ʹఆవాజ్ʹ సందర్భం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ʹఆవాజ్ʹ సందర్భం

- పి.వరలక్ష్మి | 17.04.2017 11:52:12am


మతం లేని సమాజం కోసం

మూడేళ్ళుగా నా మనోప్రపంచాన్నంతా ఆవరించిన ఉద్విగ్నత అప్పుడప్పుడూ ఇలా శకలాలుగా వ్యక్తమయింది. రచయితగా మరణించాను అని ఒక రచయిత ప్రకటించినప్పుడు, ఒక మేధస్సు తుపాకీగుళ్ళకు ఎర అయినప్పుడు, ఒక ప్రశ్న ఊపిరి ఆగినప్పుడు, ఒక చలనం ఉరితాటి కొసన అంతమైనప్పుడు నిలవనీయని మనసు, నిద్రనివ్వని రాత్రులతో ఇలా మాట్లాడింది. ఇది కదా వాస్తవం! ఇలా కదా మాట్లాడాలి! చెవులు చిల్లులు పడేలా ఆ అసంబద్ధ అరుపులేమిటి? ఇంత విశృంఖలంగా అపద్ధాల ఊరేగింపేమిటి? నోరులేని ఆవునడ్డం పెట్టుకుని నెత్తురు పారిస్తున్నప్పుడు, కులం ఆధునికతను గేలిచేస్తూ జడలు విప్పి ఆడుతున్నప్పుడు అనాల్సిన నాలుగుమాటలన్నా అనాలని మాత్రమే కాదు. ఈ స్థితినెలా అర్థం చేసుకోవాలి అనే వెతులాటలో వేసుకున్న ప్రశ్నకు మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం ఆలంబనగా చేసిన ఆలోచనలు ఇవి. (ఈ సమయంలోనే తూర్పు, మధ్యభారతాల, అకుపచ్చని కలల గుండె గాయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తర్వాత తప్పకుండా మాట్లాడతాను.)

మతంతో కలగలిసిన జాతీయత ఇక్కడ పాలకవర్గాలకు అందివచ్చిన పనిముట్టు అయి దేశభక్తి ఫాసిస్టు బుసలు కక్కుతున్నప్పుడు చరిత్రకు మసకలు కమ్మి కశ్మీర్‌ ‌గాయం శ్రవిస్తున్నది. అక్కడ హక్కులు, ఆకాంక్షలే కాదు, చరిత్ర నిషిద్ధం. కశ్మీర్‌ ఎన్నడూ భారదేశంలో అంతర్భాగం కాదు. ఈ నిజం మాట్లాడకుండా, కశ్మీరు దుఃఖిత సమూహాన్ని ఆలింగనం చేసుకోకుండా మన ఆకాంక్షలను, మన గాయాల తలపోతలను మాత్రమే ఎలా గానం చేయగలం? కాని మన దేశంలో కశ్మీర్‌ ఎం‌త దుఃఖిత ఒంటరి సమూహమో భారతపాలకవర్గ రాజనీతి వల్ల అంత పాపభారాన్ని మోస్తున్న సమాజం. దుఃఖమూ నేరమైన నిషిద్ధ నేల అది. ఎవరో ఒకరు మాట్లాడక పోతే ఎలా? ఆజాదీకి నిజమైన అర్థం చెప్పకపోతే ఎలా? దేశభక్తి పెల్లెట్‌ ‌పోట్లు పొడుస్తున్నప్పుడు మనమైనా ʹదేశద్రోహులʹ పక్షాన నిలవకపోతే ఎలా? కశ్మీర్‌ ‌గురించి వాస్తవాల మూటను విప్పాలి. అలా మాట్లాడుతూ మొత్తంగా మనిషి మీద సామ్రాజ్యవాదం చేపట్టిన యుద్ధం గురించీ మాట్లాడాను. ఈ సంక్షుభిత సమయాన వెలుతురు రేఖ వంటి ప్రజల ప్రతిఘటన గురించీ మాట్లాడాను. అన్నీ కలిపి ఇలా ఈ పుస్తక రూపంలో పంచుకోవాలనిపించింది.

అగ్రకుల ఆధిపత్య హిందూ జాతీయవాద శక్తులు రామజన్మభూమి వివాదాన్ని తీసుకున్నప్పటి నుండి చోటుచేసుకున్న పరిణామాల మీద ప్రగతిశీల శిబిరం నుండి ఎప్పటికప్పుడు అనేక స్పందనలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 2013 ముజఫర్‌నగర్‌ ‌నుండి వివిధ ఘటనల క్రమం చూస్తే ఆర్‌.ఎస్‌.ఎస్‌, ‌బి.జె.పి, వాటి పరివారానికి సంబంధించిన భిన్న ముఖాలు వాటి అంతస్సారంతో సహా గోచరమవుతాయని ఈ వ్యాసాలను పేరుస్తున్నప్పుడు అనిపించింది.

ఈ పుస్తకం గురించి ఆలోచిస్తున్నప్పుడే భారతదేశంలో పెద్దనోట్లు రద్దై సామాన్యుల జీవితాలూ బ్యాంకు ముంగిట్లో రద్దవుతున్నాయి. నల్లధనంపై, తీవ్రవాదంపై సంచలనాత్మక, చారిత్రక అస్త్రమని నమో స్మరణతో పల్లకీ మోసిన మీడియా దేశప్రజలకు భవిష్యత్తు బంగారమని చెప్తున్నది. ఈ హొరు వెనక మోడీ కార్పొరేట్‌ ‌పెట్టుబడికి బంగారు భవిష్యత్‌ను నిర్మిస్తున్నాడు. తమ కష్టార్జితాన్ని బ్యాంకు కుప్పల్లో పోసి బిచ్చగాళ్ళైన ప్రజల దుర్భర వేదనతో కలిసి నిస్సహాయత నిలువెల్లా గడ్డకట్టింది. ఇది చారిత్రకమే! సంచలనాత్మకమే! గుప్పెడు పెట్టుబడిదార్ల కోసం ప్రభుత్వం కోట్లాది మంది జనాన్ని వీధులపాలు చేసినా చప్పుడు లేకపోవడం! తమ నిర్ణయానికి బ్రహ్మాండమైన మద్దతు లభించిందని మంత్రులు ప్రకటించగలిగారు. ఇది నిజం కాదు. అలాగని పూర్తిగా అపద్ధమూ కాదు.

నిజంగానే మంచి జరగబోతోందని ప్రజలు నమ్మారు. అది నిజం కాదని మెల్లగా అర్థమయినప్పటికీ ఇక చేయడానికేం లేదు అనుకునే స్థితి. నరేంద్ర మోడీ అనే ఒక్క వ్యక్తి (ఆయన తన నిర్ణయాన్ని మంత్రులకు కూడా చెప్పలేదట!) చిత్తశుద్ధితో అవినీతిని అరికట్టి పెద్దల సొమ్మ ప్రజలకు పంచి ఇస్తాడని ఎవరైనా ఎలా నమ్మగలరు? పాలకులు మేలు చెయ్యరని, ఆ మాటకొస్తే అసలు వాస్తవాలు కూడా చెప్పరని జనం కామన్‌ ‌సెన్స్‌లో ఉంటుంది కదా! అయినా ఆకర్షిణీయమైన నినాదాలకు, అందమైన మాటలకు లోబడుతూ ఉంటారు కూడా. ఏదో చిన్న ఆశ నడిపిస్తుంటుందేమో. ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తప్ప మరి దిక్కు లేని స్థితి గోచరిస్తూ ఉంటుందేమో.

ఏ నినాదం బాగా ఆకర్షిస్తుంది, ఏ భావావేశానికి జనం ఎక్కువ లోనవుతారు అనే అంచనాలు పాలకవర్గం వేస్తూ ఉంటుంది. అధికారంలోకి రావడానికి, వచ్చాక దోపిడి వర్గాలకు అవసరమైన విధానాలు అమలు చేయడానికి నిరంతరం అది కసరత్తులు చేస్తుంది. బి.జె.పి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడానికి, వచ్చాక తన విధానాలు ఆమోదింపజేసుకోడానికి అది చేసిన భావజాల ప్రచారం భారతదేశ చరిత్రలోనే తీవ్రమైనది. మెజారిటీ మతాన్ని, కులాన్ని, అభివృద్ధి అనే ఆకర్షణను అది వాడుకున్న తీరు, తిరుగులేని శక్తిగా అవతరించాలని చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యానికి చావు దెబ్బలు వేస్తేనేం, అది పనిచేస్తున్నది. అదే ఫాసిజాన్ని తిరిగి రంగం మీదికి తెస్తున్న ఇప్పటి విషాదం. అది ప్రజాస్వామికవాదుల్ని లక్ష్యం చేసుకుంటోంది. అంతకంతకూ ఆత్మరక్షణలోకూడా పడవేస్తోంది. ఈ మూడు నాలుగేళ్ల పరిణామాల్లో ఏమేం చేశారో చూడండి. బీఫ్‌ ‌రాజకీయాలు మొదలుకొని హేతువాదుల మీద, రచయితల మీద దాడులు, రోహిత్‌ ‌వేముల ఆత్మహత్య దాకా దుర్మార్గాలకు సమ్మతి పొందగలిగే భావజాలాన్ని వ్యాపింపజేశారు. దేశభక్తి నినాదాన్ని భిన్నాభిప్రాయంపై దాడిగా మలచారు. ముస్లిం వ్యతిరేకత అనే అలవాటైన పాత మత జాతీయవాద భావనకు తోడు ప్రభుత్వాన్ని, అగ్రకుల ఆధిపత్యాన్ని, పితృస్వామ్యాన్ని, వ్యవస్థలోని సకల ఆధిపత్యాలను సమర్థించడమే దేశభక్తి అని ఒక ఈక్వేషన్‌ ‌తయారుచేశారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తే కూడా దేశద్రోహులనే కదా అంటున్నది.

మతం, సంస్కృతి అని మొదలైన బి.జె.పి, అభివృద్ధి గురించి మాట్లాడుతూ బడా పెట్టుబడిదారుల కనుసన్నలలో దేశ ఆర్థిక విధానాలను అవలంబిస్తూ, ఒక్కసారిగా నోట్ల రద్దు వంటి ʹసాహసోపేతʹ చర్యకు పూనుకున్న క్రమంలో ఈసారి వారి ప్రచారాన్ని చూస్తే వీళ్లు ప్రజల మనసును క్రమంగా సిద్ధం చేశారా అనిపిస్తుంది. స్విస్‌ ‌బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు దేశానికి రప్పిస్తానని, అవినీతిపై యుద్ధమని, నల్లధనం అని ఒక వైపు, తీవ్రవాదమని, సర్జికల్‌ ‌దాడులని ఇంకోవైపు నరేంద్రమోడీ మాట్లాడుతూ రావడం.., యూనివర్సిటీల్లో ఎబివిపి ప్రగతిశీల విద్యార్థి బృందాలను లక్ష్యం చేసుకుని దేశద్రోహులని ఫ్రేం చేయడం.., ఆర్‌.ఎస్‌.ఎస్‌, ‌వి.హెచ్‌.‌పి మొదలు వంద దాకా వారి అనుంగు బృందాలు ఎక్కడికక్కడ ప్రత్యక్షమవుతూ సంస్కమీతి పేరు మీద దాడులు చేయడం, ప్రగతిశీల శక్తులను దెబ్బగొడుతూ, తమ భజన బృందాన్ని తయారుచేసుకోవడం- ఎంత వ్యూహ విస్తరణ! ఇన్ని ప్రయోగాలు చేస్తూ వచ్చి నోట్ల రద్దు వంటి తీవ్రమైన చర్యను కూడా సాఫీగా చేసుకోగలిగారు. దీనికి ప్రతిగా ప్రతిపక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. స్థూలంగా బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు, సరళీకృత ఆర్థిక విధానాలకు ఈ పార్టీలేవీ వ్యతిరేకం కావు. అయినప్పటికీ సాధారణంగా ప్రతిపక్షాలు చేసే హడావుడి కూడా చాలా పేలవంగా ముగిసింది.

ప్రజలు ఏ భావనాప్రపంచంలో ఉంటారో, వారి మైండ్‌సెట్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌వంటి శక్తులు పట్టు సంపాదించుకోగలవు. ప్రజలకు ఏం కావాలి అని కాదు, ఏమిస్తే వెంటనే తీసుకుంటారు అనే ప్రాతిపదికన అవి పనిచేస్తాయి. పాలకవర్గాలకు ఈ తరహా పనివిధానం మామూలే. అయితే ఇందులో కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌రాజకీయ దృక్పథం ఫాసిజం కనక అది దీర్ఘకాలంగా భావజాల రంగంలో నిరంతర ఆచరణలో ఉంది. ప్రజల మానసిక ప్రపంచానికి రాజకీయాలకన్నా మతం ఎక్కువ దగ్గరగా ఉంటుంది. తమను నిరంతరం ప్రభావితం చేస్తున్న రాజకీయార్థిక విషయాల గురించి సాధారణంగా ప్రజలు ఆలోచించరు. అవి తమబోటివారికి సంబంధించని విషయాలు అనుకుంటుంటారు. మతాల మాయావాదాలే తమ దైనందిన జీవితంలో భాగమనుకుంటారు. రాజకీయ చైతన్యం పొందనంతవరకు తప్పుడు భావాల ప్రభావానికి, భావోద్వేగాలకు లోనవడం సులువు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌వంటివాటికి సహజంగానే ఇక్కడ స్పేస్‌ ఉం‌టుంది. మరోవైపు దీనికి వ్యతిరేకంగా హేతువు, శాస్త్రీయ భావాల ప్రచారం పెద్దగా పనిచేయదు. అన్నిటినీ తప్పుడు భావోద్వేగాల స్థాయికి తీసుకుపోయే ప్రచారయంత్రాంగాన్ని మతశక్తులు తయారుచేసుకోగలవు కాబట్టి అవి మనోభావాల గొడవ ఎప్పటికప్పుడు రగిలించగలవు. ఈ తరహా భావజాల విస్తరణ పాలకవర్గాలకు, మార్కెట్టుకు ఎంతో మేలు చేస్తుంది. బి.జె.పి తీసుకున్నది మతాన్ని, మార్కెట్‌ను జమిలిగా విస్తరింపజేసే నినాదాలే. తమకో భక్త బృందాన్ని ఏర్పాటు చేసుకుని, నిరంతరం తమ చర్యలకు సమ్మతిని కూడాగట్టే పనిని శక్తివంతంగా చేసింది. వరుసగా ఘర్‌వాపసీ, ఆవు, కశ్మీర్‌, ‌తీవ్రవాదం, దేశభక్తి, డిజిటల్‌ ఇం‌డియా, నల్లధనం, క్యాష్‌ ‌లెస్‌ ఇం‌డియా అన్నిటినీ సంచలనాత్మకంగా, ఆకర్షిణీయంగా అంతే పకడ్బందీగా ప్రచారం చేసింది.

ఈ కాలంలోనే ప్రగతిశీల శక్తులు ఎప్పటికప్పుడు అవార్డు వాపస్‌, ‌రోహిత్‌ ‌వేముల న్యాయపోరాటం, యూనివర్సిటీ విద్యార్థుల నిరసనలు, ఉనా దళిత ఉద్యమం వంటి రూపాల్లో ప్రతిస్పందించాయి. అవి నిత్యచైతన్య ప్రవాహం వలె కొనసాగాల్సిన అనివార్యత ఉంది. దీనికి స్పష్టమైన రాజకీయార్థిక పోరాటాలు తప్పనిసరి. ఎందుకంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌ప్రవచించే హిందూ సాంస్కృతిక జాతీయవాదం భారత పాలకవర్గ భావజాలం. ఇందులో సాంఘిక అణిచివేత, ఆర్థిక దోపిడి ఉన్నాయి. కులం, పితృస్వామ్యం స్పష్టంగా ఉన్నాయి. నిజానికి ఇండియాలో మతం ఒక మాయ. కులమే వాస్తవం. ఆర్‌.ఎస్‌.ఎస్‌, ‌దాని అనుబంధ సంస్థలు ఆస్తిపర వర్గాల, ఆధిపత్య కులాల ప్రతినిధులు. ఎక్కడైనా అగ్రకులాలు దళితుల మీద దాడి చేస్తే ఈ మతవాద సంస్థలు దళితుల పక్షాన ఉండవు గాక ఉండవు. ఆధిపత్య కులాల పక్షానే ఉంటాయి. దీనిని కప్పి పెట్టి ʹహిందుత్వʹ అంటారు. అవసరమైనప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగానో, క్రైస్తవులకు వ్యతిరేకంగానో అన్ని కులాల్ని సమీకరిస్తారు.

ʹమీరు హిందుత్వ, హిందూ మతోన్మాదం అని వ్యతిరేక ప్రచారం చేస్తున్న కొద్దీ మాకు బలమొస్తున్నదిʹ అని కమ్యనిస్టులనుద్దేశించి వీళ్ళు అంటుంటారు. మనమంతా హిందువులం అని ఎక్కువ మంది ప్రజల్ని వీళ్ళు ఒప్పించగలిగారు మరి! వేరే మతాల గురించైతే మీరు మాట్లాడతారా అని దబాయింపు ఒక పక్క! ఏ మతసారమైనా దోపిడి, అణచివేతలే. శాస్త్రీయత, మానవత ప్రాతిపదికలపై ఏ మతాన్నయినా విమర్శించాల్సిందే. మరి మతం రాజ్యంగమే అయినప్పుడు అది ఇంకెంతగానో ప్రమాదకరం. సెక్యులరిజం మౌలిక సూత్రంగా ఉన్న ప్రజాస్వామ్యంలో రాజ్యానికి మతం ఉండకూడదనేదే అసలు విషయం. నిజమైన ప్రజాస్వామ్యంలో రాజ్యం మతాతీతంగా ఉంటుంది. అలా లేనప్పుడు, సమాజం గతం తాలూకు అంధకారంలో చిక్కుకుపోతున్నప్పుడు ఆ చిక్కుల్ని దాటి ముందుకు పోవడానికి తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది. భారతదేశంలో ఆ చిక్కులు విడిపోలేదు. కాని విడిపోయే సమయం ఆసన్నమయింది. ఈ కల్లోల సూచికలు అదే చెబుతున్నాయి. అయితే మతభావోద్వేగాలను రగిలించి ఆ బలహీనత మీద రాజ్యం చేసే శక్తులకు వ్యతిరేకంగా వివిధ సమూహాల సమీకణ కేవలం భావప్రచారం ద్వారానే జరగదు. ఆ శక్తులు ఏ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయో వాటిపైన ఎక్కుపెట్టబడిన ఉద్యమాలే రేపటి సమాధానాలవుతాయి.

No. of visitors : 554
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
  Self mortality
  దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
  నుల్క‌తోంగ్ నిజాలు
  అప్పుడు
  ఎలా కలవాలి ?
  నిన్న- నేడు - రేపు
  జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
  ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
  మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
  దేశద్రోహ నేరం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •