సిరియాలో శాంతి నెలకొనేనా?

| సాహిత్యం | వ్యాసాలు

సిరియాలో శాంతి నెలకొనేనా?

- ఎ. నర్సింహారెడ్డి | 01.08.2016 01:17:48am

ఏడు దశాబ్దాల క్రితం ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన సిరియాలో కుర్దులు, అర్మీనియన్లు, అస్సిరియన్లు, క్రైస్తవులు, షియా, సున్నీ జాతుల నివసిస్తున్నాయి. సిరియా పశ్చిమాసియాలో చమురుతో సుసంపన్నమైన చిన్న అరబ్‌ దేశం, దీని జనాభా సుమారు రెండుకోట్లు. భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయిల్‌ ఆధిపత్యానికి సిరియా అటంకంగా ఉంది. అయిదేళ్ళ క్రితం టునీషియాలో అబిదిన్‌ బెన్‌ అలీ అవినీతి నిరంకుశత్వాల నుంచి స్వేచ్ఛకోసం, తమ భవితను తామే నిర్దేశించుకోగలిగే మార్పు కోసం అలీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా 2010 డిశంబర్‌ 17న మల్లెల విప్లవంగా ప్రారంభమై అరబ్‌ వసంతం పేరిట 2011లో పలు అరబ్‌ దేశాల్లో చెలరేగిన జనాందోళన సిరియానూ2011 మార్చి 15 నుంచి గట్టిగా తాకడమే ప్రస్తుత దీనావస్థకు నాంది. సిరియాలో అసద్‌ ప్రభుత్వం నేరాభియోగాలు లేకుండానే ప్రజల్ని నిర్బంధించే అత్యవసర చట్టాల్ని రద్దుచేయాలని, రాజకీయ పక్షాలకు చట్టబద్ధత చేకూర్చాలని, అవినీతిపరులైన అధికారుల్ని తొలగించాలన్న ప్రధాన డిమాండ్లతో రాజుకొన్న ఆందోళన అచిరకాలంలోనే దేశవ్యాప్తమైపోయింది. తొలి రెండు డిమాండ్లకు సమ్మతించినా జనాగ్రహం వేడి చల్లార లేదు. అసద్‌ సర్కారు విపక్షాల ఆందోళనపై ఉక్కుపాదం మోపింది.

సిరియా విపక్ష ఉద్యమకారులు అసద్‌ ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా 2011 ఆగష్టు 23న ʹఫ్రీ సిరియన్‌ ఆర్మీʹని ఏర్పాటు చేశారు. ఫ్రీ సిరియన్‌ ఆర్మీ మెజారిటి సున్నీలతో, అల్‌ ఖైదా మిలిటెంట్లతో ఏర్పడింది. వీరికి సౌది, ఖతార్‌, టర్కీ, అమెరిక దేశాల నుంచి డబ్బు, శిక్షణ, ఆయుధాలు అందాయి. అంతవరకు శాంతియుతంగా సాగిన ఉద్యమం విదేశీ జోక్యంతో రక్తసిక్తమయిన అంతర్యుద్ధానికి తెరలేపింది. సిరియాలో శాంతి నెలకొనేలా చూడటంలో అంతర్జాతీయ సమాజం విఫలమైంది. సిరియా అంతర్గత విషయాల్లో అమెరికా, నాటో దేశాల జోక్యాన్ని ఐ.రా.స. నిరోధించలేక పోయింది. అరబ్‌ లీగ్‌, ఐరోపా, టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్‌ వంటివి అసద్‌ ప్రభుత్వంపై ఆంక్షలు విధించి, విపక్షాల పోరాటానికి అన్ని విధాలుగా దన్నుగా నిలిచాయి.ఐదేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధంలో 2,70,000 మంది మరణించారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారు.

చాలాకాలంగా అమెరికా, దాని మిత్రదేశాలు సిరియాలో బషార్‌-అల్‌-అసద్‌ పాలనను కూల్చివేసే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దీనికోసం వారనుసరించని విధానం లేదు. ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టారు. అసద్‌కు వ్యతిరేకంగా ప్రచార యుద్ధాన్ని సాగించారు. అనేక తిరుగుబాటు ముఠాలను తయారుచేశారు. అసద్‌ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యంకోసం జరుగుతున్న ప్రతిఘటనగా తాము సాగిస్తున్న సాయుధ చర్యలను సమర్ధించుకున్నారు. ప్రజలపై ప్రభుత్వ సైనిక దళాలు విషపూరిత వాయువులు ఉపయోగించాయని అసద్‌ పాలనపై వారు కృత్రిమ ఆరోపణలు చేశారు. సిరియాకు వ్యతిరేకంగా వైమానిక దాడులను కూడా ప్రారంభించారు. ఇరాక్‌, ఆఫ్ఘాన్‌, లిబియా దేశాలలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి 1980 నుంచి సృష్టించిన ఉగ్రవాద ముఠాలు చాలవరకు కలిసి ʹఇస్లామిక్‌ స్టేట్‌ʹ గా ఆవిర్భవించి, సిరియా అధ్యక్షుడు అసద్‌తో పాటు అమెరికా విధానాలను విభేదిస్తోంది. 2014 నుంచి ఇరాక్‌, సిరియా, జోర్డాన్‌ భూభాగాలను కలుపుకొని విశాల ప్రాంతంలో ఖలీఫా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఎజెండాతో ఐసిస్‌ అనుసరిస్తున్న దూకుడు విధానం ఇటు సిరియా ప్రభుత్వానికి, అటు అమెరికాకు తలనొప్పిగా మారింది. సిరియాపై ఆధిపత్యాన్ని సాధించాలన్న అమెరికా కలను అది నిరాశపరుస్తోంది. సిరియాలో అమెరికా ఆధిపత్యం సాధించాలంటే ఐసిస్‌ను ఓడించడం అమెరికాకు అనివార్యమయింది.

సిరియాలో తనకు నచ్చని అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే పనిలో అమెరికా నిమగ్నమై వుండగా, రష్యా తన మిత్రదేశాన్ని ఇస్లామిక్‌స్టేట్‌ నుంచి, ఇతర తీవ్రవాదశక్తుల నుంచి ఎలాగైన కాపాడుకోవటానికి 2015 సెప్టెంబర్‌ 30 నుంచి ప్రత్యక్షంగా సైనికంగా జోక్యం చేసుకుంది. దీంతో సిరియాలో పరిణామాలు వేగవంతమయ్యాయి. రష్యా మిలటరీ బలగాలను సిరియాలో దింపే పని చేపట్టింది. లాట్కియా రాష్ట్రంలోని హమానియా ఎయిర్‌పోర్టుకు దగ్గరలోని రన్‌వే పొడవును పెంచి ఎయిర్‌పోర్టును విస్తరించింది. టార్టాస్‌ రాష్ట్రంలో స్థావరాన్ని కొనసాగిస్తోంది. 500 మందితో కూడిన దృఢమైన నౌకాపదాతిదళాన్ని లాట్కియా విమానాశ్రయ ప్రాంతంలో మోహరింపజేసింది. గత సెప్టెంబర్‌ నుంచి సిరియాలో ఐఎస్‌ఐఎస్‌పై వైమానిక దాడులను ప్రారంభించిన రష్యా బలమైన సైనిక బలగాన్ని పంపి టర్కీ సరిహద్దులకు సమీపంలోని సిరియా వైమానిక స్థావరం లాట్కియాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి సిరియా కేంద్రంగా మధ్య ప్రాచ్యంలోని బలాబలాల్లో మార్పు వచ్చింది.

రష్యా తన వైమానిక బలగాల్లోని అత్యాధునికమైన ఎస్‌యూ - 35 యుద్ధ విమానాలను, ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను లాట్కియాలో మోహరించి ఆగ్నేసియాలో అమెరికాతోపాటు మరో ఆధిపత్య శక్తిగా గుర్తింపును పొందింది. శాంతి ఒప్పందం కోసం సిద్ధమైన అమెరికా వైఖరిని బట్టి చూస్తే ʹఏది ఏమైనా అసద్‌ గద్దె దిగాల్సిందేʹ అనే తన వైఖరి నుంచి దూరంగా జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే నిజమైతే రష్యాకు సిరియాను వదిలి అమెరికా ఇరాక్‌ తదితర ప్రాంతాల్లోని ఐఎస్‌ఐఎస్‌ వ్యతిరేక యుద్ధానికి పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకు అది సిద్ధపడుతుందా ? లేక అమెరికా నూతన అధ్యక్షుని ఎన్నికవరకు తాత్కాలిక శాంతితో కాలయాపన చేయాలనుకుంటుందా ? అనేది ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు ఐ.రా.స భద్రతా మండలి తీర్మాణం ప్రకారం ఐఎస్‌, అల్‌ నుస్రా తీవ్రవాద సంస్థలపై వైమానిక దాడులు యథాతథంగా కొనసాగించేందుకు రష్యా, అసద్‌ బలగాలు నిర్ణయించుకున్నాయి.

గత అయిదేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలం అవతున్న సిరియాలో ʹయుద్ధ విరామాʹనికి అగ్ర దేశాలు ఒక ప్రణాళిక రూపొందించాయి. రష్యా వైమానిక దళాల అండతో సిరియా ప్రభుత్వ దళాలు అలెప్పో నగరం వైపు అప్రతిహతంగా పురోగమిస్తున్న నేపథ్యంలో, సిరియాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలనీ, రష్యా తన వైమానికి దాడులను ఆపాలని అమెరికా డిమాండ్‌ చేసింది. అత్యంత ప్రగతి నిరోధక అరబ్‌ రాచరికాలు, టర్కీలతో కలుపుకుని అమెరికా గత ఐదు సంవత్సరాలుగా ఆర్థికంగా, సైనికంగా మద్దతునిస్తున్న ఇస్లామిక్‌ తీవ్రవాదులు ఓటమి చవిచూస్తున్న స్థితిలో ఈ డిమాండ్‌ ముందుకు వచ్చింది. మార్చి ఒకటవ తేదీ నాటికి కాల్పుల విరమన చేస్తామని రష్యా ప్రతిపాదించింది.

సిరియాలో సాయుధ సంఘర్షణ అపటం గురించి అమెరికా సహా 17 దేశాలు 2016 ఫిబ్రవరి 12వ తేదీన మ్యూనిచ్‌లో సమావేశమై ఒక తాత్కాలిక శాంతి ఒప్పందానికి వచ్చాయి. సిరియాలో కాల్పుల విరమణకు మద్దతునిచ్చే దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ సిరియా సపోర్ట్‌ గ్రూప్‌ (ఐఎస్‌ఎస్‌జి)గా ఏర్పడ్డాయి. దీనిలో అమెరికా, రష్యా, అరబ్‌ లీగ్‌, చైనా, ఈజిప్ట్‌, ఐరోపా యూనియన్‌, ఐక్యరాజ్యసమితి తదితర దేశాలు ఉన్నాయి. ఇవన్నీ మ్యూనిట్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సిరియాలో యుద్ధ కార్యకలాపాలను కొంత కాలం నిలిపివేయాలన్నది ఈ ఒప్పందం సారాంశం. సిరియాలో భారీ ఎత్తున వైమానిక దాడులు జరుపుతున్న రష్యాకు, అక్కడ తక్షణమే శాంతి స్థాపన జరగాలంటున్న అమెరికాకు మధ్య ఈ మ్యూనిచ్‌ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి కాల్పుల విరమణ అమలులోకి రావల్సి ఉండే కాని రష్యా అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 27 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయినా, భవిష్యత్తులో అలెప్పోలో ప్రధాన ప్రభుత్వ వ్యతిరేక పక్షంగా వున్న అల్‌ ఖైదా అనుబంధిత అల్‌ నుస్రా ఫ్రరట్‌ను కాపాడటానికి అమెరికా, దాని మిత్ర పక్షాలు చేసుకునే సైనిక జోక్యం రష్యాతో ప్రత్యక్షంగా తలపడేలా చేయవచ్చు.

ఈ ఒప్పందం నిజాయితీగా అమలులోకి వస్తే నిస్సహాయులైన సిరియా ప్రజలకు సహాయం అందించే అవకాశం ఐ.రా.స.కి ఏర్పడుతుంది. కాని అక్కడి పరిణామాలను గమనిస్తే అనుమానాలు నీలినీడలా కమ్ముకుంటున్నాయి.కాల్పుల విరమణ పాక్షికమైనది కావడం వలన ప్రభుత్వ బలగాలకు, తిరుగుబాటు దార్లకు ఆత్మరక్షణ కోసం మానవ హక్కులుంటాయి. 1980వ దశకంలో అమెరికా, సోవియట్‌ యూనియన్ల ప్రచ్ఛన్న యుద్ధానికి ఒకనాడు అఫ్గానిస్థాన్‌ కేంద్రమైనట్లుగా వాషింగ్టన్‌, మాస్కోల ప్రాబల్య ప్రదర్శనలకు నేడు సిరియా వేదిక అవుతోంది. అసద్‌ ప్రభుత్వం అసమ్మతి అణచివేత పేరిట తమ దేశ ప్రజలను అణిచేసినా, ఐక్యరాజ్యసమితి సహా అన్నీ దేశాలు ఆందోళన వ్యక్తీకరించడం తప్ప ఏమీ చెయ్యలేకపొయాయి. అసద్‌ వైదొలగి ఉపాధ్యక్షుడికి అధికారం అప్పగించాలని, ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభించాలని అరబ్‌లీగ్‌ 2012లో అమెరికా ఆదేశంతో రూపొందించిన శాంతి ప్రణాళికను రష్యా, చైనా ʹవీటోʹ చేశాయి. సిరియాలో అరాచకం అవధులు మీరడానికి అగ్రరాజ్యాలు అలా తలా ఒక చెయ్యీ వేశాయి.

అమెరికా, దాని మిత్ర రాజ్యాల దన్నుతో విపక్ష సైన్యం అసద్‌ కోటలపై దాడులు సాగించింది. పలు ప్రాంతాలను స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే, గత సెప్టెంబర్‌ నుంచి విపక్ష స్వాధీనంలోని పలు ప్రాంతాలను అసద్‌ సైన్యాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. అగ్రరాజ్యాల ప్రత్యక్ష, పరోక్ష పోరులో సామాన్య ప్రజలు సమిదలయ్యారు. ఆహారం, మందులు, వైద్యం వంటి కనీస సదుపాయాలు కొరవడ్డాయి. కొంతకాలంగా సాగుతున్న శాంతి యత్నాలు కొలిక్కి రావడంతో ప్రజలు ఆనందించారు. శాంతి ఒప్పందం అమలులోకి వచ్చినా దాని చుట్టు ముసురుకొన్న భయానుమానాలు చాలానే ఉన్నాయి. తాజా శాంతి ఒప్పంద ప్రకటన వెలువడిన వెంటనే, ఏప్రిల్‌ 13న పార్లమెంటుకు ఎన్నికలు జరపనున్నట్లు అసద్‌ సర్కారు ప్రకటించింది.

రష్యా- అమెరికా కాల్పుల విరమణ కోసం సంధిచేసుకున్నప్పటికీ, అమెరికా కాల్పులను విరమించే యోచనలో పూర్తిగాలేనట్లు అర్థమవుతోంది. రష్యా అనుకూల అసద్‌ స్నేహ ప్రభుత్వాన్ని గద్దెనుండి దింపి అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని నెలకొల్పే ఆలోచన మదిలో నుంచి ఇంకా పోలేనట్లుంది. ఈ శాంతి ఒప్పందం ఇరాక్‌, సిరియా ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌)ౖ, అల్‌ నస్రా ఫ్రంట్‌, సిరియాలోని ఆల్‌ఖైదా గ్రూపులకీ వర్తించదు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన మిగతా టెర్రరిస్టు గ్రూపులకు వర్తించదు. రష్యా, అమెరికాలు సిరియాపై జరుపుతున్న దాడులకు ఎవరి ఆశయాలు వారికి ఉన్నాయి. ఒకవైపు ఐసిస్‌పై వ్యతిరేక యుద్ధం పేరుతో సిరియాలో తోలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించటానికి అమెరికా ప్రయత్నిస్తుంటుంటే, రష్యా, ఇరాన్‌లు మధ్యప్రాచ్యంలో తమకుగల ఏకైక అరబ్‌ మిత్రుణ్ణి కాపాడుకోటానికి తద్వారా ఐసిస్‌ పెరుగుదల నిర్మూలనకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

ఈ కాల్పుల విరమణద్వారా ఆల్‌ నుస్రా రక్షించబడుతుందని, తద్వారా అలెప్పొ ప్రాంతంలో అమెరికా అనుకూలురు బలపడే సూచనలున్నాయని కొన్ని పక్షాలు వాపోతున్నాయి. వాషింగ్టన్‌ మాత్రం ఈ కాల్పుల విరమణను యుఎస్‌ లో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా కొంతకాలం అసాద్‌ ప్రభుత్వం మార్పు విషయాన్ని పక్కకుపెట్టి ఎన్నికల అనంతరం ఈ ఎజెండాను మరలా తెరపైకి తీసుకొచ్చే వ్యూహంతో పావులు కదుపుతున్నది. ఈ కాల్పుల విరమణ ఎంతవరకు అమలు జరుగుతుందో చెప్పలేమని, ప్రత్యామ్నాయంగా ప్లాన్‌ -బి ను కూడా సిద్ధంగా ఉంచుకొంటున్నామని జాన్‌కెర్రీ తెలుపటంతో మరలా సిరియాలో యుద్ధ వాతావరణం తప్పదనిపిస్తుంది.కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ వాస్తవానికి కాల్పులు విరమించినట్లుగా లేదు. సిరియా అంతటా యుద్ధ వాతావరణం నెలకొన్నట్లుగా, దాడులు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సిరియా ఉత్తర ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కుర్దులు ఐసిస్‌తో పోరాడుతుంటే టర్కీ మాత్రం ఇస్లామిక్‌ స్టేట్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ కుర్దులపై బాంబు దాడులు జరుపుతున్నది. ఈ విధంగా సిరియాలో శాంతికి విఘాతం కల్గించడమే కాకుండా రెచ్చగొట్టే దోరణితో టర్కీ వ్యవహారిస్తుంది.

ఐఎస్‌ఐఎస్‌ 2014లో బలీయమైన శక్తిగా లేదు. గత ఏడాది మే నుంచి అది సాధించిన చెప్పుకోదగిన విజయాలు లేవు. ఇటు సిరియా, అటు ఇరాక్‌లలో అది కుర్దుల చేతుల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. ఇరాక్‌లోని మొసుల్‌, సిరియాలోని రఖ్ఖాలను కూడా అది త్వరలోనే కోల్పోతుందని భావిస్తున్నారు. అందువల్లనే అసద్‌ను గద్దె దించడమా? లేక కొనసాగించడమా? అనేదే ఇప్పుడు కీలకమైనదిగా మారింది. రష్యా, ఇరాన్‌ మరియు ఇతర మిత్రదేశాలు ఇప్పటికే సిరియా సమస్యకు ఒక రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయి. దేశ ప్రయోజనాల కొరకు, ప్రజల ప్రయోజనాల కొరకు అసద్‌ను ప్రతిపక్షంతో రాజీ చేసుకొనేందుకు ఒప్పించటానికి అవి ప్రయత్నిస్నున్నాయి. అమెరికా మాత్రం అసద్‌ వైదొలగాల్సిందేనంటోంది. ఆ సమయం ఎప్పుడనేది చర్చించటానికైతే అది సిద్ధంగా ఉంది. రష్యా వైమానిక దాడుల అండతో అసద్‌ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదార్లను కొన్ని చిన్న ప్రాంతాలకు పరిమితం చేశాయి. మరికొన్ని వారాల్లోనే తిరుగుబాటుదార్లను తుడిచి పెట్టేసే అవకాశం ఉన్న ఈ దశలో కాల్పుల విరమణ కంటే కాలయాపనే ఉత్తమమని అమెరికా భావిస్తుందనే వాదనను కాదనలేం.

కాల్పుల విరమణ ప్రకటించిన మరుక్షణం నుంచి ఐసిస్‌, ఆల్‌ నుస్రా అమెరికా బలపరుస్తున్న ప్రతిపక్షాలు దాడులు ప్రారంభించాయి. ఫిబ్రవరి 28న అమెరికా సిరియా గడ్డపై రఖ్ఖా, మన్భిజ్‌, టల్‌ అబ్బాద్‌ ప్రాంతాల్లో కనీసం 12 విమాన దాడులను నిర్వహించింది. రష్యా దీన్ని ఖండించింది. అమెరికా కాల్పుల విరమణను అడ్డు పెట్టుకుని కొత్త బలాలను సమీకరించుకొనే ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నదని రష్యన్‌ జనరల్‌ సెర్గీ కురీలెంకో అన్నారు.ఈ విషయంలో అమెరికా చాలా ముందుచూపుతో తన అధిపత్యం కోసమే సంది హస్తం చాపిందని మాజీ సిఐఏ డైరెక్టర్‌ లారా జాన్సన్‌ పేర్కొనడం గమనార్హం. మధ్య ప్రాచ్యంలో క్షీణిస్తున్న ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా నానా తంటాలు పడుతుంది. సిరియా మిత్ర దేశాలైనా రష్యా, ఇరాన్‌లను బలహీనపర్చి మధ్యప్రాచ్యంలోని చమురు వనరులపై గుత్తాధిపత్యాన్ని సాధించటమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతుంది.

సిరియాలో తాత్కాలిక శాంతి ఒప్పందం అమలు గురించి అంతర్జాతీయ సమాజానికి అనేక సందేహాలున్నాయి. అందుకు కారణం టర్కీ, సౌదీ అరేబియా, ఖతార్‌, ఇజ్రాయిల్‌ సృష్టిస్తున్న అడ్డంకులే. ఈ దేశాలు అమెరికా మిత్రపక్షాలు. ఈ విషయంలో రష్యాకు ఇరాక్‌, సిరియా, ఇరాన్‌, హిజుబొల్లాలపై పూర్తి నియంత్రణ ఉంది. సిరియాలో బషర్‌ అల్‌ అస్సద్‌ ప్రభుత్వాన్ని కూలదోయటమనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న టర్కీ, సౌదీ అరేబియాలను, సిరియా సంక్షోభం పరిష్కారం కాకుండా కొనసాగేలా చూడాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఇజ్రాయిల్‌ను అమెరికా తన దారికి తెచ్చుకోగలగటంపైన సిరియాలో శాంతి నెలకొంటుందా, లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే టర్కీ ఐసిస్‌కు అనేక విధాలుగా మద్దతునివ్వకుండా ఒబామా చూడగలుగుతాడా అనేదానిపై ఈ ఒప్పందం భవిత ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సిరియాపై టర్కీ దాడిచేస్తే నాటో సహకరించదని అమెరికా స్పష్టం చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా తామందరమూ సిరియాలో సంఘర్షణ ఆపాలనుకుంటున్నామని అమెరికా, దాని ఐరోపా మిత్ర దేశాలు టర్కీకి స్పష్టం చేయవలసి ఉంటుంది. అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదం సిరియా సంక్షోభ పరిష్కారంలో తన వంతు పాత్రను ఎంతవరకు పోషించేదీ ఆచరణలో మాత్రమే తెలుస్తుంది. టర్కీ, సౌదీలు ఎలాంటి దుస్సాహాసానికి దిగకపోతే, రష్యా ఈ ఒప్పందానికి కట్టుబడితే తాత్కాలికంగానైనా నెలకొనే శాంతి సిరియా ప్రజలకు గొప్ప ఊరట కాగలుగుతుంది.

No. of visitors : 968
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తీరుమారని జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు

ఎ. నర్సింహ్మా రెడ్డి | 16.07.2017 08:15:28am

జి-20 దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో అచేతనంగా వ్యవహరిస్తున్నాయి. అందువల్లే జి-20 సదస్సుకు అతిథ్యమిచ్చిన హాంబర్గ్‌ ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •