జులై 11న గుజరాత్ రాష్ట్రం గిర్ సోమనాథ్ జిల్లా ఉనా పట్టణానికి సమీపంలోని గ్రామంలో ఒక దళిత కుటుంబం చనిపోయిన ఆవు చర్మం వలుస్తున్నది. ఒక గుంపు హఠాత్తుగా దాడి చేసి గోమాతను చంపుతార్రా అని బూతులు తిడుతూ కర్రలతో ఇనుపరాడ్లతో అక్కడున్న ఎడుగుర్నీ కొట్టసాగింది. చచ్చిన ఆవునే మేం తెచ్చుకున్నాం బాబూ అని చెబుతున్నా వినిపించుకోలేదు. వారిలో నలుగురిని కారుకు కట్టేసి టౌన్ కు లాక్కుపోయారు. అందరూ చూస్తుండగా పోలీసు స్టేషన్ సమీపంలోనే చొక్కాలు విప్పి కారుకు కట్టేసి కర్రలతో, ఇనుప రాడ్లతో కొట్టే దృశ్యాన్ని వీడియో తీశారు. అడ్డం వచ్చిన వాళ్ళనూ కొట్టారు. ఆవును చంపితే ఇలానే చావగొడతాం అని చాటింపు వేస్తూ వాట్సాప్ లలో, ఫేస్ బుక్కుల్లో ఆ వీడియోను ప్రదర్శించారు.
వందల సంవత్సరాలుగా చచ్చిన పశువుల్ని ఊరి నుండి ఎత్తివేయడం కులవ్యవస్థ దళితులకు నిర్దేశించిన ధర్మం. మేత వేసి, పెండ తీసి, శుభ్రం చేసి పశువుల్ని సాకేదీ వీళ్ళే. వాటి పాలు పిండుకుని వెన్న, జూన్నూ, నెయ్యి తినే వాళ్ళు ఊరికి దూరం పెట్టిందీ వీళ్ళనే. చచ్చిన పశువు చర్మం వలిచి, దానిని ప్రాసెస్ చేసి తోలు పరిశ్రమకు ఆద్యులైన దళితులు నేడు వేలకోట్ల పరిశ్రమకు ముడిసరుకును అందిస్తున్నారు. దళితుల ఉపాధిని, ఆహారాన్ని నేరంగా ప్రకటించాయి సంఘపరివార్ శక్తులు. ఆవు చచ్చిపోతే గొరక్షకులతో సహా అందరూ కళేబరాన్ని ఎత్తివేయమని వీళ్లకే చెప్తారు. ఇటీవల ఆవు చర్మం వలుస్తున్నారని దళితుల మీద, ఆవుల్ని తరలిస్తున్నారని ముస్లింల మీద సంఘపరివార్ మూకలు పనిగట్టుకుని దాడులు చేయడం పెరిగిపోయింది. మాంసం అమ్ముకోవడంతో పాటు లెదర్ పరిశ్రమకు ముడి సరుకు రవాణా చేసే పనుల్లో ముస్లింలు ఉపాధి పొందుతున్నారు. ఆవు రాజకీయాలు వల్ల ఇప్పుడు దళితులు, ముస్లింలు బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి.
ఉనా సంఘటన, ఇటీవలి కాలంలో జరుగుతున్న అటువంటి అనేక సంఘటనలు నేరాన్నే కాదు, దాన్ని ఆమోదిస్తున్న సమాజ మానసిక స్థితిని అద్దం పడుతున్నాయి. మనుషుల్ని రక్తం కారేలా కొట్టి, హింసించి వీడియో తీసి ఆ హింసోన్మాదాన్ని సంస్కృతీ పరిరక్షణ పేరుమీద ప్రచారం చేసే స్థాయికి ఆ బరితెగింపు చేరుకున్నది. మోడీ నమూనా అభివృద్ధి ముఖమైన గుజరాత్ లోనే కాదు, ఈ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న క్రమంలో ఇటువంటి దాడులు సాధారణమైపోయాయి. దళితుల్ని కొట్టడమో, చంపడమో, వారి విషయంలో ఏ నేరమైనా నిర్భీతిగా చేయగల అవకాశం అగ్రకులానికి ఉంటుంది. వాటిని బిజే.పి రాజకీయాలు మరింత ప్రేరేపిస్తున్నాయి. మొన్న అమలాపురంలో ముగ్గురు దళితులపై జరిగిన దాడి కూడా ఆవు రాజకీయాల విస్తరణే. చచ్చిన ఆవు చర్మం వలుస్తుంటే ఆ ఊరి పెత్తందార్లు గుంపును వెంటేసుకొని వచ్చి తమ ఆవులు మూడు కనిపించకుండా పోయాయని వీళ్లే వాటిని చంపారని చెట్టుకు కట్టేసి ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్ళతో దారుణంగా కొట్టారు.
సంఘపరివార్ ఒక పథకం ప్రకారం చట్టబాహ్యంగా సంచరించే సాయుధ బలగాలను తయారుచేసుకుంటున్నది. వీరికి ఎక్కడికక్కడ పోలీసు, అధికార యంత్రాంగాల మద్దతు ఉంటున్నది. మతం, భక్తి, సెంటిమెంట్ల ముసుగు కప్పుకుని వీరి అరాచకాలకు జనామోదాన్ని కూడగడుతున్నది. గుజరాత్ లో హిందుత్వ రాజకీయం ప్రజాసమూహాన్ని నిట్టనిలువుగా చీల్చింది. ముస్లింలపై దాడులకు దళితులను, ఆదివాసులు కూడా ఎగదోసింది. అంతటితో ఆగదు. మంట రగులుతూనే ఉండాలి. ప్రజలు సమిధలవుతూనే ఉండాలి.
సంఘపరివార్ సాంస్కృతిక పునాది కులవ్యవస్థ మీద ఆధారపడిన సనాతన ధర్మం కాబట్టి అది ఆధిపత్య కులతత్వాన్ని కాపాడుతుంది, పెంచిపోషిస్తుంది. సామ్రాజ్యవాద మార్కెట్ మతాన్ని ఆలంబనగా చేసుకుని దేశమంతా కార్పొరేట్లపరం కావడానికి ఫాసిస్టు మోడీని ప్రమోట్ చేసింది. రైతుల, కార్మికుల వెన్ను విరిచే కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు ఒకవైపు, ఆరెస్సెస్ ఫాసిస్టు రాజకీయాలు ఒకవైపు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. బి.జె.పి అధికారంలోకి వచ్చాక సనాతన ధర్మాన్ని ప్రవచించే సన్యాసులకు ఎక్కడలేని రాజకీయ ప్రాముఖ్యత దక్కింది. అన్ని ప్రగతిశీల, శాస్త్రీయ ఆలోచనలకే కాదు, శ్రమ సంస్కృతికి, శ్రామిక వర్గాలకు వీళ్ళు బద్ధశత్రువులు.
ఉనా ఇప్పుడు ఆవు రాజకీయాలకు బ్రేకింగ్ పాయింట్ అయింది. బతికినంత కాలం ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవుపేడ కూడా ఉపయోగించుకుంటారు కదా. గోవు మీకు తల్లి కదా. మీ తల్లి చచ్చిపోతే పుత్రులుగా మీరే అంత్యక్రియలు జరుపుకోండి అని చచ్చిన ఆవు కళేబరాల్ని వందలుగా తీసుకొచ్చి గుజరాత్ వీధుల్లో పడవేశారు. ఇక నుంచి మేము చచ్చిన గొడ్లను తీయం అని తెగేసి చెప్పారు. సఫాయి పనులు చేయం. మీ మురికి మీరే శుభ్రపరుచుకోండి అన్నారు. తరతరాల అవమానం, అణచివేత, దోపిడిపైన ఆవేశపూరిత యువతరం వీధుల్లోకి వస్తున్నది. ఉనా సంఘటన పట్ల ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉందంటే మీ రాజ్యంలో బతకడం కన్నా చచ్చిపోవడం మేలని కనీసం ముప్పై మంది యువతీయువకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఒక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోరాడి చావడం కన్నా స్వయంహననం అత్యంత బాధాకరం. ఈ బాధ, ఆవేదనంతా ఒక్కచోటికి ఒచ్చి చేరినట్లు ఉనా దళిత్ అత్యాచార్ లడత్ సమితి ఆధ్వర్యంలో జులై 31న అహ్మదాబాద్ లో దళిత మహాసమ్మేళనం జరిగింది. దానికి 20వేల మంది దళితులు హాజరయ్యారు. ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చింది. ఉనాలో ఏవో కొన్ని అరెస్టులు చేసింది. ముఖ్యమంత్రి రాజీనామా చేసింది. ప్రధాని సినిమాటిక్ గ్గా బాధపడ్డాడు. సరిపోవు. ఇవేవీ ఆందోళనలను చల్లర్చవు. ఆజాదీ కావాలి. కులాపీడన నుండి శాశ్వత ఆజాదీ. సంఘపరివార్ కు చెప్పేదొకటే ʹఆవు తోక పట్టుకుని మీరే పొండి. మాకు మా భూములివ్వండిʹ.
ప్రభుత్వం అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపబోతున్నది. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మధ్య ప్రధాన మంత్రి దేశాన్నుద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆ రోజు దళితులూ మాట్లాడబోతున్నారు. ఆగస్టు 5న అహ్మదాబాద్లో దళిత చైతన్యయాత్ర యాత్ర మొదలైంది. అక్కడి నుండి ఊళ్ళు దాటుకుంటూ జనాల్ని కలుపుకుంటూ ఆగస్టు 15 నాటికి ఉనా చేరుతుంది. రోహిత్ వేముల తల్లి వంటివాళ్లు, యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజాసంఘాలు దేశం నలుమూలల నుండి సమూహాలు కలుస్తున్నాయి. ముఖ్యంగా ముస్లింలు కలుస్తున్నారు. ఆరెస్సెస్ విషప్రచార ప్రభావంతో ఒకప్పుడు ముస్లింల మీద దాడిచేసిన దళితులు నేడు ముస్లింలను కన్నీటితో కలుపుకుంటున్నారు. ఆగస్టు 14న ఉనా సమీపిస్తుండగా దాడులు మొదలయ్యాయి. యధావిధిగా పోలీసుల సమక్షంలోనే. కత్తులు, కర్రలు, గాజు సీసాలు రెడీగా ఉన్నాయి, ఉనా వస్తే మీ అంటూ చూస్తాం అని సంఘపరివార్ మూకలు, అవి రెచ్చగొట్టిన అగ్రకులాలు హెచ్చరించాయి. దాడులు మాకు కొత్త కాదు. తరతరాలుగా దాడులకు గురవుతూనే ఉన్నాం. నిజమైన స్వాతంత్రం కోసం ఉనాలో ప్రతిజ్ఞ చేసి తీరుతాం అన్నారు. అన్నట్టుగానే చేశారు. ʹఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో చేయి కలుపుదాం.
Type in English and Press Space to Convert in Telugu |
సోషలిజమే ప్రత్యామ్నాయం, నక్సల్బరీయే భారత విప్లవ పంథా20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణులన్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన లక్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ... |
నేనెందుకు రాస్తున్నాను?
బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక....... |
పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలుసంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విరసం సాహిత్య పాఠశాల కీనోట్)..... |
ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శంఅసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ ....... |
ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్... |
సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹమన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి ....... |
ఇది మనిషి మీద యుద్ధం సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి... |
మంద్రస్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్యదర్శి పి. వరలక్ష్మి కీనోట్... |
ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకైప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య... |
నల్లమలపై అణుబాంబుకృష్ణా, పెన్నా ఆదరువుతో బతుకుతున్న ప్రజానీకం మాత్రం నల్లమల చల్లని నీడలేకపోతే బతకడం కష్టం.మొట్టమొదట యురేనియం కృష్ణను కలుషితం చేస్తుంది.ఈ విధ్వంసం ఆమ్రాబాద్..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |