కడుపు కోత

| సాహిత్యం | క‌థ‌లు

కడుపు కోత

- పద్మకుమారి | 04.02.2017 02:34:25am

టైం తొమ్మిదవుతుంది. వీళ్లింకా రాలేదే.

అప్పటికీ ఒకటికి రెండు సార్లు చెప్పాను. స్థూపావిష్కరణ కాగానే వెళ్లొచ్చని.

అనుకుంటుండగానే ఆటో నుంచి దిగారు.

హమ్మయ్య అనుకుంటూ దగ్గరికి వెళ్లాను.

చూడగానే సుధాకర్‌రెడ్డి చేయి కలిపాడు. ఆమె వైపు తిరిగాను. లతమ్మ నన్ను బిగ్గరగా కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు అలా ఏడవనిచ్చి కన్నీళ్లు తుడిచాను.

ʹఇది ఎప్పటికీ తీరే దు:ఖం కాదు కదాʹ అని ఓదార్చాను.

ఆమె మనసు మళ్లించడం కోసం ʹరెండు గంటలకు ట్రైన్‌ ఉందంట. భోజనం కాగానే పంపిస్తాను?ʹ అన్నాను.

ʹఇంటి దగ్గర మా అత్తమ్మ ఒక్కతే ఉంది. తోడు లేకుండా కదల్లేదు. పక్కవాళ్లకు చూడమని చెప్పి వచ్చాం. ఆవులు కూడా ఉన్నాయి. పాలు పిండి కేంద్రానికి పంపించమని శ్వేతకు చెప్పి వచ్చినా. తొందరగా పోయేటట్టు చూడమ్మాʹ అన్నది.

ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్లాలి అన్నట్లు ఆమె గొంతు ధ్వనించింది.

నిజమే. సాగర్‌ సంస్మరణ రోజు చూశాను. వాళ్ల బంధువుల ఇండ్లలో ఆ ఇల్లే ఏదో వెలేసినట్టుగా ఉంది. రేకుల ఇల్లు. వెలిసిపోయిన గోడలు. లోపల దండేనికి వేలాడుతున్న బట్టలు. ఓ మూలకు వేసిన మంచంలో పండు ముసలమ్మ. మరో మూలకు గ్యాస్‌ స్టవ్‌. కొన్ని వంటగిన్నెలు. ఇంకో పక్క మేం కూచున్న మంచం. మొత్తం కలిపి ఒకే గది. బాగా చితికిపోయిన కుటుంబం. ఆవులే జీవనాధారం.

ʹఒకప్పుడు బాగా బతికినవాళ్లమే. పోగొట్టుకోగా మిగిలింది అరెకరం. మా ఆయన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కులానికి తగినట్లు దొరల్లాగే బతుకున్నారు. అందరిలా బతకలేకపోవడానికి నా భర్త అసమర్థత కారణమని అంతా అంటారు. అందులో కొంచెం నిజం ఉంటే ఉండవచ్చుగాని కానీ నమ్మి మోసపోవడమనే లోకరీతికి బలైన వాళ్లం. ఆయన తాగుడు వ్యసనం, కుటుంబం పట్ల పట్టింపు లేకపోవడం వల్ల భారమంతా నా మీదే పడింది. ఏముందమ్మా నా జీవితంలో! ఎప్పుడు కష్టాలే. పెద్ద కులంలో పుట్టినా పేదిరకం నాకు శాపమైంది. ఇన్ని కష్టాల మధ్య నా కొడుకును చూసుకొని ఆనందించేదాన్ని. సాగర్‌ చేతికి ఎదిగి వస్తే కష్టాలన్నీ తీరుతాయనుకున్న. వాడిని తండ్రిలా కాకుండా లోక జ్ఞానంతో పెంచాలనుకున్నాను. నా కొడుకెప్పుడూ నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నేను ఆశ పడ్డట్లే పెరిగాడు. చదువుకుంటూనే నాకు పనుల్లో సాయం చేసేవాడు. ఆడవాళ్ల కష్ట సుఖాలను అర్థం చేసుకున్నాడు. చెల్లెంటే ప్రాణం వాడికి. ఉన్న అరెకరం పొలం కూడా చెల్లెలుకే ఇచ్చాడుʹ అని ఆరోజు అన్నది.

లతమ్మ బక్కచిక్కిన మనిషి. ఇప్పటికీ కొడుకు చనిపోయిననాటి విషాదమే ఆమె ముఖంలో ఉంది. మధ్యలో రెండు మూడు సార్లు కలిశాను. ఏ రోజూ ఆమె ముఖంలో చిరునవ్వు చూడలేదు. దేని కోసమో వెతుకుతున్నట్లు ఉండేది. పనులన్నీ పరధ్యాన్నంగా చేసుకోపోతున్నట్లు ఉండేది. పలకరింపులో నిండైన ఆత్మీయత ఉంటుంది కాని చిరునవ్వు కనిపించేది కాదు.

నాకు అంతు చిక్కని ఆ వెలితిని తరచి చూసే ప్రయత్నం చేశాను. ఆమెతో ʹఅక్కా ..! రోజులు గడుస్తున్నాయి, దు:ఖాన్ని దిగమింగుకోవాలి కదా?ʹ అన్నాను.

ʹఎక్కడ! వాడ్ని ఇంకా ఇంటి ముందేసుకొని కూచున్నట్టే ఉంది. ఆ శవం పెట్టె చుట్టూ ఇంకా మనుషులు కూచున్నట్లే ఉంది. వాకిలి ఊడిస్తే వాడి జ్ఞాపకాలు చెెదిరిపోతాయనిపిస్తోంది...ʹ ఆమె ఇలా మాట్లాడుతుంటే నేను భయపడిపోయాను.

మనిషి సహజంగా లేదు. కొడుకు మరణం లోతైన గాయమే చేసింది.

*** *** ***

డప్పుల చప్పుడు మొదలైంది. అక్కడికి అమరుల కుటుంబాలన్నీ చేరాయి.

స్థూపం ఆవిష్కరించడానికి ఆమెను తీసికెళ్లాను. స్థూపం పక్కనే నిలబడి ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఆమె చెంపలపై కన్నీరు ధారగా కారుతోంది. ఆ దంపతులు లోలోపల బాధను అదిమిపట్టుకుంటూ స్థూపాన్ని ఆవిష్కరించారు. దు:ఖంతో ఆమె గుండెలు ఎగిసిపడుతున్నాయి.

సుధాకర్‌రెడ్డి స్థూపంపై చేయిపెట్టి కొడుకును చూసుకుంటున్నట్లు అపురూపంగా చూస్త్తుండిపోయాడు.

అమరులను స్మరిస్తూ పాట మొదలైంది. గుండెల్ని పిండే విషాదం ఏదో ఆ పాటలోని శృతితోపాటు పెరిగి అక్కడున్న వాళ్ల హృదయాలను కదిలించింది. పాట అయ్యాక ఎవరో నినాదం అందుకుంటూ పిడికిలి ఎత్తారు. వందలాది గొంతులు మారుమోగాయి. ఆ తర్వాత అందరూ హాల్లోకి నడిచారు.

మధ్యాన్నం భోజనాలప్పుడు ʹటైం అయింది మరి బయల్దేరుతారాʹ అని సుధాకరరెడ్డిని అడిగాను.

ʹలత సాయంత్రం వరకు ఉండి వెళ్దామంటోందిʹ అన్నాడాయన. ఎందుకైనా మంచిదని ఆమె దగ్గరికి వెళ్లి అడిగాను.

ʹమూడు గంటల ప్రయాణమేగా. మీటింగు అయిపోయాక బయల్దేరుతాంʹ అంది.

మీటింగ్‌ మధ్యలో ఆమెను గమనించాను. పాటల్లో లీనమైపోయింది.

ఆమె ఎందుకో మధ్య మధ్యలో తల తప్పి అందర్నీ చూస్తోంది.

సాయంకాలం సభ ముగియగానే జనం మధ్యలో వాళ్ల కోసం వెతికాను.

అక్కడ కొద్దిమంది గుంపుగా చేరి ఏవో కబుర్లలో పడిపోయారు. వాళ్లలో లతక్క, సుధాకర్‌రెడ్డి కనిపించారు. నేను వాళ్ల దగ్గరికి వెళ్లి ʹబయల్దేరుతారా?ʹ అని అడిగాను.

నా భయమల్లా... అనుకున్న సమయానికి ఇంటికి పంపకపోతే మళ్లొకసారి రావడానికి ఇబ్బందిపడతారేమో అని.

ఆమె నాకు మాత్రమే వినిపించేలా ʹఇక్కడ ఉంటే నాకు మనశ్శాంతిగా ఉందమ్మా. వీళ్లంతా నాలాంటి వాళ్లే. వాళ్ల పిల్లలు కూడా ఎట్లా వెళ్లారో, ఎట్లా చనిపోయారో చెప్తోంటే ఈ బాధ నా వొక్కదానిదే కాదని అనిపిస్తోంది. ఈ పాటలు, మాటలు వింటుంటే వాడి మాటలు వింటున్నట్లే ఉంది. ఇక్కడికి వచ్చాక నా మనసులో వెలితి తీరుతున్నట్లుంది. నేను బైటికి చెప్పుకోలేకపోతున్నది వీళ్లు మాట్లాడుతున్నట్లుంది.ʹ అంది.

నేను ఆమె ముఖంలోకి తదేకంగా చూశాను. ఆమె ఏదో అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నదని అనిపించింది. కానీ ఆమె ముఖంలో ఇప్పుడూ ఎలాంటి సంతోషం లేదు. ఈ మాటలు చెప్తున్నప్పుడైనా ఏదైనా తేడా కనిపిస్తే బాగుండనిపించింది.

*** *** ***

ఆ దంపతులు ఉదయాన్నే అందరికంటే ముందుగా తయారై వచ్చి కూచున్నారు.

ఆమె నన్ను చూసి చిన్నగా నవ్వింది.

నాకు చాలా సంబరమనిపించింది. ఈ రోజు తర్వాత ఆమె కొంచెమైనా తేరుకుంటే బాగుంటుందనిపించింది.

ʹతొందరగానే తయారై వచ్చారేʹ అన్నాను.

ʹమాకు పాలు పిండటం కోసం చీకట్లోనే లేవడం అలవాటు కదా. అందుకని జల్దీ తెలివి వచ్చింది. స్నానం చేసి వచ్చాం. ఇక్కడ వచ్చి కూసుంటే అందరూ కనిపిస్తారు కదా. మా సాగర్‌ వయసువాళ్లే ఎంత మంది ఉన్నారో. వీళ్లందర్నీ చూస్తోంటే నా కొడుకును చూసినంత తృప్తిగా ఉంది. మావాడు అప్పుడప్పుడు ఇట్ల వచ్చి రెండు మూడు రోజులు ఇట్ల్లాంటి చోటే ఉండేవాడట కదా. వీళ్లతో కలిసి మెలసి తిరిగేవాడట కదా. నిన్నటి నుంచి వాడి జ్ఞాపకాలు కొత్తగా అనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఇవేవీ నాకు తెలిసేవి కాదు. ఇక్కడికి వచ్చినంక అన్నిచోట్ల వాడే ఉన్నట్లనిపిస్తుంది. కష్టాలు నీవొక్కదానికే కాదమ్మా.. లోకమంత ఉన్నాయి అని వాడు ఇక్కడే ఎక్కడో ఉండి నాకు చెప్తున్నట్లనిపిస్తోంది. నా బిడ్డ ఎన్నోసార్లు మీటింగులకు రమ్మని పిలిచాడు. అప్పుడు రాలేదు. తల్లులతోపాటు పిల్లలు, పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా మీటింగులకు వస్తారని వాడు అనేవాడు. ఇక్కడికి వచ్చినంక వీళ్లందర్నీ చూసినప్పుడు వాడున్నప్పుడు ఒక్కసారి అయినా వచ్చుంటే వాడికి తృప్తిగా ఉండేదేమోʹ అన్నది.

ఆమె మనసు నాకు అంతు పట్టలేదు. ఆమె ఇంకా ఇంకా విషాదంలోకి మునిగిపోతోందా? అనే సందేహం కలిగింది. అప్పుడప్పుడు శ్వేత చెప్తూనే ఉంది. ʹఅమ్మకు గుండెజబ్బు ఉంది. అన్న చనిపోయినప్పుటి నుంచి తనలో తనే .. ఇట్ల మనుషుల్ని చంపేస్తే అడిగేవారు లేరా? అని మధనపడుతుంది. ఈ బాధతో ఆమెకు ఏమన్నా అవుతుందేమోనని ఆందోళన పడుతున్నాంʹ అని.

ʹఇంటికి ఎప్పుడు వెళ్తారు?ʹ అని మళ్లీ అడిగాను.

ʹసాయంత్రం మీటింగ్‌ అయిపోగానే మా వరంగల్‌ వాళ్లంతా బయల్దేరుతారు కదా? అన్నదిʹ దృఢంగా.

ఆయన కూడా ʹఅంతేʹ అన్నట్టు చూశాడు.

సాయంత్రం వీడ్కోలు సమయంలో వాళ్లిద్దరూ నా దగ్గరికి వచ్చారు.

ʹఈ రెండు రోజులు చాలా తృప్తిగా గడిచాయమ్మాʹ అన్నాడు సుధాకర్‌రెడ్డి.

ఆమె ʹఎక్కడయినా ఇట్లా మన మీటింగులు ఉంటే చెప్పమ్మా. ఈ రోజులాగే చెల్లెకు ఆవుల్ని, ఇల్లు అప్పగించి వస్తాను. ఊళ్లోనే కదా చూసుకుంటుందిʹ అన్నది.

కొన్ని క్షణాలయ్యాక ..ʹఇక్కడ అందరు అమ్మా బాగున్నావా? అని పలకరిస్తుంటే వాడు ఎదురొచ్చి పలకరిస్తున్నట్టుంది. వాడుకాక ఇంకెవరమ్మా నన్ను అంత ఆప్యాయంగా పలకరించేది. ఇంటికి వెళితే వాడు లేడనే దిగులు ఎక్కువ అవుతుందని భయంగా ఉంది..ʹ అని కళ్లు ఒత్తుకుంటూ గేటు వైపు నడిచింది.

*** *** ***

సరిగ్గా వారం రోజులు.

లతక్క ఆడబిడ్డ ఫోన్‌ చేసి ఏడుస్తూ మా ఒదిన చనిపోయిందని చెప్పింది.

లతక్క చనిపోవడం ఏమిటి? అని అడిగాను ఆదుర్దాగా.

ʹమా వదిన ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నదక్కా. కొడుకు సమాధి దగ్గరికి పోయి కూచోని వస్తోంది. అట్ల ఎందుకు చేస్తున్నవని గదమాయిస్తే.. తప్పిపోయిన ఆవును వెదకడానికి వెళ్లానని ఒకసారి, ఇంక దేనికో వెళ్లానని ఇంకోసారి చెప్పేది. మనిషి చాలా పరధ్యానంగా మారిపోయింది. పొదుపు సంఘం డబ్బులు వస్తే తీసికెళ్లి బ్యాంకులో వేసిందట. నామినిగా ఎవరి పేరు రాయించినవని మా అన్న అడిగితే ఇంకెవరి పేరు పెడ్తా? నా కొడుకుండగా? అన్నదట. ఎవ్వరం ఆమెకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. మనిషి జీవమున్న శవంలా తయారైంది. శక్తి లేకపోయినా అన్ని పనులు మీదేసుకొని చేస్తోంది. అన్న కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి మా వదినను వదిలి ఎక్కడికి పోవడం లేదు. మా అమ్మ కూడా ʹనీకేమన్నా అయితే నా కొడుకు ఒంటరివాడవుతాడʹని కోడల్ను పట్టుకొని ఏడ్చిందంట.

ఈ మాటకు మా అమ్మకు ధైర్యం చెబుతూ ʹనేను ఉన్నాను కదా అత్తమ్మా! నాకేం అవుతుంది? నిన్ను, నీ కొడుకునూ నేను కాయకష్టం చేసైనా ఏ లోటూ లేకుండా చూసుకుంటా బాధపడకుʹ అన్నదంట.

ఈ రోజు మా శ్వేత కొడుకు పుట్టిన రోజు. ఇంటికి రా అమ్మమ్మా.. అని వాడు వచ్చిండంట. గంట అయినాక వస్తాను నువ్వు వెళ్లు అన్నదంట. ఆ తర్వాత మా అమ్మతో అత్తమ్మా.. ఎందుకో ఛాతీలో నొప్పిగా ఉంది. కొంచెం సేపు పండుకుంటాను అన్నదంట. నిద్రలోనే పోయింది. ఇంకా అమ్మమ్మ రాలేదని మనవడు వచ్చి తట్టి లేపిండంట... ఆమె ఇలా చెప్పుకుపోతోంది...

ఆమె ఇంకా ఏం చెప్తోందో నా చెవులకు ఎక్కలేదు. ఫోన్‌ పెట్టేసి అచేతనంగా కూలబడి పోయాను.

ఈ తల్లి తన కొడుకును బాధ్యతగా పెంచింది. కొడుక్కి కలిమి లేముల లోకాన్ని చూపించాలనకుంది. కానీ అతను అక్కడితో ఆగలేదు. మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన మమతల కోసం ఆరాటపడ్డాడు. అవి ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయో అన్వేషించే ప్రయత్నం చేశాడు. కుటిలత్వం నిండిన ఈ రాజనీతిని అర్థం చేసుకున్నాడు. ఎదురిస్తూ నేలకొరిగాడు.

మృత్యువు మనిషి జీవితంతో ఇంతగా దోబూచులాడుతుందా? మరణాల ముందు వెనకల గురించి ఏమీ చెప్పలేం కానీ, తల్లుల కళ్ల ముందే బిడ్డలు చనిపోవడం కంటే ఈ లోకంలో విషాదం మరేముంటుంది? గుండెకు హత్తుకోవాల్సిన కొడుకు శవాన్ని ఆకారం లేని నెత్తుటి ముద్దగా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ కన్న పేగు ఎంత తల్లడిల్లిందో! అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను రాజ్యం కళ్ల ముందే క్రూరంగా చంపేస్తే ఏం చేయలేని నిస్సహాయతతో ఆ తల్లి ఎంతగా కుంగిపోయిందో! బాబు పుట్టినప్పుడు తనకు ప్రపంచాన్ని జయించినంత సంబరం కలిగిందని చెప్పింది. ఆ మాట చెప్పినప్పుడు పొత్తిళ్లలో బిడ్డను తడిమి చూసుకుంటున్నట్లు ఒడిలోకి చూసుకుంటూ మరీ చెప్పింది. అదీ కొడుకు చనిపోయిన విషాదాన్ని మోస్తున్న సమయంలో కూడా.

(విద్యాసాగర్‌ వీరోచిత మరణంతో మాకు పరిచయమై విషాదంగా మా గుండెల్లోకి ఇంకిపోయిన లతమ్మలాంటి తల్లులందరి కోసం...)

No. of visitors : 1104
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •