మహిళలు గృహిణులుగానే వుండిపోకుండా బయటికి వచ్చి ఉద్యోగం చేయడానికి, సంఘాలు, యూనియన్లుగా ఏర్పడటానికి, పురుషులతో సమానంగా వేతనాలు పొందడానికి, ప్రసూతి సెలవులు, శిశు సంరక్షణశాలలు ఏర్పరచుకోవడానికి, ఓటు వేయడానికి, అన్ని రంగాల్లో పాల్గొంటూ ఆస్తి హక్కును సైతం పొందడానికి కారణం ముందు తరాల స్త్రీలు చేసిన చారిత్రాత్మకమైన పోరాటాలే. కానీ నేడు ఆ చరిత్ర ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ తెలియకపోవడం బాధాకరమైన విషయం. పాఠ్యాంశాల్లోగానీ, మీడియాద్వారా గానీ ఈ చరిత్రను తెలిపే ప్రయత్నం చేయరు. తెలిస్తే ఎక్కడ చైతన్యవంతమై తమ డిమాండ్ల కోసం పోరాటాలు చేస్తారోనని ఈ ప్రభుత్వాల భయం. అయితే పౌరులుగా బాధ్యతగా, ఈ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
19వ శతాబ్దంలో, 20వ శతాబ్దం మొదల్లో యూరోప్ నుండి అమెరికాకు చాలా కుటుంబాలు వలస వచ్చేవి. వారు వివిధ కంపెనీలలో పని చేసేవారు. విపరీతమైన శ్రమ దోపిడి జరిగేది. మహిళా కార్మికులైతే అతి తక్కువ వేతనంతో పాటు అనేక బాధలకు గురయ్యేవారు. రోజుకు 15గంటల పని ఉండేది.
తెల్లవారుఝామునే ఇంటి పనులు చూసుకుని సూర్యోదయానికి ముందే పనికి వెళ్ళి రాత్రి ఎప్పటికోగాని ఇల్లు చేరేవారు కారు. వెలుతురే చూడని జీవితాలు వారివి. మూత్ర విసర్జనకు వెళ్ళినా కంపెనీ యజమానులు జరిమానాలు విధించేవాళ్లు. అమెరికాలో శ్రామిక పోరాటాలు పురుషులతోనే జరిగేవి. వారికి మద్దతుగా మహిళా కార్మికులు ఉండేవారు. అయినా మహిళల సమస్యలు గుర్తించకపోయేవారు. దుర్భరమైన పని పరిస్థితుల నుండి క్రమంగా మహిళలు బృందాలుగా, యూనియన్లుగా ఏర్పడ్డారు.
1820లలో న్యూ ఇంగ్లాండ్ టైలరింగ్ ట్రేడ్స్ లో మొత్తంగా మహిళా కార్మికులే సమ్మెలు నడిపారు. బట్టల, జౌళి పరిశ్రమలకు చెందిన మహిళలు న్యూయార్క్ నగరంలో 1857, మార్చి 8న పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పని పరిస్థితుల మెరుగుదలకు, పనిగంటల తగ్గింపుకు, సమాన వేతనాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తూ, దుస్తుల తయారీ శ్రామికులు, కవాతు చేస్తూ పికెట్ చేశారు. మార్చి 8 వారసత్వంగా మహిళలు అదే నెలలో తమ మొదటి లేబర్ యూనియన్ను స్థాపించుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా తమ హక్కుల కోసం ఆ నెలలో నిరసన ప్రదర్శనలు జరిపారు. 1908 మార్చి 8న న్యూయార్క్ లో ʹ1857 కవాతుʹను గుర్తుచేసుకుంటూ, ఓటు హక్కు కోసం, చిన్న పిల్లలతో శ్రమ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ కవాతు చేశారు.
ఇట్లా అనేకంగా చెలరేగిన కార్మిక మహిళా ఉద్యమాలకు కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ మద్దతునిచ్చింది. రెండో ఇంటర్నేషనల్ తర్వాత శ్రామిక వర్గ పోరాటాలతో ముడిపడిన మహిళా విముక్తి గురించి స్పష్టమైన అవగాహనతో సోషల్ డెమాక్రటిక్ మహిళా ఉద్యమం నిర్మాణమైంది. అది బూర్జువా ఫెమినిజంతో సైద్ధాంతిక పోరాటం చేసింది. దీనిలో క్లారా జెట్కిన్ కీలక పాత్ర పోషించింది. జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ సోషల్ డెమాక్రటిక్ మహిళా ఉద్యమానికి అంతర్జాతీయ కార్యదర్శి. అంతర్జాతీయ మహిళా దినం ఆవిర్భవించడానికి వెనక ఆమె కీలక పాత్ర పోషించారు. సకల దేశాల శ్రామికులు ఏకం కావాలన్న కమ్యూనిస్టు స్ఫూర్తి, మహిళా విముక్తి శ్రామికవర్గ విముక్తితో అనుసంధానంగానే జరుగగలదన్న స్పష్టత అంతర్జాతీయ మహిళా దినానికి ఉంది.
ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన రోజున ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ హక్కుల సాధన కోసం శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తిని తీసుకోవాలని కోరుతూ క్లారా జట్కిన్ ఒక ప్రణాళికను తయారు చేసింది.
1910 ఆగస్టులో కోపెన్ హాగెన్ లో అంతర్జాతీయ మహిళా మహాసభ జరిగింది. రెండవ సోషలిస్టు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు ముందు జరిగిన ఈ మహాసభలో జర్మనీకే చెందిన లూయిస్ జీట్స్ అనే సోషలిస్టు మహిళ ఉమెన్స్ డే ప్రతిపాదనను ప్రవేశపెట్టిగా క్లారా జట్కిన్ దానిని బలపరిచింది. ఫలానా తేదీ అనుకోలేదు గాని అంతర్జాతీయ మహిళా దినాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మహిళల హక్కుల ఉద్యమాలను గౌరవిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఓటు హక్కును సాధించాలని, ఆ సమావేశంలో ప్రతిపాదించారు. యూనియన్లుకు, సోషలిస్టు పార్టీలకు, మహిళాశ్రామిక వర్గానికి, క్లబ్బులకూ, ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళలు, ఫిన్లాండ్ పార్లమెంటుకు మొదటిసారి ఎన్నికైన ముగ్గురు మహిళలతో సహా 17 దేశాల నుండి వచ్చిన 100 మంది మహిళలు వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. దాని ఫలితమే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం. 1911లో క్లారా జట్కిన్ ఆధ్వర్యంలో మార్చి 19న మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, స్విజర్లాండ్ దేశాలలో లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సంవత్సరం మార్చి 25న న్యూయార్క్ ట్రయాంగిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి 146 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలో కనీస రక్షణ ప్రమాణాలు లేకపోవడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం దీనిని గుర్తు చేసుకుంటుంది. అలాగే వీరోచితమైన మహిళా పోరాటాలను స్మరిస్తుంది.
1913 వరకు వివిధ దేశాల్లో వేరు వేరు తేదీల్లో అంతర్జాతీయ మహిళా దినాన్ని జరుపుకున్నారు. 1913లో అది మార్చి 8కి మారింది. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా ఆ రోజును గుర్తించడం మొదలయ్యింది. అక్టోబర్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినాన్ని అధికారిక సెలవుగా ప్రకటించింది.
1980 మార్చి 8న దేశ వ్యాప్తంగా అనేక పట్టణాల్లోని మహిళలంతా వీధుల్లోకి వచ్చారు. మధుర రేప్ కేసును తిరిగి విచారించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర పోలీస్ స్టేషన్లో అరెస్టైన మహిళ వేశ్య అని పోలీసులు రేప్ చేశారు. ఈ కేసులో ఆమె వేశ్య కాబట్టి, ఆమె ప్రతిఘటన లేదు కాబట్టి, పోలీసులు రేప్ చేయడం తప్పుకాదని కోర్టు తీర్పు ఇచ్చింది. వేశ్య అయినా ఆమె అంగీకారం లేకుంటే రేప్ కిందకే వస్తుందని వాదించారు. అక్కడి నుండి వరుసగా ఒక్కో సంవత్సరం మహిళలకు సంబంధించిన వివిధ సమస్యలపై దృష్టిని పెడుతూ సభలు నిర్వహిస్తున్నారు.
మార్చి 8ని ప్రభుత్వాలు ఆర్భాటంగా చేస్తాయి. హక్కుల కోసం మహిళలు సంఘటితమైతే ఉక్కుపాదంతో అణచివేస్తాయి. మహిళలు పొరాడి సాధించుకున్న మద్య నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు మహిళా పక్షపాతినంటూ కోట్లు ఖర్చు పెట్టి మహిళా పార్లమెంటు నిర్వహించి మసి పూసి మారేడు కాయ చేయొచ్చనుకుంటాడు. రాజ్యహింస, మాఫియాల హింసను అమలుచేయడంలో రాటుదేలిన బాబు మీ చట్టాలనే అమలు చేయమని అడుగుతున్న చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై ముసుగు సంఘాల పేర్లతో పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేసే హీనత్వానికీ వెనుకాడడు. కడుపులో పిండంగా ఉన్నప్పటి నుండి చచ్చేంతవరకు మహిళ అడుగడుగునా అణచివేతకు గురవుతూనే ఉంది. రాజ్యం కూడా పితృస్వామిక వైఖరే కలిగి ఉంటుంది. అంతర్జాతీయ శ్రామిక మహిళా ఉద్యమ స్ఫూర్తితో సంఘటిత పోరాటాలు చేస్తే తప్ప మహిళలు ధైర్యంగా ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితి లేదు.
Type in English and Press Space to Convert in Telugu |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |