మార్పు ఎవరిలో..?

| సాహిత్యం | క‌థ‌లు

మార్పు ఎవరిలో..?

- | 17.04.2017 10:57:06am

సాయంత్రం ఆరుగంటలయింది. చలికాలం కావడంతో అప్పటికే చీకటి పడింది. ఎనిమిదో తరగతి చదువుతున్న హిమ అప్పుడే ట్యూషన్‌ నుండి వచ్చింది. రాగానే స్కూలు బ్యాగు మూలన పడేసి బయటకు పరిగెత్తబోయింది. ʹʹఏమిటే ఇప్పుడే వచ్చి మళ్లీ బయటకు పరుగెత్తుతున్నారు. ఇంట్లోకి వెళ్లి డ్రెస్‌ మార్చుకొని మొహం కడుకోవచ్చుగాʹʹ అంది హిమ నాన్నమ్మ.

ʹʹఅబ్బ ఉండు నాన్నమ్మా ఇప్పుడే వస్తాను. బయట మా ఫ్రెండ్సంతా ఆడుకుంటున్నారు త్వరగా వస్తాలేʹʹ అంటూ బయటికి పరిగెత్తింది హిమ.

ʹʹచీకటి పడింది. ఇప్పుడేం ఆటలే. ఒక్క క్షణం ఇంట్లో కాలు నిలవదు కాదాʹʹ అంటూ వెనకాలే కేకలేస్తూ ఉండిపోయింది.

అప్పుడే ఆటుగా వచ్చిన కోడలితో ʹʹఈ పిల్ల చూడవే పొద్దుపోయాక ఇప్పుడనగా వచ్చింది. మళ్లీ ఆటలకు బయల్దేరింది. ఇంట్లో ఒక్క క్షణం ఉండదు కదాʹʹ అని ఇంకా ఏదో చెప్తున్న అత్త మాటలకు అడ్డుపడి ʹʹచిన్నపిల్ల కదండీ. ఇప్పటి దాకా ట్యూషన్‌ చదువుకొని వచ్చింది కదా. కాస్సేపు ఆడుకుంటుంది లెండి. బయట పిల్లలందరూ ఆడుతుంటే దీన్నింట్లో కూర్చోమంటే కూర్చుంటుందా. చీకటి పడితేనేం, ఇంటి ముందరే కదా ఆడుకుంటుందిʹʹ అని కూతురిని పూర్తిగా సమర్థించి మాట్లాడుతూ తాను కూడా వచ్చి అరుగు మీద నిలబడి ఆఫీస్‌ నుండి వచ్చే భర్త కోసం ఎదురు చూస్తూ పిల్లల ఆటలు చూడసాగింది.

ఓ పది మంది పక్కింటి, ఎదురింటి, ఆడ మగ పిల్లలతో కల్సి హిమ, హిమ తమ్ముడు హరి గోలగోల చేస్తూ ఏవో ఆటలాడుతున్నారు. ఆటలో నిమగ్నమై ఉన్న హిమ దూరం నుండి వస్తున్న తండ్రిని చూసి ʹʹమా నాన్నొస్తున్నాడుʹʹ అంటూ ఆటని వదిలి పరిగెత్తుకుంటూ నాన్నకు ఎదురు వెళ్లి ఢీకొట్టినంత పని చేసింది.

ʹʹఅరెరె నెమ్మదిగా.. పడతావమ్మాʹʹ అంటూ కూతురిని పట్టుకొని ఆపి ఆమె భుజం చుట్టూ చేయి వేసి నడిపిస్తూ ʹʹఏమ్మా హోంవర్కు లేదా, ఇంకా ఆటలాడుతున్నావుʹʹ అన్నాడు నవ్వుతూ.

ʹʹనేనిందాకే వచ్చాను ట్యూషన్‌ నుండ. ఇప్పుడు చేస్తానుగా హోంవర్క్‌ʹʹ అంది భుజం మీద వేసిన తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంటూ. ఇంట్లోకి రాగానే భార్య నవ్వుతూ ʹʹచూసారా మిమ్మల్ని చూడగానే అది ఆట వదిలేసి పరుగెత్తుకుంటూ వచ్చిందిʹʹ అంది.

ʹʹమరేమనుకున్నావ్‌ అది నా కూతురుʹʹ అని ఒక్క క్షణం భార్యవైపు గర్వంగా చూసి వంగి కూతురు నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు. ఇద్దరు మగపిల్లల మధ్య పుట్టిన ఆడపిల్ల కాబట్టి కూతురిపై ఎక్కువ అభిమానం చూపిస్తాడాయన. ఇంతలో ఆ గదిలోకొచ్చి ముసలావిడ ʹʹచూశావురా నీ కూతురు ట్యూషన్‌ నుండి చీకటి పడ్డాక వచ్చింది. వచ్చి కాస్త కుదురుగా ఇంట్లో ఉండొచ్చు కదా. మళ్లీ ఆటలకు బయలుదేరింది. ఆడపిల్లకు ఇప్పటి దాకా ఆటలేమిటిరాʹʹ అంటూ కొడుక్కీ కంప్లయింట్‌ చేసింది.

తల్లి మాటలకు తేలిగ్గా నవ్వేస్తూ ʹʹచిన్న పిల్ల దానికేం తెలుసమ్మా, ఇప్పటిదాకా ట్యూషన్‌లో ఉండి వచ్చింది కదా, కాస్సేపు ఆడుకుంటే పోయేదేముంది. ఆటలకు ఆడ మగ అని ఏముందమ్మాʹʹ అన్నాడు నవ్వుతూ.

గర్వంగా చూసింది హిమ నాన్నమ్మ వైపు. ఆ చిన్న పిల్ల కళ్లలో ఈ ప్రపంచాన్ని గెలిచిన సంతోషం.

ఉదయం ఆరున్నర అయింది. అప్పుడప్పుడే సూర్యుడు మంచు తెరలను తొలగించుకొని కళ్లు తెరిచి తొలిచూపు కిరణాలను ప్రకృతిపై ప్రసరిస్తున్నాడు. అప్పటికే లేచి మాధవి వంటింట్లో పనులు చేసుకుంటుంది. భర్త అత్త కూడా అప్పుడే లేచారు. పిల్లలందరూ ఇంకా పడుకొనే ఉన్నారు. మంచంలో పడుకున్న హిమ, హరి ఒకే దుప్పటి కింద ఒకరిమీద మరొకరు చేతులేసుకొని ముడుచుకొని పడుకున్నారు. ముఖం కడుక్కొని అప్పుడే వంటింట్లోకి వచ్చిన నిండా శాలువా కప్పుకొని కూర్చుని కోడలిచ్చిన కాఫీ తాగుతూ చలి పోగొట్టుకోనే ప్రయత్నం చేయసాగింది ముసలావిడ. ఉన్నట్టుండి ʹʹపాపను లేపరాదటే. నీకాస్త పనిలో సాయం చేస్తుంది హైరానా పడుతూ పనులు చేసుకుంటున్నావుʹ అంది

ʹʹఅయ్యో అది పసిపిల్ల. ఈ చలికి మనమే తట్టుకోలేకుండా ఉన్నాం. ఇంక అదేం చేస్తుంది. కాస్సేపు పడుకుంటుంది లెండిʹʹ అంటున్న కోడలు వైపు కొంత అసహనంగా చూసిందామె.

ఏడు గంటలకు పిల్లలందర్ని లేపాడు విశ్వనాథ్‌. ʹʹనిద్రొస్తుంది నాన్నాʹʹ అంటూ గునుస్తున్న హిమ, హరిలతో ʹʹలేచి మొహం కడుక్కొని పాలు తాగి కాస్సేపు హోం వర్క్‌ చేస్కోండ్రా, మళ్లీ స్కూలుకు టైమవుతుందిʹʹ అన్నాడు లాలనగా.

బలవంతంగా నిద్రలేచిన హిమ కళ్లు నులుముకుంటూ, వంటింటి గుమ్మంలో కూర్చున్న నాన్నమ్మను దాటుకుంటూ బాత్రూంకు వెళ్లబోయింది.

అప్పటిదాకా పడుకొని తనను దాటుకుంటూ వెళ్తున్న హిమవైపు కాస్త అసహనంగా చూస్తూ ఉండిపోయిన ముసలమ్మ కళ్లు అనుమానంతో పెద్దవయ్యాయి. అనుమానాశ్చర్యాల నుండి తేరుకోకుండానే ʹఅమ్మాయ్‌ʹ అని కంగారుగా మాధవిని పిలిచి గుసగుసగా ఏదో చెప్పింది.

అత్త మాటలు విన్న మాధవి గుండె గుభేల్‌మంది. అయినా పూర్తిగా నమ్మకం కల్గక హిమవైపు చూసింది. అప్పటికే ఆ అమ్మాయి బాత్రూమ్‌లోకి వెళ్లిపోయింది. హిమ బయటకు వచ్చేదాకా బాత్రూం ముందే నిలబడి హిమ బయటకు రాగానే హిమ ఫ్రాకు చూసి అత్త మాటలు నిజమేనని నిర్ధారణ చేసుకొని వణికే గొంతుతో ʹహిమాʹ అని పిలిచింది.

తల్లి గొంతులోని వణుకును గుర్తించకుండా ʹʹఏమిటమ్మాʹʹ అని అడుగుతున్న హిమ కళ్లలో ఈ లోకం తెలియని అమాయకత్వం ʹʹనువ్వోసారి బాత్రూంలోకి రాʹʹ గొంతులోకి వణుకుని అదిమిపెట్టే ప్రయత్నం చేస్తూ చెప్పింది మాధవి.

ʹʹఎందుకమ్మాʹʹ అని అమాయకంగా అడుగుతూనే బాత్రూంలోకి అడుగుపెట్టింది హిమ.

ʹʹనువ్వు కాసేపు బాత్రూంలోనే కదలకుండా నిలబడుʹʹ ఆమె గొంతులో కాఠిన్యం చోటు చేసుకోసాగింది.

ʹʹబాత్‌రూమ్‌లో నిలబడడం ఎందుకుʹʹ ఆశ్చర్యంగా అడిగింది హిమ.

ʹʹనన్ను విసిగించకుండా నేను చెప్పినట్లు వింటావా లేదా?ʹʹ అంది కాస్త కోపంగా మాధవి. అకారణంగా అమ్మలో కోపాన్ని చూడని హిమ కాస్త జంకుతూ ʹʹఅది కాదమ్మా నేనింకా హోంవర్క్‌ చేసుకోవాలి.ʹʹ

ʹʹహోం వర్క్‌లేదు. ఏంలేదు, కాసేపు నోరు మూసుకొని నిలబడుʹʹ కసిరింది మాధవి. మాధవికి కాలు చేయీ ఆడటం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. ఇక్కడ తల్లి కూతుళ్లకి సంభాషణ జరుగుతుండగానే, సుందరమ్మ గబగబా కొడుకు దగ్గరకు వెళ్లింది.

ʹʹనాయనా విశ్వం, ఇన్ని రోజులూ నీ కూతుర్ని చిన్న పిల్ల అని వెనకేసుకొచ్చావు కదా, ఇప్పుడేమయిందో చూసావాʹʹ అంది స్వరం పెంచుతూ.

ʹʹఏమయిందమ్మాʹʹ చిరునవ్వుతో అడిగాడు విశ్వనాథ్‌.

ʹʹఏమయిందా? నీ కూతురు పెద్ద మనిషయిందిʹʹ అదే స్వరంతో చెప్పింది. సుందరమ్మ అతని మొహంలో చిరునవ్వు ఎగిరిపోయింది. ఒక్క క్షణం తల్లి చెప్తున్నదేంటో అర్థం కాలేదు ʹʹఏమిటిʹʹ అన్నాడు ఇంకా అర్థం కానట్టు.

ʹʹహిమ పెద్ద మనిషయిందిరా బాబూ. ఆడపిల్లన్నాక ఈడొచ్చాక ఇవ్వన్నీ తప్పవు కదాʹʹ నగ్న సత్యాన్ని చెప్తున్నట్టుగా అంది సుందరమ్మ.

ఇంతలోనే అటువైపు వచ్చిన భార్యవైపు ʹనిజమాʹ అన్నట్లు చూసాడు విశ్వనాథ్‌. నిజమేనన్నట్టుగా కళ్లు దించుకుంది మాధవి.

ఇంకా నమ్మలేకపోతున్నాడు విశ్వనాథ్‌. మోకాళ్లు దాటని ఫ్రాకులేసుకొని చెంగు చెంగున లేడిపిల్లలా గంతులేసే తన కూతురు అప్పుడే పెద్ద మనిషయిందా.

ఇంకా పధ్నాలుగేళ్లు పూర్తిగా నిండనయినా లేదు అనుకున్నాడు విశ్వనాథ్‌.

అమ్మ ప్రవర్తన ఇంకా అర్థం కాని హిమ అటుగా వచ్చిన నానమ్మతో ʹʹనానమ్మా.. అమ్మ అలా ఉంది ఎందుకు, నన్నిక్కడ ఎందుకు నిలబడమందిʹʹ అని అడిగింది. మొహం చిన్న బుచ్చుకొని అడుగుతున్న హిమ కళ్లలోకి చూస్తూ, ʹʹనువ్వు పెద్ద మనిషవయ్యావే. మీ అమ్మకేమీ తోచడం లేదు. అందుకే అలా ఉంది అదిʹʹ చెప్పింది.

ʹʹఅంటే, సుధక్కలాగానాʹʹ ఏదో అర్థమయినట్లుగా అంది హిమ.

రెండు నెలల క్రితం స్కూలుకెళ్లడం కోసం పక్కింటి సుధక్కను పిలవడానికి వెళితే వాళ్లు నానమ్మ ʹʹసుధ పెద్దమనిషయింది స్కూల్‌కి రాదుʹʹ అని చెప్పింది. కొన్ని రోజులు స్కూలుకు రాలేదు సుధ. ఆ తర్వాత వాళ్లింట్లో పెద్ద వేడుక జరిగింది. సుధకి పట్టుచీర కట్టి పూల జడవేసి ఎంత బాగా వేడుక చేసారో. తనకెంత ముచ్చటేసింది. అంటే తనక్కూడా అలాగే చేస్తారా. కానీ అమ్మో తను కూడా అన్ని రోజులు స్కూల్‌ మానేయాలా? తనక్కూడా అలాగే చేస్తారా అనుకుంది హిమ. ʹʹనానమ్మా అయితే నన్ను కూడా స్కూల్‌కి పంపించరాʹʹ అంది హిమ. భర్తను, పిల్లలనూ ఆఫీస్‌కి, స్కూల్‌కి పంపించి వేసి, హడావిడి చేయసాగింది మాధవి. ఆ వీధివాళ్లు ఒక్కొక్కరు రాసాగారు. వచ్చిన ప్రతివాళ్లతో నిండా పధ్నాలుగేళ్లు లేవు. అప్పుడే మొదలయింది వెధవగోల అంటూ విసుగ్గా చెప్తోంది మాధవి. ఓ గంటలో అందరూ వెళ్లిపోయాక దేన్నీ తాకకుండా నువ్వీ గదిలోనే కూర్చోవాలి. హిమతో చెప్పి, తను కూడా అదే గదిలో కూర్చుంది వాళ్ల నానమ్మ. ఆ గదిలోనే హిమకు అన్నపానీయాలు జరిగిపోయాయి. బాత్‌రూమ్‌కు వెళ్లాలన్నా నానమ్మకి చెప్పి ఆమెను తోడు తీసుకొని వెళ్లాల్సి వచ్చింది.

ʹʹపదకొండు రోజులే కదా ఈ బాధ అనుకొందిʹʹ హిమ.

అతి కష్టంగా సాయంత్రమయింది. స్కూల్‌ నుండి హిమ తమ్ముడు బాబు వచ్చాడు.

ʹʹఈ గదిలో నీకు పనేంటి, వెళ్లుʹʹ అంటూ గదిమింది సుందరమ్మ.

ʹʹఅక్కేంచేస్తుంది గదిలో. స్కూలుకెందుకు రాలేదు?ʹʹ అడిగాడు బాబు.

ఆ సంభాషణ వింటున్న హిమకి బాధనిపించింది.

తమ్ముడ్ని దగ్గరికి రానిస్తే ఏమవుతుంది అనుకుంది.

మెల్లమెల్లగా కిటికిలో నుండి పిల్లల గోల వినిపించడం మొదలయింది.

నిన్నటి దాకా తను కూడా ఆ గుంపులో చేరి ఆటలాడిందే కానీ ఈ రోజు ఈ గదిలో బందీ అయింది. ఉదయం నుంచే ఆ గదిలో మూలన కూర్చొని విసుగనిపించింది. ఒక్కసారి వీథిలోకెళితే అనుకొంది మనసులో హిమ.

ʹʹనాన్నమ్మా ఒక్కసారి వీథిలోకెళ్లనా?ʹʹ ఆశగా అడిగింది.

ʹʹఏమిటీʹʹ వీథిలోకెళతావా ఇంకేమైనా ఉందా, పదకొండు రోజుల వరకూ ఈ గది దాటి కాలు బయట పెట్టకూడదుʹʹ ఖచ్చితంగా చెప్పింది సుందరమ్మ.

ʹʹవిసుగ్గా ఉంది నాన్నమ్మాʹʹ దీనంగా అడిగింది హిమ.

ʹʹఅయినా తప్పదు తల్లీ, ఏ ఆడపిల్లకయినా తప్పదు కదా ఈ నియమంʹʹ కాస్త లాలనగానే చెప్పింది నాయనమ్మ. ముసలావిడ కాస్త లాలనగా మాట్లాడేసరికి ధైర్యం వచ్చి ʹʹనానమ్మాʹʹ గదిలో కూర్చోకుండా రోజులాగే ఆటలాడుతూ ఉంటే ఏమవుతుంది అడిగింది హిమ.

ʹʹఅయ్యో! అలా చేస్తే తప్పమ్మా. దేవుడికి కోపం వస్తుందిʹʹ చెప్పింది సుందరమ్మ. ఇంకేం మాట్లాడకుండా ఉండిపోయింది హిమ. ఈ పదకొండు రోజులెప్పుడు గడుస్తాయో అనుకుంది మనస్సులో. ఇంతలో హిమకి వాళ్ల నాన్నగారి గొంతు వినిపించింది. తనను పలకరించడానికి నాన్న వస్తాడేమో అనుకుంది, హిమ కానీ నాన్న రాలేదు, నాన్న తెచ్చిన పళ్లు తీసుకొని అమ్మ వచ్చింది.

ʹʹఇదిగో నాన్న తెచ్చారు తినవేʹʹ అంటూ పళ్లక్కడ పెట్టి వెళ్లిపోయింది మాధవి. హిమకు బాధేసింది. నాన్న కూడ రాడన్నమాట అని దిగులుగా అనుకుంది. అప్పుడనిపించిదామ్మాయికి, పదకొండు రోజులు పదకొండు యుగాల్లా గడుస్తాయోమోనని.

పదిహేను రోజుల తర్వాత స్కూల్లో అడుగు పెట్టింది హిమ, స్కూలేమీ మారలేదు. స్కూల్‌ టైమింగ్స్‌ మారలేదు. టీచర్లు మారలేదు. కానీ క్లాస్‌రూం వైపు వెళ్తున్న హిమను చూసిన ఆడ మగ పిల్లల చూపుల్లో మాత్రం మార్పొచ్చింది. చాలమంది పిల్లలు హిమను వింతగా చూడసాగారు. కానీ అవేమీ పట్టించుకోకుండా, క్లాస్‌ రూం వైపు వెళ్లింది హిమ. ప్రేయర్‌ అయ్యాక ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. టీచర్‌ వచ్చి అటెండెన్స్‌ వేసుకోసాగారు. తన అటెండెన్స్‌ చెప్పిన హిమవైపు టీచర్‌ కుతూహలంగా చూసి ʹʹస్టాండప్‌ʹʹ అన్నారు. లేచి నిలబడింది హిమ.

ʹʹఇన్ని రోజులు స్కూలుకు ఎందుకు రాలేదుʹʹ అడిగాడు. ఒక్క క్షణం బిత్తరపోయింది హిమ. ʹʹఏమని చెప్పాలి నిజమెలా చెప్పడంʹʹ అనుకుంది. జరిగిన విషయం అందరి ముందు చెప్పకూడదనే భావం ఆ పసి మనసులో అప్పుడే ముద్రపడి పోయింది. ʹʹజ్వరం వచ్చింది సార్‌ʹʹ తడబడుతూ చెప్పింది.

ʹʹఏం జ్వరం పదకొండు రోజుల జ్వరమాʹʹ అడిగాడాయన. ఆయన పెదవులపై కనిపించని నవ్వు. క్లాసంతా గొల్లుమంది. సిగ్గుతో తలదించుకుంది హిమ ఒక రోజంతా క్లాసులో మూడీగా ఉండిపోయింది హిమ.

ఎప్పుడెవరు ఎగతాళి చేస్తారో అని జంకుతూనే ఉండిపోయింది.

సాయంత్రం స్కూల్‌ అవగానే ఇంటికొచ్చిన హిమకి వాళ్లన్నయ్య శ్రీను ఫ్రెండ్స్‌ ముందు గదిలో కనిపించారు. వాళ్లంతా ఒకే కాలేజీలో చదువుతున్నారు. వాళ్లను చూడగానే అందర్నీ పేరు పేరునా పలకరించింది. ʹʹఈ మధ్య మా ఇంటికి రావడం లేదే. మీకు ఎగ్జామ్స్‌ ఎప్పటి నుండిʹʹ అంటూ అదీ ఇదీ మాట్లాడుతోంది.

ఇంతలో లోపల నుండి శ్రీను వచ్చి ʹʹమీరందరూ వెళ్తు ఉండండిరా, నేనిప్పుడే వస్తానుʹʹ అని వాళ్లని పంపించి, హిమ వెనకాలె లోపలికి వచ్చి ʹʹవాళ్లతో నీకు మాటలేంటేʹʹ అన్నాడు కటువుగా.

ʹʹఅదేంటి వాళ్లు నీ ఫ్రెండ్సె కదా, నేనెప్పుడు వాళ్లతో మాట్లాడుతూనే ఉంటాను కదాʹʹ అంది.

ʹʹఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు. వాళ్లు నీతో మాట్లాడుతారు. మళ్లీ నీ వెనకాలే కామెంట్స్‌ చేస్తారు తెల్సాʹʹ అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు.

అన్నయ్యేమిటీ ఇలా మారిపోయాడు. నాతో కొత్త మనిషిలా ప్రవర్తిస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నన్నేడిపిస్తునో కబుర్లు చెప్తునో నా వెనకాలె తిరిగేవాడు. ఇప్పుడు ఏదో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడు. ఏమిటీ మార్పుకు కారణం అని ఆలోచిస్తూ టైం చూసి అరే అప్పుడే ఐదు దాటిందే. పది రోజులుగా ట్యూషన్‌కు వెళ్లటం లేదు. ఈ రోజయినా వెళ్లాలి అనుకుంది. గబగబా మొహం కడుక్కొని డ్రస్‌ మార్చుకొని బుక్స్‌ తీసుకొని ట్యూషన్‌కు బయలుదేరింది హిమ.

ʹʹఎక్కడికే మళ్లీ బయల్దేరావుʹʹ ఆరా తీస్తూ అడిగింది సుందరమ్మ.

ʹʹఇంకెక్కడికి ట్యూషన్‌కిʹʹ విసుగ్గా చెప్పింది హిమ.

ʹʹఏంటీ ట్యూషన్‌కెళ్తున్నావాʹʹ ఆశ్చర్యంగా అంది సుందరమ్మ.

ʹʹఏంటీ, ఈరోజేదో కొత్తగా ట్యూషన్‌కెళ్తున్నట్టు ఆశ్చర్యపోయి చూస్తున్నావు?ʹʹ అంది హిమ.

ʹʹఇదిగో అమ్మాయ్‌. ఈ పిల్ల ట్యూషన్‌కెళ్తానంటూ బయల్దేరిందేʹʹ లోపలున్న కోడలికి కేకేసి చెప్పింది సుందరమ్మ.

లోపలి నుండి హడావుడిగా మాధవి వచ్చి ʹʹఏంటీ, ట్యూషన్‌ కెళ్తున్నావాʹʹ అని అంది.

ʹʹఅవునమ్మా ఇప్పటికే పది రోజులయింది. సిలబస్‌ చాలా అయిపోయింది. ఇంక ఈ రోజు కూడా వెళ్లకపోతే ఎలా?ʹʹ అంది హిమ.

ʹʹవద్దు హిమా.. నువ్వింక ట్యూషన్‌కు వెళ్లద్దుʹʹ అంది మాధవి.

మళ్లీ ఆశ్చర్యపోయింది హిమ, ʹʹట్యూషన్‌కెళ్లదంటారేంది. నాకసలే క్లాసులో లెక్కలు అర్థం కావడం లేదు. ట్యూషన్‌ కూడా వెళ్లకపోతే తప్పు తాను తెల్సాʹʹ గట్టిగా అంది హిమ.

ʹʹఅయినా సరే నువ్వు ట్యూషన్‌కెళ్లద్దు, అసలే నువ్వు ట్యూషన్‌కెళ్లేదారి మంచిది కాదు. నువ్వు ట్యూషన్‌ నుంచి పొద్దుపోయి వస్తావు. ఆ దారిలో అందరూ పోకిరి వెధవలుంటారు. అసలే రోజులు బాగా లేవుʹʹ చెప్పింది మాధవి.

ʹʹనేనీ రోజు కొత్తగా వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారే, నేను సంవత్సరం నుండి వెళ్తున్నాను కదాʹʹ

ʹʹఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. చెప్పింది విను ఇంట్లో కూర్చుని చదువుకోʹʹ ఖచ్చితంగా చెప్పింది మాధవి.

ʹʹఇన్ని రోజులు లేనిది ఇప్పుడేం వచ్చిందా. నువ్వు బాగానే చెప్తవ్‌ ఇంకో కూర్చొని చదువుకోమని. నేనలా చదువుకోలేను. నేను ట్యూషన్‌ కెళ్తానుʹʹ అంది మొండిగా హిమ.

ʹʹహిమా.. మొండిగా వాదించక చెప్పింది విను. ఇన్నిసార్లు చెప్పించుకోవడానికి నువ్వేమైన చిన్న పిల్లవా?ʹʹ కోపంగా అంటూ లోపలికెళ్లింది మాధవి.

ఇన్నాళ్లూ నాన్నమ్మా ముందు ప్రతిదానికి చిన్నపిల్ల అంటూ వెనకేసుకొచ్చే అమ్మా ఉన్నట్టుండి నువ్వేమన్నా చిన్నపిల్లవా అని ప్రశ్నించేసరికి ఏం మాట్లాడాలో తోచలేదు హిమకు. అమ్మ మాట కాదని వెళ్తే ఆమెకు కోపం వస్తుందని భావించి ఆ రోజు వెళ్లటం మానుకుంది. కానీ ʹనాన్న రాని మీ పని చెప్తానుʹ అని అనుకొని ముందు గదిలో ఆలోచిస్తూ కూర్చుంది.

ʹʹఏమ్మా అలా కూర్చున్నావ్‌, హోం వర్క్‌ లేదాʹʹ అనే తండ్రి పలకరింపుతో ఆలోచనల నుండి బయటపడింది.

వెంటనే ʹʹఅమ్మ నన్ను ట్యూషన్‌ మానెయ్యమంది నాన్నʹʹ చెప్పింది హిమ.

ʹʹఏం ఎందుకు మానేయమంది?ʹʹ ఆశ్చర్యంగా అడిగాడు వాళ్ల నాన్న.

ʹʹఏమో అమ్మనే అడుగుʹʹ అంది హిమ.

అంతలో అక్కడికొచ్చిన భార్యతో ʹʹహిమను ట్యూషన్‌కెళ్లద్దన్నావట. ఎందుకు?ʹʹ అని అడిగాడు.

హిమకు లోపల చాలా సంతోషమేసింది. ʹʹనాన్న నీ పని పడ్తాడులేʹʹ అనుకుంది మనసులో.

ʹʹఅవునండీ, ట్యూషన్‌కెళ్లే దారిలో పోకిరి వెధవలుంటారు. అదేమో రోజూ పొద్దుపోయి వస్తుంది కదా. ఇన్ని రోజులంటే చిన్న పిల్ల అనుకున్నాం. ఇప్పుడలా కాదు కదా. ఈడొచ్చిన పిల్ల కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది కదాʹʹ అంది మాధవి.

హిమకు ఆమె మాటలు సగం అర్థం కాలేదు. కానీ విశ్వనాథ్‌ మాత్రం భార్య మాటలు సబబే అన్నట్టు తల పంకించాడు.

ʹʹఅమ్మ చెప్పింది నిజమే కదమ్మాʹʹ అన్నాడు హిమతో.

ʹʹఏంటీ నాన్నా నువ్వు కూడా, నాకు లెక్కలు సరిగా రావు నాన్నా. ట్యూషన్‌ లేకపోతే ఎలాగʹʹ ఏడుపు గొంతుతో అంది.

ʹʹదగ్గర్లో ఎవరైనా ట్యూషన్‌ మాస్టర్‌ దొరుకుతాడేమో నేను చూస్తాలేమ్మాʹʹ ప్రేమగా చెప్పేడు విశ్వనాథ్‌.

ఇక సమాధానపడక తప్పలేదు హిమకి. లేచి హోంవర్క్‌ చేయడంలో నిమగ్నమయింది. రాత్రి తొమ్మిది గంటలయింది. ఏదో చదువుకుంటున్న హిమకు నిద్ర ముంచుకువస్తోంది. ఇక లాభం లేదని పుస్తకాలు కట్టిపెట్టి లేచి పడుకోవడం కోసం మంచం దగ్గరకు వెళ్లింది.

అప్పటికే ఆ మంచంలో బాబు ముసుగు తన్ని పడుకొని నిద్రపోతున్నాడు.

తనూ పడుకోవడం కోసం దిండూ, దుప్పటి సర్దుకోసాగింది హిమ.

ఇంతలో మాధవి వచ్చి ʹʹహిమ నువ్వేళ్లి నాన్నమ్మా దగ్గర పడుకోʹʹ అని చెప్పింది. నాన్నమ్మ దగ్గర పడుకోవడమంటే హిమకు చిరాకు. ఎందుకంటే ఆవిడ పెద్దగా గురకపెడుతుంది. అందుకే తను నాన్నమ్మ దగ్గర పడుకోదు. వాళ్లమ్మ ఎప్పుడూ పడుకోమని చెప్పదు. అలాంటిది ఈరోజు వాళ్లమ్మ అలా చెప్పేసరికి ఆశ్చర్యం, కోపం ఒకేసారి కల్గాయి హిమకు.

ʹʹనాన్నమ్మ దగ్గర పడుకోవాలా? ఎందుకు?ʹʹ అడిగింది హిమ.

ʹʹఎందుకు.. ఏమిటి అని అడగటం మాని చెప్పింది చెయమ్మాʹʹ బతిమిలాడినట్టుగా చెప్పింది మాధవి.

ʹʹనేను పడుకోను. నేనిక్కడే పడుకుంటాʹʹ ఖచ్చితంగా చెప్పింది హిమ చెప్పింది.

ʹʹఅర్థం చేసుకోవే, ఇన్ని రోజులు చిన్నపిల్లవు కాబట్టి ఫర్వాలేదు. ఇప్పుడు పెద్దదానివయ్యావు కదా, మగపిల్లల పక్కన పడుకుంటానంటే ఎలా, వెళ్లి నాన్నమ్మా దగ్గర పడుకోʹʹ విసుగ్గా చెప్పింది మాధవి.

హిమకు ద్ణుఖం కోపం కసి ఒకేసారి తన్నుకొచ్చాయి.

ʹʹనేనెవరి దగ్గర పడుకోను, ఒక్కదాన్నే పడుకుంటానʹʹని చెప్పి చాప, దుప్పటి తీసుకొని విసురుగా హాల్లోకి వెళ్లి పెద్ద చప్పుడుతో చాప పరుచుకొని పడుకుంది హిమ.

ʹʹచూశారా ఈ పిల్ల ఎంత మొండిగా తయారవుతుందో చెప్పిన మాట ఒక్కటీ వినడం లేదు. మాటకు మాట బదులిస్తోంది. హాల్లో ఒక్కర్తే పడుకుంటే భయపడితే.. అయినా నాకేం, ఈ రోజు భయపడితే రేపు చెప్పినట్టు వింటుందిʹʹ అని అంటున్న తల్లి మాటలను హిమ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

హిమ పడుకొని ఆలోచిస్తోంది. పాపం హిమ. తన ప్రమేయం లేకుండానే జరిగిన మార్పు తన జీవితాన్ని ఇంత ప్రభావితం చేస్తుందనుకోలేదు.

ఆమె కనురెప్పల మీద నుండి నిద్ర ఎగిరిపోయింది.

క్లాస్‌లో టీచర్‌ ఎగతాళి మాటలు, అన్నయ్య ముభావ ప్రవర్తన, ఇన్నాళ్లు చిన్నపిల్ల అని మాట్లాడిన అమ్మానాన్నలు ఇప్పుడు పెద్దదానివై పోయావనడం, తమ్ముడితో కూడా సన్నిహితంగా ఉండనీయకపోవడం.. ఎందుకు వీళ్లలా ప్రవర్తిస్తున్నారు అనుకుంది.

పదిహేను రోజుల క్రితం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి వీళ్లందరి తీరే మారింది. అయినా అది ఆడవాళ్లందరికి సంభవించేదే అని చెప్పిందే నాన్నమ్మా. ఆడవాళ్లందరికీ మల్లే నాకూ జరిగినప్పుడు దాన్నో వింతలాగా ఎందుకు చూస్తున్నారు. ప్రకృతి సహజంగా సంభవించే ఒక చిన్న మార్పుకు వీళ్లెందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పైగా మాటిమాటికీ నువ్వు మునుపటిలా కాదు ఇప్పుడు వేరు అంటున్నారు, నేనేమీ మారలేదు, ఎప్పలాగే ఉన్నాను. అయినా మార్పు నాలో కాదు. వీళ్లందరిలోనే, వాళ్ల మాటల్లోనే, వాళ్ల చేతల్లోనే మార్పొచ్చింది అనుకుంది. ఆలోచిస్తున్న కొద్దీ హిమకి దేనిమీదో కసి పుడుతోంది.

(ఈ కథ అరుణతారకు వచ్చింది. రచయిత పేరు, కథ పేరు కూడా రాయలేదు. అందుకని ʹమార్పు ఎవరిలోʹ అనే పేరు పెట్టాం. రచయిత ఈ సైట్‌ చూసి స్పందిస్తారని ఆశిస్తున్నాం...విరసం.ఒఆర్‌జీ టీం)






No. of visitors : 373
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
  Self mortality
  దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
  నుల్క‌తోంగ్ నిజాలు
  అప్పుడు
  ఎలా కలవాలి ?
  నిన్న- నేడు - రేపు
  జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
  ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
  మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
  దేశద్రోహ నేరం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •