సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

- పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am


ఆధునికత - సమకాలీనత ( కొన్ని పార్శ్వాలు )
( సాహిత్య చరిత్రతో సహయానం-2, రచన : ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ )

చదవటం పూర్తి అయ్యాక కూడా ఆ పుస్తకo మనల్ని వెంటాడుతూనే వుంటే, మనం మంచి పుస్తకమే చదివామనే సంతృప్తి కలుగుతుంది. పుస్తకాలు మనలో కలిగించే స్పందనలు,అనుభూతి, మనకు అందిoచే సమాచారం, విజ్ఞానం ఆధారంగానే ఆ పుస్తకాల విలువను మనం నిర్ణయించుకుంటాం.కాలం గడిచేకొద్దీ పుస్తకం విలువలో మార్పు తప్పనిసరిగా కనపడుతుంది.

గడచిన కాలపు పఠనానికి,ఈ కాలపు పఠనానికి చాలా తేడాలే ఉన్నాయి. మన రోజువారీ ఆలవాట్లు,మనం సేకరించుకునే పుస్తకాలు,వాటి ఎంపిక,లభ్యత,వాటికి మనం కేటాయించే సమయాలను బట్టి ,మన నిమగ్నత, పాఠకుడిగా మన స్థాయి,స్థితిని బట్టి, మన సామాజిక, ఆర్థిక, రాజకీయ,మానసిక పరిస్థతులను బట్టి,మన అలోచనాతీరు, అవగాహనా శక్తి,సంస్కారం,వ్యక్తిత్వాన్ని బట్టి పుస్తకం మనకు అర్థం అవుతుంది.

పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదివే క్రమంలో , గతంలో చదివినప్పటి అనుభవానికి, ప్రస్తుత అనుభవానికి గల తేడాను,మార్పును మనం స్పష్టంగా గమనించవచ్చు.ఆ మార్పులు ,తేడాలకు కాలంతో బాటూ మారని పుస్తకం కారణం కాదు . మనిషి సంస్కారం,స్వభావం, ఎదుగుదల,పరిణితి,అవగాహనా శక్తి,అనుభవాలు , అప్పటివరకు చదివిన పుస్తకాలు , వ్యక్తిత్వం లోని మార్పులే అందుకు కారణమవుతాయి. అప్పుడు చదివిన పుస్తకం ఇచ్చిన అనుభవానికి, సంతృప్తికి, జ్ఞానానికి, అసంతృప్తికి ఇప్పుడు అదే పుస్తకం కలిగించే భావనలకి గల మార్పే నికరంగా మన పరిణితి లో వచ్చిన మార్పుగా భావించాల్సి వుంటుంది.

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి , నిబద్దత, స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే విషయాల్లో సైతం ఎక్కడా సంయమనం కోల్పోక పోవడం విమర్శకుడి వ్యక్తిత్వంలో భాగమని పుస్తకం చదివిన పాఠకుడు భావిస్తాడు.
ʹ విమర్శ అంటే ఒక కావ్యమును విశాయీకరించుకుని వ్రాయు మరియొక కావ్యమని ʹ రాళ్ళపల్లి వారు అన్నట్లుగా ఈ గ్రంధం లోని చాలా వ్యాసాలు నిరూపిస్తాయి .

ʹ పది పరిశోధనల పెట్టయింది ఈ వ్యాస సంపుటి నాకు ʹ అని ముందోమాట ప్రారంభంలోనే రచయిత ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ అభిప్రాయాపడినట్లు మౌలిక ప్రస్తావనలతో,పరిశోధక విద్యార్థులకు, అధ్యేతలకు ఉపయోగపడాలనే ఆకాంక్షతో ఇప్పటికిలా ఎంతో శ్రమతో రూపుదిద్దిన ఈ పుస్తకం తెలుగు విమర్శనా రంగానికి మేలురకం చేర్పు అని చెప్పక తప్పదు. విజయవాడ చినుకు ప్రచురణలవారు ఈ పుస్తకాన్ని ముద్రిoచడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శకు సరిగ్గా అవసరమైన సమయంలో కొత్త బలాన్ని అందించినట్లయ్యింది.

రెండు దశాబ్దాలక్రితం 1996 లో భారతియార్ విశ్వ విద్యాలయంలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడెమీ సదస్సులో సమర్పించిన ఆంగ్ల పత్రానికి, మరికొన్ని ప్రసంగాలకు పరివర్ధిత రూపంగా ʹ ఆధునికత-భూమిక ʹ 42 పేజీల వ్యాసంతో 512 పేజీల ఈ పుస్తకం మొదలవుతుంది.

ʹ జ్ఞానపీఠి ప్రశస్తి తరంగం ʹ అనే మొదటి విభాగంలో శ్రీ విశ్వనాథ-విమర్శమార్గం, సినారె గేయకావ్య సంప్రదాయం, ʹ నా లోని నీవుʹ : రావూరి ఆత్మ దర్శనం, ʹవిముక్త రంగస్థలి ʹ జ్ఞానపీఠి చంద్రశేఖర కంబార్,వేదనా మహితమూర్తి :ఇందిరా గోస్వామి అనే అయిదు అధ్యాయాలున్నాయి.

***

గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారి పరిశీలన,పరిశోధన తీరుకు వారి పుస్తకంలో ప్రకటితమైన వ్యక్తికరణలే నిదర్శనం.

ʹ కవిగా విశ్వనాథ స్థానం చాలా గొప్పది,రచయితగా వివాదాస్పదమైంది.సాహిత్యవేత్తగా ( అంటే సాహిత్య విమర్శనా రచయితగా ) అనితరసాధ్యమైనది.అతి విస్తృతమైంది. ʹ

ʹ ఈ దేశంలో ఎక్కడైనా ఆలుమగలు అన్యోన్యంగా జీవించడానికి పాఠం చెప్పే పాఠశాలలో ,కళాశాలలో పెడితే,అందులో అవశ్యం పాఠ్య గ్రంథంగా చేర్చదగింది ఈ కాంతమ్మ పాంచజన్యం-అందులో భాగమైన ʹ నాలోని నీవు ʹ. ( రావూరి భరద్వాజ గురించి ) ʹ

ʹ విజ్ఞాన శిఖరదీప్తి తరంగం ʹ అనే రెండవ విభాగంలో తన్ను గూర్చి తాను చలం, ʹ అనంత ʹచంద్రిమయ కీర్తి-రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ , ʹ తెలుగు రుచుల పొలిమేర ʹ పుట్టపర్తి , అధ్యన మేరువు : ఆచార్య భద్రిరాజు ; నాలుగు అధ్యాయాలున్నాయి.

మూడవ విభాగం ʹ తెలుగు పరిశాధనా తరంగం ʹ. ఇందులో ʹ ఆచార్య దోణప్ప గారి పర్యవేక్షణ: తెలుగు పరిశోధన ʹ , ʹ విశ్వ విద్యాలయాలలో తెలుగు పరిశోధన : సమీక్ష ʹ అనే రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.నాలుగవ విభాగం లో ʹకథాకథన తరంగం ʹ శీర్షికన ʹ కొలకలూరి ఊరబావి ʹ, ʹ కథన మీమాంస :ఒక టిప్పణి ʹ వ్యాసాలున్నాయి.అయిదవ విభాగంలో ʹకవితా తరంగం ʹ శీర్షికన ʹ గురజాడను యుగకర్త అనడం సమంజసమా ʹ, ʹ ఈనాటి కవిత ʹ, ʹ దళిత కవిత్వం: స్వరకర్త మద్దూరి నగేష్ బాబు ʹ వ్యాసాలున్నాయి.

ఈ పుస్తకంలో నాటక రంగానికి సంబందిoచిన ఏడు వ్యాసాలతో కూడిన 69 పేజీల ʹ నాటక తరంగం ʹ ఈ పుస్తకంలోని పెద్ద అధ్యాయం.ఈ అధ్యాయంలో చాల విపులంగా సరళంగా నాటక చరిత్రను, నాటక రంగంలో వచ్చిన ,వస్తున్నా, రావాల్సిన మార్పుల్ని స్పష్టపరిచారు.సాహిత్యంలో నాటకం ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో, సమాజం పై నాటకం చూపే ప్రభావం ఎంత ఘాడంగా వుంటుందో రచయిత విశ్లేషించిన తీరు అపూర్వం అనిపిస్తుంది. రచయితకు నాటకాల పైన వున్న శ్రద్ధ, ఇష్టం ,ఆసక్తి ఈ వ్యాసాల్లో స్పష్టంగా గమనించవచ్చు.

ʹ విమర్శ తరంగంʹ ఏడవ విభాగం.ఇందులోని నాలుగు అధ్యాయాలు సాహిత్య విమర్శకు కొత్త చేర్పులు. ʹ విమర్శ-సమీక్ష-పరిశోధన ʹ, ʹసాహిత్య విమర్శ-శాస్త్ర స్థాయి ʹ, ʹ అలంకారిక విమర్శ-ఆధునిక తెలుగు సాహిత్యం ʹ, ʹ తెలుగు సాహిత్య విమర్శ-కాల్పానికత ʹ.

ఎనిమిదవ విభాగంలోని ʹ భావనా తరంగంʹ శీర్షికన గల నాలుగు అధ్యాయాలు ఆసక్తికరంగా చదివించేవే. ʹసాహిత్యం- సినిమా ʹ లో ఆచార్య గంగిసెట్టి లక్ష్మీ నారాయణ ఇలా అంటారు

ʹ కొందరికి కష్టంగా అనిపించ వచ్చు కానీ, సినిమా ఇవ్వాళ , మరో ఆధునిక సాహిత్య రూపమన్నది యదార్థం. ఆధునిక సాంకేతిక సాహిత్య రూపం ʹ .

ʹ దాసరి నారాయణ రావు గారితో సినిమాలో సంభాషణ ఒక పెద్ద మలుపు తిరిగిందన్న మాట యదార్థం. అంతకంటే మించి , ప్రయోజనాత్మక సినిమాకు ఆయనే ఆఖరు ప్రయోక్తేమో అన్నమాట కూడా యధార్థం.ఏదేమైనా సినిమా -ప్రయోజనాత్మకత అనే మాటలకు ,దాసరి యుగం తర్వాత అర్థం మారిపోయింది. ʹ

ʹ వ్యక్తిత్వ నిర్మాణం-ʹ సంస్కృతి విద్య ʹ: మాతృ భాషా బోధన ʹ , ʹ విద్య అంటే ప్రతిభా శిక్షణం ʹ, ʹ మాండలిక భాష : ఉపోద్ఘాతం ʹ.ఈ విభాగం లోని ఇతర అధ్యాయాలు.

ʹ ఖండాంతర స్పందన తరంగంʹ శీర్షికన తొమ్మిదవ విభాగంలో ʹ ʹ ఐదో ప్రాంతంʹ తెలుగు కవితా వీచికలు ʹ , ʹ ʹఅ ఆ ల ఆరామస్థలిʹ ఆమె కవిత ʹ , ʹ ʹనీట రాసిన పేరొక్కటి ʹ కాలగతిని మార్చిందిʹ, ʹ మనమూహించని అమెరికాకు కరదీపిక ʹ ఆసక్తికరమైన వివరణలతో కొనసాగుతుంది.
ఈ పుస్తకం లో చివరిది అయిన పదవ విభాగం లో ʹ ఆత్మీయ సంస్పందన తరంగంʹ శీర్షికన ʹ సాహిత్య ప్రభావాలు ʹ పేరుతో డా.కాకాని చక్రపాణి గారి సాహిత్య ప్రభావం ; ʹ తెలుగు శైలీ సర్వంకష ʹ, పేరుతో డా.యు.ఆర్.నరసింహ మూర్తి గారి తెలుగు వచన శైలి పుస్తకాలకు రాసిన ముందు మాటలు ఉన్నాయి. వీటితో బాటూ ʹ భావుక సీమ ʹ ( ఆచార్య కోవెల సుప్రసన్న గారు రచించిన ʹ భావుక సీమ ʹ గ్రంధ సమీక్ష ), ʹ శ్రీ రమణీయంʹ (ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి రచన ʹ అరుణాచల రమణీయము ʹ నకు రాసిన ముందుమాట ఉన్నాయి.

సమకాలీన తెలుగు,కన్నడ సాహిత్యరంగాలతో బాటూ ప్రాచీన,పాశ్చాత్య సాహిత్యాలతో బాగా పరిచయం వున్నవాడు కాబట్టే ఈ పుస్తకం లోని చాలా వ్యాసాలు విపులంగా, వివరణలతో, ఉదాహరణలతో తులనాత్మకంగా అన్వయిస్తూ చెప్పగలిగారని అర్థం అవుతుంది.

******

తెలుగు సాహిత్యానికి సంభందించి చాల ముఖ్యమైన పరిశీలనలు, సూచనలు, నిర్ధారణలు , విలువైన ప్రతిపాదనలు చేసిన గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారి తో పాఠకులు అన్ని విషయాల్లో, అన్నీ సార్లు ఏకిభావించలేక పోయినా , సరే ఈ పుస్తకాన్ని అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. తెలుగు సాహిత్య విమర్శనా రంగానికి ఈ పుస్తకం లోని చాలా ప్రతిపాదనల పైన చర్చ జరగాల్సి వుంది. పాత అభిప్రాయాలను కొందరు సవరించుకోవలసి వుంటుంది.విలువైన ఈ పుస్తకం సరైన సాహిత్య సందర్భంలో రావడం అభినందనీయం.

బహు భాషా సాహిత్యాలతో, సామాజిక శాస్త్రాలతో , ప్రాచీన సాహిత్యం తో బాటూ సమకాలీన సాహిత్యం పైన కూడా అవగహన వున్న గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారిలాంటి వారు ఎక్కడా ఆగిపోకుండా వర్తమాన సాహిత్య అధ్యయనం ,వర్తమాన సాహిత్య విమర్శాక్రియల ద్వారా తెలుగు సాహిత్యకారులకు, సాహిత్యానికి మేలు చేకూర్చాలని కోరుకుందాం. సాహిత్యం,సమాజం,సాహిత్య విమర్శ అనే చట్రంలో సమాజ ,సాహిత్యాల పట్ల లోచూపు కలిగిన వాళ్ళు మరింతగా సాహితీ కృషి చేయడమే సాహిత్యానికి,భాషకు వాళ్ళు చేసే మేలుగా భావించాల్సి వుంటుంది.

కొన్ని పుస్తకాలను చదివిన తర్వాత తను చేయటానికి ఇంకేమి వుండక, అక్కడే పాఠకుడు అదృశ్యమవుతాడు. ఇలాంటి విలువైన పుస్తకాలు చదివాక పాఠకుడు కొత్తగా తనను ,సమాజాన్ని, సాహిత్యాన్ని పునఃసమీక్షించుకుని , పునరాలోచనలో పడతాడు. సాహత్యం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన పాఠకులపైన ఈ పుస్తకo చూపే ప్రభావం గమనార్హమైనది.

లెక్చరర్,ప్రొఫసర్,డీన్, విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులు గా ఉద్యోగ అనుభవాలు కలిగి, పది గ్రంధాలు,అరవై పరిశోధనా వ్యాసాలు రచించి, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషా సాహిత్యాల్లో అవగాహన కలిగి పర్వ కన్నడ నవలానువాదానికి కేంద్ర సాహిత్య పురస్కారం పొందిన గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారి నుండి వర్తమాన సాహిత్య అధ్యయనాంశాల పై కొత్త రచనలను కోరుకోవడం అత్యాశ కాదనుకుంటాను.
ప్రపంచంలో ,భారత దేశంలో ,రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న, నెలకొంటున్న కొత్త పరిస్థితులపై కొత్త దృష్టితో కొత్తరకం రచనలు రావాల్సిన తరుణంలో ; కొత్తగా రాయాల్సిన పాత, కొత్త రచయితలను ప్రేరేపించడానికి , కొత్తగా రాయాల్సిన విషయాలను గురించి హెచ్చరించడానికి విమర్శకులు,దార్శనికులు ప్రయత్నించాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా వుంది.- పలమనేరు బాలాజీ( 9440995010 )

No. of visitors : 704
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

బ్రతికించే మాట ఒకటి కావాలి

పలమనేరు బాలాజీ | 17.03.2019 09:34:29am

నేనొక సమూహం కావటానికి నాకు ఒక మనిషి ,మాట ,మనసు కావాలి . మనసున్న మనిషి మాట్లాడే మాటొకటి కావాలి ఉదయమో ,సాయంత్రమో, రాత్రో నన్ను బ్రతికించే మాటొకటి కావాలి....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •