జూన్ 19, ఆదివారం, తెల్లవారుజామున మహరాష్ట్ర, గడ్చిరోలి జిల్లాలోని ఆహిరి తాలూక కోలపెల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఎన్కౌంటర్ జరిగిందని, అందులో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారని, వారిలో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు చార్లెస్ అలియాస్ శోభన్ ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. అదేరోజు రాత్రి పోలీసులు శోభన్ గ్రామమైన రొంపెల్లి వచ్చి అతని కుటుంబ సభ్యులను బలవంతంగా తమ వెంటనే తీసుకువెళ్లి, అతని మృతదేహాన్ని వాళ్లు గుర్తించిన తరువాత తామే తీసుకువచ్చి, గ్రామంలో ప్రవేశించకముందే 20వ తేది రాత్రి 11.35 సమయంలో ఊరి బయట పెద్ద పోలీసు బందోబస్తుతో దహనం చేశారు. జూన్ 18న ఛత్తీస్‌గఢ్, సుకుమా జిల్లా గోన్పాడ్లో మడావి హిడ్మెపై లైంగిక అత్యాచారం, హత్యలపై విచారించడానికి వెళ్లిన పౌరహక్కుల సంఘం బాధ్యులు సోమవారం కోలపెల్లి ప్రాంతానికి చేరుకునేవరకే అక్కడ సంఘటనా స్థలం తప్ప ఏమీ మిగలలేదు. అంతకుముందే మూడు మృతదేహాలు చిమ్మిన రక్తం తడి మాత్రం ఇంకా ఆరలేదు. ఘటనా స్థలం పరస్పరం కాల్పులు జరుపుకునే అనువైన స్థలంగా కూడ లేదు.
జూన్ 17, 18 తేదీల్లో ఆ దారిలో మావోయిస్టు దళం వస్తుందనే పక్కా సమాచారంతో మహారాష్ట్ర కమాండో 60 అర్ధసైనిక బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ 300 వందల దాకా అక్కడ దారికాచారు. అది కోలపెల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో కమలాపురంకు వెళ్లే దారి. ఈ కమలాపురమే 1985లో రైతు కూలి సంఘం మహాసభలు తలపెట్టి పోలీసులు భగ్నం చేసి ʹకమలాపురానికి దారులు ఎన్ని?ʹ అని చరిత్రాత్మకంగా ప్రసిద్ధికెక్కిన స్థలం. ఇది ప్రాణహిత ఒడ్డున ఉన్న స్థలం.
అంత నమ్మకంగా అక్కడ తెలంగాణ గ్రేహౌండ్స్ ఎందుకు దారికాచారంటే అక్కడికి చార్లెస్ (ఆత్రం శోభన్) నాయకత్వంలోని దళం వస్తందని వాళ్లకు తెలుసు. ఈ దళంలో చేరుతాననే కబురుతో ఒక కోవర్టును తెలంగాణ ఇంటిలిజెన్స్ పార్టీ సానుభూతిపరుల్లో ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం మార్చ్ నెల నుంచి ఈ ప్రయత్నం మొదలై జూన్ 17 నాటికి వాళ్లు తమ పథకాన్ని అమలు చేయగలిగారు. ఈ కోవర్టు పార్టీకి మూడు నాలుగు సార్లు కబురు పెట్టి ఉన్నాడు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు జిల్లా గనుక పార్టీలోకి రిక్రూట్మెంట్కు అనుకూలమైన వనరు అని నమ్మించగలిగాడు. ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న చార్లెస్ (ఆత్రం శోభన్), ముకేష్ (సామ్రు), దినేష్ (కుంజం లక్ష్మణ్)లను నమ్మించి ప్రాణహిత నది దాకా వీళ్లని రప్పించగలిగాడు. వీళ్లను ఆ నది ఒడ్డున పెట్టి మరికొందరిని రిక్రూట్మెంట్కు తీసుకువస్తానని చెప్పి, పోలీసులను తీసుకువచ్చాడు. ఆ విధంగా చక్కగా శత్రువు ఉచ్చులోకి వచ్చారు. తెలంగాణ గ్రేహౌండ్స్, మహారాష్ట్ర సి-60 కమాండోస్‌తో కలిసి చేసిన ఆంబూష్ చక్రబంధంలోకి వచ్చి చిక్కుకున్నారు. వెంటనే వాళ్లు వీళ్ల మీద పడి పట్టుకున్నారు. 17 సాయంత్రం పట్టుకొని, 18 సాయంత్రం వరకూ చిత్రహింసలు పెట్టి 18 రాత్రి చంపివేశారు. ఈ చిత్రహింసల క్రమంలో ఈ ముగ్గురే కాక దళం ఉనికి తెలిసి, ఈ ఇరవై నాలుగు గంటల్లో అయిదు వేల మంది అర్ధసైనిక బలగాలను సమకూర్చుకుని రెండు రాష్ట్రాల (డికె, తెలంగాణ) పార్టీలు పనిచేసే మూడు డివిజన్ల ప్రాంతాలను చుట్టుముట్టి అక్షరాల గ్రీన్‌హంట్ ఆపరేషన్ చేసి 19వ తేది సాయంత్రం రెండవ దాడి చేశారు. వాస్తవానికి ఈ 19వ తేది దాడినే పోలీసులు ఎన్‌కౌంటర్‌గా ప్రకటించారు. 17వ తేదిన వెళ్లిన ముగ్గురు సహచరులు రాకపోవడంతో ఈ దాడిని ఊహించిన ఇతర దళ సభ్యులు తప్పించుకోగలిగారు. ఆరు రోజుల పాటు ఈ చక్రబంధం కొనసాగింది. ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రమాదం పూర్తిగా తప్పిపోయిందనడానికి లేదు.
2015, జూన్ 12న బీజాపూర్ జిల్లా లంకపెల్లి అడవుల్లో ఆదివాసి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్య గురించి చర్చించి తిరిగి వస్తున్న కెకెడబ్ల్యూ దళం కమల, సోనీ, వివేక్‌లను ఎట్లా దారికాచి చంపేశారో సరిగ్గా ఏడాది గడిచిన తరువాత ఇటువైపు ఆదిలాబాద్ అడవుల్లో కూడా గ్రేహౌండ్స్ అదే పని చేశారు. రెండు చోట్లా తెలంగాణ గ్రేహౌండ్స్ పాల్గొన్నారు. ఏడాది క్రితం అక్కడ కేంద్ర మిలిటరీ బలగాలు, ఏపి గ్రేహౌండ్స్ తో పాటు తెలంగాణ గ్రేహౌండ్స్ ఉన్నట్లుగా ఇక్కడ మహారాష్ట్ర సి60 కమాండోలతోపాటు తెలంగాణ గ్రేహౌండ్స్ ఉన్నారు. ఈ కమిటీ వెళ్లేటప్పటికి 24 గంటలు గడిచినా అక్కడికి విచారణకు రావాల్సిన ఏ రెవెన్యూ అధికారి రాలేదు. 24 గంటల తరువాత వెళ్లిన పౌరహక్కుల సంఘం బాధ్యులకు సంఘటనా స్థలంలో బుల్లెట్ క్యాపులు దొరికాయి.
ఈ ఏకపక్ష దాడుల్లో అమరులైన మావోయిస్టు నాయకుల మృతదేహాలను భద్రపరచడానికి, పోస్ట్ మార్టమ్ నిర్వహించడానికి అనుకూలమైన ఏ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించకుండా, ఒక శోభన్ మృతదేహాన్ని మాత్రమే కుటుంబ సభ్యులతో గుర్తింప చేసి, బలవంతంగా దహనం చేయించారు గాని, మిగతా ఇద్దరి మృతదేహాలను వాళ్ల కుటుంబాలకు అప్పగించిందీ లేనిదీ ఇప్పటికి తెలియదు. మృతదేహాలను కనీసం కాగజ్‌నగర్ వంటి ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచి, వారి ఫొటోలను కనీసం రెండు జాతీయ స్థాయి దినపత్రికలలో ప్రచురించి, కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియోలో చిత్రిస్తూ, ఒక మానవ హక్కుల న్యాయమూర్తి పర్యవేక్షణలో, కనీసం ఇద్దరు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ల చేత పోస్ట్‌మార్టమ్ చేయించాల్సి ఉండగా, ఈ నియమాలు ఏవీ పాటించకుండా పోలీసులు తాము చేసిన హత్యను కప్పిపుచ్చుకోవడానికి శోభన్ మృతదేహాన్ని కాల్చివేశారు. ఇవాళనే ఇందులోని వాస్తవాలు బయటికి రాకపోయినా, ఎన్నటికైనా ఈ హత్యానేరం బయటపడకుండా పోదు. షేక్స్‌స్పియర్ నాటకం ʹమాక్బెత్ʹలో లేడీ మాక్బెత్ చెప్పినట్లుగా చేతులకు అంటిన నెత్తురు కడుక్కుంటే పోయేది కాదు. శవాన్ని దహనం చేసినంత మాత్రాన బూడిద అయిపోయిన అమరుని మృతదేహం అయినా సత్యం ప్రకటించకుండా ఉండదు.
నిజ నిర్ధారణ పూర్తిచేసి తెలంగాణ సిఎల్సి నాయకత్వం సోమవారం రాత్రి కాగజ్‌నగర్‌లో ఉండగానే, ప్రకాశం జిల్లా సూర్యం స్థూపావిష్కరణకు వెళ్లిన అమరుల బంధుమిత్రుల సంఘం నేరుగా ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని రొంపెల్లికి ప్రయాణంలో ఉండగానే, హైదరాబాద్ నుంచి నేను రొంపెల్లికి బయలుదేరుతుండగానే సోమవారం అర్ధరాత్రి పోలీసులు రొంపెల్లి గ్రామం బయట ఒక హత్య చేసినంత కుట్రపూరిత రహస్యంతో విప్లవకారుడి మృతదేహాన్ని హడావుడిగా కాల్చివేశారు. ఇంతకన్నా తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని పిరికితనానికి మరొక దాఖలా ఉండదు.
చంద్రబాబు, ఎచ్‌జె దొర నెత్తుటి పాలన కాలంలో బెంగుళూరులో పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ నాయకులు ముగ్గురు - శ్యాం, మహేష్, మురళిలను - అరెస్టు చేసి కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవులకు తీసుకువచ్చి లక్ష్మిరాజ్యం అనే పశువుల కాపరితోపాటు ఎన్కౌంటర్ పేరుతో చంపేసిన తరువాత 1999 డిసెంబర్ 3న మురళీ అలియాస్ శీలం నరేష్ మృతదేహాన్ని కూడా ఇట్లాగే పోలీసులు తమ వ్యాన్‌లో బలవంతంగా అతని కుటుంబ సభ్యులతో పాటు పెద్దపెల్లి ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లి ఆయన స్వగ్రామమైన జగిత్యాల చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి హడావుడిగా దహనం చేశారు. పౌరహక్కుల నాయకత్వం అక్కడికి వెళ్లేసరికి అంతా అయిపోయింది.
తెలంగాణ రాష్ట్రమూ, ప్రభుత్వమూ ఏర్పడ్డ రెండేళ్ల కాలం నుంచి కూడ విస్తమీతంగానూ, ఉధృతంగానూ ఈ ఆదిలాబాద్ అడవుల్లోనే వందల సంఖ్యలో గ్రేహౌండ్స్ దళాలు ఈ శోభన్ వంటి జిల్లా మావోయిస్టు నాయకత్వం కోసమే గాలింపు చర్యలు నిర్వహిస్తూ వస్తున్నది. జిల్లా మావోయిస్టు దళాల కదలిక ఉన్నదని, పలాని చోట వారు కనిపించారని, ఇటువంటి సమాచారంతో ఈ రెండేళ్లలో కనీసం నాలుగుసార్లయినా స్వల్ప వ్యవధుల్లో కాల్పులు జరిపారు. ప్రజలు గాయపడ్డ సందర్భాలూ, ప్రజలు భయభీతావహం అయిన సందర్భాలూ, దళాలు తప్పించుకుపోయిన సందర్భాలూ కూడ ఉన్నాయి. అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపిన చోట పోలీసులు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
గోదావరి తీరంలో ఇటు ఆదిలాబాద్ నుంచి అటు ఖమ్మం దాకా తెలంగాణ ప్రభుత్వం ఒక చలన గ్రేహౌండ్స్ కంచె వంటిది ఏర్పాటు చేసి, చేసిన గాలింపుల్లో, దాడుల్లో భాగమే ఖమ్మం జిల్లా చెర్ల మండలంలో ఒక ఆదివాసి నర్సింగ్‌రావు అమరత్వం. మోటర్ సైకిల్‌పై ముగ్గురు పోతూ ఉంటే పోలీసులు పట్టుకుంటారనే భయంతో, ఆగకపోతే జరిపిన కాల్పుల్లో నర్సింగ్‌రావు చనిపోయాడు, దాన్ని పోలీసులు ఎన్కౌంటర్లో మావోయిస్టు మరణంగా చిత్రించారు.
ఇంక వరంగల్ జిల్లా మొద్దుగుట్ట అడవుల్లో శృతి, సాగర్లను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపిన ఉదంతాన్ని ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం. తెలంగాణకు 30 కి.మీ.ల దూరంలోనే బొట్టెంతోగులో ఇదే తెలంగాణ గ్రేహౌండ్స్ జరిపిన దాడిలో 9 మంది అమరులు కాగా, అందులో ఐదుగురు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు, నలుగురు తెలంగాణకు చెందిన వాళ్లు. దళిత ముస్లిం, ఆదివాసీల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు. గొట్టెముక్కల రమేష్ (గుంటూరు), యూసుఫ్ బీ (మెదక్), అనిత, సృజన (వరంగల్) తెలుగు సమాజానికి తెలిసిన యువ విప్లవకారులు.
1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది. ఇదే గడ్చిరోలిలో 1980 నవంబర్ 2న పెద్ది శంకర్ అమరత్వంతోనే దండకారణ్య విప్లవోద్యమానికి నెత్తుటి రహదారులు పడినవి. ఈ జిల్లాలోని మంగి దళం రెండు దశాబ్దాలుగా ప్రజల్లో పనిచేసే విధానానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజా ఉద్యమ నిర్మాణానికి, విప్లవానికి ఒక నమూనాగా ఉన్నది. గత పదహారు సంవత్సరాలుగా ఆదివాసి యువకుడు చార్లెస్ అలియాస్ శోభన్ ఈ మంగి దళానికి పర్యాయపదంగా ఉన్నాడు. మంగి దళం కోసం, శోభన్ కోసం ఈ పదహారేళ్లు గాను పోలీసులు చేస్తున్న గాలింపు చర్యలకు, సృష్టిస్తున్న కట్టుకథలకు లెక్కలేదు. గ్రామ్స్కీ చెప్పిన ఆర్గానిక్ (నిర్మాణం నుంచి వచ్చిన) నాయకత్వానికి చార్లెస్ ఒక ఉదాహరణ. ఈ ఎన్కౌంటర్ కన్న ముందు లొంగిపోవడానికి ఆయన ఫీలర్లు పంపిస్తున్నాడని, పోలీసు అధికారులకు సమాచారం ఉందని ఒక ఇంగ్లిష్ పత్రిక రాసిన నీచమైన ప్రచారానికి భిన్నంగా ఆయన త్వరలో పార్టీ జిల్లా కార్యదర్శి కాబోతున్నాడనే వాస్తవాన్ని విప్లవ శ్రేణులు చెప్పుకుంటున్నవి.
గుండేటి శంకర్ కాలం నుంచి కూడ ఎందరో తెలంగాణ విప్లవోద్యమ నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ నాయకత్వ విశ్వాసాన్ని చూరగొంటూ ఆదివాసుల్లో విప్లవ పోరాట చేవను పెంచుతూ చార్లెస్ ఇక్కడ నిర్మాణం చేసిన విప్లవోద్యమం ఈ నేలలో ఎంతో బలంగా వేళ్లూనుకున్నది. ఇటువంటి ఒక బూటకపు ఎన్కౌంటర్లోనే ఖమ్మం జిల్లాలోనే అమరుడైన గణేష్, ఛత్తీస్‌గడ్‌లో ఒక దళ సభ్యుడిగా చేరి, దండకారణ్య మావోయిస్టు పార్టీ ప్రవక్త (అధికార ప్రతినిధి) స్థాయికి ఎదిగిన విజయ మాడ్కం వంటి ఆదివాసీ విప్లవకారుల వరుసలో చేరతాడు శోభన్.
సుకుమా జిల్లా కలెక్టర్‌ను మావోయిస్టులు బందీలుగా తీసుకున్నప్పుడు మధ్యవర్తులుగా వెళ్లిన బిడి శర్మ, హరగోపాల్‌తో చర్చలకు వచ్చింది విజయ్ మాడ్కమే (ఇతని ధర్మాగ్రహం గురించి మెత్తని చిరునవ్వు గురించి హరగోపాల్ చాలా వినమ్రంగా గుర్తు చేసుకున్నాడు). ఒక ట్రాక్టర్ నడిపే క్రమంలో ప్రమాదంలో ఆయన అమరుడయ్యాడు. శోభన్ మృతదేహాన్ని పత్రికల్లో ఫొటో చూసినవాళ్లు బసగూడ మారణకాండ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
2012, జూన్ 27-28 తేదీల్లో బసగూడ, కొత్తగూడ పరిసర మూడు గ్రామాల్లో విత్తనాల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా సిఆర్పిఎఫ్ బలగాలు సభ మీద కాల్పులు జరిపితే అక్కడికక్కడ పదిహేడు మంది మొత్తం మీద 21 మంది పిల్లలు, స్త్రీలతో పాటు ఆదివాసులు అమరులయ్యారు. ఇది దేశాన్నే కుదిపివేసి, ఢిల్లీ జంతర్ మంతర్ దాక కూడా ప్రజలు ఉద్యమించిన సమీప గతం. ఆ సందర్భంలో నిజనిర్ధారణకు వెళ్లిన సిడిఆర్‌ఒ 32 మంది బృందాన్ని కుంభవృష్టి కురిసిన చిత్తడి నేలలో ట్రాక్టర్ మీద తీసుకువెళ్లిన యువకుడు ఇతడేనా అని ఆ నిజనిర్ధారణలో వెళ్లిన వాళ్లు మీడియాలో, సోషల్ మీడియాలో శోభన్ ఫొటో చూసి ఆశ్చర్యపోతున్నారు. (నిజనిర్ధారణ నుంచి తిరిగి వచ్చినాక ఇతడు ట్రాక్టర్ నడుపుతూ తనతో ఆదివాసీ జీవితాలు, పోరాటాల గురించి ఎంతో ఉత్సాహంతో చెప్పిన అంశాలను ఆ ట్రాక్టర్ బానెట్ మీద కూర్చుని ఎంతో కుతూహలంగా విన్న బొజ్జా తారకం గారి కళ్లలోని తడి వెలుగును చూసి తీరవలసిందే.)
ఇటువంటి ఎన్నో క్లిష్ట సందర్భాల్లో, సమస్యల్లో యుద్ధాల్లో అతడు ఉన్నాడు. ప్రజల్లో, ప్రజా పోరాటాల్లో అతడు ఉన్నాడు. ʹఎన్నియో యుద్ధములలో ఆరియు తేరినʹ యోధుడు అతడు. బహుశా శిష్ట చరిత్రలకు ఎక్కని మట్టి నుంచి వచ్చిన నాయకుడు. మూలవాసుల నుంచి వచ్చిన విప్లవకారుడు.
ఈ నేలలో కష్టపడి, పోరాడి, తమ చెమట, నెత్తురు, కురిసే ఆదివాసీ, దళిత అట్టడుగు ప్రజానీకం ఏ కన్నీళ్లు ఈ నేల మీద రాలుస్తుంటారో వాళ్లు అతన్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ నేల మీద పంటలు పండిస్తూ, నిర్మాణాలు చేస్తూ సంపదనూ, సౌందర్యాన్నీ సృష్టిస్తున్న శ్రమజీవులు అతన్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ నేల మీద పుట్టి, తమతోపాటు ఎదిగి, తమతో కష్టపడి పోరాడి, తమకోసం ఒక పీడన, దోపిడి లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి అమరుడైన ఆయనను, ఆయనతో పాటు అమరుడైన మరో ఇద్దరు ఆదివాసి విప్లవకారులను అటువంటి ఎందరో జ్ఞాత, అజ్ఞాత విప్లవకారులను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. చరిత్ర నిర్మాణం చేసిన ప్రజలే చరిత్ర రచించే కాలం వచ్చిననాడు తప్పకుండా రచింపబడేవి చార్లెస్ అలియాస్ శోభన్ల వంటి వాళ్ల చరిత్రలే.
Type in English and Press Space to Convert in Telugu |
సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్లు చేసిన లైంగిక అత్యాచారం, హ........ |
చరిత్ర - చర్చభగత్సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ... |
ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణంఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్ను స్మరించుకున్న దేశద్రోహి,... |
దండకారణ్య ఆదివాసీల స్వప్నాన్ని కాపాడుకుందాం : వరవరరావు18 జూలై 2016, అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ సభ సందర్భంగా వరవరరావు ఉపన్యాసం...... |
నోటీసుకు జవాబుగా చాటింపునిన్నటి దాకా ఊరు ఉంది వాడ ఉంది/
వాడ అంటే వెలివాడనే/
అంటరాని వాళ్లు ఉండేవాడ/
అంటరాని తనం పాటించే బ్రాహ్మణ్యం ఉండేది/
ఇప్పుడది ఇంతింతై ... |
రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?అరుంధతీ రాయ్ మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల...... |
రచయితలేం చేయగలరు?1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్ 370 మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ....... |
వాగ్ధాటి కాశీపతి1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండపల్లి....
... |
Save the life of the Indian writer and activist Varavara Rao!His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals... |
రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్ (అజిత్)అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్ ధబాడే..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |