పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

| సాహిత్యం | స‌మీక్ష‌లు

పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

- పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

( చేను గట్టు పియానో -ప్రసాదమూర్తి కవితా సంపుటి సమీక్ష )

వర్తమాన ప్రపంచంలో ఉన్నట్లుండి 2017 జనవరి చివరి వారంలో కొత్త చరిత్ర మొదలైపోయింది.
అందరూ భయపడినట్లే అమెరికా కొత్త అధ్యక్షుడి పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన,ప్రజాస్వామ్య హక్కుల పతనం, సామాన్యులపై అధికారజులుం మొదలైపోయింది. ప్రపంచం ఒక కుటుంబం అనే భావనకు బీటలు వారింది. అమెరికా ఆదర్శ రాజ్యం అనే భ్రమలకు ఉన్న ముసుగు తొలగిపోయింది. ఇప్పుడు కొత్త భయాలకు, కొత్త ప్రశ్నలకు, అబధ్రతలకు, సరిహద్దు తగాదాలకు, విదేశీ మేధావుల మనుగడ ప్రశ్నార్థం అవవటానికి ,అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా నిరుద్యోగ సృష్టికి , విదేశం లో స్థిరపడిన, స్థిరపడుదామనుకున్న వాళ్ల ఆశలు వమ్ముకావడానికి ఇదొక ప్రారంభం మాత్రమే. దేశాల మధ్య,మనుషుల మధ్య నాగరికతల మధ్య గోడలు మొలిచే కాలం మొదలయ్యింది.అంతర్జాతీయంగా రాబోయే కాలాల్లో ప్రపంచదేశాల్లో ఏర్పడబోయే ఎన్నో సంఘర్షణలకు ఇదొక సూచన మాత్రమే.ఇలాంటప్పుడే మేల్కొలిపే సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా అవసరం అవుతుంది.
ఇక పైన కవులు రచయితలూ, సామాజికశాస్త్రవేత్తలు,పర్యావరణవేత్తలు, మానవహక్కుల ఉద్యమకారులు,చరిత్రకారులు,మేధావులు,విద్యార్థులు,శ్రామికులు,మహిళలు,కార్మికులు,సృజనకారులు కొత్త ఆవిష్కరణల్ని వెలువరించాల్సి వుంటుంది.ఇదొక చారిత్రక సందర్భం. కొత్త పరిణామం.కొత్త చూపుకు,కొత్త మాటకు,కొత్త బాషకు,కొత్త సమ్మేళనాలకు, కొత్త రాతకు ఇదొక గొప్ప మలుపు. ఉద్యమాల కాలంలో ఇదొక ముఖ్య దశ.

ఈ సందర్భంలోoచీ వర్తమాన తెలుగు సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు కొత్త,లోతైన చూపుతో రాసిన సృజనాత్మక సాహిత్యానికి,అనువాదాలకు,సామాజిక శాస్త్ర గ్రంధాలకు,కథా, కవితా సంపుటాలకు, రచనలకువిలువ పెరిగింది.స్వేచ్ఛను ప్రేమించే రచయితలకు, మానవీయ విలువల్ని ,మానవ హక్కుల్ని కాపాడాలని తపించే రచయితలకు,వాళ్ళ రచనలకు విలువ పెరిగింది.

***

ఈ క్రమంలో తెలుగు కవితా సంపుటాల నిరంతర ప్రవాహంలో ఏది మంచి కవిత్వమో తెలిసినప్పుడు, తెలుసుకున్నప్పుడు కాస్సేపు అక్కడే ఆగుతాం. మనం చదివిన మంచి కవిత్వాన్ని మరొక్కసారి చదువుకుంటాం. అందరికీ పరిచయం చెయ్యాలని,వాళ్ళు కూడా ఆ కవిత్వాన్ని చదవాలని ఆశ పడుతాం. ఈ మధ్య చదివిన మంచి కవితా సంపుటాల్లో ప్రసాదమూర్తి గారి కవిత్వం ʹ చేను గట్టు పియానో ʹ ఒకటి. బి.ఆర్.వీ. ప్రసాదమూర్తి అంటే తెలియని వాళ్ళు కూడా ʹ కల నేతʹ ( 1999 ), ʹమాట్లాడుకోవాలి ʹ (2007), ʹ నాన్న చెట్టుʹ (2010 ) , ʹ పూలండోయ్ పూలు ʹ ( 2014) కవితాసంపుటాల పేర్లు చెప్పగానే ప్రసాదమూర్తి కవిత్వం కదా అని గుర్తుపట్టే ప్రత్యేక కoఠస్వరం వున్న కవి.పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామం వీరిజన్మస్థలం.హైదరాబాదులో నివాసం.

శ్రీ శ్రీ డాక్యుమెంటరికి బంగారు,తామర నంది అవార్డులు (2008) , తన సాహిత్యానికిగాను నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం ( 2011),ఢిల్లీ తెలుగు అకాడెమి సాహిత్య పురస్కారం( 2012),సోమసుందర్ సాహిత్య పురస్కారం(2014),ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు (2015),విశ్వకళా పీఠo అవార్డు(2016),రొట్టమాకుల రేవు సాహిత్య పురస్కారం (2016) అందుకున్నారు.

ʹ ఎవరో మంత్రించినట్టు /నేను పుస్తకంగా మారిపోతే/గాలికి కదిలే పేజీలు పేజీలుగా/నాలోంచి రెపరెపా శబ్దాలు వచ్చాయి/ కవి ఎవరైతేనేం/పుస్తకమే నేనైనాక ʹ ( కొత్త పుస్తకం ).ఎవరి పుస్తకాలని వాళ్ళు మాత్రమే ఇష్టపడే కవుల మధ్య మంచి పుస్తకాన్ని ప్రసాదమూర్తి గౌరవించిన తీరు అతడి వ్యక్తిత్వానికి నిదర్శనం .

ప్రపంచంలో అందరికీ తెలియని,తెలిసినా పట్టించుకోని, అందరూ స్పందించని అనేకానేక సంఘటనలు,దృశ్యాలు,బాధలు, కన్నీళ్ళు,అలజడులు,సమస్యలు కవుల్ని ఆకర్షిస్తాయి.ఒక్కో కవి తనకు తెలియకుండానే తన కవితావస్తువుల్ని సేకరించుకుంటాడు. ఆయా కవితావస్తువులకు తగిన పదజాలం సహజంగా ఆ కవిత్వంలో ఇమిడిపోవడం ఒక ఇంద్రజాలం.

ఒక్కో మారు ఒక మాటో,సంభాషనో,సన్నివేశమో, తీవ్రంగా కదిలిస్తుంది.కవిలో అలజడి రేపుతుంది.జీవితం ఎలా వుందో, ఎలా ఉండాలో , ఎలా ఉండకూడదో కొంతమంది కవులు తమ కవిత్వం లో బలంగా నమ్మకంతో చెపుతారు.స్వేచ్చగా, స్వతంత్ర్యంగా,విలువలతో బ్రతకటాన్ని తమ కవిత్వంలో చూపిస్తారు.అలాంటి కవిత్వాన్ని చదివినప్పుడు ఇదికదా కవిత్వం అనిపిస్తుంది.

అంతులేని కవితా సంపుటాల మధ్య తప్పకుండా వెతికి సంపాదించి, చదువుకోవాల్సిన కవితా సంపుటాల్లో ʹచేను గట్టు పియానో ʹ ముందు వరసలోనే వుంటుంది.

జీవితం పట్ల ,ప్రేమల పట్ల,ప్రపంచం పట్ల,మనవ సంబంధాలు, అనుభూతులు,స్పందనల పట్ల ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి పట్లా,మనిషితనం పట్లా కవికి గౌరవం,విశ్వాసం వున్నాయని ఈ కవితలు చెపుతాయి.లోకం లోని అమానుషాలను, మనిషి లోపలి విధ్వంసాన్ని నగ్నంగా చూపెట్టిన కవితలు ఈ కవితా సంపుటిలో చాలా వున్నాయి.

ʹ చేనుగట్టు పియానో ʹ కవిత ను ʹ రోజూ పొద్దున్నే మేఘం భుజాన వేసుకుని/వ్యవసాయానికి పోతానుʹ అని ప్రారంభించి ʹ చేనుగట్టు పియానో మీద/ఎలాగూ పిట్టలు నాట్యమే చేస్తాయి ʹ అంటూ కవిత ముగింపు లో ఇలా అంటాడు ʹ అధినేతల శిఖరాగ్ర సమావేశాలు యథాతధమే./ ఏ రుణాలు ఎలా తీరాతాయో ఏమో/ ప్రకృతి మాత్రం రుణ మాఫీ పత్రాన్ని/ నా చేతుల్లో పెట్టి వెన్ను తడుతుంది / పురుగు మందు నన్ను తాగి అమృతమవుతుంది/నన్ను గాలిపటంగా ఎగరేసి ఉరితాడు విరితడుగా గుబాలిస్తుంది/అర్థాంతరంగా వెళ్ళిపోయిన రైతుల ఆత్మలన్నీ/ చల్లని జల్లులై నా మీద కురుస్తాయి/ రైతుని బాబయ్యా పచ్చని పలవరింతల బైతుని ʹ

ʹ బొమ్మల గోడలు ʹʹ కవిత లోతైనది. ʹ ఏ నిర్వాసితుడి కథ చదివినా /నాకు మా ఊరు..మా ఇల్లు../మా ఇంటి గోడలే/కంట్లో బొమ్మల్లా కదులుతాయి/అందుకే నాకు నేను కూడా చెప్పుకోకుండా/ఉన్నట్టుండి ఊరెళ్ళి వస్తుంటాను/నా బొమ్మలన్నీ మా ఇంటి గోడలమీదే ఉన్నాయి.ʹ అంటూ మొదలైన కవిత చివరకు వచ్చే సరికి ఒక గొప్ప తాత్వికతతో ముగుస్తుంది. ʹ ఏ నిర్వాసితుడైనా దేనికోసం ఏడుస్తాడో/అతడు పుట్టి పెరిగిన మట్టి మీద /అతడు వదిలిపోయిన /నీడల బొమ్మల్ని అడిగితే నిజం చెప్తాయి ʹ. నిజానికి ఎవరేమనుకున్నా నిజం చెప్పటమే కవిత్వం,సాహిత్యం.అలాంటి నిజాలే ప్రసాదమూర్తి కవితలు.

వేగంగా మారుతున్న ప్రపంచంలో , అత్యంత సంక్లిష్టంగా మారుతున్న మానవ మనస్తత్వాన్ని కనుక సక్రమంగా అంచనా వేయలేకపోతే మంచికి చెడు,చెడుకి మేలు జరిగిపోతుంది.ఒక అనాలోచిత ఉద్రిక్త స్వభావం వల్ల , చెంచలత వల్ల మనం సునాయాసంగా కోల్పోతున్న మనుషుల్ని, మానవ సంబంధాలను గురించిన కటిఠినమైన వాస్తవాలు ఈ కవితా సంపుటిలో కనిపిస్తాయి.

ʹ మధ్యధరా సముద్ర తీరంలో /మరో కొత్త దేశం కోసం వెదుకుతున్న/సిరియా శిశు శరణార్థి పసికల్లల్లా వున్నాయి డని అడుగులు ʹʹ ( చెరువులో పిట్ట అడుగులు )

ʹ అందరినీ కూర్చోబెట్టి మధ్యలో /అన్నం కంచంలా అమ్మ కుర్చునేదే ఇల్లు/అయినా నా ఇంటికి నన్ను రమ్మని పిలిచేది ఎవరు?/మై ఘర్ జరూర్ వాపస్ ఆవూoగా/ అయితే అక్కడ అమ్మ వుండాలి సుమా..ʹ ( ఘర్ వాపస్)

జీవితంపట్ల నమ్మకాన్ని,విశ్వాసాన్ని ,గౌరవాన్ని కలిగించడంతో బాటూ , సామాజిక మానవుడి వ్యక్తిత్వంలోని వైచిత్రిని కళ్ళకు కనపడేలా, చెవులకు వినిపించేలా రాసిన కొన్ని కవితలు కవి సామజిక బాధ్యతని చెబుతాయి. నిత్యం ,నిరంతరం మనం చూసే ప్రపంచంలో మనం చూడని సత్యాల్ని ఈ కవిత్వంలో చూసి వులిక్కిపడతాం. వస్తు ప్రపంచంలో అనేకానేక ఆకర్షణలకు లోనైనా మానవుడి అంతరంగం లోపల ఎక్కడో మనిషితనపు ఆనవాళ్ళు ఉండనే వుంటాయి. మనిషితనపు ఆ మిగిలిన ఆనవాళ్ళను ఈ కవిత్వంలో అడుగడుగునా చూస్తాం.

ʹ ఇది మనుషులనుండి /మనుషులనే ఖాళీ చేయించే కాలం ʹ (నా నుంచి నేనే ఖాళీ)
ʹ నిన్న చనిపోయిన రైతు /మొన్న చనిపోయిన రైతులా నవ్వుతూ/ఈరోజు చనిపోయిన రైతులా భయపెట్టాడు ʹ ( నిన్న చనిపోయిన రైతు )

ఉరుకులు పరుగులతో సంపాదనలకే పరిమితం అయిపోయి తన లోపలి శిశువును పోగొట్టుకున్న మానవుడికి తన గతం, బాల్యం అపురూపమైనది. తనను తాను పోగుట్టుకోని దినాల్లో తను తిరిగిన ప్రదేశాలు, తనకు మేలు చేసిన మనుషులు మానవుడికి ఎప్పుడో ఒకప్పుడు లేదా అప్పుడప్పుడూ గుర్తొస్తూనే వుంటాయి.

అలాంటి బాల్యాన్ని, మనుషుల్ని,మంచి దినాల్ని గుర్తుకుతేవడమే మంచి కవిత్వం.తనను గురించిన నిజాల్ని నిర్భయంగా చెప్పి మనిషి కాలేకపోయిన వాళ్ళని మళ్ళీ మనుషుల్ని చెయ్యడమే మంచి కవిత్వం అనుకుంటే ʹ చేను గట్టు పియానో ʹ మంచి కవిత్వమే!

ʹతగలబడుతున్న అడవుల్లోంచి పారిపోతున్న పిట్టలకు /కారిడార్ వలల్లో చిక్కి విలవిలలాడుతున్న సముద్రాలకు ఎవరున్నారు...ఎవరున్నారు/ఇంకెవరున్నారు/కవులు తప్ప? ʹ ( ఎవరున్నారు వాళ్ళకి? )
ʹవీధుల్లో పోతుంటే చిల్లులు పడ్డ గొడుగుల్లా గుడిసెలు-/ ఈ నాయకులకు చెప్పాలి/కాస్త ఆ పథకాల ప్రచారాలు ఆపి/గుడిసె గుడిసేకీ ముందు గొడుగుల్ని నాటమని-అయ్యో బయటో లోపలో భోరున వర్షం/త్వరగా ఇంటికి వెళ్ళాలి /నన్ను గొడుగుగా విప్పుకుని/ఆమె కప్పుకుంటుంది ʹ( గొడుగులు నాటండి )

కుటుంబంలోని మనుషుల మధ్య, కుటుంబాల మధ్య, మానవ సమాజాల మధ్య ,మనుషుల మధ్య, మనిషికి, మనిషి లోపలి మనిషికీ మధ్య ఏర్పడిన,ఏర్పడుతున్న అగాధాల గాయాల గురించి, ఇంట్లోని, సమాజం లోని , మానవుడిలోని ఖాళీల గురించి రాసిన కవితలు , కవి దళితుల పక్షం అని, పీడితుల పక్షం అని స్పష్టంగా తెలియచేసే కవితలతో బాటూ తను ప్రేమించిన,తనను ప్రేమించిన మనుషులకు కష్టం వాటిల్లినప్పుడు, వాళ్లకు సంతోషం కలిగినప్పుడు సహానుభూతితో రాసిన కవితలూ ఇందులో వున్నాయి.

రోహిత్ ను తలచుకుంటూ రాసిన ʹఎప్పుడైనా.. ʹ కవిత ఇలా ముగుస్తుంది. ʹ నేనుండను..నా ఇల్లూ..ఈ గోళమూ వుండవు/విభేదాలు..వివాదాలు మనుషుల మట్టి కింద శిలజాలైపోతాయి/అయినా నువ్వెప్పుడైనా నా ఇంటికి అతిధిగా వస్తావని /రోజూ కంచం తుడుస్తూ వుంటాను./కన్నీళ్ళు అక్షరాలుగా మరిగించి/అక్షరాలను అన్నం మెతుకులుగా ఉడికించి /నీ కోసం వణుకుతున్న చేతులతో /నేనులేని శూన్యంలో కూడా కంచం తుడుస్తూ వుంటాను. ʹ

జీవితం ,జీవించటం తేలిసినవాడే నిజమైన సృజనకారుడు. ఆకలివిలువ,అన్నం విలువ ,జీవితo విలువ ప్రేమ, దు:ఖం విలువ తెలుసుకున్నవాడే కవి. ఈ సువిశాల రద్దీ ప్రపంచంలో బహుశా మనిషిలా ఉండటమే , ఉండగలగటమే మనిషి గొప్పతనం అనుకునే ఈ కాలంలో మనిషితనం కలిగిన సృజనకారులైన కవుల కవిత్వంలోని ప్రేరణ పాఠకులకు ఆవసరమైన మందుల్లాంటివి.ఇలాంటి కవితల అవసరం నేటి సమాజాలకు ఎంతైనా వుంది.సృజనకారుడైన కవి రాసిన ఈ కవిత్వం ఒక స్నేహపూర్వక పలకరింపులాంటిది, ఒక హెచ్చరిక లాంటిది,ఒక ఊరడింపు లాంటిది,ఒక ఆగ్రహ నిరసన లాంటిది..

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని ఈ కవిత్వం చెపుతుంది.
దేశంలో అపహాస్యం పాలవుతున్న ప్రజాస్వామ్యం గురించిన పదునైన విమర్శ ఈ కవితల్లో కనిపిస్తుంది. రాజకీయ హత్యలపట్ల , ఎన్కౌంటర్ల పట్ల ,నిరసనల్ని అణచివేసే అధికారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ,నిరసిస్తూ, దుర్మార్గాన్ని ప్రశ్నించిన తీరు కవి ప్రసాదమూర్తి లోని నిబద్దతని తెలియచేస్తుంది.

ʹ నిజానికి ఇది నిషేధాల రుతువే కావొచ్చు/ ఇది ఆంక్షల అణచివేతల క్రతువే కావొచ్చు/అయినా రెప్పల మీద ఈ స్వప్న సంచారాన్ని/ ఎవరాపగలరు?/వసంతాన్ని నా దేశం ముంగిట కట్టిపరేసే /కాంక్షా జ్వాలను ఎవరార్పగలరు? ʹ ( నా దేశం –నా రుతువు )

కలాన్ని చంపేశారు/కలల్ని చంపేశారు/ కాల్ బుర్గీ ని చంపేశారు ʹ.... ʹమరోసారి మరోసారి/ సత్యాన్ని అన్వేషించే సత్యాన్ని చంపేశారు ʹ (సత్యం వధ )

ʹఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారీ/నా మృతదేహం ముందు నేను కూర్చుని/ దేశం తల నిమురుతూ వుంటాను.ʹ(ఎన్ కౌంటర్ )

కవికి స్పష్టమైన రాజకీయ అవగాహన ఉంది కాబట్టే వివేచనతో రాసిన చాలా కవితలు ఇందులో వున్నాయి.ప్రతి కవితా ఒక సందర్భంలోంచి,ఒక అనుభూతి లోంచి,ఒక ఆగ్రహం లోంచి, ఒక పోరాట స్పృహ లోంచి స్పందిస్తూ రాయబడింది కాబట్టే ʹ చేను గట్టు పియానో ʹ కవితాసంపుటికి పరిమళం , పదును రెండూ వున్నాయని చెప్పక తప్పదు.

( చేను గట్టు పియానో -ప్రసాదమూర్తి కవితా సంపుటి . వినూత్న ప్రచురణలు ,హైదరాబాద్ మొదటి ముద్రణ అక్టోబర్ ,2016 పేజీలు143 ధర 100/- ప్రతులకు,వివరాలకు సెల్ :8499866699,9705468149 )

No. of visitors : 874
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

బ్రతికించే మాట ఒకటి కావాలి

పలమనేరు బాలాజీ | 17.03.2019 09:34:29am

నేనొక సమూహం కావటానికి నాకు ఒక మనిషి ,మాట ,మనసు కావాలి . మనసున్న మనిషి మాట్లాడే మాటొకటి కావాలి ఉదయమో ,సాయంత్రమో, రాత్రో నన్ను బ్రతికించే మాటొకటి కావాలి....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •