వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

| సాహిత్యం | క‌థ‌లు

వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

- పలమనేరు బాలాజీ | 02.08.2020 04:14:44pm

ఆర్థిక అసమానతలు సాంఘిక వైషమ్యాలు తరతరాల బానిసత్వం దళితులను వేదనకు గురి చేస్తూనే ఉన్నాయి. సంతకాలు నేర్వడమే నేరాలుగా పరిగణించిన కాలమది. వేలి ముద్రలు వేసేవాళ్ళు సంతకాలు చేయడం ఏమిటని ప్రశ్నించిన కాలమది. అంటరాని వాళ్ళు కదా, దేవుళ్ళు మైలపడతారని దేవాలయాలలోకి వాళ్ళని రానివ్వని కాలం అది. బానిసల్లా పడి ఉండండి, ఇదేమిటని దేన్నీ ప్రశ్నించకండి, మేం చెప్పింది చెయ్యండి, మాటకు మాట ఎదురు చెప్పకండి అని ఆజ్ఞలు జారీ చేసిన దొరల కాలం అది.

సాంఘికంగా తక్కువగా చూడబడటం దళిత కులాలకే పరిమితం కాలేదు. గిరిజన బహుజన మైనారిటీ క్రిస్టియన్ వర్గాలు సైతం అసమానతలకు, వేధింపులకు గురవుతూనే ఉన్నాయి. అయితే తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ఆధిపత్య కులాల అహంకారాన్ని ఎండగడుతూ ప్రశ్నిస్తూ సమానత కోసం సాధికారత కోసం అన్ని దిగువ కులాలు వర్గాలు దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నాయి.

ఈ ఉద్యమాలలో భాగంగా వెలువడిన విలువైన సాహిత్యం సమాజాన్ని షాక్ కు గురి చేసింది. పెద్దలనబడే వాళ్ళు ఉలిక్కిపడ్డారు. వాళ్లు పెద్దలా? పై కులం ఏమిటి కింద కులం ఏమిటి? ఈ తారతమ్యాలు ఎక్కడి నుండి వచ్చాయి? మనుషులందరూ ఎందుకు సమానం కాదు? కులం తాలూకు అహంకారం, ఆధిపత్యం పెత్తనం దౌర్జన్యం ఏమిటి? ఎంత కాలమిలా? ఇంకానా ఈ బానిసత్వం? ఇంకానా ఈ సంకెళ్ళు? ఇంకానా ఈ వివక్షత? ఇంకానా ఈ అసమానత్వం? ఇంకానా ఈ అమానవీత?మనుషుల్ని కలవరపెట్టే ఈ ప్రశ్నలకు సమాధానంగా పాయలు పాయలుగా ఉద్యమ సాహిత్యం వెలువడుతూనే ఉంది. సమాజంలో సంఘర్షణలు అసమానతలు వేధింపులు హింస ఉన్నంతకాలం ఉద్యమ సాహిత్యం వస్తూనే ఉంటుంది. అది భావజాలానికి సంబంధించిన ఉద్యమ సాహిత్యం కావచ్చు, కులమత వివక్షతలకు వ్యతిరేకంగా విలువడే ఉద్యమ సాహిత్యం కావచ్చు. ప్రాథమిక హక్కులకు మానవ హక్కులకు స్వేచ్ఛ స్వాతంత్య్రతలకు సంబంధించిన ఉద్యమ సాహిత్యం కావచ్చు. ఇలాంటి సాహిత్యం రోగగ్రస్తమైన సమాజానికి అవసరమైన శస్త్రచికిత్సలాంటిది.

అలాంటి శస్త్రచికిత్సల్లాంటి కథలు కర్నూలు జిల్లా నుండి "నిప్పుల వాన" పేరిట వెలువడ్డాయి.కర్నూలు మనస్విని ప్రచురణల ద్వారా కెంగార మోహన్ సంపాదకత్వంలో మే 2020లో వెలువరించిన "నిప్పుల వాన" దళిత కథా ఈ సంకలనంలో "పైగేరి నారణప్ప కథ.." ఒకటి.

ʹకథల కన్నీళ్లుʹ పేరిట ఇచ్చిన 15 కథల జాబితాలో మొదటి కథ డాక్టర్ నాగప్ప గారి సుందర్రాజ్ రాసిన " నడిమింటి బోడెక్క బసివిరాలయయ్యేద..". ఈ కథతో పాటు మరో మూడు కథలు గతంలో అచ్చయిన కథలు. గుంపుల వెంకటేశ్వర్లు -బ్యాగరోళ్ళు, డా.యస్.జె. రవి ప్రకాష్ -తిరగబడిన డప్పు, డాక్టర్ కల్లూరి ఆనందరావు- వేకువ.ఈ కథా సంకలనంలో రచయిత్రులు రాసిన కథలు రెండు ఉన్నాయి.మల్లె పోగు వెంకట లక్ష్మమ్మ - కైమా, కోట మలిగ అరుణ-విజేత. మిగతా ఎనిమిది కథలు: డా. సక్కిరి భాస్కర్ - కాపులిండ్లు,పెరికల రంగస్వామి-పరిచయం చేయండి, సవ్వప్ప గారి ఈరన్న - కనువిప్పు, విక్టర్ విజయ్ కుమార్-బతుకు తునకలు,ఆవుల బసప్ప-దొరల దర్భారు,సూగూరు సుధాకర్-పరివర్తన,సంకటిమహేశ్వరయ్య- చూపుడువేలు, పోగు అయ్యన్న - అంటరాని గాయం. కెంగార మోహన్ రాసిన "పైగేరి నారణప్ప కథ.." ఎక్కడా పత్రికల్లో అచ్చు కాలేదు. "నిప్పుల వాన" దళిత కథాసంకలనంలో డైరెక్ట్ గా అచ్చయింది.

జి.వెంకట కృష్ణ ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో ఈ కథ గురించి ఇలా అంటారు.."ఈ నిప్పులవాన సంకలనంలో వస్తుగతమైన వైవిధ్యమూ లేకపోలేదు. పైగేరి నారాణప్ప కథలో మాదిగ-బోయ కులాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని చిత్రించబడి ఉంది. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో చారిత్రికంగా బోయ-మాదిగ కులాల మధ్య కాంట్రిడిక్షన్ వుంది. ప్యాపిలిలో జరిగిన దళిత వినాయక విధ్వంసంలో ప్రధానంగా ఈ రెండు కులాల ఘర్షణ వుంది. ఇంతకు ముందు కర్నూలు కథా సాహిత్యంలో ఈ విషయాన్ని చిత్రించిన కథలు (రాజకీయ దేవుడు, ప్యాపిలి వచ్చింది) కూడా ఉన్నాయి. ఈ రెండు కులాల ఘర్షణకు పాళెగాళ్ళ వ్యవస్థలో మూలాలున్నాయనీ, బోయలు పాలెగాళ్ళుగా , పాలెగాళ్ళ కోటలకు కావలి గాళ్ళగా సామాజికంగా ఆధిపత్యాన్ని చెలాయించే స్థితి/ ఇప్పటికీ మానసికంగా (పాలెగాళ్ళ వ్యవస్థ చిన్నా భిన్నమై అంతమై బోయలు నిరుపేదలుగా మారినా) ఆ ఆధిక్యతను ఉంచుకొని వీలైన చోట చెలాయిస్తారని పైగేరి నారాణప్ప కథ చెప్పకనే చెబుతుంది. ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని పోలిన అరాచకానికి ఒక మాదిగ వ్యక్తి కుటుంబం బలైపోవడమే కథ, కథనంలో కూడా కొత్త పోకడలు పోలిన కథ ఇది."

కుల రాజకీయాలకు బలైన మనిషి కరువు ధాటికి, కౌలు రైతుగా విఫలమై , వ్యవసాయం కోసం చేసిన యాభై వేల రూపాయలు అప్పు కి రెండు ఎకరాల పొలాన్ని అప్పగించేసి, అప్పులపాలై, అప్పులు తీర్చుకోవడం కోసం పొట్ట చేత పట్టుకొని బెంగుళూరు నగరానికి వలస వెడతాడు. అక్కడ కూడా కొనసాగిన కుల రాజకీయాలకు లొంగిపోయి, మద్యానికి బానిస కావడం, ఉపాధిని కోల్పోవడం, మరింతగా అప్పుల పాలవటం, ఒకరకంగా అతడి భార్య వాళ్ల తాకట్టు లోకి ,వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోవడం, ఊర్లో వాళ్లకే జరుగుబాటు కాని పరిస్థితుల్లో ఇతని పిల్లల్ని బంధువులు చూసుకోక పోవడంతో, ఆ పిల్లలు ఏమయ్యారో తెలియకపోవటం, అప్పుడెప్పుడో పై కులమోల్లకు ఎదురుతిరిగాడని, కక్షగట్టిన ఆధిపత్య కుల రాజకీయాలకు చివరికి అతడు హత్య చేయబడ్డాడో, ఆత్మహత్య చేసుకున్నాడో చివరికి ఏమయ్యాడో తెలియకపోవడమే ఈ కథ.

కథ ఇట్లా ప్రారంభమవుతుంది..

మా ఊరంటే చాలా ఇష్టం. జ్ఞాపకాల మూటలన్నీ ఉండేదక్కడే... ఎన్ని అనుభూతులు మదిలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయంటే మాటల్లో చెప్పలేనంత .అంత ఇష్టమున్న ఊరును ఉద్యోగకారణంతో వదలాల్సి వచ్చింది. పెళ్ళి తర్వాత ఊరుకు వెళ్ళిందీ లేదు. పెళ్ళిలో మా నాన్నతో నేను చేసిన గొడవ అంతా ఇంతా కాదు. మెరివిణి వద్దని నేను. మా నాన్న మెరివిణి చేసే తీరుతానని. మెరివిణి చేస్తే అన్నీ గుడులముందు మెరివిణి బండి ఆగుతుంది. కొత్త దంపతులమైన మేము బండి దిగి గుడి బయట నుంచే మొక్కాలి. ఏ గుడిలోకి మమ్మల్ని రానియ్యరు. నాన్నతో యుద్ధమే చేయాల్సివచ్చింది. ఇంతబతుకు బతికి ఇంటెనక సచ్చినాడంటారు. మెరివిణి కూడా సేయనీకి గతిలేదని నన్ను నానా మాటలంటారని మా నాయన ...అన్ని గుళ్ళల్లోకి రానిస్తారా ? అట్లయితే నేను మెరివిణి చేసుకుంటా అని నేను... అదెలా సాధ్యం ... మనూర్లో ఆచారానికి విరుద్ధంగా ఎట్లా పోతామని మా నాయన. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఎట్టకేలకు మా అమ్మ జోక్యంతో మెరవణి రద్దయ్యింది. ఈ వివక్ష భరించలేకేనా మాదిగ మాలలంతా క్రిష్టయన్లుగా మారేది. చర్చిల్లో ఏ నిబంధనా ఉండదు... అందరినీ సమానంగా చూస్తారు.

మా ఊర్లో మారెమ్మ గుడి పూసేది ..రంగులేసే మా మాదిగోళ్ళే. మా ఊళ్ళో మారెమ్మ గుడి బోయవీధిలో ఉంటుంది. మాదిగ్గేర్లో కూడా చిన్న మారెమ్మ గుడి ఉంది. బోయగేర్లో ఉండే గుడి బాగోగులన్నీ చూసేది మాదిగోళ్ళే. పండగలప్పుడు సున్నాలు కొట్టడం. ప్రాంగణమంతా శుభ్రం చేయడం. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. మాదిగ్గేర్లో ఐదు మేటీలున్నాయి. అంటే ఐదు గుంపులనన్నమాట.

ఊర్లో పంటలు సరిగా పండటం లేదు. ఒకసారి ఊరు దేవర చేస్తే ఊరు ప్రశాంతంగా ఉంటది..ఈ ఏడు చేయండని ఊరి బాపనయ్య రామ్మూర్తి స్వామి చెప్పాడని సాయంత్రం చాటింపు.మా ఊళ్ళో ఊరు దేవర చేయాల్సింది బోయొళ్లే. గుడికి రంగులు వేయాలని బోయోళ్లు హుకూం జారీ చేస్తారు.

పైగేరి నారాణి గాడు వాళ్ల మాటలకు ఎదురు తిరుగుతాడు. మాకేం ఇస్తారు మీరు అని అడుగుతాడు. పోతు మాంసం ఇస్తాం కదా అంటాడు పెద్దమనిషి. మాకొద్దు అంటాడు.ఇంకేం కావాలా తన్నులు కావాలా అని నడిమింటి నర్సయ్య కోపంతో ఊగిపోతాడు. అయినా ఇతడు బెదరడు.

పైగేరి నారాణిగాడు గాని పైకి లేచి " ఏమి లేదు. మెరివిణి తిరిగినప్పుడన్నా పెళ్ళైనోళ్ళు మారెమ్మవ్వ గుడి ముందర బయటే నిలబడి మారెమ్మవ్వని మొక్కుతారు. గుడి కన్నిగా పూసేది మేము. కడిగేది మేము.. గుడిలోపలికి మమ్ముల్ని రానీల్యాకుంటే ఎట్ల..మీకొక్కరికేనా మారెమ్మవ్వ మాకిలేదా" అన్నాడు

మాటలు పెరుగుతాయి కాని పంచాయితీ ఎంతకూ తెగదు. పండుగ అయిన తర్వాత మాట్లాడదాం ముందుగా గుడి పూయండి అని సర్దేస్తారు.

ప్రశ్నించడం నేరమవుతుంది ప్రశ్నించిన వాడు దోషిగా అనిపిస్తాడు అహంకారపు మనుషులకు. అతనిపై పగ పెట్టుకుంటారు. ఏళ్లకు తరబడి ఈ వేట,హింసకొనసాగుతుంది.ఈ పన్నాగంలో ఈ కుట్రలో.. పైగేరి నారాణప్ప ఏమౌతాడు?

పదేళ్ల తర్వాత ఊర్లోకి వచ్చిన కథకుడు తప్పెట శబ్దం విని చాటింపు గురించి మల్లన్నను వివరాలు అడుగుతాడు.జీవధ్బాషలో కొనసాగిన ఆ సంభాషణను చూడండి..

" ఏం లేదు సారు తునుకులంగిడ్లు యాలామేస్సారంట. ..సారు మీరొచ్చి ఎన్నిదినాలయ్యంది. పది పదేండయ్యింది. శ్యానా మారినయ్."

ఏం మారినయ్ రా

ఏమంటే ఏం చెప్పాలి సార్. ఏదానికైనా డబ్బులియ్యందే పని చేయరు. అన్నింటికీ డబ్బులీయాలి. ఉపాధి హామీ పనులియ్యాలంటే కూడా సర్పంచ్ కి డబ్బులియ్యాలి.. అంతెందుకు మనూర్లో కటికోళ్ళు బతికే మటన్ కోసే కదా. దాన్ని కూడా యాలాం, సిస్టం తెచ్చినారు.

తప్పేముంది రా. పంచాయతీకే కదా ఆదాయాలు వచ్చేది...

అట్లొస్తే సరిపోతది. కానీ.. సర్పంచ్ సేన్ల మీద సేన్లు ఎట్ల కొంటుండాడు. ఈ డబ్బుల్తోనే కదా. అన్యాయం చేయకుంటే ఇంత బాగు పడ్తాడా. ఇప్పుడు తునుకులు ఎవునికి వాడు కోస్కోని తింటుండ్రి. యాటగోస్తే యాభైరూపాలియ్యల్లంట యాలాం పాడ్నోనికి, అంతెందుకు సారు గవర్మెంట్ పన్లు చేయడానికి పేరు చేర్చాలంటే కూడా దుడ్లియ్యల్ల..

ʹఈ నా కొడుకుల్కి ఏమొచ్చిందిరా. గొవుర్మెంట్ పనంటే ఉపాధి హామీ పనేకదా.ʹ

అదే సారు.

ఊర్లన జనుమే లేరు కదరా.. యాడికి పోయినారు. యాడుంటారు సారు. యాపార్టీ నాయాండ్లు ఆ పార్టీ నాయాండ్లుకి పనులిస్తారు.. పార్టీల్లో ల్యాకుంటే పనులెవుడిస్తాడు. ?

"ఊరు ఏమీ మారలేదు అక్షరాస్యులు పెరిగారేమో కానీ చైతన్యవంతులు అవ్వలేదని అర్థమయింది. ఊరు రూపం మారిందేమో కానీ దురాచారాలు దుర్మార్గాలు అన్నీ అలానే ఉన్నాయి. అయితే వాటి రూపం మాత్రం మారింది." రూపు మారిన ఊరు మొత్తం కథలో..ఒక్కమాటలో అలా ఆవిష్కరింపచేస్తాడు కథకుడు .

ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోని సంపాదించుకోవల్ల, ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగల అనే పైగేరి నారాణప్ప వ్యవసాయం చేయడం కోసం అప్పులపాలై,అతడి భూమి బోయోళ్ల అప్పుకు జమ అవుతుంది. మిగిలిన అతడి ఇల్లు వేలానికి వస్తుంది. ఇప్పుడు అతడికి పొలం లేదు, ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు. ఇక్కడ లేదంటే లేకపోవడం కాదు. మిగలక పోవటం. పోగొట్టుకోవడం, ఇంకేమీ చేయలేకపోవడం, లేదా అతడికి ఇంకేమీ చేత కాకపోవటం, సాటి కులస్తులు ప్రభుత్వ యంత్రాంగం అతడికి ఉపాధి కల్పించ లేకపోవటం, భరోసా ఇవ్వలేక పోవడం,ఉపాధిని వెతుక్కుంటూ వలస వెళ్లిన అతడు బెంగళూరులో ఉన్నాడా లేడా? ఏమయ్యాడు ? బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అనేది కథ రాయాలని కథకుడు అనుకుంటాడు.

పదేళ్ల క్రితం జరిగిన పీర్ల పండుగ గొడవల్లో రాజకీయ ప్రాబల్యం ఉన్న కులాల వాళ్ళు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, వినాయక చవితి సందర్భంగా బెణకప్ప ఊరేగింపును అడ్డుకోవటం,బ్యాగారు బసురాజును చంపేయడం, అయినా ఎవరూ ఎదురు తిరిగే సాహసం చేయకపోవడం, కేసు పెట్టిన దళితులు పొట్టకూటి కోసం, వలస వెళ్ళి పోయినా, ఆ కేసు కోసం ఊరి ఆధిపత్య కులస్తులు ఇంటికి ఇంతని వంతులు వేసుకుని యాభై లక్షలు జమ చేసి పెట్టుకోవడం, ఏళ్ల తరబడి కేసు జరుగుతూనే ఉందని చెప్పటం వర్తమాన సమాజంలోని సంఘర్షణలకి వాస్తవ రూపం.

ఇదంతా కథ రాయలి.. రాద్దామంటే పెన్ను సాగడం లేదు. అంటాడు ఈ కథకుడు..కథ చివర్లో. కథ ముగింపు దశలో.. రచయిత కంఠస్వరం లోని తీవ్రత ఏమిటో పాఠకులు గమనించాలి.

ఉచ్చుగాడు చెప్పిన వివరాలతో పైగేరి నారాణప్ప కథే రాయాలి, ఏమని రాయలి? పైగేరి నారాణప్ప సేద్యం చేయలేక సచ్చిపోయినాడని రాయాలా? రాయాలి ..లేదంటే నీళ్ళు లేని ఈ సీమలో.. ఈ సేద్యములో ఏమిలేదని రాయలా?, ఏమి రాయలి? పైగేరి నారాణప్పగాడు చిన్నప్పటి నుంచి మంచోడు. మా గోత్రమే.. కొడుకు వరసైతడు. ఏమి అలవాట్లు లేనోడు. బాయోళ్లు అలవాట్లు నేర్పిచ్చి.., వాని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారని రాయలా ? వాడు ఒకసారి మారెమ్మ ద్వావురప్పుడు ఊర్లో మారెమ్మ గుడి పూసే వొంతువొస్తె. ఏంటికి పూయాలి. మా పెండేండ్లపుడు మెరివిణి తిరిగినపుడు గుళ్ళకి దానిచ్చేల్లేరు. ఇప్పుడేమో పూయమంటారు...గుడి మేము పూయాలి... మన కులం పెళ్ళిళ్ళు జరిగి మెరివిణి తిరిగితే దంపతుల్ని లోపలికి రానియ్యరు.. అని తిరగబడి కొట్లాడినోడు... వాడి తిరుగుబాటుతనాన్ని కథగా రాయాలా ? ఈ సామాజమే వాన్ని సంపేసింది...

ప్రారంభంలో కథకుడు మెల్లగా మెత్తగా కథను మొదలుపెడతాడు. కథ కొనసాగుతున్న కొద్ది విషాదంగా భీభత్సంగా ఉంటుంది. కథ చివరికి వచ్చేసరికి ఇంతకూ కథకుడు ఏం చెప్పాలి? అని ప్రశ్నలు సంధిస్తాడు.వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలా ?వాస్తవాన్ని ఎంత బలంగా, ఎంత స్పష్టంగా చెప్పాలని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నలు పాఠకులను మాత్రమే ఉద్దేశించినవి కాదు. ఈ ప్రశ్నలు సమాజాన్ని ఉద్దేశించినవి. ఈ ప్రశ్నలు ఆధిపత్య కులాల అహంకారానికి బలై సర్వం పోగొట్టుకున్న ధుఃఖితులను అడుగుతున్నవి. కనీసం ప్రభుత్వ పథకాలను రాజకీయాలకు అతీతంగా రాజకీయ పెత్తనం లేకుండా కూలీ పనులైనా కల్పించలేకపోతున్న అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నవి. ప్రశ్నించకపోతే ఆధిపత్యాలను ఎదిరించ కపోతే ఈ సమాజం మారదు అలాంటి మార్పు కోసం మెరుగైన సమాజం కోసం ఇలాంటి కథలు, కథా సంకలనాలు రావడం చారిత్రక అవసరం.

ఈ కథను ఆద్యంతం శ్రద్ధగా అవగాహన చేసుకుంటూ చదివే పాఠకులకు ఈ కథలో రచయిత చెప్పిన విషయాలతో పాటు సూచించిన అనేక విషయాలు అర్థమవుతాయి. మనుషులు పల్లెటూరు వదిలి వలస వెళ్లడం , బాగు పడతామని పొలాలను కౌలుకు తీసుకుని కరువును ఎదుర్కొంటూ కుటుంబం మొత్తం పొలంలో కష్టపడటం, రాయలసీమ దళిత రైతుని ,రాయలసీమ దళిత కౌలు రైతుని నిట్టనిలువునా మోసం చేస్తున్న కరువు కాటకాలు, ఊరి రాజకీయాలు, కొన్ని కులాల పెత్తనాలు, ఒక్క మాటలో చెప్పాలంటే దళిత కుటుంబాలని అదృశ్యం చేస్తున్న ఆధిపత్య కులాల దృశ్య, అదృశ్య రాజకీయాలను పాఠకులు అర్థం చేసుకోగలుగుతారు. దళిత మహిళ మోసానికి గురి కావటం, ఆధిపత్య కులాల అహంకారానికి నిలువునా బలైపోవడం, తన ఉనికినీ, పిల్లల్ని , కుటుంబాన్ని కోల్పోవటం, వాడ నుండి కాదు ఊరి నుండి కాదు లోకం నుండే అదృశ్యం కావడం, తన శీలాన్ని ,ఆత్మగౌరవాన్ని ,వ్యక్తిత్వాన్ని తన ఉనికిని, ప్రాణాన్ని , ఒక మాటలో చెప్పాలంటే తన అస్తిత్వాన్ని కోల్పోవడం ఈ కథలో కనిపించని ఒక అత్యాచారం , హత్యాచారం.

ఆధిపత్య కులాల అహంకారాన్ని ప్రశ్నించిన దళితుడు ఏమయ్యాడనేది కథ. ఊరిలో మెరవణికి సంబంధించిన కథ. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు దళితులు అయితే మెరవణిలో భాగంగా కనీసం గుడి లోపలికి వెళ్లలేని వెళ్లకూడని కట్టుబాట్లు దళిత యువకుడిని ఊరినుండి దూరం చేస్తాయి. అణిగిమణిగి ఉండకూడదని చదువుకున్న యువకుడు అనుకుంటాడు. ఊరి కట్టుబాట్లను ఎదిరించలేక మెరవణి వద్దని అనుకుంటాడు.ఎలాంటి ప్రతిఫలం లేకుండా, ఊరి పెద్దల ఆదేశాలతో, బెదిరింపులతో వంతుల వారీగా దళిత వర్గాలు మారెమ్మ గుడికి పూసేది రంగులు వేసేది మాత్రం వాళ్లే. అయితే అయితే అంత చేసినా నా పెళ్లి జరిగి మెరవణి తిరిగితే నవ దంపతులను ఆ గుడి లోపలికి రానివ్వకపోవడం ఏమిటని తిరగబడిన దళితుడు ఏమయ్యాడు? పైగేరి నారణప్ప కథ మాత్రమే కాదు ఇది. ఇది ఒక దళిత ఆత్మగౌరవ కథ కూడా.

రాజకీయ అధికారం దళితులకు ఏం చేసిందో రిజర్వేషన్ల ద్వారా రాజకీయ పదవులు పొందిన దళితులు నిజంగా స్వతంత్రులుగా ఉన్నారా వారి వర్గాలకు వారు చేయగలిగింది చేయాల్సింది చేయగలుగుతున్నారా? చేస్తున్నారా లేదా రాజకీయ అధికార పదవులు పొందిన వారి పైన సైతం ఇప్పటికీ ఆధిపత్య కులాల అజమాయిషీ కొనసాగుతూనే ఉన్నదా ? దీనికి అంతం ఏమిటి? సంక్షోభాలకు పరిష్కారం ఏమిటి? ఎప్పుడు?

ఈ అణచివేతలో ముసలి వాళ్లు, ఆడవాళ్ళు, పిల్లలు కూడా బలి కావడం ఏమిటి? దళితులకు హక్కులు కల్పించాల్సిన ,దళితులకు ఉపాధి కల్పించాల్సిన ,దళితులకు రుణాలు ఇప్పించాల్సిన అధికార యంత్రాంగం ఏమయింది? ఒక దళితుడు దళిత కుటుంబం అదృశ్యం కావడం మాత్రమే కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు , సమాన అవకాశాలను సక్రమంగా అందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం అదృశ్యం కావడం ఈ కథ లోపలి కథ.

కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న ఒక ఉద్యోగి చెబుతాడు. నగరంలో స్థిరపడ్డ వాళ్లు నగరాలకు వలస వెళ్లిన వాళ్లు పల్లెలకు దళితవాడలకు వెళ్లడంతో చాలా కథలు తెలుస్తాయి. పల్లెల్లోని దళితవాడల్లోని శిధిలమైన ఇండ్లు, ఎండిపోయిన బావులు, బోర్లు, కాలువలు, చెరువులు ఎటూ పోలేక మిగిలిపోయి అక్కడే ఉండి పోయి, కూలీలుగా మారిన రైతుల ఎర్రబారిన కళ్ళు, అరిగిపోయిన కాళ్లు అరిగిపోయిన చేతులు, నలిగిపోయిన మనసులు చాలా కథలను చెబుతాయి. వాళ్ళ కథల లోగుట్టుని విప్పి చెబుతాయి. పైకి కనిపించే సంఘటనల వెనుక కనిపించని జీవన సత్యాల్ని చెబుతాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో బోయ కులస్తుల ఆధిపత్యానికి బలైపోయిన ఒక దళితుడి కథ, ఒక కుటుంబ కథను కెంగార మోహన్ చెమ్మగిల్లిన హృదయంతో చెప్పుకున్నాడు.

నిర్దిష్ట స్థల కాల స్పృహతో రాసిన ఈ కథ దళిత జీవితం ఎలా ఉండకూడదో ,ఎలా ఉన్నదో, అలా ఎందుకు ఉన్నదో కఠినమైన వాస్తవాలనే చెబుతుంది. ఈ కథ దళిత సాహిత్యానికి ఒక మేలిమి కూర్పు. ఈ కథ వాస్తవ ఘటనల విచారణా నివేదిక, ఈ కథ ఒక ప్రశ్న, ఈ కథ ఒక హెచ్చరిక, ఈ కథ ఒక ప్రమాద సంకేతం.

No. of visitors : 792
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •