చాప ముల్లు

| సాహిత్యం | క‌థ‌లు

చాప ముల్లు

- పృధ్వి | 05.04.2017 10:00:57pm

ʹఎత్తినాము ఎత్తినాము విరసం జెండా--- అలలలలుగ వరదలొత్తు పోరు పోరు జెండాʹ
అలలలలుగ సాగుతున్నపాట హోరుకు ఎర్ర జెండా మరింతగా రెపరెపలాడుతోంది. అక్కడ గోడలు,మెట్లు,ఇరుకైన రోడ్డు,వేదాoతిలకూచున్న కుక్కపిల్ల ఖాన్ దాదా పాన్ డబ్బా అన్ని అన్ని పాటగాలికి పరవశించిపోతున్నాయి. ఎండసొడ ముఖం మీద చాచికోడ్తున్నా,చెమటలు కారుతున్నా ,పాట వాళ్ళందరికీ,అన్ని శ్రమలనుండి,అన్నిబాధలనుండి విముక్తి కల్గిస్తున్నట్టుగా ఉంది.అన్ని గొంతులు ఏకమైన అద్బుతగానం. చలసాని ప్రసాద్ యాదికొచ్చిoడు. మరణించేదాక ఈ పాటను patent right లాగ తీస్కున్న ఆ మనిషి ఈ పాటపాడనీకెనే పుట్టిండా......అనిపిస్తది. ఆయన గొంతులోంచి ఈ పాట ఒస్తే మాత్రం,అది పల్లె దాటి, పట్నం దాటి, శ్రీకాకుళం కొండగోగుల్లోని వెన్నెల వానలో తడిసినట్లుంటది.....మనిషికి పాటా,పాటకి మనిషీ..తోడూనీడ......
.......................******..........................

ఎదురుగా హోటల్లో పూరీలు ఒత్తుతున్న చాంద్ బీ కి ఇదంతా నమ్మశక్యం కానిదిగా ఉంది.ఒక ముస్లిం గల్లిలో ఇట్లాంటి సభలా.....అందునా ఇంత ఇరుకు గల్లిలో....ఇంత మురికి గల్లిలో.
ఇప్పటిదాంక ఈ గల్లిలోని ఫంక్షన్ హాల్లో అనేక ఫంక్షన్లు చూసిందిగాని తన జీవితంలో మొట్టమొదటి సారి రెండు రాష్ట్రాల(ఆంద్ర&తెలంగాణ)రచయితలు,కళాకారులు ఇక్కడ మీటింగ్ పెట్టడం మొదటి సారిగా చూస్తున్నది.
పైగా వాళ్ళు ముస్లింలకు బాహటంగా మద్దతుఇస్తున్నారు (ఆమె అప్పటికే కరపత్రం చదివి ఉంది).
ఈ కాలాన ముస్లింలు మరింత వేలివేతకూ గురిఅవుతున్న కాలాన వీల్లంత బహిరంగంగా మద్దతు ఇవ్వడం నమ్మశక్యం కాకుండా ఉంది.
ఆమె 8 తరగతివరకే చదివింది. అప్పటికే పెళ్లి చేసేషిండ్రు.కుటుంబo పిల్లలూ,జీవితo,దరిద్రపు గొట్టు బతుకు. ఒక మాములు ముస్లిం స్త్రీ కి సభల గురించి, సాహిత్యం గురించి సమాజం గురించి ఎవరు చెప్తారు?ఎట్లా తెలుస్తుంది? కాని ఆమె మనుషుల్ని చక్కగా చదవగలదు.కష్టాల కొలిమి తిత్తి లోంచి పదునెక్కిన మనిషికి సంగ్రహణ శక్తి అబ్బింది.దానికి తోడు తను వయసు అనుభవం కలిసొచ్చింది.తన హోటల్ కి వచ్చే మనిషి గురించి పది నిమిషాల్లో తెల్చేయగలదు. ఆమెకూ చదువు ఆగింది కాని మనిషిని చదవడం ఆగలేదు. బహుశ ఈ చదువే చాంద్ బీ ని ప్రత్యేకంగా నిలబెట్టింది.
.....................................****.....................................

సభలు సుమారుగా 11 గంటలకు మొదలయ్యాయి. సభ్యులు వచ్చేవాళ్ళు వస్తున్నారు.పలకరింపులు నవ్వులు సందడిసందడి గా ఉంది. లోపల పాట హోరేత్తుతోoది.ఆకాశంలో ఇంద్రధనస్సును హాల్లో వేలాడతీసినట్టుగా ఉంది.
ఇంతలోఆకస్మాత్తుగా రోడ్డు మీధ ఎదో గడబిడ మొదలైంది. ఎవరో ఆజానుభావుడు ముందు నడుస్తుంటే అతని వెనక కొంత మంది స్త్రీలు పురుషులు పిల్లలు చేతులలో ప్లకార్డ్ లు పట్టుకొని నినాదాలు చేస్తూ మీటింగ్ హాల్ వైపు వస్తున్నారు. వాళ్ళేందుకొస్తున్నారో ఇతరులకి స్పష్టంగా తెల్సి పోతున్నది. వాళ్ళు గిరిజన సంఘo, ఆదివాసి సంఘo, నక్సల్స్ బాధిత సంఘo ఇలా అనేక పేర్లని రాసిపెట్టుకున్నారు.
ʹమావోయిస్టుల హత్యాకాండ నశించాలి.ʹ
ʹమేదావుల్లరా......హంతకులకి మద్దతు ఇవ్వొద్దుʹ
ʹమావోయిస్టులకు మద్దతు ఇచ్చే వాళ్ళు హంతకులేʹ
ʹప్రజాస్వామ్యం వర్దిల్లాలిʹ
పలుగు రాళ్ళు పగిలినట్టుగా నినాదాలు వస్తున్నాయి.
వాళ్ళు వచ్చి వచ్చి చాంద్ బీ హోటల్ ముందలనె నిలబడిపోయారు.గొంతు చించుకొని నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న చాంద్ బీ కి ఈ మావోయిస్టులంటే ఎవరో, వాళ్ళకి ఈ రచయితలకి సంబంధం ఏమిటో.... ఈ వచ్చిన వాళ్ళు ఎవరో ఏమిటో.... ఏమి అర్ధం కాలేదు.
వాళ్ళందరిని బలిస్టుడైన మీసాల మహారాజు లీడ్ చేస్తున్నాడు. తెల్లటి డ్రెస్... చేతికి బంగారు ఉంగరాలు.....ఓ ముఠానాయకుడిలా వెలిగిపోతున్నాడు.
వాళ్ళట్ల వచ్చారో లేదో మీడియా వాళ్ళు, టీవీ వాళ్ళు బిలబిల మని వాళ్ళని చుట్టుముట్టి ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. వాల్లంతా తమ మైకులను మీసాల మారాజు మూతి కాడ పెట్టి ఆయన చెప్పిన ప్రతి మాటని పొల్లుపోకుండా రికార్డు చేయడం మొదలుపెట్టారు. ఒక కొత్త నాటకానికి తెరలేచింది. ఇదంతా ఒకరికొకరు తెలిసి ఆడుతున్న నాటకంల ఉంది.వాళ్ళు చాలా నిదానంగా ఇష్టపూర్వకంగా అక్కడి దృశ్యాలను రికార్డు జేసేస్తున్నారు.
చాంద్ బీ ఒకటే ఆశ్చర్యపోతోంది. లోపల కొన్ని వందల మందితో సభ జరుగుతుంటే, వీళ్ళు ఈ పిడికెడు మందికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడమేమిటో అస్సలు అర్ధం కావట్లేదు. వాళ్ళంత కాసేపు సభ జరిగే హాల్ ముందు నినాదాలు చేసి హల్ల్లోకి వచ్చే ప్రయత్నం చేసారు. నిర్వాహకులు గట్టిగ అడ్డుకోవడంతో వెనుదిరిగారు. చేసిది లేక వాళ్ళు హాల్ బయట నినాదాలు ఇస్తూ వాళ్ళు ఓ మీటింగ్ పెట్టుకున్నారు. వచ్చిపొయేవాల్లకి ఈ గొడవ ఏమిటో అర్థం కాక వింతగా చూసుకుంటూ పోతున్నారు.
.............................*********..............................

చాంద్ బీకి ఏo తోచలేదు, ఉబ్బరిచ్చినట్టైంది. అల్లరి మూక తడికెలా నిలబడేసరికి అన్ని సర్దేసి అక్కడి నుంచి తప్పుకున్నది. అటుఇటు చూసి మెల్లగా వెనుక డోర్ గుండా హాల్ లోకి వెళ్లి కూర్చుంది.
ఆమెకు కొత్త గాలి విచినట్టైంది. ఇట్లాంటి హాల్లో ఇట్లాంటి వాతావరణంలో కూర్చొని వినడం మొదటిసారి. ఎవరో గంభీరంగా మాట్లాడుతున్నాడు. ముస్లింల మీద దేశంల జరుగుతున్న దాడుల ఆవేశంగా చెప్తున్నాడు. మద్యమద్యన చప్పట్లు, నినాదాలు. అకస్మాతుగా చాంద్ బీకి తన కొడుకు అమ్జాద్ ఖాన్ యాదికొచ్చిoడు. కండ్ల నీరెట్టుకుంది. బతికుంటే వీల్లంత పెద్దోడయేవాడేమో. పదిహేనేండ్ల కింద బతుకుదెరువు కోసం గుజరాత్ కి వలస పోతే అక్కడ జరిగిన హిందూ-ముస్లింల గొడవలల్ల కొట్టిచంపిండ్రు. ఆ దెబ్బ తోటి గుండెపగిలి ఆమె భర్త చనిపోయిoడు. అప్పటినుంచి మొండి మానులా బతుకు ఈడుస్తున్నది.
ఆ మాట్లాడేటాయన గుండెకి తగిలేలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. గో రక్షణ పేరు మీధ దేవతల పేరు మీధ, మతం పేరు మీద ఏ ఏ ప్రాంతాన ఎట్లా దాడులు జరుగుతున్నాయో లెక్కలతో సహా చెబుతున్నాడు. ఆమె భయపడిపోయింది. ముస్లింల పట్ల లోకం ఇంత కఠినంగా మారిపోయిందా....వాళ్ళని బలి పెట్టి రాజ్యమేలుతున్నారా? తప్పు చేసినోడే తక్తు నెక్కిoడా.
ఆమెకి ఉక్కిరిబిక్కిరి అయినట్టై ఊపిరి పిల్చుకోనికే బయటికొచ్చిoది.
...........................******..........................................

బయట కొంత హాయిగా ఉంది. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనె ఉన్నారు. పలుకరింపులు, కౌగలింతలు పంచుకోవడాలు........ఒక పండుగ వాతవరణoలా ఉంది...స్త్రీ-పురుష బేధం లేదు , కులమతాల బేధం లేదు అంత కొత్తగా సంతోషంగా ఉంది. ఏదో తెలీని ఆత్మీయత, మోడుకు పచ్చని తీగలా అల్లుకుంది. తన ఇరుకు, ముస్లిం గల్ల్లిలలో ఇట్లాంటి వాతావరణానికి తావేది....తిట్లు, కొట్లాటలు ఆంక్షలు, దుఃఖాలు, మరణాలు ఇదే గదా జీవితం.
కిందిఅంతస్తుకు వచ్చింది. తెల్సిన వాళ్ళు ఎవరో పలుకరిస్తే ముక్త సరిగా మాట్లాడి ముందుకు పోయింది. ఎదురుగ పుస్తకాల స్టాళ్లు.....ఊరికేనే అమాయకంగా తిరిగి చూసింది. వందల కొద్ది పుస్తకాలు.కొన్ని పుస్తకాల మీద స్త్రీల బొమ్మలని తదేకంగా చూసింది. కొన్ని పుస్తకాల్ని ఆప్యాయంగా తాకింది. వేసవి ఎండల్లో వెన్నెల పాకిన స్థితి. ఏo రాస్తారీపుస్తకాల్లో..... ఎవర్రాస్తారీపుస్తాకాలని ? ఎవరు చదువుతారు వీటిని? ఏదైనా మంచే రాసి ఉంటారు. మంచోల్లే రాసి ఉంటారు. ఆమెకు నమ్మకం కుదిరింది. అదొక తప్పక గుర్తుంచుకోదగిన జ్ఞాపకంగా ముద్రించుకుపోయింది. మరేమిటి వీళ్ళ గురించి బయట ఆ గుంపు గాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు?
.....................................***********.......................................

మద్యాహ్నం భోజనం తర్వాత సంధ్య అరుణలు టీ కోసం వచ్చారు. భోజనం అయినాక టీ తాగడం వాళ్ళకి అలవాటు. ఆమెకు వీళ్ళను చూడగానే మొఖం విప్పారింది. స్పెషల్ టీ పెట్టింది. ఆమె మెదడులో బోలెడన్ని ప్రశ్నలు.
ʹ ఏం చాందక్క.... బావున్నావా ....ఎట్లా నడుస్తున్నది?ʹ- అడిగింది సంధ్య ఆప్యాయంగా
ʹ ఊ బానే ఉన్నాన్రా. నడుస్తున్నది కుడిఎడమల..ʹ అంది క్లుప్తంగా... చాంద్ బీ గుంభనం మనిషి. ఏది వివరంగా చెప్పదు. ఆమె మాటలని బట్టి వాక్యాల మద్యన అర్థాలు వెతుక్కొవల్సిందే.
ʹ అక్క.....మా సుట్టాలు వొయినట్టున్నారు.? అంది అరుణ నవ్వుతూ అటుఇటు చూస్తూ....
ʹసుట్టాలా? ఆల్లెవరు?ʹ- ఆశ్చర్యంగా అడిగింది చాంద్ బీ
ʹ అయ్యో ఇంకెవరక్కా. పొద్దున గుంపుగా రాలేదా? గాల్లే మా సుట్టాలు మీ సుట్టాలు ...అరచి అరచి ఇంటికి పోయినట్టున్నారు.ʹ
ʹఓహో వాళ్ళా....ఇంతకు ఎవరు వాళ్ళంతా....ʹ
ʹఇంకెవరక్కా.....గాల్లే పోలిసుమామలు...ఆ గుంపంత ఈల్లు తోలుకొస్తే వచ్చిన కిరాయి గుంపులు..ʹ
ʹఓహో ఇప్పుడర్థమైంది..ʹ
ʹఅక్కా మీ హోటల్ కి గూడా బ్యానర్ కట్టి పోయిండ్రు కదా.ʹ
ʹఓ ఇదా ఏంజెయ్యాలిరా.....బలవంతంగా వచ్చి కట్టి పోయిండ్రు. వద్దననీకె రాదు గదాʹ
ʹమొత్తం ఊరoతా కట్టినట్టున్నారు....మేము ఒకటి కడితే వాళ్ళు పది కట్టిoడ్రుʹ
ʹఅవునక్కా.. పోలీసోళ్ళు bjp వాళ్ళు పక్క మిలాకతు అయ్యిండ్రుʹ
కొద్ది సేపు మౌనం.....చాంద్ బీ కి విషయాలు కొంచెo కొంచెo అర్ధం కాసాగాయి.ఏకాగ్రత తో చాయను కిందికి మీదికి కలిపి సరిగ్గా మసిలిందో లేదో చూసుకుంటున్నది. కమ్మటి వాసనేస్తున్నది చాయ.
ʹఅది సరే సంద్యా...గీ మావోయిస్టులు ఎవరు?ʹ నెమ్మదిగా అడిగింది చాంద్ బీ.ʹ
సంధ్య అరుణలు సన్నగా నవ్వారు..
ʹవాళ్ళా.....వాళ్ళు మనలాంటోల్లె అక్కాʹ అంది అరుణ ʹ గీ పోలీసోళ్ళు ప్రచారం చేసినట్టు దయ్యాలు భూతాలు హంతకులు గాదు. వాళ్ళు నిలాగ నాలాగ మంచి కోరేటోల్లె. ప్రపంచం మారాలని మార్చాలని కోరుకునేటోల్లెʹ
ʹఅయితే మంచిదే...గీ ప్రపంచం జర్రనన్న మారితే, మా తుర్కోల్ల మీద గీ దాడులన్న తగ్గుతవేమో..ʹ
ʹఅదొక్కటే కాదక్క...ఆల్లు అందరిని సమానంగా చూడాలoటరు..పేదోన్ని ఉన్నోళ్ళు దోచుకోగూడదంటరు.దేశం లోని సంపదంతా అందరికి సమానంగా పంచాలంటారు..ʹ
ʹబాగుంది కాని, ఇంతకూ మీరు చెప్పేదంతా అయ్యేపనేనా ?ʹ
ʹ ఎందుకుగాదు....తొలుత మనిషి చంద్రమండలం పోతననుకున్నడా ? పోయిండా లేదా?మనకు స్వాతంత్ర్య౦ వస్తదనుకున్నమా? రాలేదా మరి...కాకపోతే అది తెల్లోని చేతిల కెల్లి నల్లోని చేతిలోకి పోయిందనుకో అది వేరే సంగతిʹ
ʹఅందరం కలసి నియ్యతుగ కొట్లాడితే ఆకాశం భూమ్మిదకి దిగొస్తదక్కా ʹ
వాళ్ళు మల్లి చాయ ఆర్డర్ చేసి తాగడం మొదలెట్టారు.చాంద్ బీ కి ఇన్నాళ్ళు గా కమ్ముకున్న పొరలు కొంచెo కొంచెo తొలగిపోయినట్లైంది. తీరిగ్గా బెంచి మీద కూర్చొని బ్యానర్ కేసి తేరిపార చూసింది.
ʹఅదిసరే మరి మావోయిస్టులు ఎక్కడో ఆడవిలల్ల ఎదో చేస్తే గీ పట్నంల గీ సభల కాడ గీ లొల్లి ఏందో అర్ధం ఐతలేదు. ఇక్కడ మావోయిస్టులు ఎవరు లేరు కదా? లేని చోట గీ బ్యానర్లు కట్టుడేoది.ʹ
ʹఎందుకంటే వాళ్ళు ఈ సభలను భగ్నం చేయనీకె వచ్చిoడ్రు అక్కా. వాల్లూ,ఈ రచయితలూ న్యాయం సమానత్వం కోరుకోనేటోల్లు...కాబట్టి వాల్లు వీల్లు ఒకటే అని పోలీసోళ్ళు తీర్పునిస్తారు. ఇచ్చుడే గాదు, ఇష్టం వచ్చిన రీతులల్ల విషప్రచారం చేస్తారు.ఇగో గిట్లʹ అంది అరుణ బ్యానేర్ వైపు చూపించుకుంటూ
చాంద్ బీ ఆ పక్కకు పోయి ఉమ్మేసి వచ్చింది.ఎక్కడిదో ఓ కుక్కపిల్ల వచ్చి ఆమె కాళ్ళ కాడ సెటిల్ అయిపోయింది.
ʹఅదిసరే...మల్ల ఈ పోలీసులకు మావోయిస్టులకు గోడవేoది.ʹ
ʹగొడవేంలేదక్కా...ఆల్లు మనసోoటోల్లె, ఒకరు ఇదంతా మారిపోయి ప్రజల ప్రభుత్వాలు రావాలంటరు. అవసరమైతే బలవంతాన దిoచెయాలoటరు. ఇంకొకరికి (సర్కారుకి ) ఇది నచ్చదు. సర్కార్ చెప్పినట్టు పోలీసులు వినాలి గదా...అందుకనే ఈ మార్పు కోరేటోల్ల మీద విరుచుకపడ్తారు...విష ప్రచారాలు చేస్తారు ʹ
ʹఅంతే కాదక్కా...గీ బ్యానర్ల మీద చనిపోయినోళ్ళ బొమ్మలేసి వాళ్ళ కుటుంబాలోల్లు ఏడుస్తునట్టు కనబడుతున్నది కదా. ఈల్లు మoచోల్లో చెడ్దోల్లో వాళ్ళ వాళ్ళ ఊర్లల్లకు పోతే తెలుస్తది. ఏదైనా చేయలేని తప్పు చేస్తేనే ఇటువంటి జరుగుతుంటాయి.ʹ
ʹఅంతేగాదు ప్రపంచంల ఎన్ని దుర్మార్గాలన్న జరగని...వీల్లకి బేఖాతర్. ఒక్క మావోయిస్టులు ఒక్క చిన్న పని చేసిన అది ప్రజల కోసం చేసిందే ఐన దాని చుట్టూ విషప్రచారం చేస్తరు. గిట్ల బ్యానర్లు కడతరుʹ
చాంద్ బీ మౌనమయ్యిoది.ఆమె మౌనం ఐంది అంటే విషయం లోతుగా అర్థమైందన్నట్టు..ఈ విషయం సంధ్య అరుణలకి బాగా తెలుసు.
ఎవరో పిలవడంతో చాంద్ బీ దగ్గర సెలవు తిస్కున్నారు. పోయేటప్పుడు చేతిల చెయ్యేసి సాయంత్రం ʹసీమ కరువుʹ మీద నాటకం ఉందని తప్ప కుండ రావాలని చెప్పిమరీ వెళ్లారు.
..................................*********....................................

చాంద్ బీ తన హోటల్ కి అడ్డంగా కట్టిన బ్యానర్ కేసి తేరిపార చూసింది.అది తనకూ ప్రపంచానికి నడుమ కట్టిన అడ్డు గోడలా అనిపించిది.అది పోలీసు మామల రూపంలో తన హోటల్ కి కావలికాసినట్టనిపించింది.చేతులు వెనక్కి కట్టుకొని బ్యానర్ లో ఉన్నదంతా చదివేసింది.ʹఅంత మంచోళ్ళ మీద మన్నుపోసుడే కదా ʹ అనుకుంది.
...........................**********.....................................

చక్కెర అయిపోవడంతో చౌరస్తాకు బయలుదేరింది చాంద్ బీ.
ఎక్కడ చూసినా బ్యానర్లె కనిపిస్తున్నాయి. వాటిని అందరికి కనపడేటట్టు కిందికి కట్టి ఉంచారు.వాటిని చూస్తుంటే ఒక్కొక్కటి చెట్టు కి వేలాడే కొండచిలువల్లా అనిపించాయ్.
చాంద్ బీ ఆశ్చర్యపడింది....తన జీవితం లో ఎన్ని ఘోరాలు చూసింది.దళితులమీద ముస్లింల మీద ఎన్నో దాడులు చూసింది.స్టేషన్ లో చిత్రహింసలు లాఠీ చార్జీలు ఎన్నెన్నో...ముఖ్యoగా గుజరాత్ అల్లర్లు
ఐనప్పుడు అక్కడ ఎన్నివేల మంది చనిపోయారో...అవి వార్తలే కానట్లుగా గడిచిపోయింది కాలం. ఎక్కడా ఎవరు ఒక్క బ్యానర్ కట్టింది లేదు.వాటిని గుర్తిoచిoది లేదు. అంతా ఒక పద్ధతి ప్రకారం ముసుగులు కప్పేస్తున్నారు. ఒద్దనుకున్నవి మరుగున పడేస్తారు. కావాలనుకున్నవి బయటికి తీస్తారు.
ఇప్పుడిక్కడ నలుగురు రాసేటోల్లు కలసి నాలుగు మంచి మాటలు చెప్పనికే ఓ సభ పెట్టుకుంటే వాల్ల గొంతుకి అడ్డం పడ్డట్టు గీ లొల్లి పెడతరు. వాళ్ళని బద్నాం చేయనికే ఇన్ని బ్యానర్లా?గింత లొల్లా?
మొన్నటికి మొన్న గా ఆడపిల్లలు గదేదో సంగంల పనిచేస్తరని వాళ్ళని బ్యానర్లకేక్కిన్చిండ్రు...పాపం..ఇప్పుడోచ్చిన సంధ్య అరుణలు కూడా అందులో ఉన్నారు.ఎసొoటోల్లు వాల్లు చందమామలసొంటోల్లు ....అనేక సమస్యల మీద లొల్లి పెట్టిండ్రు. తమ ముస్లిం గల్లిలకూ కూడ ఎన్నో సార్లు వచ్చిపోయిండ్రు.పాపం...వాళ్ళ మీద విషాన్ని చిమ్ముతున్నరు. ఎదో దొంగలన్నట్టు ఫోటోలు వేసి ఊరంతా బ్యానర్లు కట్టిండ్రు. అది చూసిన వాళ్ళ తల్లిదండ్రులు,స్నేహితులు, బంధువులు ఏమనుకుంటారో?మంచి జేసేటోల్ల మీద ఇంత బురద జల్లుడా?
ఎన్ని నేరాల మీద పెరిగింది ఈ పట్టణం....ఒక్క సంగతన్న బయటికొచ్చిందా?ఒక్కరన్న బ్యానర్లకేక్కిన్ర...అసలు మంచోళ్ళు నేరస్తులు ఎట్ల అవుతున్నరు.నేరం జేసేటోల్లు
మంచోలేట్లైతున్నరు. ప్రపంచం ఉల్టా-పల్టా నడుస్తున్నదా? భూమికి బొక్క పడి మనుషులు దాంట్లోకి
కూరుకుపోతున్నట్లుగా ఉంది.
..............................********.......................................

చాంద్ బీ కి చాల అసహనంగా ఉంది.తన కోపం ఎవరి మీద చూయిoచాల్నో తెలియడం లేదు.పోలీసుల్ని అడగలేదు.సర్కార్ ను నిలదీయలేదు. చౌరస్తాలో నిలబడి ʹఏమిటిదంతా?ʹ అని గట్టిగా అరవలేదు. తెలీని నిస్సహాయత, వెన్ను ని బలవంతంగా వొంగ తీసినట్టైంది.
రాత్రి పదైంది...జనం బాగా పల్చబడ్డారు.రేపటి నీళ్ళ కోసం బోరుకొట్టే ఒకరిద్దరు మనషులు తప్ప
ఏ అలికిడి లేదు. రోడ్డు విశ్రమించడానికి సిద్దంగా ఉన్న కార్మిక స్త్రీలా ఉంది.
బస్త సంచి చేతిలో పట్టుకొని బయల్దేరబోతున్న చాంద్ బీ కి ఎదురుగా బ్యానర్ కనిపించింది.అది తనను కవ్విస్తున్నట్టుగా ఉంది. ఆమె తనకు తెలీకుండానే ఓ పొడవాటి కట్టె ని తీసుకోచ్చి బ్యానర్ ను తూట్లు పొడిచింది.తాడు తెగి బ్యానర్ కింద పడిపోయింది. దాన్ని తీసి పక్కనే ఉన్న పెద్ద కాలువ లో పడేసింది. ఆ వెంటనే మెరుపులా కదిలింది. చుట్టు పక్కల చూసింది. ఇoడ్లన్ని నిద్ర కు ఉపక్రమిస్తున్నాయి. అదే ఊపులో పోయి చుట్టుపక్కల బ్యానర్లను గుంజిపడేసింది. అన్నిoటిని తీసుకొచ్చి పెద్దకాలువ లో పడేసి, తృప్తిగా ఊపిరిపీల్చుకుంది. నిoపాదిగా ఇంటి బాట పట్టింది.
పట్టణపు మురుగు నీటితో కలిసిపొయిన బ్యానర్లు దిక్కులేని శవాల్ల కొట్టుకోస్తుంటే, దశాబ్దాలుగా పట్టణ మురికిని, అశుద్ధాన్ని ఓపిగ్గా భరించిన పెద్ద కాలువకు అవి గొంతులో చాప ముల్లులా గుచ్చుకున్నట్టై విలవిల్లాడింది.

No. of visitors : 852
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •