ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

| సాహిత్యం | వ్యాసాలు

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

- వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ న్యాయమైంది, ప్రజాస్వామికమైంది, మానవీయమైంది

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులో న్యాయమైన వాటా రావాలన్నది మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి డిమాండ్‌. ఇది న్యాయమైనది, ప్రజాస్వామికమైనది, రాజ్యాంగబద్ధమైనది మాత్రమే కాకుండా, రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు ఆశించిన ఆదర్శానికి అనుగుణమైనది.

ఎస్‌సిలకు, ఎస్‌టిలకు చట్టబద్ధంగా మాత్రమే కాకుండా రాజ్యాంగంలోనే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించారంటే దానికి సుదీర్ఘమైన సామాజిక కారణాలున్నాయి. నిచ్చెనమెట్ల బ్రాహ్మణీయ భూస్వామ్య హిందూ కుల వ్యవస్థ ఈ దేశ మూలవాసులను ఆటవికులుగానూ, అనాగరికులుగా పరిగణించింది. కాని వాళ్లు సంరక్షకులుగా ఉన్న ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నది. దోచుకుంటున్నది. దళితుల ఆవాసాలను ఊరు వాడ వివక్షకు గురిచేసి వాళ్లను అంటరానివారిగా చూసింది. చూస్తున్నది. కాని భూమి పుత్రులయిన వాళ్ల శ్రమను, నైపుణ్యాన్ని కొల్లగొడుతున్నది. దోచుకుంటున్నది. చిరకాలం వాళ్ల శ్రమ అంతా వెట్టి చాకిరీయే అయింది. వాళ్ల జీవితాలు సేవావృత్తిలో, సాంస్కృతిక, సామాజిక బానిసత్వంలోనే మగ్గిపోయినవి.

జ్యోతిబాఫూలే మొదలు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ వరకు చేసిన పోరాటాల వలన, రాజ్యాంగ రచనకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అధ్యక్షత వహించినందున ఈ వివక్ష, అణచివేత, దోపిడీ - వీటికి వ్యతిరేకంగా దళితులు, ఆదివాసులు చేసిన పోరాటాలను గుర్తించి విద్యా, ఉద్యోగ రంగాల్లోనే కాదు, రాజకీయ ప్రాతినిధ్యంలోనూ రాజ్యాంగమే ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్‌లు కల్పించింది. అంటే ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లకు కేవలం చట్టపరమైన హామీయే కాదు, రాజ్యాంగపరమైన హామీ ఉన్నది.

ఒక రకంగా ఎస్‌సి వర్గీకరణకు ఈ రాజ్యాంగ పరమైన హామీయే ప్రతిబంధకంగా ఈ నిచ్చెనమెట్ల బ్రాహ్మణీయ కుల వ్యవస్థ అడ్డం పెడుతున్నది. రాజ్యాంగ సవరణ చేసి ఈ వైరుధ్యాన్ని ప్రజాస్వామికంగా పరిష్కరించాల్సి ఉన్నది. ఈ ఇరవై రెండేళ్లలో ఎస్‌సి వర్గీకరణను బలపరచని రాజకీయ పార్టీలేదు. అఖిల భారత పార్టీలైన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, బిజెపి, బిఎస్‌పి మొదలు ప్రాంతీయ పార్టీలన్నీ బలపరుస్తున్నాయి. బలపరచాయి.

1975లో పంజాబ్‌లో జైల్‌సింగ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణను అమలు చేసింది. 1994లో హర్యానాలో భజన్‌లాల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసింది. 1997లో ఒకసారి, 2000-2004 మధ్య మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు టిడిపి ప్రభుత్వం అమలు చేసింది.

2001లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రబుత్వం కొంతకాలం అమలు చేసింది. తమిళనాడులో కాంగ్రెస్‌ మిత్రపక్షమైన డిఎంకె ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణను అమలు చేసింది.

1998, 2000 సంవత్సరాలలో టిడిపి చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్‌సి వర్గీకరణ బిల్లును శాసనసభలో ప్రతిపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్‌ బలపరిచింది. బిజెపి కూడా బలపరిచింది.

2004లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును బిజెపి బలపరిచింది. ప్రతిపక్షమైన టిడిపి బలపరిచింది.

రెండు సందర్భాల్లోనూ శాసనసభలో ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ మొదలు బిజెపి టిడిపి మొదలైన అన్ని పార్టీలు బలపరచి ఏకగ్రీవ తీర్మానమైంది.

హర్యానాలో ఎస్‌సి వర్గీకరణ 2006లో కోర్టు ద్వారా రద్దయితే, తాము అధికారానికి వస్తే చట్టం చేసి మళ్లీ అమలు చేస్తామని బిజెపి 2009, 2011 ఎన్నికల మానిఫెస్టోలో వాగ్దానం చేసింది.

కర్ణాటకలో 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన ఎన్నికల మానిఫెస్టోలో వాగ్దానం చేయడమే కాకుండా ఎస్‌సి వర్గీకరణకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేయాలని బిజెపి ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఎస్‌సి వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన సదాశివన్‌ కమిషన్‌ నివేదికను అమలు చేస్తామని ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య బహిరంగంగా ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌సి వర్గీకరణ చేస్తామని 2012లో కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నది.

పంజాబ్‌లో అకాలీదళ్‌ (బిజెపితో పొత్తు ఉన్న) ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణను అమలు చేస్తున్నది. అట్లే బిజెపికి అనుకూలమైన జయలలిత ప్రభుత్వం తమిళనాడులో ఎస్‌సి వర్గీకరణను అమలు చేస్తున్నది. కనకు మలి తెలంగాణ ఉద్యమం కన్నా సుదీర్ఘమైన ఎస్‌సి వర్గీకరణ ఉద్యమానికి ఆటంకం ఉన్నది ఏ పార్లమెంటరీ పార్టీ కాదన్నమాట. ఏ అధికారంలో ఉన్న పార్టీ కాదన్నమాట. మరి ఏది ఆటంకం? పార్లమెంట్‌లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ జరగడమొక్కటే జరగవలసి ఉన్నది. అక్కడ అవసరం అయింది మాటలు కాదు, చేతలు. చిత్తశుద్ధి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి వర్గీకరణను సిఫారసు చేసిన ఉషా మెహ్రా కమిషన్‌ మొదలు కర్ణాటకలో సదాశివన్‌ కమిషన్‌ వరకు అన్ని న్యాయ కమిషన్‌లు ఎస్‌సి వర్గీకరణ రాజ్యాంగబద్ధమైనది, న్యాయమైనది అని సిఫారసు చేసినవే.

రాజ్యాంగ సవరణ జరుగకుండా ఎస్‌సి వర్గీకరణ కుదరదని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో ఈ పోరాటం మళ్లీ మొదటికి వచ్చింది గానీ, 1997లో ఒకసారి, 2000-2004 మధ్యలో మరోసారి ఎస్‌సి వర్గీకరణ అమలు జరిగిన కాలంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో 1997 నుంచి 2004 వరకు (కొంత మూడేళ్ల ఆటంకంతో) విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వర్గీకరణ ప్రాతిపదికగా అమలు కావడం వల్లనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గానీ, గత ఇరవై సంవత్సరాల ప్రజాస్వామిక పోరాటాల్లో గానీ మాదిగల, మాదిగ ఉపకులాల ప్రాతినిధ్యాన్ని, నాయకత్వాన్ని మనం ఎంతో ఎక్కువగా చూడగలిగాం. ఇది ఒక ప్రజాస్వామికమైన పరిణతి.

1994లో ఎస్‌సి వర్గీకరణ పోరాటం ప్రారంభమైనప్పటి నుంచీ పైన పేర్కొన్న అన్ని పార్లమెంటరీ పార్టీలే కాదు ఎంఎల్‌ పార్టీలు కూడా వర్గీకరణను బలపరుస్తున్నాయి. అప్పటి సిపిఐ ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌, 2004 నుంచి సిపిఐ మావోయిస్టుగా ఏర్పడినాక కూడా క్రియాశీలమైన మద్దతునిస్తున్నది. 1994లోనే ప్రజా గాయకుడు గద్దర్‌ నాయకత్వంలో యాభైకి పైగా ప్రజాసంఘాలతో ఎస్‌సి వర్గీకరణ కోసం పోరాట ఐక్య సంఘటన ఏర్పడింది. ఎన్‌కౌంటర్‌ మృతదేహాల స్వాధీనం మొదలుకొని, వికలాంగుల కోసం, గుండె జబ్బులొచ్చిన పసిపిల్లల కోసం పోరాడే విస్తృతిని, వైశాల్యాన్ని మానవీయ స్పందననకు ఎంఆర్‌పిఎస్‌ తన పోరాట ఆచరణగా మార్చుకున్నది. బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించడం, విప్లవకారుల అంత్యక్రియలకు హాజరుకావడం వంటి ప్రజాస్వామిక సంఘీభావంతో మొదలై ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచేదాకా ఈ కార్యాచరణ విస్తరించింది.

ఎస్‌సి వర్గీకరణ, మాదిగ, మాదిగ ఉపకులాల కోసం జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్‌లు కావాలనేది ప్రధాన ఎజెండా కావడం వల్ల ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆయా కాలాల్లో అధికారంలో ఉన్న, లేదా రాగలరని తాను భావించిన పార్టీలకు కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి, టిఆర్‌ఎస్‌ వంటి పార్టీల వర్గ స్వభావంతో నిమిత్తం లేకుండా బలపరచి ఉండవచ్చు. ఆయన నుంచి వేరుపడిన వాళ్లు కూడా వర్గీకరణ కోసమేనని అధికారంలో ఉన్న పార్టీలకు కూడా మద్దతునిస్తున్నారు. ఇటువంటి అస్తిత్వ ఉద్యమాలకుండే పరిమితియే అది. అంతమాత్రాన ఎస్‌సి వర్గీకరణ దాని ప్రజాస్వామిక, మానవీయ స్వభావాన్ని కోల్పోదు. అది న్యాయమైంది కాకుండా పోదు. మాదిగలు, మాదిగ ఉపకులాలు - సఫాయి కర్మచారులుగా, చర్మకారులుగా ఇవ్వాళ బ్రాహ్మణీయ భూస్వామ్య హిందూ కుల వ్యవస్థ వివక్షను, అంటరానితనాన్ని, దాడులను ఎదుర్కొంటున్న తీరును దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ సందర్భంలో ఎస్‌సి వర్గీకరణను బలపరచడం మన మానవీయ సంఘీభావానికి ఒక లిట్మస్‌ టెస్ట్‌.

శ్రమలోనూ, ఉత్పత్తిలోనూ పాల్గొనని పరాన్న భుక్కులు సమాజాన్ని మలినం చేస్తుంటే, సమాజాన్ని పరిశుభ్రం చేసే వాళ్లు మాదిగలు, మాదిగ ఉపకులాలు. రోడ్ల మీద గట్టర్లలో దిగి, ల్యాట్రిన్‌లలో చేతులు పెట్టి, మలమూత్ర విసర్జనలు నెత్తిపై మోసి ʹస్వచ్ఛ భారత్‌ʹను అక్షరాల సాధిస్తున్న వాళ్లు ఈ అంటరానివాళ్లు. ఆరోగ్యంగా ఉండి పాలిచ్చినప్పుడు, సంతానాన్నిచ్చినప్పుడు గోవులను బ్రాహ్మణీయ భావజాలం కల వాళ్లు పూజిస్తే, దూడ దగ్గరి నుంచి సాకి, పశువుల్లో తాము పశువులై, తమ తోటి ప్రాణుల వలె చూసుకొని, అవి కళేబరాలయ్యాక కౌలు కంపు వ్యాపించకుండా శుభ్రం చేసి ప్రపంచంలో చర్మ పరిశ్రమకు ఒక సుదీర్ఘ కాలపు నాగరిక స్థాయిని సమకూరుస్తున్న వాళ్లు ఈ చర్మకారులు. మాంస విక్రయం ద్వారా, పశు చర్మాల విక్రయం ద్వారా భారత ప్రభుత్వానికి, కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న జాతి ఇది.

జూలై 18 నుంచి ఆగస్ట్‌ 12 వరకు జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో జూలై 19 నుంచి ఆగస్ట్‌ 12 వరకు 25 రోజుల పాటు ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు.

అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నవి. మరి కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న యుపిఎ గానీ, రెండు సంవత్సరాల రెండు నెలలకు పైగా అధికారంలో ఉన్న ఎన్‌డిఎ గానీ పార్లమెంట్‌లో చట్టం చేయడానికి ఎందుకు ప్రయత్నించనట్లు? తాను కేంద్రంలో అధికారంలోకి వస్తే, వంద రోజులలోపే పార్లమెంట్‌లో చట్టం చేస్తానన్న బిజెపికి ఎన్‌డిఎలో భాగంగా కాదు, విడిగానే పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ ఉన్నది. ఏ పోరాటంలోనైనా ఎంఆర్‌పిఎస్‌ కుడిభుజంగా కనిపించిన బిజెపి రాజకీయ పార్టీగా వర్గీకరణను బలపరిచి, అధికారానికి వచ్చిన తరువాత భావజాల పరంగా అంటరానితనాన్ని, ఊరువాడ వివక్షను, గోరక్షణ, గోభక్షణ ద్వేషాన్ని పాటిస్తున్నదని ఆరోపిస్తే అందులో తప్పేమున్నది?

వ్యవస్థగా అంటరానివారిగా చూస్తూ, దాడులు, లైంగిక అత్యాచారాలు, హత్యలు చేస్తున్న ఈ బ్రాహ్మణీయ, భూస్వామ్య హిందూ కుల వ్యవస్థ ఎన్నికల రాజకీయాలు వచ్చేవరకు మాత్రమే ఎస్‌సి వర్గీకరణను సమర్థిస్తుందని అనుకోవాల్సిందేనా! ప్రజాస్వామ్య, మానవీయ శక్తులు సంఘటితంగా ఇవ్వాళ పార్లమెంటరీ పార్టీలకు వేయవలసిన ప్రశ్న ఇది.

ఎందుకంటే ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక అవుతుంది. అది న్యాయమైనది, ప్రజాస్వామికమైనది, మానవీయమైనది.

(ఆగస్ట్‌ 10 ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర ఎంఆర్‌పిఎస్‌ మహా ప్రదర్శనకు సంఘీభావంగా అన్ని రాజకీయ పార్టీల సభ సందర్భంగా)






No. of visitors : 1302
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

ప్ర‌పంచ చ‌రిత్ర అంతా వ‌ర్గ పోరాటాల చ‌రిత్రే

varavararao | 31.05.2017 06:44:19pm

మే 22 నుంచి 25 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ విర‌సం మార్క్సిస్టు పాఠ‌శాలలో కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు ప్రారంభోప‌న్యాసం...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తెగులు సోకిన రచయితలారా రండీ
    ఎవరి ప్రాభవం తండ్రీ..
    వెలివేయబడ్డ అక్షరం
    గుండె గుర్తులు వెతుక్కుంటూ
    ఏ స‌మాజం కోసం?
    సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
    అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
    ప్రతివాది
    కవి ఎక్కడ?
    ధిక్కార స్వరాలకు ఆహ్వానం
    సౌందర్యాత్మక కవిత
    అమ్మకొ లేఖ!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •