జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తూ నాగపూర్ జైలులో అండా సెల్ లో ఉన్న ప్రజా మేధావి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కామ్రేడ్ జి ఎన్ సాయిబాబా తల్లి గోకరకొండ సూర్యవతి తన 75 వ ఏట కేన్సర్ వ్యాధితో 1 ఆగస్టు 2020 మధ్యాన్నం హైదరాబాద్ లోని స్పర్శ్ కేర్ సెంటర్ లో చనిపోయారు. అంతకు రెండు రోజులు ముందు వరకు అంటే 30 జూలై, 2020 వరకు హైదరాబాద్ లోని నింస్ (నిజాంస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో కేన్సర్ వ్యాధికి చికిత్స పొందారు.
జి ఎన్ సాయిబాబ తల్లిదండ్రులు గోకరకొండ సత్యనారయణ మూర్తి, గొకరకొండ సూర్యవతి దంపతులది ఒక వ్యవసాయ కుటుంబం. తూర్పుగోదావరి జిల్లలోని అమలాపురం దగ్గరలో జనిపల్లి, సన్నవిల్లి గ్రామాలకు చెందినవారు. సత్యనారాయణ గారికి ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. సూర్యవతమ్మకు ఒక అన్న, అక్క, ఒక తమ్ముడు, చెల్లె కాగా ఇపుడు అన్న ఒకరు జీవించి ఉన్నారు..
సత్యనారయణ గారు 3 వ తరగతి వరకు చదువుకుంటే, సూర్యవతమ్మ 1 వ తరగతి కూడా సరిగా చదువుకోలేదు. సత్యనారయణగారు కొద్దిపాటి భూమి కలిగిన రైతు. కొన్ని పరిస్థితుల్లో నష్టాల పాలయ్యి భూములు కోల్పోయి, రైతు కూలిగా మారారు. వారికి ఇద్దరు కొడుకులు ( జి ఎన్ సాయిబాబా, జి రామదేవుడు), ఇద్దరి మధ్యలో రెండవ సంతానంగా ఒక అమ్మాయి (భవానీ). పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారి చదువుకోసం అమలాపురానికి వచ్చారు..
అమలాపురంలో ఒక అద్దె ఇంటిలో, సాయిబాబా వెళ్లి రావడానికి అనుకూలంగా స్కుల్ కు దగ్గరగా ఉండేవారు. సాయిబాబా కు ఉన్న వైకల్యం గురించి ఎప్పుడూ అమ్మకు ఆలోచన, ఆ భావనలేదు. చాలా జాగ్రత్తగా చూసుకునే వారు. టీచర్లను ఇంటికి పిలిపించుకుని చదువు చెప్పించేది. భూమి పోగా వచ్చిన కొద్ది డబ్బులతో అమలాపురంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు.. ఇతరత్రా ఎటువంటి ఆస్తులూ లేవు. ఇంట్లో వేసుకున్న 4,5 కొబ్బరి చెట్ల ఫలసాయాన్ని జాగ్రత్తగా అమ్మి కుటుంబ అవసరాలకు సూర్యవతమ్మ ఇమ్ము చేసేవారు. ఇంట్లొనే కొద్దిగా కూరగాయ మొక్కలు పెంచుకుని సర్దుబాటు చేసుకునే వారు. తెలిసినవారు ఆవు ఒకటి ఇస్తే, ఆ పాలతో ఇంటి అవసరాలు కొంత తీరాయి.
చిన్నప్పటి నుంచి సాయిబాబా బాగా తెలివయిన విద్యార్థి. అమ్మ తనకు తగినట్లు అవసరమయిన ఏర్పాట్లు చేసేది. సాయిబాబా బి ఎ ఇంగ్లిష్ డిగ్రీ పూర్తిచేశాక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం ఎ ఇంగ్లిష్ సీటు వచ్చింది. ఆ తరవాత సాయిబాబా హైదరాబాదులోని సీఫెల్ ( సి ఐ ఇ ఎఫ్ ఎల్) లో డిప్లొమా, ఎంఫిల్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి , డాక్టరేట్ పట్టాను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా అందుకున్నారు. సాయిబాబా చదువంతా స్కాలర్ షిప్ లపై కొనసాగింది. ఆ క్రమంలోనే తాను విప్లవ విద్యార్థి రాజకీయాలతో, విప్లవ సాహిత్యంతో, ప్రజా సంఘాలతో ప్రభావితమయ్యాడు. మరోపక్క ఊరిలో ఉండే పరిస్థితిలేక కుటుంబమంతా 1990 లో హైదరాబాద్ వచ్చేసారు. తన రాజకీయాల ప్రభావం మొత్తం కుటుంబంపై పడింది. సాయిబాబా తమ్ముడు రాందేవ్ కూడా బి ఎస్ సి, ఎం ఎస్ సి భౌతికశాస్త్రంలో డాక్టరేట్ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు.
సూర్యావతి గారు సాయిబాబాను చదువు విషయంలోనే కాదు, తను సామాజిక బాధ్యతగా చేస్తున్న పనులకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, నిరుత్సాహ పరచలేదు. ఆ క్రమంలోనే ప్రజా సంఘాలవారు అందరూ సూర్యవతి గారికి దగ్గరయ్యారు. పిల్లలూ, కోడళ్ళూ ప్రజా సంఘాలలో భాగమయితే తానూ సహకరిస్తూ పరోక్షంగా భాగమయ్యింది.
ఒక్కగానొక్క కూతురు భవాని ఏడవ తరగతితో చదువు ఆపేసింది. తాను చదువుకుంటునప్పుడే కుట్టుపని చేసేది. అన్నను బాగా చదివించమని, తనకు చదువు పట్ల ఆసక్తి లేదని చెప్పింది. తాను చాలా చురుకయిన, నిశితమయిన పరిశీలనా దృష్టి కలిగి ఉండేది. ప్రజా సంఘాల పరిచయంతో మొదలు మహిళా సంఘంలో పనిచేసింది. ఆ క్రమంలో తాను అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో భాగంగా అజ్ఞాత విప్లవోద్యమ జీవితంలోకి వెళ్ళిపోయింది. 2000లో బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలయింది. అమ్మాయి గురించి ఒక సందర్భంలో చెబుతూ - "ఇది నా డబ్బు నేను దాచుకోవాలనే భావన భవానీకి ఎప్పుడూ లేదు. పనిమనిషికి వేరే కంచంలో పెడితే తాను ఊరుకునేది కాదు. మమ్మీ నువ్వు వేరు భావంగా చూస్తున్నావు.. అవన్నీ విడిచిపెట్టుకోవాలె.. అలా అయితేనే నీ దగ్గర ఉంటాను అనేది. ఆమె చనిపోయాకే ఆమె ఏమేమి చేసిందో తెలిసింద" ని సూర్యవతి గుర్తు చేసుకున్నారు. విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది. అమరుల కుటుంబాలపై కొనసాగిన తీవ్రమైన హింస సూర్యవతమ్మ పిల్లల రాజకీయాలు అర్థం చేసుకునేలా చేసింది. పిల్లల స్పూర్తితో ఆ తర్వాత ఏర్పడ్డ అమరుల బంధు మిత్రుల సంఘం వ్యవస్థాపక సభ్యురాలయింది.
స్కూల్ చదువు లేకున్నా సూర్యవతి కూడబలుక్కుని చాలా చక్కగా పేపరు చదివేవారు. తాను చదవడమే కాకుండా పిల్లలకు ఇష్టమయ్యే శీర్షికలతో మొదలు పెట్టి అంటే, సినిమా, ఆటలు, కథలతో మొదలు పెట్టి మొత్తం పేపర్ చదివేసే వారు. అలాగే కథల పుస్తకాలు చదివి వినిపించేవారు. పిల్లలకు చదవడం నేర్పించేది. ఆమె చదివితే పిల్లలకు భలే ఇష్టం. ఆమె చదరంగం బాగా ఆడడమే కాదు.. పిల్లలకు ఆమె నేర్పారు. ఆమె పిల్లల చెస్ కోచ్.. అందువల్ల స్కూల్ స్థాయి పోటీలలో తన మనవలు సునాయాసంగా గెలుచుకువచ్చేవారు. చెస్ మాత్రమే కాదు, కాలక్షేపానికి ఆడే పేకాటలోను ఆమెను ఓడించడం కష్టమే.
పిల్లలు ఏవి ఇష్టాంగా తింటారు, ఎలా వండితే తింటారు, వీలయినంత మంచి పోషక ఆహరం ఎలా అందించాలనే వాటిపై చాలా మంచి అవగాహనే కాకుండా, చాలా బాగా వండి పెట్టేవారు. పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా అనునయంగా చెప్పి పిల్లలు వినేలా చూసుకునేవారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె నుంచీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వంటలు, పిల్లల పెంపకం ఆమె నుంచి నేర్చుకోవలసిందే. చికెన్ వండినా, చేపలు వండినా ఆ రుచివేరు. బంధువులు కూడా చేయించుకుని పోయేవారు. ప్రజా సంఘాల మిత్రులందరూ సూర్యవతిగారి చేతి వంటలను ఇష్టంగా తినేవారు. ఎక్కడిదాకా అంటే సాయి అమెరికా మిత్రులు కూడా అమ్మ చేసిన పచ్చళ్ళు, ఆవకాయలు ఇష్టంగా తిన్నవారే. ఇలా చెప్పుకుంటూ పొతే , సూర్యవతి గారి సాంబారును ప్రముఖ రచయిత గూగీ కూడా ఆస్వాదించారు. కొడుకుల కొడుకులే కాకుండా, తాతలు, మొత్తంగా బంధువులంతా సూర్యావతి గారిని ప్రేమగా "సూరక్క" అని పిలుచుకుంటారు. ఊరిలో అందరికీ సూరక్కగానే బాగా తెలుసు. పనిలేకుండా ఆమె ఎప్పుడూ ఉండదు, మనలను ఉండనివ్వదు. ప్రతి పనిని గొప్ప నిమగ్నతతో చేసేవారు. ఆమె పనికి విసుగు, విరామం లేవు. చివర రోజులు వరకు ఆరోగ్యం సహకరించినంత వరకు రోజూ పేపర్ చూసేది. వరవరరావు గారి ఆరోగ్యంతో సహా, ప్రజా సంఘాల విషయాలను గమనించి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేవారు. ప్రజల విషయాల పట్ల పట్టింపుతో ఉండేవారు.
సూర్యవతి జీవిత కాలం చాలా మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ఆమె ఆహారపు అలవాట్లు కూడా చాలా సాదా సీదాగా ఒక క్రమ పధ్ధతితో ఉండేవి. పులుపు తినేవారు కారు. ఎప్పుడూ వేడి నీళ్లు తాగే వారు. సహజంగా, ఇంట్లో వండినవి మాత్రమే తినేవారు. ఫ్రిజ్ లో పెట్టిన పదార్థాలు తినేవారుకాదు. గత రెండేళ్లుగా ఆర్త్రైటిస్ తో బాధ పడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అయితే ఇటీవల బాగా నీరసపడుతుంటే 2020 ఫిబ్రవరి 15 నుంచి 28 మధ్యలో నిమ్స్ లో జాయిన్ చేసి వైద్యం చేయించారు. ఆ క్రమంలో లింఫ్ వ్యవస్థకు సంబందించిన కేన్సర్ గా (హై గ్రేడ్ నాన్ హాడ్జ్కిన్ లింఫోమా గా) నిర్ధారణ అయ్యింది. ఆంకాలజీ విభాగం వారు ఆరు సార్లు కెమో థెరపీ ఇవ్వాలని చెప్పారు. మూడు సార్లు థెరపీ బానే సాగింది. నాల్గవ సైకిల్ కి ముందు బ్లడ్ కౌంట్స్ సరిగా లేక థెరపీ ఆలస్యమయింది. కరోనా పరిస్థితులు పరోక్షంగా ఆలస్యానికి ఇంకొంత కారణమయ్యాయి. ఆ క్రమంలో సమస్య మెదడుకు పాకింది. ఎడమ వైపు కాలు, చేయి పడిపోయాయి. నాల్గవ సైకిల్ 2020 జూలై 23 న మొదలుపెట్టారు. జూలై 29న ఫీట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయారు. చివరి క్షణాలు హైదరాబాదులోని స్పర్శ్ కేర్ సెంటర్ లో గడిచాయి. 2020 ఆగస్టు 1 వ తారీఖు మధ్యాన్నం 1.40 నిముషాలకు తుది శ్వాస విడిచారు. సాయిబాబా విడుదలకోసం జరిగిన పోరాటాలలో ఆమె పాల్గొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే.. "నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు.. పేదలకోసం మాట్లాడితే అరెస్టు చేస్తారా.. ఆదివాసుల గురించి మాట్లాడితే అరెస్టు చేస్తారా" అని ఆమె రాజ్యాన్ని నిలదిసారు. సాయిబాబా అరెస్ట్ తర్వాత ఏండ్ల తరబడి కొడుకు విడుదల కోసం ఆమె ఎంతో ఎదురు చూసింది. ప్రయత్నాలు చేసింది. అయినా కొడుకును దగ్గరిగా చూడలేకపోయింది. రాజ్య స్వభావం తెలిసిన మనిషే అయినా న్యాయ వ్యవస్థ అయినా కాస్త భిన్నంగా వ్యవహరిస్తుందేమోనని కొద్దిపాటి ఆశ. చివరికి క్యాన్సర్ బారిన పడింది. గత కొంత కాలంగా కొడుకును చూడాలని న్యాయస్థానం చుట్టూ తిరిగింది. చివరికి ఆ తల్లికి అన్యాయమే జరిగింది. జైలులో ఆ కొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉన్నా.. తల్లికి క్యాన్సర్ అని తెలిసి తల్లడిల్లిపోయాడు. కొడుకును తృప్తిగా చూడకుండానే ఆమె మనల్ని విడిచిపోయింది. కామ్రేడ్ సాయిబాబా తండ్రి సత్యనారాయణ మూర్తి తన 73 వ ఏట 2006 లో చనిపోయారు. ఇప్పుడు అమ్మ ఇలా సాయిబాబా కోసం వేదనతో చనిపోయారు.
కుటుంబ సభ్యులు, అమరుల బంధు మిత్రులు, ప్రజా సంఘాల మిత్రుల సమక్షంలో సూర్యవతమ్మ అంత్యక్రియలు 2020 ఆగస్టు 1 సాయంకాలం 5.00 గంటలకు బంజారాహిల్స్, రోడ్డు నెం. 12, స్పర్శ్ కేర్ సెంటర్ దగ్గర ఉన్న శ్మశానవాటికలో జరిగాయి
ప్రజా ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు చరిత్ర పొడవునా పిల్లలు చేసిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన అనేక మంది తల్లులు లాగానే, కొడుకు నుంచి ప్రేరణ పొంది ఆచరణకు పూనుకున్న గోర్కీ అమ్మలాగానే సూర్యవతమ్మ అందరికి అమ్మయింది. అందరికీ గొప్ప ప్రేమను పంచింది. ఎక్కువ జీవితం దిగువ మధ్య తరగతిగా కష్టాలు జీవిత కాలం అనుభవించింది. పిల్లలను తాను నడిపింది. తరవాత ఆ పిల్లలతో పాటు తానూ నడిచింది. కామ్రేడ్ సూర్యవతమ్మకు / కామ్రేడ్ సూరక్కకు విప్లవ రచయితల సంఘం తరపున వినమ్రంగా జోహార్లు చెబుతూ, నివాళులర్పిస్తున్నాను. కామ్రేడ్ సాయిబాబా, కామ్రేడ్ వరవరరావు సహా రాజాకీయ ఖైదీల విడుదలకోసం పోరాడుదాం. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడమే కాదు, పోరాటం మా జన్మ హక్కని చాటి చెబుదాం. అదే సూర్యవతమ్మకు, అమరులందరికీ మనమివ్వగలిగే నిజమయిన నివాళి.
Type in English and Press Space to Convert in Telugu |
గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !తన జీవితం, ప్రేమ అన్నీ సమాజం లోని ప్రజలకోసమేనని, ఆ ప్రేమ కేవలం నీకు, కుటుంబానికి పరిమితమయ్యేది కాదని" చెప్పాడు..అది తన అంకిత భావం ఆ మాటను తను చనిపోయే...... |
నా ప్రియమైన... విప్లవమా !విప్లవమా నీవు చూడని
లోతులూ అగాథాలూ
ఎక్కని కొండలూ శిఖరాలూ
నడవని ముళ్ళ బాటలు
దాటని నదులూ సముద్రాలూ ఉన్నాయా ... |
ఆట - నీతిదోపిడి మర్మాన్ని విప్పి చెప్పే
ఆటలు ఇప్పుడిక కనుగొందాం
కొత్త తరాలకు ఉగ్గుపాలతో నేర్పిద్దాం
శ్రమ చేస్తున్న మనుషులు
ఇంకా ఊరవతలే ఉన్నారని
ఆడదంటే ఆట బొమ... |
నీ చావు లిపిని .. డీకోడ్ చేస్తున్నా..కరోనా, నీ రాకతో
వ్యక్తిగత దూరం అనే మాట
మా దేశంలో వెంటనే
సామాజిక దూరంగానే అర్థమయింది..
ఉన్న దూరాలను
తేలిగ్గా పెంచడానికే
నీవు మరింత దోహద పడ్డావు..
... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |