పొలం ప‌ని చేసుకుంటున్నోళ్ల‌ను కాల్చిచంపారు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

పొలం ప‌ని చేసుకుంటున్నోళ్ల‌ను కాల్చిచంపారు

- పావురిగూడెం ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ నివేదిక | 15.08.2016 10:53:46pm

2005 నుండి దండకారణ్యంలోని ఆదివాసీ ప్రాంతాలన్ని సల్వాజుడుం దాడులతో, 2009 ప్రభుత్వమే ప్రకటించిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ దాడులతో ఆ ప్రాంతంలోని ఆదివాసీల జీవించే హక్కు, జీవనోపాధి హక్కులు అణచివేయబడుతున్నాయి. అటవీ ప్రాంతాలల్లో మావోయిస్టు కారణాన్ని సాకుగా వాడుకుంటూ చట్టబద్ధ పాలనను పూర్తిగా విస్మరిస్తూన్నాయి మన ప్రభుత్వాలు. సల్వాజుడుం దాడుల్లో సుమారు 700 గ్రామాలు దగ్దం కాగా, రెండు లక్షల ఆదివాసులు విస్థాపనకు గురయ్యారు. ఈ పరిస్థితిలో ఢిల్లీకి చెందిన నందిని సుందర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి సల్వాజుడుంను చట్టబద్ధంగా రద్దు చేయించగలిగింది. కాని నేడు అది మళ్లీ కొనసాగుతూ 2016 జూలై 16న పావూరిగూడెంలో నలుగురు గ్రామస్థులను హత్య చేసింది.

ఘటన వివరాలు


2016 జూలై 16న అడవి మార్గం గుండా 25 కిలోమీటర్ల దూరంలోని ఉసూర్‌ పోలీస్‌ క్యాంప్‌ నుండి బయలుదేరిన 500 మంది సిఆర్‌పిఎఫ్‌, డిఆర్‌జి, సల్వాజుడుం బలగాలు 11 గంటల ప్రాంతాలలో పావూరిగూడెం గ్రామాన్ని చుట్టుముట్టడం జరిగింది. ఆ సమయంలో గ్రామాన్ని ఆనుకుని ఉన్న తమ పొలాల్లో మొత్తం ఐదుగురు యువకులు పొలం దున్నుతున్నారు. ఉదయం 6 గంటలకే పొలం దున్నడానికి వెళ్లిన వాళ్లు, పోలీసుల గ్రామాన్ని చుట్టు ముట్టే సమయంలో పక్కనే ఉన్న వాగు దగ్గరికి స్నానానికి కదులుతున్నారు. అప్పటికే వీరికి తెలియకుండా గ్రామాన్ని మూడు వైపులా పోలీసులు, డిఆర్‌జి, సల్వాజుడుం బలగాలు చుట్టుముట్టాయి. వీరు దీనిని గమనించి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఎదురుగా ఉన్న బలగాలు ముందుకు వచ్చి పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశాయి. వీరిని ఈ గ్రామ ప్రజలుగా గుర్తించి చంపించడానికి మార్చి నెలలో సల్వాజుడుంలోకి వెళ్లిన బలరాం ప్రధాన కారకుడని మృతుల బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

నిరాయుధంగా ఉన్న గ్రామస్థులను 500 మంది పోలీసులు పట్టుకుని, ఏం నేరం చేసినా న్యాయస్థానం ముందు నిలబెట్టగలిగే అవకాశం ఉన్నా కాల్చిచంపుతున్నారంటే మొదటగా రాజ్యాంగంపైన, చట్టంపైన నమ్మకం విశ్వాసం లేని వ్యక్తులే ప్రభుత్వ సాయుధ బలగాలలో ఉంటున్నారంటే, వీరికి వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం ఎటువంటి రాజ్యాంగ విలువలతో పరిపాలిస్తున్నారో మరొకసారి మనందరం పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది.

2016 జూలై 16న ఉదయం ఈ ఘటన జరిగింది. కాని దేశంలోని అన్ని ప్రధాన పత్రికలన్ని ఇది పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌గా పతాక శీర్షికల్లో ప్రకటించాయి. పత్రికలు పాలకుల భాషను, రాజ్యం భాషను మాట్లాడుతున్నాయి. రాస్తున్నాయి. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియడం లేదు. ఈ వాస్తవాలను వెలికితీయడం కోసం ఈ నెల 6, 7 తేదీలలో పావూరిగూడెం గ్రామానికి పౌరహక్కుల సంఘం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధ్యులు ప్రొ. లక్ష్మణ్‌, ఎన్‌. నారాయణరావు, మాదనకుమార స్వామి, విప్లవ్‌కుమార్‌, చిలకా చంద్రశేఖర్‌, బొమ్మాయ్‌లతో పాటు మానవ హక్కుల వేదికకు చెందిన ఖాదర్‌ బాబా పాల్గొన్నారు.

పావూరిగూడెం బీజాపూర్‌ జిల్లాలో ఉసూర్‌ బ్లాక్‌కు చెందిన చిన్న గ్రామం. ఇది ఉసూరు బ్లాక్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌లో భాగంగా ఉసూరు గ్రామంలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేయబడి ఉంది. ఈ పోలీసుల సహకారంతో సల్వాజుడుం కార్యకర్తలు కొత్తగా గ్రామాల్లో సల్వాజుడుం కార్యకర్తలను చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బిజేపికి చెందిన చత్తీఘడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ప్రభుత్వ పాలనలో చట్ట ఉల్లంఘనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. సోనీసొరిపై జరిగిన దాడితో రమణ్‌సింగ్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక పరిపాలన ప్రపంచానంతటికి తెలిసిపోయింది. ఢిల్లీకి చెందిన నందినీ సుందర్‌ సల్వాజుడుం దుర్మార్గాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తన తీర్పులో సల్వాజుడుం చట్టవిరుద్ధం, దాన్ని రద్దు చేయాలని తీర్పు 2011లో వెలువరించారు. అయినా కాని కోర్టు తీర్పును పాటించకుండానే ఈ సంవత్సరం మార్చి నెలలో బలరాం అనే నంబి గ్రామానికి చెందిన యువకున్ని సల్వాజుడుంలో చేర్చుకుని దాడులు చేస్తున్నారు. సల్వాజుడుం, సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా బలగాలు 2016 జూలై 16న ఉదయం 11 గంటలకు గ్రామాన్ని చుట్టుముట్టడం జరిగింది. పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న యువకులు పోలీసుల రాకను దూరం నుండి గమనించలేకపోయారు. పొలం పనులు ముగించుకుని పక్కనే పారుతున్న వాగులోకి స్నానానికి బయలుదేరి పోతున్నారు. ఊరికి తూర్పు వైపు నుండి దగ్గరికి వస్తున్న పోలీసు బలగాలను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పడమర వైపున ఉన్న వాగు వైపున ఉన్న బలగాలు దగ్గర దాకా వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపేసరికి నలుగురు గ్రామస్తులు అక్కడికక్కడే చనిపోయారు. కురకు బామన్‌ అనే యువకుణ్ని పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడం జరిగింది. ఇది 11 గంటలకు వీరు నలుగురిని చంపి, గ్రామస్తులను దగ్గరికి రానీయకుండా సాయంత్రం 4 గంటల వరకు శవాలను అక్కడే ఉంచి, ఆ తర్వాత అడవి మార్గం గుండా పెద్ద దుంగలకు శవాలను కట్టుకుని ఉసూరు పోలీసు క్యాంపుకు తీసుకెళ్లడం జరిగింది. అక్కడే అరెస్ట్‌ చేసిన బామన్‌పై 307 కింద కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. జూలై 16 ఉదయం 11 గంటలకు కాల్చి చంపి, 18న అర్ధరాత్రి శవాలను గ్రామానికి పంపిచ్చారు. పురుగులు పట్టిన శవాలను ఆ అర్ధరాత్రే దహనం చేశారు. శవాలను చూడకుండా గ్రామస్థులకు తుపాకులతో బెదిరించడం, లాఠీలతో కొట్టడం జరిగింది.

హత్యగావించబడిన వారి వివరాలు

1) మాడివి ఉంగా:- ఇతను పావూరిగూడంకు పక్కనే ఉన్న సింగంపల్లి గ్రామానికి చెందిన వాడు. పొలం పనుల్లో వారితో పాటే ఉండి పొలం దున్ని స్నానాలు చేయడానికి ఉపక్రమిస్తున్న క్రమంలో కాల్చి చంపారు.

2) తాతి దూల:- దూల ఐదుగురు అన్నదమ్ములు. ఉమ్మడి పొలం. ఉమ్మడి కుటుంబం. దూలకు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పటివరకు దూలపై ఎటువంటి కేసులు లేవు. అయినా కాని కనిపించిన గ్రామస్థులను కాల్చి చంపి మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ అని ప్రకటించారు.

3) ముచాకీ అయిత:- భార్య పేరు ముచాకీ దేవే. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వీరి పొలాలన్ని ఊరిని ఆనుకుని పక్కపక్కనే ఉన్నాయి. ఆదివాసులు ఉదయమే 6 గంటలకే పొలంలోకి వెళ్లి 11 గంటలకు భోజనానికి ఇంటికి చేరుతారు. ఈ క్రమంలోనే భూమిని దున్నిన తర్వాత వాగుకు వెళ్లే ప్రయత్నంలో పోలీసులు కాల్చి చంపినారు.

4) మడకం లచ్చా:- భార్య పేరు మడం దేవే. ఒక్కడే కొడుకు. స్కూళుకు కూడా వెళుతున్నాడు. ఈ హత్యతో ఇప్పటికి కూడా తేరుకోలేకపోతున్నారు.

ఇలా గ్రామస్థులను పోలీసులు కాల్చిచంపితే మేమేం చెయాలి అని బాధితులు మనలందర్ని ప్రశ్నిస్తున్నారు. నేరస్థులను శిక్షించాల్సిన చట్టాలు ఉన్నా, నేరస్థులు అవునో కాదో, న్యాయస్థానాల వరకు వెళ్లకుండానే పోలీసులే హత్యలు చేస్తూ న్యాయవ్యవస్థ ఉండి ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. నేరం చేస్తే శిక్షించాలి కాని కాల్చి చంపడం ఏ విధంగా న్యాయమవుతుంది అని దేవే ప్రశ్నిస్తుంది. ఆక్రోషిస్తున్నది.

ముగింపు


2009లో ప్రారంభించిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ దశల వారిగా, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ ఆదివాసులను హత్య చేస్తున్నది. 2009లో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ ఆదివాసుల హత్యాకాండ తప్ప మరొకటి కాదని మేం ప్రకటిస్తూనే ఉన్నాం. వివిధ రాష్ట్రాల్లో బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు నిర్విద్వంద్వంగా దీనిని వ్యతిరేకిస్తున్నారు. వారిపై కూడా అక్రమ కేసులు బనాయిస్తూ వారిని అక్రమ నిర్బంధాలకు గురిచేస్తున్నది ప్రభుత్వం. 2012లో ఇదే బీజాపూర్‌ జిల్లా బాసగూడాలో 17 మంది ఆదివాసులు, అందులో ఐదుగురు మైనర్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి పెద్ద ఎన్‌కౌంటర్‌ అని అప్పటి హోంమంత్రి చిదంబరం గొప్పగా ప్రకటించాడు. చివరికి చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తులే నిజనిర్ధారణ చేసి ఇది ఆదివాసుల ఊచకోత అని ప్రకటించారు. నేడు మొత్తంగా ఆదివాసీ ప్రాంతాలలో జరుగుతున్నది ఆదివాసుల హత్యాకాండే. జూన్‌ నెలలో సుక్మా జిల్లా కుంట బ్లాక్‌కు చెందిన గోంపాడ్‌ గ్రామానికి చెందిన మడకం ఇడిమెను ఇంటి నుండి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై చత్తీస్‌ఘడ్‌ హైకోర్టు రీపోస్ట్‌మార్టంకు ఆర్డర్‌ ఇచ్చింది. అయినప్పటికీ పోలీసు బలగాలతో ఆదివాసులపై దాడులు నిలుపుదల చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. అందుకే పావూరిగుడెం హత్యాకాండ జరిగింది. దీని తర్వాత కూడా మరొక నలుగురిని, మరొక ఇద్దరిని ఎన్‌కౌంటర్‌ పేరుతో ఇదే చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం దంతెవాడలో చంపినారు. రోజు అత్యాచారాలు, హత్యాకాండలతో ఆదివాసులు బెదిరిపోతూ, జీవనోపాధిని వదిలి ఎటైనా పారిపోయి నిర్వాసితులు కావాలని, ఆ క్రమంలో అక్కడ ఉన్న ఖనిజ సంబదలు బహుళజాతి కంపెనీలకు అప్పగించడానికి ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు ప్రజాస్వామికవాదులుగా మనందరం అర్థం చేసుకోని ఈ ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.

పావూరి గూడెంలో హత్యాకాండ పూర్తయిన తర్వాత గ్రామంపై పోలీసు బలగాలు దాడి చేస్తూ, వారి సాంప్రదాయ ఆయుధాలైన బాణం, విల్లంబులను జప్తు చేసుకుంటూ, వారి మేకలను, కోళ్లను, డబ్బును బలవంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డం వచ్చిన వారినందరిని నిర్దాక్షిణ్యంగా చితకబాదారు. అలా గాయాల పాలైన వాళ్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసులు వారు అక్కడ జీవించి ఉండాలంటే వారి మీద, ఆర్థిక స్థితి మీద ఎటువంటి దాడులు చేయాలో ప్రభుత్వమే పథకాలు తయారు చేస్తూ పోలీసు బలగాలతో దాడులు చేపిస్తున్నది. ఆదివాసీ ప్రాంతాల్లో సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా, సల్వాజుడుం బలగాలతో దాడులు చేస్తున్నారు మరియు నగర, పట్టణ ప్రాంతాల్లో దళితులపై భజరంగ్‌దళ్‌, గోరక్షణ కమిటీ పేరుతో దాడులు కొనసాగిస్తున్నారు. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ దేశమంతటా కొనసాగిస్తున్నది. 2009 నుండి ఎన్నెన్నో నిజనిర్ధారణల నివేదికలను ప్రభుత్వం ముందు పెట్టాం. ఆదివాసి గ్రామాలపై జరిగిన సామూహిక హత్యాచారాలపై కేసులు నమోదు చేయించాము. ముఖ్యంగా కున్నా, నేంద్ర, గంగులూరు గ్రామాలపై జరిగిన దాడులపై కేసులు నమోదు చేయించాము. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఈ దాడులను నియంత్రించే ప్రయత్నం కొనసాగడం లేదు.

పావూరి గూడెం ఘటన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌లో భాగంగా సల్వాజుడుం, కోబ్రా, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు సంయుక్తంగా కలిసి కొనసాగిస్తున్న హత్యాంకాడలో భాగంగానే జరిగింది.

డిమాండ్స్‌


1) పావూరిగుడెం గ్రామస్థులను హత్యచేసిన పోలీసులపై 302 హత్యానేరం కింద కేసు నమోదు చేసి శిక్షించాలి.

2) సుప్రీంకోర్టు రద్దు చేసిన సల్వాజుడుంను కొనసాగిస్తున్న పోలీసు అధికారులను చట్టపరంగా శిక్షించాలి. దీనికి ప్రతిగా ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను కోర్టు తీర్పు ఉల్లంఘనకు కేసు నమోదు చేసి శిక్షించాలి.

3) ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌లో భాగంగా జరుగుతున్న ఈ మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేయాలి. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను వెంటనే రద్దు చేయాలి.

4) ఆదివాసుల జీవించే హక్కుకై, జీవనోపాధి హక్కుకై ప్రభుత్వం హామీ పడాలి.

5) 2009 నుండి నేటి పావూరి గూడెం ఘటన వరకు జరిగిన హత్యలన్నింటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జిచే న్యాయవిచారణ జరిపించి బాధ్యులైన వారినందరిని శిక్షించాల్సిన అవసరం ఉంది.

6) ఆదివాసీ ప్రాంతంలో పెట్టిన పోలీసు క్యాంపులన్నిటినీ ఎత్తివేయాలి.

- పౌరహక్కుల సంఘం

No. of visitors : 2632
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కూలీల‌ను కాల్చిచంపి.. మావోయిస్టుల ముద్ర‌వేశారు

గుముడుమహా ఎన్‌కౌంటర్‌ పై clc నిజ నిర్దారణ | 20.07.2016 06:43:38pm

కూలీలు ఆటోను ఎక్కబోతుండగా రోడ్డుకు ఎడమ ప్రక్క చెట్ల పొదల్లో మాటు వేసి కూర్చున్న పోలీసు బలగాలు ఒక్కసారిగా వారి మీదకు కాల్పులు జరిపారు. 5 మంది కూలీలు.......
...ఇంకా చదవండి

నిషేదాలు, నిర్భందానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో స‌ద‌స్సు

| 09.09.2016 09:38:48am

రాజ‌కీయ, సామాజిక‌, సాంస్కృతిక నిషేదాల‌కు వ్య‌తిరేకంగా; హ‌క్కులు, స్వేచ్ఛా న్యాయాలు క‌లిగిన ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ‌కై ఢిల్లీలో ధ‌ర్నా, స‌ద‌స్సు.........
...ఇంకా చదవండి

చంద్ర‌బాబుకు బహిరంగ‌లేఖ‌

పౌర హ‌క్కుల సంఘం | 02.11.2016 09:45:50am

అసలు ప్రభుత్వం టార్గెట్ ఎంత? ఇందులో మావోయిస్టులతో పాటు ఎంతమంది సాధారణ ఆదివాసీలను చంపాలనుకుంటున్నారు. న‌క్స‌లైట్ ఉద్య‌మం కారణంగా మన రాష్ట్రంలోకి .......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి -2018
  Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
  ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
  కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
  బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
  హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
  ఇప్పుడు
  నిలబడి తీరాల్సిన దారుల్లో...
  ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
  ఈ పక్షం బుల్పికలు!
  హ‌క్కులపై ఉక్కుపాదం
  పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •