త్యాగాల పరంపర

| సాహిత్యం | వ్యాసాలు

త్యాగాల పరంపర

- పద్మకుమారి | 17.07.2016 12:35:14am

బొట్టెం ఎన్‌కౌంటర్‌ మార్చి 1, 2016న జరిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలం మార్చురీ దగ్గర ఆ కామ్రేడ్స్‌ మృతదేహాల కోసం నాలుగు రాత్రులు, మూడు పగళ్లు ఎదురు చూశాం. మనుషులు ఎప్పుడు ఎలా తారసపడతారో మనకు తెలియదు. వాళ్ల స్నేహాలు, అభిమానాలు ఇలా బాధాకరంగా గుర్తు చేసుకోవాల్సి రావడం విచారకరం. కానీ విప్లవంలో, జీవితంలో ఇది నిజం.

ఈ ఎన్‌కౌంటర్‌లో 9 మంది అమరులయ్యారు. మనుషుల్ని వేటాడి హత్య చేసి 8 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న మిన్కో అనే మహిళా కామ్రేడ్స్‌ మృతదేహాన్ని గుర్తించలేదు. మర్నాడు ఆ మృతదేహాన్ని స్ధానిక ఆదివాసులు స్వాధీనం చేసుకొని విప్లవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించారట. ఈ కామ్రేడ్‌ తండ్రి, చెల్లెలు కూడా పార్టీలో పని చేస్తూ అమరులయ్యారు. వారి మార్గంలోనే ఈ కామ్రేడ్‌ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసింది.

మిగతా ఎనిమిది మందిలో నలుగురు ఎక్కడో, ఎప్పుడో కలిసినవాళ్లు, తెలిసినవాళ్లు, అనుబంధం ఉన్న వాళ్లు. అయినప్పటికి విప్లవమే ఆశయంగా ప్రాణ త్యాగం చేసిన అమరులందరూ వాళ్ల త్యాగం వల్ల మనకు తెలిసినవాళ్లనే అనిపిస్తుంది.

ఎప్పటిలాగా ఎన్‌కౌంటర్‌ వార్త తెలిసి బయల్దేరిన మేం భద్రాచలంలోని ఓ ఆదివాసీ మిత్రుడి ఇంట్లో ఆ రాత్రి గడిపాం. తెల్లారి పేపర్‌లో చనిపోయినవాళ్లందరి ఫొటోలు వేశారు. అవి చూసి అమరుల బంధుమిత్రుల సంఘం ఉపాధ్యక్షురాలు శాంత దిగులుగా మారిపోయింది. అంతకు ముందు ఉదయం నుంచే హరిభూషణ్‌, అతడి సహచరి సమ్మక్క ఈ ఎన్‌కౌంటర్లో చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీంతో తుడుందెబ్బ వాళ్లు కూడా వచ్చారు. వాళ్లిద్దరూ మృతుల్లో లేరని గుర్తించినా వాళ్ల కుటుంబానికే చెందిన సారక్క ఉన్నట్లు గుర్తించారు.

ఇలాంటప్పుడు అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యులం చనిపోయిన వాళ్లను గుర్తుపట్టడానికి దు:ఖంతో, విచారంతో మృతదేహాల కోసం తిరుగాడుతూ ఉంటాం. శవాలను గుర్తుపట్టాల్సి రావడం, అదీ సమాజం కోసం సర్వస్వం ధారపోసిన వాళ్లను ఇలా విగతజీవులుగా గుర్తుపట్టాల్సి రావడం ఎంత బాధాకరం. అందుకే సంఘంలో కొద్దిమందికి శవాలని అనడం కూడా ఇష్టం ఉండదు. అట్ల అనాలంటే ఏదో బాధగా ఉంటుందంటారు.

ఇలాంటి సందర్భాల్లో శాంతక్క అయితే తన కూతురు ఉందేమో అని ప్రతిసారి ఆందోళనతో, దు:ఖాన్ని దాచుకుంటూ మావెంట తిరుగుతూ ఉంటుంది. బిడ్డల మరణవార్త ఎప్పుడు ఎలా వినాల్సి వస్తుందో అని ఎదురుచూస్తూ బతకడం ఎంత కష్టం. కానీ ఈ రోజు ఆ బిడ్డ విగతజీవిగా మార్చురీలో ఉంటే, ఆ గోడ పక్కనే ఉన్న ఇంట్లో తల్లి ఈ విషయం తెలియక ఒక రాత్రంతా గడిపింది. బిడ్డ మరణవార్త అలా తెలుసుకోవాల్సి వచ్చిందని ఆమె ఎంత దు:ఖపడిందో.

మార్చురీలో మృతదేహాలను చూడ్డానికి వెళ్తేంటే పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు ʹఈమె బిడ్డ సృజన ఉంది. చూడ్డానికి వెళ్లాలి..ʹ అన్నాం.

సృజన అనగానే వాళ్లు ʹఎవరూ కొత్తకొండ సృజనా?ʹ అని అడిగారు.

ʹమీకు తెలిసే ఇప్పటి దాకా ఎందుకు ప్రకటించలేదు? మానవత్వం లేదా?ʹ అని ప్రశ్నించాం. నిజాయితిలేని సమాధానం.

అలా ఒక మరణవార్త తెలుసుకోవడం విప్లవంలో తప్పకపోవచ్చుగాని, కన్నవాళ్లకు భరించలేని విషాదం. కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం. సృజన మనసు చాల సున్నితమైనది. పట్టుదలగల అమ్మాయి. మేము ఇలా ఎప్పుడో ఒకప్పుడు చూస్తామని తెలిసిన తట్టుకోలేకపోయాం. తను అరెస్టు అయిన సందర్భంలో పోలీసులు సంఘ నాయకత్వమే తనను పార్టీలోకి పంపించిందని ఒప్పుకోవాలని కొట్టారు.అయిన ధైర్యంగా నిలబడింది. సంఘం ఏర్పడిన కొత్తల్లో అమరుల కుటుంబాల నుంచి పేద పిల్లల్ని స్కూళ్లలో చేర్చిన మొదటి బ్యాచ్‌లో సృజన ఉంది. తను హైదరాబాదులో ఇంటర్మీడియట్‌లో చేరింది. ప్రజాసంఘాల కార్యకలాపాల్లో పాల్గొనేది. అమరుల సంస్మరణ సభల్లో పాల్గొనేది. ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్లి ఇలా ఇప్పుడు విగతజీవిగా కనిపిస్తోంది.

బొట్టెం అమరుల్లో ఉన్న యూసఫ్‌బీ.. నేను అజ్ఞాత ఉద్యమంలో ఉన్నప్పడు నల్లమలలో భాగ్యగా పరిచయం. నాలుగు రోజులు కలిసి ఉన్నాం. అప్పుడు ఆమె సహచరుడు రమేష్‌ కూడా ఉన్నాడు. నిర్బంధం వల్ల వ్యక్తుల స్థలాల్లో మార్పుల గురించి ఆరోజు నేను, యూసఫ్‌బీ మాట్లాడుకున్నాం. ఆ పక్కనే ఏదో సమావేశంలో రమేష్‌ నాలుగు రోజులపాటు ఉన్నాడు. అప్పుడు తనను పరిచయం చేసింది. అతడి మృతదేహాన్ని ఈ రోజు నేనే సంఘం తరపున స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్కసారే అతన్ని చూసింది. కానీ సోనీ మాటలనుబట్టి నాకు ఆయనతో బాగా పరిచయం ఉన్నట్లనిపించేది. ఆయన గురించి ఆమె చాలా అపురూపంగా చెప్పేది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అంత ప్రేమ, బాధ్యత ఉన్నా నిత్య నిర్బంధం వాళ్లకు ఆటంకం కాలేదు. చివరి దాకా కలిసి పని చేశారు. ʹనా అనారోగ్యం వల్ల టెక్‌ వర్క్‌లోంచి అడవుల్లోకి వెళితే ఇబ్బందిపడతానని రమేష్‌ అనేవాడʹని చెప్పింది. అందుకని ʹఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలని చెప్పేవాడʹని అన్నది. ఆమె ఆరోగ్యం ఎలా ఉండేదో ఈ పుస్తకంలోని రచనల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాటి మధ్యనే ఇద్దరూ ఉద్యమంలో కొనసాగి అమరులయ్యారు.

రెండో తేదీ పొద్దున్నే భాగ్య మృతదేహాన్ని వాళ్ల కుటుంబసభ్యులు తీసికెళ్లిపోయారు. పోలీసుల నిర్బంధం వల్ల వాళ్లు రమేష్‌ మృతదేహాన్ని తీసుకపోలేకపోయారు. దీంతో ఆ నాలుగు రోజులుగా రమేష్‌ మృతదేహం ఆ పక్క మార్చురీలో ఉండిపోయింది. అలా ఆ ఇద్దరు విగత జీవులయ్యాక మాత్రమే విడిపోయారు.

రమేష్‌ కోసం రక్త సంబంధీకులెవరైనా వస్తారేమో అని చివరి దాకా ఎదురు చూశాం. రమేష్‌ కన్నతల్లి, పెంపుడు తల్లి ఇద్దరూ అక్కచెల్లెళ్లే. వాళ్లను తీసుకరావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. అయితే ఆ తల్లి చివరి నిమిషంలో బంధుమిత్రుల సంఘానికి తన కొడుకు మృతదేహం ఇవ్వమని పోలీసులకు చెప్పింది. రమేష్‌ మృతదేహాన్ని ఆ ఇద్దరు తల్లులకు అప్పగించడానికి బంధుమిత్రుల సంఘం తరపున స్వాధీనం చేసుకున్నాము.

సృజన మృతదేహంతోపాటు పైడిపల్లిలో రమేష్‌ అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగా 80 ఏళ్లు పైబడ్డ రమేష్‌ తల్లులు వచ్చారు. వేలాది మంది విప్లవాభిమానుల జోహార్ల మధ్య కొడుకు అంత్యక్రియలు జరగడం చూసి వాళ్లు గర్వపడ్డారు. తమ బిడ్డను భూగర్భంలో దాచుకున్న పైడిపల్లి..రమేష్‌కు మూడో తల్లిలా వాళ్లకు కనిపించింది.

సారక్కను రెండేళ్ల కింద వరంగల్‌లో విరసం సభల్లో చూశాను. ఆ గ్రామస్థులతోపాటు ఆమె ఆ సభకు వచ్చింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత పేపర్లో ఆమె ఫొటో చూసి గుర్తుపట్టాను. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని సోనీ మృతదేహాన్ని తీసుకపోయిన రోజే పొద్దున్నే వచ్చి తీసుకు పోయారు. ఈమెది వరంగల్‌కు దగ్గర్లో ఉన్న మడగూడెం. ఈ ఊరు విప్లవకారులకు కన్నతల్లి. ఆ ఊళ్లో ముగ్గురు అమరులు ఉన్నారు.

మిగతా నలుగురు చత్తీస్‌గడ్‌ అదివాసులు. ఇందులో ఇద్దరు మహిళలు. ఒకరు రామె, మరొకు దేవె. మడకం బండి ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఉన్నాడని పోలీసులు ప్రకటించడంతో అతడి తల్లి, కుటుంబసభ్యులు వచ్చారు. కానీ శవాన్ని గుర్తించడానికి ఇబ్బందిపడ్డారు. అక్కడున్న మృతదేహాలను తరచి తరచి చూడాల్సి వచ్చింది. రీ పోస్టుమార్టంకు పౌరహక్కుల సంఘం వాళ్లు కోర్టులో పిటీషన్‌ వేసి ఉన్నందున త్వరగా మృతదేహాలను అప్పగించాలనుకున్న పోలీసులు ఇది మీ అబ్బాయిదే తీసికెళ్లండని వాళ్ల మీద ఒత్తిడి చేశారు. ఆలోపు రీ పోస్టుమార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో రెండో రోజు సాయంకాలం దాకా వాళ్లు ఉండిపోవాల్సి వచ్చింది. చనిపోయిన కామ్రేడ్‌ రోషన్‌ అని పార్టీ ప్రకటన చూసి సాయంకాలానికి రోషన్‌ తల్లిదండ్రులు వచ్చారు. ఒక కొడుకు కోసం ఇద్దరు తల్లులు. రోషన్‌ తల్లి చూడగానే కొడుకును గుర్తుపట్టింది. మూడు రోజులుగా బండి మృతదేహమే అని పోలీసులు చెబుతున్నందు వల్ల తీసికెళ్లడానికి మానసికంగా సిద్ధపడ్డ ఆ తల్లి ఇంకో వైపు ఇది నా కొడుకు మృతదేహమే అంటోంది.

ʹనా కొడుకు శవమే.. నేను పాలిచ్చి పెంచానుʹ అని రొమ్ము చూపి రోషన్‌ తల్లి ఏడుస్తోంది. భాష తెలియకపోయినా ఆ తల్లి దు:ఖం అర్థమవుతోంది. తల్లి దు:ఖానికి భాషతో ఏం పని?

చివరికి అది రోషన్‌ శవమనే తేలింది. అతడి తల్లిదండ్రులకే ఇచ్చారు. అయితే బండి తల్లి దు:ఖం చూడలేక మేం ఒక సలహా ఇచ్చాం. ఎవరి బిడ్డ అయినా విప్లవంలో త్యాగం చేసిన వీరుడే కదా. రేప్పొద్దున బండి అనే తేలితే.. కొడుక్కు అంత్యక్రియలు చేయలేకపోయామనే వెలితి ఉంటుంది. మీరూ వెళ్లి రెండు కుటుంబాలు కలిసి అంత్యక్రియల్లో పాల్గొనండని సలహా ఇచ్చాం.ఆ మూడు రోజులు మేమందరం కలిసే ఉన్నాం. వాళ్ల భాష మాకు రాదు. మా మాటలు వాళ్లలో ఒకరిద్దరికి తప్ప మరెవవ్వరికీ అర్థం కావు. కానీ దు:ఖం కదా. ఒకే కుటుంబసభ్యుల్లా రోదించాం.

మృతదేహాలను సరిగా భద్రపరచకపోవడంతో కుళ్లిపోవడం మొదలయ్యాయి. మూడో రోజు చంద్‌, రోషన్‌, దేవె, రామె తల్లిదండ్రులు తమ బిడ్డల శవాలను తీసుకొని వెళ్లారు. జనవరి 11, 2016న పశ్చిమ బస్తర్‌ నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరురాలైన హేమ్లా లక్ష్మి.. చంద్‌ జీవన సహచరి. ఎన్నో కలలతో విప్లవంలోకి వచ్చిన ఈ యువతీ యువకులు ఇలా అర్థాంతరంగా రాలిపోయారు. కానీ వాళ్ల ఆశయాలు ఎన్నటికీ వాడిపోనివి. అవి నిత్యం చిగురించి పుష్పిస్తూనే ఉంటాయి.

(బొట్టెం అమ‌రుల జీవిత చ‌రిత్ర పుస్తకానికి ప‌ద్మ‌కుమారి రాసిన ముందుమాట‌)


No. of visitors : 1239
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?

పద్మకుమారి, కార్యదర్శి, అమరుల బంధుమిత్రుల సంఘం | 18.11.2016 11:48:02am

మర్మాంగాలను ఛిద్రం చేస్తున్న చోట, పాలిచ్చే వక్షోజాలను కోసి పారేస్తున్న చోట, తలెత్తి పోరాడమని ప్రజలకు నేర్పిస్తున్న వాళ్ల తలలు మాయం చేస్తున్నచోట, శవాన్ని ప...
...ఇంకా చదవండి

‌మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

పద్మకుమారి | 17.06.2016 10:57:58am

వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్‌ఘడ్‌లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా........
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు

పద్మకుమారి | 15.05.2016 01:51:20pm

ʹఅమ్మా నువ్వే ఇట్లన్నవంటే.. వాల్లు ఇంకెట్లంటరో ఆలోచించు. అది చూడు ఎంత బాధపడుతున్నదో. ఇంతకూ బాబును వదిలి వెళ్లడానికి ధనాలు సిద్ధంగా ఉందా? దాన్ని ఒక్క మాట అడగ...
...ఇంకా చదవండి

పయనించిన పాట

పద్మకుమారి | 21.12.2016 12:01:15am

బిడ్డల గురించి తల్లులకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఎదురు చూపులు. ఇవి తీరేవేనా? ఈ దు:ఖం ఆగిపోయేదేనా? ప్రభా తల్లి ఒక్కరే కాదు. అమరుల ...
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు -2

పద్మకుమారి | 01.06.2016 10:37:59am

కమాండర్‌ వెనక్కి తిరిగి మనం దగ్గరికి వచ్చేశాం. ఇది మనకు బలమైన ప్రాంతం. ఇంకో అరగంటలో గ్రామం అంచులోకి చేరుకుంటాం. ప్రయాణం ఒక రోజు లేటైనా రెండో రోజు ఏపీటీకి...
...ఇంకా చదవండి

విప్లవ వ్యక్తిత్వం

పద్మకుమారి | 16.07.2019 08:07:17pm

భారతి అమరత్వం తర్వాత కలిసినప్పుడు శంకరన్న వాళ్లన్నయ్య దుబాషి యాదయ్య తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. చిన్నారి యాదమ్మ ఆ కుటుంబంలో హక్కుల కోసం ఆమె పడిన ఘర్షణ......
...ఇంకా చదవండి

పాల్గుణ

ప‌ద్మ‌కుమారి | 11.05.2016 01:21:15pm

ఇప్పుడు పాల్గుణ అంటే మేఘ‌మే కురుస్తుంది త‌ప్ప పిడుగు రాల‌దు.పిడుగు రాలినా పిడుగంచు విద్యుత్ వెలుగై మ‌నసులోకి ఇంకుతుంది. ...
...ఇంకా చదవండి

దారులు

ప‌ద్మ‌కుమారి | 15.05.2016 01:10:40pm

ఎక్కడివీ బాటలు ఎవరి జాడలు వెంట పరిగెడుతున్నాయి నీవేనా ? అవి నీవేనా ?...
...ఇంకా చదవండి

వాకపల్లి ఇప్పుడు ఎం చెబుతోంది?

పద్మకుమారి | 04.09.2017 08:58:57am

వాకపల్లి ఒక్కటే కాదు. విప్లవోద్యమ ప్రాంతాల్లో మహిళల రాజ్యం దారుణంగా దాడి చేస్తోంది. బైటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ వింటున్నాం. చిన్న ప...
...ఇంకా చదవండి

రమాకాంత్‌ వాళ్లమ్మ

పద్మకుమారి | 17.11.2019 10:25:42am

ʹఆ రోజు అన్నను చంపేసినప్పుడు మన సంగం లేదు కాబట్టి శవాన్ని చూడ్డానికి కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికోపోయి మనోల్ల శవాలను తెస్తున్నారు. మన సంగం ఉండాలి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •