ఆవు తోక మీరు ఉంచుకొండి - మా భూమి మాకు పంచండి అంటూ దళిత ఉద్యమానికి కొత్త నినాదం ఇచ్చిన ఉనా దళిత్ అత్యాచార్ లడత్ సమితి నాయకుడు జిఘ్నష్ మెవానిని శుక్రవారం అహ్మదాబాద్‌లో పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. గుజరాత్లో ప్రతి దళిత కుటుంబానికి ఐదు ఎకరాల భూమి పంచాలనే తమ డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 1 నుంచి రైల్ రోఖో ఉద్యమం చేపడతామని ఢిల్లీలో ప్రకటించిన కొద్దిగంటలకే జిఘ్నేష్ అరెస్టు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. ఆవు రాజకీయాలకు బ్రేక్ పాయింట్లా మారిన ఉనా ఉద్యమం గురించి బిజినెస్ లైన్ పత్రికకు జిఘ్నేష్ ఇచ్చిన ఇంటర్వ్యూని పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం.
దళిత, ముస్లిం ఐక్య ఉద్యమం
ఈ వినూత్నమైన ఉద్యమాన్ని ఉనా ఉద్యమం అందాం. ఈ సృజనాత్మకమైన ఉద్యమాన్ని ఉనా ఉద్యమం అని అందాం. ఇంకా స్పష్టత కోసం ఉనా దళిత ఉద్యమం అందాం. మరింత స్పష్టత కోసం దళిత, ముస్లిం ఐక్య ఉద్యమం అందాం. అది స్పష్టత కోసం మాత్రమే కాదు. అది వాస్తవం కూడా కాబట్టి. మొదటిసారిగా ఒక దళిత ఉద్యమం స్వీయ గౌరవం కోసం మాత్రమే కాకుండా భూమి కోసం పోరాట కార్యక్రమం ఇచ్చింది. అంటరానితనానికి వ్యతిరేకంగానే కాదు, భూమి మీద అధికారం కోసం పిలుపునిచ్చింది. గుజరాత్ నమూనాగా నరేంద్ర మోడీ ఊదరగొడుతున్న విధ్వంసపూర్వక అభివృద్ధికి జవాబుగా ఆ గుజరాత్ నుంచే అట్టడుగు చర్మకారులు, సఫాయి కర్మచారులు ఒక గడ్డివేళ్ల నిజమైన అభివృద్ధి నమూనాను మన ముందు ఉంచుతున్నారు. ఇప్పుడు వాళ్లు ఒక చేదు నిజాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మనకీ గుజరాత్ నమూనాను ఇచ్చిన నరేంద్ర మోడీ 2003లో గుజరాత్లో ముస్లిం మారణకాండ నిర్వహించడానికి మా దళిత ఆదివాసులనే ముందుంచాడు. నరేన్ పాటియాలోను, ఇతర ముస్లిం బస్తీల్లోను ముస్లింలను చంపితే, ఆ ఇళ్లు మాకే అవుతాయని అన్నాడు. దాడి చేసి వాళ్లను చంపినా, తరిమేసినా, వాళ్ల టివిలు, ఫ్రిడ్జ్‌లు, గ్యాస్ స్టవ్‌లు వగైరా ఇంటి సామాన్లు మేమే తెచ్చుకోవచ్చునని తక్షణ ఆశ చూపాడు. గుజరాత్‌లోని అడవుల్లో భిల్ వంటి పోరాట స్వభావం గల ఆదివాసులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు. గుజరాత్ మారణకాండలో మూడువేల మంది ముస్లింలను చంపిన మూడు రోజులు గడిచాక మాకు కనువిప్పు అయింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఒక దశాబ్దపు పైగా అనుభవంతో గుజరాత్ నమూనా అంటే ఏమిటో మాకు మరింత స్పష్టత ఏర్పడింది.
చచ్చిన గొడ్ల కళేబరాలు ముట్టం
గుజరాత్‌లోని ఉనాలో చచ్చిపోయిన గొడ్ల కళేబరాల నుంచి మొదట చర్మాలు ఒలిచే పని మా కులవృత్తిగా మాకు అప్పగించి, అది వీడియో తీసి పోలీసులను, మీడియాను తీసుకువచ్చి మేం గోవులను చంపుతున్నామని పోలీసుల ముందే మమ్మల్ని చిత్రహింసలు పెట్టి, వీడియో తీసి మమ్మల్ని పోలీసులకు పట్టించిన గోసంర్షకకుల నిజరూపంలో మాకు భూస్వామ్య, బ్రాహ్మణీయ హిందూత్వ దుర్మార్గం అర్థమైంది. ఈ గోసంరక్షకులు ఈ వీడియోలు తమ సంఘ్ పరివార్ శిక్షణా శిబిరాల్లో యువకులకు చూపి మా మీద గుజరాత్ అంతటనే కాదు, దేశంలో పలుచోట్ల దాడులు చేయించారు. ఉనా నుంచి అమలాపురం దాకా. యుపి నుంచి రాజస్థాన్ దాకా. హర్యానా సరే సరి. ఇంక దానితో మేం ఇక నుంచి చచ్చిన గొడ్ల కళేబరాలు ముట్టం. చర్మాలు ఒలవం. సఫాయి కర్మచారి పని చేయం అని గురజాత్ నగరాల కలెక్టర్ ఆఫీసుల ముందు, మునిసిపల్ ఆఫీసుల ముందు ఆ కళేబరాలను వదిలేశాం.
ఇది ఆరంభమే
ఇప్పుడు ఉనా దళిత్ అత్యాచార్ లడత్ సమితి అనే ఒక సంస్థను నిర్మాణం చేసుకున్నాం. ఆగస్టు 15కు ఒక వారం రోజుల ముందు నుంచి అహ్మదాబాద్ నుంచి ఉనా వరకు గుజరాత్ అస్మిత యాత్రను నిర్వహించి, ఆగస్టు 15న ఉనాకు చేరుకున్నాం. దేశంలో ఆధిపత్య వర్గాలకు, వర్ణాలకు ఆజాదీ వచ్చిందేమో కాని మాకు ఆజాదీ రాలేదు అని ప్రకటించడానికి ఈ యాత్ర తలపెట్టాం. మాకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. మేం వందలుగా దళితులుగా యాత్ర ప్రారంభించి గ్రామాల మీదుగా, పట్టణాల మీదుగా సాగుతూ ఉంటే మాలో దాదాపు మా సంఖ్యకు సమానంగా ముస్లింలు వచ్చి చేరారు. వందలు వేలయ్యారు. ఉనా చేరుకునే వరకు మాదొక బృహత్తరమైన సమూహం అయింది. మాకు అండగా ఇంకెన్నో బడుగు వర్గాలు వచ్చాయి. ప్రజాస్వామ్యవాదులు వచ్చారు. దళిత, ముస్లిం తిరుగుబాటు అస్తిత్వానికి, రాడికల్ భావాలకు చిహ్నంగా మారిన అమరుడు రోహిత్ వేముల అమ్మ రాధిక వేముల వచ్చింది. అది ముగింపు కాదు, ఆరంభం.
దేశ నలుమూలల నుంచి
ఇప్పుడు మేం రాజస్థాన్ హైకోర్టుకు ఒక మహత్తరమైన ర్యాలీ తలపెట్టాం. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన అత్యున్నత న్యాయస్థానం లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. అదనంగా ఆ ప్రజాస్వామ్యంలో సామ్యవాద లక్ష్యం, శాస్త్రీయ దృక్పథం (సైంటిఫిక్ టెంపర్) అనే ఆశయాలు కూడా చేరాయి. డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ అధ్యక్షుడుగా రచింపబడిన ఆ రాజ్యాంగం కుల, లింగ, ప్రాంత, మత వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలకు, హక్కులకు హామీ పడుతుంది. ఆ రాజ్యాంగం రచించుకున్న ప్రాథమిక హక్కులను, ఇతర అధికరణలను, రాజ్యాంగ ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాల నేపథ్యంలో సృజనాత్మకంగా వ్యాఖ్యానించవలసిన ఒక ఉన్నత న్యాయస్థానం ఆవరణలో మనువు విగ్రహం ఉన్నది. మనిషి జన్మ మొదలు మనుషుల్లో స్త్రీ పురుష వివక్ష, కుల వివక్ష ప్రబోధించే బ్రాహ్మణీయ భూస్వామ్య రాజ్యాంగ రచయిత మనువును పూజించే ఈ వ్యవస్థలో అందుకు ధిక్కారంగా మేం మనుస్మృతిని తగలబెట్టబోతున్నాం. ఇవ్వాటికీ భావజాల రీత్యాను, వ్యవస్థ రీత్యాను ఆచరణలో ఉన్నది ఈ మనుస్మృతియే అని మేం ప్రకటించనున్నాం. మనుస్మృతి అంటే హిందూ న్యాయసూత్రాలు. వీటిని దగ్ధం చేసి ఆ స్థానంలో మేం లౌకిక ప్రజాస్వామ్య సమానత్వ రాజ్యాంగాన్ని పోరాటం ద్వారా ఆచరణలో తేదల్చుకున్నాం. ఇందుకు దేశంలోని నలు మూలల నుంచి రాజస్థాన్, యుపి, బీహార్, పంజాబ్, హర్యానా, తమిళనాడు, కేరళ, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రల నుంచి లక్షలాది మందిని సమీకరించనున్నాం. నలుమూలల నుంచి ర్యాలీలు తలపెట్టాం.
భూమి మాకు వదిలేయండి
ʹఆవు తోక మీరే ఉంచుకోండి, మా భూమి మాకు వదిలేయండిʹ ఇదీ మా నినాదం. ఇదీ మా కార్యక్రమం. మీరెంతో పవిత్రంగా భావించుకునే గోమూత్రం, ఆవు పేడ కోసం మీరు ఆవు తోకను భద్రంగా పెట్టుకుని పూజించండి. దూడకు పాలు వదిలేయండి. పసిపిల్లల కోసం పాలు వదిలేయండి. కష్టజీవుల కోసం, ఈ భూమిని నమ్ముకున్న వాళ్ల కోసం భూమిని వదిలేయండి. ఇదీ మా నినాదం. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను బట్టబయలు చేయదల్చుకున్నాం. అతని గుజరాత్ నమూనాలోని బూటకత్వాన్ని, అతని అచ్ఛే దిన్ ఆయేగాలోని వంచనా శిల్పాన్ని మేం బదాబదల్ చేయబోతున్నాం. ఉనా సమస్యపై ఆయన మౌనానికి వ్యతిరేకంగా మేం ఒక పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. లక్నో అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి ప్రారంభించి అహ్మదాబాద్, జెఎన్‌యు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల మీదుగా దేశవ్యాప్తంగా విద్యాలయాల్లోకి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకపోబోతున్నాం. మేం దేశవ్యాప్తంగా ఒక రైల్ రోకో కూడా నిర్వహించబోతున్నాం. మేం దీనికి సంబంధించి తేదీలు, స్థలాలు కూడా త్వరలో ప్రకటించబోతున్నాం.
దేశస్థాయి ఉద్యమం
ʹఆవు తోక మీరు ఉంచుకొని, మాకు మా భూమిని వదిలేయండిʹ అనే ఈ నినాదం ఇంతకాలం దళిత ఉద్యమాల్లో అంతగా కనిపించని వర్గదృష్టిని బలంగా ముందుకు తెస్తున్నది. ఇవాళ దళిత చర్చల్లో భూసంస్కరణలు కేంద్ర స్థానంలోకి రావాల్సి ఉన్నది. గుజరాత్ వరకు మేం మాకు ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో విప్లవోద్యమం ప్రభుత్వం ముందు ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి మహిళ పేరు మీద పట్టా చేయాలనే డిమాండ్ 2004లోనే ఉంచింది. ఇది ప్రధాన ఎజెండా చేస్తే ఇటువంటి డిమాండ్లతో కలుపుకొని ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమం కాకుండా దేశస్థాయి ఉద్యమం అవుతుంది. ఎన్నో ముస్లిం సంస్థలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈ డిమాండ్‌కు మద్దతుగా ముందుకు వస్తున్నాయి.
భూమి మీద మాకు అధికారం
ఉనా ఉద్యమం గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించగలిగింది. బహుశా దేశవ్యాప్త ఉద్యమం మోడీ పీఠాన్ని కూడా కదిలించగలుగుతుంది. పీఠాలు కదలడం ఇంకొకరికి పీఠాలు ఏర్పడడం కొరకు కాదు. ఈ పీఠాలు దురాక్రమించుకొని కూర్చున్న భూమి మీద మాకు అధికారం కావాలి. ముఖ్యంగా భూమి దున్నేవాళ్లకు. భూమి పుత్రులకు. భూమి సంతానానికి.
మోడీ మౌనం వీడాల్సి వచ్చింది
మేం ఇప్పుడు మోడీ నోరు విప్పేటట్టు చేయగలిగాం. మా పాదయాత్ర వల్ల వాళ్లు మౌనం వీడాల్సి వచ్చింది. మా పాదయాత్రకు పోటీగా వాళ్లు పాదయాత్రలు చేస్తున్నారు. తిరంగ యాత్రలు చేస్తున్నారు. మా అస్మిత యాత్రతో వాళ్లకు జరిగిన రాజకీయ నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నారు. మాకు యువజనం నుంచి ఊహించనంత మద్దతు లభిస్తున్నది.
ప్రజా ఉద్యమాలను నిర్మించండి
ఇది మౌలికంగా నిజాయితీ గల దళిత పోరాటం. దీని ప్రధాన ఎజెండా ప్రజాస్వామిక ఉదార శక్తులన్నిటినీ కలపడం. ఆధిపత్య వర్గాలు, కులాలు అణచివేస్తున్న నిమ్న వర్గాల, కులాల ప్రజాస్వామిక హక్కులను పోరాడి సాధించుకోవడం మా లక్ష్యం. మా డిమాండ్లు రాజకీయమైనవి. మా అవగాహన రాజకీయమైనది. మా పోరాటం రాజకీయమైనది. దీనికి రాజకీయ పరిష్కారం కావాలి. అంటే భూసంస్కరణలు జరగాలి. దున్నేవారికి భూమి దక్కాలి. మావి సామాజిక ఆర్థిక డిమాండ్లు. అయితే మేం ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనం. లోక్ ఆందోళన్ ఖడా హో, ప్రజా ఉద్యమాలను నిర్మించండి అనేది మా పిలుపు.
గుజరాత్ మోడల్ పోస్ట్‌మార్టం జరగాలి
మోడీ, బిజెపి, సంఘ్ పరివార్ మా ఉద్యమం వల్ల తగిలిన దెబ్బల నుంచి కోలుకోలేకపోతున్నారు. అయినా మా ఏ ఒక్క డిమాండ్‌కు కూడా స్పందించలేదు. దళితులు కూడా తాము చాలా అనవసరంగాను, తమకు తాము నష్టం చేసుకునే విధంగాను కషాయీకరింపబడ్డామని గ్రహిస్తున్నారు. మమ్ములను మాయమాటలతో, ప్రలోభాలతో, అణచివేతలతో చేరుకునే ప్రయత్నం ప్రభుత్వాలు ఎంత చేసినా మా డిమాండ్ నెరవేరే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అహ్మదాబాద్‌లోని సఫాయి కర్మచారి కార్మికులు చేసిన సమ్మె, దేశవ్యాప్తంగా సఫాయి కర్మచారుల్లో, దళితుల్లో వస్తున్న పోరాట స్ఫూర్తి విస్తరిస్తున్న తీరు చూస్తే ఇంక మమ్ములను నియంత్రించడం ప్రభుత్వాలకు సాధ్యం కాదని తేలిపోతుంది. ఈ ఊర్జిత దళిత ఉద్యమం ప్రగతివాద శక్తులతో ఏకమైతే అప్పుడది ఏ రూపం ఎత్తుతుందో ఇప్పుడే చెప్పలేం. స్థితి మాత్రం ఇప్పుడున్నట్టుగా ఉండదు. ఇంక స్థితి స్థాపకత ఉండదు. ఆ పరివర్తన రూపం ఎట్లా ఉంటుందో ఇప్పుడే ఊహించలేం. రైల్ రోకో పిలుపు ఇచ్చి ఆచరించగలిగితే అది దళిత, ప్రగతివాద శక్తులలో ఎంతో చోదకశక్తిని ప్రవేశపెట్టి తీరుతుంది. బహుశా ఇది ఢిల్లీ నుంచి ప్రారంభిస్తాం. ముఖ్యంగా మోడీ చెపుతున్న గుజరాత్ మోడల్ పోస్ట్‌మార్టం జరగాల్సి ఉన్నది.
ప్రతి దళిత కుటుంబానికి ఐదు ఎకరాల భూమి
మళ్లీ ఒకసారి మా డిమాండ్లేవో చెపుతాం. ప్రతి దళిత కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ప్రధాన డిమాండ్. దాంతో పాటు సఫాయి కర్మచారుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి. శాశ్వత ఉద్యోగులకు లభించే ప్రయోజనాలన్ని వాళ్లకు లభించాలి. దళితులు అర్హులైన యాభై వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి. గుజరాత్లో దళితులకు రిజర్వేషన్ ఇచ్చే చట్టం చేయాలి. దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాన్ని రద్దు చేసి, రెగ్యులరైజ్ చేయాలి. మేం దళితుల కోసం కోరుతున్న ఐదు ఎకరాల భూమి దళితులకు మాత్రమే కాదు, ఆదివాసులకు, ఒబిసిలకు, సైన్యంలో పనిచేసిన మాజీ ఉద్యోగులకు కూడా. మేం ఏ రాజకీయ పార్టీ మద్దతు కూడా కోరడం లేదు. నేను ఆప్ సభ్యుడినంటూ బీజేపీ, అసూయగ్రస్తమైన మరికొన్ని రాజకీయ పార్టీలు అనవసరమైన వ్యాఖ్యానాలు చేసి ఉద్యమం మీద బురద జల్లడానికి చూశారు. నేను ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వదిలేశాను.
ప్రగతిశీలమైన రాడికల్ ఉద్యమం
ఇది ఇదే గుజరాత్లో వచ్చిన పటీదార్ ఉద్యమం వంటిది కాదు. అది విప్లవ ప్రతీఘాతుకమైనది. మాది ప్రగతిశీలమైన రాడికల్ ఉద్యమం. అది భూమి కొరకు పోరాటం. ఇంటి మహిళ పేరు మీద ఐదు ఎకరాల భూమి రిజిస్టర్ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నం. ఇంత ప్రగతిశీలమైన, రాడికల్ ఉద్యమాలు చాలా తక్కువగా ఉన్నాయి. మా ఉద్యమంలోకి మేం వాల్మీకి కులం నుంచి వచ్చిన సఫాయి కర్మచారి మహిళలను ఎక్కువగా ఆహ్వానించాం. వాళ్లకు ఏడవ పే కమిషన్ సిఫారసు చేసిన క్లాస్ |ఙ వేతనం నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నాం. మేం నర్మదా జలాలు గుజరాత్ అంతటా పంచాలని డిమాండ్ చేస్తున్నాం. గుజరాత్ శాసనసభ రైతాంగానికి వ్యతిరేకంగా చేసిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది గుజరాత్ నుంచి దళిత యువకులు ప్రారంభిస్తున్న ఒక ప్రగతిశీలమైన ఉద్యమం.
పండించే పంటలకు కనీస మద్దతు ధర
ఇప్పటికైతే మాకు ఏ ఇజం ఉన్నదని నేను చెప్పలేను. మేం క్రోనీ కాపిటలిజానికి, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకం. దళితులకు ఒకవేళ ఐదు ఎకరాల భూమి దక్కినప్పటికి దళితుల మీద, ఇతర కష్ట జీవుల మీద రుద్దబడుతున్న రాజకీయార్థిక విధానాలు రద్దు కాకుండా ఏ ఫలితాలు దక్కవు. అందుకని ఈ పోరాటం కొనసాగుతుంది. వ్యవసాయదారులకు సాగు నీరు కావాలి. విద్యుత్తు కావాలి. సబ్సిడీలు కావాలి. వాళ్లు పండించే పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించబడాలి. ఇదీ మా కామన్ మినిమం ప్రోగ్రాం.
వెలిగిన కాగడా
గుజరాత్లో వచ్చిన దళిత ఉద్యమానికి ఉన్న ప్రత్యేక ఏమిటంటే గుజరాత్ బయట గుజరాత్ నమూనా పట్ల దేశమంతటా చాల భ్రమలు ఉన్నాయి. చాల ప్రగల్భ ప్రచారం జరిగింది. కనుక ఇక్కడ దళితుల పట్ల జరిగిన వివక్ష, దాడులు బయట ఎక్కువ ప్రచారం జరగలేదు. దళితుల మీద దాడులు చేసిన వారికి ఇక్కడ మూడు శాతం మందికి కూడా శిక్షలు పడలేదు. 2006లో మహరాష్ట్రలోని ఖైర్లాంజిలో దళితులపై జరిగిన దాడులు గాని, 2012లో తమిళనాడులోని ధర్మపురిలో దళితులపై జరిగిన దాడులు గాని ఈ గుజరాత్ నమూనా కింద నలిగిపోతున్న దళిత ఆగ్రహం రగుల్కోవడానికి, ఇటువంటివి ఎన్నో దోహదం చేసి ఉండవచ్చు గాని ఇప్పుడు ఈ ఉనా అనుభవంతో అది మా గుండెల్లోని చమురుతో వెలిగిన కాగడాగా వ్యక్తీకరణ పొందింది. తేడా ఏమిటంటే ఇవాళ మేం కేవలం ఉనాలోని బాధితులకు మాత్రమే న్యాయం కోరడం లేదు. 2012లో గుజరాత్ తంగధ్ పోలీసు కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాం. మాకు విశాలమైన ఎజెండా ఉన్నది. ఇవాళ ఒక కొలనులో అలలు కదిలినట్టుగా సంచలనం రేగింది. వేలాది మంది మేమింకా పశువుల కళేబరాలు ముట్టుకోమని ప్రకటిస్తున్నారు. కళేబరాలు ఒలుస్తున్న దళితులను చిత్రహింసలు పెడుతూ తీసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొంది సంఘ్ పరివార్ ఆశించిన దానికి భిన్నమైన స్పందనలను తెచ్చింది. సంప్రదాయ అగ్రవర్ణ మీడియా ఖంగుతిన్నది. సహజంగానే ఆధిపత్య భావజాల ఉద్యమంగా దళిత, ముస్లిం ప్రగతివాద ఐక్యత ఉద్యమం రగుల్కొన్నది. ఇది ఒక జానకి తాడు ముట్టించినట్లుగా దేశమంతా అగ్నిజ్వాలలను రగిలిస్తూ వ్యాపిస్తుంది. వెలుగులు సాధించి తీరుతుంది.
Type in English and Press Space to Convert in Telugu |
హిందూ మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా సదస్సుహిందూ మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తేది తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని హిందూ....... |
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో పెట్టాలివర్గీకరణ సాధన కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనది. ప్రజాస్వామికమైనది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాలలోనే ఎస్సీ........ |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |