ఈ వ్యాసాన్ని ఐడిఎ బొల్లారం(మెదక్) పోలీస్‌స్టేషన్‌లో ఉండి రాస్తున్నాను. జూలై 27న విరసం, ప్రజాఫ్రంట్ కలిసి పోలీస్ ఫైరింగ్‌లో గాయపడిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను కలువడానికి వెళ్లాం. ఏ దారిలో వెళ్లినా ముంపు గ్రామాల రహదారులన్నీ పోలీస్ దిగ్బంధంలో ఉన్నాయి. కాని ఆ గ్రామాల ప్రజలు మమ్ములను పోలీసుల కంట పడకుండా పిల్ల బాటల వెంట తీసుకెళ్లారు. మేము ఎర్రవల్లి గ్రామ పంట పొలాలలో నడుచుకుంటూ వెళ్తుంటే ఇరవై మందిని పట్టుకోవడం కోసం వందమంది పోలీసులు వచ్చారు. ʹఈ గ్రామంలో 144 సెక్షన్ ఉంది మీరు వెళ్లటానికి వీలులేదని వాదనకు దిగి అడ్డగించారు.ʹ పంట పొలాలలో కూడా 144 సెక్షన్ ఉందా? అని మేము ప్రశ్నిస్తే సమాధానం దాటవేసారు. చివరికి బలవంతంగా మమ్మల్ని పోలీస్ వాహనంలోకి నెట్టివేసి ఐడిఎ బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తీసుకవచ్చారు. మరికొందర్ని ములుగు పోలీస్‌స్టేషన్‌లో బంధించారు. ఇదిలా ఉంటే...
17 జూలై ఆదివారంనాడు విరసం సభ్యులం మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల వద్దకు వెళ్లాం. మొదట మేం ఎర్రవెల్లి గ్రామ ప్రజలు నిర్వహించిన సభలో పాల్గొన్నాం. ఎవరి కళ్లలో సంతోషం లేదు. అందరి ముఖాల మీద విషాదం ముసురుకున్నది. పోలీసులు కేసులు పెట్టి బెదిరించిన బాలమ్మ మాట్లాడడం మొదలుపెట్టింది. చారెడు భూమి ఉంటే తప్ప జీవించలేని మమ్ముల్ని భూమి నుంచి వెళ్లిపొమ్మంటే ఎట్లా? అని ఆ తల్లి ప్రశ్నిస్తున్నది. కేసులు పెట్టి బెదిరిస్తే అదురుకునేది లేదు, బెదురుకునేది లేదు. బొందిలో ప్రాణం పోయినా పుట్టిన ఊరును వదులుకోం అన్నది. ఇరవై ఏళ్ల దళిత యువకుడు(నరేశ్) ఆ సభను నిర్వహిస్తున్నాడు. మల్లన్నసాగర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చాలా స్పష్టంగా వివరించాడు. ఆ గ్రామ స్థానిక నాయకుడు టిఆర్ఎస్ ప్రజలకు వ్యతిరేకంగా మారి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంలో గ్రామంలో ఎవరో అభినందనలు తెలియచేస్తూ బ్యానర్ కట్టారు. తమ భూములను ప్రభుత్వం లాక్కుంటుంటే దానికి మద్దతు తెలయచేస్తున్నాడనే కోపంతో ఆ నాయకుడి బ్యానర్‌ను కొందరు స్త్రీలు చింపివేసారు. దీనిని సాకుగా చేసుకొని ఆ నాయకుడు స్త్రీల మీద అక్రమ కేసు బనాయించాడు.
గ్రామ సర్పంచ్‌తో సహా ప్రజలందరు మల్లన్నసాగర్ అవసరం లేదని మాట్లాడారు. మరో దళిత యువకుడు(శ్రీను) మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను ముంపునకు గురిచేయకుండా ఎన్ని రూపాలలో ప్రాజెక్టును నిర్మాణం చేయవచ్చో గణాంకాలతో సహా వివరించాడు. కాని ప్రభుత్వాలకు కాంట్రాక్టర్ల సూచనలు అవసరం కాని, ప్రజల సూచనలు అవసరం లేదు. ఎర్రవల్లి గ్రామం జాతీయ రహదారికి చాలా దగ్గర్లో ఉంది. మూడు వేల జనాభా ఉన్న గ్రామమిది. రెండు వేల ఏడు వందల ఎకరాల భూమి ముంపునకు గురికాబోతుంది. రెండు పంటలు పండే భూమి మునిగిపోతే, ఊళ్లన్నీ మాయమైతే-విషయాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ శోకం పెడుతున్నారు. ముంపు అనే మాట గుర్తుకువస్తే కడుపులో చేయిపెట్టి దేవినట్లు ఆ ప్రజలు భావిస్తున్నారు. దేవేందర్‌రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో ఉన్న బాలమ్మ మాట్లాడుతూ దుఃఖిస్తుందో, దుఃఖిస్తూ మాట్లాడుతుందో అర్థం కాని స్థితి. ఒకరకంగా శోకంలోనే కడుపులో ఉన్న బాధనంతా చెబుతున్నది. ఎర్రవల్లి ప్రజలు చెప్పిన ముంపు బాధ విన్న మేం బరువెక్కిన మనసులతో సింగారం గ్రామం వెళ్లాం.
సింగారం గ్రామం మొత్తం విషాదం అలుముకున్నది. ఇరవై ఏళ్ల మాదిగ యువకుడు గుండె పగిలి మరణించాడు. మట్టిగోడలతో, గూన పెంకులతో నిర్మించిన ఇల్లు. వర్షానికి సగం తడిసి ఉంది. ఇల్లు అనటం కంటే ఎద్దుల కొట్టం అనవచ్చేమో అంతటి దైన్యస్థితి. వాకిలంతా రాత్రి కురిసిన వర్షానికి పచ్చిపచ్చిగా ఉంది. ఆ వాకిట్లో చిరిగిన చాపలో శవాన్ని పడుకోపెట్టారు. శవం మీద కప్పడానికి సరైన బట్ట కూడా లేదు. చిల్లులు పడిన దుప్పటి ఒకటి కప్పారు. ఈ యువకుడు ఎందుకు చనిపోయాడని నా పక్కన ఉన్న వ్యక్తిని అడిగాను. అతను కళ్లలో నీళ్లతో చెప్పటం మొదలుపెట్టాడు. నిన్నటి వరకు వారితో కలిసి నిరాహార దీక్షా శిబిరంలో పగలంతా నినాదాలు ఇచ్చిన యువకుడు తెల్లారే సరికి శవమై ఉండటాన్ని ఆ ఊరి యువకులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఊరు మునుగుతుందనో, ఇళ్లు పోతుందనో, చెట్టుకొకరం పుట్టకొకరం పక్షుల్లా అయిపోతామనో ఆ అర్థరాత్రి యువకుడు ఏమి ఆలోచించాడో, ఒంటరిగా ఎంతగా రోధించాడో ఊరి ప్రజల బతుకు చిధ్రమవుతుంటే అతని చిన్ని గుండె తట్టుకోలేకపోయింది. హఠాత్తుగా ఆగిపోయింది. నేను మళ్లీ అడిగాను అతనికి భూమి ఉందా? అని. సెంటుభూమి లేదని తెలిసాక నా గుండె ఏడ్పును ఆపుకోలేకపోయింది. ఈ దేశంలో దళితులకు భూమి లేదు. ఇలా అనటం కంటే లేకుండా చేసారని అనటం బాగుంటుంది. ఆ యువకుడికి కూడా లేదు. మరి ఎందుకు పోరాటం చేసినట్లు!?
ఊళ్లో భూమి ఉంటే కూలిదొరుకుతుంది. పంట పండితే కనీసం పరిగెనైనా ఏరుకోవచ్చు. పాలుకైనా చేసుకోవచ్చు. భూమే లేకపోతే దేనిని నమ్ముకొని బతుకాలే. రెడ్లకు, దొరలకు, బీసీ కులాలకు భూమి ఉంటే వాళ్లను ఆధారం చేసుకొని కనిపెంచిన ఊళ్లో కనిపెంచినోళ్ల దగ్గర ఉండవచ్చు. ఒకవేళ భూమి మునిగిపోతే కూలిదొరకకపోతే అనే ఆలోచన ఆ యువకున్ని బతుకనీయలేదు. తెలంగాణ కోసం 14 వందల మంది యువత చనిపోతే తెలంగాణ ఇవ్వని కాంగ్రెస్-సోనియా కారణమని అన్నాం. మరిప్పుడు ఎవరు కారణమని అడిగితే సమాధానం చెప్పటం కష్టమా!? సింగారం దుఃఖాన్ని దోసిల్లలో పోసుకొని బరువెక్కిన హృదయాలతో అశ్రునయనాల మధ్య ఆ వూరును వదిలివచ్చాం.
పల్లె పహాడ్ గ్రామం మరింత భావోద్వేగంతో స్వాగతం పలికింది. డప్పుల దరువుతో, నినాదాల హోరులో ఎదురొచ్చారు. ఆత్మీయ కరచాలనాలతో దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నాం. ఈ గ్రామం చాలా భిన్నంగా కనిపించింది. వేదిక మీద పదిమందికి పైగా స్త్రీలు దీక్షలో కూర్చున్నారు. వేదిక కింద ఐదువందల మందికి పైగా స్త్రీలు అంతే సంఖ్యలో పరుషులు ఉన్నారు. సభ కూడా ఉద్వేగం-ఆవేశం కలగలిసి జరిగింది. ʹʹసారు! ఈ భూములు పోతే మేము బిచ్చగాళ్లం అవుతాం. అడుక్కోవడానికి చిప్ప కూడా దొరకదు. ఎట్లైనా భూములు కాపాడాలెʹʹ ఆమె గుండె లోతుల్లో నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని వినే ఓపిక ఈ పాలకులకు లేదు. కల కంట కన్నీరు ఒలికిన రాజ్యం ఏమవుతుందో చరిత్ర చాలాసార్లు రుజువు చేసింది. ఎర్రవల్లి, సింగారం గ్రామంలోనైనా కొందరి మాటల్లో నష్టపరిహారం గురించిన ధ్వని విన్పించింది. కానీ వీళ్లది ఒకటే నినాదం ʹʹమా భూములను వదులుకోం-ప్రాజెక్టు మాకొద్దుʹʹ వూళ్లను వదిలి వెళ్లిపోతే బొంద పెట్టటానికి గజం భూమి కూడా దొరకదనే బాధను ఎవరు తీర్చాలి. వూరు మునిగిపోతుందనే విషయం గుర్తుకువస్తే ʹకడుపులో బుగులుపుట్టేʹ స్థితిలో ఓట్లేసిన ప్రజలు ఉండటం ఈ దేశంలో కొత్తేమి కాకపోయినా, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొత్తే మరి!? పోరాడే శక్తుల పట్ల, వారి పోరాటానికి మద్దతుగా ఉండే సంస్థల పట్ల వాళ్లు ఎంత గౌరవంగా ఉంటారో వాళ్లిచ్చిన ఆథిత్యమే తార్కాణం. ఆ సంస్కారం ప్రజలకు విప్లవం వలన, విప్లవ ఆచరణ వలన వచ్చింది. ఈ నేల మీదే నడిచిన గిరాయిపల్లి అమరుల జాడలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. సముద్రుడి సమయానికి (కవిత్వానికి) కవి సమయాలు ఈ ఊళ్లు, ఈ ప్రకృతి.
ఈ జ్ఞాపకాలన్నీ మనసులో ముసురుతుంటే, వాటి నుంచి తేరుకొనకముందే, ఇంకో దృశ్యంలోకి ప్రయాణం. ఒక దృశ్యం తర్వాతి దృశ్యం మరింత గాఢంగా, తన్మయత్వంగా, భావోద్వేగంగా ఉంటే, అది దృశ్యరూపకళ అయితే దర్శకుడి నైపుణ్యం తెలుస్తుంది. కాని ఇవి యధార్థ దృశ్యాలు. ప్రత్యక్ష గాథలు-పోరాటాలు. వేములగట్టు మరిచిపోలేని యధార్థం. ఊరి ప్రజలంతా ఒకే చోట కూడారా? అన్పించింది. బహుశ, అన్ని కులాలు కలిసి కూర్చునట్లు చూసాను. పేద, ధనిక, మధ్యతరగతి రైతులు, కూలీలు ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా స్త్రీలే అధికంగా ఉంటున్నారు. వూరు-భూమి పోతుంటే బిడ్డల్ని కోల్పోయినట్లు ఆ తల్లులు వలపోస్తున్నారు. 500 నుంచి 600 ఎకరాల భూమిలో యాసంగి పంట పండించే గ్రామమిది. తెలుగు నేల మీద కొద్ది గ్రామాలకు మాత్రమే సాధ్యమయ్యే పని ఇది. ఊరుకు అడవి, దాని పక్కన వాగు. అడవి నుంచి నిరంతరం వాగులోకి ఊరే నీరు. యాభై ఫీట్లు బోరు వేస్తే చాలు పుష్కలంగా నీరు వస్తుంది. ఎండాకాలంలో కూడా యాభై నుంచి వంద ఎకరాలు పారే నీళ్లు ఆ గ్రామంలో ఉన్నాయి. వెయ్యి ఎకరాలకు పైగా ఒక్క వరిపంటనే పండించగలుగుతున్నారంటే ఎంతటి ధాన్యగారమో మనకు అర్థమవుతుంది. తెలంగాణలో అరుదుగా ఉండే పట్టు పరిశ్రమ ఈ ఊళ్లో ఉంది. విత్తన క్షేత్రంగా ఉండటం ఇంకో ప్రత్యేకత. తొంభై ఐదు శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రజలందరిది ముంపు బాధే.
మరి పాలకులేమంటున్నారు. పాలితులను ముంచుదా మంటారు. కాంట్రాక్టర్ల జేబులు నింపుదామంటున్నారు. తెలంగాణకు నీళ్లు వద్దా? అని ప్రశ్నిస్తున్నారు. భూసేకరణ ప్రాజెక్టు కోసం కాదు, కంపెనీల కోసమని మేథావులు విశ్లేషిస్తూనే వున్నారు. పేరు మోసిన ఇంజనీర్లు ఈ ప్రాజెక్టు సరైనది కాదంటున్నారు. ఏ రకంగా చూసినా కాలువ మీద నిర్మాణం చేసే బౌల్ సురక్షితం కాదంటున్నారు. జరగరానిది జరిగి పగిలిపోతే ముంపు నష్టాన్ని ఊహించటానికే భయంగా ఉందంటున్నారు.
సరే వీరి వాదనలన్ని పక్కన పెడుదాం
ప్రజలేమంటున్నారంటే...
పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు గోదావరి నీళ్లు కావల్సిందే. బీడువడిన పొలాలను కష్ణ, గోదావరితో తడపాల్సిందే. కాని ఎక్కువ మొత్తంలో మమ్మల్ని ముంచేసి, నిరాశ్రయులను చేసి మరికొన్ని జిల్లాలకు నీళ్లు ఇవ్వటం ఏం న్యాయమని అడుగుతున్నారు. కొందరికి ఖేదం మరికొందరికి మోదం ఎట్లా? వాళ్లు ప్రజలు తెచ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ముందు పెడుతున్నారు. వాళ్లు ప్రజలు కదా! నీళ్లను నిలబెట్టి ఆనకట్టలు కట్టినవాళ్లు. చెరువులు నిర్మాణం చేసి పంటలు పండించినవాళ్లు. యాభై టిఎంసిల నీళ్లు ఒకే చోట నిలుపడం కంటే కాలువ పొడుగునా చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించి నీళ్లను అందించవచ్చునని అంటున్నారు. మూడు జిల్లాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటే ఒకే జిల్లాలోని ప్రజలను ముంచడం దేనికి? మూడు జిల్లాలలో జిల్లాకు ఒక చోట ముఖ్యంగా అటవి ప్రాంతం ఉన్నచోట తక్కువ వ్యవసాయ భూమి నష్టంతో రిజర్వాయర్లు నిర్మించవచ్చునని ప్రజల సూచన. దీని గురించి పాలకులు చర్చించరెందుకు?
నిజానికి నేను ఈ వ్యాసం పోలీస్‌స్టేషన్‌లో ఉండి రాస్తున్న సమయానికి డిప్యూటీ కలెక్టర్ వరవరరావు గారికి ఫోన్ చేసి ʹʹపల్లె పహాడ్ గ్రామస్థులు వందమందికి పైగా తమ భూములను మాకు రాసి ఇచ్చారు. మీరు ఒకసారి సంగారెడ్డి వస్తే మీతో మాట్లాడుతానుʹʹ అని అడిగాడు. ప్రజల మీద ఫైరింగ్ జరిపి, లాఠీచార్జీ చేసి, కేసులుపెట్టి, బెదిరించి సంతకాలు పెట్టించుకొని దానిని ప్రజల సమ్మతిగా మీరు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆహ్వానాన్ని వి.వి. తిరస్కరించారు. అంటే ఏదో రకంగా ప్రజల నుంచి భూమిని తీసుకోవడం పూర్తిచేసారు. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో మేం వెళ్లేనాటికే ఈ తతంగం ముగిసింది. ఇక మిగిలిందల్లా వేములగట్టు. ఇవ్వాలో రేపో అది కూడా పూర్తవుతుంది. పాలకులు చేసే దుర్మార్గాలలో ఇదో లెక్కనా.
నష్టపరిహారం గురించి పాలకులు కనీసం స్పందించటం లేదని ఆ ప్రజలు అంటున్నారు. ఎకరానికి నష్టపరిహారం ఐదు, ఆరు లక్షలు ఇస్తే ప్రాజెక్టు వస్తుందనే ప్రచారంతో ఈ చుట్టూ పక్కల గ్రామాలలో యాభై లక్షలకు ఎకరం చొప్పున అమ్ముడుపోతున్న భూమిని మేము మరోచోట ఏ విధంగా కొనగలుగుతామని అడుగుతున్నారు. భూమి, గ్రామం మాత్రమే మునిగిపోవటం కాదు కదా! ఈ భూమితో, గ్రామంతో చెట్టు పుట్టతో జంతువులు, పక్షులతో ముడివడిన మా జ్ఞాపకాల సంగతేంది? భూమికి పరిహారం ఇస్తారు సరే, జ్ఞాపకాలకు ఏ పరిహారం ఇవ్వగలరనే తాత్విక ప్రశ్నను వాళ్లు వేస్తున్నారు.
అభివృద్ధి వెలుగునీడలో నీడనే ఎక్కువగా ఉంటుందని, వెలుగు ధనికులకు, నీడ పేదలకని భూ స్థలంలో ఇప్పటికే రుజువైంది. మల్లన్నసాగర్ ఇంతకంటే భిన్నంగా ఉంటుందని ఎవరికి భ్రమల్లేవు.
-27 జూలై, 2016
Type in English and Press Space to Convert in Telugu |
ఊళ్లకు ఊళ్లను ముంచి తెచ్చే నీళ్లు ఎవరి కోసం: కాశీం తెలంగాణ ప్రజలను ముంచి కోస్తాంధ్ర కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన........ |
ʹమానాలʹ దీర్ఘ కవితమానాల అమరులను స్మరించుకోవడంటే.. విప్లవోద్యమంలో అమరులైన వేలాది విప్లవ వీరులను స్మరించుకోవడమే. అమరుల వారోత్సవాల సందర్భంగా దీర్ఘ కవిత పాఠకుల...... |
విప్లవ ప్రజాస్వామ్యమే ప్రత్యామ్నాయం ʹబూర్జువా ప్రజాస్వామ్యం - అభివృద్ధి నమూనా - విప్లవ ప్రజాస్వామ్యంʹ పై విరసం కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ కాశీం ప్రసంగం........ |
రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు - అగ్రకుల తత్వం : కాశీం ఉపన్యాసం9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ర్ట మహాసభల్లో ʹరిజర్వేషన్లపై, కామ్రేడ్ కాశీం ఉపన్యాసం... |
గురిచూసే పాట గూడ అంజయ్యఊరుమనదిరా పాటను వేటూరి సుందరామ్మూర్తి కాపి కొట్టి వక్రీకరించి రాసాడు. అప్పుడు గద్దర్, గూడ అంజయ్య పత్రికా సమావేశం పెట్టి ప్రజలపాటను కాపీ కొట్టి సినిమా....... |
తీవ్రతరమౌతున్న నిర్బంధాన్ని ప్రతిఘటిద్దాం!. తెలంగాణ, అలాగే దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. 25 ఫిబ్రవరి 2020న జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్న... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |