కాశ్మీర్ ప్రజల ఊపిరి సవ్వడిలో కూడా ప్రభుత్వాలకు ʹఉగ్రవాదంʹ వినిపిస్తుంది. అక్కడి అలజడుల్లో, ఆర్తనాదాల్లో వాళ్లకు సీమాంతర కుట్రలే ధ్వనిస్తుంటాయి. ఇప్పుడే కాదు, దశాబ్దాలుగా వేలాది కాశ్మీరీల మరణాలకు, మిస్సింగుహోకు పాక్ ప్రేరిత తీవ్రవాదమే కారణమని ప్రభుత్వాలు నమ్మించాలని చూస్తూ వచ్చాయి. అయితేనేం.. ఎప్పటి వలెనే జమ్ము కాశ్మీర్ జనాభా కంటే ఎక్కువ ఉన్న సైనిక బలగాల పదఘట్టనల్లోంచి, తుపాకీ మోతల్లోంచి, దేశభక్తి గీతాలాపనల్లోంచి మరోసారి అజాదీ కాశ్మీర్ నినాదం పెల్లుబికింది. కానీ భారత సమాజానికి అది వినిపించడం లేదు. హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు 21 సంవత్సరాల బుర్హాన్ వని.. అజాదీ స్వరాన్ని తిరిగి తన జాతికి ఇచ్చి వెళ్లిపోయాడు. కాశ్మీరీ పోరాట సంస్థలపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉండవచ్చు. వాటి చర్యలన్నిటితో ఏకీభావం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అసలైన కాశ్మీరీ పోరాట సంస్థలను దెబ్బతీయడానికి అటు పాకిస్తాన్, ఇటు భారత్ పాలకవర్గాలు నకిలీ సంస్థలను ఉసిగొల్పి ఉండవచ్చు. ఇలాంటివి ఎన్ని జరిగినా స్వతంత్య్ర కాశ్మీర్ ఆకాంక్ష చల్లారడం లేదని మరోసారి రుజువైంది.
బుర్హాన్ దారుణ హత్య.., మూడు లక్షల కాశ్మీరీ ప్రజల సమక్షంలో జరిగిన ఆయన అంత్యక్రియలు, ఆ సందర్భంగా మొదలై నేటికీ కొనసాగుతున్న సైనిక చర్యలు, 350 మంది గాయపడటంతో సహా 25 మంది మృతి.. ఇవన్నీ పతాక శీర్షికలవుతున్నాయి గాని కాశ్మీరీ మంచు పొరలను తొలుచుకుంటూ వినిపిస్తున్న స్వతంత్ర కాశ్మీర్ ఆకాంక్ష బైటికి రావడం లేదు.
ఈ నాలుగు రోజులుగా భారత ప్రభుత్వం కాశ్మీరీ ప్రజలపై దారుణంగా సైనిక చర్యలకు పాల్పడుతోంది. ఫోన్లు, ఇంటర్నెట్ కట్ చేసింది. బయటి ప్రపంచం నుంచి సంబంధాలు తెంచేసింది. సరిగ్గా ఒక దేశంపై మరో దేశం చేసే దాడులను తలపించే దుర్మార్గం ఇందులో ఉంది. ఒక్క బాంబింగ్ మినహాయిస్తే. నిన్న హాస్పెటళ్లపై కూడా భారత సైన్యం దాడి చేసింది. ఇందులో కనీస కాశ్మీరీల ప్రజాస్వామిక హక్కులనే కాదు, మానవత్వాన్ని కూడా భారత ప్రభుత్వం కాలరాచింది.
ఇలాంటి ఘటనలు కాశ్మీరీలకు కొత్త కాదు. అయితే ఇందులో ఒక అర్థం ఉంది. అన్ని రకాలుగా దిగ్బంధించి దాడులు చేసి.. కాశ్మీర్ భారత్‌లో భాగం కాదని ఢిల్లీ పాలకులు ఆ రకంగా చెప్పకనే చెప్తున్నారు. ఇంకో పక్క బుర్హాన్‌ను హీరోగా మీడియా చిత్రీకరిస్తున్నదని విదేశాల్లోంచే ప్రధాని మోదీ అసహనానికి గురవుతున్నాడు. విశ్వహిందూ పరిషత్ దేశభక్తిని విశ్వమంతా వ్యాపింపజేసే లక్ష్యంతో నిత్యం ఎక్కే విమానం దిగే విమానంతో కాలక్షేపం చేస్తున్న మోదీ ఈ కాశ్మీరీ నవయువకుడి దేశభక్తిని భరించలేకున్నాడు. కాశ్మీర్లో ఎప్పుడు ఏ స్థానిక దళారీ అధికారంలోకి వచ్చినా ఆ జాతి గుండెలపై తుపాకీ మోగవలసిందే. మహెబూబా ముఫ్తీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ఇటీవలి పరిణామాలు మరోసారి కాశ్మీరీ యువతలో జ్వలిస్తున్న స్వేచ్ఛాకాంక్షను ప్రతిబింబిస్తున్నాయి.
బుర్హాన్ అంత్యక్రియల్లో పాకిస్తాన్ జెండా ఊపుతున్న ఫొటోలే మీడియాకు దొరుకుతాయి తప్ప ఇంకే వాస్తవం అగుపించదు. కాశ్మీర్ అనగానే పాకిస్తాన్, ముస్లింల ఉగ్రవాదం మాత్రమే గుర్తుకు వచ్చేలా చేయడంలో మీడియా ఇతోధిక పాత్ర పోషిస్తోంది. అక్కడి నుంచి ఎప్పుడూ వాస్తవాలు వెలుగులోకి రాకుండా చేయడంలో భారత్ విజయం సాధిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ పక్షాన నిలబడటానికి ప్రజాస్వామికవాదులనబడే వారిని కూడా ఏదో సంకోచం వెంటాడుతోంది. ఈ నాలుగు రోజులుగా సైనికుల తుపాకీ మోతలు, ప్రభుత్వ శాంతి భద్రతల సమాచారాలు తప్ప కాశ్మీరీల గుండెలపై చెవి పెట్టి విని మాట్లాడిన కంఠస్వరం వినబడటం లేదు.
కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో దశాబ్దాల్లో ఉన్న స్వేచ్ఛాకాంక్షకు తాజాగా బుర్హాన్ రెక్కలు తొడిగాడు. మోదీ అసహనానికి కారణం అదే. అయినా బుర్హాన్ కాశ్మీరీ దేశభక్తిని, దేశ స్వాతంత్య్రాన్ని గుర్తించడానికి ఎంత మంది తమ భారత ʹదేశభక్తిʹని ఫణం పెట్టడానికి సిద్ధపడతారు? చాలా కష్టం... ʹమనʹ దేశంలో బస్తర్ ఆదివాసుల పక్షాన, కాశ్మీరీల పక్షాన నిలబడటం అంత సులభం కాదు. వాళ్లవి నిజంగానే అంత బరువైన న్యాయకాంక్షలు. బుర్హాన్ అంటే ముస్లిం కదా.. అలాంటి వాళ్ల గురించి మాట్లాడటానికి తెంపరితనం ఉండాలి.
ʹనేను పడిపోయినా వేరేవాళ్లు నా తుపాకీ పట్టుకోడానికి ముందుకు వచ్చి సాగిపోతున్నంత సేపు నేను నిశ్చింతగా ఉంటాను అని చేగువేరా అన్న మాటలు బుర్హాన్ వనీకి వర్తిస్తాయʹని జెఎన్యూ విద్యార్థి ఒమర్ ఖలీద్ అన్నాడు. విప్లవాన్నీ, స్వాతంత్య్రాన్ని, విముక్తిని ఇలా అర్థం చేసుకునే వాళ్లు తప్ప బుర్హాన్ పక్షాన ఎవరు మాట్లాడగలరు? అఫ్జల్‌గురు ఉరిశిక్షను, మొత్తంగానే ఉరిశిక్షలను ఖండించినందుకు రాజద్రోహం నేరం కింద జెయిలు వెళ్లి బెయిలు మీద ఉన్న ఆయన ఫేస్బుక్లో ఈ అభిప్రాయం ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే దాన్ని ఫేస్ బుక్ వాళ్లు తొలగించారు. ఉగ్రవాదులకన్నా ఇలాంటి దేశద్రోహులు ప్రమాదకరమని, ఒమర్ ఖలీద్ బెయిల్ రర్దు చేయాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. కాశ్మీర్ విషయంలో సగటు భారత సమాజపు స్పందనకు ఇది ఒక ఉదాహరణ కావచ్చు. ఇందువల్ల కూడా కాశ్మీరీల పక్షాన మాట్లాడటానికి చాలా మందికి జంకు.
దశాబ్దాలుగా కాశ్మీరీ స్వేచ్ఛాకాంక్షను భారత్ దారుణంగా చిదిమివేస్తూ వచ్చినందు వల్ల కూడా ఆ ఉద్యమంలో అనేక మార్పులు, మలుపులు చోటు చేసుకున్నాయి. భారత్, పాకిస్తాన్ పాలకవర్గాలు అనేక కుట్ర పద్ధతుల్లో అజాదీ కాశ్మీర్ ఉద్యమాన్ని దెబ్బతీస్తూ వచ్చాయి. అలాగే అమెరికా పాత్ర విస్మరించి కాశ్మీర్ సంఘర్షణను అర్థం చేసుకోవడం అయ్యే పని కాదు. ఈ మొత్తం నేపథ్యంలో పాకిస్తాన్ అనుకూల కాశ్మీరీ వాదం కూడా ముందుకు వచ్చింది. ఈ పక్క నుంచి భారత ప్రభుత్వం మాత్రమే అక్కడ ఏం జరుగుతోందో చెప్పగలిగే పరిస్థితి వచ్చాక ఈ దేశ ప్రజలు నిత్యం కాశ్మీర్ భారత్ అంతర్భాగం అనే మాటలు మాత్రమే వినాల్సి వస్తోంది. ఇది తప్ప కేంద్ర ప్రభుత్వం భారత ప్రజలకు కాశ్మీరు గురించి ఇంకో మాట చెప్పడం లేదు. కాశ్మీర్ ఉద్యమం ఎన్ని మలుపులు తిరిగినా, ఎంత హింస ప్రయోగించినా అక్కడి ప్రజలు తాము భారత్‌లో భాగమని అంగీకరించడం లేదు. కాబట్టి ఇక భారత ప్రభుత్వానికి మిగిలింది ఏమంటే ఈ దేశ ప్రజలకు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పడమే. ఆ మాట చెప్పడం కోసం, దాన్ని నిజం చేసుకోవడం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను పట్టించుకోకుండా కాశ్మీరీ స్వతంత్య్ర ఉద్యమంలోని లోటుపాట్లు ఎవ్వరూ చర్చించజాలరు. హిజ్బుల్ ముజాహిదీన్ తరహా సంస్థల చర్యల్లో అభ్యంతరకరమైనవి ఉన్నా.. మౌలికంగా భారత పాలకులతో దగా పడుతున్న స్వతంత్య్ర కాశ్మీర్ ఆకాంక్షను పట్టించుకోవడమే ప్రజాస్వామికమవుతుంది. ఎందుకంటే.. విశ్వాసాలను, వాదాలను పక్కన పెడితే.. ఎన్నడూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదు కాబట్టి.
నెహ్రూ నుంచి మోదీ దాకా ఎంతో విచిత్రమైన వైవిధ్యంగల నాయకులెందరు ఢిల్లీని ఏలినా కాశ్మీర్ విషయంలో మొదటి నుంచీ హింసా వైఖరే అనుసరిస్తూ వచ్చారు. భాషలో ఏమైనా తేడా ఉండవచ్చు. అంతే. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ ప్రజలు భారత ప్రభుత్వ వైఖరి కంటే భిన్నమైన, ప్రజాస్వామికమైన వైఖరిని ఈ దేశం నుంచి కోరుకుంటున్నారు. గత నాలుగు రోజుల నుంచి కాశ్మీర్‌కు నానా రకాల సైనిక బలగాలు తరలిపోతున్నాయి కదా.. కనీసం దండకారణ్యంపై యుద్ధం చేయడానికి సైన్యం వెళుతున్నప్పుడు వినిపించే పాటి అభ్యంతరం కూడా ఈ విషయంలో లేదు. కాశ్మీర్ విషయంలో కేంద్రం ఎల్లప్పుడూ రెండు పనులే చూస్తూ వచ్చింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన కీలుబొమ్మను కాశ్మీర్లో నిలబెట్టేందుకు ప్రయత్నించడం, సైన్యాన్ని తరలించడం.
సరిగ్గా ఒక శతృదేశం విషయంలో పాటించే రాజనీతి ఇది. భారతదేశాన్ని కాశ్మీరీలు పరాయి దేశంగా భావించేందుకు ఈ వైఖరి చాలు. ఎన్ని వేల మందిని చంపినా, మాయం చేసినా, లక్షల సైన్యాన్ని మోహరించినా... ప్రతి తరం కాశ్మీరీలు ఈ పరాయి పాలన నుంచి బైటికి పోవాలనే ఆకాంక్షను వినిపిస్తున్నారు. ఇవిగాక చర్చలు, సంప్రదింపులనే నయగారపు మాటలు ఉండనే ఉన్నాయి. ఇవీ మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటాయి. కాశ్మీరీలను వంచిస్తూనే వచ్చాయి. ఆ తర్వాత అణచివేత తీవ్రమవుతునూ ఉన్నది. మౌలికమైన స్వేచ్ఛ సంప్రదింపులతో వచ్చేదీకాదని, అణచివేతతో స్వాతంత్య్ర కాంక్ష ఆగేదీ కాదని బుర్హాన్ చితిమంట చెబుతోంది.
Type in English and Press Space to Convert in Telugu |
వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల...... |
రైతు - నీళ్లురైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం...... |
ఈ తీసివేతలు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా......... |
జీవిత కవిత్వం విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్ పద్ధతులకు వ... |
వివేక్ స్మృతిలో...వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు....... |
భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమేఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి...... |
కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్ దేశస్థుల స్వేచ్ఛ గు... |
మానవ హననంగా మారిన రాజ్యహింస ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం....... |
నాగపూర్ వర్సెస్ దండకారణ్యందండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ... |
ఏది సత్యం ? ఏది అసత్యం ?విరసం ఆచరణలో లోటుపాట్లు ఉన్నాయని శరత్ చంద్ర అనుకుంటే, తాను విప్లవాభిమాని అయితే వాటిని సంస్థకు తెలియజేయవచ్చు. విరసం నిరంతరం అలాంటి సూచనలను గౌరవంగా స్వీకరి...... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |