రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

| సాహిత్యం | వ్యాసాలు

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

- వరవరరావు | 11.09.2016 10:16:25am

ʹపేరు కోసం వచ్చిరందుమా...ʹ అని ప్రజా గాయకుడు జయరాజ్‌ పాడినట్లు వాళ్లు అయ్య అవ్వ పెట్టిన పేర్లు కూడా వదులుకొని విప్లవంలోకి వెళ్లారు. ఊర్లూ వదిలిపెట్టారు. ఆస్తి కోసం అందమా అంటే ఇళ్లతో సహా తమకంటూ ఏదైనా ఆస్తి ఉంటే అదీ వదిలారు. తమకోసం కాకుండా, ప్రజల్లో కష్టం చేసే ప్రతి మనిషికి ఒక పేరు, ఒక ఊరు, ఒక గుర్తింపు, గౌరవప్రదమైన జీవితం, స్వేచ్ఛ, సమానత్వాలు, ప్రజాస్వామిక జీవనం సాధించడానికి, అవి ప్రజలే సాధించుకోవడానికి, ప్రజలను సాయుధం చేయడానికి విప్లవంలోకి వెళ్లారు. కనుక చాలామంది విప్లవకారులు అరెస్టు అయి జైలుకు వెళ్లినప్పుడో, ఎన్‌కౌంటర్‌లో అమరులైనప్పుడో తప్ప ఇంచుమించు యాభై ఏళ్లుగా విప్లవోద్యమంతో ఉన్నప్పటికీ ఎంతో సన్నిహితులైన విప్లవకారుల అసలు పేర్లూ, ఊర్లూ కూడా నాకు తెలియవు.

1981లో కేరళలోని త్రిశూర్‌లో జనకీయ సాంస్కృతిక వేదిక (పీపుల్స్‌ కల్చరల్‌ ఫోరం) రాష్ట్ర మహాసభల సందర్భంగా కలిశాడు అతను. సన్నీగా పరిచయం చేసుకున్నాడు. కె.వేణు నాయకత్వంలోని అప్పటి సిపిఐ (ఎంఎల్‌) సిఆర్‌సి రాష్ట్ర కమిటీలో ముఖ్యుడనుకుంటాను. ఆ పార్టీ అఖిల భారత స్థాయిలో కా. ఎస్‌.ఎ. రవూఫ్‌ నాయకత్వాన్ని స్వీకరించింది. కా. జన్ను చిన్నాలును హత్య చేసిన వాళ్లు ఆ పార్టీ వాళ్లుగా బాధ్యత తీసుకున్నందున దాని మీద తీవ్రమైన విమర్శ పెట్టడానికి నేను కె. వేణును కలవాలనుకున్నాను. ఆ కలయిక ఏర్పాటు చేసినవాడు సన్నీ. ఆ తరువాత కొద్దిరోజులకే కె. వేణు సిఆర్‌సి రాజకీయాలతో విభేదించి బయటికి వెళ్లిపోయాడు. ఆ పార్టీ మరొక అఖిల భారత నాయకుడు కె.ఎన్‌. రామచంద్రన్‌ కూడా సిపిఐ (ఎంఎల్‌) కాను సన్యాల్‌ నాయకత్వంలోని పార్టీతో ఐక్యం అయ్యాడు.

ఎస్‌.ఎ. రవూఫ్‌ నాయకత్వంలోని ఆ పార్టీని సిపిఐ (ఎంఎల్‌) నక్సల్బరీ పార్టీగా విప్లవ పంథాలో కొనసాగించి, 1985 నుంచి పీపుల్స్‌వార్‌తో ఐక్యం కావాలన్న ఎస్‌.ఎ. రవూఫ్‌ ఆకాంక్షను 2014 మేడే రోజు సాధ్యం చేసిన నాయకుడు అజిత్‌ కూడా అతనే అని అతను అరెస్టు అయినప్పుడు కాని నాకు తెలియదు. 2015 మేలో పూనెలో అరెస్టయిన అజిత్‌ అసలు పేరు

కె. మురళీధరన్‌ అని అప్పుడు కాని నాకు తెలియదు.

తానింకా ఐదారు సంవత్సరాల పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే చైనాలో భారత రాయబార కార్యాలయంలో కౌన్సిలర్‌గా పనిచేసిన తన తండ్రి కె. కన్నంపిల్లితో కలిసి చైనాకు వెళ్లాడు. తండ్రి వెంట చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైర్మన్‌ మావో సె టుంగ్‌ను చూడ్డానికి వెళ్లి ఆయనకు పూల దండ వేశాడు. అప్పుడు ఆ తండ్రి గాని, ఈ పసి బాలుడు గాని భవిష్యత్తులో మురళీధరన్‌ అజిత్‌గా ఎన్నో రివిజనిస్ట్‌ శిబిరాలతో పోరాడి మావోయిస్టు విప్లవ పంథాను సుదృఢం చేస్తాడని ఊహించి ఉండరు. నక్సల్బరీ పంథా విప్లవోద్యమంలో ముఖ్యంగా తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లలో సాకేత్‌ రాజన్‌, ఆజాద్‌ (చెరుకూరి రాజ్‌కుమార్‌) వరుసలో చేరదగిన వాడు అజిత్‌ (కె. మురళీధరన్‌).

కేరళలో రావలసిన భూసంస్కరణల గురించి ఆయన రాసిన ʹభూమి, జాతి, బంధనమ్‌ʹ కేరళలో భూసంబంధాలు, అవసరమైన భూసంస్కరణలు, కుల నిర్మూలన గురించిన ఒక అద్భుతమైన అధ్యయనం, విశ్లేషణ. అట్లాగే అమెరికా రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అవాకిన్‌ ప్రతిపాదించిన సిద్ధాంతంలోని రివిజనిస్టు పిడివాదానికి వ్యతిరేకంగా ఆయన ఇంగ్లిష్‌లో రాసిన ʹఅగెనెస్ట్‌ అవాక్యునిజంʹ ప్రపంచ ప్రసిద్ధమైన గ్రంథం. అంతర్జాతీయ విప్లవోద్యమం సంఘీభావంతో నడిచిన ʹఎ వరల్డ్‌ టు విన్‌ʹ అనే అంతర్జాతీయ పత్రికకు ఆయన కొంతకాలం సంపాదత్వం వహించాడు.

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే అనే చోట యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ అరెస్టు చేసింది. రోజుల తరబడి మానసిక చిత్రహింసలకు గురిచేస్తూ, విస్తృతంగా ప్రశ్నించి, చివరికి ఆయనను దుర్మార్గమైన ఊపా (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం - యుఎపిఎ) కింద అరెస్టు చూపుతూ పూనె యెరవాడ జైలుకు పంపించారు. సంవత్సరన్నర గడచినా ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కోర్టుకు తీసుకెళ్లారు. విచారణ కూడా మొదలుకాలేదు. ఇప్పుడు ఆయనకు 62 ఏళ్లు కూడా దాటాయి. ఆయన హృద్రోగి. బైపాస్‌ సర్జరి జరిగి ఉన్నాడు.

ఈ సెప్టెంబర్‌ 3న యెరవాడ హై సెక్యూరిటీ సెంట్రల్‌ జైలులో ఒంటరి సెల్‌లో ఉన్న మురళీధరన్‌కు తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. దాంతో ఆయనను పూనెలోని ప్రభుత్వ సాసూన్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన వయస్సు, అనారోగ్యాన్ని చూసిన వైద్యులు ఆయన వెంట తోడుగా ఎవరైనా ఉంటే తప్ప చికిత్స సాధ్యం కాదన్నారు. ఆ నగరంలోనే ఆయన కొడుకు ఉంటాడు. కాని అందుకు పోలీసులు అనుమతించలేదు. కనీసం ఆసుపత్రిలో ఆయన కొడుకును ఆ స్థితిలో ఆయనను చూడనివ్వలేదు. నిపుణులైన వైద్యులు సూచించినప్పటికీ తనకు తోడుగా ఒకరు సహాయంగా ఉండడానికి పోలీసులు నిరాకరించినందుకు మురళీధరన్‌ నిరసనగా నిరాహార దీక్ష చేపట్టాడు. దాంతో వైద్యుల సూచనలు కాదని పోలీసులు ఆయనను మళ్లీ సెప్టెంబర్‌ 6న జైలుకు బలవంతంగా తరలించారు.

ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు జైల్లో సెప్టెంబర్‌ 7న చూసిన ఆయన కొడుకు ఆయన న్యాయవాదికి తెలిపాడు. ఆయన అనారోగ్యం అవసరమైన వైద్య చికిత్స దృష్ట్యా ఆయనకు కనీసం మధ్యంతర బెయిల్‌ అయినా ఇవ్వాలని ఆయన న్యాయవాది విచారణ జరుగుతున్న కోర్టులో పిటిషన్‌ వేశాడు. నిజానికి ఇప్పటికి మురళీధరన్‌పై నమోదు చేసిన కేసు ఇదొక్కటే.

ఆయన అనారోగ్యం రీత్యా ఆయనను విడుదల చేయాలని డిమాండ్‌ చేయడానికి జనకీయ మనుష్యావకాశ ప్రస్థానం (జెఎంపి) అనే ఒక ప్రజాస్వామిక హక్కుల సంస్థ ఒక అంతర్జాతీయ ప్రచారానికి పూనుకున్నది. దాని స్పందనగానే ప్రపంచ ప్రసిద్ధ ప్రజాస్వామిక హక్కుల స్వరం, భాషా శాస్త్రవేత్త నోమ్‌ చామ్‌స్కీ ఆయనను బెయిల్‌పై విడుదల చేయడమో, పారదర్శకమైన, న్యాయమైన విచారణ వేగవంతమైనా చేయాలని, ఇటువంటి విజ్ఞప్తిపై సంతకం చేయడం తనకు సంతోషంగా ఉందని ప్రకటించాడు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ప్రొ. గాయత్రీ చక్రవర్తి స్పైవాక్‌, ప్రొ. పార్థా ఛటర్జీ వంటి సుప్రసిద్ధ మేధావులు కూడా దీనిపై సంతకం చేశారు. మన దేశం నుంచి కేేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రభాత్‌ పట్నాయక్‌, సుప్రసిధ్ధ రచయితలు కె. సచ్చిదానందన్‌, మీనా కందస్వామి, ఐఐటి కాన్పూర్‌ ప్రొఫెసర్‌, మహారాష్ట్ర సిపిడిఆర్‌ నాయకుడు ఆనంద్‌ తెల్‌తూంబ్డే, ఇపిడబ్ల్యూ ఎడిటర్‌ బెర్నార్డ్‌ డిమెల్లో, అహ్మదాబాద్‌ ఎంఐసిఎ ప్రొ. టి.టి. శ్రీకుమార్‌, జెఎన్‌యు ప్రొ. ఎ.కె. రామకృష్ణన్‌, ప్రొ. హరగోపాల్‌ మొదలైన వాళ్లు కూడా ఈ విజ్ఞప్తిపై సంతకం చేశారు.

కన్నంపిల్లి మురళీధరన్‌ విద్యార్థిగా ఉండగానే కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు. నక్సల్బరీ ఉద్యమ కాలం నుంచి కూడా విప్లవోద్యమంతో మమేకమై నాలుగు దశాబ్దాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తూ మార్క్సిస్ట్‌ రాజకీయార్థ శాస్త్రంలో, మావోయిస్టు సిద్ధాంతంలో, అంతర్జాతీయ రాజకీయాల్లో నిష్ణాతుడుగా పేరు తెచ్చుకున్నాడు.

కె. మురళీధరన్‌, కోబడ్‌ గాంధీ వంటి అరవై ఏళ్లు పైబడి, డెభైలకు చేరువవుతున్న సుప్రసిద్ధ మావోయిస్టు మేధావులు ఎందరో ఏళ్ల తరబడి తీవ్రమైన అనారోగ్యాలతో, ఏ విచారణ కూడా కొనసాగని కల్పిత నేరారోపణ చర్యల్లో జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. వీళ్లకు సరైన వైద్య చికిత్స కూడా అందనివ్వకుండా, వైద్య నిపుణుల సూచనలు కూడా పాటించకుండా రాజ్యం వీళ్ల మీద తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తున్నది. ఈ తరుణంలో దేశంలోనే వివిధ జైళ్లలో మగ్గుతున్న దళిత, ఆదివాసి, ముస్లిం తదితర పేద బడుగువర్గాల రాజకీయ ఖైదీల, సాధారణ ఖైదీల గురించి ఏమని ఊహించాల్సి ఉంటుంది.

ఎంసిసి పార్టీ నాయకుడుగా ఉండి సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌తో ఐక్యత కోసం కన్హయ్య ఛటర్జీతో పాటు కృషి చేసిన సుశీల్‌ రాయ్‌ బెంగాల్‌, జార్ఖండ్‌ జైళ్లలో ఎనిమిది సంవత్సరాల పాటు ఎన్నో కేసులు ఎదుర్కొని క్యాన్సర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురైనాడు. అప్పుడు కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజినర్స్‌ (సిఆర్‌పిపి) ప్రొ. బొజ్జా తారకం, ప్రొ. హరగోపాల్‌ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చి ఆయనను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేర్పించగలిగింది. ఆ తరువాత ఆయన బెయిల్‌పై విడుదల కూడా అయి అమరుడయ్యాడు.

ఇట్లా ఒక వ్యక్తి అని మాత్రమే కాకుండా ఒక మేధావి, నాయకుడు అని మాత్రమే కాకుండా దేశంలో ఉన్న జైళ్లలో, ముఖ్యంగా కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్‌, బెంగాల్‌, బీహార్‌, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జైళ్లలో ఉన్న ఆదివాసి, దళిత, ముస్లిం, పేద ఖైదీల ఆరోగ్య పరిస్థితి గురించి, విడుదల గురించి పోరాడవలసిన మానవీయ బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యవాదిపై ఉంది. ఒకరి ఆరోగ్యం గురించి, నిర్బంధం గురించి ఆలోచించడానికి వాళ్ల విశ్వాసాల గురించి, వాళ్లపై ఉన్న ఆరోపణల గురించి ఆలోచించే పరిమితులు పెట్టుకున్న వాళ్లు ప్రజాస్వామ్యవాదులు కాజాలరు. వాళ్లు రాజ్య హింసకు, నిర్బంధానికి గురవుతున్నారని, వ్యవస్థలో, అధికారంలో ఉన్న ఆధిపత్య శక్తుల కన్నెర్రకు గురయ్యారని, అందువలన వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడడం మన బాధ్యత అని గుర్తించడమే ప్రజాస్వామిక స్పందన అవుతుంది.

1929 జూన్‌, జులై నెలల్లో లాహోర్‌ జైలులో షహీద్‌ భగత్‌సింగ్‌ సహచరుడు జతిన్‌ దాస్‌ 63 రోజులు నిరాహార దీక్ష చేసి బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల కఠిన నిర్లక్ష్యానికి గురై అమరుడయ్యాడు. తమ విశ్వాసాల కోసం ఇట్లా ప్రాణాలు బలిపెట్టవలసిన స్థితి వలసవాద, సామ్రాజ్యవాద పాలనలోనే కాదు ఇప్పుడు ఇంచుమించు తొంభై ఏళ్ల తరువాత కూడా ఉన్నదంటే అటువంటి ప్రభుత్వాలను ఏమని పిలవాలి? అటువంటి ప్రభుత్వాల విషయంలో ప్రజాస్వామ్యవాదులు పాటించవలసిన వైఖరి ఏమిటి? చేపట్టవలసిన కర్తవ్యం ఏమిటి?

బహుశా మళ్లీ ఈ సెప్టెంబర్‌ 13 జతిన్‌దాస్‌ అమరుడు అయిన రోజు ఆలోచించడానికి అటువంటి మరొక సందర్భం అనుకుంటాను.

No. of visitors : 1801
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

Save the life of the Indian writer and activist Varavara Rao!

| 02.08.2020 08:29:01pm

His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •