ఈ తీర్పుతో బుద్ధిజీవులకు బుద్ధి రావాలట

| సంపాద‌కీయం

ఈ తీర్పుతో బుద్ధిజీవులకు బుద్ధి రావాలట

- -పి.వరలక్ష్మి | 05.04.2017 09:33:08pm

ʹఆయన శారీరకంగా బలహీనుడు కావొచ్చు, కానీ ఆలోచనా పరంగా చురుగ్గా ఉన్నాడు.ʹ ప్రొఫెసర్ సాయిబాబా తొంభై శాతం అంగవైకల్యం ప్రస్తావనకు న్యాయమూర్తి అన్న మాటలివి. ఆయన ఆలోచించగలడు. భావాలు ప్రచారం చేయగలడు. ప్లాన్లు వేయగలడు. మావోయిస్టులకు సహకరించగలడు. అతని ఆలోచనలు ఎంత ప్రమాదకరమైనవంటే జీవిత ఖైదు విధించేంత. ఢిల్లీ యూనివర్సిటీ, జె.ఎన్.యూలో పోరాటాలు చేసే విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఊరికే క్లాస్ రూం పాఠాలు కాదు. హిందూ జాతీయవాదాన్ని కాదని ప్రజాస్వామ్యమని చెప్తూ దేశద్రోహానికి పాల్పడే పాఠాలవి. ఈ మాటలు కూడా న్యాయమూర్తే అన్నారు. సాయిబాబాతో పాటు ఉత్తరాఖండ్ కు చెందిన జర్నలిస్టు, రచయిత ప్రశాంత్ రాహి, జె.ఎన్.యూ పరిశోధక విద్యార్థి, సాంస్కృతిక కార్యకర్త హేమ్ మిశ్రా, మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన ఆదివాసులు విజయ్ టిర్కి, పాండు నరోత్ లకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్చి 7న తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మరో ఆదివాసీ మహేశ్ టిర్కికి పదేళ్ళు శిక్ష విధించింది. వీళ్ళందరినీ వేరు వేరు చోట్ల అరెస్టులు చేసి కుట్ర కేసు రాసేశారు.

సాయిబాబా విషయమే తీసుకుంటే మొట్ట మొదట ఆయన ఇంటి మీద పోలీసులు దాడి చేసింది గడ్చిరోలీ జిల్లాలో ఏదో దొంగతనం జరిగిందనే కారణం మీద. దొంగిలించిన సొత్తు కోసం ఆయన ఇంటిని సోదా చేయడానికి సెర్చ్ వారెంట్ తో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆయన కంప్యూటర్, హార్డ్ డిస్కులు, పుస్తకాలు ఎత్తుకుపోయారు. అప్పటికే మావోయిస్టు కేసు బనాయించబడిన ప్రశాంత్ రాహి, హేమ్ మిశ్రాలతో కలిపి కుట్ర కథ రచించారు. ఆయన మావోయిస్టులతో ఉత్తరాల ద్వారా సంప్రదింపులు జరిపాడని, ఆయన కంప్యూటర్ లో మావోయిస్టు పార్టీ వాళ్ళు ఇచ్చిన స్టేట్ మెంట్లు ఉన్నాయని, ఆయన ఆర్.డి.ఎఫ్ నాయకుడని, ఆ సంఘాన్ని నిషేధించారని (రెండు రాష్ట్రాల్లో విధించిన నిషేధం చెల్లదని కోర్టులో వేసిన కేసు పెండింగ్ లో ఉంది) ఇట్లా ఆయనెంత ప్రమాదకరమైన వ్యక్తో 827 పేజీల తీర్పులో చెబుతూ వచ్చారు. సాయిబాబా రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ (ఆర్.డి.ఎఫ్) నాయకుడు. ఆర్.డి.ఎఫ్ ప్రణాళికకు, మావోయిస్టు రాజకీయాలకు సామ్యం ఉంది. మావోయిస్టులు ఈరోజు అతి పెద్ద ప్రమాదంగా తయారై దేశంలోకి పెట్టుబడులు రానివ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి, ఆ మావోయిస్టులను వీళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి ఇటువంటివాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా వీళ్ళకు అతి పెద్ద శిక్ష విధించాలి. దురదృష్టవశాత్తూ ఊపా (UAPA) కింద జీవితఖైదు మాత్రమే విధించగలం. అందువల్ల కానీ లేకపోతే మరణశిక్ష వేసేయాలి. ఇంచుమించు ఈ అర్థం వచ్చే మాటలే జడ్జి మాట్లాడారు. దేశ చరిత్రలో ఇంత కక్షపూరితంగా న్యాయమూర్తి మాట్లాడటం చూసామా? అది కూడా నిందితులు కేవలం భావాలు కలిగి ఉన్నందుకు.

విచారణ ఖైదీగా ఉన్న రెండేళ్ళలో సాయిబాబా ఆరోగ్యం శిధిలమైంది. వైద్య సౌకర్యాలు కల్పించాలని అనేక సార్లు నిరాహార దీక్షలు చేసి చివరికి బెయిల్ వచ్చాక గాని ఆయనకు సరైన వైద్యం అందలేదు. 90 శాతం అంగవైకల్యంతో పాటు తీవ్ర రక్తపోటు, గుండె జబ్బు, భుజం నరాల క్షీణత, వెన్నెముక నొప్పి వంటి సమస్యలు జైలు అధికారుల మొరటు వైఖరి వల్ల మరింత తీవ్రమయ్యాయి. ఈ జబ్బుల నుండి ఆయన ఇంకా కోలుకోలేదు. ఈ తీర్పు వచ్చే సమాయానికి ఆయన ప్యాంక్రియాస్ సమస్య వల్ల శస్త్ర చికిత్సకు తయారవుతూ ఉన్నారు. అందుకోసం ఆహారం, మందులు విశ్రాంతి ఎంతో అవసరమని వైద్యులు చేప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నివేదిస్తూ ఇచ్చిన పిటిషన్ కూడా కోర్టు స్వీకరించలేదు. ఇప్పుడాయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహిలు కూడా అనారోగ్య సమస్యలతో ఉన్నారు.

ఈ తీర్పును తప్పుపట్టినా మావోయిస్టుల తరపున మాట్లాడినట్లే కావొచ్చు. మావోయిస్టుల తరఫునే కావొచ్చు అసలు మాట్లాడితే తప్పెలా అవుతుంది అంటారా? ఈ రోజు హక్కులని మాట్లాడితే, పోలీసు చర్యలకు ఆటకం కలిగించి తద్వారా మావోయిస్టులకు సహకరించినట్లే. మావోయిస్టులకు సహకరించడం అన్నిటికన్నా పెద్ద నేరం. రాజ్యం చూస్తూ ఊరుకోదు. ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు తమ పని తాము చేసుకుంటుంటే చట్టమని, న్యాయమని, హక్కులని కొంతమంది బయలుదేరారు. మావోయిస్టు మద్దతుదారులను చంపకూడదట. అత్యాచారాలు చేయకూడదట. వాళ్ళ ఇల్లు కాల్చేయకూడదట. వాళ్ళను జైళ్ళలో వేయకూడదట. ఆదివాసీలపై మారణహోమమని దేశమంతా ప్రచారం చేస్తున్నారు. ఇట్లా మాట్లాడి, రాతలు రాసి చికాకు పెడుతున్నందుకే మాలినీ సుబ్రమణ్యం వంటి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి బస్తర్ నుండి వెళ్లగొట్టేది. సోనీ సోరీ వంటి వాళ్ళ మీద యాసిడ్ దాడి చేసేది. ప్రొఫెసర్ నందినీ సుందర్ లాంటివాళ్ల మీద ఏకంగా మర్డర్ కేసు పెట్టేది. బేలా బాటియా వంటి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసేది. ఇట్లా మాట్లాడుతున్నందుకే శాలినీ గేరా, ఇశా కందేల్ వాల్ లను మోటారు వాహనాలతో తొక్కించాలని సుక్మా ఎస్.పి అంటున్నది.

ఇంత చేస్తున్నా తెలంగాణ నుండి ఒక ఏడుగురు నిజనిర్ధారణకు బయలుదేరుతారు. పదమూడేళ్ళ పిల్లవాడిని ఎన్ కౌంటర్ చేశారని, దాని గురించి నిజనిర్ధారణ చేసి లోకానికి చెప్పాలని వెళతారు. బస్తర్ లో జర్నలిస్టులు రాయలేనిది, రాసి బతకలేనిది ఎక్కడి నుండో వచ్చి రిపోర్టు రాయబోతారు. హక్కుల సంఘాలో, న్యాయవాదులో, జర్నలిస్టులో ఎవరైతే ఏమిటి? బస్తర్ లో అడుగు పెట్టబోతే తగిన శాస్తే. ఇంకేవ్వరూ ఇటు చూడకుండా కనీసం ఏడేళ్లు జైల్లో పడేయ్యాలి. తెలంగాణ డెమాక్రటిక్ ఫ్రంట్ నిజనిర్ధారణ బృందం చిక్కుడు ప్రభాకర్, బల్లా రవీంద్రనాథ్, దుడ్డు ప్రభాకర్, దుర్గా ప్రసాద్, ఆర్.లక్ష్మయ్య, రాజేంద్ర ప్రసాద్, నజీర్ లకు మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టు చివరికి హై కోర్టు కూడా బెయిలు నిరాకరించింది అందుకే. ఎంత పకడ్బందీగా ఉచ్చు పన్నుతారంటే ఇటు తెలంగాణ సరిహద్దులోపల తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయి ఛత్తీస్ఘడ్ పోలీసులకు అప్పజెబుతారు. వాళ్ళేమో వీళ్ళ ఫోటోలు పత్రికల కిచ్చి ఏడుగురు మావోయిస్టులు అరెస్ట్ అని చూపుతారు. మావోయిస్టుల కోసం పాత నోట్లు మార్పిడి చేస్తున్నారని కేసు పెడతారు.

తమిళనాడులో మావోయిస్టు ఖైదీల కేసులు వాదిస్తున్నాడని అడ్వకేట్ మురుగన్ ను UAPA కింద అరెస్టు అరెస్టు చేయడమే కాక ఆయన ఇంటి మీద పడి ఆయన పుస్తకాలను, ఆయన వాదిస్తున్న కేసులకు సంబంధించిన ఫైళ్లన్నిటినీ పోలీసులు ఎత్తుకెళ్లిపోతారు. మన రాజ్యాంగం అలా ఉంచి, ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఫలానా వాళ్ళ తరపున కేసు వాదించడం నేరం అని కూడా ఈ దేశంలో రాజ్యం శాసించగలదు. ఇదంతా దశల వారీగా అమలవుతున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ లో భాగమే. లక్షల కోట్ల పెట్టుబడుకు ఈ దేశ అడవిని, ప్రకృతి సంపదను బలి పెట్టి, పర్యావరణాన్ని విధ్వంసం చేసి, లక్షలాది మంది ఆదివాసుల ఉసూరు తీసే అభివృద్ధి ప్రణాళికలో భాగమే. అయిదేళ్ళో, పదేళ్ళో శాసన సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వచ్చిన వాళ్ళకు ఈ దేశ సంపదను, వనరులను శాశ్వతంగా ప్రజల నుండి లాక్కొని పెట్టుబడిదారులకు ఇచ్చివేసే హక్కు ఎక్కడిదని ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీలు అడుగుతున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లో కూర్చున్నది దేశ సంపదను కాపాడటానికా, తెగనమ్మడానికా? జావాబుదారీగా ఉండాల్సింది ప్రజలకా, పెట్టుబడిదారుకా? సమాధానం తుపాకులతో చెబుతున్నది ప్రభుత్వం. బాక్సైట్ కోసం ముప్పై ఒక్క మందిని ఊచకోత కోసి ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో నెత్తురు పారించినప్పుడు ఆ ఆదివాసులే కాదు దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు, బుద్ధిజీవులు ప్రశ్నించారు. అట్లాగే బస్తర్ లో ప్రభుత్వం జరిపిస్తున్న మారణహోమం ప్రపంచానికి తెలిసి వస్తున్నందుకు అన్ని గొంతులను మూసివేయాలనుకున్నది. దానికి మిషన్ 2017 అని నిస్సిగ్గుగా లక్ష్య ప్రకటన కూడా చేసుకున్నది. బూటకపు ఎన్ కౌంటర్ల గురించి మాట్లాడేవాళ్లు, చట్టం, రాజ్యాంగం అని మాట్లాడేవాళ్లు వైట్ కాలర్ మావోయిస్టులట. వీళ్ళను నిర్మూలిస్తే గాని మావోయిస్టుల పీడ తొలగిపోదట. నక్సలైట్ సమస్య శాంతి భద్రతల సమస్య కాదు, సామాజిక సమస్య అని ప్రభుత్వాలు మాట్లాడే దశ నుండి వాటి గురించి మాట్లాడినా, ఆ భావాలు కలిగి ఉన్నా తీవ్రవాదులు అనే దశకు ప్రభుత్వమే కాదు కోర్టులు కూడా వచ్చేసిన పరిస్థితి.

ఈ స్థితికి బిజెపి ఫాసిజం ఒక్కటే కారణం కాదు. అసలు పచ్చి మతోన్మాద జాతీయవాదులు అధికారంలోకి రావడం వెనక కూడా కార్పొరేట్ పెట్టుబడి తీసుకుంటున్న వికృత రూపం ఉంది. ట్రంప్ కూడా దీని వ్యక్తీకరణే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్ని సున్నితత్వాలు కోల్పోతూ, కార్పొరేట్ పెట్టుబడి ఏ మాత్రం అసౌకర్యం కూడా భరించలేని స్థితి వచ్చింది. లాభాల మార్కెట్ విస్తరణ సంక్షోభంలో భాగమే ఇది. కార్మిక హక్కులు, ప్రాదేశిక హక్కులు, వన్ ఆఫ్ సెవెంటీలు వంటివి పెట్టుబడులకు అడ్డంకులని (అభివృద్ధికి అడ్డంకులని చెప్తారు) వాటిని ʹసంస్కరించేʹ పని పెట్టుకుని కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. ఏ ప్రభుత్వమున్నా అధికారపక్షం విపక్షం అని కూడా తేడా లేకుండా పెట్టుబడులకు ఊడిగం చేయడమే పరమావధిగా సాగిపోతున్నారు. 2012లో మారుతి సుజుకి కార్ల ఫ్యాక్టరీలో యూనియన్ పెట్టుకున్న నేరానికి కార్మికుల మీద యాజమాన్యం, దానితో పాటు రాజ్యం కక్షగట్టి వేధించి, ఉద్రిక్తతలు సృష్టించి అక్కడ జరిగిన దుర్ఘటనకు 148 మంది కార్మికుల మీద కుట్ర కేసు బానాయించింది. చివరి వరకు ఏ ఒక్కరికీ బెయిల్ ఇవ్వకుండా ఆఖరికి మార్చి 18న గుర్ గావ్ జిల్లా కోర్టు 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధింస్తూ తీర్పు చెప్పింది. ప్రొఫెసర్ సాయిబాబా కేసులోనే కాదు, గత ఏడాది ప్రారంభం నుండి యూనివర్సిటీ విద్యార్థుల మీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, దేశద్రోహలని ప్రచారం చేసి కేసులు బనాయించడం మొదలు ఈ జీవిత ఖైదు తీర్పులదాకా చూస్తే న్యాయస్థానాలు కూడా ఫాసిస్టు పరిభాషను అభ్యసిస్తున్నాయని అనిపించకమానదు.

ఈ తీర్పుల ద్వారా చెప్తున్నదేమంటే ఎవ్వరం నోరెత్తకుండా కార్పొరేట్ అభివృద్ధికి సహకరిస్తూ పన్నులు కడుతూ బుద్ధిగా ఉండాలని. చేయవలసిందంతా ఆరెస్సెస్ పరివారం చేస్తుంది. ఎవరు మాంసం తింటున్నారో, ఎవరు పార్కుల్లో ప్రేమించుకుంటున్నారో, ఎవరు ఫేస్ బుక్కుల్లో గీతాలు దాటుతున్నారో, ఎవరు పరిశోధనలు చేస్తున్నారో, ఏ చరిత్రలు తీసి మనోభావాలు గాయపరుస్తున్నారో, ఎవరు వందేమాతరం పాడటం లేదో, జనగన పాడే సమయంలో ఎవరు లేచి నిలబడ్డం లేదో నిజనిర్ధారణలు చేసి తగిన చర్యలు తీసుకుంటారు. ఇట్లా పెంపొందే ఉన్మాదంలో ఫాసిస్టు సేనలను ఎక్కడికక్కడ తయారుచేసుకుంటారు. ఇది అధికారంలో ఉన్నవాళ్ల హక్కు కావొచ్చు. అందువల్ల ఆ పరివారపు భావప్రకటనా స్వేచ్ఛ కూడా వెల్లువెత్తుతూ ఉంటుంది.

No. of visitors : 1113
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పిల్లల మానసిక ఆవరణ- శశికళ కథలు

-పి.వరలక్ష్మి | 05.04.2017 10:15:52pm

పిల్లలను దండించకుండా దారికి తెచ్చే విధానమేమిటో, బోధనలో సృజనాత్మకతను ఎలా మేళవించవచ్చునో ఆమె ఆచరించరిస్తూ ప్రధానోపాధ్యాయురాలిగా టీచర్లను ప్రేరేపించిన......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •