జ్ఞాపకాల తలపోత: పృథ్వీ... అమ్మల కోసం వచ్చెయ్‌

| సంభాషణ

జ్ఞాపకాల తలపోత: పృథ్వీ... అమ్మల కోసం వచ్చెయ్‌

- నల్లూరి కాంతి | 17.04.2017 11:37:06am

పచ్చగా విరుస్తోన్న బతుకు పాట
అసంపూర్ణంగా
ఏ పరిక్కంపకి చిక్కుకుపోయింది?
సూటిగా సాగుతోన్న పసి పాదముద్ర
అర్థాంతరంగా
ఏ శూన్యంలోకి చెదిరిపోయింది
రివ్వున ఎగురుతోన్న ఎర్రని జెండా
ఆశ్రుకణంగా
ఏ శీతలత్వంలోకి ఒదిగిపోయింది?

పృథ్వీ... పృథ్వీ...
ఎందుకిలా తండ్రి?

నా చుట్టూ పారాడిన నీ పసితనం
పచ్చి జ్ఞాపకమై
నన్ను పదే పదే పొలమారుస్తోంది
నన్ను అల్లుకుపోయిన నీ ఊసులు
కలల్లో సైతం
నన్నుకుదిపి కలవరపెట్టేస్తున్నాయి

పృథ్వీ!
సార్థక నామధేయుడివి నీవు
భూమిని ప్రేమించావ్‌
భూమై బతికే ప్రజలను ప్రేమించావ్‌
ఇప్పుడు చుట్టూ నీవే
చుట్టేసుకుంటూ నీవే!

జ్ఞాపకాలు ఇంతగా వేధిస్తాయని
జ్ఞాపకాలు ఇంతగా వెంటాడతాయని
తొలిసారిగా తెలిసొస్తుంది

*** *** ***

పృథ్వీ!

ఈ రోజు ఉదయాన్నే ఐదు గంటలకు కల్లోకి వచ్చావయ్యా. ʹకాంతత్తా ఇంకా పడుకున్నావేంటి?ʹ అని పిలిచినట్లై ఉలిక్కిపడి లేచాను. చుట్టూ చూశాను నువ్వు కనిపించలేదయ్యా. నువ్వు లేవని అనుకోవడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. మా నాన్న మరణం తర్వాత ఎవరి జ్ఞాపకాలు నన్ను ఎక్కువ కాలం వెంటాడలేదు. కన్నీళ్ళని తెప్పించలేదు. ఇప్పుడు తిరిగి నీ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. కన్నీళ్ళని తెప్పిస్తున్నాయి. పృథ్వీ... పృథ్వీ! నీ జ్ఞాపకాలు ప్రతీక్షణం వెంటాడుతున్నాయి. చిన్నప్పటి నీ ఒక్క పల్చని రూపమే కనిపిస్తుందయ్యా. ʹరుʹపకలేని నీ మాటలే వినిపిస్తున్నాయయ్య. బడి నుండి వచ్చి మెట్ల మీద కూర్చొన్న పృథ్వే కనిపిస్తున్నాడయ్యా. ఉదయాన్నే నిద్రలేపి జి.కె. భుజాన వేసుకొని బాత్‌రూమ్‌ దగ్గర దింపే లోపల మెడచుట్టే చెయ్యేసి నిద్రపోయే నీ రూపమే కనిపిస్తుందయ్యా అప్పుడు బక్క పల్చని పసివాడ్ని భుజాన వేసుకొని బాత్రూమ్‌ దగ్గర దింపితే ఇప్పుడు మావోయిస్ట్‌గా ఎదిగిన నీ బక్కపల్చని దేహాన్ని భూమిలోకి దింపుతోన్న దృశ్యమే మెదడును పిండెస్తుందయ్యా. బాక్సులో నిర్జీవంగా ఉన్న నిన్ను చూడగానే చిన్నప్పటికన్నా బక్కగా ఉన్నాడనుకున్నాను. మనిషి ఒక్కే గానీ ఆశయం మాత్రం మోయలేనంతదని పక్కనున్న మిత్రులతో అన్నాను.

ఏమాత్రం బరువులేని నీ కాళ్ళను అమ్మమీద వేసి నిద్రపోతున్న నీ రూపమే కనిపిస్తుందయ్యా. చలనం లేని నీ బక్క పల్చని దేహాన్ని తడిమి, తడిమి ʹనా బిడ్డ ఎంత సన్నగా ఉన్నాడో, పది కేజీల బరువు కూడా ఉండడు కదూ?ʹ మీ అమ్మ ప్రశ్నలే గుర్తుస్తున్నాయి. పృథ్వీ! బరువైతే లేవుకానీ ఎంతో బరువైన ఆశయాన్ని ʹఅమ్మకిʹ, అమ్మలాంటి తల్లులకీ మిగిల్చి వెళ్ళిపోయావా? ʹపృథ్వీకి క్యారెంబోర్డంటే ఇష్టం కానీ రెండొందలు లేక కొనలేకపోతున్నాʹనన్న అమ్మ వేదన అప్పుడు నా కర్థం కాలేదు పృథ్వీ. కన్నీటితో నిన్ను సాగనంపిన తర్వాత ʹనా బిడ్డను సరిగ్గా సాకలేకపోయానేమో కాంతీ, ఇక్కడే ఉంటే నా బిడ్డ నా దగ్గరే ఉండేవాడేమో, నాకు దూరమయ్యేవాడు కాదేమోʹ అంటూ విలపిస్తోన్న నీ తల్లి కడుపుకోత, ఆవేదన, అసహాత్వం ఇప్పుడు నాకర్థమైందయ్యా! అమ్మ బాధను, వేదనను, ద్ణుఖాన్ని ఓదార్చగల శక్తి నీకే ఉందయ్యా. పృథ్వీ! అమ్మని ఓదార్చవా! మోయలేని ద్ణుఖాన్ని నీచేత్తో తీసేయవా!

పృథ్వీ... పృథ్వీ...! అంత మందుండి ఎందుకు చేసారమ్మా ఇంత చిన్న తప్పు? పాము చిన్నదైనా కాని కర్ర పెద్దది కావాలికదమ్మా. నాగుపాములాంటి శత్రువుని అంత తక్కువగా అంచనా వేసారెందుకు? అలక్ష్యానికి మూల్యం ఇంత ద్ణుఖమా? అమ్మలాంటి ఎంతోమంది తల్లుల కడుపు కోతల బాకీలను ఎప్పటికి తీర్చుకోగలం? ఎంతని వాళ్ళని ఓదార్చగలం?

ప్రియమైన కామ్రేడ్‌!
నీకిష్టమైన ఎర్ర నక్షత్రం టోపీ పెట్టుకొని
మళ్ళీ ఫార్మేషన్‌లోకి వచ్చేయ్‌
అమ్మకోసం
అందరి కోసం
ఎదురుచూస్తూ
నీ కాంతత.

జ్ఞాపకాలు ఇంతలా మెలి తిప్పేస్తాయని
జ్ఞాపకాలు ఇంతగా కలతబారుస్తాయని
ఇప్పుడే అనుభవంలోకి వస్తోంది.

పృథ్వీ... పృథ్వీ...
ఏమైందమ్మా?

నీ బక్కపల్చని రూపం
గుండెల్ని బరువెక్కిస్తుంది
బరువైన ఆశయాన్నిస్తుంది
చిన్నప్పుడు ʹరుʹ పలకలేని నీ భాషన
ఇప్పుడు మా నిఘంటువులుగా భద్రపర్చుకుంటున్నాం

పృథ్వీ!
అమ్మ ఒడిలోంచి
మరుపు మట్టిలోకి
ఎప్పుడు దొర్లిపోయావ్‌?
అడవి ఫార్మేషన్‌లోంచి

అజాగ్రత్తలోకి
ఎందుకు తుళ్ళిపోయావ్‌?

పసిపిల్లోడివి
పిలుపు అందనంత దూరానికి
ఎందుకెళ్ళిపోయావ్‌?

(బెజ్జంకి ఎన్‌కౌంటర్‌ అమరుడు పృథ్వీ (మున్నా) జ్ఞాపకాలతో)

No. of visitors : 387
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి -2018
  Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
  ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
  కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
  బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
  హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
  ఇప్పుడు
  నిలబడి తీరాల్సిన దారుల్లో...
  ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
  ఈ పక్షం బుల్పికలు!
  హ‌క్కులపై ఉక్కుపాదం
  పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •