బేలా సోమారి ఇంటి మీద బస్తర్‌లో ఇది రెండోసారి దాడి. ఇది ఐజి కల్లూరి భాషలో స్వచ్ఛందంగా ఆదివాసీ ప్రజలు చేసిన దాడిగా కనిపించవచ్చు, అందులో ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పి మహిళా పోలీసులను, మరో పద్నాలుగు మంది సాయుధ పోలీసులను ఆమెకు రక్షణగా పంపించినట్టు అనిపించవచ్చు. కాని స్పష్టంగా ఇది కల్లూరి ఆదేశాలతోటే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చేసిన దాడి. రాజ్యం చేసిన దాడి. హిమాంశు కుమార్‌తో ప్రారంభించి ఇప్పటి వరకు బస్తర్‌లో బయట సమాజం నుంచి వచ్చిన ప్రజాస్వామ్యవాదులను ఎవ్వరినీ ఉండకుండా అక్కడి నుండి తరిమేయగలిగారు. ఒక్క బేలా భాటియా విషయంలోనే అది వాళ్లకు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే, ఆమె ఆదివాసులతో ఎంత మమేకం అయిపోయిందంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఆ మేధావి తాను ఆదివాసీగా మారి బేలా సోమారి అయింది. ఒక హేమండార్ఫ్ వలె, ఒక మహాశ్వేతా దేవి వలె, ఒక బిడి శర్మ వలె ఆమె వారిలో ఒకరైపోయింది.
మిగిలిన బుద్ధిజీవులకు బేలా సోమారికి కొట్టవచ్చినట్టు కనిపించే తేడా ఏమిటంటే ఆమె అధ్యయనానికి లక్ష్యమైన ప్రజల్లో ఆమె కలిసిపోవడం. నీటిలో చేప అనే కమ్యూనిస్టు సూత్రం పట్ల ఆమెకు పూర్తి అంగీకారం ఉందో లేదో తెలియదు గాని ఆమె మాత్రం తాను పనిచేయదలుచుకున్న ప్రజలు ఉండే చోటునే తన కార్యక్షేత్రంగా ఎంచుకుంటుంది. ఆమె విదేశాల్లో చదవవచ్చు, విదేశాల్లో పిఎచ్‌డి చేయవచ్చు. ఢిల్లీ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేయవచ్చు. కాని ఒకసారి ఢిల్లీ బస్తీల్లో, మురికివాడల్లో పనిచేయాలని ఎంచుకున్నదంటే వాటిని ఆమె తన ఆవాసాలుగా మార్చుకుంటుంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో ఫెలో గానో, రిసెర్చర్గానో దండకారణ్యంలో ఆదివాసీ సమాజం గురించి చదవడానికీ, చదువు చెప్పడానికీ చేరిందంటే ఆమె దండకారణ్యంలో భాగమైన గడ్చిరోలీ, బస్తర్ ప్రజల మధ్య ఉండడానికి ఎంచుకుంటుంది.
ఆమె మొదటిసారి దండకారణ్యంలోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నప్పుడు నాకు కలిసింది. ఆ తరువాత ఎన్నో సందర్భాల్లో కలుసుకున్నాం. ఆమెది చాలా నిజాయితీతో కూడిన స్వచ్ఛందమైన దృక్పథం. మామూలు రాజకీయ పరిభాషలో దానిని ఉదారవాద ప్రజాస్వామ్య దృక్పథం అంటారేమో. ఇటువంటి వాళ్లందరినీ ఫ్రెంచ్ విప్లవానికి ప్రేరణ అయిన రూసో, వాల్టేర్ల వారసులుగా చెప్పవచ్చు. ఇటువంటి వాళ్లతో మనకు ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు, కాని తమ విశ్వాసాలతో పాటు మన విశ్వాసాలను కాపాడడానికి వాళ్లు ప్రాణాలు ఒడ్డడానికైనా వెనుకాడరు. అది ఎటువైపు నుంచి వచ్చే ప్రమాదమైనా సరే. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వంలో విశ్వాసం ఉన్నవాళ్లు. ప్రపంచంలో నియమబద్ధ పాలన ఉండాలని కోరుకునేవాళ్లు. కష్టం చేసే ప్రజలకు ఏ దేశపు రాజ్యాంగమైనా హామీ పడిన హక్కులన్నీ అమలు కావాలని కోరుకునేవాళ్లు. అది అమలు చేసే క్రమంలో ప్రభుత్వంతో సహా భాగస్వాములయ్యే అన్ని రాజకీయ పార్టీలతో, సంస్థలతో సంభాషించాలని, చర్చించాలని, ప్రజలే ఎజెండాగా ఆలోచించాలని బలంగా కోరుకునేవాళ్లు, అందుకోసం ప్రయత్నించేవాళ్లు. పోరాడేవాళ్లు.
బేలా సోమారి వంటి వాళ్లకు డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ అధ్యక్షతన రచింపబడిన రాజ్యాంగానికి ఒక ఉద్యమ, పోరాట చరిత్ర ఉందని తెలుసు. ఆ చరిత్రను నిర్మాణం చేసిన వాళ్లు. ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, రైతాంగం, కార్మికులు, ఈ అన్ని వర్గాల నుంచి వచ్చిన స్త్రీలు, విద్యార్థులు వంటి శ్రామికవర్గాల నుంచి వచ్చిన వాళ్లని తెలుసు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసులు మొదలు, 1857 భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రైతాంగం వరకు చేసిన త్యాగాలు, ఆ తరువాత పోరాటాల్లోనూ, ఉద్యమాల్లోనూ ముందుకు వచ్చిన ప్రజల ఆకాంక్షలు, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో, ఉపోద్ఘాతంలో, ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడ్డాయనేది వీళ్ల విశ్వాసం. ఈ ఆకాంక్షలన్నీ, ఈ ఆశయాలన్నీ ప్రజలు తమ ఆదేశాలుగా రాజ్యాంగంలో చేర్చుకున్నారనేది వీళ్లు విశ్వసిస్తారు. కనుక నిర్మాణాలు, సంస్థలు అనుకునేవి కూడా ఒక నిరంతర ప్రజా, ప్రజాస్వామిక పోరాట ఫలితంగా వచ్చినవి గనుక, సృజనాత్మకమైన, క్రియాశీలమైన వ్యాఖ్యానంతోనూ, అన్వయంతోనూ, ఉద్యమంతోనూ మనం సాధించుకోవాలని, నిలుపుకోవాలని వాళ్లు నమ్మి, తాము అందుకు కృషి చేసే ప్రజాస్వామికవాదులు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రజాస్వామిక విప్లవాలు ముందుకు తెచ్చిన జీవించే హక్కు, మాట్లాడే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, విశ్వాసాలు కలిగి ఉండే హక్కులను హరించే అధికారం ఎటువంటి ప్రభుత్వానికైనా ఉండదనేది వీళ్ల బలమైన విశ్వాసం. వాళ్లు దాన్ని ఆమోదించరు. ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడడమే ఒక సజీవ ప్రజాస్వామిక లక్షణం.
ఇటువంటి ప్రజాస్వామిక లక్షణం ఏ ఆధిపత్యాన్ని అంగీకరించదు. ఒక నైసర్గిక స్వభావం ఆదివాసులకు ఉంటుందని చరిత్ర నుంచి తమ అధ్యయనం ద్వారా, పరిశోధన ద్వారా, వారి మధ్యన మసులుకోవడం ద్వారా రూపొందిన ప్రజాస్వామ్యవాదులు వీళ్లు. ఆదివాసులు అపారమైన సంపద కలిగినటువంటి ప్రకృతిని, పర్యావరణాన్ని తమకోసమే కాకుండా, మన కోసం ఆదిమ కాలం నుంచి ఇప్పటి వరకు భావితరాల కోసం కాపాడుతున్నారనే అవగాహన కూడా వాళ్లకు ఉంది. అందుకే బేలా సోమారి లాంటి వాళ్లు బస్తర్‌ను తమ ఆవాసంగా ఎంచుకున్నారు.
ఇవాళ ʹబస్తర్‌ను కాపాడుకుందాంʹ అని నినదించే వాళ్లందరికీ ఆమె ఒక ప్రతీక.
ఆమె ఒక జీవనశైలిని ఎంచుకున్నది. నిరాడంబరంగా నిరంతరం తిరుగుతూ ప్రజల వంటి వేషధారణతోనే అత్యంత సాధారణ జీవితాన్ని గడిపే ఒక జీవనశైలి. బాలగోపాల్ అంతిమ యాత్రలో ఆకు చెప్పులు వేసుకొని, అతి సాధారణమైన దుస్తుల్లో ముందు భాగాన నిలబడి నినాదాలు ఇస్తున్న బేలా సోమారి నాకిప్పటికీ కళ్లల్లో ఒక దృశ్యంగా నిలిచిపోయింది.
బాసగూడ మారణకాండ జరిగిన తరువాత సిడిఆర్‌ఒ నిజ నిర్ధారణ కమిటీ బొజ్జా తారకం గారి నాయకత్వంలో అక్కడికి వెళ్లి వచ్చిన తరువాత ఆర్డిఎఫ్, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నది. ఆమె బస్తర్ పరిస్థితులను వివరిస్తూ ʹమీకు నగరాల్లో, మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఏయే కార్యక్రమాలు, ఎజెండాలు లక్ష్యాలు ఉంటాయో గాని, మాకు బస్తర్ అడవుల్లో ఒక ఆదివాసి మహిళ మీదనో, పిల్లల మీదనో ఒక దాడి, ఒక అత్యాచారం, ఒక అన్యాయం జరిగిందంటే పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే ఒక విప్లవంʹ అన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బేలా సోమారి లాంటి వాళ్లు ఆ కృషిని చాలా ముందుకు తీసుకువెళ్లారు. సల్వాజుడుం రాజ్యాంగ వ్యతిరేకమైందని సుప్రీంకోర్టుతో తీర్పు చెప్పించగలిగారు. విద్యావంతులు గాని, శిక్షితులు గాని ఆదివాసి యువకుల చేతులకు మారణాయుధాలు ఇచ్చి తమ తోటి ఆదివాసులపైనే దాడులు చేయించి, చంపించడం ఆదివాసి సమాజంలో ఒక అంతర్యుద్ధం వంటి కల్లోలాన్ని సృష్టించడమేనని సుప్రీంకోర్టు తీవ్రంగా అభిశంసించింది.
సల్వాజుడుంను రూపంలో రద్దు చేసి, మళ్లీ వాళ్లకు పోలీసు యాక్సిలరీ ఫోర్స్గాను, కోయ కమాండోలుగాను ఉద్యోగాలు ఇచ్చి, సాయుధులను చేసి, కేంద్ర, అర్ధసైనిక బలగాలతో పాటు ఆదివాసీ గ్రామాల మీద దాడి చేసినప్పుడు ఆదివాసి మహిళలపై అత్యాచారాలు చేసినప్పుడు, ఆదివాసీ గ్రామాలను తగలబెట్టినప్పుడు అవి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమే కాదు, అందుకు అంగీకరించకపోతే హైకోర్టుల దాకా తీసుకువెళ్లారు. హైకోర్టులో పిటిషన్ వేసి సామూహిక లైంగిక అత్యాచారానికి గురైన ఒక హిడ్మె మృతదేహాన్ని బయటికి తీసి రీపోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్ చేయడంలో, ఒక పదమూడు సంవత్సరాల సోమారు పొట్టం ఆదివాసి బాలుడిది బూటకపు ఎన్కౌంటర్ అని, రీపోస్ట్‌మార్టం కోసం హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొందడంలోనైనా వాళ్లు విజయాలు సాధించారు.
ఒక్క 2016లోనే ఛత్తీస్‌ఘడ్‌లో 134 బూటకపు ఎన్కౌంటర్ హత్యలు జరిగాయి. కనీసం మూడు చోట్ల ఆదివాసీ మహిళలపై భద్రతా బలగాలు సామూహిక లైంగిక అత్యాచారాలు చేశాయి. ఇవన్నీ ఇటువంటి ప్రజాస్వామ్యవాదులు జాతీయ మానవ హక్కుల కమిషన్ దాకా తీసుకురాగలిగారు.
2015 అక్టోబర్‌లో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఇటువంటి ఒక సంఘటనలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారుల ప్రమేయం ఉందని ఎన్ఎచ్ఆర్సి విశ్వసించింది. 2017 జనవరిలో నేంద్రలో జరిగిన ఇటువంటి లైంగిక అత్యాచారం గురించి కూడా ఎన్ఎచ్ఆర్సి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంజాయిషీ కోరింది.
ఇప్పటికి కనీసం పదహారు మంది ఆదివాసీ మహిళలపై లైంగిక అత్యాచారాలలో ఐజి కల్లూరి, ఎస్పి దాస్ నాయకత్వంలోని భద్రతా బలగాల పాత్ర ఉందని ఎన్ఎచ్ఆర్సి గుర్తించి ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని సంజాయిషీ కోరింది. అది జనవరి 16న విచారణకు చేపట్టే సమయానికి అటువంటి మరొక నాలుగు కేసులు కూడా ఎన్ఎచ్ఆర్సి దృష్టికి వచ్చాయి.
వీటితో పాటు ఇప్పటికీ తాడిమెట్ల గ్రామం మూడుసార్లు తగలబెట్టబడిందని, ఇందులో కూడా కేంద్ర భద్రతా బలగాలు, సల్వాజుడుం కోయ కమాండోలు వంటి వాళ్ల పాత్ర ఉందనేది, దీనికంతా ఐజి కల్లూరి ఆదేశాలు ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చి సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు కూడా ఆదేశించింది. సిబిఐ ఆ మేరకు నివేదిక కూడా సుప్రీంకోర్టుకు ఇచ్చింది.
కనుక వీటిపై కక్ష తీర్చుకునే క్రమంలోనే మనీష్ కుంజం (సిపిఐ మాజీ ఎంఎల్ఎ, ఆదివాసీ సంఘం నాయకుడు), సోనీ సోరి, నందినీ సుందర్, మాలినీ సుబ్రహ్మణ్యం, బేలా సోమారిలపై దాడులు, కేసులతో పాటు వాళ్ల దిష్టిబొమ్మలు తగలపెట్టడం కూడా గతంలో ఈ ఛత్తీస్‌ఘడ్ యాక్సిలరీ సాయుధ బలగాలు చేసినవి. శాలినీ గేరాపై మావోయిస్టు పార్టీ పది లక్షల రూపాయల రద్దయిన పాత నోట్లు మార్పిస్తున్నదనే కేసు పెట్టారు. ప్రభాత్ సింగ్ వంటి స్థానిక పత్రికా రచయితలపై, సుకుల్ ప్రసాద్ బర్సే అనే ఆదివాసి సామాజిక కార్యకర్తపై కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైలుకు పంపించారు. సుకుల్ ప్రసాద్ బర్సే 2016 డిసెంబర్ 19న మటెనార్ గ్రామంలో ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ సభ ఏర్పాటు చేసినందుకు ఆయననీ సభకు వెళ్లకుండా చేసి పోలీసులు వేధించారు.
బేలా సోమారి ఇంటిపై దాడి చేయడానికి కొంచెం ముందుగానే శాలినీ గేరాపై రద్దయిన నోట్ల మార్పిడి కేసు పెట్టారు. అంతకు కాస్త ముందు డిసెంబర్ 25న తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం ఏడుగురు బృందం నిజ నిర్ధారణకు వెళ్తూ ఉంటే తెలంగాణ పోలీసులే దుమ్ముగూడెం దగ్గర అరెస్టు చేసి సుక్మా పోలీసులకు అప్పగించారు. ఐదు వారాలకు పైగా రెండుసార్లు బెయిల్ నిరాకరింపబడి అప్రజాస్వామిక ఛత్తీస్‌ఘడ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీళ్లు సుక్మా జైలులో మగ్గుతున్నారు. వీరిలో బల్లా రవీంద్రనాథ్ స్వయంగా రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి రెండు తెలుగు రాష్ట్రాల చాప్టర్‌కు కార్యదర్శి. అఖిల భారత కమిటీలో సభ్యుడు. ఆయనా, చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు న్యాయవాదులు. రమడాల లక్ష్మయ్య మూడు దశాబ్దాలుగా తుడుం దెబ్బ ఆదివాసీ సంఘం నాయకుడు. దుడ్డు ప్రభాకర్ రెండు దశాబ్దాలుగా కుల నిర్మూలన పోరాట సమితి రెండు తెలుగు రాష్ట్రాల నాయకుడు. దుర్గాప్రసాద్ రెండు దశాబ్దాలుగా జర్నలిస్టు. వీళ్లలో దుడ్డు ప్రభాకర్ తప్ప మిగిలిన వాళ్లంతా తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్లు కూడా. వీరే కాకుండా రాజేంద్రప్రసాద్, నజీర్ ఉస్మానియా యూనివర్సిటీలో రిసెర్చ్ స్కాలర్స్. రాజేంద్రప్రసాద్ తెలంగాణ విద్యార్థి వేదిక ఉపాధ్యక్షుడు. నజీర్ తెలంగాణ విద్యార్థి వేదిక ఉస్మానియా క్యాంపస్ బాధ్యుడు, రచయిత, వక్త.
వీళ్ల అరెస్టు సందర్భంలోనే ఐజి కల్లూరి ʹతాను ఉండి ఉంటే వాళ్లను కోర్టుకు అప్పగించి ఉండేవాడిని కాదని, ఇక నుంచి అంటే 2017లో ʹతెల్ల కాలర్ మావోయిస్టుʹలను వేధించే అజిత్ దోవల్ డాక్ట్రిన్ (సిద్ధాంతాన్ని) అమలు చేస్తామʹని నిస్సిగ్గుగా ప్రకటించాడు.
అజిత్ దోవల్ కేంద్ర హోంశాఖ సలహాదారుడు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత ఇప్పుడు సలహాదారుడుగా నియమింపబడ్డాడు. అట్లే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా వీరప్పన్, కిషన్‌జీల ఎన్కౌంటర్లకు బాధ్యుడైన తమిళనాడుకు చెందిన విజయకుమార్ కూడా ఇప్పుడు కేంద్ర హోంశాఖ సలహాదారుడుగా ఉన్నాడు. ఇటీవల కేరళలో మావోయిస్టు పార్టీ ట్రై జంక్షన్ నాయకులైన దేవరాజ్, అజితల ఎన్‌కౌంటర్‌ను పర్యవేక్షించింది ఇతడే.
ఈ ఇద్దరి నాయకత్వంలో, పర్యవేక్షణలో ఛత్తీస్‌ఘడ్‌లో బస్తర్ ఐజిగా ఎస్ఆర్పి కల్లూరి మారణకాండను అమలు చేస్తూ ఉన్నాడు. 2009లో గ్రీన్‌హంట్ ఆపరేషన్‌గా ప్రారంభమైన ఈ ప్రజల మీది యుద్ధం మూడు దశలు దాటి ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ హాకా, మిషన్ 2016లలో కూడా విఫలమై, ఇప్పుడు మిషన్ 2017గా ఆదివాసీ ప్రజలతో పాటు ప్రజాస్వామ్యవాదులపై అమలవుతున్నది. దాని పేరే ʹసఫేద్ కాలర్ మావోయిస్టుʹల అణచివేత. సుప్రీంకోర్టులో ఎన్కౌంటర్ హత్యలను హత్యానేరంగా నమోదు చేయాలనే ఎపిసిఎల్సి పిటిషన్‌ను విచారించే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ దీనినే మావోయిస్టుల అర్బన్ కనెక్ట్‌గా పేర్కొన్నది. లేదా అడవిలో ఉన్న మావోయిస్టుల కన్నా పట్టణాలలో ఉన్న మేధావులు ప్రమాదకరంగా పేర్కొన్నది.
ఈ క్రమంలో ఆదివాసీ సమాజం నుంచే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతూ భయంకరమైన లైంగిక దాడులకు, ముఖంపై, శరీరంపై యాసిడ్ దాడులకు గురై, సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గిన సోనీ సోరి, మనీష్ కుంజం, సుకుల్ ప్రసాద్ బర్సే మొదలు బేలా సోమారి దాకా రాజ్యం దాడులకు, హింసకు, అక్రమ కేసులకు గురవుతున్నారు.
రాజ్యం వైపు నుంచి ఆదివాసీ సమాజ న్యాయమైన, ప్రజాస్వామికమైన పోరాటాల నుంచి బుద్ధిజీవులను వేరు చేయాలనే ఈ కుట్ర ఎంత తీవ్రతరమైతే అంత తీవ్రమైన స్వరంతో ప్రతిఘటించి, అంత గాఢమైన మమేకత్వంతో ఆదివాసీ సమాజంలో కలిసి పోవడం తప్ప ఇందులో నుంచి బయట పడడానికి బుద్ధిజీవులకు దగ్గరి దారి ఏదీ లేదు.
బేలా భాటియా బేలా సోమారి కావడానికన్నా చాలా ముందుగానే 1980 నుంచే మావోయిస్టులు ఆదివాసులు అవుతున్నారు. ఆదివాసులు మావోయిస్టులు అవుతున్నారు. ఆదివాసులు తమదైన జనతన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మావోయిస్టులతో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా బేలా భాటియా లాంటి వారు బేలా సోమారిలై వాళ్ల మధ్యన బతుకుతూ తమ తెల్లకాలర్లను ఆదివాసీ మట్టి మనుషుల ప్రజల మధ్యన మట్టి కాలర్లుగా మార్చుకుంటున్నారు. మట్టిమనుషుల్లో ఒకటవుతున్నారు.
బుద్ధిజీవులకు, ప్రజాస్వామ్యవాదులకు న్యాయం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల అంత నిజాయితీతో కూడిన ప్రేమ, పక్షపాతం ఉంటే అది ఒక్కటే ఇవాళ రాజ్యహింసను, రాజ్యం దాడిని ఎదుర్కోవడానికి మిగిలిన ప్రత్యామ్నాయమైన ప్రజాస్వామిక మార్గం. బేలా సోమారి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెను అక్కడి నుంచి పంపించాలని రాజ్యం చేస్తున్న కుట్రను ప్రతిఘటిస్తూ, అంత మాత్రమే కాదు ఆదివాసులను విస్థాపితులను, నిర్వాసితులను చేస్తున్న సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ విధ్వంసక అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం కూడా మన ఆశయంగా, లక్ష్యంగా నిర్దేశించుకోవడమే ఇవాళ మన ముందున్న కర్తవ్యం.
-1 ఫిబ్రవరి, 2017
Type in English and Press Space to Convert in Telugu |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |