కొత్త లోకం కోసం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

కొత్త లోకం కోసం

- బిల్ల మహేందర్ | 02.08.2020 07:55:12pm

( నా కవిత్వంతో నేను - కొత్త శీర్షిక ఆరంభం)

"అగ్గిపుల్ల గీయడం కవిత్వం/ ఎదురు బద్దను వంచి విల్లంబు చేయడం కవిత్వం/ నా చూపుతో ముట్టుకున్నదీ/ నా చేత్తో ముట్టుకున్నదీ/ నా దేహంతో ముట్టుకున్నదీ కవిత్వం" అంటాడు శివారెడ్డి గారు. అంటే మనం మనసు పెట్టి చూస్తే ప్రతిదీ కవిత్వమే. ప్రతి వస్తువు కవిత్వమే. కాకపోతే ఆ కవిత్వం తిలక్ అన్నట్లు "నువ్వు చెప్పేదేదైనా నీలోంచి రావాలి/ చించుకొని రావాలి". ʹఎవరో నిర్మించిన పునాదుల్ని తవ్వి/ నాలుగు అక్షరాలు ఏరి, జతచేసి/ నిర్మాణం నాదంటూ భుజాల ఎగిరివేతʹ (అక్షరం-ఇప్పుడొక పాటకావాలి లోంచి) అనేది ఆ కవిని తనను తానుగా ఎన్నడూ నిర్మించుకోలేడు. ʹనా కవిత్వంతో నేనుʹ అనే శీర్షికతో కొత్తగా ఆన్లైన్ మాగ్జిన్ లో ఒక కాలమ్ మొదలు పెడుతున్నాం, మొదటగా మీ పుస్తకం ʹఇప్పుడొక పాట కావాలిʹ తో ప్రారంభించాలని అనుకుంటున్నాం..మీరు ఆ పుస్తకంలోని మీ కవిత్వాన్ని పరిచయం చేస్తూ ఒక వ్యాసాన్ని రాయండని ʹపాణిʹ గారు అన్నప్పుడు మనసులో కొంత సంశయం ఏర్పడింది. ఐతే దాదాపు రెండేండ్ల క్రితం అనుకుంటాను, శ్రీ రాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయం, వరంగల్లు వారు ʹఈతరం గొంతులుʹ అనే కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమంలో నా కవిత్వం పరిచయం చేసే అవకాశం లభించింది. ఆ అనుభవంతో నేను తప్పకుండా రాసి పంపగలను అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఎవరి కవిత్వాన్ని వారు విశ్లేషించుకోవడమనేది చాలా అరుదు. కొంత ఇబ్బంది కూడాను. ఇతరులు కవిత్వాన్ని విశ్లేషించినప్పుడు కవిత్వం లోని అనేక కోణాలు, విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఐతే కవి ఒక కవితను నిర్మించినప్పుడు అది ఏ కోణంలో నిర్మిస్తున్నాడో, చివరికి ఆ కవిత ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒక స్పష్టత, అవగాహనను ఆ కవి కలిగి ఉంటాడు. కానీ అది ఎప్పుడైతే సమాజగతవుతుందో పాఠకులు ఆ కవితను భిన్న కోణాలలో, భిన్నమైన పద్దతులలో విశ్లేషిస్తూ వారి ఆలోచనలకనుగుణంగా రాయడమనేది సహజం. కవి తన కవితలను ఏ కోణంలో రాశాడో, ఆ కవిత ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నాడో పాఠకులకు స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ శీర్షికను ఎన్నుకున్నారనీ, ఈ ఆలోచన కొత్తగా, విభిన్న అంశంగా ఉన్నప్పటికీ ఇది ఆయా కవుల కవిత్వ కోణాలను, వైఖరులను తెలియజేస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను.

దాదాపు నాలుగు సంవత్సరాలుగా రాసిన కవితలలో కొన్ని కవితలను ఒకటిగా చేర్చి నా కొత్త కవితా సంపుటి ʹఇప్పుడొక పాట కావాలిʹ గా అచ్చువేసి ఇటీవలనే ఆ సంపుటిని ఆవిష్కరించుకున్నాను. ʹనేను- నా కవిత్వంʹ అనే శీర్షిక వినబడగానే నా కవితా సంపుటిలోని ʹనా కవిత్వంʹ శీర్షికతో నేను రాసుకున్న కవిత నాకు వెంటనే గుర్తుకొచ్చింది. బహుశా చాలా మంది కవులు వారి వారి కవిత్వ లక్ష్యం చెప్పేందుకు ఏదో ఒక చోట, ఏదో ఒక రూపంలో వ్యక్తపరచడం అలవాటు. అదేవిధంగా ʹనా కవిత్వంʹ లో నా లక్ష్యాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేశాను. "ఉత్తిగనే రాస్తూ కూర్చుండలేను/ నడవాల్సిన తొవ్వెంబడి నడవకపోతే కాళ్ళు గుంజుతుంటయి/ ఎత్తాల్సిన కాడ పిడికిలి ఎత్తకపోతే చేతులు బరువెక్కుతుంటయి" అని ప్రారంభించి చివరికి "ఏ బాల్కనీలో హాయిగా ఉయ్యాలలూగుతూ రాసేందుకు/ నా కవిత్వం కాఫీ కాదు/ దేహమ్మీద నుండి రాలుతున్న చెమట చుక్క" అని ముగించుకున్నాను. రాయడం వేరు, ఆచరణ వేరు! రాసింది ఆచరణలోకి చూపెట్టడమనేది ఇవ్వాళ చాలా అవసరమని నా భావన. కనీసం ఆచరణ సాధ్యమైనది కూడా ప్రయత్నించక పోతే రాయడం ఎందుకు?? అందుకే ఉత్తిగనే రాస్తూ కూర్చుండ లేనన్నాను. "అన్నీ ఏకమై ప్రవహిస్తున్న చోట/ అందరూ ఒక్కటై నడుస్తున్న చోట/ ఒంటరిగా మిగిలిపోతే ఊపిరే ఆగిపోతుందని" చెప్పుకున్నాను. ఒక న్యాయమైన, ధర్మమైన పోరాటానికి అందరు ఒక్కటై పోరాటం చేస్తూ ముందుకు నడుస్తున్నప్పుడు దాన్ని చూసి, వాళ్ళతో అడుగులు వేసే అవకాశం ఉండి కూడా ఒంటరిగా ఉండడం కన్నా చావు ఇంకొకటి లేదు. అందుకే ʹనా ఊపిరే ఆగిపోతుందʹనే వాక్యం ద్వారా నా పయనం ఎటువైపో చెప్పే ప్రయత్నం చేశాను. ఇదే తరహాలో ఇంకో శీర్షిక ʹఓ కవి(త)ʹ లో తను నేను ʹఆకలి పేగుʹ కవితను విశ్లేషించుకుంటున్న సందర్భంలో "కాఫీని కవిత్వాన్ని ఆస్వాదిస్తూ/ మా దైన లోకంలో మేం తేలి పోతున్నప్పుడు/ గేటు ముందు ఓ ఆకలి గొంతు అమ్మ అని అరిచి అరిచి/ నేలచూపులు చూస్తూ వెళ్ళిపోతుంది" అంటూ... "ఒక్కసారిగా మెలుకువ తెచ్చుకున్న నేను/ దూరమవుతున్న అడుగుల్ని చూసినప్పుడు/ చేతిలోని కాఫీతో పాటు కవిత్వం చేదేక్కిందని" అన్నాను. రైతులు, కార్మికులు, పేదరికం, ఆకలి, తదితర అంశాల గురించి రాసే వారు చాలామంది ఉన్నారు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఆయా వర్గాల వారికి చేతనైనంత సహాయమో లేదా కనీసం ఓ భరోసానో కల్పించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ఇక్కడ చెబుతూ చివరిగా "ఓ కవీ నువ్వెలా రాస్తున్నావో అలానే బతుకు/ నువ్వెలా బతుకుతున్నావో అలానే రాయి" అని ముగించాను. అంటే మన బతుకుకు, రాతకు వ్యత్యాసం ఉండకూడదనే నా ఆలోచన. ఐతే ముందుగా చెప్పబడినట్లుగా ప్రతి సందర్భంలో వందకు వందశాతం ఎవరికీ ఇది సాధ్యం కాదు. కానీ సాధ్యమయ్యే సందర్భంలో కూడా ప్రయత్నం జరగటం లేదు. అలా జరగాలన్నదే నా అశ.

ʹరెక్కల గీతంʹ అనే శీర్షికలో "ఒకానొక రోజు/ దేహమ్మీద సాయంత్రాన్ని మోసుకెళ్తూ/ నెమ్మదిగా నడుస్తుంటాను/ అకస్మాత్తుగా ఎక్కడినుంచో తెగిపడ్డ కొన్ని పూల రెక్కలు/ సూర్యుడితో పాటు పడమట దిక్కులో మాయమైపోతాయి" అని, చివరికి "ఆ క్షణం నాకు తెలియకుండానే/ వాటిని నా చేతుల్లోకి తీసుకుని/ ఒక ఉదయం వైపు అడుగులేస్తానని" అంటాను. ఇక్కడ తెగిపడ్డ పూల రెక్కలు బడుగు,బలహీన వర్గాలకు ప్రతీకలుగా తీసుకున్నాను. ఒక ఆధిపత్యంలో నుంచి ఆ పూల రెక్కలు తెగి పడి హత్యకు గురైనప్పుడు ఆ సాయంత్రం దృశ్యాన్ని చూసిన నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ మెల్లగా ఇంటి లోకి వెళ్లి నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి ఒక్కసారిగా ఆ పూల రెక్కల రోదనలతో ఉలిక్కి పడుతాను. వెంటనే ఆ పూల రెక్కలలో వెలుగులను నింపడం కోసం నా అడుగులు మొదలవుతాయనీ చెప్పాను. ఇది నాకు నేనుగా ఒక ఇమేజనరీని సృష్టించుకుని రాసిన కవిత. దీని ద్వారా నా ఆలోచన విధానాన్ని చెప్పడం చేశాను. ఇవాళ ప్రశ్నిస్తేనే నేరమవుతున్న కాలంలో మనమందరం బతుకుతున్నాం. ప్రశ్నిస్తున్న గొంతుకల్ని రాజ్యం భయభ్రాంతులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెట్టి చీకటి గదిలో బంధిస్తూ వారిపై కక్ష్యగట్టడం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఆ పరంపరలోనే ప్రశ్నించే గొంతుకలైనుటువంటి ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావులాంటి చాలా మంది మేధావులను బంధించి రాజ్యం తమాషా చూస్తూ ఉంది. "ఇప్పుడే కాదు/ అతను ఎప్పుడూ తనకంటూ ఏమీ కోరుకోనూ లేదు/ తన కోసం ఏమీ చేసుకోనూ లేదు... "తనలాగే అవిటిదైపోతున్న/ ఈ దేశాన్ని రెండు కాళ్ల మీద సరిగ్గా నిలబెట్టేందుకు/ కొన్ని ప్రశ్నల్ని ఎముకలుగా నిలబెట్టి/ కొంత ధిక్కారాన్ని నేర్పించడం/ కొన్ని గాయాలకు పూత పూయడం/ అంతే...అంతకన్నా తను ఏమీ చేయనూ లేదు" (అతడు) అని రాశాను. నిజానికి సాయి బాబా గారు ఏం చేసారు?? 90 శాతం వైకల్యం ఉన్నటువంటి వ్యక్తిని ప్రభుత్వం కుట్ర కేసులో ఇరికించి కనీసం సరైన సదుపాయాలను కల్పించకపోవడం, అంతర్జాతీయ దివ్యాంగుల చట్టాలను అతిక్రమించడమనే చర్యలను ఒక దివ్యాంగుడుగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ʹఅతడికి వైకల్యం ఉన్న మెదడు సరిగ్గానే పనిచేస్తున్నది కదాʹ అని జడ్జి గారు మాట్లాడినప్పుడు "నిజమే../ ఇప్పుడు నువ్వన్నట్లు/ అతనికి వైకల్యం ఉన్న మెదడు సరిగ్గానే పని చేస్తుంది/ ఇక పని చేయాల్సింది కరగాల్సింది/ గడ్డ కట్టుకుపోయిన కొందరి మానవత్వం" అంటూ ఈ కవిత ద్వారా ఒక నిస్సహాయతను వెలిబుచ్చాను. ఈ రెండు వారాల నుండి వివి గారి గురించి వార్తలు పత్రికలలో సామాజిక మాధ్యమాలలో చదువుతూ ఉంటే ఒకవైపు బాధ, మరొక వైపు ఏమీ చేయలేనితనం వెంటాడుతుంది. ఒక కవిగా, గొప్ప వక్తగా, నాయకుడిగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన వారు ఇవ్వాళ దీనమైన స్థితిలో బతుకుతున్నారు. కనీసం జీవిత చరమాంక సమయమైనటువంటి వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల మధ్య గడపాల్సిన పరిస్థితి కూడా వారికి లేకపోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం ʹకొవిడ్ʹ విపత్కర పరిస్థితిలోనైనా కూడా వారిని విడుదల చేయలేకపోవడం చూస్తుంటే వారి పట్ల ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. అందుకే ఒక కవి గా నేను స్పందించాను. "చీకట్లో వెన్నెలను కురిపించినోడు కదా/ వెలివాడల్లో వెలుగుల్ని పూయించినోడు కదా/ అతడికి యుద్ధమేమి కొత్తకాదు/ కుట్రలూ తెలియంది కాదు/ జైలు ఊచలు ఎన్నో సరిగ్గా లెక్క తెలుసు" అంటూ "ఏదో ఒక సమయాన/ నది సంద్రమై ఉప్పొంగుతుంది/ చిరునవ్వు పాయిరమై పంజరంలోంచి ఎగిరొస్తుంది" అని ఒక ఆశావాదంతో కవితను ముగించాను. అలా జరిగితే ఎంత బాగుండు??

ʹయుద్ధం అనివార్యమేʹ అనే కవితలో "నువ్విక్కడ/ కలాన్ని పట్టుకో కూడదు/ అక్షరాన్ని జాలువార్చే లోపు/ నీ జాడ శాశ్వతంగా కనుమరుగైపోతుంది" అంటూ ధైర్యశాలిగా, ముక్కుసూటిగా మాట్లాడే పాత్రికేయురాలిగా గారీ లంకేశ్ గారు సమాజంలోని అసమానతలు, దురాచారాల నిర్మూలనకు నడుం కట్టినందుకు కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెను కాల్చి చంపిన స్థితిని, "నువ్విక్కడ/ అసలే ప్రేమించకూడదు/ ప్రేమను పంచుకునే లోపు/ నువ్వు కిరాతకంగా హత్య చేయబడుతావు" అంటూ తన కుమార్తె అమృత వర్షిణి ప్రణయ్ ను కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించిన మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త తిరునగరి మారుతీరావు అతనిని హత్య చేయించిన స్థితిని "నువ్విక్కడ/ తలపాగా చుట్టుకో కూడదు/ నవ్వుతూ మురిసేలోపు/ నీ తోలు దారుణంగా ఒలిచివేయబడుతుంది" అంటూ మధ్యప్రదేశ్ లో ఒక ఎస్సీ వర్గీయుడు తలపాగ ధరించాడని, అతని తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదుల స్థితిని తెలియజేస్తూ చివరికి "తప్పదు/ ఇప్పుడిక నీకు యుద్ధం అనివార్యమే" అని ప్రకటించాను. ఒక్కో సందర్భంలో మనిషి ఎలా హత్య చేయబడుతున్నాడో, ఎలా ఆధిపత్య భావజాలంలో అన్యాయాలకు, అవమానలకు గురై పోతున్నాడో చెప్పడం ఈ కవిత యొక్క ఉద్ధేష్యం. చివరికి యుద్ధం చేయాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను ఈ కవిత ద్వారా తెలియజేశాను. అదే సందర్భంలో ʹయుద్ధమంటే ప్రేమించడం కూడా ʹఅని చెప్పాను. " నీకు నాకు యుద్ధమంటూ జరిగితే/ ఇద్దరం ఎదురెదురుగా నిలబడాలి/ పువ్వేదో ముల్లేదో రాయేదో కనిపెట్టాలి/ తప్పక యుద్ధం జరగాల్సి వస్తే/ ముందు పరుచుకున్న పువ్వుల్ని ప్రేమించాలి/ ఎదురుపడ్డ ముల్లను రాల్లను ఏరివేయాలి" అంటూ చివరగా "ఓ ప్రియమైన శత్రువా/ ఇప్పుడు యుద్ధమంటే ప్రేమించడం కూడా" అని అన్నాను. ప్రతి విషయానికి యుద్ధమే పరిష్కారం కాదు. కూర్చుని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా ఒక్కోసారి ఆయుధాలు లేకుండానే పరిష్కారమవుతాయి. అందుకే యుద్ధమంటే ప్రేమించడం కూడా అని చెప్పాను. అలా చెబుతూనే మరొక కవితలో ʹయుద్ధం చేయాల్సిందేʹ అని భిన్నంగా రాసాను. ఐతే పైన చెప్పిన యుద్ధానికి, ఇక్కడ చెప్పబడుతున్న యుద్ధానికి వ్యత్యాసం ఉంది. "అతడిని కొన్ని పువ్వులను ప్రేమించమని పంపాను/ వాటి భాష గాఅర్థం కాలేదని అన్నాడు/ అరుస్తున్న పిచుక గొంతు వినమన్నాను/ దాని భాష అర్థం కాలేదని అన్నాడు/ పూల మొక్కల ముందు కాసేపు మోకరిల్లుమన్నాను/ కూర్చున్నంత సేపూ ఏమీ అర్థం కాలేదని లేదని తిరిగొచ్చాడు". అప్పుడు "ఇక/ నీకు నువ్వు యుద్ధం చేయాల్సిందే"నంటూ అన్నాను. ఇక్కడ ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశులను మనిషి ప్రేమించుకోవడం నేర్చుకోవాలి అనేది నా ఉద్దేశ్యం. అవన్నీ మన నిత్యజీవితంతో ప్రతినిత్యం ముడిపడి ఉన్నాయి. వాటిని ఎవరూ నేర్పరు. మనమే అర్థం చేసుకోవాలి. అలా అర్థం కాకపోతే మనతో మనం యుద్ధం చెయ్యాల్సిందే అన్నాను. అలా చేయటం వలనే చివరికి "ఒకానొక రోజు/ తన గుమ్మం ముందు నుంచి వెళ్లి పోతున్నప్పుడు/ కొన్ని ఏపుగా పెరిగిన మొక్కల మధ్య నిలబడ్డ/ అతడి అర చేతిలో మురిపెంగ పిచుక" వాలిందని ముగించాను. అంటే ప్రయత్నిస్తే మనం ఏదైనా సాధించగలమని దీనిద్వారా చెప్పాను. కాకపోతే ఆ ప్రయత్నం ఓ ʹయుద్ధంʹలా ఉండాలి.

చిన్నారి ʹశ్రీహితʹ ఘటన పై స్పందిస్తూ ʹనిషేధిస్తున్నానుʹ అనే కవితలో "ఇప్పుడు/ నాకోసం చింతించకండి/ రోడ్లపై ర్యాలీలు తీస్తూ నినదించకండి/ మూతులకు నల్ల గుడ్డకట్టి నిరసనలు చేపట్టకండి" అంటూ "నిజంగా/ మీరు నా కోసం ఏదైనా కచ్చితంగా చేయాలనిపిస్తే/ ఇకనుండి ఎప్పుడైనా గడపదాటే ముందు/ మొలిచిన మీ అంగాన్ని/ ఇంట్లోనే వదిలి వెళ్లండని" నిరసన వ్యక్తం చేశాను. ఏళ్ల తరబడి మహిళలపై అకృత్యాలకు అంతూ, అదుపూ లేదు. చివరికి ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం వెంటాడుతున్న దృశ్యాలు ఈ సమాజంలో చోటు చేసుకోవడం చాలా హేయమైన చర్య. అందుకే చేసేదేమీ లేక అన్నింటికీ మూల కారణమైన ʹఆʹ అవయవాన్ని ఇంట్లోనే వదిలేసి బయటికి వెళ్ళండి అని ఆక్రోశించాను. ఇటువంటి అకృత్యాలు, అరాచకాలు ఒకవైపు ఐతే, స్ర్రీ స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రశ్నిస్తున్న ʹఅయ్యప్ప సన్నిధానంʹ గురించి స్పందించాను. మహిళలు ఆలయ ప్రవేశం చేయడానికి నిరాకరించే దురాగతాన్ని వ్యతిరేకిస్తూ "హే ధర్మశాస్త/ ఆమె మరణం అంచున వ్రేలాడుతున్న సరే/ చిరునవ్వుతో ఈ సృష్టికి జీవం తొడుగుతోంది కదా/ ఆమెనే మైల పడ్డావని అని అనడం ఏమి ధర్మమో చెప్పూ??" అంటూ "ఏదీ/ మైలపడిన దేహమొకటి నా కంటి చూపెట్టు/ పుట్టుకనే ఉమ్మనీటిలోంచి కదయ్యా" అంటూ ప్రశ్నించాను. స్త్రీని ʹమైలʹ పేరుతో దూరంగా ఉంచడం, వెలివేయడం లాంటి చర్యలను, ఆ మానసిక స్థితిని నేను ఈ కవిత ద్వారా ఖండించాను. చివరగా ʹఇప్పుడొక పాట కావాలిʹ శీర్షికలో "వాడు పుట్టిన నేల మీద/ రెండడుగుల జాగ లేని వాన్ని/ ఏ గీతం పాడుమంటావు?/ పొలం దున్ని, విత్తులు జల్లి/ పంట పండించిన నోటిలో/ నాలుగు మెతుకులు కూడా కరువైన వాన్ని/ ఏ గీతం పాడుమంటావు?" అంటూ "సరే/ ఇప్పుడు నువ్వన్నట్లు ఓ పాట పాడాలే/ అది కన్నీళ్లను తుడిచి గాయాలను చెరిపి/ గుండె గుండెల్లో మమతల్ని నింపి/ గుడిసె గుడిసెల్లో వెలుగుల్ని పూయించే/ ఓ కొత్త పాట కావాలి" అని అన్నాను.. నిజానికి ఇప్పుడొక కొత్త పాట ఎందుకు కావాలి?? అని ప్రశ్నించుకున్నప్పుడు ఈ శీర్షికతో ముడిపడి ఉన్న అర్థాలను వెతుక్కోవాలి. ఈ పుస్తకానికి ముందుమాటలో ఎన్. వేణుగోపాల్ గారు చెప్పినట్లు ఈ శీర్షికకు బహుళార్థక సూచనలున్నాయి. ఇప్పుడొకపాట కావాలంటే ఇప్పుడొక జీవితం కావాలి, ఇప్పుడొక మార్పు కావాలి, ఇప్పుడొక కొత్త ఆలోచన రావాలి, ఇప్పుడొక కొత్త గొంతుక పుట్టాలి...తద్వారా ఒక నూతన, నవ సమాజం నిర్మింపబడాలన్న ఒక ఆశావాద దృక్పథంతో నా కవితా సంపుటికి ఆ పేరును సూచించుకున్నాను. అందుకే ʹరేపటి కోసంʹ లో "ఇప్పుడొక పాట కావాలి/ భుజమ్మీద తుపాకి మొనలోంచి/ దొరల గుండెల్లో సూటిగా దూసుకెళ్లిన/ తూటాలాంటి సాయిధ పాటొకటి కావాలి" అంటూ, ఆ పాట ఎలా ఉండాలో ఒక స్పష్టతనిస్తూ, నినదిస్తూ ముగించాను.

No. of visitors : 863
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •