గోదావరీ కల్లోలం

| సంభాషణ

గోదావరీ కల్లోలం

- కె.ఎన్.మల్లీశ్వరి | 22.04.2017 10:31:31pm

మొగల్తూరు ఆనందా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో దుర్ఘటన జరిగి అయిదుగురు చనిపోయిన విషయం, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఏప్రిల్ మూడవ తారీఖున పాలకొల్లు నరసాపురం వెళ్లాను. తులసి చందు, విశ్వమానవ వేదిక వారు ఈ పర్యటనని సమన్వయం చేసారు. సాధారణంగా వృద్ధాశ్రమాలకి వెళ్ళాలంటే జంకుగా గిల్టీగా ఉంటుంది. వేదిక వారి ఆశ్రమానికి వెళ్ళినపుడు వాళ్ళంతా చుట్టూ చేరి మల్లుల సురేష్ ని జైలు నుంచి ఎలాగైనా బైటకి తీసుకురమ్మని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. రాజకీయాల్లో చేరడం కోసమే ఇదంతా చేస్తున్నాడని స్థానిక నాయకుల ఆరోపణ. తుందుర్రు, కె.బేతపూడి, జొన్నల గరువులో ఆడవాళ్ళు చేస్తున్న పోరాటం గురించి కూడా స్వయంగా వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాను. అదొక ఉత్తేజకరమైన అనుభవం. ఈ పోరాటాన్ని లోకానికి తెలిపే ఏ చిన్న అవకాశం అయినా వారికి సాయపడుతుందేమోనన్న ఆశతో ఈ నాలుగక్షరాలు.

ʹపెరట్లో నాటిన సన్నజాజి, చిన్నమొగ్గలు వేయడం మొదలు పెట్టిందో లేదో వెంటనే ఇల్లు మారవలసి వచ్చిందిʹ అమాయకమైన చిన్ననవ్వుతో ఆ కొత్త పెళ్లికూతురు చెప్పగానే ఎవరికైనా మనసు కదలబారుతుంది. పాలకొల్లుకు చెందిన మల్లుల సురేష్, ఒక యువ సేవా కార్యకర్త. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ జనావాసాల మధ్య నిర్మించడానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజాపోరాటాలకి అతను మద్దతుదారు. ఆ స్టాండ్ తీసుకోగానే అకస్మాత్తుగా అతని మీద వివిధ కారణాలతో పదకొండు కేసులు పెట్టారు.

ముప్పయి మూడేళ్ళ వరకూ ఎలాంటి నేరచరిత్రా లేని అతను పోరాటంలోకి దిగిన నాలుగునెలలలోనే ఒక స్త్రీ పైట లాగాడని, దళితులను కొట్టాడని, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఇంకా అనేక కేసులను బనాయించారు. అతని భార్యని, సహచరులను వారు నడిపే వృద్ధాశ్రమ భవనం నుంచి వెళ్ళగొట్టారు. వారికి జీవికనిచ్చే వనరులను నాశనం చేసారు. సేవ ముసుగులో రాజకీయాలు చేస్తే సహించబోమని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. పార్టీలను విమర్శించాలంటే ఏదో ఒక పార్టీలోకి వచ్చి తీరాలని కొత్త భాష్యాలు చెప్పారు. రాజకీయ శక్తుల మీద పోరాటం అంటే తిరుగులేని ఆధిపత్యం మీద పోరాటం అని తెలిసేసరికి ఆ సేవా సమూహం మీద అన్నివైపుల నుంచి ఒత్తిడి కమ్ముకొచ్చింది. అయినా నిలబడి పోరాడుతున్నారు.

మొగల్తూరులోని ఆనందా ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విషవాయువులు పీల్చి అయిదుగురు చనిపోయిన ఘటన విషయంలో ప్రరవే ఏపీ శాఖ ఆయాప్రాంతాల్లో పర్యటించింది. వివిధవర్గాల ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలు రికార్డ్ చేయడం జరిగింది. బైటి ప్రపంచానికి కనపడే దానికి భిన్నంగా ఉన్నాయి వాస్తవాలు. దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే సంస్థకి స్వప్రయోజనం తప్ప కార్మికుల, ప్రజలక్షేమం ముఖ్యం కాదన్నది అర్థమవుతుంది. యూనిట్ నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలని ఏం చేయాలన్నదాని మీద కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. వాటి అమలు సజావుగా లేకపోవడం వల్లనే తరుచుగా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. హానికారకమైన ఆ వ్యర్థాలను ప్రజల అనేక అవసరాలను తీర్చే గొంతేరు కాలువలోకి నిర్భీతిగా వదిలింది ఆనందా యాజమాన్యం. అందుకు రుజువుగా ఫాక్టరీ నుంచి సరాసరి గొంతేరులోకి పైపులైన్లు ఉండటాన్ని గమనించాము. ఈ విషయం నాలుగునెలల ముందే పసిగట్టిన విశ్వమానవవేదిక, మరి కొంతమంది విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దాంతో జాగ్రత్తపడిన సంస్థ, వ్యర్థాలను భూమిలోపల నిర్మించిన టాంకుల్లో నిలవ ఉంచింది. లోలోపల మురిగిపోయి హానికారకంగా తయారైన వ్యర్థాల పట్ల కార్మికులకి సరే యాజమాన్యానికి అవగాహన లేకపోవడం వల్లనే టాంకులు శుభ్రం చేయడానికి దిగిన అయిదుగురు కార్మికుల ప్రాణాలు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. విషకారక వ్యర్థాలను గొంతేరు లోకి వదిలి ప్రజల ఆరోగ్యాలను, లోపలే మురగబెట్టి కార్మికుల ప్రాణాలను హరించడం మీద ఇపుడు అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అక్కడికి సమీపంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. తుందుర్రు, కె. బేతపూడి గ్రామాల మధ్య ఇళ్ళకి ఆనుకుని పుడ్ పార్క్ సరిహద్దు గోడ నిర్మాణం జరిగింది. అతి చిన్న ప్రాసెసింగ్ యూనిట్ అయిన ఆనందాలోనే ఇంత ప్రమాదం జరిగినపుడు దీనికి పదిరెట్లు పెద్దదైన గోదావరి మెగా ఆక్వాలో ఏ ప్రమాదం జరగదని గారంటీ ఏమిటని అక్కడి మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఫాక్టరీ కడతారో మానతారో వాళ్ళిష్టమని గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఫాక్టరీని ఇక్కడి నుంచి వేరే చోటకి తరలించుకోమని డిమాండ్ చేస్తూ పోరాటం మొదలు పెట్టారు. అనేక చోట్ల మీటింగులు పెట్టుకుని తమ నిరసన తెలియజేసారు. సాధ్యమైనన్ని చోట్ల ధర్నాలు చేసారు. ఈ విషయం మీద చాలా ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నవారు ఉన్నారు. సిపియం పార్టీ సహకారం వల్ల పని చేయగలుగున్నామని కొందరు మహిళలు చెప్పారు. పోరాటం అనగానే ప్రభుత్వాలు మొదట చేసేపని అణిచి వేయడం. వేయి కళ్ళూ చేతులూ చూపు ఉన్న ప్రభుత్వాలు బడుగు జీవుల వేదనని ఆలకిస్తాయని అనుకోవడం పొరపాటు. అందుకే తుందుర్రు, కె. బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మీద పోలీసు పహారా మొదలైంది. పోరాటంలో యాక్టివ్ గా పనిచేస్తున్న ఆరేటి సత్యవతిని నిర్బంధించి 53 రోజుల తర్వాత వదిలిపెట్టారు. ఆరేటి వాసు, త్రిమూర్తులు మొదలైన వారి మీద కూడా కేసులు పెట్టారు.

ఈ ప్రాజెక్ట్ ఆరెంజ్ కాటగిరీలోకి (అదుపు చేయగల కాలుష్యం) వస్తుందని ప్రభుత్వం చెపుతోంది. ఇప్పటికే చిన్నచిన్న ప్రాసెసింగ్ యూనిట్లు చెరువులను కాలువలను మురికి కూపాలుగా మార్చిన అనుభవాల వల్ల ఇంత పెద్దఫాక్టరీ కాలుష్యాన్ని అదుపు చేయగలదని ప్రజలు నమ్మడం లేదు. పూర్తిస్థాయి ప్రైవేట్ ఫాక్టరీకి బడ్జెట్ లో అంత పెద్దమొత్తం ఎందుకు కేటాయించారు అన్న ప్రశ్న కూడా మొదలైంది.. కాలుష్య కారక వ్యర్థాలను అక్కడికి పది కిలోమీటర్ల పైన ఉన్న సముద్రంలోకి వదిలేలా చర్యలు చేపడతామని ప్రభుత్వం చెపుతోంది. సముద్ర కాలుష్యం గురించి పక్కన పెడితే పది కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికోసం ఎంత భూసేకరణ జరపాలి? భూములివ్వడానికి ఒప్పుకోని రైతులను బలవంతంగా ఒప్పించడానికి ఎంత మూల్యం చెల్లించాలి? అంతచేసినా గ్రామాల మధ్యలోనుంచి వెళ్ళే పైపులైన్ల లీకేజీ వల్ల అన్ని కిలోమీటర్ల మేరా ప్రజలు భయాందోళనలతో బతకాలి.

ʹభవంతుల నుంచి తరిమేస్తే ఇళ్ళలోకి మారతాము, ఇళ్లనుంచి తరిమేస్తే గుడిసెల్లోకి మారతాము. మాలపల్లి నుంచే తరిమేస్తే ఇంకా ఎక్కడకి పోవాలి?ʹ పోలీసు బందోబస్తు గుప్పెట్లో ఇరుక్కుపోయిన కె.బేతపూడి గ్రామంలోని ఒక దళితమహిళ ఆవేదన ఇది. కష్టాలగురించి పోరాడే ప్రజలమీద నేరస్తులని ముద్రలు వేయడం, వారిని భయభ్రాంతులని చేయడం, ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టడం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మంచిది కాదు. పీడితుల క్షేమమే అంతిమలక్ష్యంగా పని చేసేవారికి సన్నజాజి పూల వంటి స్వచ్ఛమైన నవ్వులతో ప్రజలు స్వాగతం పలుకుతారు. లేనపుడు పోరాడే గొంతుకల ఉరుములను వినక తప్పదు.

- కె.ఎన్.మల్లీశ్వరి, ప్రరవే(ఏపి)

No. of visitors : 1523
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  అరుణతార సెప్టెంబర్ - 2018
  యాంటి నేషనల్
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
  అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
  కుట్ర
  ఇప్పటికైనా అర్ధమయిందా....?
  యుద్ధానంతర యుద్ధగీతం
  పోలీసుల నీడలో రాపూరు
  అర్హత

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •