ఇది విరసం సిటీ యూనిట్ కవిత్వం. ఇంతవరకు ఒక్క కవితా సంపుటినీ తీసుకురాని సభ్యుల కవిగాయక సంకలనం. వీరిలో విరివిగా రాస్తున్నవాళ్లు ఉన్నారు. సందర్భానికి స్పందిస్తున్న వాళ్లు ఉన్నారు. వేరే ప్రక్రియల్లో రచనలు చేస్తూ, మధ్య విరామంలో కవితని, పాటని సృశిస్తున్నవాళ్లు ఉన్నారు. ఇంకా..ఉద్యమ కార్యకర్తలుగా మాత్రమే మన ఎరుకలో ఉండి, తొలిసారి ఈ సంకలనంతో కవులుగా తమ పరిచయాలను అందిస్తున్నవాళ్లు ఉన్నారు. నలభైఏళ్లకు పైగా ఉద్యమ జీవితమో, దానితో పరిచయమో కలిగి కనీసం ఇరవై ఏళ్లుగా కవిత్వం రాస్తున్న వారినుంచీ, ఐదారేళ్లుగా పోరాటాలతో పరిచయమై, రెండుమూడేళ్లుగా చిక్కని భావాలను పలికిస్తున్నవారిదాకా ఈ సంకలనంలో కనిపిస్తారు. నిజానికి, ఇన్ని తరాలవాళ్లని తన నిత్య ఆచరణ, ప్రజా సాంస్కృతిక ప్రచార కృషిలో భాగం చేసుకోవడంలోనే విప్లవ సాహిత్యోద్యమ బలం దాగిఉంది. ఇలాంటి సమిష్టితత్వాన్ని ఎత్తిపట్టే ప్రయత్నంలో భాగమే ʹమంది పాట ఉరవడిలో..ʹ సంకలనం.
మిత్రమా!
ఈ చరిత్రనూ, సంస్కృతినీ
మీరెంత సుసంపన్నం చేశారో కదా!
నువ్వు వలి గుజరాతివో
కైఫి అజ్మివో
ఫైజ్, మజాజ్, సాహిర్, మక్దూమ్
ఫిరాక్, మజ్రూహ్,
ఇలా ఎంతమందని చెప్పను?
రిక్షావాలా, ఆటోవాలా
సైకిల్ షాపు మహమ్మద్
స్కూటర్ మెకానిక్ ఖాన్ భాయ్
చాయ్కొట్టు సుల్తానా,
ఒకరా, ఇద్దరా?
నా నిత్య జీవితంలో సామాన్యులంతా..( కొన్ని సందర్భాలు, మరికొన్ని ఆశ్వాసనలు)
అవును..తత్వంలోనూ, జీవన సరళిలోనూ సమిష్టిని పొదువుకున్న నగరమిది. బహుళత్వ వ్యక్తీకరణే హైదరాబాద్ జీవధాతువు. భిన్న మతాల సారాన్నే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల అస్తిత్వాన్నీ తనలో ఇంకించుకొన్న భూమి ఇది. అయితే, పాత (అసలు) నగరం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విడదీసి ఈ నేల సుసంపన్నతనీ; లౌకిక, ప్రజాస్వామిక ధిక్కారాన్నీ అంచనా కట్టలేం. సిటీ యూనిట్ కూర్పుని చూస్తే ఈ వైవిధ్య విస్తృతి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిర్బంధం వల్ల కావచ్చు, బతుకు తండ్లాట వల్ల కావచ్చు..ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణలోని మారుమూల జిల్లాల నుంచీ సిటీ యూనిట్లో ప్రాతినిథ్యం ఉంది. అందువల్లనే హైదరాబాదీ మక్దూమ్తోపాటు, రంగారెడ్డి జిల్లా మూలాలు కలిగిన చెరబండరాజు, వరంగల్‌లో పుట్టి కార్మికవర్గ పుత్రునిగా పటాన్చెరులో అమరుడైన ఎం.ఎస్.ఆర్ల కళా, ఉద్యమ వారసత్వమూ మొత్తం విరసానికి, నిర్దిష్టంగా సిటీ యూనిట్‌కి ఉంది. ఈ నేపథ్యంలోనే నల్లమల గాలులనూ, ప్రాణహిత కెరటాలనూ, శేషాచలం నెత్తుటి జాడలనూ, ఏవోబీ బాక్సైట్ వ్యతిరేక పోరు అలలనూ, లక్షింపేట దు:ఖాలనూ, పోలేపల్లి పలవరింతలనూ ఈ కవులు రికార్డు చేస్తున్నారు.
అడవి ఒంపుల మీది నుంచి
అమరుల చిరునవ్వు సవ్వడి వినిపిస్తోంది
శ్రీశైల శిఖరమంత ఎత్తయిన
ఆదివాసీ త్యాగభరిత జీవితంతో కలిసి ఉన్నది (ఎంతని వెతుక్కోను?)
అంటూ కవి ʹనల్లమల జ్ఞాపకాల కాంతిʹని మనపైకి ప్రసరిస్తున్నారు.
సామాన్యులను అసామాన్య కథానాయకులను చేస్తున్న కాలం ఇది. ఇరాక్, నికరుగువా, పాలస్థీనాల్లో పాల ఫ్యాక్టరీలపై బాంబులు వేస్తున్నవాడినీ, మన గిన్నెల్లో విష క్షీరాలను కలుపుతున్న వాడినీ ఒక్కటిగానే చూడాల్సిన సందర్భం ఇది. విప్లవాల యుగం ఇది. నిజామ్ను తరిమికొట్టిన పోరాటం జార్జి జూనియర్ బుష్‌పై బూటు విసిరిన ప్రపంచంతో కరచాలనం చేస్తున్నది. రజాకార్లను ఎదిరించిన చేతుల్తోనే ఇప్పుడు హిందూ ఫాసిస్టు పాలకులతో తలపడుతున్నది. సామ్రాజ్యవాదాన్ని మృత్యువుగా ప్రకటిస్తున్నది.
జీవితమే జయిస్తుంది
మృత్యువు మరణిస్తుంది
నిశ్శబ్దం మృత్యువు కాదు
నివురుగప్పిన నిప్పు ( సామ్రాజ్యవాదమే మృత్యువు)
అవును, మృత్యువే. కాకపోతే బ్రాహ్మణీయ హిందుత్వ దళారి పాలకవర్గంతో కలిసిన దరిమిలా భారతదేశ సందర్భంలో సామ్రాజ్యవాదం ఓ రాచపీనుగ. విలువల విధ్వంసక యుద్ధ మహమ్మారి. శ్రమ శక్తులను ఆత్మహత్యల ఉచ్చులోకి, రాజకీయ అస్తిత్వాలను అవినీతి జాలంలోని లాగేస్తున్న మాయాగేలం. మనో దుర్భలత్వాన్ని పెంచే వస్తు సంస్కృతిని నరనరాల్లోకి ఎక్కించడం, సమిష్టి శ్రమ పద్ధతుల్లోకి, ఉమ్మడి సాహిత్య సంప్రదాయాల్లోకి వ్యక్తివాద విషాలను కుమ్మరించడం ద్వారా సామాజిక, విప్లవ పోరాటాలు జరిగిన నేలను అంతకంతకు దు:ఖంతోనూ, ప్రియుల, తనయుల శాశ్వత వియోగ వేదనలతోనూ ముంచెత్తుతున్నది. దీనికి వ్యతిరేకంగా ఈ కవులు నాలుగు గోడల్లో ఇంకుతున్న దు:ఖాన్ని సామూహిక చేతనతో రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.
నా దు:ఖం నీది కాకుండా పోదు కదా!
మనిషినే కదా? పద..పద..పదా
అందరిలో...అందరికోసం దు:ఖిద్దాం
దు:ఖిద్దాం.. దు:ఖిద్దాం
దు:ఖాన్ని పారిద్దాం
దు:ఖిస్తూనే మాట్లాడుదాం! ( దు:ఖం ఒక విప్లవం).
మాట్లాడటం మనిషి గుణం. వనరులను కొల్లగొట్టకుండా కాపాడుకొన్నట్టే మాటలనూ మిగుల్చుకోవాల్సిన అవసరం ఎక్కువవుతోంది. ప్రకృతిని మానవీకరించి మనిషి సమాజ నిర్మాణం చేశాడు. అలాంటి మనిషిని అమానవీయ, అవమానాలకు గురిచేసే సకల దుర్మార్గాల్ని ఛేదించాల్సిందే. ఈ క్రమంలో దు:ఖమే కాదు, ఏ మానవీయ స్పందనైనా ఆయుధమే! భావజాల సంస్థగా ʹవిరసంʹ ఈ స్పందనలను సంఘటితపరచడాన్ని తన బాధ్యతగా భావిస్తుంది. దానికోసం ʹనిషేధ సంచారంʹ చేయడానికీ సిద్ధమని ప్రకటిస్తున్నది.
చుట్టూ ఘనీభవించిన
కన్నీటికట్టడాలను తరచి చూస్తూ
ఇంకిపోయిన నెత్తుటి కణాలను
నిలువెల్లా దాచుకొన్న
రహదారుల గుండా
నడిచిపోతుంటాను
అంటరానిదేదో
అంటుకునే పోతుంటాను (నిషిద్ధ సంచారి)
ఈ నేపథ్యమే ʹలక్షింపేటʹని సంకలనం చేసింది. ʹతెలంగాణʹగా పలికింది. గుజరాత్ విషాదాన్ని, రైతాంగ, చేనేత, జాలర్ల జీవన్మరణ పోరాటాలను ప్రత్యేకంగా సంపుటీకరించింది. పోయిట్రీ పోల్డర్లుగా తనను తాను ఆవిష్కరించుకొంటున్నది. రాజకీయ, విప్లవ ప్రచారం ముఖ్యం. ప్రత్యామ్నాయ దారిని బలపరచడం ముఖ్యం. ఈ బాధ్యతని సగర్వంగా స్వీకరిస్తూనే, మరో రెండు పనులను ʹవిరసంʹ తలకు ఎత్తుకుంది. మన నిత్య వ్యవహారాల్లో, వ్యక్తీకరణల్లో కొరవడుతున్న ʹమనంʹ భావనని అన్ని స్థాయుల్లో ప్రకటిస్తున్నది. ఈ పనిని తనతోనే ప్రారంభించి..తన నిర్మాణ, ఆచరణ క్రమాలను ఎప్పటికప్పుడు సామాజిక పరీక్షకు గురిచేస్తున్నది. సంస్థ స్థాయిలో.. విడి విడి సాహిత్య ఆచరణనంతా పోగుపరిచే పనిని ప్రయత్నపూర్వకంగానే చేస్తున్నది. ప్రధాన వర్గ వైరుధ్యం వైషమ్య స్థాయికి చేరుకొని యుద్ధాలుగా, ఫాసిజంలా బద్దలవుతున్న తరుణంలో, వాటికి వ్యతిరేకంగా సాగే సమీకరణ శక్తివంతంగా ఉండి తీరాలి. లేదంటే రానున్న కాలంలో మరిన్ని సామాజిక ఆత్మ హనన విషాదాలను మోయక తప్పదన్న అవగాహనతోనే ʹవిరసంʹ కలెక్టివిటీ కోసం పాటుపడుతున్నది. సిటీ యూనిట్ తీసుకొస్తున్న ఈ సంకలనం ఆ కృషిలో భాగమే. ఇక రెండో విషయం, తాను పనిచేస్తున్న సాహిత్య, కళా ప్రక్రియల ప్రమాణాలను పెంచడాన్నీ ముఖ్యమైన కర్తవ్యంగానే విరసం భావిస్తుంది. ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో ఇంతదాకా చేస్తూ వస్తున్న ప్రయత్నాలను బేరీజు వేసుకోవడానికి ఇలాంటి సంకలనాలు దోహదపడతాయని భావిస్తూ..ʹమంది పాట ఉరవడిలో.. ʹ మీ చేతుల్లో పెడుతున్నాం.
శిలకు జోహారు
ఉలికి జోహారు
ఉలి మలిచిన శిల్పానికి జోహారు
ఉలికి శిలకు చెలిమె కలిపిన
శిల్పి చేతులకు జోహారు
శిల్పి మేధకు జోహారు (కలలకు, కళలకు జోహారు)
Type in English and Press Space to Convert in Telugu |
మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన : రివేరా9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన పై రివేరా ఉపన్యాసం....... |
చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..పుస్తకాల సంచిని గిరాటేసి
రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం
వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు
స్నేహితుల భుజాలపైనుంచి
నవ్వుతూ చూడటమే చివరిచూపు....... |
ఏప్రిల్ పండు II రివేరాపిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,... |
సాయంకాలం వాన!దుప్పటి కింద, దిండు అడుగున
పిల్లలు చూడకుంటా కప్పెట్టుకొన్న
వరదగూడుని మెలిపెడతావేమో... |
సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరావిప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే....... |
రెప్పని కప్పని నిద్దురఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?... |
ఈ రాక్షస గీతి వింటారా?మనం నిలబడిపోయిన చోట నుంచే
మన నడకలను మోసుకెళుతున్నారు
మనం ఆపేసిన రాగాలనే
తీగలుగా సాగిపోతున్నారు
మన గొంతునీ, మన వంతునీ
మనక్కిచ్చేసి వెళుతు... |
భయం చుట్టూ భయం..వీళ్లెక్కడ చంపుకుతింటారోనని ఆడవాళ్లకు భయం
భయంలేని ఆడవాళ్లంటే మగవాళ్లకు మహా భయం
దొంగలంటే భయం, పోలీసులన్నా మరి భయమే
తాళాలు లేని తలుపులంటే భ... |
నో, ఐ డోన్ట్ లైక్ టమాటటమాట రంగు సరే,
రసాలూరే సరస్సులేమీ..
కొంచెం కరిచిపట్టుకొన్న
మిలమిలా మీనాలేమీ..
పైకి కిందకి మునకలేసే
గత్తరబిత్తర గోళాలేమీ....... |
అద్గదీ...అటో ఇటో వేటో పోటో పడిపోవాల్సిందే!
పాలకులంతా ప్రజాస్వామికవాదులై
ప్రజలేమో నియంతలైతే ఏమి చేస్తాం?... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |