ఉద్దేశం మంచిదే అంటున్నారు, ఏమిటా ఉద్దేశం?

| సంపాద‌కీయం

ఉద్దేశం మంచిదే అంటున్నారు, ఏమిటా ఉద్దేశం?

- పి.వరలక్ష్మి | 18.11.2016 10:43:33am

నిజంగా నల్లధనాన్ని (చెడుకు చిహ్నంగా నలుపును వాడడం అటుంచి) నిర్మూలించడానికే నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేశాడా? అందుకేనని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జరుగుతోంది కూడా. జనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా దీనివల్ల రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఉద్యోగాలకు సెలవులు పెట్టి రోజంతా బ్యాంకుల ముందు, ఎ.టి.యం.ల ముందు క్యూలో పడిగాపులు గాసే వాళ్ళు కూడా ఈ ప్రచార హోరులో కలవరపడిపోయిన ముఖాలతో ʹఉద్దేశం మంచిదే కానీ...ʹ అంటూనే ఇబ్బందులు చెప్పుకొస్తున్నారు. ఇది కాస్తా ʹఉన్న కష్టాలకు తోడు చిల్లర కష్టాలు కూడానాʹ అని విసుక్కుంటున్న వాళ్ళను ʹఏం, దేశం కోసం ఆ మాత్రం ఓర్చుకోలేరా?ʹ అని మోదీ భక్తులు దబాయించేదాకా పోయింది. నల్లధనం, తెల్లధనం అని డబ్బు రంగుల గురించి తెలీని సామాన్య ప్రజలు, పూట పూటనా చిల్లర సరుకులతో నెట్టుకొచ్చే అల్పజీవులు చచ్చిపోతున్నాం బాబూ అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జరగబోయే మంచేదో తెలుసుకోకుండానే చచ్చిపోతున్నారు కూడా. పాత కరెన్సీ చెల్లక వైద్యం ఖరీదు చేయలేని వాళ్ళు, కూలి చేసి కూడబెట్టుకుని తాగుబోతు భర్త బారిన పడకుండా దాచుకున్న డబ్బంతా చిత్తు కాగితాలైనాయని, పొలం అమ్మితే వచ్చిన లక్షలు పనికిరావని విని ఆత్మహత్యలు చేసుకొని కొందరు, క్యూ లైన్ లో గుండెపోటుతో కుప్పకూలి కొందరు – ఇలా ఇప్పటికీ 40మంది చనిపోయారని రిపోర్టయ్యింది. కోట్లాది మంది చస్తూ బతుకుతున్నారు. 86శాతం కరెన్సీ ఒక్కసారిగా గల్లంతైపోయి దేశం యావత్తూ అచేతన స్థితిలోకి పోయింది. బ్యాంకు ఉద్యోగులు సెలవులు కూడా మానుకుని నడుములు విరిగేలా పని చేసి ఇప్పటికే మూడు ల‌క్ష‌ల కోట్ల రూపాయల డిపాజిట్లు పోగేశారని బ్యాంకుల వాళ్లు గొప్పగా ప్రకటించారు.

ఇదంతా మంచి ఉద్దేశం కోసమేనా? కేవలం దాని అమలు లోపభూయిష్టంగా ఉన్నదా? నల్లధనం, అవినీతి, తీవ్రవాదం- ఈ మూడింటిపై దాడి అన్నాడు ప్రధానమంత్రి. ఆ మూడూ ఆయనకు ఇష్టమైన పదాలు. విదేశాలల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి రప్పిస్తానని ఎన్నికల ముందు ప్రతిజ్ఞ చేశాడు. అలా చేసి, వచ్చిన డబ్బును ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు జమచేస్తానన్నాడు. అవినీతిని నిర్మూలించి దేశాన్ని ప్రక్షాళన చేస్తానన్నాడు. అయితే వీటికన్నా ముందు ʹతీవ్రవాదంʹ, ʹదేశభక్తిʹ మతంలో రంగరించి అవసరమైనప్పుడు వాడుకోడానికి కావలసినంత ద్వేషాన్ని మాత్రం నిలువ చేసి ఉంచాడు.

స్విస్ బ్యాంకు ఖాతాల నుండి పనామా పేపర్ల దాకా మన పెద్దలు విదేశాల్లో దాచిన సొమ్ము గురించి చాలా చర్చ జరిగింది. చర్యలు మాత్రం ఏమీ లేవు. బినామీ ఆస్తులు, రియలెస్టేట్, బంగారం నిల్వల దగ్గరి నుండి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని చెల్లించని లక్షల కోట్ల దాకా దేన్నీ తాకలేదు. అది కూడా చేస్తాం అంటారు. కానీ మొదలు కావలసింది వాటితోనే. నల్లధనానికి ప్రాణవాయువులు అవే. వీటితో పోలిస్తే డబ్బు సంచులుగా ఉండేది చాలా చాలా తక్కువ. అది తీసేసినా పై సాధనాల నుండి మళ్ళీ వస్తుంది. ప్రధానమైనవాటిని వదిలేసి ప్రజల కష్టార్జితాల మీద ఎందుకు పడ్డారు? కోట్లాది మందిని గంటల తరబడి క్యూలో నిలబడి నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోమంటున్నారెందుకు?

ఒకవేళ దొంగలను పట్టడానికే ఇదంతా చేస్తున్నారనుకున్నా, అన్ని నిబంధనలకు లోబడి డిపాజిట్ చేశాక కూడా ఎవరి డబ్బు వారికివ్వడానికి పరిమితులు విధిస్తున్నారేందుకు? జనానికి వచ్చే అరకొర శ్రమ ఫలితం కూడా తీసుకుని కనీస అవసరాలకు డబ్బు మిగలనివ్వకుండా చేస్తున్నారేందుకు? అత్యవసర వైద్యం కోసమో, వ్యవసాయ పెట్టుబడుల కోసమో తమ డబ్బును తాము వాడుకోనివ్వని దుర్మార్గం ఏమిటి? దేశమంతా వాడుకలో ఉన్న 500, 100 రూపాయల కరెన్సీ సరిపడా ముద్రించి ఇవ్వకుండా, 2000 కరెన్సీ బలవంతంగా అంటగడుతున్నారేందుకు? ముందుగా ముద్రించి అందుబాటులో ఉంచాల్సింది రద్దయిన 500 నోట్లను కదా? దానికన్నా ముందే, అదీ ఇంత సంక్షోభంలో 2000 రూపాయల కరెన్సీ ఎందుకొచ్చింది? ప్రకటించిన ఉద్దేశానికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? జనానికి దొరకని 100 నోట్లు కమిషన్ వ్యాపారుల వద్దకు లక్షలకొద్దీ ఎలా వచ్చి చేరాయి? ప్రభుత్వం చెప్పినట్లు బ్లాక్ మనీకి ద్వారం మూసేస్తే, వెంటనే మరో ద్వారం ఎలా తెరుచుకుంది? ఈ వ్యవహారం అసలైన వాళ్ళకు ముందే తెలుసు అనడానికి విమర్శకులు చూపుతున్న ఆధారాలు కొట్టిపడేసేవి ఎంతమాత్రం కావు.

సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఏది కావాలన్నా రోడ్డెక్కి పోరాటం చేస్తే తప్ప లొంగని ప్రభుత్వాలు, ఊరికే ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పి ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటాయా? అదీ సంపన్నవర్గాలకు నొప్పి కలిగించే పనులు చేస్తాయా? అసలు పాలకవర్గ పార్టీల ఉనికే సంపన్న వర్గాలతో ముడిపడి ఉంది. ఈ పార్టీలకు ఫండ్ ఎక్కడి నుండి వస్తుంది, ఎంత వస్తుంది వాటికేమైనా లెక్కలున్నాయా? వచ్చేది అక్రమ సంపాదనాపరుల నుండా, సక్రమ సంపాదనాపరుల నుండా? ఎన్నికల్లో ఖర్చుపెట్టేది ఎంత? అది అక్రమమా, సక్రమమా? అన్ని పార్టీల కన్నా భిన్నంగా బి.జె.పి స్వఛ్చమైనదేమీ కాదు కదా? వార్తా శీర్షికల్ని మేనేజ్ చేయగలిగే నేర్పు బాగా వంటబట్టించుకున్న మోదీ ఈ విషయంలోనూ అంటే నేర్పును ప్రదర్శించాడు. కానీ ఇది తేలిగ్గా తెగే వ్యవహారం కాదు. కోట్లాది జనం బతుకుకు సంబంధించిన నిర్ణయంలో పచ్చి నియంతృత్వపు అహంభావం సంక్షోభం ముదిరేకొద్దీ అర్థమవుతున్నది. ఒక పరిణామం వెంట మరొక దుష్పరిణామం చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మార్కెట్లు స్థంబించి రైతుల వద్ద పంట కొనుగోలు ఆగిపోయింది. ఇట్లాగే ఉంటే నిత్యావసారాల ధరలు ఎంతగా పెరిగిపోతాయో చెప్పలేని స్థితి.

జనం డబ్బు మొత్తం బ్యాంకుల్లో పోగేసి ఏం చేయబోతున్నారు? పరిమితి విధించడం ద్వారా కొద్ది రోజులపాటు డబ్బు తీసుకోను కూడా వీలుకాని దిగ్బంధనం విధించి మరీ ఏం చేయబోతున్నారు? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఏం చేసినా సామాన్య జనం కోసం మాత్రం అంటే నమ్మబుద్ధి కాదు. ఇప్పటికైతే ఒక వాస్తవం కళ్ల ముందు ఉంది. బ్యాంకులేం చేస్తాయో అవే చేస్తాయి. అంటే వడ్డీ వ్యాపారం చేస్తాయి. ఎవరికి అప్పులిస్తాయి? ఎవరికైనా ఇస్తాయి కానీ పెట్టుబడిదారులకు ఎంత కావాలంటే అంతిస్తాయి. రిలయన్స్, వేదాంత, ఎస్సార్, ఆదాని, జిందాల్ వంటి టాప్ కంపెనీలే బ్యాంకులకు చెల్లించవలసిన లోన్ల మొత్తంలో ముందు వరుసలో ఉన్నారు. భారతదేశంలో బ్యాంకులు సుమారు ఆరు లక్షల కోట్లు ఇటువంటి వారి నుండి రాబట్టవలసి ఉంది. అప్పు చెల్లించని రైతు పొలాన్ని బ్యాంకులు జప్తు చేస్తాయి కానీ పెట్టుబడిదారుల ఆస్తులు జప్తు చేయవు. పైగా గత ఏడాదే పెట్టుబడిదారుల రుణం లక్షా 14వేల కోట్లు మాఫీ చేశారు. నల్ల ధనం మీద యుద్ధం జరుగుతోందని ఒకవైపు ప్రచారం జరుగుతున్నప్పుడే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బడా పెట్టుబడిదార్లు అప్పుపడిన సుమారు 7,100కోట్లు రద్దు అవుతున్నట్లు ప్రకటించింది. అరుణ్ జెట్లీ చెప్పిన ఆర్థిక పరిభాషలో అది పూర్తిగా రద్దు అయినట్లు కాదట. కానీ సారాంశంలో ఆ సొమ్ము తిరిగి రావడం దాదాపుగా ఉండదు. సామాన్య ప్రజానీకం గుప్పెడు చెల్లని నోట్లతో క్యూలో నిలబడితే, 500కోట్లతో కూతురి పెళ్లి వైభవంగా జరిపిస్తూ గాలి జనార్ధనరెడ్డి ఈ మహాయజ్ఞాన్ని గేలి చేస్తూ ఉంటాడు. ఒక మిత్రుడన్నట్లు అమ్మను క్యూలో నిలబెట్టిన మోదీ అంబానిని మాత్రం నిలబెట్టలేడు. కాబట్టి ఉద్దేశం నల్లధనం నిర్మూలన కాదు. ఏదో పద్ధతిలో జనం డబ్బు ఒక్క దగ్గర చేర్చి నియంత్రించదలచుకున్నారు . దేశప్రజానీకాన్ని, వారి ఆర్థిక లావాదేవీలను మొత్తంగా బ్యాంకుల పరిధిలోకి తీసుకొచ్చే చర్యగా కూడా పరిశీలకులు దీన్ని చూస్తున్నారు.

మంచి నీళ్ళ నుండి మందుల దాకా డబ్బు లేకుండా పూట గడవదు. పురిటి నుండి పాడె దాకా కరెన్సీతో, పెట్టుబడితో జీవితాలు ముడిపడిపోయాయి. అవి మరింతగా పెట్టుబడి కనుసన్నలలోకి, అదుపాజ్ఞల్లోకి తీసుకురావడానికి, పెట్టుబడి రథచక్రానికి కట్టివేయడానికా ఇంత హింస? ఇది ఇంతకన్నా తక్కువ నొప్పితో చేయవచ్చునేమో కదా? రాత్రికి రాత్రి గుజరాత్ ను ద్వేషాగ్నికీలల్లో దగ్ధం చేసిన మోదీ, కార్పొరేట్ పెట్టుబడి చేతులు కలిపితే ఇంతకన్నా తక్కువ హింసాత్మకంగా ఉండదేమో!

No. of visitors : 1433
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •