మ‌ధ్య‌భార‌తంలో... యుద్ధ బీభ‌త్సం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

మ‌ధ్య‌భార‌తంలో... యుద్ధ బీభ‌త్సం

- సాధ‌న‌ | 19.11.2016 09:33:06am

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పోలీసు, సైనిక బలగాలు ప్రజలను విచక్షణారహితంగా కాల్చిచంపుతున్నాయి. విశాల గ్రామీణప్రాంతంలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు రోజూ ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తూనే ఉన్నారు. గెరిల్లా దాడుల్లో ఒక ఖాకీ మరణిస్తే అందుకు ప్రతిగా 12మంది మావోయిస్టులను హతమారుస్తానంటూ బస్తర్‌ ఐజీ ఎస్‌ఆర్‌పీ కల్లూరి బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో గ్రామీణుల హత్యలు సాగుతున్నాయి. సెప్టెంబర్‌ 25న బస్తర్‌ జిల్లాలోని బూరుగుం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు చిన్నారి స్కూల్‌పిల్లలను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపడం బస్తర్‌ దుస్థితిని విస్పష్టంగా తెలియచెబుతున్నది. ఈ ఘటన పూర్వాపరాలు పరిశీలించకుండానే ఐజీ కల్లూరి వెనువెంటనే ఎంతో ఉత్సాహంగా తన ట్రిగ్గర్‌హ్యాపీ పోలీసులకు లక్ష రూపాయలు పారితోషికం ప్రకటిస్తూ, పోలీసులు పెద్ద మావోయిస్టు నాయకుడిని కాల్చిచంపారని ప్రకటించారు.

దంతేవాడ జిల్లాలోని ఈతమెట్ట ప్రాథమిక పాఠశాలలో ఈ చిన్నారులు ఇద్దరూ చదువుకుంటున్నారు. 8వ తరగతి చదువుతున్న బిజ్నూ, 9వ తరగతి చదువుతున్న సోన్‌కులను బూరుగుం ఠాణా పోలీసులు సోంగేర్‌లో అర్థరాత్రి అరెస్టు చేశారు. ఆ ఇద్దరు పిల్లలూ తమ బంధువుల ఇంటికిపోయినప్పుడు, అక్కడే వారిని పట్టుకుని, తెల్లవారుజామున కాల్చిచంపేశారు. మావోయిస్టులతో గంటకుపైగా ఎదురుకాల్పులు జరిగాయనీ, ఇద్దరు మావోయిస్టులు చనిపోగా వారిలో ఒక పెద్దనాయకుడు కూడా ఉన్నాడని చెప్పడమే కాక, ఎన్‌కౌంటర్‌ స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు, విప్లవ సాహిత్యం, రోజువారీ సామానులు కూడా దొరికినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ పిల్లలిద్దరి హత్య జరిగినవెంటనే గుండెలు పగిలేలా ఏడ్చిన బంధువులు అసలు జరిగినదేమిటో సమాజానికి తెలియచెప్పారు. పిల్లలను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయమంటూ అన్ని రాజకీయపార్టీలను, తమ ఆదివాసీ సమాజ నాయకులను వేడుకున్నారు. ఆమ్‌ ఆద్మీపార్టీ నాయకురాలు సోనీ సోడీ సహా పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఆదివాసీ నాయకులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వాస్తవాలేమిటో విప్పిచెప్పారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ ఐజీ కల్లూరిని బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

బస్తర్‌లో గత పదిమాసాలుగా కొనసాగుతున్న మిషన్‌-2016లో భాగంగా ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్లు చాలా పెరిగిపోయాయి. వాస్తవంగా 2009లో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ ప్రారంభమైన తరువాత, ఊచకోతలో భాగంగా హత్యలు, సామూహిక అత్యాచారాలు పెరుగుతూ వచ్చాయి. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు ముందు సల్వా జుడుం క్యాంపెయిన్‌ను ఐదేళ్ళపాటు కొనసాగించి వేలాది ఆదివాసులను చిత్రహింసల పాల్జేసి, వారి ఆస్తులు ధ్వంసం చేసి లక్షల సంఖ్యలో ఆదివాసులు గ్రామాలు వదిలిపోయేట్టు చేశారు. బస్తర్‌ సహా యావత్తు దండకారణ్యంలోని ప్రజలు దశాబ్దకాలానికిపైగా ఒక బీభత్సవాతావరణంలో జీవిస్తుండగా, వారిపై మిన్ను విరిగి మీదపడిన చందంగా ఈ మిషన్‌-2016 వచ్చిపడింది. 2017 నాటికి 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తికావస్తున్న నేపథ్యంలో, బహుళ ప్రచారంలో ఉన్న ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ గడువు కూడా ముగిసిపోతున్నందున పోలీసు, అర్థసైనిక బలగాలు ఈ మిషన్‌ ఆరంభించి సైనిక దాడులను బాగా పెంచినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కొత్తదాడికి దన్నుగా రాజ్య ప్రాయోజిత సంస్థలూ పుట్టుకొస్తున్నాయి. అగ్ని (యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌) పేరుతో ఏర్పడిన ఒక సంస్థ ఇటీవల బస్తర్‌ ముఖ్యపట్టణం జగదల్‌పూర్‌లో ʹలల్‌కార్‌ ర్యాలీʹ (ఛాలెంజింగ్‌ ర్యాలీ) నిర్వహించింది. ఇందులో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐజీ కల్లూరి ఆగ్రభాగాన నిలిచి, అడవుల్లో తాము మావోయిస్టులతో యుద్ధం చేస్తుంటే, అగ్నిలాంటి సంస్థ పట్టణాల్లోని మావోయిస్టు మేధావులతో పోరాడుతున్నదని ప్రశంసల జల్లులు కురిపించాడు.

ఇటువంటి సంస్థల అవసరం గతంకన్నా పాలకులకు ఇప్పుడు ఎంతో పెరిగిపోయింది. మావోయిస్టు సమస్య ఉత్పన్నం కావడానికి నిరుద్యోగమే ప్రధాన కారణమని ఇవాళ బస్తర్‌లో టాపర్స్‌ అనుకుంటున్న విద్యార్థులు కూడా పరీక్షాపత్రాల్లో జవాబులు రాస్తుండటం పాలకులకు మింగుడు పడడం లేదు. విద్యార్థుల మెదళ్ళలో నిజాలకు స్థానంలేకుండా చేయడానికి అగ్ని సంస్థ కృషి చేస్తే, బిజ్నూ, సోన్‌కు వంటి విద్యార్థులను అంతం చేయడానికి కల్లూరి సేన కదం తొక్కుతూంటుంది.

ఫాసిస్టు సల్వాజుడుం కొనసాగిన కాలంలో దేశంలోని అనేకమంది మేధావులు, హక్కుల సంఘాల నాయకులు, ప్రజాస్వామిక వాదులు, పాత్రికేయులు, రచయితలు బస్తర్‌ ప్రజలకు అండగా నిలిచి జుడుంను ఓడించడంలో తమ పాత్ర పోషించారు.ఎ్‌సపీవో వ్యవస్థ రద్దుకోసం చట్టపరంగా కూడా పోరాడి ప్రభుత్వ కుట్రలను ఓడించారు. తదనంతరం పురుడుపోసుకున్న ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా కూడా వారంతా ముందుకు వస్తున్నారు. ప్రత్యేకించి ఈ మిషన్‌-2016లో భాగంగా బస్తర్‌ డివిజన్‌లో మున్నెన్నటికన్నా తీవ్రమైన హత్యాకాండను ఖండిస్తూ, పోలీసుల చట్టవ్యతిరేక చర్యలను, దౌర్జన్యాలను ప్రపంచానికి తెలియచేస్తున్నారు. ఇది పోలీసులు సహించలేకపోతున్నందున ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ సాయిబాబా నుంచి దంతేవాడ జిల్లాలోని స్కూల్‌వార్డెన్‌ సోనీ సోడీ వరకూ ఎంతో మంది వేధింపులను, దాడులను ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరకాలంలోనే ప్రొఫెసర్‌ నందినీ సుందర్‌ మొదలుకొని హక్కుల కార్యకర్త బేలా భాటియా, పాత్రికేయురాలు మాలినీ సుబ్రహ్మణ్యం వరకూ ఎందరెందరో ప్రజాహిత మేధావులు చెప్పనలవికాని రీతిలో పోలీసుల వేధింపులను, బెదిరింపులను, తప్పుడు కేసులను అనుభవిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో గత పదమూడేళ్ళుగా భారతీయ జనతాపార్టీ పాలన సాగుతోంది. పారిశ్రామికవర్గాల ప్రయోజనాలను ఈడేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పడరానిపాట్లు పడుతోంది. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, శాసనసభలో ప్రజాప్రతినిధులకు కూడా తెలియచేయకుండా ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలతో పరమదోపిడీ ఒప్పందాలను కుదుర్చుకుంది. టాటా, ఎస్సార్‌ సంస్థలు 2005 జూన్‌నుంచి 2016 వరకూ తమ ఒప్పందాలకు కార్యరూపం ఇవ్వడానికి అనేక యత్నాలు చేశాయి. బస్తర్‌లో టాటాకు వ్యతిరేకంగా 10 పంచాయితీల ప్రజలు దృఢంగా నిలబడ్డారు. వందలాది కుటుంబాల పోరాట ఫలితంగా లోహండిగుడాలో తన ప్లాంట్‌ను టాటా సంస్థ రద్దుచేసుకుంది. అలాగే ఎస్సార్‌కు దుర్లీ, భాంసీలలో ఇదేరకమైన ప్రజావ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యతిరేకతను తక్షణమే అణచివేయాలనీ, రావ్‌ఘాట్‌ రైల్వేలైనును వేగంగా పూర్తిచేయాలన్నది దేశపాలకుల ఎజెండా. ఇలాంటి అనేక పనులు పూర్తిచేయడమూ, గనుల తవ్వకాలకు మార్గం సుగమం చేసుకోవడం రానున్న విధానసభ ఎన్నికల్లోగా పూర్తిచేయాల్సిన లక్ష్యం ముందుంది. రాబోయే రోజుల్లో వేటికీ టాటా, ఎస్సార్‌ అనుభవం ఎదురుకాకూడదన్నది మిషన్‌-2016 వెనుక గల మరోకోణం అన్నది గుర్తించాలి.

No. of visitors : 1025
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •