నేనెందుకు రాస్తున్నాను?

| సంభాషణ

నేనెందుకు రాస్తున్నాను?

- పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am


సాహిత్యకారులుగా అంతకన్నా సాహిత్య ప్రేమికులుగా ఇక్కడ మనమంతా కలిశాం. రాయడానికన్నా ముందు మనమంతా సాహిత్యాన్ని ఇష్టపడిన వాళ్ళం. జీవితంలో భాగం చేసుకున్న వాళ్ళం. అక్షరాలు సృష్టించిన జగత్తులో ఏవేవో అనుభూతులు పొందుతాం. అలా సాహిత్యం చదువుతున్నప్పుడు నేనూ ఇలా రాయగలనా అనుకున్నాను. ప్రయత్నిస్తూ పదాలు పేర్చుకుంటూ ఒక రూపాన్నిచ్చి చూసుకోవడం గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకు రాశారు అనంటే బహుశా రచయితలందరూ సాహిత్యాన్ని ఇష్టపడే రాసి ఉంటారు. ఫలానానే ఎందుకు రాశారు అంటే మాత్రం సామాజిక రాజకీయ కారణాలు ఉంటాయి. అటువంటివేమీ లేవు, కళ కోసమే రాశాను అని చెప్పుకునే దశను తెలుగు సాహిత్యం ఎప్పుడో దాటి వచ్చింది.

నాకు సాహిత్యమంటే ఎంత ఇష్టమో సైన్స్ అంటే అంత ఇష్టం. బాల్యదశలో కథలు, ఆ తర్వాత పాపులర్ నవలలు ఏవో చదివాను కానీ నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది శ్రీశ్రీ, మాక్సిమ్ గోర్కి. అవి సాహిత్యం పట్ల ప్రేమనే కాదు, గౌరవాన్ని కలిగేలా చేశాయి. రష్యన్ సాహిత్యానికి, దాన్ని మనకందించిన వారికి సెల్యూట్ చేయాలి. సోవియట్ వాళ్ళు ప్రచురించిన సాహిత్యం తెలుగు సమాజంలో కనీసం రెండు మూడు తరాల మానవులను గొప్పగా ప్రభావితం చేసింది. అటువంటి సాహిత్యంతో పాటు పాపులర్ సైన్స్ కూడా చిన్నతనం నుండి ఎంతో కొంత చదివే అవకాశం నాకు కలిగింది. ప్రశ్నలు మొలకెత్తని మెదడు ఉండదు. వాటిని నొక్కిపెట్టకుండా, సమాధానాలు అందించే కొద్దీ మరిన్ని మొలకెత్తుతుంటాయి. అలాంటి దశలో ప్రపంచాన్ని అర్థం చేసుకునే శాస్త్రీయ సిద్ధాంతంగా మార్క్సిజం ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సామాజిక చలనాలను అర్థం చేసుకోడానికి అవసరమైన చూపునిచ్చింది. దుర్భర పీడనామయమైన ఈ సమాజం మారుతుందని, ఈ జగత్తును నిర్మించిన అద్భుత సృజనకారులైన శ్రమజీవులు, చరిత్ర నిర్మాతలు దీనిని సకల బంధనాల నుండి విముక్తి చేస్తారని విశ్వాసాన్నిచ్చింది. ప్రకృతి శాస్త్రాలను, వాటి నియమాలను అధ్యయనం చేస్తున్న క్రమంలో మానవ సమాజాన్ని, అందులోని వైరుధ్యాలను మార్క్సిజం పట్టుకున్న తీరు ఎంతగానో ఆశ్చర్యపరిచింది. గొప్ప కళాత్మక విలువలున్న సాహిత్యాన్ని చదివినప్పుడు కలిగే అనుభూతి మార్క్సిజం పరిచయమవుతున్నప్పుడు కలిగిందంటే చిత్రంగా అనిపించవచ్చు. ఈ రెండు జమిలిగా నన్ను విరసం వైపు నడిపించాయి. ప్రత్యక్ష ఉద్యమాల ప్రభావం కానీ, పరిచయం కానీ నాకు లేకపోయినా అవి లేకుండా ప్రగతిశీల సాహిత్యం ఉండదు కదా. తెలుగు నేల మీద వర్గపోరాట రాజకీయాల నుండే రచయితల ముందు విశాఖ విద్యార్థుల సవాల్ నిలబడింది. ఆనాడు రచయితలు దానికి సమాధానం చెప్పి తీరాలి. చెప్పారు కూడా. ఆ చరిత్రంతా అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు మరింత స్పష్టంగా చెప్పాలంటే విరసంలో భాగమైన నేను వర్గపోరాట రాజకీయాల కోసం రాస్తున్నాను. ఈ అక్షరాలు, ఈ మాటలు, ఈ కథలు, గాధలు ఏవీ మనవి కావు. ఏ ప్రజల నుండి వాటిని తీసుకున్నామో ఆ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలు పోరాటం చేస్తుంటే దాని గురించి తక్కిన వాళ్ళకు చెప్పడం కోసం రాయాలి. ఆ పోరాటాలకు సైద్ధాంతిక, నైతిక తోడ్పాటునందించడం బుద్ధిజీవుల కర్తవ్యం. మహాశ్వేతాదేవి అన్నట్లు రచయితలందరూ తమ తరానికి జవాబుదారులు. ఈ తరం దండకారణ్యంలో పోరాడుతోంది. కాశ్మీర్ లో పోరాడుతోంది. వెలివాడల్లో పోరాడుతోంది. వీటిని గురించి చెప్పడం కోసం రాస్తాను. దాదాపు రోజూ రాస్తాను. కథ, కవిత్వం కన్నా నావన్నీ దాదాపుగా వ్యాసాలే. లెక్క పెట్టలేదు కానీ ఇప్పటికి వందకు అటు ఇటూగా వ్యాసాలు రాసి ఉంటాను. వ్యాసానికి సాహిత్యగౌరవం ఎంత ఉందీ, ఎంత లేదూ అన్న ఆలోచన పక్కన పెట్టి అవసరం కోసమే రాస్తున్నాను.

ఒక రచయితకు పాఠకులు కూడా ముందే నిర్ణయమైపోతారనుకుంటా. నేను రాస్తున్నది ఎటువంటి పాఠకులు చదువుతారు, లేదా ఎటువంటి పాఠకుల కోసం నేను రాస్తున్నాను అనే విషయం బహుశా రచయిత దృష్టిలో ఉండి ఉంటుంది. ఏదైనా రాస్తున్నప్పుడు ʹఫలానా వాళ్ళు నా రచన చదివి ఎలా స్పందిస్తారోʹ అని రచయిత అనుకుంటారని నా ఊహ. ఉద్యమ కార్యకర్తల కోసం, విద్యార్థుల కోసం, అంతగా సాహిత్యం చదవని సాధారణ పాఠకుల కోసం రాయాల్సిన అవసరం నా చేత రాజకీయ వ్యాసాలనే రాయిస్తోంది.

ʹరోహిత్ ఎందుకు చనిపోయాడు మేడమ్ʹ అని ఒక విద్యార్థి నన్నడిగినప్పుడు ఎలా చెప్తే వీళ్ళకు అర్థమవుతుంది అనుకుని నేను విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కరపత్రం రాశాను. సరే, కరపత్రాలో, పత్రికా ప్రకటనలో, రాజకీయ వ్యాసాలో అది రోజువారీ పని. నాకు తెలిసిన ఒక విద్యార్థి -చాలా సరదాగా, ఈ కాలపు టేకిట్ ఈజీ యూత్ లాగే ఉండే అబ్బాయి ఒక రోజు రైలు పట్టాల మీద శవమయ్యాడు. ఆ కల్లోలాన్ని ఎలా వ్యక్తీకరించాలి? పైకి కనిపించే జీవితాల్లో తెలియని లోతులెన్ని? విద్యార్థుల ఆత్మహత్యలకు మనకు స్పష్టంగా గోచరించే కారణాలు ఒత్తిడి అనండి, ఆత్మ విశ్వాసం ఇవ్వని విజ్ఞానం అనండి, సమాజం అనండి - ఈ సమాధానాలు చచ్చిపోయే ముందు ఆ విద్యార్థి మానసిక స్థిని ఎంతవరకు వివరించగలవు? అప్పుడు నాకు కథ రాయాలనిపించింది. రాశాను కూడా. దానికి నాకెన్ని మార్కులు పడ్డాయో కానీ రాయకుండా ఉండలేని స్థితి నుండి రాశాను. మనిషి జీవితపు లోతుల్లో నుండి, ఉదాహరణకు ఆ పిల్లవాడి మనసు నుండి లోకాన్ని చూడగలమా? దీనికి కాల్పనిక సాహిత్యమే మార్గం కదా. అట్లా అనుకున్నప్పుడు నేను రాయాల్సి ఉండి రాయలేకపోతున్నవి చాలా ఉన్నాయి. నేనెందుకు రాయలేకపోతున్నాను అని అది మరో టాపిక్ అవుతుంది. రచయితలకు అటువంటి సవాళ్ళు నేడున్నాయి. ఇటువంటి విషయాలు మాట్లాడుకోడానికి సాహిత్య వ్యాసాలు, మేము వర్క్ షాపుల్లో చేసిన చర్చలు, వాటి సారాంశం తోటి రచయితలను ఉద్దేశించి రాస్తాను. అట్లా భాష దగ్గరి నుండి ప్రక్రియ దాకా ఏది రాయాలో, ఎలా రాయాలో, ఏ పాఠకుల కోసం, ఏ అవసరం కోసం రాయాలో అదే నన్ను రాయమని నిర్దేశిస్తుంది.

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అవి చరిత్రను, వర్తమానాన్ని, రాజ్య దుర్మార్గాన్ని కప్పిపెడితే, వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రాస్తాను. అది తీవ్రవాదం కాదు ఆజాదీ పోరాటం అని చెప్పడం కోసం రాస్తాను. భారత ప్రభుత్వం దండకారణ్యంలో ఆదివాసులపై నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నది కాబట్టి, అదక్కడ చేస్తున్న హత్యలు, అత్యాచారాలు, హింసాత్మత దాడులు, గృహదహనాలు మీడియా మూసిపెడుతుంది కాబట్టి నేను రాస్తాను. తలకిందుల న్యాయాన్ని నిరసించడానికి, తలకిందులైన సత్యాన్ని సరిచేయడానికి మనమైనా రాయాలి కదా. అందుకే రాయడం. ఒక్కోసారి మొరటుగాను, ఒక్కోసారి వ్యంగ్యంగానూ, ఒక్కోసారి వేదనతోనూ రాస్తాను. వాటిలో దినపత్రిక పాఠకులను ఉద్దేశించినవి కొన్ని ఉంటే, రచయితలను ఉద్దేశించినవే కొన్ని ఉంటాయి. అయితే ఏది రాసినా వర్గపోరాట రాజకీయాల కోసమే రాస్తున్నాను. రాయడానికి నేను విశ్వసించే మావోయిస్టు రాజకీయ సైద్ధాంతిక భావజాల విస్తృతి నాకు స్పష్టతనిస్తుంది. విప్లవోద్యమం బలాన్నిస్తుంది. విరసం బాధ్యతను గుర్తు చేస్తుంది.

(సెప్టెంబర్ 10,11 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన మహిళా రచయితల సమ్మేళనంలో ʹనేనెందుకు రాస్తున్నానుʹ అనే అంశంపై చేసిన ప్రసంగం)


No. of visitors : 2404
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి

ఉద్దేశం మంచిదే అంటున్నారు, ఏమిటా ఉద్దేశం?

పి.వరలక్ష్మి | 18.11.2016 10:43:33am

జనం డబ్బు మొత్తం బ్యాంకుల్లో పోగేసి ఏం చేయబోతున్నారు? పరిమితి విధించడం ద్వారా కొద్ది రోజులపాటు డబ్బు తీసుకోను కూడా వీలుకాని దిగ్బంధనం విధించి మరీ ఏం చేయబోతు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
  ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •