పోస్ట్‌మార్టం - పోస్ట్‌ ట్రూత్‌ : వ‌ర‌వ‌ర‌రావు

| సంభాషణ

పోస్ట్‌మార్టం - పోస్ట్‌ ట్రూత్‌ : వ‌ర‌వ‌ర‌రావు

- వ‌ర‌వ‌ర‌రావు | 07.02.2017 06:34:46pm

ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ ʹపోస్ట్‌ ట్రూత్‌ʹ (సత్యానంతరం) అనే మాటను 2016 శబ్దంగా నిర్ణయించింది. విస్తృతమైన చర్చలు, వాదోపవాదాలు, పరిశోధన జరిగిన తరువాత 2016లో ప్రచలితంగా వాడబడిన మాటగా ఈ మాటను ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ గుర్తించింది. మన దేశంలో ʹహిందుʹ వంటి ఇంగ్లిష్‌ దినపత్రికలోను, ఇతర ఇంగ్లిష్‌ ప్రింట్‌ మీడియా, సామాజిక మీడియాలోను ఈ మాట మీద, ఈ మాటకు ఉండే పొరల పొరల అర్థాల మీద చాలా ఆలోచనలు వచ్చాయి. చాలా భావాలు వెలువడ్డాయి.

ʹపోస్ట్‌ ట్రూత్‌ʹ అనే మాట ఒక విశేషణం. వస్తుగతమైన వాస్తవాలకు దారితీసే పరిసరాలు, వాతావరణం, పరిణామాల గురించి కాకుండా ప్రజాభిప్రాయాన్ని మలిచి, సామూహిక ఆవేశాలకు, వయ్యక్తిక విశ్వాసాలకు నచ్చే ఒక మాటగా, ఒక విశేషణంగా ఇది వాడుకలోకి వచ్చింది. బహుశా ఇది ʹపోస్ట్‌ మాడరన్‌ʹ (ఆధునికానంతర) భావజాలంలో భాగమే అనుకుంటాను. మేధావులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ఈ భావజాల కాలంలో ఇటువంటి శబ్దాలు రూపొందడం ఆశ్చర్యం కాదు.

ఆధునికతయే అబద్ధం అనిపించే మన బ్రాహ్మణీయ హిందూ కుల, మత వ్యవస్థలో ఆధునికానంతర ఒక అబద్ధం. పెట్టుబడియే గొలుసు పెట్టుబడి దాకా పాకి ఫాసిజంగా అమలవుతున్న వ్యవస్థలో పెట్టుబడిదారియే కాదు, పెట్టుబడిదారీ అనంతరం ఒక అబద్ధం. ఇన్ని అబద్ధాల మధ్యన మట్టి పొరల కింద మనం సత్యాల కోసం వెతుకుతూ ఉంటే, మన చేతులకు అన్నీ అస్థిపంజరాలే లభిస్తున్నాయి. కంకాళాలే లభిస్తున్నాయి. సత్యం వలెనే అసహజ మరణాలకు గురవుతున్న ఎందరో సత్యాన్వేషకుల ప్రాణాలు.

మహాశ్వేతా దేవి చెప్పినట్లు ʹʹనేరస్థ ఆదివాసీ సమాజాలʹʹ వంటి మనం వెతికే సత్యం, మనుషులకు సంబంధించిన సత్యం అసహజ మరణాలు పొందే మనుషుల చావులకు కారణాలు వెతికే అన్వేషణ. కనుక మనకు నిత్య జీవితంలో అలవాటు అయింది ఆసుపత్రి శవాగారాల దగ్గర, ఎస్‌పి ఆఫీస్‌ ఆవరణలో చెక్క పెట్టెలలో, లేదా భద్రాచలం మొదలు గడ్చిరోలీ, ఛత్తీస్‌ఘడ్‌ దాకా అటు ఒరిస్సా వైపు పోలీసు స్టేషన్‌ల ఆవరణలలోను, ఆసుపత్రుల ఆవరణలోను విసిరేయబడిన మృతదేహాలలో మన సత్యాన్వేషకులను వెతుక్కోవడం - భద్రాచలంలో మన కళ్లముందే ఆసుపత్రి శవాగారం నుండి కుంటా (తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు గ్రామం/పట్టణం, ఛత్తీస్‌ఘడ్‌)కు తరలింపబడి కుంటా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పోలీసు, సల్వాజుడుం పహారాలో విసిరేయబడిన పువ్వర్తి ఎన్‌కౌంటర్‌ అమరుల వలె. కనుక మనకు మృతదేహాల స్వాధీన కమిటీగానో, అమరుల బంధుమిత్రుల సంఘంగానో తెలిసిన ఒకే ఒక అబద్ధం లాంటి సత్యం పోస్ట్‌మార్టం. మరణానంతర సత్యం. ఇప్పుడు మరణానంతర సత్యం సత్యానంతర అబద్ధంగా తేలిపోయింది. కనుక రెండు మాటలు-బతుకు ఒక్కటే నిజం, మిగతా అంతా అబద్ధం అని చెప్తున్నాయి. బతుకు పోరాటం ఒక్కటే నిజం.

ఒక్క పోస్ట్‌ ఆఫీస్‌ అనే మాట తప్ప ʹపోస్ట్‌ʹ అనే విశేషణం తగిలే మాట ఏదీ వాస్తవం కాదు. అది వాస్తవానంతరం గనుక అందులో అతిశయానికి, ఆవేశానికి మన ఇష్టానిష్టాలను బట్టి నిర్ణయించుకునే అర్థం తప్ప అక్కడ సత్యం తేలదని ఈ చర్చించిన, పరిశోధించిన వాళ్లు చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ఆలోచిస్తే ఈ పోస్ట్‌ ఆఫీస్‌ అనే మాట కూడా అటువంటి ఒక అనంతర కార్యక్రమమే అనిపిస్తున్నది. ఎందుకంటే ఉత్తరాలు రాసిన తరువాత పోస్ట్‌బాక్స్‌లో వేస్తారు. అవి పోస్ట్‌ ఆఫీస్‌ నుంచి పోస్ట్‌మ్యాన్‌ బట్వాడా చేస్తాడు. తపాల పెట్టెలో ఉత్తరం పడే నాటికే మనిషి భావాలు కాగితం మీదికి బట్వాడా అయిపోయాయి. అది కార్డు కావచ్చు, కవర్‌ కావచ్చు. అది భావానంతర, రచనానంతర దశ. అది పోస్ట్‌బాక్స్‌లో పడిన తరువాత ఇక వెనక్కి తీసుకోవడానికి ఏమీలేదు. అది బట్వాడా అయి, అటువైపు కళ్లు, మనసు తీసుకోవడమే.

అయితే, మనం అట్లా ఒక మనిషి నుంచి మరొక మనిషికి భావాలు బట్వాడా కాని దేశంలో బతుకుతున్నామని ఆఘా షాహిద్‌ అలి (1949-2001) అనే కవి చెప్పే దాకా నాకు సత్యం ఆవిష్కృతం కాలేదు. ఈ కశ్మీరీ కవి శ్రీనగర్‌లో పుట్టి, పెరిగి, కశ్మీర్‌, శ్రీనగర్‌ యూనివర్సిటీలో చదువుకొని, 1975లో అమెరికా వెళ్లిపోయాడు. అమెరికాలో మసచ్యుసెట్స్‌-అంహెరెస్ట్‌ యూనివర్సిటీలోను, ప్రిన్స్‌టన్‌ కాలేజీలోను, వారెన్‌ విల్సన్‌ కాలేజీలోను బోధించాడు. ఇంగ్లిష్‌లో కవిత్వం రాసి అమెరికాలో ఇంగ్లిష్‌ కవిగానే ప్రసిద్ధుడయ్యాడు. అయితే కశ్మీరీ ముస్లింగా కశ్మీర్‌లో తన మూలాలు నిలుపుకున్నాడు. ఒక కశ్మీరీ వలెనే నిరంతరం ఒక అభద్రతా భావానికి, గత జ్ఞాపకాలకు, మృత్యువు భావనకు గురయ్యాడు. ఎప్పుడూ చరిత్రలోకి, తన కుటుంబ ప్రాచీన వారసత్వంలోకి, గతంలోకి నాస్టల్జియాలోకి పోయేవాడు. 2001 అమెరికాలో క్యాన్సర్‌తో చనిపోయాడు.

కశ్మీర్‌లోని లక్షలాది మంది యువకులు తమ రక్తబంధువులకు, స్నేహితులకు బట్వాడా చేయలేకపోయిన భావాలు ఒక శిథిల పురాతత్వ భాండాగారంలో దుమ్ము కొట్టుకు పోయి, శిథిలమైపోతున్న ఒక దృశ్యాన్ని చూసి, ఊహించుకుని ʹపోస్ట్‌ ఆఫీస్‌ లేని దేశంʹ అని ఒక దీర్ఘ కవిత రాశాడు. ఈ మాట భౌతికమైంది కాదు. ఎంతో మంది మనుషులు ఎన్‌కౌంటర్‌లలో, మిస్సింగ్‌ కేసులలో మరణించి, వేల మంది జైళ్లలో మగ్గి మనుషులు శాశ్వత మౌనంలోను, కత్తిరింపబడ్డ మాటల్లోను, ఒకరికొకరు చేరుకోలేని స్థితిని ఆయన పోస్ట్‌ ఆఫీస్‌ లేని దేశంగా ఊహించుకున్నాడు.

రాయగలిగిన మనుషుల భావాలను ఒక హృదయం నుంచి మరొక హృదయానికి చేర్చగల పేదల పాలిటి ఒకే ఒక సదుపాయం పోస్ట్‌ ఆఫీస్‌ భౌతిక పరిస్థితుల వల్ల కశ్మీర్‌లో లేకపోవడమే కాదు, ఇవాళ భారత ఉపఖండంలోనే లేకుండా పోతున్నది. కశ్మీర్‌ విషయంలో కశ్మీరీ ప్రజల ఆజాదీ పోరాటం మీద ఒక దమనచర్యగా అది పోస్ట్‌ ఆఫీస్‌ లేని దేశం అయింది కావచ్చు. అటువంటి దేశం గురించి జెఎన్‌యులో ఒక కవిత్వ సాయంకాల సందర్భాన్ని రచించుకోవాలని విద్యార్థులు ప్రయత్నం చేస్తే అదీ ఒక ఆజాదీ భావనగా జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్‌ యూనివర్సిటీ దాకా రాజ్యం వెన్నెముకలో చలిపుట్టించి రోహిత్‌ వేముల స్మృతిబద్ధ (ఆత్మ)హత్య దాకా తిరిగి మళ్లీ వెన్నుపూస వెంబడి పాకి నజీబ్‌ అనే కశ్మీరీ విద్యార్థి అదృశ్యం దాకా తన వికృత చేష్టలన్నీ ప్రదర్శించవచ్చు. అది రాజ్య అమానుష ముఖపార్శ్వానికి సంబంధించిన అంశం అయితే, అదే రాజ్యం అత్యంత ఆధునిక, సాంకేతిక జ్ఞాన భావజాల ఉప్పెనలో ప్రపంచమంతటా పోస్ట్‌ ఆఫీస్‌లు, పోస్ట్‌ బాక్స్‌లు తుడిచి పెట్టుకుపోతున్నాయి.

కశ్మీరీ కవికి పోస్ట్‌ ఆఫీస్‌ లేని దేశం ఒక విషాదం అయితే, ఇది కవులందరికీ పాబ్లో నెరూడాకు ఒక పోస్ట్‌మ్యాన్‌ వంటి మిత్రుడు దొరకని ఒక విషాదం ఇవాళ భారత ఉపఖండం అంతటా విస్తరించింది.

కనుక పోస్ట్‌ ఆఫీస్‌ కూడా ఒక భావ వినిమయానంతర అబద్ధంగానే మిగిలిపోయిన స్థితి. ఈ స్థితినంతా పోస్ట్‌మార్టం చేసి మనకందించిన చేదు నిజాన్ని ఒక నిరంతర గాయంగా స్వీకరించి గాయాలను మాన్చుకునే గేయాలు రచించే స్వప్నాల వైపు పయనిస్తూ చేసిన ప్రయాణం ఈ రచనలు.

రామగూడ (బెజ్జంగి) ఎన్‌కౌంటర్‌గా కుఖ్యాతి పొందిన ఎఒబి ఎన్‌కౌంటర్‌, అట్లాగే నీలాంబుర్‌ ఎన్‌కౌంటర్‌గా కుఖ్యాతి చెందిన ట్రై జంక్షన్‌ ఎన్‌కౌంటర్‌ రెండూ కూడా మనుషులను చంపడం దగ్గర ఆగలేదు. ఆ మనుషులను చంపడానికి, ఆ సత్యాన్వేషకులైన మనుషులను చంపడానికి రాజ్యం ఎంత ఎక్స్‌ర్‌సైజ్‌ చేసిందో ఆ హత్యానంతర సత్యాన్ని సత్యానంతర పోస్ట్‌మార్టంగా తేల్చడానికి అంతే ఎక్స్‌ర్‌సైజ్‌ చేసింది.

మంద్రస్వర యుద్ధం అని అమెరికన్‌ సామ్రాజ్యవాదం కనిపెట్టిన యుద్ధ వ్యూహం తెలిసిన వాళ్లకు ఇది ఆశ్చర్యం అనిపించకపోవచ్చు గాని, హిట్లర్‌ కాలపు గోబెల్స్‌ ప్రచారం గురించి ప్రచారం అయినంతగా ఈ మంద్రస్వర యుద్ధంలో భాగమైన ప్రచారం గురించి తెలియవలసిన ప్రజలకు తెలియలేదు. రెండు చోట్లా తమ లక్ష్యమైన మనుషులను చంపడం దగ్గర రాజ్యం ఆగలేదు.

ఆ ఎన్‌కౌంటర్‌ అక్కడ ముగియలేదు. రామగూడలోనయితే అది స్థల కాలాలు మారుతూ రామగూడ నుంచి పాడేరు దాకా, అక్టోబర్‌ 23 నుంచి 29 దాకా కొనసాగుతూనే ఉన్నది. అది 18, 22, 31, 39 సంఖ్యల దాకా మనం ఇవాళ మాట్లాడుకోవచ్చు గాని వాళ్లంతా మనుషులే. వారిలో 22 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు. లేదా అందులో నలుగురు మిలీషియా సభ్యులు. సాయుధులు. ప్రతిఘటిస్తూ పోరాడారు. ప్రతిఘటిస్తూ అమరులయ్యారు. మిగతా పదిహేడు మంది ఆదివాసులు. నిరాయుధులు. పట్టుకొని చిత్రహింసలు పెట్టి రాజ్యం వాళ్లను చంపింది. ప్రతిఘటిస్తూ గాయపడి తమ చేత చిక్కిన మావోయిస్టు పార్టీ సభ్యులను అట్లాగే చంపింది.

ఇది ఒక అంశం అయితే, ఆనాటి నుంచి ఇవ్వాటి వరకు ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రచారం, అసత్యాలను ప్రచారం చేసే ప్రచారం. ఎదురుదాడి. భౌతిక ఎదురుదాడి కూడా రాజ్యం ఆపలేదు. ఇవాళ అజిత్‌ దోవల్‌ డాక్ట్రిన్‌గా పేర్కొంటూ బస్తర్‌ ఐజి కల్లూరి చెప్తున్న ʹసుఫేద్‌ కాలర్‌ మావోయిస్టుʹలను ఏరివేసే ప్రచారం ఒకటి రామగూడ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా కొనసాగుతూనే ఉన్నది.

అయితే ఇటు సత్యాన్వేషకుల నుంచి కూడా ఈ సత్యానంతర దుష్ప్రచారాన్ని, అబద్ధపు ప్రచారాన్ని ఎదుర్కొనే ప్రజాపరమైన వాస్తవాలు పోరాటపరమైన వాస్తవాలు బయట పెట్టడం కూడా ఎప్పటికప్పుడు పారదర్శకంగా జరుగుతూనే ఉన్నది. ఇది కూడా ఒక ప్రత్యేకతనే. 2016 అక్టోబర్‌ 26న జగబంధు ఫోన్‌ ద్వారా తెలిపిన సమాచారం, నవంబర్‌ 2న ఆడియో ప్రకటన, నవంబర్‌ 3న మళ్లీ ఫోన్‌ సమాచారం అన్నీ నిర్దిష్టమైన వాస్తవాలు చెప్పినవే.

స్వీకరించిన వాళ్ల వైపు జాగురూకత కొరవడవచ్చు తప్ప పోరాట వాస్తవాలు యుద్ధం మధ్య నుంచి కూడా ప్రజలకు అందజేయాలనే బాధ్యత కనిపిస్తుంది. అది ʹరాంగూడ సంఘటన - ఆర్థిక, రాజకీయ నేపథ్యంʹ వివరించడంలో గాని, అమరుల తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు లేఖ రాయడంలో గాని ఆ బాధ్యత నిర్వహణలో ఎక్కడా లోపం జరగలేదు. స్వీకరించే వైపు సృజనాత్మక అన్వయం గాని, సమాచార విశ్లేషణ గాని, బిట్వీన్‌ ది లైన్స్‌ చదువుకోవడం గాని లోపిస్తే అందువల్ల ఈ సంఘటనను అర్థం చేసుకోవడంలో గందరగోళ పడితే ఇవన్నీ వాటిని పటాపంచలు చేశాయి.

ఇవాళ పులుకడిగిన సత్యం వలె ఈ సంఘటన ఒకవైపు మారణకాండగాను, (పదిహేడు మంది ఆదివాసుల విషయంలోను, చేతికి చిక్కిన పార్టీ సభ్యుల విషయంలోను), మరొకవైపు ప్రజల మీది యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా ప్రతిఘటించడంలోను ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది.

ʹమావోయిస్టు గెరిల్లాలు ఒక వీరోచిత ప్రతిఘటనతో, సమయస్ఫూర్తితో, సాహసంగా, కొందరు ప్రాణత్యాగం చేస్తూ మెజారిటీని రక్షించారని, మూడు వైపుల నుండి, ఒకవైపు మాత్రమే భూభాగం ఉండి, ఆ భూభాగం వైపు నుండే దాదాపు వెయ్యి మంది ప్రభుత్వ సాయుధ బలగాలు అత్యంత అధునాతన, శక్తిమంతమైన ఆయుధాలతో దిగ్బందించి, తప్పించుకోలేని విధంగా వారిపై కాల్పులు జరిపినప్పటికీ, సమయస్ఫూర్తితో అటు మూడు వైపుల ఉన్న నీటివైపు వెళ్లకుండా ప్రాణాలను సైతం త్యజిస్తూ, పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూనే వెళ్లిపోవడం మావోయిస్టు ప్రజా గెరిల్లా సేన పరిణతికి చిహ్నం. కొందరు ప్రాణత్యాగం చేస్తూ మెజారిటీ ప్రజా గెరిల్లా సైనికులను, పార్టీ నాయకులను, ప్రజలను కాపాడడం ఈ ఘటన ద్వారా మనకు తెలుపుతున్న విప్లవోత్తేజ స్ఫూర్తిదాయక సందేశం. ప్రభుత్వ సాయుధ బలగాలు, ఈ సంఘటనలో అన్ని విధాలా తమకే అనుకూలంగా మలుచుకొని, ఇక పూర్తి విజయం తమదేననే భరోసాతో, ఒక్కరు కూడా బతకకుండా అంతం చేయాలనే పక్కా ప్రణాళికతో దాడి మొదలుపెట్టినప్పటికీ గెరిల్లాలు సెక్యూరిటీ పరంగా పూర్తిగా అప్రమత్తతగా లేని సమయంలో ఈ దాడిని ఎదుర్కోవడం, మెజారిటీ క్యాడర్‌ను రక్షించుకోవడం ఈ ఘటన విప్లవ విజయం పట్ల భరోసాను ఇచ్చే సంఘటన అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రజలు విప్లవోద్యమంతో మమేకమై విప్లవిస్తే ఎంత అత్యంత అధునాతన ఆయుధాలు, టెక్నాలజీ కలిగిన ప్రభుత్వ సాయుధ బలగాలు ప్రజల చేతిలో ఓటమి చెందక తప్పదనే సత్యం ఈ ఘటన ద్వారా మనకు అర్థమవుతుంది.ʹʹ అని హైదరాబాద్‌ నుంచి వి. కృష్ణమూర్తి ʹవీక్షణంʹ ఫిబ్రవరి 2017 సంచికలో రాసిన లేఖ కూడా ఈ ఘటనకు సంబంధించిన ప్రజానుకూల అంశానికి ఉదాహరణలు.

అందువల్లన రాజ్యం తన పిరికితనంతోటి పిచ్చెత్తినట్లుగా ఎదురుదాడికి, దుష్ప్రచారానికి పూనూకుంటున్నది.

కేరళలోని నీలాంబుర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో అమరులైన ఇద్దరు కామ్రేడ్స్‌ ఎట్లా ఎదురుపడి లేదా పోలీసులకు చిక్కి అమరులయ్యారో పార్టీ వైపు నుంచి మనకేమీ సమాచారం లేదు. నిజ నిర్ధారణకు వెళ్లినవాళ్లు అనారోగ్యంతో ఉన్న ఇద్దరు నిరాయుధంగా దొరికారని చెప్పిన అంశాలు తప్ప ఎఒబి ఎన్‌కౌంటర్‌ విషయంలో వచ్చినట్లుగా అధికార ప్రకటన ఏదీ లేదు. ముఖ్యంగా అజిత విషయంలో ఆమె నిరాయుధురాలు అని, ఆమె శరీరంలో చాలా బుల్లెట్లు దూరాయని సోషల్‌ మీడియాలో ఒక తమిళ కవయిత్రి పెట్టిన వ్యాఖ్య తప్ప నాకు వేరే ఆధారాలు లేవు.

ఆ ఇద్దరి మృతదేహాలను కోజీకోడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చిన దగ్గర నుంచి ప్రజల స్పందన ఎంతగా ఉన్నదో భయంతో శత్రువు ప్రతిచర్యలు అట్లా ఉన్నాయి. విప్లవకారుల మృతదేహాలను చూడడానికీ, స్వాధీనం చేసుకోవడానికీ వచ్చిన ప్రజలను లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టడం, నాయకత్వం వహించిన వృద్ధ నేత ఎం.ఎన్‌. రావుణ్నిని అరెస్టు చేసి ఇప్పటికీ యుఎపిఎ కింద జైల్లో పెట్టడం, బహిరంగ తీర్పు చెప్పవలసిన కోర్టు మాటల్లో ఒకటీ రాతల్లో ఒకటీ నిజాలను మార్పు చేయడం ప్రత్యక్షంగా రాజ్యానికి సంబంధించిన పిరికితనం. కుట్రపూరిత స్వభావం అయితే, ఇద్దరి మృతదేహాల అంత్యక్రియల సందర్భంగా సంఘ్‌ పరివార్‌ వాళ్ల దాడులు, అభ్యంతరాలు, నినాదాలు రాజ్యంలో భాగమైన బ్రాహ్మణీయ హిందుత్వ స్వభావాన్ని బట్టబయలు చేశాయి. ముఖ్యంగా మార్క్సిస్ట్‌ పార్టీ ప్రభుత్వం ఉన్న కేరళలో. ఈ ముఖ్యమంత్రి మీదనే ఆయన ఇంకా ముఖ్యమంత్రి కాకముందు సిపిఎం ఫ్యాక్షన్‌ లీడర్‌గా, కేరళలో తన ʹబషాయి టుడుʹను చంపిన నేరస్తునిగా మహాశ్వేతా దేవి ఆరోపించింది.

చివరకు నీలాంబుర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలానికి నిజనిర్ధారణకు వెళ్లిన సిడిఆర్‌ఒ న్యాయవాదుల బృందాన్ని సంఘ్‌ పరివార్‌ అడ్డుకోవడం, తమ అనుమతి లేకుండా అడవిలోకి ఎవరూ పోవడానికి వీల్లేదనే ఫారెస్ట్‌ అధికారులు, కలెక్టర్‌ కూడా అభ్యంతరం చెప్పడం ఎంతగా వ్యవస్థ, రాజ్యం కలగలిసి సత్యాన్వేషణను అడ్డుకుంటున్నాయో ఒక నిదర్శనం.

కనుకనే మనుషులను చంపే వేట వేటతో ముగియలేదు. వేట కోసం ఎంత వ్యూహం, ఎంత పథకం ఉంటుందో, వేట అనంతరం కూడా హత శరీరాలు వేనోళ్ల సత్యాన్ని ప్రకటించకుండా పాతర పెట్టడానికో, దహించి వేయడానికో అంత వ్యూహం, అన్ని పథకాలు ఉంటాయని ఈ రెండు ఎన్‌కౌంటర్‌లు, ఎన్‌కౌంటరనంతర ప్రచారాలు మనకు స్పష్టం చేస్తున్నాయి.

మనం ప్రతి సందర్భంలో చెప్పుకుంటున్నట్లుగా ఇది ఇక్కడ ముగిసింది కాదు. ముగుస్తుందనీ కాదు. ఇది మొదటిది కాదు, చివరిదీ కాదు. రోజూ చూస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ నిలబడి ఒకసారి వెనక్కి తలతిప్పి ముందుకు చాలా ముందుకు సత్యాన్వేషకులు అసహజ మరణాలు పొందడానికి వీల్లేని ఒక ఆదర్శ సమాజ ఆవిష్కరణలోకి చూడడానికి ఈ స్థలకాలాలు ఏమైనా ఇక్కడ పాదం మోపి, ఇక్కడ అక్షరం మోపి ఆలోచించడానికి దోహదం చేస్తాయనే చిన్న ఆశతో ఈ సంకలనం. ఇది అసంపూర్ణం.

1857లో ప్రారంభమై ఇంకా పరిపూర్తి కాని ప్రజాస్వామిక విప్లవం నూతన ప్రజాస్వామిక విప్లవంలోకి గుణాత్మకంగా పరిణమించిన నాడు కూడా ఆగని ఒక సత్యాన్వేషణ ఇది.

ఏటికి ఎదురీదినట్టు, పోస్ట్‌ ట్రూత్‌ కాలంలో చేస్తున్న పోస్ట్‌మార్టం ఇది. మనంగా చేస్తున్న పోస్ట్‌మార్టం. సత్యాన్వేషకులుగా చేస్తున్న పోస్ట్‌మార్టం. సత్యాన్వేషకులుగా కూడా ఇంకా మనకన్నీ వాస్తవాలు, పరికరాలు, అధ్యయనాలు, చర్చలు, పరిశోధనలు పారదర్శకంగా చేసే అవకాశం లేక, ముగియక ముందే చేస్తున్న పోస్ట్‌మార్టం.

మనవైపు నుంచి చేసే ఈ పోస్ట్‌మార్టంలో సదుద్దేశ్యాలే ఉండవచ్చు కాని, సత్యాన్వేషణకు సంబంధించిన సమగ్రత్వం ఉండే అవకాశం లేదు. ఇందులో సబ్జెక్టివ్‌ చాలా ఉండవచ్చు. ఆబ్జెక్టివ్‌గా ఉండాలనే ప్రయత్నం మాత్రమే ఉండవచ్చు. చాలా లోపాలు ఉండవచ్చు. వాటినన్నిటినీ అధిగమించి పాఠకులు చదువుకుంటారని ఆశిస్తూ...

(పోస్ట్‌ స్క్రిప్ట్‌: ఫిబ్రవరి 1న, బుధవారం సాయంకాలం నాలుగు గంటలకు కోరాపుట్‌ జిల్లాలో జైపూర్‌-సాలూర్‌ మధ్య 26వ నంబర్‌ జాతీయ రహదారిపై ముంగిరిగుమ్మ వద్ద సిపిఐ (మావోయిస్టు)లు మందుపాతరతో ఒక కల్వర్టు పేల్చేశారని, అందులో ఎనిమిది మంది బిఎస్‌ఎఫ్‌ ట్రైనీ జవాన్‌లు చనిపోయారని వార్త.)

ఈ పుస్త‌కం ఫిబ్ర‌వ‌రి 11, 12 తేదీల్లో ప్రొద్దుటూరు, క‌డ‌ప జిల్లాలో జ‌రిగే విర‌సం సాహిత్య పాఠ‌శాల‌లో ఆవిష్క‌రించ‌బ‌డ‌తుంది.

No. of visitors : 1064
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

Bhoomaiah, Kishta Goud, Bhabani Da and Sumanta - Down Memory Lane

Varavara Rao | 09.06.2017 05:08:54pm

On 25th December early morning hours before unlocking the cells and barracks, the news spread that in the wee hours of 26th December, Bhoomaiah and Kishta G...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •