ఒక కొత్త కథల పుస్తకాన్ని ముట్టుకోవడం అంటే ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించటం.ప్రతి మంచి కథల పుస్తకం కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది లేదా ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తుంది. అప్పటిదాకా మనం చూస్తున్న ప్రపంచమే అయినప్పటికీ మనం చూస్తూనే ఉన్నప్పటికీ , మనకు కనపడని దృశ్యాలెన్నో మనం చూడలేని సత్యాలెన్నో కథ చదివాక కొత్తగా మనకు అర్థం అవుతాయి. ఇది కదా జీవితం అని అనిపిస్తుంది. ఇంతేనా జీవితం అనిపిస్తుంది. కాదు కాదు.. ఇది కాదు జీవితం అని కూడా అనిపిస్తుంది. జీవితం ఏది అవునో, ఏది కాదో చెప్పేది మంచి కథ. మొత్తం మీద జీవితాన్ని ప్రపంచాన్ని కొత్తగా, లోతుగా పరిచయం చేసేది మంచి కథ. చదివిన కథ ఒక అలజడిని కలిగిస్తే ,కడుపులో తిప్పినట్లు అనిపిస్తే ,కథ చదివాక గుండె గాబరా పడితే, కథ మనిషిలోపల ఏదో స్పందన కలిగించిందని అర్థం. ఒక పుస్తకం చదివినప్పుడు రక్తం తడిగా చేతికి అంటుకున్నట్లనిపిస్తే ,ఆ పుస్తకంలోని కన్నీళ్లు మన కళ్ళలోనుంచి రాలి పడితే, ఎవరితో బాధ మనల్ని బాధ పెడితే భయపెడితే, అది మంచి పుస్తకమే. ఎప్పుడూ దేనికీ తెగించకపోయినా, ఎప్పుడూ దేన్నీ ప్రశ్నించకపోయినా, నాలుగైదు కథలు చదివాక దేన్నో ఎదిరించాలనిపిస్తే ,ఎందుకో తిరగబడాలనిపిస్తే ,ఎప్పుడూ రాని ఆలోచన వస్తే, కొంత దుఃఖం,కోపం, కొంత ఆవేశం మనిషిలో నుంచి తన్నుకు వస్తే ఆ కథలేవో అలజడి కలిగించే కథలని అర్థం.!
ఎం ఎస్ కె కృష్ణ జ్యోతి కథా సంకలనం" కొత్త పండగ " అలాంటి ఒక మంచి కథల పుస్తకం. సిరా ముద్ర ప్రచురణల తరపున తిరుపతి బి.కిరణ్ కుమారి వేసిన ముఖచిత్రంతో 2019 జూన్ లో వెలుగుచూసిన ఈ కథల పుస్తకం నిండా చీకటి ఉంది. లోకంలో పైకి కనిపించని చీకటిని లోతుగా చూపించే ప్రయత్నం రచయిత్రి చేశారు. ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఆ పదునైన వెలుతురు పాఠకులను చైతన్యపరుస్తుంది. ఇందులోని 17 కథలూ వదలకుండా మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సినవే. మనం వదిలించుకుందాం అని అనుకున్నా, చదివిన తర్వాత మనల్ని ఎంతమాత్రం వదిలిపెట్టని కథలివి. అనేక వందల పుస్తకాల మధ్యలో నిత్యం మనం చదువుకుంటూ చదువుకుంటూ ఎప్పుడో చోట ఎక్కడో అక్కడ ఉన్నట్లుండి ఆగిపోతాం. అట్లాంటి పుస్తకమే ఇది. మామూలుగా చదివి పక్కన పెట్టేసే పుస్తకం కాదు, చదివిన తర్వాత మళ్ళీ మనల్ని మామూలుగా వుంచే పుస్తకం కూడా కాదు- నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే అనేక జీవితాల వ్యధల సంపుటి ఈ కథల పుస్తకం.
***
వివిధ సాహిత్య ,అంతర్జాలపత్రికల్లో ముందుగా రావడం వల్ల విస్తృతంగా, విభిన్న వర్గాల పాఠకులకు ఈ కథలు కథాసంపుటి కన్నా ముందే చేరువయ్యాయి.
కాకి గూడు(తెలుగు వెలుగు అక్టోబర్ 2017), నేను -నా దయ్యం(సాక్షి ఫన్ డే 2015జూలై 26), స్త్రీ ధనం (2015 బలివాడ కాంతారావు బహుమతి పొందిన కథ),నేను తోలు మల్లయ్య కొడుకు(2015 అక్టోబర్ 2 సారంగ),శాంతి విప్లవం శాంతి(2015 డిసెంబర్ మాతృక),తెల్ల మచ్చల నల్ల పంది(2017 మార్చ్ తెలుగు వెలుగు), కొత్త పండుగ(2016 ఆగస్టు తెలుగు వెలుగు),దొరబాబు- (2016 జూన్ వాకిలి),మర్డర్ ఎంక్వయిరీ (2016 ఏప్రిల్ ప్రజాసాహితి), నా నేల నాకు ఇడిసి పెట్టు సార్(2016 జూన్ అరుగు), బొమ్మ-(2017 తానా వార్షిక సంచిక),షరీనా(2017 సెప్టెంబర్ అడుగు), డెవిల్ హౌస్(సాక్షి 2017 అక్టోబర్ 29),ఒక దేశం ఒక ధనమ్మ (2017 అక్టోబర్ మాతృక),
దురాయి(2018 కొత్త కథ), సముద్రపు పిల్లాడు(2018 మే 20 ఆంధ్రజ్యోతి), పంచమి (2018 నవంబర్ 11 సాక్షి) ఇవీ ఈ కథా సంపుటంలోని కథలు.
కృష్ణజ్యోతి కథల గురించి "ఇది ʹకడగొట్టోళ్ల బాధామయ కథలు. ʹకడగొట్టోళ్ల లోకి కడగొట్టోళ్లుʹ అయిన ఆడ కూతుళ్ళ మనస్సుల సుడిగుండాలు. ఇవి పాత్రల మీద రచయిత దౌర్జన్యం లేని, వాదాల దురాక్రమణ లేని వైవిధ్యం కళా నైపుణ్యాలు. ఏ ముదురు రంగులు పులమని, నలుపు తెలుపుల దీన జీవన చిత్రాలు.అచ్చమైన పల్లెపట్టు పలుకుతో, మధ్య మధ్య మంచి చెతుర్లతో మనల్ని పలకరిస్తాయి. ఉన్నట్టుండి ఒకే ఒక్క మాటతో గుండెల్ని కలుక్కుమనిపిస్తాయి. అచ్చమైన నేల బిడ్డ కథలివి.కృష్ణ జ్యోతి సాధారణంగా కనపడే అసాధారణ రచయిత్రి" అంటారు పాపినేని శివశంకర్.
ʹదురాయిʹ, నానేల నాకు ఇడిసి పెట్టు సారూʹ ʹషరీనʹ, ʹడెవిల్ హౌస్ʹ వంటి కథలు అనేక వివక్షలకు గురైన జీవితాలు కనబడతాయి. అభివృద్ధి పేరిట, ఆధునుకీకరణ పేరిట సహజవనరులు నొల్లుకోబడుతున్నాయి. సహజ వనరుల వారసులు వెళ్ళగొట్టబడుతున్నారు. అడవుల నుంచి ఆదివాసీలు, సముద్రతీరం నుంచి మత్స్యకారులు, సారవంత పంట భూములు నుంచి వ్యవసాయక బహుజనులూ విస్తాపనకు గురవుతున్నారు. సాహిత్యావరణంలో కూడా సరిగ్గా ఈ జీవితాల కథనాలు విస్తాపనకు గురి అవుతున్నాయి. కనుక, మరింతగా వీటిని కథనం చేయాలని కోరుతున్నానంటారు అట్టాడ అప్పల నాయుడు.
జీవితంలోంచి కథలకు కావలసిన ముడి పదార్థాలని ఎన్నుకోవడంలోనూ, తీసుకున్న వస్తువుల్ని ప్రతీకాత్మకంగా, సార్వజనీయంగా మలచడంలోనూ రచయిత్రి నేర్పును ఈ కథలన్నీ నిరూపిస్తాయి. కథలకు సరిపోయే కంఠస్వరాన్ని ఆమె జాగ్రత్తగా ఎన్నుకుంటారు.సమాజంలోని అన్యాయాల్నీ, అమానవీయతలనూ సహించలేకపోయినప్పుడల్లా ఆమెలోని వ్యంగ్యం పదునెక్కి పోతుంది. ప్రకృతి సహజంగానూ, సులభంగానూ యిచ్చే సామాన్యమైన ఆనందాల్ని గూడా సాదా సీదా జనాలకు అందనివ్వని సమాజం దౌష్టన్ని కృష్ణ జ్యోతి కథలన్నీ నిలదీసి ప్రశ్నిస్తాయంటారు- మధురాంతకం నరేంద్ర.
ఆంధ్రా కోస్తా తీర వాసుల, దక్షిణ జిల్లాల పట్టపోళ్ళ జీవితాల్ని వాళ్ళ ఆచార వ్యవహారాలని ఆరాట పోరాటాలను మన ముందు పెట్టిన కృష్ణ జ్యోతి కథలు హంగూ ఆర్భాటమూ లేకుండా జీవితాన్ని మాత్రమే చూపిస్తాయి. జీవితాలనుంచే పుట్టిన కథలు. ఓవర్ టోన్స్ లేకుండా శక్తివంతంగా చెప్పిన కథలు. కథలో ప్రత్యక్షంగా ఏదో ఒక పాత్ర పక్షం వహించడం కాక ఒక ప్రేక్షకురాలిగా సంయమనంతో ʹఇదీ సంగతి. ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం ʹ అన్నట్టు నిబ్బరంగా చెప్పిన కథలు. సామాన్యంగా అనిపించే అసామాన్యమైన కథలు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతున్నామని భ్రమ పెట్టే వాతావరణంలో అభివృద్ధి అందరిదీ కాదు అని అర్థం చేయించే కథలు.పితృస్వామ్య సమాజంలో జీవిస్తూనే దానితో తలపడుతున్న బలమైన స్త్రీ పాత్రలు ప్రధానంగా ఉండే కథలున్నాయి.
కృష్ణజ్యోతి కథల్లో కథకి అవసరమైన నేపధ్యాన్ని చెప్పడం వరకే వర్ణనలుంటాయి.అనవసరమైన వివరాలు అసలుండవు. క్లుప్తంగా నిరాడంబరంగా కథ చెబుతుంది.పాత్రోచితమైన భాష వాడుతుంది.-అంటారు "తీరవాసుల కథలు, వెతలు" పేరిట రాసిన తన ముందు మాటలో సత్యవతి గారు.
చిన్న కథలో ఏం చెప్పొచ్చు అని ప్రశ్నిస్తే -జీవితం తెలిసిన రచయితలు మొత్తం జీవితాన్ని యధాతధంగా చూపించగలరనటానికి ఒక ఉదాహరణ ఈ కథా సంకలనం లోని " ఒక దేశం ఒక ధనమ్మ " అనే చిన్నకథ. దేశంలోని ఒక నిరుపేద బాలిక దుస్థితిని దుఃఖాన్ని, దైన్యాన్ని,ధైర్యాన్ని , జీవన పోరాటాన్ని తెలియజేసిన ఒక మంచి కథ. కథ ఇలా ప్రారంభమవుతుంది..
కథ సుఖాంతమే. అదృష్టం అలా ఊహకి అందకుండా తిరుగుతుంది ఒకోసారి!
ఇంత చీదరలో కూడా ధనమ్మ తన రోజువారీ పనికి బైలు దేరింది. కలలు కనాలి అని ఎలా తెలుసుకుందో కానీ, పనికి బైలు దేరినప్పుడు పెద్ద పెద్ద ఇనప ముక్కల్ని, కాగితం ఆటల్నీ ప్లాస్టిక్ డబ్బాల్నీ కలలు కంటూ బైలు దేరుతుంది. సాయంకాలానికి కలలు నిజం చేసుకుని తిరిగి వస్తుంది. ఇవాళ అటువంటి కలలకి ఓపిక లేదు. పరిస్థితి బాలేదు. నడవడం కష్టంగా ఉంది. మూడునెలలైంది. లోపల్నించి నెత్తురు కారడం మొదలు. ఆరేడు రోజులు అలా కారి ఆగి పోతుంది. మొదటి నెలే తను పెద్ద మనిషి అయిపోయినట్లు ధనమ్మకి తెలిసిపోయింది. శుభవార్త! కానీ చెప్పుకోడానికి ఎవరూ లేరు.
కథ ప్రారంభమే ఉలికిపాటుకు గురిచేస్తుంది.
పిల్లలకి కలలు ఉంటాయని, కలలు వస్తాయని తెలుసు, కానీ అందరిలాంటి కలలు ధనమ్మకి రావు.ఆమె కలలు వేరని ఒకే ఒక్క మాటలో ఆ అమ్మాయి జీవితం ఏమిటో రచయిత్రి సూటిగా చెబుతోంది. ఉన్న వాళ్ళ కుటుంబాలో ఒక పండుగలా భావించే ʹపెద్దమనిషి కావడంʹ అనే సందర్భం ధనమ్మ జీవితంలో విశేషం ఏమీ కాదని పేదరికం అలాంటిదని ఒక మాటలో రచయిత్రి చెప్పేస్తుంది.
భుజాన గొనె సంచి, రాగి రంగులో రింగులు తిరిగిన తైల సంస్కారం లేని జుట్టు మాసిన దేహం, మోకాళ్ళ కిందకి వేలాడే చీకిపోయి, ఏ రంగో ఆనవాలు పట్టడానికి చిక్కని అనార్కలీ డ్రెస్; వయసు పదమూడు. పేరు ధనమ్మ. వాళ్ళ అమ్మ పెట్టిన పేరు. ఆ పేరు పెట్టిన తల్లి పైకి పోయింది. ఈ పిల్ల పుటక్కి కారణం అయిన తండ్రి ఇంకా పోలేదు.ప్రభుత్వ ఆదాయం ఉడతా భక్తిగా పెంచే క్రమంలో తన పరిమిత సంపాదనలో ఎక్కువ భాగం బెల్టు షాపుకి అప్ప చెబుతాడు. కాబట్టి అతను కూడా తొందర్లోనే పోయే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా అదే బాధ్యత మీద తాగి ఏదో ఫలానా వీధిలో పడున్నాడు
పెద్దమనిషి అవడం గురించే కాదు, ధనమ్మకి ఇంకా ఎన్నో విషయాలు తెలుసు. కటిక పేదరికం. దేన్నీ దాచి పెట్టదు. అన్నీ విప్పి చూపించేస్తుంది!
రచయిత్రి ఎంతగా జీవితాన్ని, సమాజాన్ని లోతుగా పరిశీలించారో -"కటిక పేదరికం. దేన్నీ దాచి పెట్టదు. అన్నీ విప్పి చూపించేస్తుంది!"
అనే ఒక్క మాటలో మనకు చెబుతోంది. జీవితాన్ని ఉన్నదున్నట్లు చూపటానికి పేరాలు పేజీలు అవసరం లేదు . ఒక్క మాట చాలు, ఒక్క దృశ్యం చాలు.!
కడుపులో నొప్పి, కానీ ఈ వంకన పని మానేసి ఇంటికి దగ్గర ఉండదు వాస్తవానికి బజారు కూడా పదిలం కాదు కానీ, ఇల్లు కన్నా బజారు పదిలం! ..ఆ ఇల్లు మాటలతో చెప్పడానికి కుదరని ఓ పదార్థం.పాత చీరలు కట్టిన డేరా .లోపల మట్టి. నేలపై చింకి చాపల ఫ్లోరింగ్. అడపా దడపా పక్కలో పాములు. ఇంకా ఇంకా చాలా. ప్రతిదీ బైటికి చెప్పడం కుదరదు.
చీర ముక్కలూ, ఫాంటు పేలికలూ ఏరి దాచి పెట్టింది. రెండు పిన్నీసులు సంపాయించి గోచీ కట్టింది. కాళ్ళ మధ్య ఒరుసుకుంటోంది. నడవడానికి సౌకర్యంగా లేదు. కాళ్ళు ఎడం జరిపి నడిచినా, కాస్త కాస్త దూరం తరవాత ఆగి పోవలసి వస్తోంది.
ʹ ఈ కుండలో మట్టి, కాలవలో దొర్లించి రావే ʹ అమ్మ ధనమ్మని పిల్చి చెప్పేది .ఆమె బాలింత. నులక మంచంలో తమ్ముణ్ణి పక్కలో వేసుకుని పండుకునే ఉండేది. ఆ మంచానికి మధ్య భాగంలో నులక ఎడం చేసిన ఖాళీ ఉండేది. ఆ ఖాళీ కంత కింద ఒక కుండ. కుండలో మట్టి, అమ్మ పొట్టలోనించి నెత్తురు గడ్డలు కిందకి, కుండ లోని మట్టిలోకి పడుతూ ఉండేవి. మట్టి, రక్తంతో బాగా తడిసిపోతే దానిని ఖాళీ చేసి కొత్త మట్టి తెచ్చి పోసే పని ధనమ్మది .ఇంకా ఆ పిల్లవాడి ముడ్డి కింద గుడ్డలు తీసే పని కూడా ధనమ్మదే. చాకీరీ చాకిరి. కానీ ఈ పాటు తొందరగానే తెమిలింది. తారీఖు, నెలా, వారం ఇవన్నీ ధనమ్మ చెప్పలేదు గానీ, అటూ ఇటుగా రెండు మూడు వారాల తేడాతో ఈ రెండు పనులూ ఆమెకి తప్పి పోయాయి.!
రచయిత్రి ఈ ఒక్క పేరాలో భారతీయ సమాజం అట్టడుగు పొరల్లో దాగున్న అత్యంత దుఃఖభరిత జీవిత దృశ్యాన్ని వెలికితీసి చూపిస్తుంది.గుడిసెల్లో మురికివాడల్లో ముడుచుకుని దాక్కున్న నిరుపేద జీవితాల్లో ఈ దృశ్యం మామూలే.
మురికివాడల అభివృద్ధి పథకాలు, పేదరిక నిర్మూలన పథకాలు , కనీస ఆరోగ్యం అందించే పథకాలు ఎన్నున్నా , ఏళ్ల తరబడి అమలవుతున్నా లక్షలాది మందికి ఈ నాటికి ఆహార భద్రత లేకపోవడం ,విద్య ,వైద్యం మొదలైన మౌలిక వసతులు కనుమరుగు కావడం ,కనీస దూరంలో అందుబాటులోకైనా రాకుండా పోవటం విషాదకరం.
ధనమ్మ ఎలాగో నడుస్తా పెద్ద బజార్లో ఫంక్షన్ హాలు వెనక చతికిల బడింది. ప్లేట్లు చెత్త బుట్టలో పారేశారు.పారేసిన ఆకులు బైటికి రావడం రావడం బైటి జనాలు ఎగబడ్డారు. ఒకళ్లనొకళ్ళు అనుమానంగా చూసుకున్నారు. పోటీలు పడ్డారు. లాక్కున్నారు.ధనమ్మ తనకి చిక్కినవన్నీ ఒక ఆకులో సర్దుకుంది. కోవా మిఠాయి, మటన్ పొలాలు, చికెన్ కూర ముక్కలు, సగం సగం వడ ముక్కలు ఇంకా ఏవేవో. చేతి బోరులో రెండు ప్లాస్టిక్ గ్లాసుల నిండా నీళ్లు పట్టుకుంది.ధనమ్మ తిని పారేసిన ముక్కల కోసం, బొమికల కోసం కుక్కలు ఎగబడ్డాయి.చెయ్యి కడిగి నీళ్ళు తాగి గ్లాసూ ప్లేటూ అక్కడే పడేసింది. లేచి నాలుగడుగులు వేసింది.
ʹఅమ్మా మళ్లీ కూల బడింది. కరువులో అధికమాసం అంగుళం దిగబడింది గాజు పెంకు.
కుంటుతానే బోరు గట్టుకి చేరింది. కళ్ళు గట్టిగా మూసుకుని పెంకుని అదాటున లాగేసింది. నెత్తురు. కాలిలోంచి జివ్వున చిమ్మింది. బోరింగు కొట్టి, కాలు బోరింగు దార కింద పెట్టింది. పాదం భరించలేని నొప్పి.
ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నర్సును ఆయింట్ మెంట్ అడుగుతుంది.దూది , గాజు గుడ్డ, చిన్న ఆయింట్మెంట్ ట్యూబు ఇచ్చింది నర్సు.
ʹమట్టిలో తిరగొద్దు సెప్టిక్ అవుతదిʹ వేరే వాళ్ళకైతే చెప్పి ఉండేది కానీ, కాయితాలు ఏరుకునే పిల్లకి ఆ మాట చెప్పి ఏం లాభం? ʹఇంజక్షన్ చేయించుకో ʹ లోతుగా ఉన్న గాయం వంక చూసి చెప్పింది నర్సమ్మ.
ʹఅమ్మో వొద్దుʹ ఆస్పత్రి అరుగు మీదే కూచుని కట్టు కట్టుకుంది.
ʹఅక్కా ఇంకా రొంత దూది ఇస్తావాʹ అడిగింది.
నర్సు మళ్ళీ కొంచెం దూది, గాజు గుడ్డ ఇచ్చింది.ధనమ్మ నర్సు టేబులు మీద పెద్ద దూది బండిల్, గాజు గుడ్డ చుట్ట చూసింది.
అత్యంత దారుణమైన పరిస్థితుల్లో, అత్యంత పేదరాలలైన ఆ అమ్మాయి మనసులో ఆ దూదిని అప్పుడు అక్కడ చూసినప్పుడు కలిగిన భావన, వచ్చిన ఆలోచన, ఆ అమ్మాయి మనసులో కలిగిన కోరిక రచయిత్రి జీవద్భాషలో చెబుతుంది రచయిత్రి. కథనంగా ఏం చెప్పాలో అంతమాత్రమే తను చెబుతూ, పాత్ర అంతరంగాన్ని -పాత్ర తాలూకు ఆలోచనల్ని ఆ పాత్ర సహజ భాషలో చెప్పడం వల్ల పాఠకులకు ఆ పాత్రల పైన గౌరవం నమ్మకం పెరుగుతాయి.కథకు పాఠకులకు మధ్య దూరం చెదిరిపోయి కథను, కథలోని పాత్రలను పాఠకులకు దగ్గర చేసేది కథలో వాడే భాష.అది రచయితల భాష కావచ్చు పాత్రల భాష కావచ్చు. సరైన భాషను సక్రమంగా ఉపయోగించడం కథకు నిండుదనం చేకూరుస్తుంది. ధనమ్మ అంతరంగాన్ని ఆమె భాషలోనే చదవండి.
ʹదెబ్బ లోపలి నుంచి నెత్తురు రాకండా దూది ఆపింది. పొత్తి కడుపు లోపలి నుంచి బైటికి వచ్చే నెత్తురుకి కూడా అడ్డంగా వేసుకుంటే ఎంత బాగుందో. అప్పుడు మెత్తగా ఉంటది. తొడలు ఒరుసుకోవు. ఎంత దూరమైనా జాయిగా నడవచ్చు. ఆ పిల్లకళ్ళు దూది వంకే చూస్తున్నాయి.
అదీ ఆ ఆ అమ్మాయి ఆశ. ! మామూలుగా అయితే దూది అంత విలువైంది కాకపోవచ్చు. కానీ ఏ విలువ లేని ధనమ్మ లాంటి వాళ్ళకి ,వాళ్ళ జీవితాలకి దూది కూడా బంగారం లాంటిదే. అందుకే రచయిత్రి ఆ అమ్మాయి "దూది వంకే చూస్తూ ఉంది "అని సూచనప్రాయంగా అమ్మాయి మానసిక పరిస్థితిని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయికి దూది అవసరం. ఆ దూది అమ్మాయికి ఆ పరిస్థితుల్లో అత్యవసరం. అయినా ఈ భారతదేశంలో పేదరాలైన ఆడపిల్ల రుతు సమయంలో మరే ఇతర మార్గమూ లేక దూదిని అడుక్కోవాల్సి రావడం కంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఈ కథ కలిగించే వేదనకు సమాధానం ఎక్కడుంది?
ʹఅక్కా ఎక్కువ దూది, గుడ్డ కావాలిʹ ఈసారి మాత్రం నర్స్ కసురుకుని ధనమ్మని బైటికి తరుముకుంది. పాపం. ఆ పిల్లకి అడగడం చాత కాలేదు. ఏం కావాలో సరిగా అడిగితే బహుశా నర్సు సహాయం చేసి ఉండేది." అంటుంది రచయిత్రి.
ఆ అమ్మాయి బాధ గనుక అర్థం అయి ఉంటే ,ఆ అమ్మాయి అర్థం అయ్యే విధంగా చెప్పి ఉంటే ఒక స్త్రీగా నర్సు తన వంతు సహాయం చేసి ఉండేదని రచయిత్రి సున్నితంగా సయంమనంతో చెబుతుంది.సమాజంలో ఉద్యోగిని అయిన స్త్రీలోని సున్నిత మనస్తత్వాన్ని సునిశితంగా చెప్పటం రచయిత్రి వ్యక్తిత్వానికి చిహ్నం.
కొందరికి ఏడవడానికి కూడా సమయం ఉండదు. కదలలేని స్థితిలో సైతం కళ్ళ ముందర పని ఒకటే కనపడుతుంది. కళ్ళముందు,చేతుల నిండా ఎప్పుడూ పనే కనపడుతుంది. శ్రమే వాళ్ళ జీవితం,శ్రమే వాళ్ళ ఉనికి, శ్రమే వాళ్ళ ఆనవాలు.
కథ ముగింపు చూడండి. వాస్తవిక జీవితం యధాతథంగా కళ్ళముందు కదలాడుతుంది. అప్పుడు మాత్రం ఎక్కడో ఎవరో వీపు మీదో, చెంపమీదో హఠాత్తుగా కొట్టినట్లు అనిపిస్తే అందుకు కారణం కథలోని జీవిత వాసస్తవికతే!
కర్కశమైన నొప్పుల్నీ , ఇబ్బందుల్నీ ఎక్కువ సేపు తలుచుకునే ఉండటం కుదరని వర్గం కదా. కాసేపటికి పనిలో పడింది. కర్రతో చెత్తని కెలుకుతూ దొరికిన బోల్డ్లూ, పిన్సులూ, కాయితాలూ గోనెకి నింపుతోంది. చిన్న సందుల్లోంచి పెద్ద వీధిలోకి తిరిగింది. పెద్ద పెద్ద బిల్డింగులు, చెట్లూ, రంగులూ ఉన్న వీధిలోకి. ఇళ్ళ ముందు చెత్త తొట్టెలు. అవి కూడా మంచి మంచి బొమ్మలతో చాలా అందంగా ఉన్నాయి. ఓ తొట్టెలో హాండిల్స్ కట్టేసి పెద్ద ప్లాస్టిక్ సంచి .ముడి విప్పి బోర్లించింది. లోపల లూజుగా కట్టిన కాగితం పొట్లాలు. కొన్ని పొట్లాలు ఊడి పోయాయి. వాటి లోపల ముట్టు గుడ్డలు. బజార్లో అమ్మేవి. కొన్ని నిండా ఎర్రగా, పూర్తిగా తడిసి ఉన్నాయి. కొన్నిటి మీద కొద్దిగానే మరక. ఒకటి మాత్రం చుక్క రక్తం కూడా అంటకుండా తెల్లగా ఉంది.ధనమ్మ కర్రతో మిగిలిన వాటిని పక్కకి నెట్టేసి తెల్లటి నేప్కిన్ చేతిలోకి తీసుకుంది.
నెమ్మదిగా నొక్కింది. ʹభలే మెత్తగా ఉందిʹ ధనమ్మకి ఆ మెత్తదనం చాలా నచ్చింది. ఖరీదైన లగ్జరీ వస్తువు. ఎలాగైతేనేం, ధనమ్మకీ అందుబాటులోకి వచ్చింది!
కథ సుఖాంతం.
మాతృక అక్టోబర్ 2017 ఈ సంచికలో ఈ కథ మొదట అచ్చయింది.కథ ముగుస్తుంది కానీ, పాఠకులలో ఆలోచన మొదలవుతుంది. స్వచ్ఛ భారత్ లోని స్వచ్ఛత ఏమిటి అనే ప్రశ్న కళ్లముందు నిలుస్తుంది.
సినీ తారలు క్రీడాకారులు ఎందరో న్యాప్ కిన్స్ కు ప్రచారం చేస్తున్నారు.కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.గ్రామీణ పట్టణ సమాజాల్లో నిరుపేదలైన బాలికలు మహిళలు అనేకమంది సరైన న్యాప్ కిన్స్ వాడకపోవడం వల్ల,రుతు సమయాల్లో , పాత ముట్టుగుడ్డల వాడకం వల్ల, ఆ గుడ్డలను కనీసం ఎండలో ఆరవేయకపోవడం వల్ల సమస్యలతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు.ఈ అనేక రకాల శారీరక సమస్యలు అనారోగ్యానికి దారి తీసి ఈ అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలకు దారితీసి మొత్తం మీద ఎందరో బాలికలు, మహిళలు విలువైన తమ జీవితాల్ని పేదరికం కారణంగా కోల్పోతున్న బాధాకరమైన విషయం దారుణమైన వాస్తవం మీడియాకు తెలుసు, రాజ్యానికి తెలుసు.సమాజంలోని ఉన్నత, మధ్య తరగతి ప్రజలందరికీ బాగా తెలుసు.వీళ్ళ వద్ద ఉన్నవి వాళ్ళ వద్ద లేవని తెలుసు . వీళ్ళ వద్ద ఎక్కువగా ఉన్నవి కనీసం చేతనైనంతలో పేదవాళ్లకు ఇవ్వగలరని, ఇవ్వొచ్చు అని ,ఇవ్వాలనీ తెలుసు.ప్రభుత్వాలు సమాజం పేద వాళ్ళ వైపు చూడాల్సిన దృష్టి వేరే ఉంది, చేయాల్సింది చాలా ఉంది.
తిండి ఎక్కువైన జనం తినకుండా, కుప్పతొట్లలో పడేసిన విస్తర్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాల్లో భారతీయ బాల్యం తన బంగారు భవిష్యత్తును వెతుక్కుంటోంది. నిరుపేద బాలికలు తమ కనీస అవసరాల కోసం, నామమాత్రపు సౌకర్యాల కోసం, ఇంకా చెత్తకుప్పల్లోనే వెతుక్కుంటూ ఉన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న అలాంటి బాలికలందరి ఆత్మగౌరవాన్ని కాపాడటమే సమాజపు కనీస గౌరవం, కర్తవ్యం అని మహా సున్నితంగా, అంతకన్నా పదునుగా చెపుతోంది ఎం .ఎస్. కె .కృష్ణ జ్యోతి ఈ కథలో.
మానవ హక్కులకు, బాలల హక్కులకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ కథ చర్చిస్తుంది.జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ పరిష్కారానికి నోచుకోని చాలా ముఖ్యమైన సామాజిక సమస్యలకు సంబంధించిన కథ ఇది. అభివృద్ధి సాధించాం అభివృద్ధి సాధించేస్తున్నాం, కొత్త ఆవిష్కరణలు కనుగొన్నాం అని, అంతరిక్ష ప్రయాణాల గురించి ,అణు ప్రయోగాల గురించి మాట్లాడుకునే దేశంలో బాలకార్మికులుగా, వెట్టిచాకిరీ వాళ్ళుగా మిగిలిపోతున్న క్రింది వర్గాల పిల్లల గురించి , కనీస అవసరాలకు నోచుకోలేని వారి దుస్థితి గురించి చర్చించాల్సిన అత్యంత ప్రాధాన్యత కలిగిన కథాంశమిది.
చిన్న కథలో చాలా చెప్పొచ్చు అనటానికి ఈ కథ మంచి ఉదాహరణ. ఈ దేశంలోని బాలలందరికీ కనీస అవసరాలు సమకూరి, విద్య వైద్యం వసతి ఆహారం ఆరోగ్యం లభించే మంచి రోజుల కోసం అందరం గట్టిగా ప్రయత్నం చేయాల్సిందే. చదువుతున్నంతసేపు వేదన కలిగించి, చదివిన తర్వాత మనసున్న పాఠకులందర్నీ కదిలించే వర్తమాన భారతీయ కథ ఇది.!
Type in English and Press Space to Convert in Telugu |
పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానోకవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని ....... |
ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి కవిత్వంకాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి... |
సాహిత్య విమర్శకు కొత్త బలంఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే... |
ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులునమ్ముకున్న కలల్ని గాలికొదలి
ఇల్లు వదిలి, ఊరు వదిలి
పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి... |
మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹమనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ...... |
స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ... |
మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ
అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు...... |
వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..." కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న ..... |
ఒక మంచి రాజనీతి కథవ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు...... |
మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹసాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |