ʹఈ అన్యాయం కలకాలం కొనసాగదుʹ

| సంభాషణ

ʹఈ అన్యాయం కలకాలం కొనసాగదుʹ

- అరుంధతీ రాయ్ | 02.08.2020 11:26:14pm

జైల్లో వున్న తన స్నేహితుడు జి.యన్.సాయిబాబాకు అరుంధతీ రాయ్ రాసిన ఉత్తరం

జులై 17, 2020

ప్రొ॥ జి.యన్.సాయిబాబా
అండాసెల్
నాగపూర్ సెంట్రల్ జైల్
నాగపూర్, మహారాష్ట్ర,

ప్రియమైన సాయి,

నిన్ను నిరాశపరుస్తున్నందుకు క్షమాపణలు. ఈ ఉత్తరం రాస్తున్నది అంజుమ్ కాదు. నేను, అరుంధతిని రాస్తున్నాను. నువ్వు మూడు సంవత్సరాల క్రితం ఆమెకు లేఖ రాశావు. ఆమె నుండి సమాధానం తప్పక ఆశించాల్సిందే. కాని, నేనేం చెప్పాలి - ఆవిడ సమయ స్పృహ నీ, నా స్పృహకంటే పూర్తిగా భిన్నమైనది. వాట్సాప్, ట్విట్టర్ల వేగవంతమైన ప్రపంచాన్ని అలా వుండనివ్వు. ఒక ఉత్తరానికి జవాబు రాయడానికి మూడు సంవత్సరాల కాలం తీసుకోవడం గురించి ఆవిడ ఏమీ ఆలోచించదు. ప్రస్తుతం జన్నత్ గెస్ట్ హౌస్ లో తన రూమ్ లో తలుపులు బిగించుకొని తన సమయమంతా పాటలు పాడుతోంది.

చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే ఇన్ని సంవత్సరాల తరవాత తను తిరిగి పాడటం ప్రారంభించడం. ఆమె గది తలుపు దగ్గరగా నడుస్తూ ఆమె పాడడాన్ని వింటూ వుంటే, ఆమె సజీవంగా వుండడం నాకు ఆనందాన్ని యిస్తోంది. ప్రతిసారీ తను ʹనేనెలా వున్నానో నువ్వు తప్ప ఎవరు అడుగుతారుʹ అనే పాట పాడుతోంది. అది నా హృదయాన్ని గాయపరుస్తుంది. నీ గురించి ఆలోచింపచేస్తుంది. ఆ పాట పాడుతున్నప్పుడు ఆమెకూడా నీ గురించి ఆలోచిస్తూ వుంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక ఆమె నీకు తిరిగి జవాబు రాయకపోయినా, ఆమె తరచుగా నీ కోసం పాడుతోందని నీవు తెలుసుకోవాలి. నువ్వు కష్టపడి దృష్టి కేంద్రీకరిస్తే బహుశా ఆమె పాట వినగలవు.

నేను మన సమయ స్పృహ గురించి రాసినప్పుడు చాలా తేలిగ్గా ʹనీ, నాʹ అని అనగలగడం తప్పే. ఎందుకంటే దుర్భరమైన అండా సెల్ లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న నీ సమయ స్పృహ నా కంటే అంజుమ్ సమయ స్పృహకు దగ్గరగా వుంటుంది. లేదా బహుశా ఆమె స్పృహకంటే కూడా పూర్తిగా భిన్నమైనది కావచ్చు. ఇంగ్లీషు భాషలోని ʹజైల్లో గడపడంʹ (doing time) అనే పదబంధం ప్రజలు సాధారణంగా వాడేదానికంటే గాఢమైన అర్థాన్ని సూచిస్తుంది. ఏదేమైనా ఆలోచనా రహితమైన నా వ్యాఖ్యకు క్షమాపణ కోరుతున్నాను. అంజుమ్ కూడా తనదైన పద్ధతిలో, తన సమాధిలో - Butcherʹs luck1 జీవితంలో- యావజ్జీవశిక్షను గడుపుతోంది. అయితే ఆమె కటకటాల వెనక జీవించడం లేదు. ఆమె వద్ద మానవజైలర్ ఎవరూ లేరు. Djinns2, జకీర్ మియా Zakir Mian3 గురించిన ఆమె జ్ఞాపకాలే ఆమె జైలర్లు.

ఖాకీల కాల్పనికత :

వసంతద్వారా అన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి నువ్వు ఎలా వున్నావు అని అడగడం లేదు. వివరంగా వున్న వైద్య నివేదికను చూశాను. వాళ్ళు నీకు బెయిల్ గానీ, కనీసం పెరోల్ గానీ మంజూరు చేయకపోవడం అనూహ్యంగా వుంది. నిజం చెప్పాలంటే నేను నీ గురించి ఆలోచించని ఒక్కరోజు కూడా లేదు. వాళ్ళింకా నీకు వచ్చే పత్రికలు సెన్సార్ చేస్తూనే వున్నారా? పుస్తకాలు అందకుండా అడ్డుకుంటూనే వున్నారా? నీ సెల్ లో నీ రోజువారి కాలకృత్యాల నిర్వహణలో నీకు సహాయం చేసే సహ ఖైదీలు వంతులవారీగా పనిచేస్తున్నారా? వాళ్ళు స్నేహపూర్వకంగానే వున్నారా? నీ చక్రాల కుర్చీ ఎలా వుంది? ఒక ప్రమాదకరమైన నేరస్థుడిలాగా నిన్ను భావించి, నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి అరెస్టు చేసినపుడు ఆ కుర్చీ పాడైందని నాకు తెలుసు. (వాళ్ళ కష్టడీలో వుండగా నువ్వు వాళ్ళ తుపాకీ లాక్కొని, మరో చేత్తో నీ చక్రాల కుర్చీ పట్టుకుని పారిపోతున్న సందర్భంలో, ʹఆత్మరక్షణʹ కోసం నిన్ను వికాస్ దుబేను చేసినట్టు ఎన్ కౌంటర్ చేయనందుకు మనం కృతజ్ఞులమై వుండాలి. సాహిత్యంలో ఒక నూతన ప్రక్రియ- ఖాకీ కాల్పనికత - తలెత్తిందని నువ్వు అనుకోవడం లేదా? సంవత్సరానికి ఒకసారి ఒక సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించడానికి తగినంత సాహిత్య సామగ్రి తయారుగా వుంది. ఈ కాల్పనిక సాహిత్యానికి పెద్ద మొత్తంలోనే బహుమతి వుంటుంది. తటస్థంగా వుండే మన న్యాయస్థానాల్లోని మరింత తటస్థంగా వుండే న్యాయమూర్తులలో కొందరు ఇక్కడ కూడా తీర్పరులుగా అద్భుతమైన సేవలు అందించగలరు.)

నువ్వు మా యింటికి వచ్చిన రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు నా యింటి ఎదురుగా వుంటే టాక్సీ డ్రైవర్లు మెట్ల మీద గుండా నీ చక్రాల కుర్చీతో సహా నువ్వు మా యింటికి రావడానికి సహాయపడడం కూడా గుర్తుంది. ఇప్పటి రోజుల్లో మా యింటికి వచ్చే మెట్ల మీద ప్రతి మెట్టుకీ ఒక వీధి కుక్క వుంటుంది. చద్దా సాహెబ్ (తండ్రి), బంజారిన్ (జిప్సీ తల్లి), వాళ్ల కుక్కపిల్లలైన లీలా, శీల. అవి కోవిడ్ లాక్ డౌన్ కాలంలో పుట్టాయి. నన్ను పెంచుకోవడానికి నిర్ణయించుకున్నాయి. అయితే లాక్ డౌన్ ప్రకటించాక మన స్నేహితులైన టాక్సీ డ్రైవర్లు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి పనిలేదు. టాక్సీలన్నీ దుమ్మూ, ధూళీ పట్టివున్నాయి. మెల్లిమెల్లిగా వాటిల్లో చెట్లు మొలుస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాల రోడ్లమీద నుండి చిన్నవాళ్ళయిన ప్రజలు మాయమైపోయారు. అందరూ కాదు కాని చాలామంది, లక్షల్లో.

నువ్వు నా కోసం తయారుచేసిన పచ్చడి సీసాలన్నీ అలానే వున్నాయి. నువ్వు బయటికి వచ్చి నాతో కలసి భోజనం చేసేటప్పుడు వాటిని తీద్దామని నేను ఎదురు చూస్తున్నాను. అవి బాగా పక్వానికి వచ్చి వున్నాయి.

నీ వసంతను, మంజీరను అప్పుడప్పుడు మాత్రమే కలుస్తున్నాను. కలిసినపుడు మేం ముగ్గురం దు:ఖాన్ని కలబోసుకోవడం భరించలేనిదిగా వుండడమే దీనికి కారణం. అది కేవలం దు:ఖం మాత్రమే కాదు సుమా. అది కోపం, నిస్సహాయత కూడా. నాకు సంబంధించినంత వరకు అది నేను సిగ్గుపడేలా చేస్తుంది. నీ పరిస్థితి ఎంత అన్యాయంగా వుందో, హాస్యాస్పదమైన నేరారోపణతో తొంభైశాతం అంగవైకల్యం వున్న వ్యక్తిని జైల్లో నిర్బంధించడం ఎంత తీవ్రమైన, క్రూరమైన చర్యో, తగినంత మందిచేత గుర్తింపచేయలేక పోయినందుకు నాకు సిగ్గుగా వుంది. విచారణా క్రమాన్నే శిక్షా కాలంగా మార్చివేసే సంక్లిష్టమైన, చిక్కుముడులతో కూడుకున్న మన న్యాయవ్యవస్థ నీ విజ్ఞప్తుల్ని త్వరత్వరగా పట్టించుకునేలా చేయలేకపోయినందుకు నాకు అవమానంగా వుంది. అంతిమంగా సుప్రీమ్ కోర్టు నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తుందని నాకు గట్టి నమ్మకం వుంది. అయితే అది జరిగేటప్పటికి నువ్వూ, నీ వాళు , ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

నువ్వున్న జైల్ తో సహా దేశంలోని జైళ్ళు అన్నింటిని కోవిద్-19 చుట్టుముట్టి వేస్తుంటే, నువ్వున్న పరిస్థితుల్లో, యావజ్జీవ శిక్ష చాలా తేలిగ్గా మరణశిక్షగా మారుతోందని వాళ్ళకి తెలుసు. మన వుమ్మడి స్నేహితులు - విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తలు - ఎవరితో కలసి మనం మనసారా నవ్వుకొన్నామో, ఉ త్సాహభరితంగా గడిపామో, తీవ్రంగా వాదించుకున్నామో, వాళ్ళందరూ ఇప్పుడు జైళ్ళలో వున్నారు. వి.వి.ని గురించిన వార్త నీకు తెలుసో లేదో నాకు తెలియదు. (నేను వరవరరావు గురించి మాట్లాడుతున్నాను. వి.వి. అంటే ఈ జైలు అధికారులు ఇంకేదో కోడ్ అనుకుంటారేమో) అద్భుతమైన అలాంటి 81సం॥ల కవిని జైల్లో వుంచడమంటే ఒక అధునాతమైన స్మారక కట్టడాన్ని జైల్లో వుంచడమే. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయన పాడైపోయిన దుప్పట్ల మీద పడివున్నారని, ఎవరూ పట్టించుకోవడం లేదనీ, ఒంటరిగా వున్నారని, నడవలేకపోతున్నారని, ఆయన మాటలు అసంబద్దంగా వుంటున్నాయని ఆయన్ను చూసిన కుటుంబసభ్యులు అంటున్నారు. అసంబద్ధత! వరవరరావు! లక్షలాది మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించటం తప్ప మరేమీ ఆలోచించని వ్యక్తి. ఆంధ్ర, తెలంగాణాలలోనూ, దేశవ్యాప్తంగానూ లక్షలాది మందిలో నూతన భావాగ్నిని రగుల్కొల్పిన కవితలు రాసిన వ్యక్తిలో అసంబద్దత!

నీ జీవితం గురించి భయపడుతున్నట్లే వి.వి. జీవితం గురించి కూడా భయపడుతున్నాను. భీమా కోరెగావ్ కేసులో అరెస్టు కాబడ్డ ఇతరులు కూడా - ʹభీమా కోరెగావ్ పదకొండు మందిʹ - అంత ఆరోగ్యంగా లేరు. వాళ్ళకు కూడా కోవిద్-19 సోకే అవకాశం ఎక్కువగా వుంది. వి.వి.ని పట్టించుకుంటూ జైల్లో వున్న వెర్నన్ కు ఆ ప్రమాదం మరింత ఎక్కువగా వుంది. గౌతమ్ నవాల్కా, ఆనంద్ తేల్ తుంబ్డేలు కూడా ఆ జైలులోనే వున్నారు. కాని మళ్ళీ మళ్ళీ న్యాయస్థానాలు బెయిల్ నిరాకరిస్తూనే వున్నాయి. కోవిద్-19 పాజిటివ్ తేలిన అఖిల్ గొగోయ్ గౌహతి జైలులో వున్నాడు. ఎంతటి కూరమైన, నీచమైన మనస్తత్వం కలిగిన, మేధోపరంగా మరుగుజ్జులైన పాలకులు మనకు దొరికారు. ఇంతటి విశాలమైన దేశంలో తన స్వంత రచయితలను, మేధావులను చూసి భయపడే ప్రభుత్వం వుండడం ఎంతటి విషాదం.

పరిస్థితుల్లో మార్పు రాబోతుందని కొద్ది నెలల క్రితం నిజంగా అనిపించింది. పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌరసత్వ రిజిష్టర్ కి వ్యతిరేకంగా కోట్లాదిమంది వీధుల్లోకి వచ్చారు. ప్రత్యేకించి విద్యార్థులు. అది గొప్ప అనుభవం. వాతావరణం అంతా సంగీతం, కవిత్వం, ఆప్యాయత అలుముకున్నాయి. విప్లవం కాకపోయినా చివరకు కనీసం ఒక తిరుగుబాటైనా వచ్చిందన్న సంతోషం. నువ్వు దాన్ని ప్రేమించి వుండేవాడివి.

కాని అది విచారకరంగా ముగిసింది. ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో యాభైమూడు మంది ప్రజల ఊచకోతకు, పూర్తిగా శాంతియుతంగా వున్న సిఏఏ వ్యతిరేక ఆందోళన కారులమీద నిందలు మోపారు. శ్రామిక ప్రజలు నివసించే ప్రాంతాలగుండా ప్రభుత్వం కొమ్ముకాసే సాయుధమూకలు పోలీసుల ప్రోత్సాహంతో ఇళ్ళు తగలబెట్టటానికి, దౌర్జన్యానికి, హత్యలకు పూనుకున్నట్లుగా చూపిస్తున్న వీడియోలను బట్టి అది పధకం ప్రకారం జరిగిన దాడేనని తెలుస్తోంది. కొద్దికాలంగా వుద్రిక్తతలు ఆ ప్రాంతంలో పెరుగుతున్నాయి. అందుచేతనే సిద్ధంగా వున్న స్థానిక ప్రజలు ఆ దాడులను తిప్పికొట్టగలిగారు.
అయితే ఎప్పటిలాగానే బాధితుల్నే నిందితులుగా చూపించారు. కోవిడ్ లాక్ డౌన్ ముసుగులో ఢిల్లీలోనూ, ఉత్తరప్రదేశ్ లోనూ అనేకమంది విద్యార్థులతో సహా వందలాదిమంది యువకులను అరెస్టు చేశారు. వాళ్ళల్లో అత్యధికులు ముస్లింలు. తాము నిర్బంధించిన ఈ యువకుల చేత బలవంతంగా సాక్ష్యాలు ఇప్పించి, సీనియర్ కార్యకర్తలను కేసుల్లో ఇరికించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని పుకార్లు చెలరేగుతున్నాయి. ఆ సీనియర్ కార్యకర్తలపై పోలీసుల వద్ద నిజమైన సాక్ష్యాలు లేవు.

కాల్పనిక రచయితలు వివరణాత్మకమైన ఒక నూతన కథను అల్లే ప్రయత్నంలో నిమగ్నమై వున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఢిల్లీలో వుండగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడంకోసం అక్కడ నరమేధానికి ఒక పెద్ద కుట్ర తయారయిందన్నది వాళ్ళ కథనం. పోలీసులు చెప్తున్న తేదీలు చూస్తే, ట్రంప్ భారతదేశ పర్యటన ఖాయం కావడానికి ముందే ఆ ప్రణాళికలు తయారయినట్టు తెలుస్తోంది. సిఐఏ వ్యతిరేక ఆందోళనకారులు వైట్ హౌస్ లో అంత లోతుగా పాతుకుపోయారన్నమాట! అది ఎలాంటి కుట్ర? ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం కోసం నిరసనకారులు తమనితామే చంపేసుకునే కుట్ర!
ప్రతిదీ తలకిందులుగా వుంది. హత్యకు గురికావడం ఒక నేరం. వాళ్ళు నీ శవానికి వ్యతిరేకంగా కేసు నమోదు చేస్తారు. నీ భూతాన్ని పోలీస్ స్టేషన్ కు రమ్మని నోటీస్ ఇస్తారు. నేనిది రాస్తున్న సమయంలో బీహార్‌లోని అరారియా అనే గ్రామంలో జరిగిన ఒక సంఘటన వార్త అందింది. గూండాల చేతిలో అత్యాచారానికి గురై, పోలీస్ కంప్లయిట్ ఇచ్చిన ఒక మహిళమీద అక్కడ కేసు నమోదు అయింది. ఆమెతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన మహిళా కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.

ఆందోళన కలిగించే విషయాలన్నీ తప్పనిసరిగా రక్తపాతంతో, ఊచకోతతో, సామూహిక హత్యాకాండతో, సామూహిక నిర్బంధంతో సంబంధం వున్నవే కానక్కరలేదు. కొద్ది రోజుల క్రితం ఒక దౌర్జన్యకర గుంపు అలహాబాదులో ఒక వరుసలో వున్న కొన్ని ఇళ్ళకు బలవంతంగా కాషాయ రంగు పూసింది. ఆ ఇళ్ళ యజమానుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆ గోడలమీద పెద్ద పెద్ద హిందూ దేవతల బొమ్మలు వేశారు. ఏ కారణం చేతనైనా గానీ నా రక్తం గడ్డకట్టుకుపోయింది.

ఈ మార్గంలో భారతదేశం ఇంకా ఎంత ముందుకు ప్రయాణించాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోయిన ప్రపంచాన్ని చూస్తావు.
కోవిడ్-19, ఆలోచనా రహితంగా అప్పటికప్పుడు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం విధ్వంసాన్ని సృష్టించాయి. కేవలం పేదలకే కాదు, మధ్యతరగతికి కూడా. అందులో హిందుత్వ దళాలు కూడా వున్నాయి. 138కోట్ల ప్రజలకు కేవలం నాలుగు గంటల నోటీస్ మాత్రమే ఇచ్చి (రాత్రి ఎనిమిది గంటల నుండి అర్ధరాత్రి వరకు) దేశవ్యాప్తంగా కర్ఫ్యూలాంటి లాక్ డౌన్లు విధించి నెలల పర్యంతం కొనసాగించడం నువ్వు వూహించగలవా?

అక్షరాల ప్రతిదీ - ప్రజలు, సరుకులు, యంత్రాలు, మార్కెట్లు, కర్మాగారాలు, బడులు, యూనివర్శిటీలు- అన్నీ ఎక్కడివక్కడ హఠాత్తుగా ఆగిపోయాయి. చిమ్నీలనుండి పొగరాలేదు. రోడ్లమీద లారీలు లేవు. పెళ్ళిళ్లలో అతిధులు లేరు. ఆసుపత్రిలో చికిత్స లేదు. ఇదంతా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే. ఒక గడియారం బొమ్మను ఆడించడానికి అవసరమైన కీ ని తీసివేస్తే అదెట్లా ఆగిపోతుందో అట్లా. ఎందుకట్లా చేశాడు? ఎందుకంటే అతను చేయగలడు కాబట్టి.

మన సమాజాన్ని పీల్చుకు తింటున్న వ్యవస్థాగతమైన అసమానతలను - కులం, వర్గం, మతం, లైంగికత - నగ్నంగా చూపెట్టే ఎక్స్ రేలాగా కోవిడ్-19 మారింది. అత్యంత అవివేకంగా రూపొందించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దాదాపుగా కూలిపోయింది. వైరస్ మాత్రం వ్యాప్తి చెంది వర్ధిల్లింది. ఇదంతా చూస్తుంటే మనం ఒక మంచుకొండలో జరిగిన విస్ఫోటనంలో బతుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ పేలుడు మూలంగా చెల్లాచెదురు అయిన ముక్కలన్నీ ప్రపంచవ్యాప్తంగా గాలిలో తేలాడుతున్నాయి. అవి ఎక్కడ భూమిమీదకు చేరతాయో, దాని మూలంగా వాస్తవంగా జరిగే నష్టమెంతో ఇప్పటికీ మనకు తెలియదు.

తలదాచుకునే స్థలం, ఆహారం, డబ్బు, రవాణా సదుపాయాలు లేకుండా నగరాల్లో చిక్కుకుపోయిన లక్షలాది మంది కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి వందల మైళ్ళు , కొన్ని సందర్భాలలో వేల మైళ్ళు నడిచిపోయారు. వాళ్లట్లా నడుస్తూ పోతుంటే పోలీసులు వాళ్ళను కొట్టారు, అవమానపరిచారు. ఇదంతా చూస్తూ వుంటే నేను ఈ మధ్య చదివిన "ది గ్రేప్స్ ఆఫ్ వ్రాత్ʹ (The Grapes of Wrath) గుర్తుకొస్తోంది. దాని రచయిత జాన్ స్టిన్ బెక్స్ (John Steinbecks). ఎంత గొప్ప పుస్తకం అది!

అది మహాసంక్షోభ కాలంలో అమెరికాలో జరిగిన వలసల గురించి రాసిన నవల. ఆ నవలలో జరిగినదానికీ, ఇక్కడ జరిగినదానికీ ఒక్క తేడా కనపడుతోంది. అదేమిటంటే భారతదేశంలోని ప్రజలలో దాదాపుగా కోపం ఏ మాత్రం లేకుండా వుండడం. నిజమే, అక్కడక్కడా అప్పుడప్పుడు కొంతమంది కోపాన్ని వెళ్ళగక్కారు, కాని అది వుండాల్సిన స్థాయిలో లేదు. ప్రతివాళ్ళూ తమ ఖర్మను ఆమోదించడం ఎంత భయంకరంగా వుంది. ప్రజలు ఎంత విధేయులు. బాధలు పడడానికి, విధేయంగా వుండడానికి ప్రజలకున్న అంతూపొంతూలేని శక్తి, పాలకవర్గాలకు, ఆధిపత్య కులాలకు ఎంత సౌకర్యవంతంగా వుంటుంది. అయితే బాధల్ని అనుభవించడానికి వుండే ఈ శక్తి వరమా? శాపమా? దీని గురించి నేను చాలా ఆలోచిస్తున్నా.

లక్షలాది మంది శ్రామికులు వాళ్ళ ఇళ్ళకి లాంగ్ మార్చ్ చేస్తూ వుంటే, ప్రధాన స్రవంతికి చెందిన మాధ్యమాలు "వలస కార్మికుడుʹ అనే ఒక కొత్త ధోరణిని అకస్మాత్తుగా కనిపెట్టాయి. ʹనువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ దగ్గర ఎంత డబ్బు వుంది? నీవు ఎంత కాలం నడుస్తావు?ʹ అని విలేఖర్లు అడుగుతూ, వాళ్ళ బాధల గురించి కార్పొరేట్ల ప్రాయోజిత మొసలి కన్నీళ్ళు కార్చారు.
కాని, జైళ్ళలో వున్న అనేకమంది ఇతరులలాగే నువ్వుకూడా ఈ నిర్వాసిత్వాన్ని, పేదరికాన్ని సృష్టించిన, పర్యావర్యాణాన్ని విధ్వంసం చేసిన, ప్రజలు తమతమ గ్రామాల నుండి పారిపోయేటట్టు చేసిన యంత్రాంగానికి వ్యతిరేకంగా చాలా సంవత్సరాలుగా ప్రచారం చేశారు. మీరందరూ న్యాయం పక్షాన నిలబడ్డారు. అయితే ఆ రోజున మీ వాణిని వినిపించిన ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు ఇప్పుడు ఆ యంత్రానికి అనుగుణంగా మారి మిమ్మల్ని నిందిస్తున్నారు, మీమీద బురద జల్లుతున్నారు, ముద్రలు వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మొసలి కన్నీళ్ళు కారుస్తూ భారతదేశపు జీడిపి మైనస్ 9.5%శాతానికి పడిపోవడంపట్ల ఆందోళన చెందుతుంటే, మీరేమో జైళ్ళల్లో వున్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి మాధ్యమాల్లో వస్తున్న హర్షాతిరేకత ఏమాత్రం తగ్గడం లేదు. అప్పుడప్పుడు అది అతి హర్షధ్వానాల జేజేలు అందుకుంటోంది. లాక్ డౌన్ కాలంలో నేను చదివిన మొదటి నవల వాసిలి గ్రాస్ మాన్ (Vassily Grossman) రాసిన ʹస్టాలిన్ గ్రాడ్ʹ(Stalingrad). (గ్రాస్ మాన్ ఎర్రసైన్యంతో కలిసి సరిహద్దుల్లో పోరాడినవాడు. ఆయన రెండవ పుస్తకం ʹలైఫ్ అండ్ ఫేట్ʹ (Life and Fate) సోవియట్ ప్రభుత్వానికి చికాకు కలిగించింది. వాళ్ళు ఆ నవల లిఖిత ప్రతిని ʹఅరెస్టుʹ చేశారు, అదేదో మనిషిలాగా. అది సాహసోపేతమైన రచన. అలాంటి రచనా నైపుణ్యాన్ని సృజనాత్మక రచనా తరగతులలో ఎవరూ నేర్పరు.)

ప్రపంచ యుద్ధకాలంలో రష్యా సరిహద్దుల నుండి బెర్లిన్ కు పంపబడిన ఒక సీనియర్ నాజీ అధికారికి, హిట్లర్‌కు మధ్య జరిగిన ఒక సమావేశాన్ని ఆ నవలలో అసాధారణంగా వర్ణించారు. ఇప్పుడు నాకు ఆ పుస్తకం గుర్తుకు రావడానికి అదే కారణం. అప్పటికే యుద్ధ ఫలితాలు పూర్తిగా జర్మనీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. హిట్లర్ కు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియచెప్పడం కోసం ఆ అధికారిని పంపుతారు. అయితే అతడు హిట్లర్‌ను చూడగానే ఎంతగానో భయపడతాడు. తన యజమానిని కలిసినందుకు సంభ్రమానికి గురవుతాడు. ఫలితంగా అతని మెదడు మూసుకుపోతుంది. తాను చెప్పాల్సింది మర్చిపోయి, హిట్లర్ ను సంతృప్తి పరచడానికి అవసరమైన పదాలను వెతుక్కోవటం మొదలుపెడతాడు.

మనదేశంలో కూడా అదే జరుగుతోంది. సమర్థవంతమైన మెదళ్ళన్నీ భయంతో గడ్డకట్టుకుపోయాయి. అధినేతలను పొగడాలనే దురాశలు ప్రారంభమయ్యాయి. అందరి మేథస్సు దిగజారిపోతోంది. వాస్తవమైన వార్తలకు అవకాశం లేకుండా పోయింది.

ఇదిలావుండగా వైరస్ విజృంభిస్తూనే వుంది. ఇరవైఒకటో శతాబ్దపు తొలిభాగంలో అద్భుతమేధావులైన ముగ్గురి (మోడి, ట్రంప్, బోల్సోనారో) నాయకత్వంలోని దేశాలు, కరోనా వైరస్ వల్ల అత్యంత తీవ్రంగా నష్టపోయిన దేశాలు కావడం కాకతాళీయం కాదు. పువ్వుల చుట్టూ గిరికీలు కొడుతున్న తేనెటీగల్లాగా భారతీయ జనతాపార్టీ చుట్టూ తిరుగుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే ఆ ముగ్గురి వుద్దేశం "ప్రస్తుతం మనం స్నేహితులమే! కాదా?ʹ అని.

నవంబరు ఎన్నికల్లో ట్రంప్ పదవీచ్యుతుడు అవుతాడనపిస్తుంది. ఇలాంటి అవకాశమేదీ భారతదేశంలో కనుచూపుమేరలో కూడా లేదు. ప్రతిపక్షాలు కూలిపోతున్నాయి. నాయకులందరూ భయానికి గురై మౌనంగా వుండిపోతున్నారు. ఎన్నికైన రాష్ట్రప్రభుత్వాలను కాఫీమీద వుండే నురగలాగా వూదిపారేస్తున్నారు. ద్రోహం, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వార్తలను దినపత్రికలు ఉత్సాహంగా రిపోర్ట్ చేస్తున్నాయి. శాసనసభ్యుల్ని ఇతరులు ప్రలోభపెట్టి కొనకుండా చేయడానికి వాళ్ళందర్నీ ఒక మందలాగా దూరంగా వున్న వేసవి విడిది కేంద్రాల్లో బందీలుగా వుంచుతున్నారు. అలా అమ్మకానికి సిద్ధంగా వున్నవాళ్లని బహిరంగంగా వేలంపాట వేయటం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎవరు ఎక్కువ మొత్తంలో కొనుక్కుంటే వాళ్ళకు అమ్ముడుపోతారు. నువ్వేమంటావ్? వాళ్ళవల్ల ఎవరికి ఏం వుపయోగం? వాళ్ళని పోనివ్వు. మనం వాస్తవాన్ని ఎదుర్కొందాం. అంతిమంగా మనం, ఇద్దరు వ్యక్తులచేత పరిపాలించబడుతున్న ఏకపార్టీ ప్రజాస్వామ్యంలో వున్నాం. దీనిలో వున్న వైరుధ్యాన్ని, విషాదాన్ని చాలామంది గుర్తిస్తారని కూడా నేననుకోను.

లాక్ డౌన్ కాలంలో, తాము జైళ్ళల్లో వున్నట్టుగా అనుభూతి చెందుతున్నామని అనేకమంది మధ్యతరగతి ప్రజలు ఫిర్యాదు చేశారు. అయితే అది ఎంత వాస్తవదూరమో అందరికంటే నీకే బాగా తెలుసు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో కలిసి వాళ్ళ ఇళ్ళల్లో వున్నారు. (అయితే మహిళలు మాత్రం అనేక రకాలైన గృహ హింసలను ఎదుర్కొన్నారు.) వాళ్ళకు ప్రియమైన వ్యక్తులతో సంభాషించగలిగారు. వాళ్ళవాళ్ళ పనులన్నీ చేసుకోగలిగారు. వాళ్ళకు ఫోన్లు వున్నాయి. ఇంటర్నెట్ వుంది. నీలాగా లేరు వాళ్ళు. పోయిన సంవత్సరం ఆగస్టు 5న నిబంధన 370 రద్దుచేసి, జమ్మూకాశ్మీర్ కున్న రాష్ట్ర హోదాను, ప్రత్యేకహోదాను తొలగించినప్పటి నుండీ నిరవధికంగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను, ఇంటర్నెట్ లాంటి భావప్రకటనా సౌకర్యాలను పోగొట్టుకున్న కాశ్మీరీ ప్రజలలాగా లేరు వాళ్ళు.

రెండునెల్ల కోవిడ్ లాక్ డౌన్ భారత ఆర్థిక వ్యవస్థను బలంగా దెబ్బ తీసిందంటున్నారు. కాని సంవత్సరంలో అత్యధిక భాగం ఎలాంటి వార్తా సౌకర్యాలు లేకుండా మిలటరీ లాక్ డౌన్ కింద విలవిలలాడుతున్న కాశ్మీరీల గురించి ఆలోచించు. వ్యాపారాలన్నీ దివాళా తీస్తున్నాయి. డాక్టర్లు పేషంట్లకు వైద్యసౌకర్యాన్ని అందించలేకపోతున్నారు. విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు. గత సంవత్సరం ఆగస్టు 5కు ముందు వేలాదిమంది కాశ్మీరీలను జైళ్ళలో పడేశారు. అవి నేర నిరోధక అరెస్టులు. ముందస్తు అరెస్టులు. ఏ నేరమూ చేయని ఇలాంటి ప్రజలతో పూర్తిగా నిండిపోయిన జైళ్ళు ఇప్పుడు కోవిద్ వైరస్ కు కేంద్రాలయ్యాయి. దాని గురించి ఏమందాం?

సెక్షన్ 370ని రద్దు చేయడం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కూడిన చర్య. వాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా దానివల్ల సమస్య ʹశాశ్వతంగాʹ పరిష్కారం కావడానికి బదులు, ఆ ప్రాంతం మొత్తం మీద భూ ప్రకంపనాలను సృష్టించింది. లోపల్లోపల పునరేకీకరణలు జరుగుతున్నాయి. చైనా ప్రజావిముక్తి సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దును దాటి లడఖ్ లోని అనేక చోట్ల వ్యూహాత్మకమైన ప్రాంతాలను ఆక్రమించుకున్నది. చైనాతో యుద్ధం పాకిస్తాన్ తో యుద్ధం లాంటి తమాషా కాదు. అందుకే మామూలుగా వుండే ఛాతీ విరుచుకోవడాలు తగ్గిపోయాయి. దాని బదులు మెల్లగా తమ భుజాల్ని తామే తట్టుకోవడం మాత్రమే జరుగుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశం గెలుస్తోంది, భారత టెలివిజన్ ప్రసారాల్లో, అవి కట్టేస్తే మరో నూతన ప్రపంచ వ్యవస్థ సాక్షాత్కరిస్తోంది.
నేను అనుకొన్నదానికంటే ఈ లేఖ సుదీర్ఘమై పోతోంది. ప్రస్తుతానికి నీకు వీడ్కోలు చెప్పనివ్వు. స్నేహితుడా, నీకెంత ధైర్యం! నీకెంత ఓపిక! ఈ అన్యాయం కలకాలం కొనసాగదు. జైళ్ళ తలుపులు తెరుచుకుంటాయి. నువ్వు మా వద్దకు తిరిగివస్తావు. పరిస్థితులు ఇలానే కొనసాగవు. ఒకవేళ కొనసాగితే ఈ వ్యవస్థ దానంతట అదే వేగంగా పతనోన్ముఖం అవుతుంది. మనం ఏమీ చేయాల్సిన అవసరం వుండదు. అదే జరిగితే ఫలితం ఊహించశక్యంకాని ఘోరమైన విషాదం. కాని ఆ శిధిలాల నుండి ఇంతకంటే దయకలిగిన, ఇంతకంటే తెలివైన మరొకటేదో తప్పనిసరిగా తలెత్తుతుంది.

- ప్రేమతో, అరుంధతి

అనువాదం : సిఎస్సార్ ప్రసాద్


No. of visitors : 546
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •