ధర్నా చౌక్‌

| సంభాషణ

ధర్నా చౌక్‌

- వరవరరావు | 05.04.2017 11:52:13pm

ప్రజాస్వామిక హక్కుల ప్రస్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ కాలం నుంచి ఒక విహంగ వీక్షణం చేద్దాం.

ఇంకా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్యగారి నాయకత్వంలో ఒక పెద్ద రైతాంగ ర్యాలీ జరిగింది. వ్యవసాయ కూలీలకు, రైతులకు ఉన్న సమస్యలతో, భూపంపకాల డిమాండ్‌తో వేలాది మంది ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ దగ్గరికి తరలి వచ్చారు. అప్పటి సంప్రదాయం ఏమిటంటే శాసనసభ జరుగుతూ ఉంటే ఒక ర్యాలీ గాని, ఒక ఉరేగింపు గాని వచ్చి దానికి నాయకత్వం వహించే ఒక ప్రతినిధి వర్గం శాసనసభ జరుగుతున్న దగ్గరకు వెళ్లి సభాపతి చాంబర్‌లో సభాపతి ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి పత్రాన్ని అందజేయడం.

ఆ రోజు వర్షం పడుతున్నది. అప్పటికింకా గన్‌పార్క్‌ కూడా లేదు. శాసనసభ ఆవరణకు ర్యాలీ చేరుకున్నది. లోపల శాసనసభ చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి సభాపతి అనుమతి తీసుకొని, ఒక గొడుగు తీసుకొని బయటికి వచ్చి సుందరయ్యగారికి ఎదురుగా వెళ్లి ఆయనకు గొడుగు పట్టి, ఆయన నుంచి విజ్ఞప్తి పత్రం తీసుకొని, ర్యాలీకి ఆ డిమాండ్‌లు పరిశీలిస్తాని వాగ్దానం చేసి లోపలికి వెళ్లిపోయాడు.

ఇది నేను కళ్లతో చూడలేదు కాని 1972లో కొల్లిపర బాలగంగాధర్‌ తిలక్‌ తీసిన ʹభూమి కోసంʹ అనే సినిమా ఈ దృశ్యంతో ముగుస్తుంది. ఈ సంఘటనను యథాతథంగా ఆయన సినిమాలో చూపెట్టాడు.

1962 చైనా యుద్ధ కాలం నుంచి శాసనసభ జరిగే రోజుల్లో శాసనసభ చుట్టూ 144 సెక్షన్‌ అమలవుతున్నదని, అది తొలగించిన కాలం చాలా తక్కువని కేశవరావు జాదవ్‌ చెప్తుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో నిర్బంధం 1964లో సిపిఎం నాయకత్వాన్ని, 80 మందిని పిడి చట్టం కింద నిర్బంధించిన దగ్గర నుంచి తీవ్రతరమైంది. అప్పుడే శ్రీశ్రీ అధ్యక్షుడుగా, డా. యలమంచలి రాధాకృష్ణమూర్తి కార్యదర్శిగా ఎపిసిఎల్‌ఎ కూడా ఏర్పడి ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలు కూడా పుంజుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలపు డా. జయసూర్య, సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి వాళ్లు నిర్వహించిన పౌరహక్కుల ఉద్యమం తరువాత పేర్కొనదగిన ఉద్యమం ఇదే. హక్కుల ఉద్యమాలపై నిర్బంధం కూడా ఇట్లా 1964లో మొదలై 67లో నక్సల్బరీ, శ్రీకాకుళాల పోరాటాల కాలం నుంచి ఎమర్జెన్సీ ముగిసే దాకా (1977) తీవ్రతరంగానే ఉన్నాయి.

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తొలి రోజుల (1977, మార్చ్‌) నుంచి జగిత్యాల, సిరిసిల్లలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించే (1978 అక్టోబర్‌) వరకు ఒక సాపేక్షికమైన ప్రజాస్వామ్యాన్ని తెలుగు నేల అనుభవించింది. కె.ఎస్‌. వ్యాస్‌ నాయకత్వంలో రవూఫ్‌ గ్రూప్‌ నాయకులను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపడం దీనికి మినహాయింపు.

1983లో ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత కరీంనగర్‌లో జరిగిన రైతు కూలీ సంఘం రెండవ మహాసభల నాటికే మళ్లీ నిర్బంధం తీవ్రతరమైంది. ఆ సభలు అటు జరుగుతూ ఉండగానే వరంగల్‌లో పీపుల్స్‌వార్‌ నాయకుడు మామిడాల హరిభూషణ్‌ను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేశారు. ఆ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన స్వామి అగ్నివేష్‌తో హైదరాబాద్‌లో సచివాలయం పక్కనే ఎపిసిఎల్‌సి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసింది. సభ అయిపోయిన తరువాత స్వామి అగ్నివేష్‌, కె.జి. కన్నబిరాన్‌, మాదాల నారాయణస్వామి, వై. కాశీపతి మొదలైనవాళ్లు సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ప్రజలపై నిర్బంధాన్ని నిలిపివేయాల్సిందిగా విజ్ఞప్తి పత్రం ఇచ్చారు. అప్పుడు సచివాలయ ప్రవేశ ద్వారం టాంక్‌బండ్‌ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లే రోడ్డు వైపు ఉండేది.

ఎన్‌టి రామారావు రాజకీయాల్లో ప్రవేశించేటప్పటికి ఆయన మీద ఉన్న ప్రభావం జై జవాన్‌, జై కిసాన్‌ మాత్రమే. ఆయన ఖాకీ డ్రెస్‌ ఇష్టపడేవాడు. కాని ప్రజాస్వామిక హక్కుల కోసం ఒక స్వామిజీ కాషాయ దుస్తుల్లో రావడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ʹమీరు స్వామిజీలాగ ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారాʹ అని అడిగాడు. ʹనేను హర్యానాలో మంత్రిగా కూడా చేసాను అని చెప్పాడు ఆయన. తాను జనతా పార్టీ నాయకుడినʹని చెప్పాడు. అయితే ఆర్య్‌సమాజ్‌లో ఉన్నందున ఈ స్వామి ఆహార్యం వేసుకున్నానని చెప్పాడు. ఎన్‌టిఆర్‌కు ఆ వేషం ఇష్టమైంది. ఆ తర్వాత కాలం తను కూడా ఆ ఆహార్యాన్ని ఇష్టపడ్డాడు. ఆ ఆహార్యంతో 1985 నుంచి 89 దాకా ఆయన ఆట, పాట, మాట బంద్‌ చేసి ఏం చెసాడో చెప్పడానికి ఇది రాయడం లేదు.

అప్పుడు సచివాలయం ప్రాకారం పక్కనే సభ పెట్టుకొని నాలుగు అడుగులు వేసి ప్రధాన ద్వారం నుంచి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి విజ్ఞప్తి పత్రం ఇవ్వడానికి అవకాశం ఉండేది అని చెప్పడానికి ఇది ప్రస్తావించాను. ఈ అవకాశం నేను ప్రత్యక్షంగా చూశాను.

అప్పటికింక ప్రభుత్వం సచివాలయంలోను ప్రభుత్వం నుంచి హక్కులు కోరే వాళ్లు సచివాలయం చుట్టూ తమ గొంతు వినిపించే అవకాశం ఉండేది. ప్రభుత్వం అంటే శాసనాలు చేసే సమయంలో శాసనసభలోను, అమలు చేసే కాలంలో సచివాలయంలోను ఉంటుందనే భావన ఉండేది. అప్పటికింకా అధికారం పూర్తిగా ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసుకు తరలిపోలేదు. తరలిపోయినాక కూడా ముఖ్యమంత్రి ఇటువంటి గొంతులు వినే అవకాశం కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం వరకూ ఉండేది.

అప్పుడు రోజుల తరబడి, నెలల తరబడి తెలుగు తల్లి విగ్రహం దగ్గరే ప్రదర్శనలైనా, ధర్నాలైనా జరుగుతూ ఉండేవి. సచివాలయంలోకి ప్రవేశం ఎంతో సులభ సాధ్యంగా ఉండేది. మేం ప్రత్యక్షంగా పాల్గొని చూసిన ఒక అనుభవం చెప్పాలంటే 1994 డిసెంబర్‌ నెల నుంచి 95 మార్చ్‌ వరకు నాలుగు నెలల పాటు రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల విడుదల కోసం ఒక శిబిరం తెలుగు తల్లి విగ్రహం దగ్గరగా లుంబినీ పార్క్‌ వద్ద నిర్వహించబడింది. దినమే కాదు, రాత్రి కూడా ఆ శిబిరంలో హక్కుల సంఘాల కార్యకర్తలూ, కవులూ, కళాకారులూ ఎల్లప్పుడూ సందడిగా ఉండేది. ఎన్‌టి రామారావు రెండవసారి ముఖ్యమంత్రి అయిన కాలం అది. పీపుల్స్‌వార్‌ మీద నిషేధం ఎత్తివేసిన కాలం అది. 1995 మార్చ్‌లో ఈ శిబిరం నిర్వహిస్తున్న రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల కమిటీతో చర్చలకు ఎన్‌టిఆర్‌ ఒప్పుకున్నాడు. అప్పుడు హోంమంత్రి ఇంద్రారెడ్డి. అప్పుడూ పక్కనున్న సచివాలయం ముఖద్వారం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశించి కె.జి. కన్నబిరాన్‌ గారు, ఎం.టి. ఖాన్‌, నేను హోంమంత్రి, హోం కార్యదర్శి సమక్షంలో ఈ అంగీకార పత్రంపై వాళ్లతో పాటు సంతకాలు చేశాం. నెలల తరబడి ధర్నాలు, వాటి ఫలితాలు ఇట్లా ఉద్యమకారులు, ప్రభుత్వాలు ఎదురుపడి మాట్లాడుకొని పరిష్కరించుకున్న రోజులు అప్పటికింకా మిగిలాయి.

పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ధర్నాచౌక్‌ ఇందిరా పార్క్‌కు మారింది. అంటే నిరసన తెలపడానికి ప్రభుత్వమే ఒక స్థలం ఏర్పాటు చేసే పద్ధతి మొదలైందన్నమాట. అప్పటివరకు సంప్రదాయంగా వస్తున్న స్థలాలే నిరసన స్థలాలుగా ఉండేవి. అంటే, ధర్మగంట పాలకులకు వినవచ్చే దూరంలో ఉండేది. పాలకులు శాసనసభలో, సచివాలయంలో ఉంటారని, ఆ పరిసరాల్లో నిరసనలు, ప్రదర్శనలు ఆ గొంతులు వినిపించాలనేది ఒక ప్రజాస్వామిక అవగాహన. అది ఎక్కడి నుంచి వినిపించాలో ప్రజలు ఉద్యమకారులు కాకుండా ప్రభుత్వాలు నిర్ణయించే కాలం వచ్చింది.

ఎమర్జెన్సీ ముందు దాకా ఢిల్లీలో బోట్‌క్లబ్‌ దగ్గర జరిగే ప్రదర్శనలు, ధర్నాలు జంతర్‌ మంతర్‌కు తరలిపోయాయి. జంతర్‌ మంతర్‌ అయినా, ఇందిరా పార్క్‌ అయినా అధికారానికి మరీ దూరమైన ప్రాంతాలు కావు. కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతాలే అని సరిపెట్టుకున్నాం. ఇప్పుడింక ధర్నా చౌక్‌ నాగోల్‌కో, ఉప్పల్‌కో, ఘట్‌కేసర్‌కో తరలిపోతున్నది. ముఖ్యంగా 1996 నుంచి 2014 వరకు పద్దెనిమిది సంవత్సరాలు వేలాది ధర్నాలకు, ప్రదర్శనలకు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ వంటి ధర్నాచౌక్‌ తెలంగాణ రాష్ట్రంలో చాలా దూరం తరలిపోనున్నది.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉప్పల్‌, ఘట్‌కేసర్‌లు చాలా దగ్గరగా ఉంటాయి కదా! వాళ్లకు అండగా నిలిచే అధ్యాపకులకు కూడా దగ్గరగా ఉంటాయి కదా! అనే ఒక వాదన వినవస్తున్నది. ఇందిరా పార్క్‌లో ప్రదర్శనలు ట్రాఫిక్‌కు అంతరాయం అనే వాదన వినవస్తున్నది. కార్తీక దీపోత్సవాలు ఎన్‌టిఆర్‌ స్టేడియంలో నిర్వహించబడినా, జియ్యర్‌ స్వామి జన్మదినం ఎల్‌బి స్టేడియంలో నిర్వహించబడినా ట్రాఫిక్‌ నియంత్రణ జరుగుతుంది. కాని ప్రజల ప్రదర్శనలకు, ధర్నాలకే ట్రాఫిక్‌ సమస్య ఏర్పడతది. ఇది ప్రజల్లోనే ఉద్యమకారులకూ, వివిధ ప్రజా సమస్యల గురించి కదిలివచ్చే ప్రజలకూ, తమ తమ పనుల మీద ప్రయాణం చేసే వారికి మధ్యన ఒక కృత్రిమ వైరుధ్యాన్ని సృష్టించే కుట్ర.

పల్లెల నుంచి తమ సమస్యలు తీసుకుని వచ్చే ప్రజలకైనా, నిరుద్యోగులకైనా, గ్రామీణ తెలంగాణకైనా, ఒకవైపు వాళ్లకైనా నగర బయటి ప్రాంతాలు దగ్గరగా ఉంటాయనుకున్నప్పటికీ అవన్నీ వినవలసిన వారికి చాలా దూరంగా ఉంటాయనే స్పృహ లేకుండా నిన్నటి ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. నిన్న కూడా వీళ్లు ఉద్యమకారులేనా, లేక రాజకీయ ప్రయోజనాలు ఉన్నవాళ్లా అనే అనుమానం ఇప్పుడు వస్తున్నది.

ఢిల్లీ, కలకత్తాలలో కాఫీ హౌజ్‌లు, హైదరాబాద్‌లో ఓరియంటల్‌ హోటళ్లు ఉద్యమాల నుంచి అద్భుతమైన రాజకీయ నాయకులను తయారు చేశాయి. హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ఓరింయటల్‌ హోటల్‌ నుంచి మగ్ధూం, టంగుటూరి అంజయ్య, ఎం.టి. ఖాన్‌ వంటి నాయకులు వచ్చారు. ఇప్పుడు శతవార్షికోత్సవం చేసుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆలంఖుంద్‌ మీరి, మగ్ధూం వంటి కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ నిర్మాణం చేసిన రాజకీయ ఉద్యమ నాయకులు వచ్చారు. అప్పటి ప్రభుత్వం అన్ని మధ్యయుగాల రాచరికపు భూస్వామ్యాన్ని తలపించేదని చరిత్రకారులు చెబుతారు. ఇప్పుడో మరి?

ఇప్పటికీ అమెరికా వాషింగ్టన్‌ వైట్‌ హౌజ్‌ పక్కనే సంవత్సరాల తరబడి నిరసనలు, ప్రదర్శనలు చేసే శిబిరాలు ఉన్నాయి. ఫాసిస్టు ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యా అవి నిత్యం లక్షలాది మంది ప్రదర్శనకులకు తావులయ్యాయి. లండన్‌లోని హైడ్‌ పార్క్‌ అటువంటిదే. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌, కలకత్తాలో కాలేజ్‌ స్ట్రీట్‌, ముంబైలో ఆజాద్‌ మైదాన్‌, చెన్నైలో మెరీనా బీచ్‌ (ఇటు ఇందిరా పార్క్‌లో ధర్నాలు జరుగుతున్న రోజుల్లోనే మెరీనా బీచ్‌లో జల్లికట్టు ప్రదర్శన చూశాం), బెంగుళూరులో శాసనసభ ఆవరణ చుట్టూ ఉన్న పార్క్‌లు, మైదానాలు ఇప్పటికీ ప్రజాప్రదర్శన స్థలాలుగా ఉన్నాయి. అక్కడి ప్రభుత్వాలన్నీ ఎంత కరుడుగట్టిన నియంతృత్వాన్ని అమలు చేస్తున్నాయో, ఎంత వివక్షను పాటిస్తున్నాయో వివరించనక్కర్లేదు. తెలంగాణ ప్రభుత్వం అంతకన్నా కడుహీనంగా ఉందా.

భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ శ్రీశ్రీ రాసిన ఒక విజ్ఞప్తిలో డాస్ట్‌వస్కీ ఉరిశిక్షను రద్దు చేసిన జార్‌ చక్రవర్తి కన్నా, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ గెరిల్లాలను ఉరితియ్యడానికి జంకిన నైజాం కన్నా చరిత్రలో అపఖ్యాతి మూటగట్టుకోవద్దని ఇందిరా, వెంగళరావులకు విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు బహుశా అటువంటి పోలికతోనే తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయాల్సి వచ్చేటట్టుంది.

మహ్మద్‌ దగ్గరికి కొండ పోకపోతే, కొండ దగ్గరికి మహ్మద్‌ పోక తప్పదు కదా అనేది సామెత. మహ్మద్‌ ప్రవక్త. ప్రవక్త దగ్గరికి ప్రజలు పోతారు. కొండ పోలేదు కదా. అందుకని ప్రవక్త అయినా సరే, ఆయనే కొండ దగ్గరికి పోవాల్సి వస్తది. ధర్నా చౌక్‌ ఇందిరా పార్క్‌లో ఉంటే ప్రదర్శన చేసేవాళ్ల ప్రతినిధి వర్గం సచివాలాయానికో, శాసనసభకో వెళ్లడానికి వీలవుతుంది. లేదా శాసనసభ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా, ప్రభుత్వ ప్రతినిధి ఎవరైనా ధర్నా దగ్గరికి రావడానికి వీలవుతుంది. నగరానికి బయటికి ధర్నా చౌక్‌ను విసిరివేస్తే ఈ రెండు అవకాశాలు లోపిస్తాయి. ఏదైనా ఒక మార్గం కొండను మహ్మద్‌ను కలపాలి కదా. ఎందుకంటే ప్రవక్తల మాటలు ప్రజలకు ఎట్లాగూ చేరతాయి. పాలకులు కూడా వినాలి కదా.

మామూలుగా మావోయిస్టులైతే దోపిడీని కొండతో పోలుస్తారు. ప్రభుత్వం అంటే ఈ దోపిడీ పాలకవర్గ రాజ్యాంగ యంత్రం అని చెప్తారు.

తమకు తాము ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకునేది ఇటువంటి దోపిడీ కొండ కాదు అని చెప్పదల్చుకుంటే ఇందిరా పార్క్‌ నుంచి మోగే ధర్మగంటను విసిరేయకుండా వినడానికి సిద్ధపడే ధర్మ ప్రభువుల వలె చెవి ఒగ్గుతారని ఆశిద్దాం.

18 మార్చి 2017

No. of visitors : 1086
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •