వల్ల ఆయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో జైలులో ఉన్నారు. ఆయనతోపాటు భీమా కొరేగావ్ కేసులో అక్రమ నిర్బంధంలో ఉన్న వాళ్లందరికీ బెయిలు రాకుండా కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ అడ్డుకుంటోంది. అలాగే జిఎన్ సాయిబాబ తీవ్ర అనారోగ్యంతో యావజ్జీవ ఖైదీగా నాగపూర్ జైల్లో ఉన్నారు. గతంలో ఆయన సుదీర్ఘ జైలు జీవితం తర్వాత బెయిలు మీద విడుదలై వచ్చి అమరుల కుటుంబసభ్యుడిగా జూలై 18 సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగించారు. అప్పటికే ఉద్యోగంలో సస్పెండ్ అయి ఉన్నా, బెయిలు మీద బైటికి వచ్చినా తటపటాయింపు లేకుండా ఆ సభలో రాజ్యహింసను ఖండిస్తూ మాట్లాడి, అమరుల ఆశయాలు ఎత్తిపట్టాడు. ప్రస్తుతం ఆయన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉ ంది. సాయిబాబాకు పెరోల్ ఇవ్వడానికి కూడా కోర్టులు అంగీకరించలేదు. కరోనా కాలంలో కూడా వేలాది పోలీసు బలగాలను కూంబింగ్ కు, ఎన్ కౌంటర్ హత్యలకు ఉసిగొల్పుతున్న ప్రభుత్వాలే రాజకీయ ఖైదీలకు బెయిలు, పెరోలు ఇవ్వవద్దని ఆదేశిస్తున్నాయి. తెలంగాణలో గత ఆగస్టు నెల నుంచి వివిధ ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను 18 మందిని అక్రమంగా అరెస్టు చేశారు. అనేక మందిని ఈ కేసుల్లో ఇరికించారు. అరెస్టయిన వాళ్లలో ఇంకా కొందరికి బెయిలు రావాల్సే ఉన్నది. బెయిలు మీద విడుదలైన నలమాస క్రిష్టను తిరిగి ఎన్ఏఏ పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాకుండా ప్రజా సంఘాల నాయకులను, సభ్యులను నిరాధారంగా ఎన్ఏఏ పోలీసులు విచారణ పేరుతో వేధిస్తున్నారు. తాజాగా విరసం కార్యవర్గ సభ్యుడు క్రాంతి ఇంటి మీదికి ముంబై ఎస్ఏఏ పోలీసులు రెండు రోజులు వెళ్లారు. ఒక రోజంతా విచారణ జరిపారు. ఈ కరోనా కాలంలో ముంబైలో జూలై 24న హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. ఇట్లా ప్రజలు, ప్రజా సంఘాల కార్యకర్తల మీద, మేధావుల మీద అక్రమ నిర్బంధం పెరిగిపోయింది. గత ఏడాదిలో తెలంగాణలో వివిధ ప్రజాసంఘాలను నిషేధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. నిషేధానికి ఉండాల్సిన కనీస చట్టపరమైన ప్రక్రియ ఏదీ పాటించకుండానే బెదించడానికి, ప్రజల నుంచి సంఘాలను దూరం చేయడానికి కుట్ర పూరితంగా ఇలాంటి ప్రకటన చేశారు. పోలీసులు ప్రకటించిన జాబితాలో అమరుల బంధు మిత్రుల సంఘం కూడా ఉండింది. నిషేధం బూచి చూపించి హైదరాబాదులో కొన్ని సమావేశ స్థలాల్లో మీటింగులకు అనుమతి లేకుండా అయితే పోలీసులు చేయగలిగారు. ఇది ఒక రూపంలోని నిర్బంధం.
గత వార్షికోవత్సవం తర్వాత 2019 సెప్టెంబర్ లో విశాఖ ఏజెన్సీలో ఐదుగురు విప్లవకారులను పోలీసులు హత్య చేశారు. వీరంతా చత్తీస్ ఘడ్ కు చెందిన ఆదివాసీ కామ్రేడ్స్. అలాగే 2019 డిసెంబర్ లో దండకారణ్య గెరిల్లా జోన్ కమిటీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అనారోగ్యంతో అమరుడయ్యాడు. 2020 మే2న గడ్చిరోలి ప్రాంతంలో దండకారణ్య తొలి తరం మహిళా నాయకురాలు కా. రాగో(జైని)ని పోలీసులు బూటకపు ఎదురు కాల్పుల్లో హత్య చేశారు. జూలై 3వ తేదీన తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో కొట్టె అభిలాష్ అలియాస్ చందర్ అమరుడయ్యాడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్ట్ నగర్ ఆయన స్వగ్రామం. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు విప్లవోద్యమంలో పని చేస్తూ అమరులయ్యారు. కామ్రేడ్ పెద్ది శంకర్ నుంచి అభిలాష్ దాకా నలభై ఏళ్ల దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా అమరులయ్యారు. ఈ ఏడాదిలో జార్ఖండ్, దండకారణ్యం, ఏవోబీ, పశ్చిమ కనుమల్లోని ట్రై జంక్షన్ ప్రాంతాల్లో అనేక మందిని ఎన్ కౌంటర్ల పేరిట కాల్చేశారు.
ఈ అమరులందరినీ స్మరించుకుందాం. వాళ్ల త్యాగాలను ఎత్తిపడదాం. జైయిళ్లలో అక్రమ కేసుల మీద నిర్బంధించిన రాజకీయఖైదీల విడుదల కోసం ఉద్యమిద్దాం. కా. నర్సన్న, కా. గంటి ప్రసాదం సంస్మరణలో విప్లవ ప్రజా పోరాటాల్లో అసువులు బాసిన వీరులందరినీ జూలై 18న స్మరించుకుందాం. వివిధ రూపాల్లో కొనసాగుతున్న రాజ్యహింసను ధిక్కరిద్దాం. ప్రశ్నిద్దాం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా ఉన్నందు వల్ల ఎప్పటిలా ఈ జూలై 18 కార్యక్రమాన్ని సుభాష్ నగర్లో నిర్వహించడం లేదు. ఆ ప్రాంతంలో ఉన్న అమరుల కుటుంబసభ్యులు, మిత్రులు జెండా ఎగరేసి అమరులకు నివాళి ప్రకటిస్తారు. మిగతా ప్రాంతాల్లో అమరుల బంధుమిత్రులు ఎక్కడికక్కడ నివాళి కార్యక్రమాలు వీలునుబట్టి నిర్వహిస్తారు. అమరుల కుటుంబసభ్యుల్లో చాలా మంది వృద్ధులు, అనారోగ్యపీడితులు కాబట్టి ఏబీఎంఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. అందరం కలవలేకపోయినా ఎక్కడికక్కడ మన ఇంట్లో, ఊరులో అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. ఎన్ కౌంటర్ హత్యలను, అక్రమ అరెస్టులను నిరసిద్దాం. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం.
అలాగే జూలై 18 సాయంకాలం 6 గంటలకు విరసం.ఆర్గ్ ఫేస్ బుక్ లైవ్ లో అమరుల సంస్మరణ సభ జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం.
Type in English and Press Space to Convert in Telugu |
అడవి తల్లీ నీకు వందనామమ్మా...కామ్రేడ్ గుండేటి శంకర్ స్మృతిలో.. "అడవి తల్లీ నీకు వందనామమ్మా...
పుడమి తల్లీ నీకు వందనామమ్మా.. పురుగు బూసి ముట్టకుండగా జూడు"... |
అమరులను స్మరించుకుందాం - రాజ్యహింసను ప్రతిఘటిద్దాంఅమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావదినం సందర్భంగా... జూలై 18న హైదరాబాద్‌లో
ప్రజా ఉద్యమాలపై రాజ్యహింసకు వ్యతిరేకంగా బహిరంగసభ...... |
రాజ్యహింస చెలరేగి పోయెగదనే.. ఎదురు కాల్పుల పేర మిము జంపెగదనేఅమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ దినం సందర్భంగా 18 జూలై 2016న సుబాష్ నగర్లో ర్యాలీ. అమరుల స్మృతిలో... కళాకారుల విప్లవ గీతాలు........ |
అమరుల స్మృతిలో....రాంగుడా లాంటి అతి పెద్ద బూటకపు ఎన్కౌంటర్ దగ్గరి నుంచి దండకారణ్యంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఎదురుకాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఎంతోమంది విప్లవకారులు, విప్లవాభిమాన... |
నీ పోరు గెలవాలని ..నిన్ను ఆ పోరులో చూడాలని ..అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ సభలో ప్రభాకర్ స్మృతిలో " సాహితి " పాడిన పాట ... |
అమరుల బంధు మిత్రుల సంఘం ఉత్తరాంధ్ర రెండో సదస్సుఉత్తరాంధ్ర అమరులను స్మరిస్తూ అమరుల బంధు మిత్రుల సంఘం ఈనెల 23న బొడ్డపాడులో ఉత్తరాంధ్ర రెండో సదస్సును నిర్వహిస్తోంది........ |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |