మా తుఝే స‌లాం

| సాహిత్యం | క‌థ‌లు

మా తుఝే స‌లాం

- ఆర్ . శ‌శిక‌ళ‌ | 04.03.2017 10:37:23am

స్కూల్లు తెరిచారు. వేసవి తాపం తగ్గింది. నా డ్యూటీ మొదలయింది. అడ్మిషన్ల వ్యవహారం చూస్తున్నాను. ఆఫీసు రూంలో కూర్చుని ఉన్నా.. కొంత విరామం దొరికింది.... అనుకుంటున్నా ఇంతలోనే ఓ బుజ్జిగాన్ని చేత్తో పట్టుకుని నడిపించుకొంటూ ఓ అందమైన యువతి లోపలికి వచ్చింది.

నిమ్మపండు రంగు చీర, మ్యాచింగ్‌ జాకెట్‌. బొట్టుబిళ్ల, కళ్లకు కాటుక మెరుస్తోంది. చెవుల్లో పెద్ద రింగులు - తన పొడవాటి జడకు వేలాడుతూ పువ్వుల దండ ఊగుతోంది.

ఆమెను ఎక్కడో చూశా. కానీ గుర్తు రాలేదు. ఆ గుండ్రని ముఖం మణికట్టుపై పెద్ద గాటులాంటి మచ్చ గాజుల కుదుపులో కన్పడుతోంది.

ʹనమస్తే మేడమ్మాʹ అంది. ప్రతి నమస్కారం ʹచేస్తూ కూర్చోమ్మాʹ అన్నా - బెరుకుగా అలానే నిలబడింది ʹఫర్వాలేదు కూర్చోండి. బాబును ఆ బెంచిపై కూర్చోబెట్టుʹ అన్నాను. ʹఈ స్కూల్‌లో తెలుగు మీడియం ఉందంట. నా పెద్ద కూతురు లక్ష్మి చెప్పిందిʹ ఆ స్కూల్లోనే ఏత్తామనుకుంటే మా కూతురే వద్దనింది. ఆడ బాగా చెప్పరంట - అంది గబగబా. ఫీజులు అన్ని వివరాలు అడిగింది. ʹనేను ఫీజులు అన్నీ కట్టుకుంటా కానీ ఆలస్యమయినా తట్టుకోవాల రామును అడగొద్దుʹ ఈ సాయం చేయమ్మ సాలు. మా రాము పెద్ద పెద్ద సదువులు సదవాల మేడమ్మా మీలాగేʹ అంది.

ʹసరే నేను కొన్ని రోజులే తెలుగు మీడియం స్కూలును చూస్తా. తర్వాత హెడ్‌మాస్టరు చేరతాడు ఆయనకు చెప్తాలేʹ అన్నాను.

ʹఅప్లికేషన్‌ పూర్తి చేసిస్తావాʹ అడిగాను ఆమె ముందుకు పెట్తూ, ʹనాకాడ సదువాత్తాదమ్మ, వేలిముద్ర యాడపెట్టమంటే ఆడపెట్తాʹ మీరే సేసియ్యండి.

పేరు - రాము, తండ్రి పేరు అడిగాను.

తరగతి 1వ తరగతి కులం..... సంవత్సరం ఆదాయం, చిరునామా తండ్రిపేరు చెప్పకుండా ఎటో చూస్తోంది.

ʹనా పేరు రాసుకోమ్మాʹ నేనాగదా సదివించేది అంది. అయినా తండ్రి పేరు రాయలమ్మా. ʹపేరు లేదు, గీరు లేదు నా పేరే రాసుకోండిʹ అంది కొంత అసహనంగా - అంటూ - ఈమెను వదిలేశాడా? భర్త ఆ కోపంతో చెప్పటం లేదనుకున్నా. ఆమెను చూస్తే భర్త చనిపోలా, మరయితే?

ʹఒకవేళ చనిపోయింటే కూడా పేరు రాయాలమ్మా... 10వ తరగతి సర్టిఫికేట్‌ వచ్చేవరకూ తండ్రి పేరే ఉంటుంది. కొంత వివరంగా చెప్పా. మొదటి భర్త చనిపోతే మళ్లీ పెళ్ళి చేసుకొని ఉండొచ్చు గదా. నా అనుమానం.

ʹలేదమ్మా లేదని చెప్తాంటేʹ - అంది రెట్టించిన కోపంతో నా పేరే రాసుకొండి - ʹకమలమ్మాʹ - గట్టిగా గదిమినట్టు అంది. తర్వాత చూడచ్చులే ఈ వ్యవహారం అనుకోని మనసులోనే పూర్తి చేసిన అప్లికేషన్‌పై వేలిముద్ర వేయించాను. స్కూల్‌ వెనుకల ఉండే గుడిసెల్లోనే ఆమె నివాసం... అది మిషిన్‌ కాంపౌండ్‌ - ఎన్నో ఏళ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. ʹరామును పిలుచుకొని వెళ్తూ, మేడమ్‌కు నమస్తే చెప్పు అంది. ʹఅబ్బ ఈమె కోపం తగ్గింది అనుకొని రాము బుగ్గలు లాగి బాగా సదువుకోవాలʹ చెప్పా.

ఆ రోజు వ్యవహారాలు ముగించి ఇంటికి చేరే సరికి బాగా ఆలస్యమయింది. ఇంటి పని హడావుడి ముగించి నిద్రకుపక్రమించా, అయినా కమలమ్మ ముఖం నన్ను వెంటాడుతూనే ఉంది. అప్పుడు తళుక్కున మెరిసింది ఆ తార ఎవరో - ఇంక నిర్దారణ చేసుకోవాలి ఆ మణికట్టుపై గాయం గుర్తు - నాకిప్పటికీ గుర్తే... నేనపుడు 10వ తరగతి పరీక్షలకు తయారవుతున్నా. ఇంక పదిహేను రోజులే. ఆ రోజు రాత్రి 12 గంటలవుతోంది. గోడ గడియారం నా నిద్రమత్తు వదలగొట్టింది. అప్పటికింకా మిషన్‌ కుడ్తూనే ఉంది అమ్మ ʹఇంక పడుకో తెల్లారి లేపుతాలేʹ అంది దుప్పటి పైకిలాక్కున్నాను...

ఇంతలో బయట పెద్దగా కేకలు. ఎవరిదో అర్తనాదం... ఏడ్పు. చుట్టుపక్కల ఇంట్లో వాళ్లు తలుపులు తీసి బయటకొచ్చారు. అమ్మా నాన్న బయటికి పోయి ఆ గుంపులో ఏం జరుగుతోందో తొంగి చూస్తున్నారు. ఆసక్తితో బయటికి నడిచా.

అక్కడ పదమూడేళ్ల అమ్మాయి పడిపోయింది. మణికట్టు దగ్గర పెద్ద లోతయిన గాయం, రక్తం కారుతోంది. వళ్ళంతా దెబ్బలే - చేతులు గీరుకుపోయి ఉన్నాయి. జనం పోగయ్యేసరికి ఆమెను తరుముకొస్తున్న వారు ఎవరో పారిపోయారు. తిట్లు తిట్టీ వాళ్లు - ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ పిల్లను ఎవరూ తాకలేదు. మా ఇంటి బయట రెండు పెద్ద అరుగులున్నాయి. మా అమ్మ నాన్నలు ఆ పిల్లను తీసికొని అక్కడికి వచ్చారు. ఇంట్లోకి పోయి సైబాల్‌ పసుపు పట్టుకొని రమ్మంది. అమ్మ. క్షణంలో అక్కడున్నా - గాయాలు తుడిచి కట్టుకట్టారు. ఆ పిల్ల భయంతో మాటి మాటికి రోడ్డువైపే చూస్తోంది. ఏడుస్తూనే ఉంది. మోచేతులు చూసుకొని ఊదుకొంటోంది.

ʹఇంక భయం లేదులే పాపా! ఎవ్వరూ రారు. మేమంతా ఉండ్లాʹ అన్నాడు. నాన్న - ʹమీ ఇల్లు ఎక్కడో చెప్పుʹ మేము వదిలి పెట్టి వస్తాం....ʹ అంది అమ్మ ఎదురింటి అనంతమ్మా ఓదార్చింది... ఇంతలో గుంపతా జారుకొన్నారు. ʹఇంట్లోకి తీస్కపోండిʹ బయటుంటే కష్టం ʹఆ లమ్డీనా కొడుకులు మల్లోస్తేʹ అనంతమ్మ సందేహం... ఆ పిల్లను ఇంటిలోకి పిలుచుకొచ్చారు. నన్ను అక్కా అంటోంది ఆ పిల్ల. వారం రోజులు సపర్యలు తర్వాత వివరాలన్నీ కనుక్కొన్నాను. వాళ్ల మామని ఎవరో ఒకతను వచ్చాడు. అనంతమ్మ అతన్ని విచారించింది. ʹలచ్చిందేవి, పంపించు మీరు మాత్రం ఎన్ని రోజులు చూత్తారు మీకు ఇద్దరు ఆడపిల్లలున్నారు అంది. అమ్మతో... అమ్మ తలూపింది.

తర్వాత రాము గురించో, ఫీజు కట్టాలనో వచ్చినపుడు నన్ను మాట్లాడించేది. ఆ పిల్లే..... ఆ కమలమ్మ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా... గుర్తు చేశాను.... చాలా సంతోషించింది.

తర్వాత పెద్ద బిడ్డ పెళ్లికి పిలవాలని వచ్చింది. పదారేళ్లకే పెళ్లి - బాగా చదువుతుంది కదా! అప్పుడేం తొందరʹ అడిగాను ʹఎదిగిన పిల్లను ఇంట్లో పెట్టుకోలేనమ్మ -ʹ ఇప్పటికే ఎక్కువ. ఒంటరిదాన్ని ఎవరు చూత్తారు? నాకు ఉంటే తినిపోతారు. బంధువులా పాడాʹ తిట్టిపోసింది. చెరువుకట్టపైనే పెళ్లి తప్పక రావాలమ్మ-ʹ వెళ్లిపోయింది.

తర్వాత రెండు, మూడేళ్లు గడిచిపోయాయి. నేను ఇంగ్లీష్‌ మీడియం బాధ్యతల్లో ఉన్నా - తెలుగు మీడియం హెడ్మాస్టర్‌ చేరారు అందుకని అక్కడి పిల్లల గురించి పెద్దగా పట్టించుకోలేదు. 6వ తరగతిలో అడ్మిషన్‌ చేసేందుకు రాము వాళ్లమ్మను పిలిపించాడు. హెడ్మాస్టర్‌... నాలాంటి అనుభవం ఆయనకు ఎదురయింది... అప్పుడు రాము అమ్మాయి అని తెల్సింది... పేరు - ʹరామాంజినమ్మా... ʹఅంజనిʹ అని మారుస్తాం బాగుంటుంది అడిగాను. రాము - అంజని అయింది. రాము పేరే అలవాటు. కొత్తగా ఉంది. తరగతులు మారుతున్నాయి. అంజని ఎన్నో బహుమతులు అందుకుంది. క్లాసులో ఆ పిల్లా మొదటి ర్యాంకు వాళ్లమ్మ వచ్చినప్పుడు తప్పక నన్ను కలిసే వెళ్లేది.

రాము 8వ తరగతిలో కొచ్చింది. కానీ నిక్కరు చొక్కాలోనే వచ్చేది. ʹడ్రస్‌లు కొనివ్వమ్మాʹ చెప్పా, ʹఈ విషయంలో నన్నేమీ బలవంతం చేయద్దమ్మాʹ - ఇంకా రెండేళ్లు తర్వాత ఎక్కడో చేరుత్తా - అప్పుడు తప్పదు కదా! అంది. ఆమె వేదన నాకర్థమయింది. బాలల దినోత్సవం నాడు రాము నెహ్రూ గురించి మాట్లాడింది. అన్ని పోటీల్లో పాల్గొంది - టీచర్లంతా ఆ అమ్మాయిని అభిమానిస్తున్నారు... ʹనా బిడ్డ బాగా సదువుతాంది. ఎంత సదివితే అంతా సదివిత్తా అంది ఒక రోజు మెరిసే కళ్లతో - 10వ తరగతి రిజల్ట్‌ వచ్చింది - అంజని డిస్టింక్షన్‌లో పాసయింది. కమలమ్మ స్వీట్లు తీసుకొని వచ్చింది. ఇన్నాళ్లు నా బిడ్డను అంతా కడుపులో పెట్టుకుండారు. ఇంకెట్లా చేయాలో డాక్టరు సదువుతాదంట... ʹఅంత శక్తి నాకేడుందమ్మ...ʹ అంజని తల్లి పక్కనే నిలబడింది. ఎప్పట్లాగా క్రాపు, షర్ట్‌, పాంటు - గొప్పగా తేజస్సుతో వెలిగిపోతaంది. టీచర్లందరం అభినందించి బహుమతులిచ్చాం - ఎప్పుడే అవసరం ఉన్నా తప్పదు కదాʹ, మెడిసన్‌ చాలా చాలా కాలం పడ్తుంది. అమ్మ పరిస్థితి ఆలోచించు అన్నా... తర్వాత శెలవు తీసుకొన్నారు... విజయవాడ గీతాంజలిలో ఫీజులు లేకుండా చేర్చుకున్నారని తెల్సింది. అంజలి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. అక్కడా మంచి మార్కులతో పాసయిందంట. వాళ్లమ్మ వచ్చి సంతోషం పంచుకొని పోయింది.

ʹఇప్పుడూ పాంటు, షర్టేనా అడిగిందిʹ పద్మావతి టీచర్‌. ʹలేదు మేడమ్‌ ఇప్పుడన్నీ డ్రస్సులే- ఇప్పుడెంత బాగుందో నా బిడ్డʹ కమలమ్మ.

శెలవులిస్తే రమ్మను స్కూలు మరిచిపోతే ఎట్లా అన్నాను. లేదమ్మా - మిమ్మలందరిని తల్చుకుంటూనే ఉంటాం అంది కమలమ్మ.

కాలేజీలు తెరి చారు. అంజని ఇంటర్‌ రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టిందంట... తర్వాత కమలమ్మ రావటం బాగా తగ్గిపోయింది.

ఆ రోజు ఆదివారం కావటంతో టీ తాగుతూ, పేపర్లు తిరగేస్తూన్నా.... ʹజీసెస్‌నగర్‌లో ఓ మహిళ దారుణ హత్యʹ వార్త - ఆమె ఇంట్లో దోపిడి జరిగిందని, గుర్తు తెలియని వ్యక్తులెవరో చంపారనిʹ - రాశారు. ఎక్కువ వివరాలు లేవు - ఫోటో ఉంది మృతురాలి ముఖం స్పష్టంగా లేదు రక్తపు మడుగులో పడి ఉంది.

పేపర్లు మడిచి పక్కన పడేశాను. సోమవారం స్కూలుకు వెళ్లా. ఇంకా గేటుదాటి లోపలికి వెళ్లలేదు. ఇంతలోనే విజయ టీచర్‌ దగ్గరగా వచ్చింది - మేడం మీరు వార్త పేపర్‌ చదివారా నిన్న - అడిగింది.

లేదు మేము ఈనాడు తెప్పిస్తాం అన్నాను.

ʹఅంజని వాళ్లమ్మను ఎవరో దారుణంగా చంపేశారంట మేడం అంది. ఆమె - వారం క్రితమే క్లాసులు మొదలయ్యాయంట - వాళ్ల అక్క తల్లి దగ్గరే ఉంది. బావ ఆ పిల్లను పిల్చుకురావడానికే వెళ్లారట అంది. కమలమ్మ - అందమైన ముఖం నా మనసులో మెదిలింది. ʹఎందుకింత దుర్మార్గం. ఆమె ఇళ్లలో పని చేసుకొని బతికేది. ఆమె మీద ఎవరికింత శత్రుత్వంʹ అన్నాను. అప్రయత్నంగా ʹమీకు తెలీదా మేడమ్‌, ఆమె గురించి, అందరికీ తెల్సు, ఆమెకు గుండాలతో లింకులున్నాయి అందొక టీచర్‌ - ʹమీకెలా తెల్సు అడిగాʹ...

ʹవేరే పేరెంట్స్‌ మాట్లాడుకుంటుంటే విన్నానుʹ అంది.

ఆ రోజు పని మీద దృష్టి పెట్టలేకపోయాం ʹప్రేయర్‌లో ఆమె ఆత్మశాంతి కోసం మౌనం పాటించాంʹ తర్వాత ఎవరి క్లాసులకు వాళ్లు వెళ్లిపోయాం.

ఆఫీస్‌ రూంలో ఒంటరిగా ఉన్నా - టీ తెప్పించుకుని తాగాను. తల వేడెక్కి పోతోంది. ఎమిటీ ఘోరం... కమలమ్మ, అంజనీలు కనపడుతున్నారు. చివరిసారిగా నాతో కలిసి చెప్పిన మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి.

ʹఆ రోజు కాస్త తీవ్రంగానే కోప్పడ్డాను...ʹ ఎప్పుడు పేరెంఠ్స్‌ మీటింగ్‌ పెట్టినా రావెందుకు? మీ అమ్మాయి బాధపడదా? కమలమ్మ ʹఅమ్మా నా బిడ్డ గురించి అడిగేందుకేం ఉంది అంతా మీరేసూత్తున్నారు నేనొత్తే మీ మాదిరి అంతా గౌరవిత్తారా? ఏ తెల్సిక నాబట్టో నా బిడ్డను ఏడిపిత్తే, అవమానిస్తేʹ అంది.

ʹతప్పుడు నాయాళ్లు రాత్రిళ్లు తప్పతాగి నా ఇంటికొత్తారుʹ వాళ్లలో ఎవడన్నా ఏదన్నా వాగితే నా బిడ్డలకు కష్టం కదా?ʹ అంది. ʹఇంతవరకూ అది బిడ్డ అని తెలియనీయలేదు ఎవరికీʹ స్కూలుకి షర్టు నిక్కరు, పాంటూ, షర్టులో పంపానుʹ.

ʹఅప్పుడప్పుడూ అందరిలా గౌన్లు, రంగురంగుల డ్రస్‌లు వేసుకోవాలని, ఏడ్చి ఏడ్చి గోల గోల చేసేదిʹ నేనూ మొండిగా తిట్టేదాన్ని - సదువు మాన్పిత్తా అంటే చాలు గోలంతా కట్టిపెట్టేది. ఏం చేసేదమ్మా - ఇంతకంటే ఆమె ముఖంలో ఆవేదన స్పష్టంగా కన్పడుతోంది. బిడ్డ అనే విషయం తప్పుడు నా కొడుకులకు చెప్పలా - ఆ పక్క గదిలో సంటిబిడ్డప్పటి నుండి రాత్రి ఎనిమిదికే నిద్రమాత్రలు వేసి పాలు తాపించి పడుకోబెట్టేదాన్ని పెద్ద పిల్లనెట్టా కాపాడిండానో నాకే తెల్సు. మా చిన్నాయిన ఇంటి కంపేదాన్ని అందుకే అంత తొందరగా పెళ్లి చేసినా అంది కమలమ్మ... తండ్రి గురించి అడిగినపుడు ఆమె ఎట్లా స్పందించిందో గుర్తొచ్చింది.

ఆ తల్లి ఎంత వేదన అనుభవిస్తోంది మాటల్లో పెట్టటం కష్టం

ʹపిల్లల గౌరవం కోసం పగలు నాల్గిండ్లల్లో పని చేసేదాన్ని మేడం నా బతుకిట్టా కాలిపోయింది. మా రామూ బాగా సదవాలి - సల్లంగుండాలి - ఈ నా బతుకు శత్రువుకు కూడా వద్దు...ʹ ఆమె ఏడుస్తోంది...ʹ ఆవేదన అంతా బయటకొస్తోంది. ఇంతలో, ఎవరో అటు రావడంలో కళ్లు తుడుచుకొని లేచింది. నమస్కారం చేసి వెళ్లిపోయింది. నేనలా మాన్పడిపోయా - స్తబ్దుగా ఉండిపోయా. వెళ్తూ వెనక్కి తిరిగింది ఎందుకో - ఇంకా ఏదో చెప్పాలనుకుంటుంది. నీ బిడ్డకు మేమంతా అండగా ఉంటాం ఏ సహాయం కావాలన్నా అడగమని చెప్పు అన్నాను. ఆమె సంతోషంతో వెళ్లిపోయింది. అదే ఆఖరవుతుందని అనుకోలా ఆ రోజు... ఇప్పుడు ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకొనే అవకాశమొచ్చింది. టీచర్లందరం సాయంత్రమే కలిసి చర్చించుకొన్నాం అందరూ ప్రయివేటు ఉద్యోగాలు, చిన్న జీతాలే. సోషల్‌ వెల్పేర్‌ ఫండ్‌ ఎలానూ ఉంది. ఆర్‌.డి.టి. వాళ్ల సాయం కోసం అడిగాం... తలా చెయ్యి వేశాం.

అంజనిని దిగులు, దైన్యం నుండి బయట పడేయాలనుకున్నాం. కానీ ఆ దుఃఖం తీర్చడం ఎవరికి సాధ్యం. అందరూ మాట్లాడి దైర్యమిచ్చాం. అక్కా బావలు అండగా నిలబడ్డారు. కొత్త కథ మొదలయింది. అంజనిప్పుడు బి.టెక్‌. ఫైనలియర్‌. చదువు ఆపలేదు.

(విర‌సం సాహిత్య పాఠ‌శాల‌లో ఆవిష్క‌రించిన "మా తుఝే స‌లాం" క‌థా సంక‌ల‌నం నుంచి)

No. of visitors : 770
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీ పేరేంటి?

ఆర్‌. శశికళ | 03.09.2016 12:22:28am

స్టాఫ్‌ మీటింగ్‌ నడుస్తోంది. ʹసున్నాలు, ఒకటి, రెండు మార్కులు వచ్చే వాళ్ళంతా కలిపితే 100 మంది తేలారు. 6 నుండి 10 వరకూ అన్ని సెక్షన్లు...........
...ఇంకా చదవండి

బ్రతుకు భయం

ఆర్‌ శశికళ | 20.10.2016 02:10:18am

కల్తీ కల్తీ ఇక్కడ ఈ సరుకుల్లో పాలు, నీళ్ళు, నెయ్యి, నూనె, వంట సరుకులు ఓ ఒకటా, రెండా.. షాపుకెళ్ళి ఏం కొనాలన్నా భయంతో బిగుసుపోతున్నా.....
...ఇంకా చదవండి

నా చేతుల్లో ఏముంది ?

ఆర్‌ శశికళ | 05.10.2016 12:20:01am

ఇంటర్వ్యూలో ఫెయిల్‌ అయ్యారంట తల్లిదండ్రులు . సెలక్ట్‌ అయితే వెంటనే అడ్మిషన్‌ స్లిప్‌ ఇస్తారంట. కానీ అలా జరుగలేదు. బయటికి వచ్చాక ఇద్దరు తగువులాడుకుంటున్నారు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •