నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

| సాహిత్యం | వ్యాసాలు

నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

- వరవరరావు | 18.01.2017 10:41:11pm

రాజ్యాంగ యంత్రం, దాని తాలూకు సంస్కృతి ఎటువంటి పాలకవర్గ స్వభావంతో పనిచేస్తాయి అనడానికి కాళోజీ భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర నుంచి ఒక ఉదాహరణ చెప్తుండేవాడు. పంచ భూతాలను తన గుప్పిట్లో పెట్టుకున్న హిరణ్యకశ్యపుడిని ఆశ్రయించిన, పొగిడిన వాళ్లందరూ ఉగ్ర నరసింహుడు అతన్ని చంపగానే నరసింహ స్వామిని కూడా అదే స్థాయిలో, ఇంకా మించే పొగడడం ప్రారంభించారని. కారణం ఇతడు కూడా ఆ పంచ భూతాలను తన అధీనంలో పెట్టుకోగలడనే గ్రహింపు వలనే. ఒకరు రాజు అయితే మరొకరు అవతారం. ఇద్దరిదీ అపరిమితమైన అధికారమే. ఆధిపత్యాన్ని ధిక్కరించే వాళ్లకు తప్ప అధికారాన్ని ఆశ్రయించడం అందరికీ అవసరమే మరి.

1999లో బెల్లి లలితను పదిహేడు ముక్కలుగా ఖండించిన దగ్గరి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాంబశివుని తమ్ముడు రాములును హత్య చేసే దాకా పదిహేడేళ్లు కోవర్టుగానూ, గ్యాంగ్‌స్టర్‌గానూ వ్యవహరించిన నయీముద్దీన్‌కు చంద్రబాబు నాయుడు పాలన నుంచి ఇప్పటి దాకా ఆయా కాలాల్లో రాజకీయాల్లో ఏ నాయకునికీ, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఏ పోలీసు అధికారికీ సంబంధాలు లేవని తెలంగాణ ప్రభుత్వ హోం శాఖ హైకోర్టులో కౌంటర్‌ ఫైల్‌ చేసింది. ఇటు రాజకీయ నాయకత్వం, అటు పోలీసు యంత్రాంగం సహాయం లేకుండానే పదిహేడు సంవత్సరాలు తనదైన ఒక హంతక, ఆర్జన రాజ్యాన్ని నయీం నడిపించగలిగాడంటే ఆయా కాలాల ప్రభుత్వాలన్నీ అంత బలహీనమైనవని అనుకోవలసిందేనా? రాజ్యం అంత అసహాయమైందా?

రాములు హత్య నాటికి కెసిఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నడని తేలిపోయింది. కనుక రానున్న ప్రభుత్వానికి ఇది ఒక సవాల్‌ వంటిదని నేను అప్పుడే రాసి ఉన్నాను. ఆ సవాల్‌ను తనదైన పద్ధతిలో ఎదుర్కోవడానికి ఆయన ప్రభుత్వానికి రెండు సంవత్సరాలకంటే ఎక్కువే పట్టింది. మానాల (నిజామాబాద్‌) ఎన్‌కౌంటర్‌ను, గాడిదగండ్ల (కరీంనగర్‌) ఎన్‌కౌంటర్‌ను ఎస్‌ఐబి, గ్రేహౌండ్స్‌ సహకారంతో స్వయంగా రచించిన నయీం తానూ అటువంటి ఎన్‌కౌంటర్‌లోనే హతుడు అవడం కూడా రాజ్యాంగయంత్ర స్వభావంలో భాగమే.

1998లో లొంగిపోయిన నక్సలైట్‌ ఈదన్నను తన వ్యక్తిగత కక్షతో జైలులో ఉండి నయీం చంపించిన తీరుతో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐబి చాలా అబ్బురపడింది. తన చెల్లెలిని అవమానపరిచాడనే అక్కసుతో నయీం ఈదన్నను నరికి, శిరస్సు వేరు చేసి కనుగుడ్లు తెచ్చి చూపాలని తమ్ముడు అలీముద్దీన్‌కు పని అప్పగించాడు. ఆ పనిచేసి ఆ కనుగుడ్లు పట్టుకొచ్చి జైలులో నయీంకు అతని తమ్ముడు చూపాడు. ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగల మనిషి రాజ్యానికి కావాలి.

ఇటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతకు ముందే కత్తుల సమ్మయ్యతో ప్రారంభించింది. వ్యాస్‌ హత్యకేసులో టాడాకేసులో ఉన్న కత్తుల సమ్మయ్యకు క్షమాభిక్షపెట్టి అరెస్టు కూడా చేయకుండా తన దళసభ్యులను నిద్రలో చంపివచ్చే కార్యక్రమాన్ని హుజూరాబాద్‌ స్థానిక సిఐ అప్పగించాడు. ఇటువంటివే పావురాలగుట్ట (నల్గొండ)లోను, కరీంనగర్‌ జిల్లాలోను మరికొన్ని కోవర్టు హత్యలు జరిగినవి.

కరీంనగర్‌ జిల్లా పీపుల్స్‌వార్‌ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్కాపురం భాస్కర్‌ (విజయ్‌)ను చంపే పని జిల్లా ఎస్‌పి జడల నాగరాజు అనే దళ సభ్యునికి అప్పగించాడు. ఆ పని పథకం ప్రకారం చేసినందుకు విజయ్‌ తల మీద ఉన్న బహుమతిని డిజిపి ఎచ్‌జె దొర అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి స్వయంగా జడల నాగరాజుకు అప్పగించారు. ఇది ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా ప్రదర్శింపబడినప్పుడు హత్య చేశానని స్వయంగా ఒప్పుకుంటున్న వ్యక్తికి ప్రభుత్వాలు బహుమానాలు ఇవ్వడం ఏమిటని అప్పటి ఎపిసిఎల్‌సి కార్యదర్శి బాలగోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. హైకోర్టు ఆ పిటిషన్‌ను విచారించనే లేదు.

పైన పేర్కొన్న మూడూ ఒకటి రెండు హత్యా నేరాలకు సంబంధించినవే. 1986లో కరీంనగర్‌ జిల్లా ఎస్‌పిగా ఉన్న అశోక్‌ ప్రసాద్‌ మొదలు నయీం ఎన్‌కౌంటర్‌ దాకా పోలీసు అధికార యంత్రాంగం కోవర్టులను పోషిస్తూ వస్తున్నారనడానికి మాత్రమే పై ఉదాహరణలు చెప్పాను. 1995-97 మధ్యకాలంలో మెదక్‌ జిల్లా ఎస్‌పిగా పనిచేసిన వి.కె. సింగ్‌ (ఇప్పుడు తెలంగాణ జైళ్ల డిజిపి) ప్రజా ఉద్యమాలను అణచడానికి ప్రజాదర్బార్‌లు, పీపుల్స్‌ కౌన్సిల్‌లు, గ్రామరక్షక దళాలు మొదలుకొని, సిపిఐ (ఎంఎల్‌) ప్రజా పార్టీ వరకు ఏర్పరిచి ఫ్యూడల్‌ కచేరి సంప్రదాయాలను కొనసాగించాడు. ఇవి చట్టవిరుద్ధమని ఎపిసిఎల్‌సి హైకోర్టులో రిట్‌ వేయగా వాటిని రద్దు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. న్యాయం కోసం నేను కోర్టులనైనా, చట్టాలనైనా ఎదిరిస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఆ తీర్పును సవాల్‌ చేస్తూ మరో రిట్‌ వేసి ఒక ఫ్యూడల్‌ ప్రభువులా చెలామణి అయ్యాడు.

నయీం ఎన్‌కౌంటర్‌ తరువాత అతను కోవర్టు అవునా కాదా అనే చర్చ జరిగినప్పుడు కనీసం ఇద్దరు డిజిపి స్థాయి పోలీసు అధికారులు విప్లవోద్యమాన్ని అణచడానికి ఇటువంటి ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఉపయోగించడం చట్టబద్ధమే అనే పద్ధతిలో మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. డిజిపిగానూ, వివిధ హోదాల్లోనూ పనిచేసిన దినేశ్‌రెడ్డి స్వయంగా తనకు నయీంపై చర్య తీసుకునే అధికారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పాడు. ఇంక జనాంతికంగా ప్రతి ఒక్క పోలీసు అధికారి నయీంను ఏమీ చేయలేని తమ అసహాయతను ప్రకటించిన వాళ్లే.

ఒక మంత్రి స్వయంగా ఈ శాసనసభలోనే తన డ్రైవర్‌ను నయీం కిడ్నాప్‌ చేశాడని చెప్పాడు. సిట్‌ విచారణ సందర్భంగా ఐదుగురు మంత్రులు, నలభై ఆరు మంది రాజకీయ నాయకులు, పద్దెనిమిది మంది ఐపిఎస్‌ ఆఫీసర్లు భయానికో, స్వప్రయోజనాలకో నయీం సంబంధాల్లో ఉన్నారని సిట్‌ మీడియాకు లీక్‌లు ఇస్తూపోయింది.

2000 సంవత్సర ప్రారంభంలో ఒక డిజిపి స్థాయి పోలీసు అధికారికి ఒక మాజీ నక్సలైట్‌ అతని కూతురు పెండ్లిలో విలువైన నెక్లస్‌ కానుకగా ఇచ్చిన దృశ్యం వీడియోలో రావడాన్ని మీడియా ప్రస్తావించినప్పుడు కలకలం రేగింది. నయీం అతని గ్యాంగ్‌కు పోలీసు అధికారులతో ఉన్న ఇటువంటి సంబంధాల గురించి చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలు కూడా రాయక తప్పలేదు. అప్పుడు ఒక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి రంగాచారితో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను వేసింది. కాని తనకు ఏ ఐపిఎస్‌, ఐఎఎస్‌ అధికారి సహకరించడం లేదని కొన్నాళ్లకు ఆయన తనకు తానే కమిషన్‌ను రద్దు చేసుకున్నాడు.

అదే సంవత్సరం ఏడు రాష్ట్రాల్లోని నక్సలైట్‌ ఉద్యమాన్ని అణచడానికి కేంద్ర హోంమంత్రి అద్వాని నాయకత్వంలో ఏర్పడిన ఏడుగురు ముఖ్యమంత్రుల సంయుక్త కార్యచరణ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పత్రం సమర్పించాడు. దాని సారాంశం నక్సలైట్‌ ఉద్యమాన్ని కేవలం చట్టబద్ధంగా పోలీసు యంత్రాంగంతో అణచలేమని, అది శాంతి భద్రతల సమస్య అయినప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి కోవర్టు యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలని ఆయన ప్రతిపాదించాడు. జర్మనీలో, ఇంగ్లండ్‌లో, ఇజ్రాయిల్‌లో ప్రభుత్వాలు ఇందుకు అనుగుణమైన బలమైన యంత్రాంగాలను తయారు చేసుకున్నాయని ఉదాహరణలు ఇచ్చాడు. కోవర్టు హత్యలకు చంద్రబాబు నాయుడు ఒక అధికార ప్రతిపత్తిని ఇస్తున్నాడని నేను అప్పుడే పత్రికల్లో రాశాను.

2002 దాకా ఒక డిఐజి స్థాయి ఐపిఎస్‌ ఆఫీసర్‌ లొంగిపోయే నక్సలైట్లందరినీ సమావేశపరిచి, నిర్దేశించే బాధ్యతను నిర్వహించాడు. అతని పేరు అందరికీ తెలుసు. అతను ఈ లొంగిపోయిన నక్సలైట్లందరినీ సమావేశపరిచి వారికి విప్లవకారులను చంపే బాధ్యతలు అప్పగిస్తున్నాడనే విషయం విస్తృత ప్రచారానికి రావడంతో అతన్ని ఢిల్లీ ఎపి భవన్‌కు బదిలీ చేశారు. అతనితో పాటు డిజిపి స్థాయి, అంతకు మించిన స్థాయిలో పనిచేసిన మరో ఇద్దరు ఐపిఎస్‌ ఆఫీసర్లకు పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురు - శ్యాం, మహేశ్‌, మురళి (పశువుల కాపరి లక్ష్మీ రాజంతో పాటు) ఎన్‌కౌంటర్‌ గురించి శౌర్య పతకాలు ఇచ్చినప్పుడు ఆ ముగ్గురూ ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వాళ్లు కాదని, పైగా ఆ ముగ్గురికీ నయీం కోవర్టు హత్యలతో సంబంధాలు ఉన్నాయని చర్చల సమయంలో హోంమంత్రి దృష్టికి రావడంతో అది వివాదాస్పదమైంది.

ఎపిసిఎల్‌సి సంయుక్త కార్యదర్శి పురుషోత్తం హత్య సందర్భంగా నయీముద్దీన్‌ స్వయంగా తాను ఆ హత్యలో పాల్గొన్నట్టుగా ప్రకటించాడు. ఎపిసిఎల్‌సి నల్గొండ జిల్లా నాయకుడు ఆజం అలీ హత్య మొదలుకొని 2006లో కనకాచారి హత్య వరకు తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ప్రకాశం జిల్లాలో మన్నెం ప్రసాద్‌ హత్య వరకు ప్రజాసంఘాల నాయకులెందరినో తానూ, తన అనుచరులూ చంపినట్లుగా ఆయన ప్రకటనలు చేశాడు. చంద్రబాబు కాలంలో టైగర్‌ల పేరుతోను, నర్సిరెడ్డి హత్య తరువాత కోబ్రాల పేరుతోను ఆయన విడుదల చేసిన ప్రకటనలు మీడియా లైబ్రరీలలో వేల కొద్ది దొరుకుతాయి. పోలీసు శాఖలో నయీంకు, నయీం అనుచరులైన మాజీ నక్సలైట్లకు వాళ్ల వాళ్ల హంతక రికార్డులను బట్టి ఐజి మొదలు డిఎస్‌పి స్థాయి వరకు అనధికారికంగా పదవులు గుర్తించబడ్డాయనేది బహిరంగ రహస్యమే.

నయీం ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి జరిగిన అరెస్టులు చూస్తే దాదాపు అందరికి అందరు ఆయన గ్యాంగ్‌స్టర్‌ దశలోకి మారినాక చేసిన నేరాలతో సంబంధం ఉన్నవాళ్లుగా భావించబడిన వాళ్లే. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మహిళలు. వాళ్లనే ఆయన ఎక్కువ విశ్వాసంలోకి తీసుకున్న మాట నిజమే అయినప్పటికీ మిగిలిన వాళ్లంతా తమ స్వార్థ ప్రయోజనాల కోసమో, భయంతోనో ఆయన ఆస్తులు, డబ్బులు సంపాదించుకోవడానికి సహకరించిన వాళ్లు. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రజాసంఘాల నాయకులను హత్య చేయడంలో నయీంకు సహకరించిన వాళ్లు ఈ అరెస్టయిన వాళ్లలో లేరు.

ప్రజాసంఘాల నాయకుల హత్యల విషయంలో మాత్రమే కాదు, కొందరు పార్టీ నాయకుల ఎన్‌కౌంటర్‌లలో కూడా ఎస్‌ఐబి వాళ్లు నయీంను కోవర్టుగా ఉపయోగించుకున్నారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు సుదర్శన్‌ (కె. సముద్రం), సోమన్న (వరంగల్‌)లను బెంగళూరు నుంచి తీసుకువచ్చి ఎన్‌కౌంటర్‌ చేయడంలో నయీం సహకరించాడు. ఇప్పుడింక బయటికి వస్తున్నటువంటి విషయాలను బట్టి బెంగళూరులో కేంద్ర కమిటీ నాయకత్వాన్ని ద్రోహి సహాయంతో అరెస్టు చేయడంలో అదే నల్గొండకు చెందిన నయీం పాత్ర ఉన్నదని స్పష్టమవుతున్నది.

నయీం స్వయంగా నలుగురు పార్టీ నాయకులను, నలుగురు ప్రజాసంఘాల నాయకులను చంపకుండా వదలలని టివి9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పార్టీ నాయకుల్లో ఇప్పుడు ఒకరు మాత్రమే మిగిలారు. ప్రజాసంఘాల నాయకుల్లో పురుషోత్తంను చంపగలిగాడు. మిగిలిన వారిలో ఒకరి విషయంలో నయీం తన ఎన్‌కౌంటర్‌ దాకా బెదిరింపులు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం స్పష్టంగా ప్రభుత్వానికి తెలుసు. ఈ ప్రయత్నాల్లో ఎస్‌ఐబి ఉన్నతాధికారి సహకారం కూడా ఉందని ప్రభుత్వానికి తెలుసు. శాసనసభలో మేధావులు తన దృష్టికి తెచ్చారని ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం ఇటువంటిదే.

ఇంక బెదిరింపులకు సంబంధించి ఆయన ఎన్‌కౌంటర్‌ సమయం దాకా (ముఖ్యంగా అనుచరులు పీడీ చట్టం కింద అరెస్టయిన సందర్భంగా) కూడా నయీం ఒక మంద్రస్థాయి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇదంతా ఒక పెద్ద యంత్రాంగం ఉంటే తప్ప సాధ్యమయ్యేది కాదు. అదంతా మాజీ నక్సలైట్లతో ఎస్‌ఐబి సహాయంతో చేసుకున్న నిర్మాణం. నయీం కోరితే అప్పటికప్పుడు తమ ప్రాణాలు ఇవ్వడానికి వెయ్యి మంది ఉంటారని, లేదా ఎవరివైనా సరే ప్రాణాలు తీయడానికి వెయ్యి మంది సిద్ధంగా ఉంటారని భువనగిరిలో ఎవ్వరిని అడిగినా చెపుతారు. ఇదంతా ఏ రాజకీయ నాయకుని, ఏ పోలీసు యంత్రాంగం సహకారం లేకుండా సాధ్యమేనా? సాధ్యమని నమ్మమని మన కంట్లో వేలు పెడుతున్నది తెరాస ప్రభుత్వం.

చంద్రబాబు పరిపాలన కాలం నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డి పరిపాలన దాకా అజ్ఞాతంలో ఉన్న విప్లవ నాయకులతో సహా గంటి ప్రసాదం దాకా కోవర్టు హత్యలు చేయించడంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నయీముద్దీన్‌ కోవర్టు నాయకత్వాన్ని వాడుకున్నది. అతన్ని చంపాం కదా, పీడ విరగడ అయిందని అభినందించండి. ఆయన చెయి కింది కోవర్టు యంత్రాంగం అంతా మా కనుసన్నల్లోనే ఉన్నదని, తమకు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటామని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మనకు ఈ హైకోర్టులో వేసిన అఫిడవిట్‌ వల్ల చెప్పదల్చుకున్నాయి.

ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలకు, రెండు ప్రభుత్వాలతో కేంద్రానికి సయోధ్య కుదిరింది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి కూడా గుజరాత్‌లో సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌, మాజీ హోంమంత్రి హిరేన్‌ పాండే హత్యలతో నయీంకు ఉన్న సంబంధం బయటపడకుండా ఉండడం చాలా అవసరం. తీగ కదిపితే డొంక అంతా కదులుతుంది.

అంతకన్నా మించి గ్యాంగ్‌స్టర్‌గా నయీం ముఠా చేసిన దుర్మార్గాలు, దురాక్రమణలు అన్నీ రాజకీయాల్లో, పోలీసు యంత్రాంగంలో స్వార్థ ప్రయోజనాలు పొందిన వాళ్లకు చాలా అవసరమైనవి. కోవర్టుగా చేసిన పనులన్ని దోపిడీ వర్గానికీ, రాజ్యానికీ అవసరమైనవి. కనుక హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చేదు నిజం అది.

No. of visitors : 6849
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

Bhoomaiah, Kishta Goud, Bhabani Da and Sumanta - Down Memory Lane

Varavara Rao | 09.06.2017 05:08:54pm

On 25th December early morning hours before unlocking the cells and barracks, the news spread that in the wee hours of 26th December, Bhoomaiah and Kishta G...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •