నాలుగు రోజుల పాటు సాగిన హ‌త్యాకాండ‌ - ఏఓబీ ఘ‌ట‌న‌పై మావోయిస్టు పార్టీ ప్ర‌క‌ట‌న ( పూర్తిపాఠం )

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

నాలుగు రోజుల పాటు సాగిన హ‌త్యాకాండ‌ - ఏఓబీ ఘ‌ట‌న‌పై మావోయిస్టు పార్టీ ప్ర‌క‌ట‌న ( పూర్తిపాఠం )

- జగ‌బంధు | 05.11.2016 09:50:52am

ఆంధ్రా, ఒడిశా పోలీసులు చుట్టుముట్టి దాడిచేసి 31మందిని హత్య చేశారు
వారిలో 9మంది నిరాయుధులైన సాధారణ ప్రజలు
గాయపడిన కామ్రేడ్స్ ను పట్టుకొని గ్రామస్తులందరూ చూస్తుండగా కాల్చి చంపారు

అక్టోబర్ 24న ఒడిసా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా రామగూడ గ్రామ సమీపంలో మా మకాంపై ఆంధ్ర, ఒడిశా పోలీసులు సంయుక్తంగా దాడి చేసి 31మంది కామ్రేడ్స్ ను హత్య చేసిన ఘటనపై ఇప్పటివరకు పోలీసు అధికారులు ఇచ్చిన ప్రకటనలు వాస్తవంగా జరిగిన సంఘటనకు పూర్తి భిన్నంగా అవాస్తవాలతో కూడినవిగా ఉండి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. పూర్తి పోలీసు దిగ్బంధంలో చిక్కుకుపోయిన మేము వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో కొంత ఆలస్యం జరిగింది.

అసలేం జరిగిందంటే 23వ తేదీ ఉదయాన మా దళం రామగూడ గ్రామం చేరుకొని మకాం వేసింది. 23 రాత్రి అదే స్థలంలో పడుకున్నాం. 24 ఉదయం పోలీసులు మా మకాంవైపు రావడాన్ని గమనించిన ప్రజలు మాకు సమాచారం ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని వారిని నిర్బంధించారు. ఉదయం 6గంటలకు రోల్ కాల్ జరుగుతున్న సమయంలో రెండు వైపుల నుండి మా మకాంకు అతి సమీపానికి చేరుకున్నారు. అప్రమత్తమైన మా పి.ఎల్.జి.ఎ వెంటనే కాల్పులు ప్రారంభించింది. ఆ సమయంలో మాతోపాటున్న చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరాయుధులైన యువతీయువకులు కొందరు పక్కనే ఉన్న గ్రామంవైపు పరిగెత్తారు. పరిగెత్తిన వారిపైనా, పక్కనే ఉన్న నదిలో చేపలు పడుతున్నప్రజలపైనా విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అందులో అనేకమంది గాయపడ్డారు. వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నారు. మా దళం ప్రతిఘటిస్తూనే మకాం నుండి క్షేమంగా రిట్రీట్ అయింది. ఆ స్థలంలో మాకు ఎలాంటి భౌతిక నష్టం జరగలేదు. అయితే అప్పటికే మా మకాం రెండు వలయాలుగా చుట్టివేయబడి ఉంది. ఒక వలయాన్ని ఛేదించడానికి 40 నిమిషాలు ఫైర్ చేసి సురక్షితంగానే రిట్రీట్ అయ్యాం. దాని తర్వాత మరో వలయం చేత చుట్టివేయబడ్డాం. వారంతా కొండలనాక్రమించుకుని మా రిట్రీట్ దిశను అనుసరిస్తూ అన్నివైపుల నుండి కాల్పులు ప్రారంభించారు. అప్పటికే కాల్పులు ప్రారంభమై గంట గడిచిపోయింది. పోలీసులు వేలాది తూటాలను, మేము వందలాది తూటాలను కాల్చాము. చివరి వలయాన్ని గండి కొట్టే సమయంలో మేము ఒక కొండ నుండి మరో కొండకు వెళ్తున్నప్పుడు చిన్న మైదానాన్ని దాటి కొండ ఎక్కాల్సివచ్చింది. అప్పుడు పోలీసుల బలగాలు అతి సమీపానికి వచ్చాయి. వందలాది బలగాలు కొండలపై అనుకూల రక్షణలో ఉండి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దాన్ని రెండువైపులా గండికొట్టే సమయంలో కొద్ది మంది కామ్రేడ్స్ అమరులయ్యి, అనేక మంది గాయపడి, మిగిలిన కామ్రేడ్స్ ను రక్షించారు. గాయపడి కదలలేని స్థితిలో ఉన్న మా కామ్రేడ్స్ ను వందలాది బలగాలు చుట్టుముట్టి హతమార్చాయి. కొందరు గాయాలతో తప్పుకున్నారు. 25వ తారీఖు మరికొన్ని అదనపు బలగాలను రప్పించి ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి గాయపడిన మా కామ్రేడ్స్ ను తప్పించుకొనివ్వకుండా వెతికారు. ఆరోజు ఆంధ్రప్రదేశ్ డిజిపికి స్వాగతంగా అప్పటికే వారి చేతిలో ఉన్న సాధారణ యువతీయువకులు- కొమలి (కొదిరిగూడ), శ్యామల (పిల్లిపొదురు), కావేరి ముదిలి, లచ్చ ముదిలి (డక్ల పొదురు) లను కాల్చి చంపి మరో ఎన్‌కౌంటర్ కథనాన్ని అల్లారు.

గాయపడి శత్రు వలయంలో చిక్కుకుపోయిన మరో మహిళా కామ్రేడ్‌ను 26న రామగూడ ప్రజలందరూ చూస్తుండగానే కాల్చి చంపారు. అలాగే గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న మరో ఇద్దరు -కామ్రేడ్ గౌతమ్, కామ్రేడ్ నరేశ్‌లను 27 ఉదయం 7 గంటలకు గ్రామ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపి ఎన్‌కౌంటర్ కథను అల్లారు. మా కామ్రేడ్స్ ఈ దాడిని ఎదుర్కోవడంతో అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని, వర్గకసిని, త్యాగనిరతిని ప్రదర్శించారు. వారు అమరులవుతూ కూడా వారి చేతుల్లోని ఆయుధాలను శత్రువుల చేతికి చిక్కకుండా సహచర కామ్రేడ్లకు అందిస్తూ అమరులయ్యారు. ఈ హత్యా ఘటనలో 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 31 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. అందులో 9 మంది నిరాయుధులైన సాధారణ యువతీ యువకులే. అందులో 9మందిని కూడా పట్టుకుని 24న నలుగురిని, 25వ తేదీన నలుగురిని, బలగాలు వాపస్ అయ్యే రోజున మరొకర్ని హత్య చేశారు.

అమరులైన వారి వివరాలు:


కామ్రేడ్ ప్రసాద్ @ బాకూరు వెంకటరమణ (AOB SZCM), బాకూరు గ్రామం విశాఖ జిల్లా
కామ్రేడ్ దయా @ కిష్టయ్య (AOB SZCM), నల్గొండ జిల్లా
కామ్రేడ్ గంగాధర్ @ ప్రభాకర్ (DVCM), యాప్రాలు, రంగారెడ్డి జిల్లా
కామ్రేడ్ కిరణ్ @ సువర్ణ రాజు (డి.వి.సి.యం), పశ్చిమగోదావరి జిల్లా
కామ్రేడ్ మున్నా @ పృధ్వీ (ప్లటూన్ డిప్యూటీ), ఆలకూరపాడు
కామ్రేడ్ బిర్సు @కేశవరావు (సెక్షన్ కమాండర్), తాడిపాలెం, విశాఖ జిల్లా
కామ్రేడ్ రాజేష్ @ సోమ్లు (సెక్షన్ డిప్యూటీ), ఊరు-కొట్టం, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ ఎర్రాలు @ నంగాలు (సిపిసిఎమ్), ఊరు- ఎర్రం ,బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ బుద్ధి @ బుద్రిసోరి (ఎసియం), ఊరు-గురునామ్, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ మంజుల @ ఉంజీ (ఎసియం), ఊరు-నాంగెల్ గూడెం, సుక్మా జిల్లా
కామ్రేడ్ గౌతమ్, టెక్నికల్ దళ కమాండర్, కాంకేర్,
కామ్రేడ్ మురళి @ సింహాచలం (ఎసియం), విజయనగరం జిల్లా
కామ్రేడ్ మధు @ దాసు (ఎసియం), పశ్చిమగోదావరి జిల్లా
కామ్రేడ్ లత @ భారతి (ఎసియం), హైదరాబాద్
కామ్రేడ్ మమత @బొట్టు కుందన (పియమ్), శ్రీకాకుళం జిల్లా
కామ్రేడ్ దాసు @ సాధురామ్ (పియమ్), వాకపల్లి గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ నరేశ్ @ సురేశ్ (పియమ్), గ్రామం-సామాన, కోరాపుట్ జిల్లా
కామ్రేడ్ తిలక (పియమ్), పశ్చిమ బస్తర్, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ గంగ @ గంగ మాధవి (పియమ్) శీలకోట గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ రజిత @ కామి (పియమ్), నానాదరి గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ జ్యోతి (పియమ్), సుమనోవ గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ కమల @ లక్కీ (పియమ్) ఆలుమ్ గ్రామం, బీజాపూర్ జిల్లా

సాధారణ యువతీయువకులు:


లచ్చ మొదిలి, గ్రామం- డక్ల పొదురు, మల్కన్ గిరి జిల్లా
కావేరి మొదిలి, గ్రామం- డక్ల పోదురు
బుమిలి, గ్రామం- బచ్చర పొదురు
మల్కన్ పాంగి, గ్రామం-బచ్చర పొదురు
అమల, గ్రామం- బచ్చర పొదురు
షిండే, గ్రామం- ముక్కుడు పల్లి
శ్యామల, గ్రామం-సుంగి పొదురు
జయా, గ్రామం- కొదురుగూడ
కొమలో, గ్రామం- కోదురుగూడ

న్యాయ విచారణ జరపాలి


మా అమరుల శవాల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఆదరాబాదరాగా పోస్టుమార్టం నిర్వహించి, వాళ్ళ శవాలను బంధుమిత్రులు గుర్తుపట్టే విధంగా ఫోటోలను ప్రదర్శించకుండా సాధారణ అట్టపెట్టేల్లో పెట్టారు. వారి కుటుంబసభ్యులు శవాలను తీసుకుపోయి చివరిసారి చూపుకు కూడా నోచుకోకుండా చేశారు. ఈ అమరవీరులందరికీ మా పార్టీ తలవంచి వినమ్రంగా జోహార్లర్పిస్తున్నది. వారి కుటుంబసభ్యుల, బంధుమిత్రుల బాధలు, దుఃఖంలో పాలుపంచుకుంటున్నది. వారిని హత్య చేసిన రాజ్యాంపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనుతున్నది. వారి ఆశయాలను తుదకంతా కొనసాగిస్తామని శపథం చేస్తున్నది. అమరులైన కామ్రేడ్లందరూ పీడిత వర్గాల నుండి ఉద్యమంలోకి వచ్చిన వారే. వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించారు. అయితే ఆ సమస్య పరిష్కారానికి సాయుధమవ్వడం తప్ప మరో మార్గం లేదని స్వీయ అనుభవం ద్వారా తెలుసుకొని ఆయుధాలు పట్టారు. ఇది ప్రభుత్వం చెబుతున్నట్లుగా శాంతి భద్రతల సమస్య కాదు. నూటికి తొంభై శాతంగా ఉన్న ప్రజల సమస్య. ప్రజల సామాజిక ఆర్థిక సమస్య. ఈ సమస్య మా కామ్రేడ్స్ ను హత్య చేయడం ద్వారా పరిష్కరించలేరు. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకు ప్రజలు పోరాడుతూనే ఉంటారు. పోరాడే ప్రజల నుండే మళ్ళీ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అమరులు లేని లోటును మళ్ళీ భర్తీ చేస్తాం. మా పార్టీకి త్యాగాలు కొత్తవి కాదు. త్యాగాల చాలు వేస్తూనే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ సంఘటనలో మేము శత్రువును అంచనా కట్టడంలో చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాం. అందుకు తీవ్రంగా విచారిస్తున్నామని ప్రజలకు తెలియజేస్తున్నాం. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోడానికి శత్రువుతో మరింత వర్గ కసితో పోరాడాలని పిలుపునిస్తున్నాం. ఈ సంఘటనలో నిరాయుధులైన తొమ్మిది మంది యువతీ యువకులను సజీవంగా పట్టుకుని హత్య చేసిన సంఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్యాకాండను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి


కటాఫ్ ఏరియా మావోయిస్టులు సేఫ్ జోన్ గా వాడుకుంటున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారం వట్టి బూటకం. ఈ ప్రాంత ప్రజలు మా పార్టీ నాయకత్వంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా, బలిమెల రిజర్వాయర్ ముంపు నిర్వాసిత సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలిటెంట్ ఆందోళన చేస్తున్నారు. దున్నేవారికే భూమి సమస్యపై వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకొని భూమిలేని పేదలకు పంపిణీ చేస్తూ వ్యవసాయక విప్లవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. అలాగే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. దీంతో రాజ్యం ప్రత్యేకంగా కేంద్రీకరించి ఆంధ్రా ఒడిశా పోలీసులు సంయుక్తంగా అనేక సంవత్సరాల నుండి కూంబింగ్ ల పేరుతో దాడులు చేసి ప్రజలను, పి.ఎల్.జి.ఏ సభ్యులను హత్యలు చేశారు. గత రెండు సంవత్సరాల నుండి నాయకత్వ నిర్మూలన కోసం ప్రత్యేకంగా కేంద్రీకరించారు. అందులో భాగంగా జరిగిందే అక్టోబర్ 24 ఘటన. అయితే పోలీసులు ప్రకటిస్తున్నట్లుగా ఆ సమయంలో మా పార్టీ పైకమిటీ సమావేశాలు గానీ, ప్లీనాలు గాని ఏమీ లేవు. ఆ ప్రాంత ఆర్గనైజేషన్ లో భాగంగానే మా దళం అక్కడికి వెళ్లింది. పక్కా సమాచారంతోనే 23 రాత్రి అత్యంత రహస్యంగా మా మకాం పరిసరాలకు బలగాలను చేర్చి చుట్టుముట్టి ఉన్నారు. మరికొన్ని బలగాలను 24 ఉదయం 6 గంటలకు రప్పించుకొని చుట్టుముట్టి దాడి చేశారు. దీనికి లొంగిపోయిన మాజీల సహకారం కూడా తీసుకున్నారు. ఈ ఘటన జరటానికి దారితీసిన మా లోపాలను సమీక్షించుకుంటూనే, దీనిలో ఇన్ ఫార్మార్లుగా వ్యవహరించిన వారిని, అలాగే విప్లవద్రోహులైన మాజీలను ప్రజల సహకారంతో శిక్షిస్తామని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి వందలాది బలగాలతో గాలింపులు కొనసాగిస్తున్నారు. దాంతో ప్రజలు చేతోకొచ్చిన పంటను రక్షించుకోలేకపోతున్నారు. పశువులను కాపలా కాయలేకపోతున్నారు. ఈ బలగాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే రెండు రాష్ట్రాల అధికార టిడిపి, బిజెడి నాయకులు మూల్యం చెల్లించవలసి ఉంటుంది.

విప్లవాభివందనాలతో
జగబంధు
ఎఒబి ఎస్.జెడ్.సి అధికార ప్రతినిధి


No. of visitors : 6535
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పదేళ్ల జనతన సర్కార్‌పై చర్చ

| 21.06.2016 02:20:15am

విరసం ఆవిర్భావదినం సందర్భంగా... పదేళ్ల జనతన సర్కార్‌పై చర్చ జులై 3, 2016 ఆదివారం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌ ......
...ఇంకా చదవండి

వ‌ర్గపోరాటంతోనే విప్ల‌వ ప్ర‌జాస్వామ్యం

విరసం | 21.06.2016 01:30:56am

గత ఏడాది డిసెంబర్‌కు దండకారణ్య క్రాంతికారీ జనతన సర్కార్‌ ఏర్పడి పదేళ్లు. అంతక ముందున్న గ్రామ రాజ్య కమిటీలు వర్గపోరాట అభివృద్ధి క్రమంలో క్రాంతికారీ జన........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •