చెరబండరాజు

| అమరులు

చెరబండరాజు

- | 19.04.2016 10:43:18am

చెరబండరాజు మరణించి అప్పుడే ఇరవయి అయిదేళ్లు అయింది. అంటే ఒక తరం మారింది. ఈ తరానికి చెరబండరాజు తెలుసా? బాల నరసిమ్మకు మొక్కుకుంటే బక్కారెడ్డి పుట్టిండు. పది నెలలయినా ఆ ఉగ్రనరసింహుడు బయట పడకపోతే, ఆ శిశువును మోయలేక తల్లి ఆపసోపాలు పడుతుంటే ఆ పల్లెటూళ్లో ఆమెను కోదండమేసిన్రు. అవి పురుటినొప్పులు మాత్రమే కాదు. దేవకీదేవి చెరసాలలో పడిన కష్టాల వంటివి. అందుకే తండ్రి ఆయనను శెరబందిరాజు అని పిలుచుకున్నాడు. పలుకుబడుల్లోని బక్కారెడ్డి బడి పలుకుల్లో భాస్కరరెడ్డి అయిండు. దిగంబర కవిగా ʹనన్నెక్కనివ్వండి బోనుʹ అని గర్జించినపుడు తన వంటి వాళ్లకు పుట్టుక చెరలోనే అని, తనవంటి వాళ్ల బతుకు బండబతుకేనని. అయినా ఈ బండబతుకులే పోరాడి చెరవదిలించుకొని తమ బతుకులకు తాము పాలకులమవుతామనే ధిక్కార ప్రకటనే కానీ కులంపేరు కాదు రాజు. దిగంబర కవులుగా ఏర్పడినపుడు కులాన్ని సూచించే పేర్లు వదులుకోవాలని చర్చించుకొని పెట్టుకున్న పేరు ఇది. చెరబండరాజుకు బ్రెయిన్‌ ట్యూమర్‌ అని బయటపడినపుడు ʹగార్డియన్‌ʹ పత్రికలో ఆయన గురించి రాస్తూ ప్రిజన్‌ స్టోన్‌ కింగ్‌ అని ఆయన పేరును కూడ అనువదించారు – కవితతోపాటు.

చెరబండరాజు నలగొండ జిల్లా బోనగిరి తాలుకా అంకుశాపురంలో 1944లో పుట్టిండు. అవి రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న రోజులు. సామ్యవాద ప్రజాస్వామిక శక్తులు, ఫాసిజం మీద గెలుస్తున్న రోజులు. ʹక్విట్‌ ఇండియాʹ ఉద్యమం ముగిసి దేశం నుంచి ఇంగ్లిష్‌ దొరలు వెళ్లిపోతారని నమ్మకం కుదురుతకున్న రోజులు. బోనగిరి ఆంధ్రమహాసభకు రావినారాయణరెడ్డి అధ్యక్షుడయి ʹదున్నేవారికే భూమిʹ నినాదం ఇచ్చిన రోజులు. శ్రీశ్రీ అధ్యక్షతన తెలుగునేల మీద కూడ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిన రోజులు. ముగ్గురన్నదమ్ముల్లో చిన్నవాడు బక్కారెడ్డి. బుక్కెడు పాలు నోటికందడం కష్టమైన రోజులు. ʹఏటికేతం బెట్టి ఎయిపుట్లు పండించి గంజిలో మెతుకెరగనన్నాʹ అని మోటకొడుతూ తన అయ్య పేగులు నోట్లో కొచ్చేలా గొంతెత్తుకునే పాట ఆయన జీవన గీతం. అప్పటికే నలగొండ జిల్లాలో మొండ్రాయిలో లంబాడా స్త్రీలు వెలమదొరల భూములు కౌలు చేసే హక్కు తమదేనని ప్రకటిస్తూ నాగళ్లు కట్టి, దాడి చేసిన నైజాం పోలీసునకు, తోడు వచ్చిన ఇంగ్లిష్‌ సిపాయిలను కారంపొడి, రోకళ్లతో తరిమిన రోజులొచ్చినయి. పాలకుర్తి అయిలమ్మ దొరగూండాలను ఎదిరించి సంగం సాయంతో తమ పంటను తన ఇంటికే తీసుకపోయే భరోసా ఇచ్చింది. చెరబండరాజు తన బాల్యం గురించి రెండు జ్ఞాపకాలు ఎప్పుడూ మరచిపోలేదు. అవి చెపుతున్నపుడు ఆయన కళ్లలో ఆ దృశ్యాలు మనకు కనిపించేవి. విరసం ఏర్పడి ప్రథమ మహాసభలు జరుపుకున్న పాణిగ్రాహి నగర్‌ (ఖమ్మం)లో 1970 అక్టోబర్‌ 8 సాయంత్రం శ్రీశ్రీ ఆవిష్కరించిన ఆయన ʹదిక్సూచిʹ కవితా సంకలనం తండ్రికి అంకితమిచ్చాడు. ఎయిపుట్లు పండించి గంజిలో మెతుకులెరగని తండ్రి, వడ్డీల కింద, నాగులకింద గోళ్లూడగొట్టి బక్క రైతుల దగ్గర కొలుచుకున్న ధాన్యంతో గాదెలు నిండిన ఆ ఊరి సేటును ఒక జామురాత్రి కడప మీద తలపెట్టి ఎవరో మెడనరికిన దృశ్యం ఆ బాలుని మనసు మీద ఎన్నడు చెరగిపోలేదు. అయితే అప్పటికాయనకు కడివెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వంతో తెలంగాణ సాయుధ పోరాటం మొదలయిందని తెలియదు. ఇంత నిష్ఠురమైన బతుకు నుంచి చదువులో ఒక ఆదర్శ ఉపాధ్యాయుడు మన బతుకులు బక్కవయినంత మాత్రాన పేర్లు బక్కగుండాల్నా అని భాస్కరరెడ్డి అని పేరు పెట్టిండు.

భాస్కరరెడ్డికి శరత్‌చంద్రుని నవలలు పరిచయం చేసిండు. రవీంద్రుని ʹశాంతినికేతన్‌ʹ కలలూరించిండు. పెరిగినంక చెరబండరాజు తెల్లటి పంచెకట్టుకట్టి, జుబ్బా వేసుకొని ఆ జేబుల్లో ధోతి కుచ్చెళ్లు దోపుకున్నపుడు మనకాయన శరత్‌ నవలల్లోని పాత్రవలెనే కనిపించడం ఆయనకెంత ఇష్టమో. ఉపాధ్యాయుని ప్రోత్సాహంతోనే చదువు అయిపోయి కళాశాలలో చేరాల్సిన వయసులో తండ్రి చేతులెత్తేసిండు. అన్నలు పాలమ్ముకొని బతుకుతున్నారు. ఇంట్లో చెప్పకుండా ʹశాంతినికేతన్‌ʹ కని పారిపోయాడు. ఈ దేశం రైళ్లల్లో ʹశాంతినికేతన్‌ʹకు టికెట్లు ఉండవని, స్టేషన్‌ మాస్టర్‌ హౌరాకు టికెట్టు ఇచ్చేదాకా ఆయనకు తెలియదు. కలకత్తాలో జేబులు ఖాళీ అయినపుడు విశ్వనాథ కవిరాజు నచ్చచెప్పి నీ శాంతినికేతన్‌ స్వప్నం నీ ఇంట్లో ఎంత అశాంతి రేపుతుందో ఆలోచించమని వెనక్కి పంపించినపుడు కలల్లోంచి కొలువులోకి వచ్చి పడ్డాడు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో నివాసం. ఉపాధ్యాయుని వృత్తి. అప్పటికే పెళ్లయింది. సహచరి శ్యామలతో కలిసి ఊళ్లో చెలకల్లో చేల్లల్లో, బురద పనుల్లో చేసిన పనులు శ్రమ జీవన సౌందర్యంగా పద్యాలల్లిండు. చదువు మీద, సాహిత్యం మీద దాహం తీరలేదు. నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఎం.ఒ.ఎల్‌. (తెలుగు) దాకా చదివిండు. ఆయన హైదరాబాద్‌ చేరుకునే వరకే ఆయనకే కాదు తెలుగు సమాజానికీ అన్ని కలలు కల్లలయినవి. 1946 నుంచి 51 దాకా ప్రజలు పోరాడి సాధించుకున్న గ్రామాలు మళ్లా దొరల చంకన చేరినవి. సాయుధ రైతాంగ పోరాట ఫలాలు కేవలం జవహర్లాల్‌ నెహ్రూ షేర్వానీ గుండీ దగ్గర గులాబీ రంగులోకి మారినవి. నాలుగు వేల మంది త్యాగాలు భవిష్యత్‌ గుణపాఠాలుగా మాత్రం మిగిలిపోయినవి. చెరబండరాజు ఓరియంటల్‌ కాలేజి చదువుల కాలం వచన కవితా ఉద్యమ కాలం. తిలక్‌, కుందుర్తిల ప్రభావకాలం.

ముఖ్యంగా హైదరాబాద్‌లో ʹఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ʹను కుందుర్తి ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్న రోజులు. అరవైల ఆరంభంలో క్యాంపస్‌లో ఉన్న నాకు అట్లా అరిపిరాల విశ్వం ఇంట్లో యాదవరెడ్డి (నిఖిల్‌) ద్వారా భాస్కరరెడ్డి (చెరబండరాజు) పరిచయమయ్యాడు. యాదవరెడ్డి తన హిందీ, ఇంగ్లిష్‌ సాహిత్యం అధ్యయన నేపథ్యం నుంచి భాస్కరరెడ్డిని కవిత్వం రాయడానికి ప్రోత్సహిస్తున్న రోజులవి. చెరబండరాజు శాంతినికేతన్‌ స్వప్నం ఒక మానసిక శాంతికి సంబంధించింది. ఒక ఆదర్శానికి సంబంధించింది. ఒక విలువకు సంబంధించింది. అది శాంతినికేతన్‌లో ఉందో లేదో తెలియదు. అది ఆయన తరం స్వప్నం అని 1965లో ʹదిగంబర కవులుʹ అశాంతి, అసహనంలో మనకు స్పష్టం కాకపోచ్చు గానీ 1966లో చెరబండరాజు ʹనన్నెక్కనివ్వండి బోనుʹ అని విధాన ప్రకటన చేసినపుడు, 1968లో ʹవందేమాతరం‌ʹకు ప్రత్యామ్నాయంగా ʹవందేమాతరం‌ʹ రాసినప్పటికే మనందరికీ స్పష్టంగా దారి దొరికింది. ఆదారే నక్సల్బరీ. చెరబండరాజు ʹవందేమాతరం‌ʹ రాసేప్పటికి తరిమెల నాగిరెడ్డి శాసనసభను ʹసాలెగూడుʹగా గుర్తించిండు కానీ ఇంకా ʹతాకట్టులో భారత దేశంʹ రాయలేదు. ʹతాకట్టులో భారతదేశంʹ సారాన్నంతా ఒక శక్తివంతమైన వెక్కిరింతగా రాసిన విశ్వరూపం గురించి త్రిపురనేని మధుసూదన రావు ఎప్పుడూ ఆశ్చర్య పోతుండేవాడు. రాజకీయార్థిక శాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం, అన్నిటినీ మించి జీవితం ఇరవై నాలుగేళ్ల యువకుని సానెట్‌ కన్నా చిన్నదయిన కవితలో పలకడం వెనుక 1944 నుంచి 68 దాకా తెలంగాణ రైతాంగం నడచి వచ్చిన జయాపజయాల కలనేత బాట ఉన్నది. ఆ బాట ఆయన అనుభవంలో, పరిశీలనలో, జీవన సారంలో జీర్ణమయింది. 1968 మేలో దిగంబర కవులు మూడో సంపుటం వెలువడుతున్న కాలానికి నక్సల్బరీలో పుడమితల్లి పురిటి నొప్పులనుభవిస్తున్నది. 1968 మే 23న డార్జిలింగ్‌లో సూర్యోదయమయింది. మే 25న ఆ సూర్యోదయాన్ని ఆవిష్కరించిన తల్లులు, పిల్లలు తమ త్యాగాలతో నూతన మానవ చరిత్ర రచన ప్రారంభించారు. చెరబండరాజుతో నా పరిచయం స్నేహంగా మారుతున్న రోజులవి. విరసంలోకి వచ్చిన నలుగురు దిగంబర కవులు, వరంగల్‌ కేంద్రంగా వచ్చిన తిరుగబడు కవులు, విశాఖ సీ సాండ్స్‌లోని శ్రీశ్రీ, శ్రీకాకుళం అభిమానులు సాహిత్య, సాంస్కృతిక, బౌద్ధిక రంగాల్లో ప్రత్యామ్నాయ పంథాను రూపొందించడానికి కలాలు నూరుతున్న కాలం. పాణిగ్రాహి వదిలిపోయిన పాట, సత్యం కైలాసాలు ఇచ్చిన చూపు అందుకొని 1970 జూలై 4న విరసం ఏర్పడిన దగ్గర్నించీ 2 జూలై 1982న అమరుడయ్యే దాకా చెరబండరాజు చరిత్ర విరసం చరిత్ర విడదీయరానివి.

No. of visitors : 1675
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆలూరి భుజంగ‌రావు 3వ వ‌ర్థంతి స‌భ‌

| 10.06.2016 01:43:10am

ఆ విప్ల‌వ భాట‌సారి స్మ‌రించుకుంటూ రాహుల్ సాహిత్య స‌ద‌నం ఈ నెల 19న ఆలూరి మూడ‌వ వ‌ర్థంతి స‌భ‌ను నిర్వ‌హిస్తోంది. ఆలూరి క‌విని అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ స‌భ‌లో.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •