పిల్లల మానసిక ఆవరణ- శశికళ కథలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

పిల్లల మానసిక ఆవరణ- శశికళ కథలు

- -పి.వరలక్ష్మి | 05.04.2017 10:15:52pm

పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తామనే పెద్దలకు వారి పిల్లల గురించి ఎంత తెలుసు? పిల్లల ప్రపంచాన్ని, వారి అంతరంగాలను, మానసిక ఆవరణాన్ని ఎంతమేరకు అర్థం చేసుకోగలరు? ప్రతి ఒక్కరం బాల్యాన్ని దాటి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లల మనోప్రపంచాన్ని పిల్లల కోణంలో చూసే ప్రయత్నం చేస్తామా? రూపొందబోతున్న సమాజ భవిష్యత్తు వాళ్ళు. సమాజం వారి గురించి ఎంత పట్టింపుతో ఆలోచిస్తుంది? వ్యవస్థలోని అమానవీయతకు అత్యంత ఎక్కువగా ప్రభావితమయ్యే పిల్లల గురించిన ఇతివృత్తాలు మన సాహిత్యంలో తక్కువే. ఈ అంశం మీద కథలంటే నామిని మొదట గుర్తొస్తారు. పిల్లల ప్రపంచాన్నే కాదు, పిల్లల కోణంలో ప్రపంచాన్ని చూపించడం ఆయన ప్రత్యేకత. ఈ అంశం మీదే ప్రత్యేక దృష్టితో సున్నితమైన బాల్యపు సంస్పందనలను కథలుగా రాశారు శశికళ. విద్యావ్యవస్థ అమానవీయతను కొంతవరకు సుభాషిణి చిత్రీకరించారు. బెత్తాలు లేని స్కూళ్లను రాప్తాడు గోపాలకృష్ణ స్వప్నించాడు. యాధృచ్ఛికంగా వీళ్ళు రాయలసీమ వాళ్ళే.

ఆర్.శశికళ అనంతపురంలో చాలా కాలం పాటు ఉపాధ్యాయినిగా పని చేస్తూ పిల్లలతో గాఢమైన అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఆమె విప్లవ రచయితల సంఘంలో సీనియర్ సభ్యురాలు. ఈ రెండు నేపథ్యాల కలయికతో కథాసాహిత్యంలో ఆమెది ప్రత్యేకమైన కంఠస్వరం. వ్యవస్థ వైపు నుండి పిల్లలు కోల్పోతున్న సున్నితమైన బాల్యానుభూతులను, వాళ్ళ మీద కర్కశంగా మోపబడుతున్న గుడిబండలను ఆర్తితో చిత్రీకరించారామె. పిల్లలు సంపూర్ణ మానవులుగా ఎదిగే క్రమం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నది? ఇది ఆమె కథల్లోని కేంద్రక అంశం. కథలుగాక శశికళగారు అనువాద ప్రక్రియలో కృషి చేస్తున్నారు. ఆమె రచనలకు పునాది, ప్రేరణ విప్లవ సాహిత్యోద్యమం. శశికళ విద్యార్థి ఉద్యమంలో, మహిళా ఉద్యమంలో పని చేస్తూ సాహితీ కార్యక్షేత్రంలోకి వచ్చారు. 1987 నుండి కథలు రాస్తున్నా ఇబ్బడి ముబ్బడిగా రాసినవారు కాదు. ఆమె కథలు చూస్తే చాలా ఎంపిక చేసుకుని తీసుకున్న ఇతివృత్తాలని మనకు తెలుస్తుంటాయి. 2003 వరకు రాసిన పదైదు కథలు ʹచెదిరిన పిచ్చిక గూడుʹ పేరుతో సంకలనంగా తెచ్చారు. మళ్ళీ ఇటీవలనే 2017 జనవరిలో మరో పదైదు కథలతో ʹమా తుఝే సలాంʹ సంకలనం విడుదలైంది.

రూపొందవలసిన మనుషుల గురించి విప్లవోద్యమానికి చాలా పట్టింపు ఉంటుంది. వ్యవస్థ తనకు అనుగుణమైన మనుషులనే తయారు చేసుకుంటుంది. అలా పెట్టుబడికి ఊడిగం చేసే కూలీలను మన విద్యావ్యవస్థ ఉత్పత్తి చేస్తుంది. ఈ పనిలో కుటుంబం కూడా భాగమవుతుంది. పెట్టుబడి ఎంత అమానుషంగా ఉంటుందో, ఎంత విధ్వంసపూరితంగా ఉంటుందో అదంతా ఇక్కడ ప్రతిఫలిస్తుంది. మానవీయ స్పందనలు రద్దు చేసుకుంటూ తాను తప్ప మరేదీ ప్రధానం కాదనే సంకుచిత మెదళ్ళను తయారుచేయడం ఇప్పటి పోటీ విద్యావిధానం ప్రధాన లక్షణం. ఇటువంటి పరిస్థితిలో ఎదిగే పిల్లలు సమాజం పట్ల కాదు కదా, తల్లిదండ్రుల పట్ల కూడా బాధ్యతతో ప్రేమతో ఉండలేరు. ఈ క్రమమంతా కూడా బాల్యం మీద హింస అమలవుతూ ఉంటుంది. ఒక దశకొచ్చేసరికి దాని తీవ్ర ప్రతిఫలనాలు చూస్తాం. టీనేజ్ మగపిల్లల హింసాప్రవృత్తి ఒక పార్శ్వమైతే, ఆత్మహత్యలు ఇవాళ ఒక సామాజిక సంక్షోభం. ఎంతమంది గుర్తిస్తున్నారో గాని విద్యార్థుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యల కన్నా ఎక్కువ. గడిచిన పదేళ్ళ కాలంలో సగటున ఏడాదికి మూడు వందలకు పైగా పిల్లలు (రెండు తెలుగు రాష్ట్రాల్లో) ఇలా చనిపోతున్నారు. ఇష్టం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు ఈ ఊబిలో దిగబడిపోతున్నారు. అంతకన్నా ప్రత్యామ్నాయం వైపు ఆలోచించే తెగువ చూపలేకున్నారు. ఎనిమిది గంటల పనిని డిమాండ్ చేస్తున్న మనమే పదహారు గంటల చదువులను పిల్లలపై రుద్దుతున్నాం. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపునుండి, ఆచరణ వైపు నుండి దండకారణ్య ఉద్యమ సాహిత్యంలో ఇటీవల పిల్లల కోణం నుండి అరుదైన కథలొచ్చాయి. పిల్లల పట్ల వ్యవస్థ కాఠిన్యం మొదలుకొని, పిల్లల్లో బీజప్రాయంగా పాదుకొనే ఆధిపత్య భావజాలం, సరైన బోధన ఉంటే పిల్లలెన్ని అద్భుతాలు చేయగలరు, ఎలా కొత్త సమాజాన్ని వాగ్దానం చేయగలరు వంటి విస్తృతమైన అంశాల మీద ఆ రచయితలు రాశారు (దండకారణ్య కథలు 2005-2012, 2013-2015). ఇటువంటి ఉద్యమ సాహిత్య ఒరవడి శశికళ అంతరంగంలోని మానవీయ పార్శ్వానికి నేపథ్యం.

శశికళ కథల్లో పిల్లలతో అనుసంధానమైన రచయిత మానవీయ లోకం మనకు పరిచయమవుతుంది. అది ఊహా ప్రపంచం కాదు. దానిని తన ఉపాధ్యాయ వృత్తిలో భాగం చేసుకొని, జీవితంలో కూడా భాగం చేసుకున్నారు. పిల్లల్ని ప్రేమించే ఉపాధ్యాయినిగా వారి గురించే కాదు, వారి కుటుంబ పరిస్థితుల గురించి పట్టించుకుని సమస్యలను అర్థం చేసుకుంటారామె. ʹమా తుఝే సలాంʹ కథలోని తల్లి జీవితం అత్యంత సంక్లిష్టమైనది. అత్యాచారానికి గురికాబడి, శరీరాన్ని సరుకుగా చేసుకుని జీవిస్తున్న స్త్రీ తన పిల్లలను, అందునా ఇద్దరు కూతుర్లను ఎలా కాపాడుకుంటుంది, బడికెలా పంపుతుంది, అందుకోసం ఎటువంటి జీవనపోరాటాన్ని చేయవలసి వస్తుంది చెప్పే ఈ కథ ఎటువంటి ఆడంబరాలు లేకుండా వ్యవస్థ ముసుగులు విప్పి చూపుతుంది. చిన్న కూతురిని ఉన్నత చదువులు చదివించడానికి స్కూలు ఫైనల్ వరకు ఆమెను అబ్బాయి వేషంలో పంపుతూ ఉంటుంది తల్లి. విషాదంగా అంతమయ్యే ఆమె జీవితం కూతురికి తాననుకున్న ఒక భవిష్యత్తును నిర్మించి నిష్క్రమిస్తుంది. ఇటువంటి అసాధారణ కథకూ వాస్తవ జీవితమే నేపథ్యం. పిల్లల ద్వారా ఇటువంటి జీవితాల్లోకి వెళ్ళిపోవడం రచయిత ప్రత్యేకత. స్కూల్లో చేర్చుకునేటప్పుడు తండ్రి పేరు పదే పదే అడిగితే ʹపేరు లేదు, గీరు లేదు నాపేరే రాసుకోండి. నేనే గదా సదివించేదిʹ అంటుంది తల్లి. మళ్ళీ అడిగితే లేదమ్మా, లేదని చేప్తాంటే అని రెట్టించిన కోపంతో నా పేరే రాసుకోండి ʹకమలమ్మాʹ గట్టిగా గదుముతుందామె. వ్యవస్థలో రాటుదేలిన జీవమున్న పాత్ర కమలమ్మ. అందుకే ఆమె కథా సంకలనానికి కూడా ʹమా తుఝే సలాంʹ పేరు ఎంచుకున్నారు.

ఈ కథలోనైనా ʹతండా అమ్మాయిʹ, ʹఅంకితంʹ వంటి కథల్లోనైనా కరువు వాతనబడి చదువులు ఆగిపోయే పిల్లలకు ప్రేమను పంచే ఉపాధ్యాయిలు తారసపడితే పై చదువులు చదివి, అవకాశాలు పొందగలరు గాని లేదంటే సాధారణంగా వ్యవస్థ శిధిలాల కింద ఉండిపోతారు. శశికళ కథల్లో కవితా టీచర్ వంటి వాళ్ళు, లేదా రచయిత వంటి వాళ్ళు సమాజంలో అక్కడక్కడా ఉన్నా ఎంతమంది పిల్లల్ని ఆదుకోగలరు? ఈ కథలు ఉపాధ్యాయులు పిల్లల పట్ల ఎలా ఉండాలో సున్నితంగా చెప్తాయి. సాధారణంగా పిల్లలు, చదువులు వంటి అంశాలు సాహిత్యంలో చోటుచేసుకుంటున్నది ప్రైవేట్ విద్యాసంస్థల పోటీల కింద నలిగిపోతున్న మధ్యతరగతి పిల్లల గురించే. ఏకమొత్తంగా పిల్లలు అని మాట్లాడ్డం సాధ్యం కాదు. ఎందుకంటే పిల్లలందరూ ఒక్కటి కాదు. అంతెందుకు, సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లోనూ మగపిల్లలకు ఉండే అవకాశాలు ఆడపిల్లలకు ఉండవు (ʹపాము-కప్పʹ కథ). ఈ ఎరుక ఆమెకు ఉంది. ఆమె మొదటి కథాసంకలనంలో ఇటువంటి కథలున్నాయి. ఆమె తొలిరోజుల్లో రాసిన ʹవర్తమానం హోరులోʹ కరువు వల్ల పొట్టచేతబట్టుకొని వలసలుబోయే కుటుంబాల పిల్లల స్థితిని చిత్రించారు. రోడ్డు పక్కన గుడ్డ పీలికలతో గుడిసెల్లో నివాసం ఉండే దళిత పిల్లలు వర్షం పడినప్పుడు అంతా మూటగట్టుకొని స్కూలు బిల్డింగ్ లో పడుకుంటారు. ఆ చలిలో అనారోగ్యంతో తల్లి చనిపోతే శవాన్ని పూడ్చటానికి డబ్బులు అడుక్కుని రమ్మని తండ్రి పంపిస్తాడు. సరిగ్గా బడిపిల్లలు స్కూలు లోపలికి వెళ్ళే సమయానికి జీవితం నేర్పుతున్న చేదు అనుభూతులతో వీళ్ళు వీధిలోకి వెళ్తుంతారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకునే ʹచిన్నోడుʹ సెలవుల్లో హాస్టల్ మూసేస్తే తిండికి కూడా గతిలేని ఇంటికి పోలేక హోటల్లో పనికి కుదురుకుంటాడు. బడి వదిలేసి తల్లిదండ్రులతో పాటు పనులకు వలసలు పోవడం అనంతపురం తండాల్లో సాధారణ దృశ్యం. ముసలివాళ్లను దిక్కులేకుండా వదిలేయడమూ, వాళ్లు అలాగే అలమటించి చనిపోవడమూ అంతే సాధారణం. ఆత్మహత్యలు చేసుకునే రైతుల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నవయసులోనే వేశ్యావాటికలకు తరలించబడటమో, దాన్ని తప్పించడానికి స్కూలు డ్రాపౌట్ చేసి పెళ్లిళ్లు చేసి పంపించివేయటమూ కరువు నేల ఆవిష్కరించే దృశ్యాలే(డ్రాపౌట్). రైతు జీవితం నుండి డ్రాపౌట్ అయితే పిల్లలు కూడా డ్రాపౌట్స్ గా మిగిలిపోతారు. ఈ పిల్లలనే కాదు, రైలు బోగీల్లో కసువూడ్చే పిల్లలు, వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు మధ్యతరగతి ఆసక్తులు, దురభిమానాల మధ్య రచయిత చూడగలుగుతారు. స్పష్టమైన తాత్విక దృక్పథం లేకుండా ఉపాధ్యాయిని మాత్రమే అయితే ఎంత మానవీయ హృదయం అయినప్పటికీ, ఇటువంటి జీవితాల వైపు చూడటం, ఇంత విస్తృతి సాధ్యం కాదు.

పిల్లలను దండించకుండా దారికి తెచ్చే విధానమేమిటో, బోధనలో సృజనాత్మకతను ఎలా మేళవించవచ్చునో ఆమె ఆచరించరిస్తూ ప్రధానోపాధ్యాయురాలిగా టీచర్లను ప్రేరేపించిన అనుభవాలు చాలా విలువైనవి. బోధన గురించి ఆలోచించే వాళ్ళు, ముఖ్యంగా ఉపాధ్యాయులు వీటిని చదవాలి. ʹమీ పేరేమిటిʹ కథ ఇంగ్లీషు పదజాలాన్ని పిల్లలకు నేర్పడానికి చేసే ఒక ఆసక్తికరమైన ప్రయోగం. ఈ విషయంలో ఆమె ఎంత సున్నితంగా ఉంటారో దానికి కాస్త భిన్నంగా ప్రవర్తించవలసి వచ్చినప్పుడు చాలా బాధపడిపోతారు. లొంగుబాటు కథలో పిల్లల్ని లొంగదీసుకునే టీచర్ రచయితే. స్కూలు ఎగ్గొట్టి బైట తిరిగే పిల్లలను దారికి తేవడానికి పిల్లలను ఎత్తుకుపోయే దొంగల బూచి చూపిస్తారు. వాళ్ళు దారికొస్తారు గాని ʹఇంతకూ లొంగుబాటు ఎవరిది? ఈ ప్రశ్న పీడిస్తూనే ఉందిʹ అంటారామె కథ చివర్లో.

కార్పొరేట్ పెట్టుబడి తయారుచేసిన అమానవీయ విద్యావ్యవస్థ కింద పిల్లల సృజనాత్మకత, మానసిక శారీరక ఎదుగుదల ఎంతగా చిదిమి వేయబడుతున్నాయో, దాని గురించిన ఆందోళన సమాజంలో లేనట్లే, సాహిత్యంలో కూడా పిల్లల కోణం నుండి రచనలు తక్కువే. వివిధ అస్తిత్వాలు, పీడిత సమూహాల సాహిత్యం వస్తున్నట్లే ఈ అంశం మీద ఇంకా చాలా రావలసే ఉంది. శశికళ కథల్లో ప్రత్యేకత పిల్లలే మాట్లాడటం. కొన్ని కథలు పూర్తిగా పిల్లలే చెప్తారు. ʹనేను, మా లెక్కల సారుʹ అటువంటి కథే. లెక్కల సారు కొట్టిన దెబ్బలకు అమ్మలుకు జ్వరమొస్తే ఇంట్లో ఎప్పుడూ తన బాధలు పట్టించుకొని అమ్మ, నాన్న, అన్న ప్రేమగా, జాలిగా చూస్తుంటారు. ఈ జ్వరం తగ్గకుంటే ఎంత బాగుంటుందో? తగ్గిపోతే అంతా మామూలే.. అంటుంది అమ్మలు. ʹనాకు లెక్కలు రావు, నాకు లెక్కలు రావు.. నేనింక ఆడుకొను. నేను స్కూలుకు వెళ్ళను అని నిద్రలో పలవరించే అమ్మలు లాంటి పిల్లలుʹ ఎంతో మంది ఉంటారు. టీచర్ అంటే పిల్లల మనసుల్లో ఎటువంటి ముద్ర ఉంటుందో వాళ్ళ మనసుల్లోకి తొగిచూసి తెలుసుకునే ప్రయత్నం చేయగలగాలి. కలలోకి కూడా వచ్చి భయపెట్టే రూపాలు ఉంటాయంటే అతిశయోక్తి అవదు. ఇక ఇంట్లో అమ్మ కూడా టీచర్ పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది. పిల్లలు ఆడుకునే ఆటలో బబ్బులు (ప్రతిబింబం) అమ్మ పాత్ర పోషిస్తూ చెప్పింది రాయకుంటే చంపేస్తానని తోటి పిల్లల్ని కొడుతూ ఉంటుంది. ఈ దృశ్యం ఒకటి చాలు. ఇట్లా పిల్లల మనసుల్లో ఏమేం మెదులుతుంటాయో అర్థం చేసుకోను ప్రయత్నించే సాహిత్యం కావాలి. పెద్దల ప్రపంచంలో ద్వంద్వ ప్రమాణాలు నచ్చని ʹకిట్టూʹ (మా కిట్టూ యమా స్ట్రిక్టు) వంటి వాళ్ళు వేసే ప్రశ్నలు తల్లిదండ్రులకు, ఉపాద్యాయులకు ఎక్కుబెట్టినవి. ఇందులో కూడా కిట్టూ తరపున ఆ పిల్లవాడి అక్క సుమ మాట్లాడుతుంది.

మరో ముఖ్యమైన పార్శ్వం వ్యవస్థలోని ఆధిపత్య సంబంధాలు, వైమానష్యాలు, హింస పిల్లల మానసిక స్థితి మీద లోతైన ప్రభావం వేయటం. మనం సాధారణంగా చెప్పుకున్నట్లు బాల్యం స్వచ్ఛంగా, నిర్మలంగా, అమాయకంగా ఉండదు. ఉండనిచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. టీచర్ బిడ్డలు మిగతా పిల్లల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తారు. మగపిల్లలు ఆడపిల్లల మీద, ధనవంతుల పిల్లలు పేదవాళ్ళ పిల్లల మీద, అగ్రకులాల పిల్లలు పీడిత కులాల పిల్లల మీద అజమాయిషీ చేయొచ్చనుకుంటారు. తోటి పిల్లలను ఏడిపించే టీచర్ కొడుకు రాహుల్ ను, ధనవంతుల బిడ్డ భరత్ ను ఎవరూ ఏమీ అనరే అని కిట్టూ బాధ. వాళ్లను తను ఏడిపించడం కరెక్టే అని కిట్టూ తర్కం. అందుకు టీచర్ తో, నాన్నతో దెబ్బలు తిన్నా ఫరవాలేదనుకుంటాడు. సౌమ్య, రమ ముఠా తగాదాల్లో ఇరువర్గాలైన కుటుంబాల పిల్లలు. పెద్దల కోపాలు, పగలు తామూ ప్రదర్శించాలనుకుంటారు(కలుపు మొక్కలు). రిక్షా తోక్కేవాడి కొడుక్కు ఎంత ప్రతిభ ఉన్నా పోలీసు కానిస్టేబుల్ కొడుక్కు లొంగాలి. పరీక్షల్లో వాడు కాపీ కొడితే శిక్ష వీడికి పడాలి (స్కూల్ ఫస్ట్). ఇటువంటి పరిసరాల్లో పిల్లలు ఎదుగుతున్నారు అని శశికళ చెప్తారు. ఇటువంటి స్థితిలో ఆ నిస్సహాయశూరుల చేత కష్టాల్లో ఉన్నవాళ్లను ఆడుకోవాలనే మానవీయ భావనను, సామాజిక దృష్టిని పెంపొందింపజేసే ప్రయత్నం చేస్తారొక కథలో. ఈ కథలో కూడా ఆ ఉపాధ్యాయిని రచయితే. ఉపాధ్యాయులు పేద పిల్లల కోసం ఏర్పాటు చేసే వెల్ఫేర్ ఫండ్ కోసం చిన్న చేతులనూ ఆహ్వానిస్తూ సహకారంలోని గొప్పతనం తెలుసుకొనేలా చేస్తారు.

ఈ కథలన్నింటిలో శశికళ శైలి, కథనం పిల్లలకు పెద్దలకు ఏకకాలంలో చెప్తున్నట్లుగా ఉంటుంది. చాలా వరకు కథల్లో పిల్లల మాటలు, వారి వాడుకలోని పదాలతో సంభాషణలే కాదు, కథనం కూడా నడుస్తుంది. వర్ణనలు కూడా పిల్లల ప్రపంచం నుండే తీసుకోవడం ఇంకెంతో ముచ్చటగా ఉంటుంది. పిల్లల కోసం పెద్దలు, ఉపాధ్యాయులు చదవడానికి ఉద్దేశించిన కథలివి. అట్లాగే ఒక స్థాయి పిల్లలు కూడా చదవగలిగిన కథలు. మరెన్నో కథలు ఆమె రాయవలసే ఉంది. రాస్తారనికూడా ఆశించవచ్చు.

(పద్మావతి మహిళా యూనివర్సిటీ సెమినార్(15,16 మార్చి 2017)లో పత్ర సమర్పణ చేస్తూ ఈ విషయాలు మాట్లాడాక ఒక పాప వేదిక మీదికొచ్చి ʹఆంటీ, మా తెలుగు టీచర్ నన్ను కొడుతుంది, మీరేమైనా చేయండిʹ అని నా చెవిలో చెప్పింది. ఆ పిల్ల ఒకటో తరగతి. వాళ్ళమ్మతోపాటు అక్కడికొచ్చింది. అట్లా ఉంటాయి కా.శశికళ కథలు.)

No. of visitors : 1153
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •