విరసం 25వ మహాసభల థీంగా మంద్రస్థాయి యుధ్ధం అనే అంశాన్ని ఎందుకు తీసుకోవలసి వచ్చింది? ఏమిటీ మంద్రస్థాయి యుధ్ధం అంటే?
యుద్ధం అనగానే మనకు సైనిక మోహరింపులు, భౌతిక దాడులు గుర్తుకు వస్తాయి. ఆ రకంగానే చూస్తే మంద్రస్థాయి యుద్ధం అంటే అర్థం తక్కువ స్థాయి యుద్ధమని. అయితే ఇది కేవలం సైనిక సంబంధమైనదే కాదు. ఇది దీర్ఘకాలిక సైనిక రాజకీయార్థిక సాంస్కృతిక వ్యూహం. అమెరికన్ సామ్రాజ్యవాదం, అంతర్జాతీయ పెట్టుబడి రూపొందించిన యుద్ధవ్యూహానికి పెట్టినపేరే ʹలో ఇంటెన్సిటీ కాన్ ఫ్లిక్ట్ʹ.
ఈ రోజు ఆత్మహత్యలు, హిందుత్వ హత్యల రూపంలో మన దేశంలో సామాజిక సంక్షోభం అత్యంత తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ఆత్మహత్యలు సామాజికార్థిక రంగాల్లో హీనస్థితిని తెలియజేస్తే, మతోన్మాద హత్యలు మన సాంస్కృతిక, భావజాల స్థాయిని వ్యక్తం చేస్తున్నాయి. వేటికవి విడివిడిగా చర్చకు వచ్చే ఈ వ్యక్తీకరణలన్నిటి వెనక ఒక కామన్ త్రెడ్ ఉంది. దేశ రాజకీయార్థిక సాంస్కృతిక విధానాలను నిర్దేశించే పాలకవర్గ ప్రయోజనాలున్నాయి. అవి సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రయోజనాలతో కలగలిసి ఉన్నాయి. వీటి వెనక లో ఇంటెన్సిటీ కాన్ ఫ్లిక్ట్ ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ఉంది. ప్రత్యక్షంగా ఈ యుద్ధ తంత్రాన్ని భారత ప్రభుత్వం దండకారణ్యంలో అమలు చేస్తున్నది. పరోక్షంగా అది ప్రజలపై, మనిషి మనిషిపై రాజకీయ ఆర్థిక సాంస్కృతిక యుద్ధం చేస్తున్నది. ఈ రోజు మనమంతా మంద్రస్థాయి యుధ్ధంలో ఉన్నాం. ఒక్క మావోయిస్టులే కాదు దేశం మొత్తం దాని ఎదుర్కొంటోంది. అది మనిషి మీద యుద్ధం. మనిషిని మనిషిగా, సామాజిక మానవుడిగా/ మానవిగా మిగలనివ్వని యుద్ధం.
మంద్రస్థాయి యుద్ధ స్వభావం ఎలా ఉంటుందంటే అది మన మానసిక ప్రపంచాన్ని మొత్తం స్వాధీనం చేసుకుంటుంది. తెలియకుండానే మనం దానికి లోబడిపోతాము. చిన్న ఉదాహరణ తీసుకుంటే.. ఇటీవలి వివేక్, సూర్యంల ఎన్ కౌంటర్ సందర్భంలో తెలుగు సమాజంలోని ఆలోచనాపరులు ఒక వాదనను తీసుకొచ్చారు. ఇరవై ఏళ్లయినా నిండని పిల్లలను ఉద్యమం బలితీసుకుంటున్నది అని. బలితీసుకున్నది రాజ్యం కాదా? ఎన్ కౌంటర్ అంటేనే ఏకపక్ష కాల్పులన్నది స్థిరపడిన అర్థం. ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు. పట్టుకునే అవకాశం ఉన్నా చిన్న పిల్లలని ఎలా కాల్చి చంపారు అనే ప్రశ్న ఎందుకు రాలేదు. ఇది పాత ప్రశ్నే కదా? అరెస్టు చేసి వాళ్ళను మీరనుకునే విధంగా సంస్కరించి వాళ్ళ భవిష్యత్తును కాపాడొచ్చు కదా! ఈ ప్రశ్న ఏ ప్రాధాన్యతల, ప్రభావాల మరుగున పడిపోయింది? విద్యార్థుల కెరీర్ చుట్టూ ఉన్న భ్రమాజనిత వ్యూహంలో మేధావులు కూడా పడిపోయారా? విద్యార్థులు ఉద్యమాలకు దూరమవుతున్నారని, స్వార్థం, సంకుచిత భావాల్లోకి కుచించుకు పోతున్నారని ఒక వైపు వాదిస్తూ ఉంటారు. భగత్ సింగ్ నే కాదు, క్యాంపస్ లలో జార్జిరెడ్డి, జనార్ధన్ ల కాలాన్ని ప్రభావాన్ని గుర్తు చేస్తుంటారు. అటువంటిది వాళ్ళు బూర్జువా భావజాలానికి లోనుకావడం చూడండి. రాజ్యాన్ని ప్రశ్నించడానికి వెనుకాడే సమాజం, రాజ్యం వ్యూహంలో చిక్కుకుపోయిందని అర్థం. ʹప్రోగ్రామింగ్ ది మైండ్ʹ అనే సామ్రాజ్యవాద వ్యూహం అది.
ఇది రూపొందే సమయంలోనే ఆఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సోవియట్ సైన్యంతో తలపడుతూ ఒక ప్రయోగం చేస్తోంది. తాలిబాన్ పుట్టుక, ఇస్లాం తీవ్రవాద బూచీ చూపి అమెరికా చేసిన దురాక్రమణ యుద్ధాల కొనసాగింపు నేటికీ నడుస్తున్న చరిత్రే. సోవియట్ పోయాక అమెరికా ప్రయత్నపూర్వకంగా ఒక శత్రువును తయారు చేసుకుంది. ట్విన్ టవర్స్ వెనక ట్రూత్ ఏమిటని రాసిన పరిశోధనాత్మక కథనాలు చదివితే గగుర్పాటు కలుగుతుంది.
మంద్రస్థాయి యుద్ధవ్యూహం (1980ల్లో) నిర్దిష్టంగా రూపొందక ముందే రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక (1954లో) అమెరికా, యూరప్ పెట్టుబడిదారులు బిల్డర్ బెర్గ్ (Bilderberg group) గ్రూపుగా ఏర్పడి పెట్టుబడుల విస్తరణకు రిస్క్ లేకుండా, తమలో తాము యుద్ధాలు చేసుకోకుండా ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకున్నారు. కమ్యూనిస్టు ప్రభావం అత్యధికంగా ఉన్న ఒత్తిడి కూడా ఈ వ్యూహం రూపొందించుకోడానికి ఒక కారణం. ఈ గ్రూపు ఐదు వందల సంవత్సరాల ఎజెండాతో రూపొందిందని చెప్తారు. వీళ్ళు ఆనాడే ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా గ్లోబల్ గవర్నెన్స్ ను స్థాపించాలని తీర్మానించుకున్నారు. సామరస్యంగా మార్కెట్లను పంచుకోవాలనుకున్నారు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూటీవో, నాటో, ఇంటర్ పోల్వగైరాలు గ్లోబల్ గవర్నెన్స్ స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్నవే.
సరే, కమ్యూనిస్టులను అంతం చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా అనుకున్నారు. ఇంక వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేయకుండా మూడో ప్రపంచ దేశాల్లో వైరుధ్యాలు పరిష్కరించుకోవాలని అనుకున్నారు. అట్లా యుద్ధక్షేత్రాలు మారాయి. పెదదేశాలే సామ్రాజ్యవాద యుద్ధ క్షేత్రాలు. ఇజ్రాయెల్ ను స్థాపించడం వెనక బలమైన సైనిక, ఆర్థిక వ్యూహం ఉంది. అక్కడి నుండి వనరులున్న ముస్లిం దేశాల్లో, దేశాలతో యుద్ధాలు ఎట్లా జరుగున్నాయో మనం చూస్తున్నాం. పెట్టుబడిదారీ మీడియా ఏ భావజాలాన్ని ప్రచారం చేయాలో, ఏ వార్తలు చెప్పాలో, ఏ అభిప్రాయం దిశగా జనాన్ని నడిపించాలో ఎటువంటి శషబిషలు లేని స్పష్టమైన విధానం వారికి ఉంది. బిల్డర్ బర్గ్ గ్రూపులో మీడియా భాగస్వామిగా ఉన్న సి.ఎస్.బి.ఎన్.సంస్థ మాజీ అధినేత రిచర్డ్ సలాంట్ వంటివాళ్లు ʹ మీడియా పని జనానికి ఏం కావాలో అది ఇవ్వడం కాదు, మనం ఏది ఇవ్వాలో అది జనం తీసుకునేలా చేయడంʹ అని స్పష్టంగా చెప్తారు. ఇటీవలి సంవత్సరాలలో బిల్డెన్ బర్గ్ గ్రూపు గురించి పాశ్చాత్య దేశాల్లో పుస్తకాలు, వ్యాసాలు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. వాటిని అధ్యయనం చేయొచ్చు.
మంద్రస్థాయి యుద్ధవ్యూహం రూపొందడం వెనక నేపథ్యం ఇది. ఎల్ ఐ సీ వ్యూహం చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే ʹభావజాల యుద్ధం గెలవగలిగితే మరే యుద్ధమూ కష్టం కాదుʹ అని. ఎల్ ఐ సీ మొత్తంగా నాలుగు ముఖాల వ్యూహం. ఆర్థిక, రాజకీయ, సామాజిక (సాంస్కృతిక, భావజాల సంబంధమైన), సైనిక వ్యూహాల్లో చివరిది అవసరమైనప్పుడు మాత్రమే నేరుగా రంగంలోకి వస్తుంది.
ఎల్ ఐ సీ ఎలా అమలవుతుంది?
సామ్రాజ్యవాదం దేశాల ఆర్థిక వ్యవస్థల్లో నేరుగా జోక్యం చేసుకుని దాని నడుములు విరగ్గొట్టడంతో పాటు రాజకీయంగా దానికి ఎదురు లేకుండా చేసుకుంటుంది. కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటుంది. విద్రోహ కార్యకలాపాలు చేపడుతుంది. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదు అని సైద్ధాంతిక ప్రచారం చేస్తుంది. కమ్యూనిజానికి కాలం చెల్లింది అని, సోషలిజం అంటే నియతృత్వం అని దిష్ప్రచారానికి అదే పనిగా కొంతమంది అనుకూల మేధావులను తయారు చేసుకుంటుంది. నిరంత సంక్షోభాలతోనే నడుస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలను కాదు, అది సోషలిస్టు రాజ్యాల వైఫల్యాలను ఊదరగొడుతుంది. ఉదాహరణకు అయాన్ రాండ్ అటువంటి ఒక ఫిలాసఫర్. ఆమె ఫిలాసఫీ అధ్యయనం కోసం అమెరికా యూనివర్సిటీల్లో శాఖలు ఉన్నాయి. స్వేచ్చా మార్కెట్ సిద్ధాంతానికి ఆమె ఒక ఛాంపియన్.
సోవియట్ యూనియన్ సోషలిస్టు దేశంగా, అమెరికా వైరి వర్గంగా ఉన్న రోజుల్లో వచ్చిన హాలీవుడ్ సినిమాలన్నిటిలోనూ రష్యా ఒక విలన్. అమెరికా ఏమో ప్రపంచాన్ని రక్షించే హీరో. ఇప్పుడు తీవ్రవాదం అనే విలన్ని అమెరికానే స్వయంగా తయారు చేసుకుందనుకోండి!
ఈ రకమైన సైద్ధాంతిక, సాంస్కృతిక దాడి ఒక వైపు చేస్తూ, ఉద్యమాలను అణచివేయడం, విచ్ఛిన్నం చేయడం, మళ్ళీ తలెత్తకుండా చూసుకోవడం కోసం సైనిక, సాంస్కృతిక, సైద్ధాంతిక దాడులు చేయడం సామ్రాజ్యవాద వ్యూహంలో ఉంటుంది.
స్వాతంత్రోద్యమంలో మధ్యతరగతిని దారి మళ్లించి రాజీ మార్గం చేపట్టేలా జాతీయ కాంగ్రెసును ఏర్పాటు చేసింది. (అది ఆహింస ముసుగులో అంతులేని రాజ్యహింసకు ఆజ్యం పోసింది.) స్పష్టమైన రాజకీయ దృక్పథంతో స్వాతంత్రోద్యమం చేపట్టిన విప్లవకారులకు (గదర్ వీరులు, భగత్ సింగ్ వంటి వాళ్ళు) వ్యతిరేకంగా ప్రజలను నిలబెట్టే ప్రయత్నం చేసింది.
అధికార మార్పిడి తర్వాత ఈ యుద్ధతంత్రాన్ని బ్రిటీషు వారికంటే గొప్పగా భారత ప్రభుత్వం అమలు చేసింది. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో అది చేయని ఘోరం లేదు. ఉదా.కాశ్మీర్ ప్రజల స్వతంత్ర పోరాటాన్ని దెబ్బ తీయడానికి అది నకిలీ పోరాట సంస్థలను ఏర్పాటు చేసింది. ఉద్యమం నుండి లౌకికవాద కాశ్మీరీలను విడగొట్టింది. కాశ్మీరీ ముస్లింల మీదికి కాశ్మీరీ పండిట్లను రెచ్చగొట్టింది. వారికి శిక్షణనిచ్చి, ఆయుధాలిచ్చి హంతక ముఠాలుగా తయారుచేసింది. కాశ్మీర్ ను ఒక విధ్వంస ప్రయోగానికి వేదిక చేసి భారతదేశం లోపల అది ప్రచారం చేసిన అబద్ధాలను చాలామంది లౌకికప్రజాస్వామిక వాదులూ నమ్ముతున్నారు.
నక్సలైట్ ఉద్యమం మీద కోవర్టు ప్రయోగాల దగ్గరినుండి సల్వాజుడుమ్ వంటి ప్రతీఘాతుక హంతక సైన్యం, ఇప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ దాకా అమెరికా నిఘా సంస్థల సలహా, సహకారాలతో భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. దండకారణ్యంలో అమెరికా సిఐఎ శిక్షణ ఇస్తున్న సైనిక స్కూళ్ళు ఉన్నాయి. అది ఏ లక్ష్యంతో దండకారణ్యం వైపు గురి చూస్తోంది? ఆర్థిక, రాజకీయ లక్ష్యాలు రెండూ ఉన్నాయి- సామ్రాజ్యవాద మార్కెట్ కోసం వనరుల దోపిడి, మావోయిస్టు ప్రత్యామ్యాయ రాజకీయాలను నిర్మూలించడం.
భారతదేశం అభివృద్ధి శిఖరాలను అందుకుంటోందని, సూపర్ పవర్ గా అవతరిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. ఏ యంగ్ ఇండియా గురించి గొప్పగా మాట్లాడుతున్నారో ఆ యంగ్ ఇండియా ప్రపంచంలోనే అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతలో మొదటి స్థానంలో ఉంది. 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు ఏటా ప్రతి లక్ష మందిలో 30-40 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందులో కూడా ఎక్కువ మంది విద్యార్థులే.. 2013లో 2,471 మండి పరీక్షల్లో విఫలమైందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఒక సర్వే తేల్చింది.
ఒక సమాజ వర్తమానమూ, భవిష్యత్తూ యువజనులే. వారు నిస్సహాయంగా చనిపోవడానికి కారణాలు ఎక్కడ వెతకాలి? చాలా సాధారంగా విద్యావ్యవస్థ, కుటుంబంలో వెతుకుతాం. ఎందుకంటే శిశువు సామాజికుడిగా ఎదిగేది కుటుంబం, విద్యావ్యవస్థ పునాది మీదనే. విద్య మార్కెట్ సరుకయ్యింది. కుటుంబం, తల్లిదండ్రులు కూడా మార్కెట్ భావజాలానికి లోనూ కావడం. పిల్లలను సామాజికులుగా తయారు చేయడమా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా తయారు చేయడమా అనేది మనలాంటి వాళ్ళ ప్రశ్న. కార్పొరేట్ విద్య తప్ప భవిష్యత్తుకు ప్రత్యమ్నాయం ఉందా తల్లిదండ్రులు అని అడుగుతారు. చాలా సింపుల్ గా బి.ఏ. చేస్తే ఉదోగమొస్తుందా, బీటెక్ చేస్తే ఉద్యోగమొస్తుందా అని అడుగుతారు. ఈ ఆలోచనాధోరణి సామాజంలో రావడానికి భౌతిక పరిస్థితులు ఉన్నాయి.
విద్య ఎందుకు అనంటే ఏమీ తెలియని పిల్లలను జ్ఞావంతులైన మానవులుగా తయారుచేయడానికి, తద్వారా మంచి సమాజాన్ని నిర్మించడానికి అని చెప్పాలి. కానీ ఎవరినైనా విద్యా ఎందుకు ఆనంటే ఉద్యోగం రావడానికి అనంటారు. ఉత్పత్తిలో భాగం కావడానికి, పని చేయడానికి స్కిల్స్ అవసరం. కానీ విద్య అది మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు చరిత్ర ఎందుకు, సామాజిక శాస్త్రాలు ఎందుకు అని మాట్లాడాడు. బూర్జువా వ్యవస్థ విద్యకు కెరీర్ కు, ముడివేసింది. కెరీరిజం ఇప్పుడు ఒక భావజాలం.
దీన్ని పాలక వర్గాలు ఎలా ఫ్రేమ్ చేస్తాయో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. వియత్నాం యుద్ధ సమయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రదర్శనల్లో పాల్గొన్నారు (అమెరికా విద్యార్థులే). విద్యార్థుల్ని ఉద్యమాలకు ఎట్లా దూరం చేయాలా అన్న ఆలోచన వచ్చింది. విద్యార్థులు నిరంతరం పుస్తకాల్లో, పరీక్షల్లో మునిగిపోయి సామాజిక అంశాల నుండి దూరంగా ఉండాలి. పాలక వర్గ భావజాలాన్ని మాత్రమే, ఆ పరిధిలో ఉండే జ్ఞానం మాత్రమే పొందాలి. ఇలాంటి ఆలోచనల నుండే అస్తమానం పరీక్షలు ఉండే సెమిస్టర్ విధానం వచ్చింది. విశ్వవిద్యాలయాల అర్థమే మారిపోయింది. విద్యార్థుల ప్రపంచం కుచించుకుపోయింది.
మన సమాజంలో పోటీ పరీక్షలు విద్యార్థులను ఎట్లా మానసికంగా నియంత్రిస్తున్నాయో, వారి జ్ఞానాన్ని ఏ పరిధుల్లో ఉంచుతున్నాయో చూస్తున్నాం. విద్య మార్కెట్ సరుకవ్వడం సమాజానికి ఎంత విషాద అనుభవాల నిచ్చిందో పాలకులకు అంత అనుకూల ఫలితాలనిచ్చింది. విద్యార్థులు ఉద్యమాలకు దూరమయ్యారు. పాలకవర్గ భావజాలాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు. ప్రైవేట్/ ఫారిన్ విశ్వవిద్యాలయాల బిల్లు దాన్ని మరింత ముందుకు తీసుకుపోనున్నది.
మంద్రస్థాయి యుద్ధ ఆర్థిక పార్శ్వం సామ్రాజ్యవాద మార్కెట్ దాడి. నిజానికి ఇదే దాని ప్రధాన లక్ష్యం. సామ్రాజ్యవాద పెట్టుబడి ఎట్లా దేశ ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకొని, నాశనం చేసి దాని పట్టు నిలుపుకుంటుందో నూతన ఆర్థిక విధానాల తర్వాత మనదేశ ఆర్థిక వ్యవస్థ ఏ మార్పులకు లోనైదో చూస్తే అర్థమవుతుంది. కనీసం పాతికేళ్లుగా దీని గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనదేశంలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి రంగం. అత్యధిక శాతం ప్రజల జీవనాధారం. దాని స్థితి ఏమిటంటే అది వినియోగ మార్కెట్ గా సామ్రాజ్యవాద పెట్టుబడి చేతుల్లో చిక్కింది. దేశంలో అపరిష్కృతంగా వదిలేసిన భూమి సమస్య అలా ఉండగా ఉత్పాదక రంగంగా అది బలహీన పడింది. దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ , ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, అటు ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండేలా సంస్కరణలు ఉండాలి. అలా కాక ఇది బహుళజాతి కంపెనీలకు విత్తన మార్కెట్ గా, పురుగుమందుల మార్కెట్ గా ప్రయోగశాల చేయబడింది. ఫలితంగానే లక్షలాది రైతుల ఆత్మహత్యలు.
మనదేశంలో భూపోరాటాలు, రైతుకూలీ పోరాటాలు భూమి సమస్యను అడ్రెస్ చేశాయి. 90లలో వ్యవసాయ రంగం కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొదటి దశలో తెలంగాణలో విప్లవోద్యమం రైతాంగ సమితులు పెట్టి రైతుల సమస్యలను అడ్రెస్ చేసింది. అది మినహాయిస్తే రైతులకు సంఘటిత ఉద్యమాలు లేవు.
రైతుల సమస్యలు ఎన్నికల వాగ్దానాలకు పనికొస్తున్నాయి తప్ప వాస్తవికంగా వాటిని అడ్రెస్ చేసే ఉద్యమాలు ఉంటే రైతులు పోరాటాల్లో ఉంటారు. ఇలా పిట్టల్లా రాలిపోరు. మంద్రస్థాయి యుద్ధం మనుషులు తమను తామే అంతం చేసుకునేలా చేస్తుంది.
బ్రాహ్మణీయ హిందూ సాంస్కృతిక జాతీయవాదం ఒక్క సంఘపరివార్ భావజామే కాదు. దాన్ని మొత్తంగా భారత పాకవర్గాల భావజాలంగా అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం, కులం, అర్ధవలస, అర్ధభూస్వామ్య ఉత్పత్తి సంబంధాల మీద ఆధారపడి పునరుత్పత్తి అవుతున్నాయి. అందువల్ల వలసానంతరం ఏర్పడ్డ భారత రిపబ్లిక్ సెక్యురిజాన్ని వక్రీకరించిన అర్థంలో స్థిరపరిచింది. రాజ్యం చేతిలో మతం ఒక ఆయుధంగా ఉంటూ వచ్చింది. మన వ్యవస్థ పనితీరులో సెక్యులరిజం నిజమైన అర్థంలో భాగం కాలేదు. వలస పాలన కానీ, ప్రధాన స్రవంతిగా నడిచిన కాంగ్రెసు రాజకీయాలు కానీ దీని ఫ్యూడల్ శక్తులతో జతకట్టి నడిచాయి. ఇక్కడ మెజారిటీ మతం అనబడేది కులవ్యవస్థ, వర్ణధర్మం కాక మరోటి కాదు. మతం జాతి ఐడెంటిటీగా జాతీయోద్యమంలో ముందుకొచ్చింది. మామూలుగా జాతి భావన బూర్జువా ఆధునికత నుండి వచ్చింది. ఇక్కడ అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఈ మతం.. అంటే సనాతన ధర్మంతో జతగట్టిన జాతి కాన్సెప్ట్ సంఘపరివార్ విస్తరణకు, ఎదుగుదలకు అన్ని అవకాశాలు ఇచ్చింది. కాంగ్రెస్ గానీ, మరే పాలకపక్ష పార్టీ గానీ దాన్ని అడ్డుకోవడం మాట అటుంచితే, దానికి ప్రత్యక్ష, పరోక్ష సహకారాలను అందించాయి. మతం రెడీమేడ్ ఆయుధం గనక స్వయంగా కూడా అవి హిందుత్వ ఆయుధాన్ని ధరించాయి. కశ్మీర్ జాతి అణచివేత, సిక్కుల ఊచకోత మొదలుకొని అయోధ్య నుండి ముజఫర్‌నగర్ దాకా అటువంటి అనేక ఉదాహరణున్నాయి. ప్రజాస్వామ్యంలో అతి ప్రధాన అంశం భిన్నత్వాన్ని అంగీకరించి గౌరవించడం. భిన్న సమూహాల్ని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడం. కానీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భిన్నత్వాన్ని వాడుకునే ఓట్ల రాజకీయాల సంకుచిత పరిధిలోనే ఉండిపోయింది. అది ప్రజల నిర్ణాయకశక్తిని ఎప్పుడూ వెలికితీయదు. ఈ స్థితిలో ఉన్న సమాజంలో పాకవర్గ అనుకూల మెజారిటీ భావజాలాన్ని తయారుచేయడం, లేదా పురుత్పత్తి చేయడం కష్టం కాదు. నిరంతరం దాన్ని జనం మెదళ్ళలోకి చొప్పిస్తూ సమయానుకూంగా దాన్ని ఎగదోస్తూ ఉండటం కూడా ప్రతీఘాతుక యుద్ధవ్యూహమే. భారతదేశ రాజకీయార్థిక వ్యవస్థ కులవ్యవస్థను, మతతత్వ భావజాలాన్ని పునరుత్పత్తి చేస్తూనే ఉంది.
సామ్రాజ్యవాదం వలసవాదంగా వచ్చి మన దేశంలోని సనాతన ధర్మాన్ని, హిందుత్వను వాడుకున్నట్లే.. వలసానంతరం కూడా ప్రపంచ వ్యాప్తంగా మతంతో దానికి విడదీయలేని సంబంధం ఏర్పడిరది. భారత బూర్జువా వర్గం సామ్రాజ్యవాద ఆర్థిక ఆదేశాలకు లోబడి ఉంటుంది కాబట్టి దేశీయ సంస్కృతి గురించి ఎంత మాట్లాడినా సంఘపరివార్‌కు సామ్రాజ్యవాద మార్కెట్ పట్ల అనుకూత ఎక్కువ. ఎంతగానంటే సంఘపరివార్ రాజకీయ ముఖానికి అతివాద రూపమైన మోడీ కార్పొరేట్ ఇండియాకు, బహిళజాతి పెట్టుబడుకు ప్రతినిధి అయ్యాడు. అటు బహుళజాతి మార్కెట్ తన లక్ష్యాను, ఇటు సంఘపరివార్ తన సాంస్కృతిక జాతీయవాద ఎజెండాను మోడీ ద్వారా వేగవంతంగా ముందుకు కదిలించాలని అనుకున్నాయి. దేని పాత్ర అది నిర్వర్తిస్తూ వస్తోంది. దేశమంతా ఒక పక్క అసహనం గురించి చర్చ జరుగుతోంటే, మరోవైపు పెద్ద చర్చ కాకుండానే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేల ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోయింది. అటువంటి కనీసం పది పదిహేను నిర్ణయాలు ఒక్క ఏడాది కాలంలోనే కనీస చర్చ లేకుండానే పార్లమెంటులో పాసైపోయాయి. సంఘపరివార్, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు ఒక్కచోటే కలిసిన స్థితికి చేరుకునేసరికి హిందుత్వ హత్యలు, దేశవ్యాప్తంగా లక్షలాది రైతు ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. వ్యవస్థ సంక్షోభానికి రెండూ సాంస్కృతిక, ఆర్థిక ప్రతిబింబాలు.
ముందే చెప్పినట్లు హిందూ మతం అంటే సారాంశంలో కులవ్యవస్థనే. కుల వ్యవస్థ సమాజాన్ని విడదీస్తుంది. జాతి భావన మరి ఎక్కడి నుండి వస్తుంది? దానికి వీళ్ళు ముస్లిం వ్యతిరేకతను తీసుకున్నారు. కనీసం సామ్రాజ్యవాద వ్యతిరేకత కూడా కాదు. ఎందుకంటే సామ్రాజ్యవాద ఆర్థిక ప్రయోజాలతో వీళ్ళ ప్రయోజనాలు కలుస్తాయి. మారో వైపు వీళ్ళ మతం సాంస్కృతిక పునాది కులవ్యవస్థలో ఉంది. అదే విధంగా మార్కెట్ కూడా కులవ్యవస్థను వాడుకుంటుంది. వీళ్ళు కూడా స్వేచ్ఛా మార్కెట్, స్వేచ్ఛాయుత పోటీ అనే బూర్జువా కన్సెప్ట్ ను, స్థూలంగా పాలక వర్గ కాన్సెప్ట్ ను రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంగా తీసుకొచ్చారు. జనంలో నరనారానా జీర్ణించుకున్న నిచ్చెనమెట్ల కుల భావన ఫ్యూడల్ అవశేషంగా కాదు, మార్కెట్ తో కూడా కలగలిసి నడుస్తున్నది. ప్రజల ప్రాతినిధ్యం, సోషలిజం పోయి సంక్షేమ రాజ్యం అన్నారు. ఇప్పుడు సంక్షేమ రాజ్య భావన కూడా పోయింది కాబట్టి కొత్త విశ్వవిద్యాలయాల్లో దళితులకు ప్రోత్సాహకాలు.. స్టైఫడ్ వంటివి అవసరం లేదు, లేదా ఉండవు అని చెప్తున్నారు. ఇక హిందుత్వ సంస్కృతిగా బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతిని ఆరెస్సెస్ ఎలా చొప్పిస్తూ వస్తున్నాదో గోవధ నిషేధం దగ్గరి నుండి నేరుగా రాజకీయాలు మాట్లాడే పీఠాధిపతులదాకా మనం చూస్తున్నాం.
హిందుత్వతో సాంస్కృతిక పోరాటం తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే హిందుత్వ ఏ వర్గ భావజాలానికి పుడుతున్నదో ఆ వర్గంతో రాజకీయ పోరాటం లేకుండా కేవలం సాంస్కృతిక పోరాటం మాత్రమే సరిపోదు. అది కూడా వర్గపోరాటంలో భాగంగా జరగాలి. పాలకవర్గ భావజాలమైన మతంతో పోరాటం పాలకవర్గాలతో పోరాటమే.
ప్రజాస్వామిక పోరాటాలు/వర్గపోరాటాలు ప్రజాస్వామిక సంస్కృతిని, విలువల్ని ఉత్పత్తి చేస్తాయి. నూతన సంస్కృతి, విలువలు వాటంతటవి రావు. అవి పెంపొందించకుండా సమాజంలో హిందుత్వ ప్రభావాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మౌలిక మార్పు దిశగా జరిగే పోరాటాలు పాత భావాలతో ఘర్షనాత్మకంగా డీకొట్టాలి.
ప్రజల రాజకీయాధికారం ఏర్పడిన/ఏర్పడుతున్న దండకారణ్యంలో విద్యా, వ్యవసాయం, సంస్కృతి ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికగా ఉన్నాయి. దండకారణ్యం యుద్ధాన్ని, మంద్రస్థాయి యుద్ధాన్నీ ఎదుర్కొంటున్నది. సైనిక బలగాలతోనూ, మతాన్ని మోసుకొచ్చే ఆరెస్సెస్ శక్తులతోనూ, విధ్వంస మార్కెట్ ను మోసుకొస్తున్నకార్పొరేట్ శక్తులతోనూ ఒకేసారి పోరాటం చేస్తున్నది. తనదైన పరజాస్వామిక సంస్కృతీ రాజకీయాలను నెలకొల్పుకుంటున్నది.
వర్గపోరాట ఆచరణ మంద్రస్థాయి యుద్ధాన్ని ఎదుర్కుంటున్న ఉదాహరణ మళ్ళీ వివేక్, సూర్యంల త్యాగాల వద్దకే వచ్చి మాట్లాడుకుందాం. వివేక్, సూర్యంల అమరత్వం చుట్టూ భిన్న వాదనలు, చర్చలు ఒకవైపు జరుగుతుంటే మరో ఇద్దరు యువకులు శృతి, విద్యాసాగర్ లు రాజ్యం చేతిలో తీవ్ర చిత్రహింసలు ఎదుర్కొని ఆశయం కోసం బలికావడం ఎట్లా సమాజాన్ని కదిలించింది? వారు ఆ మొత్తం చర్చకు, వారి ఆచరణతో, త్యాగంతో సమాధానం చెప్పారు. దాదాపు నాలుగువందల ప్రజాసంఘాలు బూటకపు ఎన్ కౌంటర్ ను నిరసించాయి.
చివరగా సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసులోవాలి. నేడు రాజ్యం మనిషి మనిషి మీదా నిఘా పెడుతోంది. నూటా ఇరవై కోట్ల జనాభా మొత్తాన్నీ అనుమానపు కళ్ళతో చూస్తోంది. సిసి కెమరాలు, వేలిముద్రలు, కంటి రెటీనా గుర్తులు అన్నీ నమోదు చేసుకుంటోంది. రాజ్యం ఎంత ముందు చూపుతో ఉందో నిజానికి అంత ఆత్మ రక్షణలో కూడా ఉంది. అయితే దీన్నతా చెబితే ప్రభుత్వం దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది. అతి పెద్ద సైన్యం ఉంది. శక్తివంతమైన ఆయుధాలున్నాయి. దీనితో పొరాడి గెలవడం సాధ్యమేనా? సాయుధపోరాటం ఎన్నటికి విజయం సాధించేను అన్న ప్రశ్న వస్తుంది. రాజ్యం కూడా దాని శక్తిని ప్రదర్శించి దీన్ని ప్రతిఘటించడమంటే మూర్ఖత్వమే అని చెబుతుంది. అదో మానసిక యుద్ధం. అయితే ప్రపంచంలో విజయవంతమైన పోరాటాలన్నీ సాంకేతికంగా అత్యంత బలంగా ఉన్న శత్రువుతో చాలా బలహీనమైన ఆయుధాలతో ప్రజలు చేసినవే. ఇది పాలకవర్గానికి తెలుసు. అందుకే యుద్ధం అంటే ఆయుధాలే కాదు. అనేక పార్శ్వాలుంటాయని అది అర్థం చేసుకుంది. ఈ అనేక విషయాల్లో ప్రజలే శక్తివంతులు. అది వారిని తెలుసుకొనివ్వకుండా చేస్తుంది. అనేక మాయపొరలు కప్పుతుంది. వాటిని విచ్ఛిన్నం చేసే శక్తి ప్రజల సంఘటిత శక్తిలో ఉంది. లేకపోతే మావోయిస్టుల తుపాకులు, భారత ఆయుధ సంపత్తితో పోల్చితే అత్యంత బలహీనమైనవి. వాటిని చూసి అది ఇంతగా భయపడదు. నాలుగు లక్షల బలగాలు కొన్నీళ్లుగా దండకారణ్యంపై యుద్ధం చేస్తూ విప్లవోద్యమాన్ని అంతం చేయలేక పోవడానికి కారణం ప్రజల చేతిలోని తుపాకులే కాదు, ప్రజల రాజకీయాలు, ప్రజల సంఘటిత శక్తి. అది మాత్రమే మంద్రస్థాయి యుద్ధాన్ని ఎదుర్కోగలదు.
(మంద్రస్థాయి యుద్ధసందర్భం పై కీనోట్)
Type in English and Press Space to Convert in Telugu |
సోషలిజమే ప్రత్యామ్నాయం, నక్సల్బరీయే భారత విప్లవ పంథా20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణులన్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన లక్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ... |
నేనెందుకు రాస్తున్నాను?
బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక....... |
పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలుసంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విరసం సాహిత్య పాఠశాల కీనోట్)..... |
ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శంఅసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ ....... |
ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్... |
సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹమన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి ....... |
మంద్రస్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్యదర్శి పి. వరలక్ష్మి కీనోట్... |
ఉనా స్వాతంత్ర నినాదంఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ... |
ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకైప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య... |
నల్లమలపై అణుబాంబుకృష్ణా, పెన్నా ఆదరువుతో బతుకుతున్న ప్రజానీకం మాత్రం నల్లమల చల్లని నీడలేకపోతే బతకడం కష్టం.మొట్టమొదట యురేనియం కృష్ణను కలుషితం చేస్తుంది.ఈ విధ్వంసం ఆమ్రాబాద్..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |