ఎవరి అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేయాలి ? నేరం ఎవరిది? శిక్షలుఎవరికి ? ఏదీ ప్రజాస్వామ్యం?

| కార్య‌క్ర‌మాలు

ఎవరి అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేయాలి ? నేరం ఎవరిది? శిక్షలుఎవరికి ? ఏదీ ప్రజాస్వామ్యం?

- | 24.08.2016 04:19:19pm

మిత్రులారా !

అభివృద్ధి సాధించాలని కోరుకోనివాళ్ళు ఎవరుంటారు.? పాలకులు మాత్రం తమ అభివృద్ధికోసం ప్రజల్ని బలిపెడుతుంటారు. పాలకుల చేతిలో అభివృద్ధి అనే మాట మంత్రదండమైపోయింది. తమ స్వానుభవం వల్ల ప్రజలు అభివృద్ధి అనే మాట వింటేనే భయపడిపోతున్నారు. అభివృద్ధి పేరిట అమలవుతూ వచ్చిన విధ్వంసం మిగిల్చిన అనుభవం ఇది. అభివృద్ధి సాధించింది మేమే అని డంబాలు కొటుకునే పాలక వరాలు విధ్వంసాన్ని మాత్రం ప్రజల అదృష్టానికి వదిలిపెడుతున్నారు. తమ స్వీయ గౌరవం కోసం, మనుగడ కోసం అభివృద్ధికోసం సామాన్య ప్రజలు చేసే పోరాటాలను, ప్రజల ఆకాంక్షలను పాలకులు ఎన్నికల హామీలుగా అధికారం చేజిక్కించుకోవటానికి సోపానాలుగా మలుచుకుంటున్నారు. అధికారం దక్కగానే భాష, విధానాలు మారిపోతున్నాయి.

ప్రజలు చైతన్యవంతులవుతు పాలక వర్గాల అభివృద్ధి విధానాల లోగుట్టును ఆ రాజకీయాల బండారాన్ని బయట పెడుతూ ముసుగులు తొలగిస్తున్న కొద్దీ పాలక వర్గాలు హింసకు తెగబడుతున్నాయి. సామాన్య ప్రజల వైపు నించి, పీడితుల వైపు నించి విద్యారంగంలో ఉపాధ్యాయ ఉద్యమంలో, తెలంగాణ జనసభ ద్వారా ప్రజాస్వామిక తెలంగాణ సాధన పోరాటంలో పాల్గొన్న కె. కనకాచారిని 24-08-2005న పాలక వర్గాలు బలి తీసుకున్నాయి. పాలకులు ఎంతో అభివృద్ధి సాధించినామని పలుకుతున్నా ప్రజలందరికీ విద్య ఎందుకు అందలేదని, కనీసం సమాన విద్యావకాశాలైనా ఎందుకు దక్కలేదని, తెలంగాణ ఎందుకు వెనుకబడిందని కె.కె.తాను పనిచేసిన సంఘాలద్వారా, నడిపిన ఉద్యమాల ద్వారా ప్రశ్నించటం ఎందుకు నేరమైంది.?

అభివృద్ధి అనే మాటకి ఆయా సమాజాలలో, కాలాలలో అర్థాలు వేరుగా ఉంటాయి. భూస్వామ్య సమాజాలలో అభివృద్ధి భూస్వామ్యానిదే కాగా, పెట్టుబడిదారీ సమాజాలలో అభివృద్ధి పెట్టుబడిదారులదే అయింది. భూస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం పెనవేసుకుని సాగుతున్న సమాజాలలో ప్రజలు భూస్వామ్యం, పెట్టుబడిదారీ పీడనకు, భావజాలానికి బలవుతున్నారు. భారత ప్రజలు అజరామరమైన త్యాగాలతో పోరాటాలతో వలస పాలనను వదిలించారు. అధికారం చేజిక్కించుకున్న భారత పాలక వర్గాలు ప్రజాస్వామ్యం పేరున ప్రజల్ని గడిచిన ఏడు దశాబ్దాలుగా పట్టు సడలని భూస్వామ్యానికి, పట్టుబిగిస్తున్న పెట్టుబడిదారీకి బందీలుగా మిగిల్చారు.

రెండు ప్రపంచ యుద్ధాలు, ఆపరిణామాలు, ప్రభావాలు పాలక వర్గాలకు అనేక పాఠాలు నేర్పాయి. ఆ అనుభవాలలోంచి ప్రపంచీకరణ రాజకీయార్థిక విధానాలు పుట్టి పెరిగాయి. 1990ల నాటికి ప్రపంచీకరణ రాజకీయాల ముసుగుతొలగిపోయింది. గడిచిన రెండున్నర దశాబ్దాలలో ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి అనే మాటకి విస్థాపన అనే అర్ధమే ప్రజల అనుభవంలోకి వచ్చింది. దేశంలో ప్రజల విస్థాపన క్రమంగా రెండు విధాలుగా తీవ్రమైంది.

ఒకటి ప్రధాన జీవన వృత్తులను దెబ్బతీయటం. ప్రత్యామ్నాయం కల్పించక పోవటం. బతుకు జీవుడా అని వలసబాట బట్టి పెట్టుబడిదార్లకు, కంట్రాక్టు కంపెనీలకు, కంట్రాక్టర్లకు, నగరాలకు ప్రజలు తమ శ్రమను, జీవితాలను చవకగా సరుకులాగా అమ్మకునే దుస్థితి కల్పించటం. ఈ వలస చట్రం చుట్టు ఒక భావజాలాన్ని అభివృద్ధి చేసి వలసల వల్ల ప్రజలు అనుభవిస్తున్న పీడనను, దోపిడిని, వ్యవస్థీకృతమవుతున్న హింసను మరుగుపరచటం. రెండవది, అభివృద్ధి ʹබීට්ඨ చేపడుతున్న ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు, ఇతర నిర్మాణాల కోసం, అవసరం లేని నిర్మాణాల కోసం, పథకాల కోసం అవసరాలను మించి భూసేకరణ చేయటం ప్రజలను పల్లెలనించి అడవులలో నివాసాల నించి, తమ జీవన శ్రమ రంగాలనించి, అనుబంధాలనించి, జ్ఞాపకాలనించి, జీవితంనించి తరిమేయటం భూములను సహజవనరులన్నింటిని, బడ్జెట్ను పరిశ్రమాధిపతులకు, కంట్రాక్టర్లకు, మాఫియాకు అర్పించటం. ఇలా చట్టం దాని పని అది చేస్తుండగా ప్రజలు విస్థాపితులవుతూన్నారు. మొదటిది పొమ్మనలేకపొగపెట్టటం కాగా రెండవది పొమ్మని మంటలు పెట్టటం.

భారతదేశపు తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూను హేతుదృష్టి, సమ సమాజ స్థాపన దృష్టి, శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను వృద్ధిపరచవలసిన దృష్టికలవాడంటారు. ఆయన భారీ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలన్నాడు. వాటిలో క్రి సామాన్యులకు ప్రవేశం లేదా అనే ప్రశ్నను ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాతి ఏ పాలకుడూ పట్టించుకోలేదు. వలసలు నిర్వాసిత్వం, విస్థాపన తీవ్రమవుతూనే ఉన్నాయి. పాలకులు, అధికారులు మొత్తంగా పాలక వర్గ రాజకీయాలు విస్థాపన లేకుండా అభివృద్ధి అసాధ్యం అని ఒక వికృత భావజాల విషవలయాన్ని అభివృద్ధి చేస్తు విస్థాపితులవుతున్న ప్రజలను ఒంటరి చేస్తున్నారు. అభివృద్ధి రాజకీయాల వేగము, తీవ్రత పెరిగిన కొద్ది, ప్రజల కోసం ఏర్పడినట్టు చెబుతున్న వ్యవస్థలు దోపిడీదార్ల కోసం, నేరగాళ్ళకోసం పనిచేస్తున్న కొద్దీ నేరాలు తీవ్రమవుతున్నాయి. అడుగడుగునా మాఫియాలు పుట్టుకొస్తున్నాయి. భూమి, రియల్ఏస్టేట్, అడవి, ఇసుక, సహజవనరులు, మద్యం, విద్య, వైద్యం ఇలా మాఫియాలు పుట్టుకరాని రంగమే లేకుండా పోయింది. ఆస్తులు, అధికారాలు కాపాడుకోవటానికి పాలకులకి మాఫియాల అవసరం పెరిగిపోయింది. ప్రభుత్వాల ప్రమేయంతో అండదండలతో చట్టం చాటున హింస చెలరేగుతున్నది. దేశ వ్యాపితంగా ప్రజాస్వామిక వాదులు, ఉద్యమకారులు ఈ మాఫియాల హింసకు బలవుతున్న సందర్భాలు మన కళ్ళముందున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామిక భావనల మీద, ఉద్యమాలమీద తీవ్రవమైన హింసను ప్రయోగించారు. రాష్ట్రవ్యాపితంగా ఆటపాటమాట బంద్ చేశారు. దీనిని నిరసిస్తూ ప్రతి ఘటిస్తు తెలంగాణలో తెలంగాణ సాధన పోరాటం మొదలైంది. తెలంగాణ మాట ఎత్తకూడదని మొగ్గదశలోనే భయాందోళనతో ఆ పోరాటాన్ని తుదముట్టించాలని బెల్లిలలితను హత్య చేశారు. హైద్రాబాదు నడిబొడ్డున హక్కుల నేత పురుషోత్తంను బలి తీసుకున్నారు. ఈ ఘాతుకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో జరగగా కె.కనకాచారి, మునెప్పవంటి ఉపాధ్యాయల, ప్రజాస్వామిక వాదుల హత్యలు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అధికారంలో జరిగాయి. ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమాలు ఎంత తీవ్రంగా ప్రశ్నించినా హంతకులెవరో ప్రభుత్వాలు పట్టుకోలేదు. పైగా ఏకపక్షంగా కేసులు మూసివేశారు. అమరులు ప్రొ|| కె. జయశంకర్ వంటి పలువురు పెద్దలు విచారణ చేపట్టాలని అడిగినా ఫలితం లేకపోయింది. దీనితో తెలంగాణ ఉద్యమంలో "ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలపై, ప్రజా ఉద్యమాలపై ఉద్యమ నేతలపై అమలు జరిగిన హింసపై విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అనే డిమాండ్ ముందుకు వచ్చింది. విచారణ జరపలేదు కానీ రాజ్యమే మాఫియాల రాజ్యంగా పరిణమించింది.

ప్రజాగ్రహంతో పెరిగిన రెండు దశాబ్దాల మలిదశ తెలంగాణ పోరాటం వల్ల తెలంగాణ ముద్దు బిడ్డల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. తెలంగాణ తొలి ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు అనేక ఆశలుండినాయి. గత ప్రభుత్వాలు అమలు పరచిన విధానాలు మారాలని, ప్రజాస్వామికమైన, ప్రపంచీకరణ రాజకీయాల దాడికి భిన్నమైన, న్యాయమైన విధానాలు రూపొందించి అమలు పరచాలని ప్రజలు కోరుకున్నారు. ఇరవై ఐదు నెలల నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన గత ప్రభుత్వాల పాలనా విధానాలకు కొనసాగింపుగానే ఉన్నది. పాలనా నిర్వహణలో, అభివృద్ధి విధానాలలో, అంతరాలను పెంచటంలో, వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయటంలో, ఉపాధి కల్పనలో, ప్రజలమీద, ఉద్యమాల మీద అణచివేతకు పాల్పడటంలో తేడా కనిపించటం లేదు. అవినీతి తగ్గిందికూడా లేదు. ఇరవై ఎనిమిది రాష్ట్రాల జతకు ఇది ఇరవై తొమ్మిదో రాష్ట్రమైంది. పాత విధానాలను కొత్త నినాదాలతో అమలు చేస్తున్నది. అనేక చారిత్రక పోరాట అనుభవాలతో తెలంగాణ ప్రజలు పాలక వర్గాల అభివృద్ధి విధానాలను మౌలికంగానే ప్రశ్నించి ప్రత్యామ్నాయాల అమలుకు పోరాడవలసివుంది.

కె.కె. (కె.కనకాచారి) మెమోరియల్ ట్రస్ట్ ఆయన అమరత్వం తర్వాత 2007 నుండి పనిచేస్తున్నది. ప్రతియేటా ఆయన మరణించిన వారంలో వచ్చే సెలవు రోజు ఒక పూర్తి దినం ఆయన ఆశయాలకు అనుగుణంగా కె.కె. స్మారక ఉపన్యాసాల కార్యక్రమం జరుపుతున్నది. ఈ అభివృద్ధి విధానాల వల్ల తీవ్రమవుతున్న విస్థాపనను, అమలులో పెచ్చు పెరిగిపోతున్న నేరమయ పరిస్థితులను, ప్రజాస్వామిక ఉద్యమాల కర్తవ్యాలను చర్చకు తీసుకురావాలని నిర్ణయించింది. ప్రధాన వక్తలుగా ప్రొlయం.కోదండరాం, ప్రొ| జి.హరగోపాల్ పాల్గొంటున్న ఈ సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టు, నెట్టెంపాడు, భీమ పాలమూరురంగారెడ్డి ఎత్తిపోథల పథకాల బాధితులు, పోలేపల్లి సెజ్ బాధితులు వారి అనుభవాలు మాట్లాడతారు.
ఏడు దశాబ్దాలుగా దేశంలో నిర్వాసితులు చేస్తున్న పోరాటాలవల్ల 2013లో ఒక చట్టం వచ్చింది. దేశమంతటా ప్రభుత్వాలు భూములు గుంజి అభివృద్ధి సాధిస్తామంటున్నాయి. అభివృద్ధి కోసం సర్వంత్యాగం చేస్తున్న ప్రజలను ఆ అభివృద్ధి ఫలాలకు దూరంగా తరిమేస్తున్నాయి. భూమి, ఉపాధి, మంచి నివాసం కల్పించి నిర్వాసితులను ఆదుకోవచ్చు అసమానతలు తగ్గించవచ్చు. కానీ న్యాయాన్ని చట్టాలను కూడా తోసేసి సాధించేది ఎవరి అభివృద్ధి ? వివరి అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేయాలి ? మైదానాల నించి, అడవుల నించి నిర్వాసితులవుతున్న ప్రజలు ముక్త కంఠంతో అడుగుతున్న ఈ ప్రశ్నకు తోడునిలుద్దాం. క‌న‌కాచారి స్మారక సమావేశానికి రండి ?

కె.కె.(కె.కనకాచారి) స్మారక ఉపన్యాసాలు - సభ

అభివృద్ధి-విస్థాపన-అనుభవాలు - భాదితులు
అభివృద్ధి-విస్థాపన - ప్రజాస్వామ్యం - వక్త : ప్రొII ఎం. కోదండరాం
అభివృద్ధి-నేర రాజకీయాలు -ప్రజాస్వామ్యం - వక్త : ప్రొII జి. హరగోపాల్

తేది 25-8-2O16 గురువారం,
సమయం : ఉ| 10 గంటల నుండి
స్థలం : తెలంగాణ ఎన్జీఓల భవనం,మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌

క‌న‌కాచారి మెమోరియ‌ల్ ట్ర‌స్టు


No. of visitors : 987
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •