దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

- వరవరరావు | 07.12.2016 11:00:07am

ధర్మపురి రేగళ్లల నుంచి సత్యమంగళం మీదుగా
కొంకణి మలబారు తీరాల వరకు
వాళ్ల ప్రశ్నలతో గాలి మళ్లీ పదునెక్కుతోంది
పశ్చిమ కనుమల్లో వాళ్ల కవాతు మొదలైంది
దండకారణ్యాన్ని ఆవాహన చేసుకొని
కదులుతున్న దండులతో
కావేరి తీరం ఎరుపెక్కుతోంది

(- జయ, తుళు, నైరుతి రుతుపవనాల కాలమిది!)

అమరుడు సాకేత రాజన్‌ ʹఎన్‌కౌంటర్‌ʹ (2005) కన్న ముందు నుంచే పడమటి కనుమల్లో వాళ్ల కవాతు మొదలైంది. అప్పటికి దేశంలో మూడు అతిపెద్ద సాయుధ విప్లవ పార్టీలు ఐక్యమై ఐక్య మావోయిస్టు పార్టీ ఏర్పడిన కాలం నుంచి దేశంలో అనువైన వేరు వేరు చోట్ల విముక్తి ప్రాంతాల నిర్మాణం కోసం వీలైనన్ని నక్సల్బరీలను రూపొందిస్తున్న కాలమది. మేఘం అంచున మెరుపు ఉన్నట్లే వర్షంతో పాటు పిడుగు వస్తుంది. రాలుతున్న పిడుగుకు పెద్ద ఆకర్షణ లోహం, లోహ ధాతువు. ముఖ్యంగా ఇనుము, రాగి. ఈ రాగి కోసం 1973లో దక్షిణ అమెరికా చిలీ మీద పిడుగు పడడం చూశాం. సాల్వెడార్‌ అలెండీని, పాబ్లో నెరూడాను మట్టుబెట్టిన పిడుగు. ఉక్కుగా మారే ఈ ఇనుము కోసం సాకేత రాజన్‌ను ఈ పడమటి కనుమల్లో మట్టుబెట్టడం చూశాం. ఉక్కుగా మారే ఇనుము కోసం జంగల్‌ మహల్‌లో కిషన్‌జీని మట్టుబెట్టడం చూశాం. అయినా ప్రజలు నిర్మించే చరిత్రను రచిస్తూ పడమటి కనుమల నుంచి తూర్పు కనుమల దాకా జోగు జలపాతం నుంచి జంగల్‌మహల్‌ దాకా ఈ కవాతులు సాగుతూనే ఉంటాయి. కబాని నది, భవాని నది, అవినాశ నది ఈ ట్రై జంక్షన్‌లో నీళ్లైతేనేమీ, నెత్తురైతేనేమీ నీళ్ల రూపమైనా, నేల రూపమైన, పంచభూతాల రూపమైనా రక్తచలనాన్ని, ఘర్షణను, మార్పును అంతర్నిహితం చేసుకున్న మట్టి రూపమే కదా.

మట్టి ఎప్పుడైనా తన కోసం తను మాట్లాడుకుందా?
అసలు మట్టి తన కోసం తాను మాట్లాడుకుంటే
ఎదురు ఎవరైనా మాట్లాడగలరా?
ఏ పాటైనా అడవి పాడిందా? అచ్చంగా తన కోస
కడుపు కోత తప్ప అడవికి ప్రత్యేకమైన పాట ఏమైనా ఉందా?

నేను నవంబర్‌ 8న బోల్షివిక్‌ విప్లవ శతవార్షిక సభల్లో మాట్లాడడానికి త్రిశూర్‌ చేరుకున్నాను. సమావేశ స్థలంలో కలిసిన విప్లవాభిమానులందరు ప్రొ. నందినీ సుందర్‌, ప్రొ. అర్చనా ప్రసాద్‌లపై ఛత్తీస్‌ఘడ్‌లో హత్యానేరం పెట్టారని చెప్పారు. అంతేకాదు, ఢిల్లీలోని జోషీ అధికారి అధ్యయన పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న వినీత్‌ తివారి, ఛత్తీస్‌ఘడ్‌ సిపిఎం కార్యదర్శి సంజయ్‌ పరాఠేలపై కూడా ఆ కేసు మోపారన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌లో పాల్గొంటున్న పోలీసుల తోడుగా పనిచేస్తున్న ఒక ఆదివాసిని మావోయిస్టులు చంపిన కేసు అది. నాకు చెప్పినవాళ్లకు ఇది వార్త ఎందుకు అయిందంటే ఈ కేసులో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర సిపిఎం కార్యదర్శిని పెట్టినారు అనేది. అక్కడ సిపిఎం అధికారంలో లేకపోవడం మాత్రమే కాదు, సిపిఐ ఉన్నంత బలంగా కూడా లేదు. కేరళలో సిపిఎం అధికారంలో ఉన్నది. మావోయిస్టులు కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ ఒక దశాబ్దం పైగా ఆపరేషన్‌ థండర్‌బోల్ట్‌ అమలవుతున్నది. సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు దాని వైఖరి అదన్నమాట. సభ ఈ సమాచారంతోటే మొదలైంది.

నిండా రెండు వారాలు కాలేదు, నవంబర్‌ 23 మధ్యాహ్నం నుంచి టివిలో వార్తలు మొదలైనవి. కేరళ మల్లాపూరం జిల్లా నీలాంబుర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగిందని, అందులో కుప్పు దేవరాజ్‌ అలియాస్‌ యోగేశ్‌ అలియాస్‌ రమేశ్‌, అజిత అలియాస్‌ కావేరి చనిపోయారు. వైనాడుకే చెందిన సోమన్‌ గాయపడి బందీగా ఉన్నాడని, తప్పించుకున్నాడని ఇప్పటికీ ధృవపడని వార్తలే. ఇంకొక 11 మంది మూడు దళాలకు చెందిన గెరిల్లాలు తప్పించుకొని పోయారని, వాళ్ల కోసం ఉధృతంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయని థండర్‌బోల్ట్‌ ఇంచార్జ్‌ పోలీసు ఆఫీసర్‌ ప్రకటన.

మావోయిస్టు పార్టీ రాజకీయ నిర్మాణంలో ఈ ప్రాంతం పశ్చిమ కనుమల స్పెషల్‌ గెరిల్లా జోన్‌. ఇది కేరళ, కర్నాటక, తమిళనాడుల అడవులను కలిపే ప్రాంతం. బండీపూర్‌, ముదుమలై అరణ్య జీవ ఆవాసాలు, నీలగిరి జీవ పర్యావరణ ప్రాంతం ఇది. తమిళనాడులోని నీలగిరి అడవి ప్రాంతం, కేరళలో పాలక్కాడు మల్లపురం, వైనాడు అడవి ప్రాంతం, కర్నాటకలోని మైసూరు, మొదలైన అడవి ప్రాంతం కలిసి మీడియా విస్తృతంగా ప్రచారం చేసే ట్రై జంక్షన్‌ ఇది. ఒకప్పుడు వీరప్పన్‌ సంచరించిన సర్వమంగళం అడవులుగా వీళ్లు చెప్పుకునేవారు. కేరళలో మున్నార్‌ ప్రకృతి దృశ్యాలను చూడడానికి వెళ్లేవాళ్లు, వేల ఎకరాలు ఆక్రమించి విస్తరించుకొని ఉన్న టాటా తేయాకు తోటలు, కాఫీ తోటలు చూడడానికి వెళ్లేవాళ్లు తిరుగాడే ప్రాంతం ఇది.

ఉదకమండలం లోయలు సత్యమంగళం అడవులు వైనాడు తేయాకు తోటలు చూపరులకు ఎంత అందంగా కనిపిస్తాయో అంతగా ముక్కాలు రూపాయి కోసం ముప్పొద్దులా గొడ్డు చాకిరీ చేసే మనుషులను పోల్చుకోవడానికి వాళ్ల మధ్యకు మనుషులు పోవాలి. అట్లా మనుషులుగా వెళ్లిన వాళ్లు ఆదివాసుల మధ్యకు మావోయిస్టులుగా వెళ్లినవాళ్లు ఇప్పుడు వాళ్లతో పాటు తమను నూతన మానవులుగా వర్గపోరాటంలో ఆవిష్కరించుకోడానికి వెళ్లిన వాళ్లు ఈ గెరిల్లాలు.

ʹʹకాసిన్ని మిరియాలు, కాఫీ గింజలు ఏరుకోవడానికి వెళ్లి ఏనుగు కాళ్ల కింద పడి చితికిపోయిన వేలాది మంది అనామకులʹʹ మధ్యకు. ʹʹనిప్పులు రాజేసుకోవడానికి కట్టెపుల్లలు పట్టిన పాపానికి పుస్తెలు తెగిపోయే చప్పుడుʹʹ విని వెళ్లినవాళ్లు వాళ్లు. ఆ ట్రై జంక్షన్‌ రహదారులకు పోయి చూస్తే అక్కడ దేశం కన్నీళ్లు కనిపిస్తాయి. ʹʹఅసలు అక్కడ ఇప్పుడు దోచుకోవడానికి కూడా ఏమీ మిగలలేదు. అక్కడ దోచుకోబడని వాళ్లంటూ ఎవరూ లేరు.ʹʹ

ʹʹవాళ్లు తిండి గింజల్ని, అడవి ఫలాల్ని, జీవన మాధుర్యాల్ని, శ్రమ ఫలితాల్ని, ఎదిగిన ఆడపిల్లల్ని, పీలికలు లేని గుడిసెల్ని సమస్తం కోల్పోయిన వాళ్లు.ʹʹ వాళ్ల మధ్యకు వెళ్లారు వీళ్లు.

ఈ ఇద్దరిని ఈ అడవిలోనే కావచ్చు, పరిసర ప్రాంతంలోనే కావచ్చు అనారోగ్యంతో నిరాయుధంగా ఉన్న వాళ్లను పట్టుకొని వచ్చి ఈ అడవుల్లో చంపారనేది స్పష్టం. అతని శరీరంలోంచి 19 బుల్లెట్లు వెళ్లాయి. ఆమె శరీరంలోంచి 7 బుల్లెట్లు వెళ్లాయి. అతని వయసు 60 ఏళ్లు. మధువ్యాధి పీడితుడు. ఆమె వయసు 45 ఏళ్లు. అవివాహిత. ఇద్దరూ దళిత కుటుంబాల్లో, తమిళనాడులోనే పుట్టారు. అజితది చెన్నయి. తండ్రి పరంధామన్‌ భారతీయ రైల్వేలో ప్రభుత్వాధికారిగా పనిచేశాడు. రైలు ప్రమాదాలు ఎట్లా జరిగాయో తెలుసుకునే నిపుణుడైన ఇంజినీర్‌. కాని మావోయిస్టు భావజాలంతో ప్రభావితమైనవాడు. ప్రచారం చేసినవాడు. అజిత 25 ఏళ్ల క్రితమే కళాశాల విద్యార్థిగానే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితురాలైంది. తమిళనాడులో మహిళా విముక్తి సంఘాన్ని ఏర్పాటు చేసిన తొలి నాయకత్వంలో ఆమె ఉన్నది. అప్పటికే భయంకరమైన కళ్ల వ్యాధితో బాధపడుతున్నది. చూసిన వైద్యులు జాగ్రత్తలు తీసుకోకుంటే అంధత్వం వస్తుందన్నారు. విముక్తి దృక్పథంతో మహిళా సంఘాలు నిర్మాణం చేస్తూ ఆమె లా చదివింది. ప్రజాస్వామిక హక్కుల కోసం న్యాయవాదిగా పోరాడింది. ప్రజా విముక్తి మార్గంలో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నది. అమరత్వం నాటికి ఆమె పశ్చిమ కనుమల స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు. చెన్నై పట్టణంలో ఆమె పేరు వినని వారు ఉండరు. తమిళనాడులోనూ ఉండరు. నవ యవ్వనంలో చూపుమాంద్యం మొదలు, మధ్యవయస్కురాలు అయ్యే నాటికి అనారోగ్యం వరకు అన్నిటినీ జయించిన అజిత ఆమె.

కుప్పు దేవరాజ్‌ ఆయా దశల్లో, కాలాల్లో ఆయా తరాలకు ఆయా పేర్లతో పరిచితుడు. నాకు మూర్తిగా తెలుసు. ఆల్‌ ఇండియా లీగ్‌ ఫర్‌ రెవల్యూషనరీ కల్చర్‌ (ఎఐఎల్‌ఆర్‌సి - అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి)లో ఆయన, నేను కార్యవర్గ సభ్యులుగా 1983-85 మధ్యన కలిసి పనిచేశాం. 8వ దశాబ్దపు ఉత్తరార్ధానికే ఆయన అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నాడు. రమేశ్‌గా, యోగేశ్‌గా కర్నాటకలో విప్లవోద్యమానికి, విప్లవాభిమానులైన ప్రజలకు తలలో నాలుక. పుట్టింది తమిళనాడులోని కృష్ణగిరిలో. ధర్మపురి, కృష్ణగిరి, ఉత్తర ఆర్కాట్‌ జిల్లాలు, ఎలిగిరి కొండలు నక్సల్బరీ కాలం నుంచి కూడా విప్లవోద్యమానికి పట్టున్న ప్రాంతాలు. నీలగిరి అడవుల్లో ఎప్పుడూ ఎర్రని విప్లవ కణాలు రాజుకుంటూనే ఉంటాయి. కా. బాలన్‌, కా.రవీంద్రన్‌ వంటి విప్లవకారులు పోరాడి అమరులు అయిన నేల అది.

అక్కడ పుట్టి దేవరాజ్‌ విప్లవ జీవితమంతా కర్నాటకలో గడిపాడు. ఉదయ్‌గా కా. చెరుకూరి రాజ్‌కుమార్‌ నాయకత్వంలో నిర్మాణమైన కర్నాటక విప్లవోద్యమంలో రాజ్‌కుమార్‌ కేంద్ర కమిటీకి వెళ్లిన తరువాత కార్యదర్శిగా నాయకత్వం చేపట్టినవాడు దేవరాజ్‌. 1995 నాటికే కేంద్ర కమిటీ సభ్యుడుగా, 2001 పార్టీ తొమ్మిదవ కాంగ్రెస్‌లో, 2007 ఐక్య కాంగ్రెస్‌లో పాల్గొన్నవాడు. మూడు రాష్ట్రాలలో 2007 నాటికి విప్లవోద్యమ నాయకత్వమంతా ఏదో ఒక రూపంలో కోల్పోయిన సందర్భంలో నిలబెట్టినవాడు ఆయన. 1985-87 పీపుల్స్‌వార్‌ పార్టీలో సంక్షోభం వచ్చిన కాలం నుంచి ఈ మూడు రాష్ట్రాల్లో ఆటుపోటుల కాలమంతా తన వెనుక విప్లవశ్రేణులను నిలబెట్టినవాడు. స్వయంగా ఇంజినీర్‌. కళాకారుడు. తమిళం, కన్నడం, మళయాలం, తెలుగు, ఇంగ్లిష్‌ ధారాళంగా మాట్లాడగలడు. రాయగలవాడు. విప్లవ మేధావి. ఒక్క మాటలో ఆయన ట్రై జంక్షన్‌లో ట్రై జంక్షన్‌. ఈ సమాజ సంక్షోభపు చార్‌ రాస్తాలో తీన్‌బత్తీ (మార్క్సిజం, లెనినిజం, మావోయిజం)గా వెలుగుతున్న దీపస్తంభం ఆయన.

అతడు ఎప్పుడూ అడవితోపాటు ప్రత్యక్షమయ్యేవాడు
అతడి దేహమంతా తూటాల గాయాలు
అతని గాయాల నిండా చితికిన పల్లెలు
అతడి పల్లెల నిండా చిత్రహింసల కొలుములు

అతడి గుండె నిండా సన్నీల కోతలు
అతని గాట్ల నిండా ఆచూకీ దొరకని జీవితాలు
అతని జీవితమంతా దిక్కుమొక్కులేని ఆదివాసీల ఆర్తనాదాలు

అతడెప్పుడూ ఒక నమ్మకంతో ప్రత్యక్షమయ్యేవాడు
అతడి గుండెల నిండా విముక్తి గానాలు
అతడెప్పుడూ ఓ గొప్ప కలతో ప్రత్యమయ్యేవాడు

ఉత్పత్తి పరికరాలు ఉపయోగించే చేతుల్లోకి చేరుకోవాలని
భూములన్నీ తమను దున్నే చేతుల్లోనే వశం కావాలని
తరాల కలలన్నీ వాస్తవంగా రూపొందే మార్గాన్నే ఎన్నుకోవాలని
అతడు విశ్వస్వప్నాన్ని అంతటా వెదజల్లేవాడు

అమరత్వాన్ని ప్రజలకు హామీ ఇవ్వడం
అదేమంత తేలికేం కాదు
అందుకే అమరత్వం అతని వద్ద సరికొత్త పాఠాల్ని నేర్చుకుంది

(- భాస్కరన్‌, తమిళం, నైరుతి రుతుపవనాల కాలమిది!)

అందుకే ఆయన కోసం, ఆమె కోసం, కబనీ కోసం, కావేరి కోసం చెన్నైలో విజయకుమార్‌ కాచుకుని కూర్చున్నాడు. పథకం పన్ని. కుట్రపూరితంగా. తమిళనాడు క్యూ బ్రాంచ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో. కిషన్‌జీ కోసం జార్ఖండ్‌, జంగల్‌ మహల్‌ సరిహద్దుల్లో కాచుకుని కూర్చున్నట్లు. అప్పుడతడు సిఆర్‌పిఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌. ఇప్పుడు మోడీ కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టు వ్యతిరేక భద్రతా సలహాదారు. ఆయన పనే మనుషుల మధ్య పనిచేసే మావోయిస్టులను చంపడం. అందుకే ఆయన ఇది మాకు గొప్ప విజయం, మావోయిస్టులకు పెద్ద దెబ్బ అని ప్రకటించాడు. కాని ఎంత భయపడిపోయాడంటే దేవరాజ్‌ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆయన తల్లి అమ్మిని, సోదరుడు శ్రీధరన్‌ (బాబు), అక్కచెళ్లెళ్లు వెళ్లగానే కృష్ణగిరి ప్రాంతమంతా ఆ శవాన్ని తీసుకొని వాళ్లు తిరిగి వస్తే ఏ ఒక్కరూ వాళ్లకి సహకరించివద్దని, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని క్యూ బ్రాంచ్‌ కట్టడి చేసింది. అజిత మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన ఆయన చిన్నాయన చెన్నై ఇంటి వాళ్లను భయపెట్టి ఆయన్ను వెనక్కి రప్పించింది.

కోజీకోడ్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో శాశ్వత నిద్రలో ఉన్న దేవరాజ్‌, అజిత మృతదేహాలు ఏం చేస్తున్నాయి? కేరళనంతా కదిలిస్తున్నాయి. కేరళ అట్టుడికిపోతున్నది. కోజీకోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రి ముందు వివిధ జిల్లాల పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ ముందు ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. నినాదాలు ఇస్తున్నారు. అక్కడే తిరుగుబాటు స్వరాలై మృతదేహాలపై రీపోస్ట్‌మార్టమ్‌ జరగాలని, ఇది బూటకపు ఎన్‌కౌంటరని, ఈ హత్య చేసినవాళ్లను శిక్షించాలని నినదిస్తున్నారు.

కొడుకు మృతదేహం కోసం వెళ్లిన అమ్మిని పోలీసు స్టేషన్‌ ముందు ధర్నాకు నాయకత్వం వహిస్తున్నది. కోజీకోడ్‌ ఆస్పత్రి ముందు ఏ మట్టి నుంచి తాను వచ్చిందో ఆ మట్టి మీదనే లోపల ఉన్న కొడుకు మృతదేహం స్పర్శ కోసమైనా తపిస్తూ సేదతీరుతున్నది. అది సేదతీరడం అందామా? ఆమె గుండెల్లో కూడంకళం సముద్ర తరంగాలు కలవరపెడుతున్నాయందామా? ఆమె గుండె లోతుల్లోకి చూడగల మానుష ప్రపంచం ఈ మార్కెట్‌ వేగంలో ఒక క్షణం ఆగి తొంగి చూడగలదా?

అక్కడ 78 ఏళ్ల పోరాట్టం (నక్సల్బరీ పంథాను ప్రచారం చేసే ప్రజాసంఘం) నాయకుడు ఎం.ఎన్‌. రావుణ్ని మొదలు పోరాట్టం కార్యకర్తలు, జనకీయ మానుష్యావకాశ ప్రస్థానం కార్యకర్తలు, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు రీపోస్ట్‌మార్టమ్‌ కోసం, న్యాయ విచారణ కోసం డిమాండ్‌ చేస్తూ బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ ఉద్యమిస్తున్నారు. ఒక చోటనే కాదు, ఇప్పుడు అది మల్లాపురం అడవుల నుంచి పట్టణాలకీ, నగరాలకూ పాకుతున్నది.

నాలుగు రోజులు పోయాక ముఖ్యమంత్రి విజయన్‌ మెజిస్టేరియల్‌ విచారణ కోసం ఉత్తర్వులు ఇచ్చాడు. అట్లాగే, డిజిపి ఉత్తర్వులపై క్రైం బ్రాంచ్‌ విచారణ కోసం ఆదేశించాడు. ఇతరులకు కాదు కదా, ఇది మార్క్సిస్ట్‌ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, వృద్ధ నేత అచ్యుత్తానందన్‌కు కూడా సంతృప్తి కలిగించలేదు. సిపిఐ అయితే ఎన్‌కౌంటర్‌ రూపంలో కేరళ నుంచి ఒక రాజకీయ పార్టీగా ఉన్న మావోయిస్టు పార్టీని తుడిచేసే ఈ పద్ధతిని తాము సుతరాము ఒప్పుకోం అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన రమేశ్‌ చెన్నితల హైకోర్టు సిట్టింగ్‌ లేదా రిటైర్డ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలన్నాడు.

ఇది ఈ విప్లవకారులకు ప్రజల మీద ఉండే ప్రభావం, ప్రజాస్వామ్యవాదుల్లో ఉండే గౌరవం వల్ల ఏర్పడిన ఒత్తిడి. కేరళలో వర్గీస్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత ఇదే పెద్ద ఎన్‌కౌంటర్‌. ఈ మధ్యకాలంలో ఈ పశ్చిమ కనుమల్లో విప్లవోద్యమం నిర్మాణం చేస్తున్న సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐబి వాళ్లు, గ్రేహౌండ్స్‌ స్టీఫెన్‌ రవీంద్ర నాయకత్వంలో వెళ్లి కొల్లాంలో అరెస్టు చేసి తీసుకువచ్చి అనంతపురం జిల్లా హిందుపూర్‌లో కాల్చివేశారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో ఈ పశ్చిమ కనుమల విప్లవోద్యమ మావోయిస్టు పార్టీ నాయకత్వం మురళీధరన్‌, వీరమణి, కన్నన్‌, రూపేశ్‌, షైనా, అనూప్‌లను పూణె మొదలు, కోయంబత్తూర్‌ల వరకు వేరు వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసి జైల్లో పెట్టింది.

అయితే ఇటువంటి పార్టీలు కూడా ఇప్పుడు ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటున్నాయని చెప్పడం ఎందుకంటే ఇది పోస్టిరిటీ అంటారు. అంటే భవిష్యత్‌ చరిత్ర కోసమైనా ఇవాళ వ్యక్తమైన ఒక అభిప్రాయాన్ని నమోదు చేయడం అని.

1995లో పీపుల్స్‌వార్‌ హైదరాబాద్‌ కార్యదర్శి రామేశ్వర్‌ (సురేశ్‌), ప్రాంతీయ కార్యదర్శి దామోదర్‌ (సంజీవ్‌) మొదలైన విప్లవకారులు ఎన్‌కౌంటర్‌లలో అమరులై మెదక్‌ జిల్లా నర్సాపుర్‌ అస్పత్రిలో మృతదేహాలుగా ఉండి ఆస్పత్రి ముందు, హైకోర్టులో తమ తమ పుట్టిన గ్రామాల్లో హైదరాబాద్‌లో న్యాయం కోసం ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని రెండు వారాల పాటు నిర్వహించినట్టుగా మృతదేహాల స్వాధీన కమిటీ రూపొందడానికి కారణమైనట్లుగా ఇవాళ కోజీకోడ్‌ ప్రభత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఈ ఇద్దరు అమరుల మృతదేహాలు ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాయి. పది రోజుల పాటు రామగుండం ఏరియా ఆస్పత్రి శవాగారంలో భద్రపరచబడిన ఎర్రంరెడ్డి సంతోష్‌ (మహేశ్‌) మృతదేహం రాష్ట్రమంతటా ఎన్ని సంచలన ఉద్యమాలు నిర్వంచిందో ఇవాళ కేరళలో అన్ని సంచలన ఉద్యమాలు జరుగుతున్నాయి.

సెషన్స్‌ కోర్టులో రీపోస్ట్‌మార్టమ్‌ కోసం వేసిన పిటిషన్‌ అనుమతించబడింది. డిసెంబర్‌ 5 వరకు మృతదేహాలను భద్రపరచి మొదలు జరిపిన పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ ఈలోగా కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. ఇప్పుడు అక్కడ ఒక జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పడింది. డిసెంబర్‌ 3, 4 తేదీల్లో అఖిల భారత స్థాయిలో ప్రజాస్వామిక హక్కుల సంఘాలు నిజ నిర్ధారణకు వెళ్తున్నాయి. ఈ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకత్వంలో డిసెంబర్‌ 9న ఒక పెద్ద ర్యాలీ నిర్వహించబడుతుంది.

తెలంగాణ మొద్దుగుట్ట అడవుల్లో ఎన్‌కౌంటరైన శృతి, సాగర్‌ల అమరత్వం రగిలించిన ప్రజాస్వామిక ఉద్యమం వంటిది కేరళలో ఈ ఇరువురు విప్లవకారుల అమరత్వం రగిలిస్తుందని, అందుకు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విప్లవాభిమానుల నుంచి, ప్రజల నుంచి, ప్రజాస్వామిక వాదుల నుంచి ఎగసన లభిస్తుందని ఆశిద్దాం.

అయితే ఇదంతా క్యూ బ్రాంచ్‌లు, ఎస్‌ఐబిలు, గ్రేహౌండ్స్‌, ఎన్‌ఐఎలు వంటి రాష్ట్ర, కేంద్ర మావోయిస్టు వ్యతిరేక సంయుక్త ఆపరేషన్‌ల గురించి మాట్లాడుకోవడం కాదు. గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌, ఆపరేషన్‌ థండర్‌బోల్ట్‌, మిషన్‌ 2016 గురించి మాట్లాడుకోవడం కాదు. కేవలం రీపోస్ట్‌మార్టమ్‌లు, న్యాయ విచారణలు, నేరస్తులకు శిక్షలు, మృతదేహాల స్వాధీనం గురించి మాట్లాడుకోవడం కాదు. ఇవన్నీ జరగాలి, మనుషులకు చావు పుట్టుకలకు సంబంధించిన మానవీయ గౌరవం దక్కాలి. ప్రజాస్వామిక న్యాయం దక్కాలి అని కోరుకోవడం ఒక సహజమైన, ఒక నాగరికమైన సమాజం నిత్య ఆచరణలో పెట్టవలసిన డిమాండ్‌. ప్రజలు ఆ డిమాండ్‌ పెడతారు, సాధించుకుంటారు.

ప్రజలు అందుకోసం మాత్రమే ఉద్యమించడం లేదు. అందుకోసమే జీవించడం లేదు. అందుకోసమే పోరాడడం లేదు. వాళ్లకు ఒక ఉన్నత జీవితం కోసం, ఒక సమూల మార్పు కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా, యాభై వసంతాల క్రితం, అవును మీరు వెంటనే అనవచ్చు, అవి శిశిరాలు అని కూడా. విప్లవ ఆశావాహ దృక్పథంతో ఈ పిడుగుపాటులో కూడా ఒక తటిల్లత వంటి మెరుపు ఉందని నేనూ కూడా అనవచ్చు. కురిసిన వసంత మేఘంలో ఒక మెరుపు తీగ దాగి ఉన్నదని అనవచ్చు. ఒక చీకట రాత్రి అంచున ఒక ఉదయం హామీ ఉన్నదనవచ్చు.

ఇవాళ సమస్య రెండు ప్రాపంచిక దృక్పథాల ఘర్షణ. రెండు రాజ్యాల మధ్య ఘర్షణ. ఒక మృత్యువుకు, జీవితానికి మధ్య ఘర్షణ. మృత్యువు మరణశయ్యపై ఉన్న సామ్రాజ్యవాదం. దాని మారుపేరు మార్కెట్‌. అది నిత్యమూ జీవితంలో తన విశ్వరూపంతో వ్యక్తమవుతూ ఇటువంటి దాడులుగా, యుద్ధాలుగా హింసా విధ్వంసాల నిజరూపాన్ని చూపుతుంది. దానిని వర్గపోరాటంతో ప్రజలు ఎదుర్కొంటారు. కార్మిక, కర్షక ప్రజలు. కష్టజీవులైన ప్రజలు. సాంఘిక పరిభాషలో దళితులు, ఆదివాసులు, ముస్లింలు, స్త్రీలు మొదలైన పీడనకు, అణచివేతకు గురవుతున్న ప్రజలు. ఒక గెరిల్లా పోరాటంగా ప్రారంభమై, ప్రజాయుద్ధంగా పరిణమించే పోరాటం ఇది.

దీని రాజకీయార్థిక పునాది ఒక అభివృద్ధి నమూనాలో ఉన్నది. పై నుంచి రుద్దబడుతున్న ప్రపంచ బ్యాంక్‌ నమూనా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ. దీని ప్రత్యామ్నాయంగా విప్లవ రాజకీయాల నాయకత్వం ప్రజలు గడ్డివేళ స్థాయి నుంచి ప్రజల ప్రజాస్వామ్య స్థాపన ప్రయోగం చేస్తున్నారు. తెలంగాణ, దండకారణ్యంలో ప్రజలు ఇరవై ఏళ్లుగా, జార్ఖండ్‌లోని సరండా, పడమటి కనుమల్లోని ట్రై జంక్షన్‌లో ఈ ప్రయోగాలు చేస్తున్నారు.

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి నుమల్లో సాకేత్‌ రాజన్‌ నుంచి నిన్నటి కుప్పు దేవరాజ్‌, అజితల దాకా ఎగసిపడి విరిగిపడిన కెరటాలుగా నిర్మాణం చేస్తున్నారు కావచ్చు. కాని ఇది మౌలికమైన పోరాటం. మానవీయమైన పోరాటం. ఈ మానవీయ పోరాట ప్రాపంచిక దృక్పథం వర్గపోరాటం.

ఇది ప్యారిస్‌ కమ్యూన్‌, బోల్షివిక్‌ విప్లవం, చైనా ప్రజా విప్లవం, నక్సల్బరీల కాలం నుంచి పడిలేస్తూ పురోగమిస్తున్న విప్లవం. ఈ విప్లవ పథంలో మనం చేగువేరాలను చూశాం. కాస్ట్రోలను చూశాం. సామ్రాజ్యవాద వ్యతిరేక ఫెడెల్‌ కాస్ట్రో నిలకడలకే కాదు, చేగువేరా వంటి త్యాగాలకు ఉత్చేజితులమయ్యాం. ఇప్పటికి తుడిచిపెట్టుక పోయిందనిపిస్తున్న ఎల్‌టిటిఇ పోరాటాన్ని తన బాలచంద్రునితో సహా అమరుడైన ప్రభాకరన్‌ను మనమేమీ నైరాశ్యంలో జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఈ ప్రభాకరన్‌ అమరత్వంపై పీపుల్స్‌మార్చ్‌లో ఈ దేవరాజే ఎంతో విశ్లేషణాత్మకమైన, ఉత్తేజకరమైన రచన చేసి ఉన్నాడు.

విప్లవంలో ఓటమీ ఉంటుంది, విజయం ఉంటుంది. రెండింటినీ గతితార్కికంగా కలిపి ఉంచేది కమిట్‌మెంట్‌, త్యాగం. నడిపించేది స్పష్టమైన వర్గపోరాట దృక్పథం. గీటురాయి అది. ఆ కత్తి అంచు మీద నడిచిన మొదటి వాళ్లు కాదు, చివరి వాళ్లు కాదు దేవరాజ్‌, అజిత్‌లు. ఈ మట్టికోసం పోరాటంలో వాళ్లు అమరులై ఇంక ఆస్పత్రిలో శాశ్వత నిద్రలో ఉన్నారు. ఆ అమరులు మళ్లీ రేపు మట్టిలో కలిసి తమ అమరత్వంతో వాళ్లు మనకు జీవితాన్ని వాగ్దానం చేస్తారు. నూతన మానవ జీవితం.

వసంతం...
ఉవ్వెత్తున ఉరిమిన మేఘగర్జనలు నెత్తురి ధారల వెనుక కనుమరుగు చేయబడింది
సమస్త శిథిలాల్నీ తుడిచిపెట్టే పెను తుపానులుగా రూపొందడానికి

(- అప్పు, మళయాలం, నైరుతి రుతుపవనాల కాలమిది!)

(చదవండి: ʹనైరుతి రుతుపవనాల కాలమిది!ʹ అనువాద కవిత్వం, పశ్చిమ కనుమల లేత పచ్చిక గానం, తెలుగు: గోదావరి)

No. of visitors : 2369
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి

ప్ర‌పంచ చ‌రిత్ర అంతా వ‌ర్గ పోరాటాల చ‌రిత్రే

varavararao | 31.05.2017 06:44:19pm

మే 22 నుంచి 25 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ విర‌సం మార్క్సిస్టు పాఠ‌శాలలో కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు ప్రారంభోప‌న్యాసం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  International Seminar on Nationality Question
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?
  ఎప్పటికప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టి బతికేస్తున్నారు
  కుట్ర
  జర్నలిస్టు జమాల్‌ అహ్మద్‌ ఖషోగి హత్య
  నామ్ కే లియే
  వరి గొలుసుల మార్మిక సవ్వడి
  ఆఖరున కలుసుకున్నాం - అమరత్వాన్ని చూసాం
  చర్చనీయాంశం గద్దరా? విప్లవోద్యమమా?
  పిడికెడు ఆత్మగౌరవం కోసం
  పీక‌ నొక్కు సిద్ధాంతం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •