మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

| సాహిత్యం | వ్యాసాలు

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

- మిసిమి | 05.04.2017 09:43:48pm

నజీబ్ కనిపించకుండా పోయి అయిదు నెలలు గడిచిపోయింది. అతని కోసం బంధువులు, స్నేహితులు వెతకని చోటు లేదు. అతని తల్లి ఫాతిమా నఫీజ్ పోలీసులను, కోర్టును, రాజకీయ పార్టీలను, మీడియా వాళ్ళను ప్రతి రోజూ ప్రాధేయపడుతోంది. మా నజీబ్ ను అప్పగించండి. మాకింకేమీ వద్దు. వాడిని ఇక్కడి నుండి తీసుకెళ్లిపోతాం అంటోంది. ఉత్తరప్రదేశ్ లోని బడాన్ లో అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న భర్తను ఇంటి దగ్గరే వదిలేసి ఆమె కొడుకు కోసం ఢిల్లీ వచ్చింది. బంధువుల ఇంట్లో ఉంటూ దినమంతా కొడుకు కోసం తిరగడం, ఆందోళనలు చేయడం, పొద్దు గడిచాక మీడియాతో మాట్లాడ్డం.. ఇలా ఎన్ని రోజులు.. అంటుందామె.

నిజంగా నజీబ్ ఏమయ్యాడో ఎవరికీ తెలీదా? లేదు.. ఎవరికో తెలిసే ఉంటుంది. ఆ ముందు రోజు అతన్ని రక్తం కారేలా కొట్టిన వాళ్ళకు కూడా తెలీదని కాసేపు అనుకుందాం. మరి యూనివర్సిటీ విచారణలో గాని, పోలీసు ఎఫ్.ఐ.ఆర్ లో గాని అతని మీద జరిగిన దాడిని కనీసం ప్రస్తావించకుండా ఉండడం ఎందుకు? నేరం చేసిన వాళ్ళనెరినో కాపాడాలనే ఉద్దేశం లేకపోతే నజీబ్ తీవ్రంగా గాయపడిన విషయం, ఆ రాత్రి అతన్ని ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్ళిన విషయం పోలీసులు ఎందుకు దాచిపెట్టారు? వంద మంది విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది, వార్డెన్ లు చూస్తుండగా ʹవాడిని చంపుతాంʹ అని వీరంగం ఆడినవాళ్ల గురించి ఏ రిపోర్టులోనూ ఎందుకు చేర్చలేదు? ప్రతీక్ష సాక్ష్యులుగా జె.ఎన్.యూ విద్యార్థి సంఘనాయకుడు, వార్డెన్, సెక్యూరిటీ గార్డులు, 20 మంది విద్యార్థులు రిపోర్టు చేసినా యూనివర్సిటీ అధికారులు నజీబ్ ను దారుణంగా కొట్టిన వాళ్ళ మీద ఏ చర్యా తీసుకోలేదేందుకు? ఎందుకంటే కొట్టిన వాళ్ళు ఎ.బి.వి.పి కాబట్టి! దాని వెంటే ఇంకోటి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. పోయినవాడు ఏ దిక్కూ లేని పేద ముస్లిం కాబట్టి! లేకపోతే ఇంత జరిగాక యూనివర్సిటీ అధికారులు నజీబ్ ఒక ఎబివిపి విద్యార్థిని కొట్టాడని, అతన్ని కాలేజ్ నుండి, హాస్టల్ నుండి బహిష్కరిస్తున్నామని పత్రికా ప్రకటన ఇవ్వటం, ʹనిందితుడుʹ కనిపించకుండా పోయాడనడం ఇవన్నీ ఏం చెబుతున్నాయి?

ఈ ప్రశ్నలు అతని తల్లి మాత్రమే కాదు, జె.ఎన్.యూ అడుగుతోంది. విద్యార్థులు అడుగుతున్నారు. ఎబివిపి గూండాగిరి గురించి తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. అక్టోబర్ 14-15 అర్ధరాత్రి రెండు గంటలకు నజీబ్ రూమ్మేట్ ఫోన్ చేసి వెంటనే రమ్మన్నప్పుడు తల్లికి మొదలైన ఆందోళన, తెల్లారి బయలుదేరి మధ్యాహ్నం చేరుకునే దారిలో ఉండగా ʹనీ కోసం ఎదురుచూస్తున్నాʹ అని కొడుకు ఫోన్ లో మాట్లాడినప్పుడు కాలిగిన ఆతురత, పెరిగిన గుండె వేగం, నాలుగు నెలల తర్వాత కూడా అలాగే ఉంది. జరిగిన సంఘటనలు విన్నప్పుడు మరింత దడదడలాడింది. ఇంతకూ ఏం జరిగింది? ఎదురుచూస్తున్నా అని చెప్పినవాడు గంటలోనే ఏమైపోయాడు? దేశ రాజధానిలో, అదీ అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో, ఆధునిక సిసి కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య నుండి మిట్ట మధ్యాహ్నం ఎలా మాయమైపోయాడు?

తన పనేదో తను చేసుకుపోయే రకం అంటారు నజీబ్ గురించి అక్కడి విద్యార్థులు. కొత్తగా చేరాడు కాబట్టేమో పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. పేద కుటుంబంలో పుట్టిన నజీబ్ అహ్మద్ కు ఇల్లు, చదువు తప్ప వేరే వ్యాపకాలు లేవని అతని కుటుంబ సభ్యులంటారు. డాక్టర్ అవ్వాలని కలగన్నాడు. కష్టపడ్డాడు గాని ఎంబిబియస్ సీటు సాధించలేకపోయాడు. బిడియస్ లో ఆవకాశమొచ్చినా అందులో చేరకుండా అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో డిగ్రీ చదివాడు. పతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో ఎమ్మెస్సీలో సీటొచ్చినప్పుడు పొంగిపోయాడు. నజాబ్ కు ఏకైక బెస్ట్ ఫ్రెండ్ నేనే అంటుంది వాళ్ళమ్మ. కాలేజ్ లో జరిగినవన్నీ నాకు చెబుతుంటాడు.. ఒక్క రోజు కూడా వాడితో మాట్లాడకుండా ఉండింది లేదని కన్నీళ్లతో గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నెలలు గడుపుతోంది. ఇంట్లో బాధ్యత తెలిసిన పెద్ద కొడుకు. అమ్మకు సాయం చేయడమే కాదు, గంటల తరబడి ఆమెతో మాట్లాడుతూ ఉంటాడని అతని తమ్ముడు ముజీబ్ అంటాడు. కుటుంబ సభ్యులు, మిత్రులు అతన్ని అమ్మ కూచి అంటారు. అయితే కొన్నేళ్ళ క్రితం నజీబ్ తండ్రి నఫీజ్ అహ్మద్ కు ఆక్సిడెంట్ లో వెన్నెముక దెబ్బ తిన్నప్పుడు కుటుంబానికి తానే వెన్ను అయ్యాడని తల్లి అంటుంది. బాధల్లో ఉన్నప్పుడు నా పక్కన వాడున్నాడనే ధైర్యం ఉండేది. ఇప్పుడేం చేయాలో తెలీటం లేదు. దయచేసి నా కొడుకును నాకు అప్పగించండి అని మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడుతుంది.

ఏం జరిగి ఉండొచ్చు అంటే అక్కడి విద్యార్థులంతా ముందు రోజు అనూహ్యంగా జరిగిన ఘటన గురించి తప్ప చెప్పటానికింకేం లేదంటున్నారు. అక్టోబర్ 14 రాత్రి హాస్టల్ కమిటీ ఎన్నికల కోసం ప్రచారం చేసుకుంటూ వివిధ బృందాలు హాస్టల్ కు వస్తూ పోతూ సందడిగా ఉంది. విక్రాంత్ కుమార్, అంకిత్ రాయ్, సునిల్ నజీబ్ గది తలుపు తట్టారు. అనూహ్యంగా వాతావరణమంతా ఉద్రిక్తత వ్యాపించింది. విక్రాంత్ కుమార్ ను మొదట నజీబ్ కొట్టాడని అంటున్నారు. యూనివర్సిటీ విచారణ కమిటీ అది తప్ప మరేం రాయలేదు కూడా. గొడవ మొదలయ్యే సమయానికి గుమికూడిన విద్యార్థులు నజీబ్ ముక్కు, నోటి వెంట రక్తం కారుతుండగా చేతులు కట్టుకుని విక్రాంత్ ఎదుట నిలుచున్న దృశ్యాన్ని చూశారు. విద్యార్థులు చాలా మంది చూస్తుండగానే విక్రాంత్ అతన్ని చెప్పుతో కొట్టాడు. అతని మనోభావాలేవో గాయపడే విధంగా నజీబ్ మాట్లాడాడట. గుమికూడిన విద్యార్థులు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈలోగానే పాతిక మంది దాకా ఎబివిపి మద్దతుదారులు వెంటనే వచ్చి చేరారు. వాళ్ళీ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు.

రక్తం కారుతున్న నజీబ్ ను అతని ఫ్రెండ్స్ బాత్ రూమ్ తీసుకెళ్తే, అంకిత్ రాయ్ లోపలికి చొరబడి మరీ కొట్టాడు. విషయం తెలిసి వెంటనే జె.ఎన్.యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రసిడెంట్, మాజీ సెక్రెటరీ, హాస్టల్ వార్డెన్, సెక్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకున్నారు. ఘర్షణ వద్దని, సమస్యను గురించి వార్డెన్ ఆఫీసులో కూలంకుశంగా మాట్లాడుకుందామని అందరూ కలిసి నచ్చజెప్పారు. గొడవ సమసిపోవాలని ఎబివిపి అనుకోలేదు. వాళ్లెంత ప్లాన్ తో ఉన్నారంటే వార్డెన్ ఆఫీసుకు తీసుకెళ్లే దారిలో ఉండగా హాస్టల్ లైట్లు ఆర్పేసారు. అక్కడున్న ఎబివిపి బృందానికి బయటి నుండి వచ్చిన వాళ్ళు కలిశారు. వాళ్ళంతా కలిసి నజీబ్ మీద మళ్ళీ దాడి చేసి తంతూ, పిడి గుద్దులు వేశారు. అడ్డుకున్న విద్యార్థులనూ కొట్టారు. వార్డెన్ ఆఫీసు గది తలుపు తాళం వేసి ఉంది. అది తెరిచేలోగా మళ్ళీ కొట్టారు. అంతటితో ఆగలేదు. నజీబ్ మరికొంతమందిని లోపలికి తీసుకెళ్లి ఒక స్టేట్ మెంట్ తయారుచేసేలా వొత్తిడి చేశారు. రూమ్ మేట్ ఖాసీం నజీబ్ తో తనకు ఇబ్బందిగా ఉందని అతన్ని వేరే గదికి మార్చాలని ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఉన్న ఆ పేపర్ అప్పుడు చదవకుండానే సంతకం చేశానని చెప్పి తర్వాత ఖాసీం దాన్ని వాపస్ తీసుకున్నాడు. ఈలోగా బైట గుంపులో నుండి ʹవాన్ని మాకప్పగించండి, పొద్దున్నే డెడ్ బాడీ పంపిస్తాంʹ అని అభిజిత్ అనే విద్యార్థి అందరూ చూస్తుండగా వీరంగం చేశాడు. ఈ విషయాలన్నీప్రత్యక్ష సాక్షులు విచారణ కమిటీకి చెప్పినప్పటికీ వాటిని నివేదికలో చేర్చలేదు. అక్కడ నలుగురు వార్డెన్లలో ముగ్గురు ఆరెస్సెస్ వాళ్ళు. ఇక యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఎబివిపి పక్షమని చాలా సార్లు నిరూపించుకుంది. ఈసారి కూడా నజీబ్ కొట్టాడని ఎబివిపి చెప్పింది మాత్రం రాసుకున్నారు. ఆ రాత్రి నజీబ్ పరిస్థితి బాగోలేకపోవడంతో అతన్ని ఆంబులెన్స్ లో తీసుకెళ్ళాల్సి వచ్చింది. తర్వాత హాస్టల్ గదికి వచ్చిన నజీబ్ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఉండి, కొద్ది సేపట్లో అతని తల్లి, తమ్ముడు వస్తారనగా మాయమయ్యాడు. అమ్మా, నీ కోసం ఎదురుచూస్తున్నా అని గంట క్రితం ఫోన్ లో మాట్లాడినవాడు ఎలా మాయమయ్యాడు అని ఆ రోజు నుండి తల్లి రోజూ అడుగుతూనే ఉంది.

మిస్సింగ్ అని పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ రాశారు. ʹనజీబ్ యూనివర్సిటీకి తిరిగి రావాలని, వస్తే అతని మీద చర్య తీసుకునే విషయం పునరాలోచిస్తాʹమని వి.సి ప్రకటన చేశాడు. చర్యకు భయపడో, సిగ్గుతో ముఖం చూపించుకోలేకో అతను వెళ్లొపోయాడని అర్థం వచ్చేలా రాశాడు. ఎబివిపి యధావిధిగా నజీబ్ పైనే ఆరోపణలు గుప్పిస్తూ, ఈ విషయాన్ని జె.ఎన్.యూ స్టూడెంట్స్ యూనియన్ రాజకీయం చేస్తోందని కరపత్రం వేసింది. ఎబివిపిపై నామమాత్రపు విచారణ లేదు. కానీ నజీబ్ మాయం విషయమై ముందుకొచ్చిన విద్యార్థులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి అధికార్లకు ఏవేవో సాకులు దొరుకుతున్నాయి. నజీబ్ జీవితమూ, ప్రాణమూ భారతీయ మీడియా ప్రమాణాల ప్రకారం అంత విలువైనవేమీ కాదు. విద్యార్థులు, అధ్యాపకులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. లోకం పట్టించుకుంటేనే కదా ప్రదర్శనలకు విలువ.

ఇండియా గేట్ వద్ద ప్రదర్శనలో పాల్గొన్న నజీబ్ తల్లి ఫాతిమాను, చెల్లెలు సదాఫ్ ను పోలీసులు ఈడ్చి వేశారు. అనుమతి లేదని అరెస్టు చేశారు. మనుషుల్ని కలిచివేసే ఈ దృశ్యం సోషల్ మీడియా ద్వారా నజీబ్ విషయం కాస్తైనా చర్చలోకి వచ్చేలా చేసింది. వివిధ పార్టీల పరామర్శలు, నవంబర్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పడటం, అదే నెలలో నజీబ్ తల్లి డిల్లీ హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రావడం జరిగాయి గాని ఫలితమైతే లేదు. పైగా సిట్ పరిశోధన ʹనజీబ్ మానసిక ఒత్తిడి (డిప్రెషన్)లో ఉన్నాడని, కొంత కాలంగా అతను దానికి వైద్యం చేయించుకుంటున్నాడʹని ప్రత్యేకంగా చెప్పింది. కోర్టు కాస్త గట్టిగా మాట్లాడాక పోలీసులు చేసిందేమంటే నజీబ్ ఆచూకీ తెలిపిన వాళ్ళకు ఇచ్చే పారితోషకం పెంచడం. అది పెరుగుతూ పెరుగుతూ పది లక్షలదాకా చేరుకుంది. ఎబివిపితో జరిగిన ఘర్షణ ఎఫ్.ఐ.ఆర్ లో ఎందుకు లేదు అని కోర్టు అడిగింది కాబట్టి నామమాత్రపు విచారణ ఒకటి చేశారు. విచారణ కదల్లేదేమిటి అని గట్టిగా ప్రశ్న వచ్చినప్పుడల్లా కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు శక్తివంతంగా జరుగుతున్నాయి. నజీబ్ కనిపించకుండా పోయిన వందరోజులకు పోలీసులు ఉత్తరప్రదేశ్ లో ఉన్న నజీబ్ బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. జనవరి 28న ఉదయం నాలుగు గంటలకు నజీబ్ మేనమామ ఇంటిమీదికి యాభై మంది పోలీసులు వెళ్లి, వాళ్ళు విపరీతంగా భయపడిపోయేలా సోదా చేసి, ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కేసు నడపకుండా ఉండేందుకు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా అని నజీబ్ తల్లి ఫాతిమా సూటిగా ప్రశ్నించింది.

అంతే మరి. ఈ దేశంలో బాధితులు, బలహీనులే నేరస్తులు. ఒకానొక ఆందోళనలో రోహిత్ వేముల తల్లి రాధిక, నజీబ్ తల్లి ఫాతిమా ʹమాకు న్యాయం చేయండʹని ప్లకార్డులు పట్టుకుని కూర్చున్న దృశ్యం ఈ దేశ విషాద వర్తమానాన్ని ప్రతిబింబిస్తుంది. అంతకన్నా ఒక ముఖ్యమైన పరిణామానికి వర్తమాన కాలం సాక్ష్యంగా ఉన్నది. అక్టోబర్ 14న జరిగిన సంఘటనలు విద్యార్థులను అడిగి తెలుసుకొని ఫ్రంట్ లైన్ పత్రిక వివరమైన రిపోర్ట్ రాస్తూ ఒక విషయం చెప్పింది. ఎ.బి.వి.పి దాడిని గురించి చెప్పిన విద్యార్థులు చాలా మంది తమ పేర్లు రాయకండని విజ్ఞప్తి చేశారట. అంటే జె.ఎన్.యూలో టెర్రర్ సృష్టించడంలో ఎ.బి.వి.పి సఫలమవుతూ వస్తోంది. అందుకు ఏ చిన్న అది అవకాశమొచ్చినా వదిలిపెట్టడం లేదు. ఇక్కడొక ముస్లిం విద్యార్థి దొరికాడు. మరో సందర్భంలో కమ్యూనిస్టు. ఇంకోసారి ఒక కశ్మీరీ. ముస్లిం విద్యార్థులను నిష్కారణంగా కొట్టిన ఘటనలు బిజెపీ అధికారంలోకి వచ్చాక దేశంలో అనేక చోట్ల మాదిరే ఇక్కడ కూడా చోటు చేసుకుంటున్నాయి. టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తున్న సమయం చాలు, ఉద్రిక్తత రెచ్చగొట్టడానికి. గత ఏడాది ఫిబ్రవరి కశ్మీర్ మీద చర్చ నుండి ఈ ఫిబ్రవరి రాంజాస్ కాలేజ్ లో చేసిన గూండాగిరి వరకు బిజెపి ప్రభుత్వ అండతో ఎవ్వరినైనా ఏమైనా చేయగలం అనే ధీమా, మూక సంస్కృతి యువకుల్లో పెచ్చరిల్లిపోవడం చూస్తున్నాం. ఇక్కడి రోహితులు, నజీబ్ లు కళ్ల ముందే మతదురహంకారానికి బలైపోతుంటే కిమ్మనకుండా అమెరికాలో అసహనం గురించి మనం ఎన్ని సుద్దులు చెప్తాము! అంత జరిగినా ట్రంపు నోరు విప్పడెందుకని అని గంటు పెట్టుకుంటాం. ట్రంప్ అయినా చివరికి నోరు విప్పాడు. దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంతమందికి గుర్తుంది? అక్కడ జాత్యాహంకారం, మరిక్కడ బిజెపీ, ఆరెస్సెస్, ఎబివిపిలది ఏమిటి? రోహిత్ మనకు దూరమైంది, నజీబ్ మాయమైంది ఇటువంటి ప్రశ్నల్లో కాదా? రోహిత్ సూసైడ్ నోట్ లో ట్రంప్ పోలిక గుర్తుందా? రోహిత్ మరణించాక కూడా ఎలా వెంటాడారో ఇంకా పచ్చిగానే ఉంది. అతని తల్లిని ఇంకా ఎంత క్షోభ పెడుతున్నారో కూడా చూస్తున్నాం. నజీబ్ మాయమమైన కొద్దిరోజులకు అతని మానసిక స్థితి బాగోలేదని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక హేయమైన కథనం రాయించారు. నజీబ్ ఐసిస్ తీవ్రవాదులతో కలిసి ఉండొచ్చట. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. కుక్కను చంపే ముందు అది పిచ్చిదని ప్రకటించండి అని. జీవిత ఖైదు పడిన సాయిబాబా, అతని సహ ముద్దాయిల గురించి, బెయిల్ నిరాకరించబడిన తెలంగాణ డెమాక్రటిక్ ఫ్రంట్ నిజనిర్ధారణ బృందం గురించి, కేరళ, తమిళనాడుల్లో నిర్బంధించబడ్డ ప్రజాసంఘాల కార్యకర్తల గురించి ఆయా ప్రాంతాల్లో మీడియా అటువంటి ప్రచారమే చేసింది. చేసింది అనడం కన్నా చేయించారు అనడం కరెక్టుగా ఉంటుంది. ఇప్పుడు నజీబ్ ను ఏం చేశారు? ఏం చేయదలచుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునేటప్పుడు ఒకటి స్పష్టమవుతుంది. చట్టం, న్యాయవ్యవస్థ, మీడియా ఈ దేశప్రజలను పిచ్చివాళ్లను చేయదలచుకున్నాయని.

No. of visitors : 955
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

-మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా ...
...ఇంకా చదవండి

తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

మిసిమి | 17.06.2016 11:09:21am

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగా...
...ఇంకా చదవండి

దేవతా - దెయ్యమూ

మిసిమి | 03.09.2016 12:53:20am

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి చేసి ఇంట్లో బంధించి........
...ఇంకా చదవండి

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

మిసిమి | 16.07.2016 12:56:55pm

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్న......
...ఇంకా చదవండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| 01.10.2018 10:37:48pm

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్... ...
...ఇంకా చదవండి

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడు.....
...ఇంకా చదవండి

కరోనా కాలంలో ʹవైరస్ʹ థ్రిల్లర్

మిసిమి | 02.04.2020 12:07:53am

కరోనా కాలంలో వైరస్ ఇతివృత్తంలో వచ్చిన సినిమాలు యూ ట్యూబ్ ద్వారా వైరల్ అవుతున్నాయి....
...ఇంకా చదవండి

మానవహక్కులను వెటకారం చేసే ద్వేషభక్తులు అర్థం చేసుకోలేనిది.

మిసిమి | 17.03.2019 09:38:24am

జెనీవా ఒప్పందం గురించి ఎంత ప్రచారం జరిగింది! పట్టుబడిన యుద్ధ ఖైదీని, అది సివిల్ వార్ అయినా సరే మానసిక శారీరక హింసకు గురిచేయకుండా ఎట్లా చూసుకోవాలో సోషల్ మీ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •