పెట్టుబడిదారీ వ్యవస్థే సకల సంక్షోభాలకు మూలం

| సాహిత్యం | వ్యాసాలు

పెట్టుబడిదారీ వ్యవస్థే సకల సంక్షోభాలకు మూలం

- వ‌ర‌ల‌క్ష్మి | 04.03.2017 09:25:18am

పెట్టుబడిదారీ వ్యవస్థే సకల సంక్షోభాలకు మూలం - సోషలిజమే ప్రత్యామ్నాయం.
(ప్రొద్దుటూరు సాహిత్య పాఠశాల కీనోట్)


ʹదీన్ని మరణమని చెప్పలేను
అలాగని బతకడమూ కాదు
ఇదో అలౌకిక అసమంజస నిరర్థక నిర్బంధ స్థితిʹ

వర్తమాన కవి ఇప్పటి సమాజ స్థితి గురించి ఇలా వ్యక్తీకరించాడు. ఉన్న స్థితిలో కొనసాగలేక, ముందుకుపోనూ సాధ్యం కాక వ్యవస్థలు పెనుగులాడుతుంటే అది సంక్షోభాన్ని సూచిస్తుంది. సంక్షోభమనే మాట రోజువారీ సామాజిక జీవితంలో చాలా సార్లు ఉపయోగిస్తుంటాం. పొద్దున్నే పంపులో నీళ్ళు రాకపోతే అదో సంక్షోభంగానే ఫీలవుతాం. మోదీ పుణ్యమా అని రెండు నెలలు భారతదేశం అనుభవించిన గడ్డు రోజులు (దాని ప్రభావం ఇప్పటికీ ఉంది) ఉన్న ఫలంగా సామాజాన్ని స్థంబింపజేసాయి. జేబులో డబ్బులుంటాయి కాని, వాటి ఖర్చు చేసుకోలేము. బ్యాంకు బ్యాలెన్సు, ఏటియం కార్డు ఉంటాయి గాని నిరుపయోగమైపోతాయి. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నా, దాన్ని కొనడానికి డబ్బులున్నా అవి చెల్లక మనుషులు చచ్చిపోయిన రోజుల్ని కూడా చూశాం. నోట్ల రద్దు గురించి అనేక విశ్లేషణలొచ్చాయి. వాటి సారాంశం ఏమిటంటే గుత్త పెట్టుబడి బండి నడవడానికి బిజెపి ప్రభుత్వం ప్రజల డబ్బులన్నిటినీ ఇంధనంగా పోసింది. వేరు వేరు రూపాల్లో ప్రభుత్వాలు పెట్టుబడిదారీ దోపిడి నిరంతరాయంగా జరగడానికి ప్రజల శ్రమను పిండి దానికి ధారపోస్తూనే ఉన్నాయి. నోట్ల రద్దు అనే చర్య ద్రవ్య ఆర్థిక వ్యవస్థ దోపిడిని సులభతరం చేయడానికే. ఇది ఒక పెట్టుబడి సంక్షోభాన్ని, దాన్ని నివారించడానికి వ్యవస్థాగతంగా చేయవలసిన సర్దుబాటును సూచిస్తుంది. ఇదే సమాజంలోనూ, ప్రజల జీవితాల్లోనూ సంక్షోభాన్ని తెచ్చిపెడుతుంది.

సంక్షోభం అంటే ఏమిటి?


సమాజాన్ని నడిపించే సూత్రాలు కాలగతిలో పనికిరాకుండా పోతే, అవి విచ్ఛిన్నం అయితే సంక్షోభం వచ్చినట్లు.
(crisis: breakdown of operating principles of a society-marxist thought)

సంక్షోభాన్ని సూచించే పరిణామాలు, ఘటనలు అనేక రూపాల్లో సమాజంలో వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ అవాంఛనీయ పరిణామాల మధ్య ఎటు పోతోందీ సమాజం అని కలవరపడుతూ ఉంటాం. సాధారణ అర్థంలో అవి అవాంఛనీయమే కానీ అవి అనివార్య పరిణామాలు. ఆ పరిణామాల ఒత్తిడులను, హింసను మనం ప్రతి సందర్భంలోనూ విశ్లేషించుకోవాల్సి ఉంది. అది కూడా రాజకీయార్థిక పునాది నుండి విశ్లేషించుకోకపోతే వేరు వేరు సంక్షోభాల వ్యక్తీకరణల వెనక పనిచేసే మూలాలను వదిలేసినవాళ్లమవుతాం. అసలు వ్యవస్థయే సంక్షోభాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అట్లా ఉత్పత్తి చేసినప్పుడల్లా అది మార్పు కోసం పెనుగులాడుతోందని అర్థం. మార్క్స్ చాలా స్పష్టమైన రాజకీయార్థిక అర్థంలో సంక్షోభామానే మాటను వాడతాడు. ఆయన చెప్పినట్లు పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు ఉంటాయి. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే అందుకు కారణం. ఇక్కడ సమాజ అవసరాల కోసం ఉత్పత్తి చేయడం కాకుండా పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం, మార్కెట్‌ విస్తరణ కోసం ఉత్పత్తి జరుగుతుంటుంది. పెట్టుబడికి లాభాలు పెరుగుతూపోవాలి. ఆ పెరుగుదలలోనే దాని ఉనికి ఉంటుంది. ఆ పెరుగుదల దోపిడి మీద ఆధారపడి ఉంటుంది. మౌలికంగా సరుకు ఉపయోగపు విలువకు, మార్కెట్ ధరకు వైరుధ్యం ఉండటం, ఉత్పత్తికి, పంపిణీకి వైరుధ్యం ఉండటం వల్ల ఉత్పత్తి చేసిన సరుకులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నా అవి మనుషులకు అందుబాటులో ఉండవు. అంతకంతకూ సంపద కొద్ది మంది వద్ద పోగుపడుతూ వస్తుంది. సామాజిక ఉత్పత్తికి, వ్యక్తిగత ఆస్తి సంచయనానికి మధ్య వైరుధ్యం తీవ్రమవుతూ వస్తుంది. లాభాల వేటలో తాను విపరీతంగా ఉత్పత్తి చేసిన సరుకులకు కొనుగోలు మార్కెట్ చిన్నదైపోతుంది. ఇదే సంక్షోభానికి దారి తీస్తుంది. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి పెట్టుబడి కొత్త మార్కెట్లను సృష్టించుకుంటుంది.

ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికిలోకి వచ్చాక అది వస్తురూపంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, గుత్త పెట్టుబడిగా, సామ్రాజ్యవాదంగా మారడం అంతా నిరంతర సంక్షోభాలకు గురవుతూ, వాటిని అధిగమిస్తూనే సాగింది. 1870లు, 1930లు, 1970ల ఆర్థిక సంక్షోభాలు, తర్వాత 1980ల, 1990ల తొలి సంవత్సరాలు, 2001 ఆ తర్వాత తాజాగా 2008 ఫైనాన్స్ పెట్టుబడి సృష్టించిన దారుణమైన సబ్ ప్రైమ్ సంక్షోభం- ఇలా ఎప్పటికప్పుడు సంక్షోభాలను అధికమించినట్లు పెట్టుబడి నటిస్తుంది. అది ఎన్నటికీ వాటిని పరిష్కరించదు కానీ వాయిదా వేస్తూ పోతుంది. పెట్టుబడిదారీ సంక్షోభం అనేక చిన్నా పెద్దా యుద్ధాలను సృష్టించింది. మార్కెట్లను, వనరులను తన చెప్పుచేతల్లో పెట్టుకోడానికి అదెంత దూరమైనా పోతుంది. మందులమ్ముకోడానికి రోగాలను సృష్టిస్తుంది. ఆయుధాలమ్ముకోడానికి పోట్లాటలు ప్రేరేపిస్తుంది. ఆయిల్ కోసం టెర్రరిజాన్ని పుట్టిస్తుంది.

బ్రిటీష్ ప్రభుత్వం పోయి అధికార మార్పిడి జరిగాక మన దేశం అర్దవలసగానే కొనసాగింది. సామ్రాజ్యవాద మార్కెట్‌ విస్తరణ కోసం 1991నుండి మన మీద రుద్దిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశీయ ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ పెట్టుబడి సంక్షోభంతో జత కలిపింది. సమస్త రంగాలను పెట్టుబడి కబలించింది. చెట్టు, గుట్ట, నీరు, నది మార్కెట్ సరుకులయ్యాయి. వ్యవసాయం కుదేలయింది. దేశీయ పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యా, వైద్యం మనుషుల కోసం కాక మార్కెట్ కోసమైంది. మానవ ఆవాసాలు, ప్రకృతి నివాసయోగ్యతను కోల్పోయేంతగా పాడైపోతున్నాయి. సామాజిక, సాంస్కృతిక రంగాలు కుదుపుకు లోనయ్యాయి.

ప్రపంచీకరణ విపరీతంగా సంపద కేంద్రీకరణకు దారితీసి గ్లోబల్ సంపన్నులను తయారు చేసింది. ఎంతగా సంపద కేంద్రీకరణ జరుగుతున్నదో అంతగా సగటు జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఆర్థిక రంగమే కాదు, అనేక మానవ విధ్వంసక రూపాల్లో సామ్రాజ్యవాద పెట్టుబడిని ఈ రోజు మనం చూడొచ్చు. సామ్రాజ్యవాదం ప్రపంచ పోలీసు అవతారమెత్తింది. విపరీతంగా సైనికీకరణ (పారిశ్రామిక రిజర్వ్ ఆర్మీ వంటివి), మనిషి మనిషిపై నిఘా, అభద్రత, జాతి విద్వేషాలతో పాలన సాగించే పరమ రియాక్షనరీ పాలకులు 21వ శతాబ్దపు కొత్త తరహా ఫాసిజాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

భారతదేశంలో 2000-2014 మధ్య సంపద విపరీతంగా పెరిగింది (2/3 దాకా పెరిగింది). అంతకన్నా ఎక్కువగా సంపద కేంద్రీకరణ జరిగింది. ఇవాల భారతదేశం మొత్తం సంపదలో సగం కన్నా ఎక్కువ ఒక శాతం మంది సంపన్నుల చేతిలో ఉంది. మూడొంతుల సంపద 10 శాతం వ్యక్తుల చేతిలో ఉంది. మరో వైపు మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలను ఈ దేశం నిశ్శబ్దంగా వీక్షించింది. ఈరోజు ప్రపంచంలో అన్నం దొరక్క పస్తుండే ప్రతి నలుగురిలో ఒకరు ఇండియన్‌. సరైన పౌష్టికాహారం లేక ఎదుగుదల లోపం ఉన్న పిల్లల శాతం అధికంగా ఉన్న దేశం కూడా ఇండియానే. 78 శాతం వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రుల మీద ఆధారపడుతున్న ఇండియాలో ప్రజల సగటు ఆరోగ్య ప్రమాణాలు ఆఫ్రికా ఆకలి దేశాలతో పోటీపడున్నాయి. ప్రభుత్వం చెవుతున్నట్లు కొత్త పరిశ్రమలు, ప్రైవేటు పెట్టుబడి ఉద్యోగాలవకాశాలను మెరుగుపరచడం లేదు. అంతకంతకూ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో ఏటా కోటి మంది చొప్పున కొత్త కార్మిక శక్తి తయారవుతుంటే అందులో సగం మందికి కూడా ఉద్యోగావకాశాలు లేవు. పెద్ద ఆర్థిక విజయంగా చెప్పుకుంటున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సుష్టించిన ఉపాధి చూస్తే అది మొత్తం కార్మికుల సంఖ్యలో రెండు శాతం మాత్రమే.

సంక్షోభాన్ని మేనేజ్ చేయడానికి వ్యవస్థలో రాజ్యం జోక్యం పెరుగుతుంది, హింస పెరుగుతుంది


చిరకాలంగా మనగడలో ఉన్న సామాజిక ఆర్థిక వ్యవస్థను మార్పుకు గురిచేయడానికి రాజ్యం ఆయా సమాజాల్లో అంతకంతకూ ఎక్కువ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజ్య యంత్రాంగం ఎప్పటికన్నా విస్తారమూ, సుస్థిరమూ అవుతూ వస్తుంది. ప్రజలు ఎంత ఎక్కువ సరుకుల వినిమయంలోకి వెళ్తారో అంతగా రాజ్యంతో అనుసంధానంలోకి వెళ్తారు. రేషన్‌ కార్డు దగ్గరి నుండి ఆధార్‌ కార్డు దాకా మెల్లగా ప్రజలను తన పరిధిలోకి తీసుకొచ్చి ప్రజలందరినీ లబ్దిదారులుగా, ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవారిగా చేస్తుంది. ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు ఊడ్చుకుపోతూ ప్రజల కాళ్ల కింది నేలను కూడా పెట్టుబడి కబళిస్తుంది. ఈ పరిణామాలు ఘర్షణకు, తిరుగుబాట్లకు దారి తీస్తాయి గనక, విద్యావంతులైన పెటీబూర్జువా వర్గం చేత రాజ్యం తన అనుకూల భావజాలాన్ని కూడా సమాజంలో వ్యాపింపజేస్తుంది. ఈ వ్యవస్థ ఎంతో సుస్థిరమూ, పటిష్టమూ అనుకునేలా, దీనికి ప్రత్యామ్నాయం లేదనుకునేలా చేస్తుంది. ప్రపంచీకరణ మంచిదే! అడవులు, కొండలు, నదులు, భూములు పోతాయనుకుంటే మరి అభివృద్ధి ఎలా సాధ్యం? కొంత మంది నష్టపోవడం తప్పదు! ఇటువంటి వాదనలు వస్తాయి. ప్రత్యక్ష, పరోక్ష హింస విపరీతంగా పెరిగిపోతుంది.

మన సమాజంలో రాజ్యం పాత ఆధిపత్య శక్తులను ఉపయోగించుకుని కుల, మతపరమైన హింసకు కూడా దోహదం చేస్తుంది. పాత సాంఘిక వ్యవస్థను, అసమానతను ప్రశ్నిస్తూ అట్టడుగువర్గాలు కదుతున్న దశలో సమాజంలో రాపిడి జరుగుతుంది. కుల అణచివేత సామూహిక మారణకాండ వంటి హింసాత్మక రూపం తీసుకుంది. రాజ్య స్వభావంలో, పనితీరులో ఆధిపత్య కుల, మత భావజాలం ఉండటం, అది సాంఘిక వ్యవస్థను నియంత్రిస్తూ, ఆర్థిక విధానంలో సామ్రాజ్యవాద మార్కెట్‌కు అనుసంధానమై ఉంటడం మన సమాజ ప్రత్యేకత. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత నిర్దిష్టంగా ఇది వ్యక్తమవుతున్నది. హిందూ జాతీయవాద భావజాంతో అది ఫాసిజాన్ని అమలుచేస్తూ భారతీయ సమాజాన్ని సామ్రాజ్యవాద మార్కెట్‌ లక్ష్యానికి నేరుగా గురి చేసింది. రోహిత్‌ వేముల మరణం, తదనంతర పరిణామాలు, గొడ్డు మాంసం తిన్నారని దాడులు, హత్యలు చేయడం, ఉనా దళిత ఉద్యమం వంటి సంచనాల క్రమంలో నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీల ప్రయోగం జరిగింది. భారత ప్రభుత్వం తన హిందూజాతీయవాదంలో భాగంగా కులాధితపత్యతత్వాన్ని మరింత బలంగా వ్యక్తం చేస్తూనే, గత పాతికేళ్లలో కార్పొరేట్‌ పెట్టుబడి కోసం ప్రజల్ని బలిపెడుతూ చేసిన అతిపెద్ద చర్య నోట్ల రద్దు రూపంలో తీసుకుంది. కార్పొరేట్‌ కంపెనీల కోసం తీసుకున్న ఈ చర్యతో కేవలం నగదు అందుబాటులో లేకపోవడం వల్ల యాభై రోజుల్లో 150 ప్రాణాలు పోయాయి. అటు సామ్రాజ్యవాద శక్తులకు, ఇటు మతవాద ఫాసిస్టు శక్తులకు మనుషుల ప్రాణాల పట్ల లెక్కలేనితనం కొత్తేమీ కాదు. నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీ ప్రయేగం వంటివైనా, మైనింగ్‌ కోసం దండకారణ్యంలో ఆదివాసులపై చేస్తున్న యుద్ధంమైనా, బాక్సైట్‌ కోసం ఆంధ్రా ఒడిసా సరిహద్దు ప్రాంతంలో చేస్తున్న మారణకాండ అయినా, పశ్చిమ కనుమల్లో ప్రకృతి సంపదను మార్కెట్‌పరం చేయడం కోసం అముచేస్తున్న హింస అయినా సామ్రాజ్యవాద పెట్టుబడి విస్తరణలో భాగమే.

ప్రాంతీయ అసమానతలు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఫలితమే!


పెట్టుబడి అంటేనే అసమానత. అది సమాజంలో అనేక రకాల అసమానతలను సృష్టిస్తుంది. అందులో జాతి పరమైన అసమానతలు, ఒకే జాతిలోని వేర్వేరు ప్రాంతాల మధ్య అసమానతలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడి చావకగా శ్రమశక్తిని, ప్రకృతి వనరులు కొల్లగొట్టడానికి వెనకబడిన ప్రాంతాలను తయారుచేస్తుంది. సరుకులమ్ముకోడానికి వస్తువినిమయ సమాజాన్నీ, సోకాల్డ్ అభివృద్ధి చెందిన ప్రాంతాలను సృష్టిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసమానతలు ప్రాంతీయ ఉద్యమాలకు దారితీసిన వైనం చూశాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు రాయలసీమ కూడా తన ఆకాంక్షలు వ్యక్తం చేసింది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు మరింత తీవ్ర రూపంలో కొనసాగుతాయని రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు వంటి ప్రాంతాలు తెలియజేస్తున్నాయి. రాయలసీమ రాష్ట్ర ఉద్యమం తిరిగి రంగం మీదికి వస్తున్నది. దేశవ్యాప్తంగానే ఇటువంటి ప్రాంతీయ ఆకాంక్షలు వివిధ ప్రాంతాల్లో వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడిదారి సంక్షోభం వల్ల దెబ్బతిన్న వివిధ సమూహాలు ఇటువంటి ఉద్యమాల్లో సమీకరించబడతాయనడానికి తెలంగాణ ఒక ఉదాహరణ. వీరి ఆకాంక్షలు బూర్జువా పార్లమెంటరీ సర్దుబాట్ల వల్ల తీరేవి కావు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ సమాజం తిరిగి ఉద్యమాలకు సిద్ధం కావలసిన పరిస్థితులు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే మౌలిక వైరుధ్యాలను పరిష్కరించే శక్తి ఈ వ్యవస్థకు లేదు.

సాహిత్య రంగంలో సంక్షోభాల ప్రతిఫలనం


సమాజ హృదయమే సాహిత్యం అన్నాడు గోర్కీ. సమాజం రాపిడికి గురవుతున్నప్పుడు, ఆ ఒత్తిడి మానవ జీవితంలో ఎలా ప్రతిఫలిస్తుందో, మార్పు క్రమంలోని చలనాలు నిజజీవిత ఆవరణలో ఎలా గోచరమవుతాయో అది వ్యక్తమయ్యే తీరులో గొప్ప సాహిత్యం తయారవుతుంది. తెలుగు సాహిత్య రంగం అనేక సంచలనాలను తనలోకి స్వీకరించింది. ప్రగతిశీల భావాల వేదికయ్యింది. అభ్యుదయ, విప్లవ, అస్తిత్వ సాహిత్య ధోరణున్నీ భాషా, సాంస్కృతిక రంగాలను సుసంపన్నం చేశాయి. రాజకీయార్థిక, సామాజిక సంక్షోభాలు సాహిత్య ప్రపంచంపై పాజిటివ్, నెగెటివ్ ప్రభావాలు వేస్తున్నాయి. ఈ దేశపు మూలవాసులు సరికొత్త కంఠస్వరంతో ఆధిపత్య సంస్కృతిని, రాజకీయాలను ప్రశ్నిస్తూ మానవసారాన్ని సాహిత్యంలో పలికిస్తున్నారు. మరోవైపు సాహిత్యానికి ఉన్న సామాజిక తత్వాన్ని తిరస్కరించే ధోరణి ఒకటి బయలుదేరింది. కళా సాహిత్యాలను, వాటికి మూలమైన మానవ సామాజిక, వ్యక్తిగత అనుభవాలను విశ్లేషించేందుకు మార్క్సిజం ఒక్కటే సరిపోదనే వాదనా తిరిగి లేచి నిలబడింది. సామాజిక అనుభవం నుంచి వైయుక్తిక అనుభవాలను వేరు చేసి, పోటీ పెట్టి, ఆ రెంటిని అపసవ్యంగా అర్థం చేసుకోవడమేగాక వ్యక్తిగత అనుభవాలే గొప్ప కళగా మారుతాయనే ధోరణి కూడా మళ్లీ వచ్చేసింది. సామాజిక చలనాలను, వాటి అంతస్సారాన్ని జీవితపులోతుల్లోంచి అర్థం చేసుకోలేని గందరగోళంలో రచయితలు పలాయనవాదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఉజ్వలమైన ధిక్కార స్వరం సన్నగిల్లి మళ్ళీ రాజాశ్రిత సాహిత్య సంరంభాలు, పెట్టుబడి స్పాన్సర్డ్ సాహిత్య పండుగల్లో సృజనాత్మకత సామాజిక నిబద్ధత నుండి దూరం జరుగుతున్నది.

ఇవాళ మళ్ళీ సాహిత్య సామాజికతను, సాహిత్య సామాజిక ప్రయోజనాన్ని ఎత్తిపడుతూ రకరకాల సాహిత్య కూటవాదాలను ఓడించాల్సిన బాధ్యత ప్రగతిశీల సాహిత్యకారులకు, ముఖ్యంగా మార్క్సిస్టు రచయితలకు ఉన్నది. ప్రపంచానికి గొప్ప సాహిత్యాన్ని అందించిన మార్క్సిస్టు సాహిత్యకారులు, విమర్శకులను మళ్ళీ కొత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సాహిత్యంలో వాస్తవికతావాదానికి తిరుగులేని శక్తిని అందించిన రష్యన్‌ సాహిత్యకారులు ఇప్పటికీ మానవజాతి సాహిత్య చరిత్రలో అగ్రగణ్యులుగా నిలిచే ఉన్నారు. రష్యన్‌ సాహిత్యం ఇప్పటికీ అంత ప్రభావశీలంగా ఉండగలుగుతోంది అంటే దానికున్న శక్తి ఏమిటి? పుష్కిన్, గొగోల్, టాల్ స్టాయ్, దొస్తోయెవ్స్కీ, తుర్గెనెవ్, కుప్రిన్, చెహోవ్, గోర్కీ వంటి సృజనమూర్తుల రచన, జీవితాచారణ చూస్తే వీళ్ళంతా సామాజికులైన రచయితలు. రాజకీయ కార్యాచరణలో ఉన్నవారు. అధికారాన్ని ధిక్కరించి ప్రవాస శిక్షలు అనుభవించిన రచయితలు ప్రపంచ సాహిత్యాన్నే సుసంపన్నం చేశారు. ఇవాళ రాజకీయ నిబద్ధత సృజనాత్మకను పలుచబారుస్తుందని విమర్శించే వాళ్ళు, రచయితలకు రాజకీయాలుండొద్దని, సాహిత్యం రాజకీయాలకు అతీతంగా ఉండాలనే వాళ్ళు రష్యన్ సాహిత్యాన్ని చదవాలి. అటువంటి సృజనమూర్తులను సృష్టించిన బోల్షివిక్‌ విప్లవానికి ఇప్పుడు నూరేళ్లు. మూడు నాలుగు తరాలుగా మానవాళిని ఉరికెత్తే విప్లవశక్తిగా తీర్చిదిద్దుతున్న ఆ విప్లవాన్ని, ఆ సాహిత్యాన్ని ఈ సంక్షోభ కాలంలో తప్పక మళ్లీ మళ్లీ అధ్యయనం చేయాలి. మనకాలపు ప్రజా ఆకాంక్షల్లో, ఆచరణలో ఆనాటి రష్యన్‌ సాహిత్య కాంతి బావుటాలు ప్రకాశిస్తున్నాయి.

రష్యన్‌ విప్లవం వందేళ్ళ సందర్భంలో ఆ అనుభవాన్ని నేడెలా చూడాలి?


సామ్రాజ్యవాదం గుత్త పెట్టుబడిగా మారుతున్న దశలో విజయవంతమైన ఆ విప్లవం, దానికి ప్రేరణ అందించిన ఆ సాహిత్యం .. ఇవాళ్టి ద్రవ్య పెట్టుబడి సంక్షోభాలను పరిష్కరించే ప్రజా ఆచరణకు తప్పనిసరిగా గొప్పగా పదును పెడతాయి. అయితే ఇరవయ్యవ శతాబ్దంలో సామ్రాజ్యవాద పెట్టుబడి శరవేగంగా విస్తరిస్తూ పోతుండగా జరిగిన మరో ముఖ్యమైన పరిణామం ప్రత్యామ్నాయం అనుకునే సోషలిస్టు శిబిరాలు లేకుండా పోవడం. ఒక మనవీయ ప్రయోగం అనేక బాహ్య, అంతర్గత కారణాల వల్ల దెబ్బతినిపోయి ఓడిపోయింది. అంత మాత్రాన మానవ సమాజం ఇక ఎప్పటికీ లేచి నిబడదు అనడం హాస్యాస్పదం. రాచరికం ఒక్కసారిగా అంతం కాలేదు. బానిస సమాజమూ ఒకే దెబ్బతో కూలిపోలేదు. మానవ ప్రయత్నం కొనసాగింది. అంతిమంగా మార్పు అనివార్యం. మార్పే నిత్యసత్యం. మార్క్స్‌ చేపినట్లు పెట్టుబడిదారీ సంక్షోభాన్ని చైతన్యయుతమైన కార్మిక వర్గమే వర్గపోరాటం చేసి పరిష్కరిస్తుంది.

ఈ ఏడాదికి బోల్షవిక్‌ విప్లవ విజయానికి వందేళ్లు పూర్తవుతాయి. మనిషిని పరాయీకరించి, సామూహికత నుండి విడగొట్టి, మనిషిని మనిషిగా ఉండనీయని వర్గసమాజానికి ప్రత్యామ్నాయం ఉందని, అది సుసాధ్యమేనని నిరూపిస్తూ మానవజాతి చరిత్రలో జరిగిన మహాద్భుత ఘట్టం రష్యన్‌ విప్లవం. అది సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ఎంత గొప్ప మానవీయ ప్రయోగాలు చేసిందో, ఎన్ని విలువల్ని నెలకొల్పిందో పున:స్మరించుకోవాల్సిన అవసరం నేడెంతో ఉంది. అట్లాగే చైనా మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవానికి 50ఏళ్ళు నిండిన సందర్భం కూడా ఇదే. సాంస్కృతిక విప్లవం మార్క్సిజానికున్న విమర్శనాత్మక దృక్పథాన్ని, నిరంతర వర్గపోరాటతత్వాన్ని, విగ్రహ విధ్వంస లక్షణాన్ని పదునుపెట్టింది. ఆ విమర్శనాత్మక దృక్పథంతోనే సోషలిస్టు ప్రయోగాలను అంచనా వేయాలి. బోల్షవిక్ విప్లవం, చైనా సాంస్కృతిక విప్లవం రెండూ విప్లవ క్రమంలోనూ, సోషలిజాన్ని నిర్మించే క్రమంలోనూ వర్గేతర భావజాలానికి వ్యతిరేకంగా సలిపిన పోరాటం నిత్య స్ఫూర్తిదాయకం. విప్లవం విజయవంతమైన తర్వాత కూడా బూర్జువా శక్తులు తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాయో, కమ్యూనిస్టు నాయకత్వం కూడా సులువుగా అన్యవర్గ భావజాలానికి గురయ్యే ప్రమాదం ఎలా వెన్నంటి ఉంటుందో అవి తెలియజెప్పాయి. నిరంతర వర్గపోరాటం ఏ మాత్రం పట్టు విడిచినా అది బూర్జువా శక్తులకు ఎలా అందివస్తుందో హెచ్చరించాయి. సాంస్కృతిక విప్లవ ప్రభావం మనదేశంలో వర్గపోరాట రాజకీయాలను రివిజనిజం నుండి కాపాడింది. నక్సల్బరీ సాయుధ పోరాటాన్ని మార్క్సిస్టు ఆచరణ రూపంగా స్థిరపరిచింది. రాబోయే మే నాటికి యాభై ఏళ్లు నిండనున్న నక్సల్బరీ ఇవాళ దండకారణ్యంగా వాస్తవరూపం ధరించింది.

సోషలిజమే ప్రత్యామ్నాయం


ఇది నినాదప్రాయం కాదు. విఫల ప్రయోగంగా పెట్టుబడిదారీ మేధావులు ప్రచారం చేస్తున్న సోషలిజం ఒక శాస్త్రీయ సిద్ధాంతం. పెట్టుబడిదారీ వ్యవస్థ హామీ పడిన బూర్జువా ప్రజాస్వామ్యం ఎంత డొల్లగా తేలిపోయిందో కొత్తగా నిరూపించనక్కర్లేదు. అది ఎట్లా ఫాసిస్టు రూపు తీసుకుంటోందో మోడీలు, ట్రంపులే చెబుతున్నారు. ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదని విర్రవీగడం తప్ప మనుషులు మనుషులుగా జీవించే వ్యవస్థ ఇది కాదని తేలిపోయింది. చరిత్ర పొడవునా ఆయా స్థలకాలాల్లో వచ్చిన సంక్షోభాన్నిటికీ కార్మికవర్గ విప్లవాలే పరిష్కారంగా వచ్చాయి. మరి సోషలిజమే ఎందుకు ప్రత్యామ్నాయం? పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో ఉన్న వైరుధ్యం పరిష్కరించే దారి సోషలిజంలో ఏర్పడుతుంది. నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తికి, పంపిణీకి, ఉపయోగితకు మధ్య తీవ్ర వైరుధ్యం ఉంటుంది. అదనపు విలువ దోపిడి ఆధారంగా నడిచే స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ సంపద ఒక్క చోట పొగుపడేలా చేస్తుంది. వ్యవస్థలో సకల దుర్లక్షణాలకు అది మూలం. సోషలిస్టు వ్యవస్థలో వ్యక్తిగత ఆస్తి రద్దు ఉత్పత్తి శక్తులను విడుదల చేసి సంపద అందిరికీ పంపిణీ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ లాభాల కోసం ఉత్పత్తి కాదు, సమాజ అవసరాల కోసం ప్రణాళికాబద్ధ ఉత్పత్తి ఉంటుంది. భూమి, నీరు అందరిదీ అయి, ప్రకృతి పెట్టుబడి కబంధ హస్తాల నుండి విడుదలవుతుంది. వినియోగదారునిగా, మార్కెట్ వనరుగా, సరుకుగా ఉండే మనుషులు నిజమైన మానవులుగా ఆవిష్కారమయ్యేది సోషలిజంలోనే. ఇక్కడ దోపిడి, అసమానత తొలగిపోతూ, సకల ఆధిపత్య వ్యవస్థలు అంతరించే ప్రాతిపదిక ఏర్పడుతుంది. కార్మికవర్గ నియంతృత్వం దోపిడీదారులను కట్టడి చేసే శ్రమజీవుల రాజ్యం. అది అంతిమంగా రాజ్యం కూడా అంతరించే కమ్యూనిజాన్ని సాఫల్యం చేస్తుంది.

No. of visitors : 617
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •