సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

- పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

రాయలసీమ కన్నీటి పాట ఈనాటిది కాదు. పెన్నేటి పాటను ఆలపించిన విద్వాన్ విశ్వం మొదలు నేటి రాయలసీమ కవుల వరకు నీళ్లులేనితనం నిరంతర ఆలాపనే. కరువును కన్నీటిధారగా పాడుకున్న రాయలసీమ, కరువు వెనక రాజకీయాలను ఎరుక చేసుకున్నాక, కుట్రలను విప్పి చెప్పనారంభించింది. ఉద్యమానికి సాంస్కృతిక అంగమైనప్పుడే కదా పాట పదునుదేరేది. అటువంటి ఆరాటమూ పోరాటమూ రాయలసీమకు లేక కాదు. అది సుదీర్ఘ చరిత్ర వెంట పడుతూ లేస్తూ, ఆగుతూ సాగుతూ వచ్చి నేడు ఒక కీలక మలుపుకు చేరుకుంది. ఇప్పుడు రాయలసీమ వాదం నిలకడ, స్థిరత్వం సంతరించుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒక కేటలిస్ట్ లాగానో, ఒక అనివార్యతలాగానో రాయలసీమ రాగం విచ్చుకునేలాగా చేసింది. నిజానికి సమైక్యాంధ్ర శబ్దకాలుష్యంలోనే రాయలసీమ తనదైన గొంతును సవరించుకుంది. రాయలసీమ విద్యార్థుల ఒక చిన్న సమూహం ఎటువంటి వంటి తటపటాయింపు లేకుండా సమైక్యత పేరుతో వేసిన సంకెళ్ళను తెంచమని, వంచన రాజకీయాల నుండి రాయలసీమ బైట పడకపోతే భవిష్యత్తు లేదని తెగేసి చెప్పింది. ఇప్పుడా స్వరం పదునుదేలుతోంది. ఎంతగానంటే నీటి లెక్కలు, టి.యం.సీ.ల మర్మాలు విప్పి చెప్పడమే కాదు. విద్య, ఉపాధి, మౌలిక వసతులు ఘోరంగా నిర్లక్ష్యం చేయబడిన తీరు ప్రశ్నించడమే కాదు, అది ఒక సాంస్కృతిక ఉద్యమ స్వరం కూడా వినిపిస్తోంది. రాయలసీమలో మొదటిసారి విద్యార్థులు తయారు చేసిన పాటల ఆల్బమ్ ʹరాయలసీమ కన్నీటి కెరటాలుʹ. రాయలసీమ కొత్త తరం కవులు ఇరుపోతు శ్రీనివాసులు, సొదుం శ్రీకాంత్ పాటలు రాశారు. ఇందులో మొత్తం ఎనిమిది పాటలుంటే అయిదు పాటలు విద్యార్థులు, మరో మూడు పాటలు యువకళాకారులు పాడారు. మొత్తంగా ఈ కన్నీటి కెరటాలు ఈ తరం ఆలపించిన గీతాలు కావడం, అవి సరికొత్త వ్యకీకరణలు తీసుకోవడం ఆసక్తికరంగానూ, ఆశావాహంగానూ ఉంది.

రాయలసీమ గురించి చెప్పడానికేముంది, కరువే కదా అనుకుంటారు. రాయలసీమ రచయితలు కరువును కాస్త ఎక్కువే రాసేసారేమో. అమాయక పల్లె రైతుల్లా ప్రకృతిని ఎక్కువే నిందించారేమో. ఉపగ్రాహాలను తయారు చేసి ఆకాశంలోకి పంపే కాలంలో గ్రహదోషాలను వేదికినట్టు, మబ్బుల దిక్కు మోరజాపి చూడడం ఎంత అమాయకత్వం! కానీ ఉద్యమ గొంతు అలా ఉండదు. కలిమికి, లేమికి రాజకీయ ఆర్థిక కారణాలను విశ్లేషిస్తుంది. శాస్త్రీయ పరిష్కారాలు వెదుకుతుంది. అందుకనే పరిచయ వాక్యాల్లోనే ఈ కళాకారులు ఇటువంటి స్పష్టతనిస్తారు.

ʹపారని నీళ్ళవెనక పారిన కుట్రలుండాయని తెలిసినప్పుడు...
కన్నీళ్లు పోటెత్తిపారే కోటి గొంతు పాటలైతాయి.... నాగలి కన్నీటి కెరటాలైతాయిʹ

పాలక పక్షాలు, ఆధిపత్య వర్గాల చరిత్రను ప్రశ్నించి ప్రజలు తమ చరిత్రను తామే రచించుకునే క్రమం పోరాటాలు సాగినంత కాలం, బహుశా అటు తర్వాత కూడా ఉంటుంది. దత్త మండలాలు అని పిలవబడుతున్న ఈ ప్రాంతం తనకు తాను రాయలసీమ అని పేరు పెట్టుకుంది. ఇట్లా ఒక ధిక్కార సందర్భంలో ఒక ప్రాంతం తనకు తాను పేరు పెట్టుకోవడం అరుదైన చారిత్రక ఘటన. ఉద్యమం పురోగమించే కొద్దీ అది ప్రజాస్వామికమయ్యే కొద్దీ తన మూలాల అన్వేషణ పునాది వర్గాల ప్రజల సాంస్కృతిక వ్యక్తీకరణలు తీసుకుంటుంది. ʹరాయలేలిన సీమ అనే రాగాలాపనʹ అరిగిపోయిన రికార్డయ్యింది. ఒక పీడిత సమూహంగా సంఘటితమయ్యేటప్పుడు తన అస్తిత్వాన్ని పాలక వర్గం వైపు నుండి కాకుండా ప్రజల సంస్కృతి వైపు నుండి ప్రకటించుకోవడం ఆ ఉద్యమానికి చాలా ప్రగతిదాయకం. ఈ పాటల్లో ʹరాయలేలిన సీమʹ, ʹరతనాల సీమʹ వంటి వ్యక్తీకరణలు ఎక్కడా లేవు. ఈ యువకులు ఒకడుగు ముందుకు వేసి ʹవేమన్న మనవళ్లంʹ అంటారు (ʹయాలపొద్దు మీరిపాయేʹ అనే పాటలో).

ప్రజాపాటల సాంప్రదాయంలో యాస భాషలు, మాండలికాలు, పదబంధాలు ఒడుపుగా వాడిన విధం చూస్తే ఇది ఈ కాళాకారుల మొదటి ప్రయత్నమంటే నమ్మబుద్ధి కాదు. పల్లె వలసెళ్లిపోతాంది రన్నా అనే పల్లవితో సాగే పాటలో ప్రయోగాలు చూడండి.

ʹగుడిసెలో పిడసా లేదు, గుండెల్లో పాడు గుబులుʹ

ʹపెన్నేటితట్టు సూడు కన్నీటి పిట్టలు నేడు
పారని మెట్టను సూడు ఆరని కట్టెలు నేడుʹ

కాబేళాలకు తరలే పశువుల గురించి సీమ కవులు రాయకుండా ఎట్లుంటారు? ఈ కవి ʹకాడి కటికెక్కి పాయేనురన్నాʹ అంటాడు.

కరువోక్కటేనా కారణం? వర్తమాన వ్యవసాయ సంక్షోభం రైతులందరి కన్నా సహజంగానే సీమ రైతులకు మరింత గుడిబండ అవుతుంది.

ʹపైరూ పంటా జూడు పురుగుల పుట్టయే నేడు
నకిలీ ఇత్తూలొచ్చి నడ్డిరిసిపాయెను జూడు
అమ్మ అగసాట్ల కొమ్మాయే రన్నా, ఊరు అంగడి సరుకాయే రన్నా

పాడీ గాడీ ల్యాక నడవంత బోసీపాయా
మగ్గం పగ్గం ల్యాక బతుకంత బుగ్గైపాయా
సేద్యం అప్పుల పాలాయ రన్నా సేను ఉరికాయ పాదాయరన్నాʹ

వలసల వల్ల, కరువుల వల్ల పల్లె బోసిపోయింది. మరి కరువులకు కారణమేమిటి?

ʹనాటిన కుట్రాలతోనే నాటని కరువులు పండే
నాయకద్రోహంతోనే నాసీమ నేర్రిలిగ్గేʹ

కరువుకు ప్రాకృతిక కారణాల కన్నా రాజకీయ కారణాలున్నాయి. అందుకనే

ʹగొర్రు పిడికిలి పోటెత్తెరన్నా గొంతు పాటెత్తి పిలిసింది రన్నాʹ
కవి ఆశించినట్లు రాయలసీమలో ఉద్యమం మొలకెత్తుతోంది. అందుకనే చాలా ఆశావాహంగా ఉన్నాడు.
ʹనాసీమ ముంగిట సూడు, దివిటీల వెలుగులు నేడు
రాయలసీమంత సూడు రగిలిన పచ్చని స్వప్నంʹ

ఈ పాట నిండా గొప్ప సాహిత్య ప్రయోగాలున్నాయని చెప్పక్కర్లేదు. ఇది కడప యూనివర్సిటీ విద్యార్థి రామాంజనేయులు గొంతులో మరింత జీవం పోసుకుంది.

వలస బతుకుల మీదే మరో పాట ʹపొట్టకూటి కోసం పుట్టెడు కష్టాలుʹ. పల్లవిలో, రాగంలో, గాయకుడు రవి ఆలాపనలో పలికిన లోతైన భావం చరణాల్లోని సాహిత్యంలో రాలేకపోయింది. వలస పోయిన రైతు పని దొరకక ఆకలితో అలమటిస్తాడు. ఉండడానికి జానేడు చోటు లేక, కటిక నెల మీద కాయితాలు పరుచుకుని పడుకుంటాడు. ఇంత మాత్రమేనా రాయలసీమ వలస బతుకు కష్టాలు పగోడికి కూడా కన్నీళ్లు పెట్టించేలా ఉంటాయి. గల్ఫ్ వలసల గురించిన ప్రస్తావన వచ్చి ఉండాల్సింది. అట్లాగే మహిళల, బాలికల ట్రాఫికింగ్ రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో విపరీతంగా ఉంది. రోజు కూలీ కోసం పోటీలు పడే రైతు బాధాలైనా, ఘోరమైన శ్రమ దోపిడి అయినా మొత్తంగా వలస చుట్టూ అన్ని తీర్ల జీవన విధ్వంసం ఉంటుంది. దీన్ని పాట చేయడం ఎలాగో కవికి (ఇరుపోతు శ్రీనివాసులు) తెలిసు. ఆయన రాసిన ʹవలశేల్లి పోతాండనే అమ్మ.. బతుకు తెరువు కోసం కోవైటు, మస్కటు, పూణేల దారుల్లో..ʹ అనే పాట ఈ ఆల్బమ్ లో చేర్చి ఉండాల్సింది.
అయితే ʹపొట్టకూటి కోసం..ʹ పాటలోనే చివరిగా పాలకుల మోసపూరిత మాటల గురించి పదునుగా వ్యక్తీకరించారు.

ʹఉరుతాళ్లను లెక్కబెట్టే ఎక్స్ గ్రేషియాలు
సంక్షేమం క్షామమాయెరా సంక్షోభపు పాలనాయెరాʹ

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి గింజెలు ఎలా కనుమరుగయ్యాయి? ఇవి సార్వజనీన ప్రశ్నలు. అదీ, ఇదీ అని కాదు, అక్కడ, ఇక్కడ అని కాదు అన్ని ప్రాంతాల్లో ప్రకృతి మొత్తం విధ్వంసమవుతున్న దృశ్యం. ʹపాలకంకి పదమే లేదన్నా, నా రాయలసీమలో జొన్నకంకి జాడే లేదమ్మాʹ అని ఇరుపోతు శ్రీనివాసులు రాసిన పాటలో రాయలసీమ స్థిని చెప్పినా కూడా ఇది సమస్త ప్రాకృతిక విధ్వంసం. అయితే సంగటి ముద్ద దూరమైన రాయలసీమలో, గరిశె గింజలు మొత్తం ఖాళీ అయిపోయిన స్థితిలో ఆకలి చావులు, గంజి కేంద్రాల ఘోరమైన దృశ్యాలు దర్శనమిస్తాయి. ఈ స్థితిని ప్రత్యేకంగా చెప్పి ఉండాల్సింది. అప్పుడు రాయలసీమ వంటి ప్రాంతాల్లో మార్కెట్ సృష్టించిన విధ్వంసం ఇంకెంతలా ఉంటుందో చెప్పడానికి అవకాశముండేది. ఒక సాధారణ సంక్షోభం రాయలసీమ నిర్దిష్టతలో చెప్తే ప్రాంతీయ వివక్ష కూడా తోడై ఇక్కడ మరింత తీవ్రతతో, మరిన్ని ప్రత్యేక సమస్యలలో కనపడుతుంది.

పారని నీళ్ళ వెనక పారని కుట్రలున్నాయని ఎంత స్పష్టంగా ప్రకటించారో దానికి భిన్నంగా ʹవానాలేదు వంగడి లేదు రాయలసీమలోʹ అనే పాట వస్తుంది. ʹవానలేదు వంగడి లేదుʹ అనే వ్యక్తీకరణ రాయలసీమ పల్లెల్లో బాగా వినిపిస్తుంటుంది. అందులో బాధ, విసుగు, విరక్తి ఉంటాయి. ఈ పాటలోనూ అవి కనిపిస్తాయి. ʹతెంపరి హంపన్న త్యాగం, పెనుగొండ లచ్చుమ్మ, లేపాక్షి బసవన్న, తిరుమల వెంకన్న ఎంతమందున్నా, ఎన్ని తీర్థాలున్నా రాయలసీమలో దప్పిక తీరదు... ఎందిరా ఇది ఏందిరాʹ అని బాధపడతాడు కవి. నిజానికి ఇప్పుడిక్కడ ఇటువంటి కవిత్వాలు, గేయాల కాలం దాటిపోయింది. ఆ మాట వీరే ముందు మాటలోనే చెప్పారు. సంకలనం చేసేటప్పుడు దృక్పథానికి సంబంధించిన జాగ్రత్త తప్పనిసరిగా ఉండాలి. ఏ మాటకామాటే చెప్పాలి. పాట మాత్రం పల్లె వాసనలతో గొప్పగా ఉంది.

ఈ ఆల్బమ్ లో ఉద్యమానికి సన్నద్ధం కమ్మని పిలుపునిచ్చే పాటల్లో ʹయాలపొద్దు మీరిపాయె మామ జైకొట్టు రాయలసేమʹ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది. ప్రాతినిధ్య పాట అనవచ్చునేమో. మంచి మంచి రాయలసీమ పల్లె పదాలు పాటంతా పరుచుకున్నాయి. అవి యువ గాయిని, యూనివర్సిటీ విద్యార్థి స్వాతి గొంతులో అధ్బుతంగా పలికాయి. పాటంతా ఒకే రాగంలో సాగే జానపద బాణీలో కమ్మగా ఉంటుంది.
పల్లవిలోనే లక్ష్యం ప్రకటితమవుతుంది.

ʹయాలపొద్దు మీరిపాయె మామ జైకొట్టు రాయలసేమ
సాలిడిసి కాలేసేయ్ మామ సాలకాల జాడిడుసు మామʹ
రాయలసీమ ఉద్యమానికి ఇప్పటికే ఆలస్యమైపోయింది. యాలపొద్దు మీరిపోయింది. పోరాట చాలు వేయాలంటాడు కవి. రాయలసీమ గట్టి నేల మీద కాలేసి తొక్కి లోతుగా దున్ని విత్తనం వేయవలసి ఉంటుంది. అందుకే ʹసాలిడిసి కాలేసేయ్ మామ, సాలకాల (చేర్నాకోల) జాడిడుసు మామʹ అంటాడు కవి. గీత గీసినట్లు గోర్రు తోలి విత్తనం వేస్తూ, గుంటికతో మట్టి కప్పెసే రైతు పనితనం లోతుగా తెలిస్తేగాని రాయలేని వాక్యాలివి.
పాలకుల మాయ మాటలు పల్లె జనం మాటల్లో వివిధ చరణాల్లో ఇలా వస్తాయి..

ʹమట్టినీళ్ళంటడు, నోట మట్టి కొడతాడు మామ
పట్టిసీమంటాడు మామ పిట్ట కథలు సెబుతాడు మామ...

నీరు సెట్టు పేరు చెప్పి మామ నిధులన్నీ కొల్లగొట్టే మామ
నిద్రపోనంటాడు మామ నిందలేసి పోతాడు మామ..

తాగునీళ్ళ పేరు సెప్పి మామ సాగునీళ్లు కొల్లగొట్టే మామ
నిలదీసి అడుగుతే మామ నిందలేసి పోతాడు మామ..

(ʹకొల్ల గొట్టే మామʹ ʹనిందలేసి పోతాడు మామʹ, వంటివి రిపీట్ అవ్వడం గుర్తించి నివృత్తి చేసుకోవలసిన లోపాలు. అట్లాగే ʹకొల్ల గొట్టేʹ బదులు ʹకాజేసేʹ అంటే సాధారణ జనం వాడుక భాష అయ్యేది.)

జనం చైతన్యవంతమై రానున్న ఉద్యమంలో అడగబోయే సూటి ప్రశ్న
ʹసీమపెరు జెప్పుకోని మామ శ్రీశైలం నింపుతాడు మామ
మావాటా యాడంటే మామ సాటుగా జారుకుండే మామ..ʹ
రాయలసీమ అస్తిత్వం వేమన వారసత్వంలో చాటుకునే రాజకీయ స్పష్టత-
ʹవేమన్న మనవళ్లం మామ ఊరుమిండి కారమోల్లం మామ
ఊరంతా ఏకమై మామ ఉప్పెనై తిరగబడ్తాం మామʹ

ఎంతగానో ఆహ్వానించాల్సిన పరిణామం. వేమన్న మానవళ్లం, ఊరుమిండి (ఊరగాయ) కారమోల్లం వంటి పొందికల్లో ఎంతో స్పష్టతతో పాటు కళాత్మకత ఉంది. అందుకు రచయిత శ్రీకాంత్ ను తప్పక అభినందించాలి.

ʹకన్నీటి కెరటాలుʹ పాటలన్నిటిలో ఒక తపన, ఆవేశం, ఆర్ద్రత వినిపిస్తుంది. చిన్నచిన్న లోపాలు ఉన్నా పరావాలేదులే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యువకులు ముందు ముందు చాలా ప్రామిసింగ్ గా కనపడుతున్నారు. రాయలసీమ ఉద్యమం ఉన్న స్థితిలో, ఎన్ని పరిమిత వనరుల్లో వీరి కృషి జరిగిందో తెలుసుకుంటే ఆ తపనకు ముగ్ధులమవుతాం. అది కూడా విద్యార్థులు భుజాన వేసుకుని చేశారంటే మరింతగా. రాయలసీమే కాదు, ప్రజా ఉద్యమాల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళంతా మనసారా ఆహ్వానించే ప్రయత్నం ఇది.

రాయలసీమ కన్నీటి కెరటాలు పాటల సి.డి.


రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్.ఎస్.ఎఫ్) సమర్పణ
రచన, స్వరకల్పన: సొదుం శ్రీకాంత్, ఇరుపోతు శ్రీనివాసులు
గానం: స్వాతి గుడిమి, రామాజనేయులు సిగిలిరేవు, దాదాబి, రవి మిట్టా, ఇరుపోతు శ్రీనివాసులు

No. of visitors : 1973
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •