అప్పటికే వరంగల్‌లో ఉండి నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాల గురించి, సాహిత్య రంగంలో అందుకు మేం చేయదగిన దోహదం గురించి మధనపడుతున్న మాకు కాశీపతి పేరు 1969 ʹజనశక్తిʹ పత్రిక ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. అప్పటికింకా ʹతిరుగబడుʹ కవితా సంకలనం రాలేదు. అప్పటి నుంచి చాలాకాలం దాకా శ్రీశ్రీ నుంచి కాశీపతి పలికించిన ʹచీపురు పుల్లలతో విప్లవం రాదుʹ అనే మాట చాలా ప్రచారం అయింది. ʹపోరాటమంటే సాయుధ పోరాటమే కదాʹ అనే ప్రశ్న వేసి ఈ జవాబు ఆయన రాబట్టాడు. అంతమాత్రమే కాదు, ʹనేను శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వాడినే... నేను వాళ్లతో సజీవమైన సంబంధం పెట్టుకోదలిచాను... సందేశాలతో ప్రయోజనం లేదు... అందుకనే వాళ్లకిప్పుడు ఏ సందేశం ఇవ్వలేకపోతున్నాను...ʹ అనే జవాబు చెప్పించినవాడు ఆయనే. కాశీపతి ప్రశ్న ʹశ్రీకాకుళంలో గిరిజనులు ఈనాడు దోపీడి వ్యవస్థను అంతం చేయడానికి సాయుధులై అన్ని త్యాగాలకు సిద్ధమై పోరాడుతున్నారు. ఒకనాడు తెలుగుజాతిని మేల్కొల్పిన మహాకవిలా వారికి మీ సందేశం ఏమిటి?ʹ
ఈ ఇంటర్వ్యూలో కాశీపతి తానే స్వయంగా ʹప్రధానంగా అభ్యుదయ మహాకవులైన మిమ్మల్ని రాజకీయ చర్చల్లోకి లాగానుʹ అని, ʹశ్రీశ్రీ గారు రాజకీయ విషయాలపై జరిగిన సమగ్రమైన ఇంటర్వ్యూలో కూడ ఆలోచించి ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా ఉపయోగించారుʹ అని రాసాడు. దానికి శ్రీశ్రీ కూడా ʹప్రపంచ రాజకీయ పరిస్థితి గురించి సింహావలోకనం చేసుకోవడానికి నాకీనాడు అవకాశం కల్పించారుʹ అని వినమ్రంగా ఒప్పుకున్నాడు.
ʹరెస్ట్ ఈజ్ హిస్టరీʹ అన్నట్టుగా శ్రీశ్రీ షష్టిపూర్తి (1970 ఫిబ్రవరి), విరసం ఏర్పాటు (1970 జూలై 4) తరువాత యాదాటి కాశీపతి 1972 అక్టోబర్ గుంటూరు మహాసభల్లో విరసంలో చేరాడు. అప్పటికే ఆయన మూడేళ్లుగా విజయవాడ నుంచి వెలువడుతున్న ʹజనశక్తిʹ పత్రికకు సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన రాజకీయాభినివేశం గురించి తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులతో ప్రారంభమై 1972 నాటికే చండ్రపుల్లారెడ్డి, అంతకన్నా ముఖ్యంగా మాకు సన్నిహితంగా ములుగులో తెలిసిన పొట్లూరి రామనర్సయ్య గారి రాజకీయాల స్పోక్స్‌మెన్‌గా ఆ మూడేళ్లూ కాశీపతి గురించి పరోక్షంగా వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అవే రాజకీయాలతో వరంగల్‌లో ఉన్న అట్లూరి రంగారావు, కానూరి వెంకటేశ్వరరావుల ద్వారా. ఇదే గుంటూరు మహాసభల్లో అజ్ఞాతంలో ఉన్న శివసాగర్‌కు విరసం గౌరవ సభ్యత్వం ఇచ్చాం. కాశీపతి విరసం సభ్యత్వానికి దరఖాస్తు పెడితే ఆయనకు రాజకీయాభినివేశమే కాని సాహిత్య ప్రవేశం లేదేమోనని సందేహించాం. కాని ఆయన మంచి కవి అని, వక్త అని, సాహిత్య విమర్శకుడు అని ఆ రెండు రోజుల సభల్లోనే ఆయనతో పరిచయమే సాన్నిహిత్యమైన సందర్భంలో అర్థమైంది.
అనంతపురంలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 74 సంవత్సరాల క్రితం (1942) పుట్టిన యాదాటి కాశీపతి సహజంగానే 1967 నాటికి తన ఇరవై ఐదేళ్ల వయసులో ఒక విద్యావంతుడుగా, ముఖ్యంగా జర్నలిజంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ పొందిన ప్రతిభాశాలిగా నక్సల్బరీ రాజకీయాల వైపు ఆకర్షితుడు కావడం ఆశ్చర్యం కాదు. కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలు మొదలు ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఖరగ్‌పూర్ ఐఐటి మొదలు ఇంకెన్నో ఉన్నత విద్యాలయాల వరకు అత్యంత ప్రతిభాశాలురు నక్సల్బరీ రాజకీయాల వైపు ఆకర్షితులు కావడం అప్పుడు వీచిన గాలి ప్రభావం.
నిన్న (2016 ఆగస్ట్ 11) సాయంత్రం వార్త తెలియగానే వెళ్లినప్పుడు ఆయన మృతదేహం దగ్గర తెలిసిన విషయం నన్ను మరింత ఆశ్చర్యపరిచింది. ఆయన ఐఎఎస్‌కు ఎన్నికై శిక్షణకు ట్రెయినింగ్‌కు వెళ్లే ముందు అప్పటికే ఆయన అత్యంత అభిమానించే చండ్రపుల్లారెడ్డి గారి దగ్గరికి ఆ విషయం చెప్పడానికి విజయవాడకు వెళ్లాడట. ప్రభుత్వ సేవ చేయదలచుకున్నావో, ఇప్పటి తరుణంలో ప్రజల సేవ చేయదలచుకున్నావో ఎంచుకో అన్నాడట సిపి. అంతే, ఆయన ʹజనశక్తిʹ పత్రికలో చేరిపోయాడు.
తనకు సాహిత్యాభినివేశం లేదేమోననే మా సందేహాన్ని తీర్చడానికి అన్నట్లుగా కాశీపతి గుంటూరు మహసభలైన ఒకటి రెండు ఏళ్లలోనే ʹఎర్ర పిడికిలిʹ అనే కవితా సంకలనం వెలువరించి కెవిఆర్‌తో, నాతో ముందుమాటలు రాయించుకున్నాడు. 1972 నుంచి ఆఖరి శ్వాస దాకా మాకు అత్యంత సన్నిహితమైన స్నేహం. ఆయన స్వభావంలోనే ప్రేమాస్పదమైన స్నేహభావం ఉన్నది. చలసాని ప్రసాద్ వలెనే మనిషి కలవగానే పెనవేసుకుపోతాడు. అద్భుతమైన సంభాషణాశీలి. దానికితోడు నోట్లో సిగరెట్టు పెట్టుకొని పెదవుల మధ్య ఆడిస్తూ అంతే వేగంగా మాట్లాడే ఆయన మ్యానరిజం ఆయనతో పరిచయం ఉన్న ఎవరూ మరచిపోరు.
పదేళ్ల కింద పార్కిన్సన్ జబ్బు రావడం కన్నా ముందే, బహుశా 1980ల నాటికే ఆయన శరీరంలో స్వేద గ్రంథుల నుంచి చాలా పల్చటి రక్తబిందువులు కూడా వచ్చేవి. 1982 గుంటూరు జిల్లా మాచెర్లలో జరిగిన విరసం మహాసభల్లో కార్యవర్గ సమావేశంలో ఇద్దరం తీవ్రమైన పొలిమికల్ చర్చ చేసుకున్నాం. (గుంటూరు నుంచి మాచెర్ల దాకా పదేళ్లు విరసం సభల్లో బహుశా మేం అట్లా తలపడని సందర్భాలు ఉండవు. బయటికి రాగానే చెట్టపట్టాల్ వేసుకొని కలబోసుకోని సందర్భాలు ఉండవు.) బయటికి వస్తూనే ఆయన శరీరం నుంచి పల్చటి చెమట, అది కాస్త ఎర్రగా రావడం గమనించి అడిగాను. అందుకే ఆయన ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండేవాడు కాని అందుకు కారణం ఏమిటో అప్పటికైతే తనకు ఏమీ తేలడం లేదన్నాడు. బహుశా ఆయన తన ఆరోగ్యాన్ని అంత పట్టించుకొని ఉండడు.
పార్కిన్సన్ జబ్బు వచ్చినప్పటికి, మాట స్పష్టత కోల్పోయినప్పటికి చివరి దాకా అద్భుతమైన జ్ఞాపకశక్తి, పరిశీలనా శక్తి మాత్రం ఉన్నాయి. ఇటీవలనె ఆయన వెలువరించిన ʹʹశ్రీశ్రీ మద్యతరగతి మందహాసంʹʹ చదివితే అటువంటి అంశాలపై కూడా అంత సాహిత్య ప్రమాణాలతోటి, పరిశీలనతోటి రాసే శక్తి మిగిల్చుకున్నాడనేది స్పష్టం అవుతుంది.
1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండపెల్లి సీతారామయ్య నిర్దేశకత్వంతో చారు మజుందార్ రాజకీయాల పట్ల అభినివేశం ఉన్నవాళ్లు ఉన్నారు. ʹసాంస్కృతిక రంగంలో మన కర్తవ్యాలుʹ అని ఓల్గా ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ ద్వారా టిఎన్, డివిల రాజకీయ ఆలోచనలను బలపరుస్తున్నవాళ్లు ఉన్నారు. 1972 నుంచి 82 వరకు కూడా సాహిత్య, బౌద్ధిక రంగాల్లో సిపి రాజకీయాలను బలంగా వినిపించిన గొంతు కాశీపతిది. అంతే బలంగా ఆయనకు కవిత్వంలోనూ, సాహిత్య విమర్శల్లోనూ అభినివేశం ఉన్నది.
శ్రీశ్రీ మీద ఈగ వాలనివ్వని శక్తిమంతమైన అభిమానుల్లో చలసాని తర్వాత చెప్పవలసిన వాడు కాశీపతియే. అయితే ఆయన కార్యరంగం విరసం కన్నా విస్తృతమైనది. సిపి నాయకత్వంలోని ప్రజాసంఘాలన్నిటికీ ప్రచారపరంగా కాశీపతి ఇచ్చినంత బలం బహుశా మరెవ్వరూ ఇచ్చి ఉండరు. అవి పిడిఎస్యు కావచ్చు, ఆరుణోదయ కావచ్చు, ఇంకే ప్రజాసంఘమైనా కావచ్చు. ఆయన అరుణోదయ మిత్రులు చెప్పుకున్నట్లుగా ʹగిట్టనివాళ్లు ఆయనను కూసేపతి అనవచ్చు కాని, ఆయన మాట ఒక మంత్రమై, లావా స్థితిలో ఉన్న ఎందరినో సీతాకోక చిలకలుʹగా విప్లవాకాశంలో ఎగరవేసింది.
విరసంలో అగ్ర నాయకత్వానికి తోడుగా ఉంటూనే అంతకన్నా కీలకమైన పాత్ర ఆయన 1973లో ఎపిసిఎల్సి ఏర్పాటులోను, భారత-చైనా మిత్రమండలి ఏర్పాటులోను చేశాడు. ఆ రెండిటికీ ఆయన ఎమర్జెన్సీ దాక కూడా సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. 1980 విరసం దశాబ్ది ఉత్సవాల్లో విరసం సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఈ మూడు సంఘాలతో పాటు మరిన్ని ప్రజాసంఘాల వేల సభల్లో అద్భుతమైన వక్తగా పాల్గొన్నాడు. రాజకీయార్థ శాస్త్రాన్ని వర్తమాన రాజకీయాలకు అన్వయించి పండు ఒలిచినట్టు వేలాది ప్రజలకు వివరించే విషయంలో కాశీపతి ముద్ర ప్రతి శ్రోత మీద ఉంటుంది. ముఖ్యంగా, విద్యార్థి, యువజన, సాంస్కృతిక కార్యకర్తల మీద.
తరిమెల నాగిరెడ్డి కుట్ర కేసు (హైదరాబాద్ కుట్రకేసు)లో కాశీపతి ముద్దాయి. అంటే మొదటిసారి 1970ల ఆరంభంలోనే ఆయన జైలుకు వెళ్లాడు. ఎమర్జెన్సీ ప్రకటించగానే మళ్లీ అరెస్టై సికిందరాబాద్ జైలులో ఉన్నాడు. అప్పుడు రాష్ట్రంలో వివిధ జైళ్లలో విరసం సభ్యులు ముప్పై మంది ఉండేవాళ్లు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ జైలుకే వచ్చి నెలల తరబడి ఇక్కడే ఉండిపోయేవాళ్లం. ఎందుకంటే కెవిఆర్, టిఎంఎస్, కాశీపతి వంటి మా నాయకత్వమంతా ఇక్కడే ఉండేది. ఎంటి ఖాన్, చెరబండరాజు, బొజ్జా తారకం మాత్రం చెంచలగూడ జైలులో ఉండేవారు. ఒకరికొకరు ʹబాబుʹగా పిలుచుకునే కాశీపతి, ఎచ్ఆర్కెల సావాసం మాకు ఇక్కడే. 1979 తిరుపతి విరసం సాహిత్య పాఠశాలలో సాహిత్య రంగంలో విరసం పాత్ర గురించి ʹనమ్ము డాక్యుమెంట్ʹ పేరుతో ప్రతిపాదన పెట్టి, చర్చ ప్రారంభమైన తరువాత కాశీపతి స్థానంలో నమ్ము, ఎచ్ఆర్కె వంటి వాళ్ల కొత్త నాయకత్వం వచ్చింది. బహుశా కాశీపతి పూర్తికాలపు పార్టీ రాజకీయాల్లోకి వెళ్లిపోయినట్లున్నాడు. ఎందుకంటే ప్రతి ఎన్నికల సందర్భంలోనూ సిరిసిల్ల ఎంఎల్ అభ్యర్థికి ప్రచారం చేయడానికి ఆయన వస్తుండేవాడు. 1985లో జరిగిన ఎన్నికల్లో ఆయనే సిరిసిల్లలో నిలబడ్డాడని నాకు జ్ఞాపకం. నేను, బాలగోపాల్ వరంగల్ జైలులో ఉన్న సమయంలో ఆయన, చలసాని కలిసి వచ్చినట్లుగా గుర్తు.
ఎమర్జెన్సీ అంతా సికిందరాబాద్ జైలులో ఉండడం వల్ల మొదటి ఆరు నెలలు 1975 జూన్ 26 నుంచి నవంబర్ దాకా జైలులో ఉన్న వారందరికీ భూమయ్య, కిష్టాగౌడ్లతో చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. కాశీపతి అప్పటికే ఎపిసిఎల్సి కార్యవర్గ సభ్యుడుగాను, వక్తగాను వాళ్ల ఉరిశిక్ష రద్దు గురించి వేల సభల్లో మాట్లాడి ఉన్నాడు. 1975 డిసెంబర్ 1న ఆ ఇద్దరిని ఉరి తీసినప్పుడు వీళ్లంతా ఆ జైలులో ఉన్నారు. ఆయన మనసు మీద అది గాఢమైన ముద్ర వేసింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికల్లోను, తర్వాతను జలగం వెంగళరావు అధికారంలో ఉన్నంత కాలం సభల్లో కాశీపతి శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించడం గురించి, ఎన్కౌంటర్ల గురించి, భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష గురించి మాట్లాడుతుండేవాడు. ఈ రాజ్యహింస గురించి ఎంతో ప్రభావితంగా చెప్పి, ʹఈ నరహంతకుడిని ఏం చేయాలిʹ అని అడుగుతుండేవాడు. ఆయన ప్రసంగంతో ఉత్తేజితులైన సభికులు ʹఉరితీయాలిʹ అని కేకలు పెట్టేవారు. ʹఎపిసిఎల్సి ఉరిశిక్షలకు వ్యతిరేకం. కనుక ఈ నరహంతకుడిని సజీవంగా ఒక బోనులో పెట్టి, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో పెట్టాలి అనేది నా ప్రతిపాదనʹ అనగానే చప్పట్లు మారుమోగుతుండేవి.
ఎంత రాజకీయాభినివేశంతో, ఉద్విగ్నతతో ధారాళంగా మాట్లాడేవాడో అంత సున్నితమైన కరుణాంతరంగం కూడా ఆయనది. ఆయనకు అత్యంత సన్నిహితులైన నీలం రామచంద్రయ్య, జంపాల ప్రసాద్‌లు ఎమర్జెన్సీలోనే గుంటూరు దగ్గర ద్రోహి ఇచ్చిన సమాచారంతో అరెస్టై బూటకపు ఎన్కౌంటర్లో అమరులయ్యారు. అప్పుడు ఆయన సికిందరాబాద్ జైలులో ఉన్నాడు. జంపాల ప్రసాద్ పిడిఎస్యు నాయకుడుగా ఎదిగి, పూర్తికాలపు విప్లవోద్యమంలోకి పోయినవాడు. వీరిద్దరూ పరస్పర ప్రభావం ఉన్న వాళ్లు. ʹఊయాలో జంపాలో... ఈ దోపిడీ కూలదోయాలోʹ అని కాశీపతి జైలులో రాసిన పాట ఆయన స్వరంలోను, అరుణదోయ రామారావు స్వరంలోను జైలులోను, బయటా విస్తృత ప్రచారాన్ని పొందింది.
ఆరంభంలో ఆయన సంపన్న బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడని రాశాను. అది పెద్ద అగ్రహార భూస్వామ్య సంప్రదాయ కుటుంబం. కాని ఉద్యమంలో ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదివాసి మహిళ పుష్ప సాహచర్యాన్ని ఎంచుకున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు - ప్రగతి, వెన్నెల. నిన్న మరణించే నాటికి ఆయనకు ఎక్కడా సొంత ఇల్లు కూడ లేదు.
గత ముప్పై ఏళ్లుగా వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లోను, తరువాత కలర్ చిప్స్లోను పూర్తికాలపు జర్నలిస్టుగా, పదేళ్లుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ విప్లవోద్యమానికి, విరసంకు ఇప్పటికీ తడి తడి జ్ఞాపకంగానే ఉండిపోయాడు కాశీపతి. ఎల్లకాలం కొరకు అట్లాగే ఉంటాడు. చెమట చెమ్మలో కలిసి బయటికి వచ్చే పల్చటి నెత్తుటి జ్ఞాపకం వలె, పెదాల మధ్య కదలాడుతున్న ఉత్తేజకరమైన నిప్పు కణికల వంటి మాటల జ్ఞాపకం వలె, భుజం మీద ఆత్మీయమైన స్పర్శ అనుభూతి వలె.
Type in English and Press Space to Convert in Telugu |
సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్లు చేసిన లైంగిక అత్యాచారం, హ........ |
నిజమైన వీరులు నేల నుంచి వస్తారు1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది....... |
చరిత్ర - చర్చభగత్సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ... |
ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణంఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్ను స్మరించుకున్న దేశద్రోహి,... |
దండకారణ్య ఆదివాసీల స్వప్నాన్ని కాపాడుకుందాం : వరవరరావు18 జూలై 2016, అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ సభ సందర్భంగా వరవరరావు ఉపన్యాసం...... |
నోటీసుకు జవాబుగా చాటింపునిన్నటి దాకా ఊరు ఉంది వాడ ఉంది/
వాడ అంటే వెలివాడనే/
అంటరాని వాళ్లు ఉండేవాడ/
అంటరాని తనం పాటించే బ్రాహ్మణ్యం ఉండేది/
ఇప్పుడది ఇంతింతై ... |
రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?అరుంధతీ రాయ్ మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల...... |
రచయితలేం చేయగలరు?1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్ 370 మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ....... |
Save the life of the Indian writer and activist Varavara Rao!His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals... |
రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్ (అజిత్)అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్ ధబాడే..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |