ఇసుక మాఫియా కనుసన్నుల్లో ప్రభుత్వం

| సాహిత్యం | వ్యాసాలు

ఇసుక మాఫియా కనుసన్నుల్లో ప్రభుత్వం

- కుమార్ | 04.05.2017 10:44:29am

చిత్తూరు జిల్లాలో ఏర్పేడులో జరగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంది. పచ్చని పల్లెలు వల్లకాడుగా మారడానికి లారీ డ్రైవర్‌ తాగి నడపడమే ప్రధానకారణంగా అందరూ భావిస్తున్నారు. నిజానికి ఇందులో చనిపోయిన 15 మంది సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాలు మాత్రం ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 23.4.17వ తేదీ జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది గ్రామస్ధులు గాయాలపాలయ్యారు. వీరిలో 13 మంది మునగళపాలెం గ్రామానికి చెందినవారు. మిగిలిన ఇద్దరు ముసిలిపేడు గ్రామానికి చెందిన వారు. ఆంధ్రజ్యోతి విలేకరి గ్రామస్ధులు పోలీసు స్టేషన్‌ ముందర చేస్తున్న ధర్నాను కవర్‌ చేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు గ్రామాలు ఏర్పేడు మండలం లోనివి. ఇసుక మాఫియా కారణంగా తమ గ్రామాలలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని వారు ప్రభుత్వాధికారులకు అనేకసార్లు మెరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం వారు ఏర్పేడు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వారిపై లారీ వేగంగా వెళ్లింది. ఇసుకమాఫియాను అరికట్టలేని ప్రభుత్వ అసమర్ధతను ఎండగట్టడానికి వెళ్లిన గ్రామస్ధులు చనిపోయారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బాధితులు పేర్కోంటున్నారు. లైట్‌ వెహికల్‌ లైసెన్సు వున్న వ్యక్తి లారీ డ్రైవర్‌గా మారిపోవడం, అందులోను మద్యం తాగి పూర్తి మత్తులో వుండటం బాధితుల అనుమానానికి బలం చేకూరుస్తున్నది.

ఇక సాధారణంగా జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. పూతలపట్టు-నాయుడుపేట, చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారులపై మలుపుల్లేని ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఈ ప్రతిపాదన 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వం ముందర వుంచబడింది. ఇప్పటివరకు దానికి తగ్గ భూసేకరణ సైతం జరగలేదు. అలాగే జిల్లాలో 94 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు. గత సంవత్సరం 80 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 201 కిలోమీటర్ల పోడవునా రోడ్లపై లోపాలను సరిదిద్దాల్సి వున్నప్పటకీ అవి ప్రతిపాదనల వరకే పరిమితమయ్యాయి.

జిల్లాలో రోజుకు సగటున 18 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదిమంది చనిపోతున్నారు. 25 మందికిపైగా క్షతగాత్రులవుతున్నారు. జిల్లా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో పాటు 4 ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలిగివుంది. అందువల్ల భక్తులు ఎక్కువుగా వస్తుంటారు. తిరుమలకు తరచూ వచ్చే భక్తులే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు గురవడానికి ప్రమాదకరమైన రోడ్లే కారణంగా వున్నాయి. ఎన్‌హెచ్‌ 4, 140, 42, 716 రోడ్లు జిల్లాలో వున్నాయి. ఇవి అత్యంత రద్దీగా వుండే రోడ్లు. 2014లో జిల్లాలో 2,463 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 1,118 మంది చనిపోయారు. 3,049 మంది గాయపడ్డారు. అదే 2015లో 2,300 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 1,342 మంది చనిపోయారు. 2,896 మంది గాయపడ్డారు. 2016లో 2,098 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,056 మంది చనిపోయారు. 3,000 మంది గాయపడ్డారు. మితిమీరిన వేగం, నిద్ర మత్తు, మద్యం సేవించడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మునగళపాలెం గ్రామ రూపురేఖల్నే ఇసుక మాఫియా మార్చివేసింది. ఏకంగా భోగోళిక సరిహద్దులే మారిపోతుండటంతో గ్రామస్ధులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారలు దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలకు తాళాలు వేసి ధర్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి గ్రామస్ధులు ఎస్‌పి ఏర్పేడు పోలీసు స్టేషన్‌కు వచ్చారని తెలిసి ఆమెకు తమ సమస్యను విన్నవించుకున్నారు. పోలీసులు వారిని గేటు బయటే నిలబెట్టి మాట్లాడంతో వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అధికార పార్టీ నాయకులే ఇసుకదందాలకు పాల్పడుతున్నారని పేర్లతో బయటపెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. ఇసుకమాఫియాను ఎదిరించిన వనజాక్షి లాంటి తహసీల్దార్ల పరిస్ధితి ఎంత దయనీయంగా వుంటుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆమెను జుట్టుపట్టి ఈడ్చిన శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను కనీసం పార్టీనుండి సస్పెండు చేయలేదు. గ్రామస్ధులు ఇసుక చుట్టూ కంచెవేసి దేశ సహజసంపదను రక్షించుకోవాలని తాపత్రయపడ్డారు. దాన్ని ఇసుకమాఫియా జేసీబీలతో ధ్వంసం చేశారు. జిల్లా ఎస్‌పీ గ్రామస్ధులను పోలీసు స్టేషన్‌ బయటే నిలబెట్టి మాట్లాడింది. చివరకి ఇసుక అక్రమ రవాణా రెవెన్యూ శాఖలకు చెందిందని ఆమె తప్పించుకున్నారు. ఆమె వెళ్లిన ఐదు నిమిషాలకే 12టైర్ల లారీ పోల్‌ను, ఆటోలను గుద్దుకుంటూ రైతులపై దూసుకు వచ్చింది. ఇందులో చనిపోయినవారి తప్పు ఏమీలేదు. ఇసుకదోపిడీ వత్తాసు పలుకుతూ వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు, ప్రభుత్వమే అసలు దోషులు. లారీ యజమాని రమేష్‌ను, లారీ నడిపిన డ్రైవరు గురవయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇసుకమాఫియాను నడుపుతున్న వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు.

ఉచిత ఇసుక రవాణా నిజానికి సామాన్యులకు ఉపయోగపడాలి. కాని ఇది తెదేపా పార్టీ నాయకులకు ఆదాయవనరుగా మారింది. ఇసుకమాఫియాను వీరే నడుపుతున్నారు. ఇసుకమాఫియాను రాష్ట్రవ్యాప్తంగా నడుపుతున్నది సాక్షాత్తు అధికారపార్టీ నాయకులే. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం దగ్గర ఇసుకను తవ్వి యధేచ్ఛగా లూటీకి పాల్పడుతున్నారు. పోలవరం డ్యామ్‌ నుండి కడెమ్మ కాలువ వరకు కిలోమీటరు పోడవునా ఇసుక తవ్వకాలను జరపకూడదని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. దీన్ని సాక్షాత్తు కృష్ణా జిల్లా కు చెందిన మంత్రే నడుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాగావళి నుండి మంత్రి కిమిడి కళావెంకట్రావు అనుచరులే ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ అనుచరులు ఇసుకమాఫియాను నడుపుతున్నారు. కత్త్రూరు ప్రాంతంలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అనుచరులు ఇసుకదందాను నడుపుతున్నారు. కర్నూలు జిల్లాలో తుంగభద్ర, హంద్రీ నదుల్లో లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను యధేచ్చగా తరలిస్తున్నారు. దీని వెనుక టిడిపి ముఖ్యనాయకులు వున్నారని, జిల్లా ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 34మందిపై కేసులు నమోదు చేసినప్పటికీ, 5 గురిని మాత్రమే అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా స్ధాయి సంఘం 114 ఇసుకరీచ్‌లకు అనుమతి ఇచ్చింది. ఇందులోని 90 ఇసుకరీచ్‌ల్లో పరిమితిని మించి అక్రమ తవ్వకాలు జరిగాయి. అమరావతి, క్రోసూరు, లింగాయపాలెం రీచ్‌ల పరిధిలో ఇప్పటికే రు.1000 కోట్ల ఇసుక వ్యాపారం జరిగింది. కృష్ణానదిలో డ్రగ్గింగ్‌, డ్రజ్జర్ల మిషన్లను పెట్టి, జెసిబిల సహాయంతో 2కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుకను తవ్వేశారు. రావిలాల, వేదాద్రి వద్ద కృష్ణానదిలో తవ్వి తీసిన ఇసుకను హైదరాబాద్‌కు తరలింపజేస్తున్నారు.

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం రచ్చుమర్రి గ్రామం వద్ద వున్న వేదవతి, హగరి నదీ పరివాహాక ప్రాంతాలలోను ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. రోజు 200 ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా ఈ ప్రాంతంలో జరుగుతోంది. ఉరవకండ, గుంతకల్లు, వజ్రకరూర్‌ ప్రాంతాలకు ఈ ఇసుకను చేరవేస్తున్నారు. జిల్లాలోని 5గురు ఎమ్మేల్యేలు, ఓ ఎంపీ ఈ దందాలో పాల్గోంటూ రోజకు 30 లక్షలు సంపాయిస్తున్నారు. తూగో జిల్లాలో కోరుమిల్లి, తాతపూడి, కపిలేశ్వరపురంలో అక్రమ ఇసుక తవ్వకాలను చేపట్టారు. నిజానికి 3 యూనిట్ల ధర రు.900 వున్నప్పటికీ రు.1500 వరకు అమ్ముతున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్నా, స్వర్ణముఖి, కాళంగినదుల్లో ఇసుకను తవ్వుతున్నారు. కలువాయి, సోమశిల, కోటితీర్ధం, ఉలవపల్లి, మాముడూరు, టీకే పాడు, మడవల్లి, తెలుగురాయపురం, పడమటి కంభంపాడు, కోలగట్ల, అప్పారావుపాలెం, సూరాయపాలెం, ఇరువూరు, మహమ్మదాపురం, పచ్చలపల్లి, దరవారిసత్రం, తడ, సూళ్లూరుపేట, ప్రతి రోజు వేల లారీల ఇసకను అక్రమంగా తరలిస్తున్నారు.

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం తహశీల్దారును సస్పెండు చేశారు. అలాగే అక్రమ రవాణాను అడ్డుకోలేదని రేణిగుంట రూరల్‌ సీఐను బదిలీ చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రభుత్వం చర్యలు అధికారపార్టీనేతలన్నే విస్మయపరుస్తున్నాయి. మెత్తం 16మంది చనిపోయిన ఘటనలో సీనియర్‌ అధికారితో విచారణకు సీఎం ఆదేశించారు. ఇసుకమాఫియా డాన్లగా పేర్కుంటూ తెలుగుదేశం నేతలైన ధనుంజయనాయుడు, చిరంజీవి నాయుడలను పార్టీ నుండి సస్పెండు చేసినట్టు సీఎం చెప్పారు. అయితే వీరిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదు. సిఐకు ఇసుక మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలు వున్నప్పటికీ అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, తూతూ మంత్రంగా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. నిజానికి అత్యవసర వస్తువుల కిందకు ఇసుకను తీసుకువచ్చి, ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చిన్నవారిని శిక్షించి చేతులు దులుపుకుంది. ఏర్పేడు సంఘటనలో కుట్రకోణం వుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుకమాఫియానే 16మందిని పోట్టన పెట్టుకుందని అన్ని పార్టీలు ధర్నాలు చేశాయి. కాళహస్తిలో 8 చోట్ల ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు. స్ధానికులు ఇసుకమాఫియాపై ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పెడచెవిన పెట్టారు. గత నెలలో జిల్లాలో 600 ట్రాక్టర్లను ప్రభుత్వ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నా, వారిపై వత్తిడి తెచ్చి, వాటిని విడిపించారు. ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు గేటు బటయే నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఇసుక మాఫియా నేతలు మాత్రం పోలీసు స్టేషన్‌ల్లోనే తిష్ట వేసి కధను నడిపిస్తున్నారు. ఏర్పేడు సంఘటనలోను పోలీసు స్టేషన్లు గేట్లు మూసివేయడం వల్లే ఎక్కువమంది చనిపోయారు. ప్రజల క్షేమం కోసం పనిచేయాల్సిన పోలీసు స్టేషన్లు ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వత్తాసు పలకడం దురదృష్టకరం. జిల్లా ఎస్పీ ఎదుటే ఘోర ప్రమాదం జరుగుతున్నా సరైన చర్యలు చేపట్టలేకపోయారు. బాధిత కుటుంబాలకు కేవలం రు.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వాన్ని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తూ, 300 కోట్లు దండుకున్న ఇసుకమాఫియాను ఎప్పుడు రూపుమాపుతారని ప్రశ్నించారు. స్వర్ణముఖి నదిలో తవ్వకాలు యదేఛ్చగా జరపడం వల్ల పంటలు సైతం కరువును ఎదుర్కున్నాయి. స్ధానికులు ఇసుకను అక్రమంగా తవ్వుతున్న తెదేపా నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు పెట్టలేదు. ఇది పూర్తిగా మానవహక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుంది. వీటిని ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి వుంది. అడుగడుగున్నా ప్రభుత్వ విభాగాలు నిర్లక్ష్యం వహించడం, ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోవడం వల్ల ఏర్పేడు సంఘటన జరిగింది.

ఏర్పేడు సంఘటనలో మరో కోణం ఏమిటంటే, ప్రజల సంపదను యదేచ్ఛగా లూటీచేస్తున్న ఇసక బకాసురులను అరెస్టు చేయాలని ప్రజలు ధర్నా నిర్వహించడం. మండల పరిషత్‌ కార్యాలయంలో ధర్నా చేసేందుకు వచ్చిన గ్రామ ప్రజలు జిల్లా ఎస్పీ వచ్చిందని పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఆమె సమయస్ఫూర్తితో స్పందించి వుంటే సమస్య సద్దుమణిగి గ్రామస్ధులు ఇళ్లకు వెళ్లేవారు. గంటపాటు వారిని పోలీసు స్టేషను గేటు బయటే వుంచారు. అలాగే ఇసుకమాఫియానే ఏర్పేడు ఘటనకు కారణంగా ప్రతిపక్షాలు పేర్కుంటున్నాయి. పధకం ప్రకారమే జరిగిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గత మూడేళ్లుగా గ్రామాల ప్రక్కనున్న ఏట్లో ఇసుకదోపిడీ జరుగుతున్నా ప్రభుత్వాధికారులు మిన్నకుండిపోయారు. ఎమ్మార్వో, పోలీసులు ఇసుమాఫియాతో కుమ్కక్కైనారని బాధితుకుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గ్రామస్ధులు రోడ్డుపై వుండటానికి ప్రధానకారణం జిల్లా ఎస్పీనే. ఆమె వారినందరిని పోలీసు స్టేషన్‌లోకి ఆహ్వానించి చర్చలు జరిపివుండవచ్చు. ఇంత జరుగుతున్నా ఎమ్మార్వో కనీసం కార్యాలయంలో లేకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బోర్లలో నీరెండిపోవడానికి, భూగర్భజలాలకు అడుగంటి పోవడానికి ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వడం ఓక కారణం. స్వర్ణముఖి నదిలో ఏకంగా 40 అడుగల లోతు వరకు ఇసుకను తవ్వేశారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇసుక ఫ్రీ అని చెప్పి ప్రభుత్వం రాష్ట్రంలోని ఇసుకనంతా ఇసుకమాఫియా చేతిలో పెట్టివేసింది. నిజానికి ప్రజాసంపదను కాపాడటానికి పోరాటం చేస్తూ, అశువులు బాసిన గ్రామస్ధులకు చుట్టప్రక్కల ప్రజలు బ్రహ్మరధం పట్టారు. లక్షలమంది ప్రజానీకం వారి అంత్యక్రియలకు హాజరయ్యి ఇసుకమాఫియాను అంతం చేయడానికి తాము సైతం పోరాడతామని చెప్పారు. నిజానికి చనిపోయిన వారిలో చాలామంది తెదేపా పార్టీని అభిమానించేవారు. ఎన్నికల్లో వారికి ఓటు వేసినవారే. లారీ డ్రైవరు గురవయ్యను, క్లీనర్‌ సుబ్రమణ్యాన్ని పోలీసులు అరెస్టు చేశారు గాని, ఇసుకమాఫియాను నడిపిస్తున్న అధికార పార్టీ నాయకులను అరెస్టు చేయలేదు. బాధ్యతారహితంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. వాస్తవాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన తెదేపా ప్రభుత్వం ఈ సంఘటన పట్ల వ్యవహరించిన తీరు అధికార పార్టీ కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది.

ముఖ్యమంత్రి స్వంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా ఎక్కువుగా వుంది. బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కాళంగినదిలోని ఇసుకను ట్రాక్టర్లతో తోడేస్తున్నారు. ఇసుక మెత్తాన్ని ఓకచోట డంప్‌ చేసి లారీల్లో చెన్నైకు తరలిస్తున్నారు. స్ధానికంగా ఇళ్లు నిర్మిస్తున్న వారికి ఇసుక దోరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. నదిలో ఇసుకను తోడెయడం వల్ల భూగర్భజలాలుఅడుగంటి పోయి, వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయి. చిత్తూరు మండలంలోని అనంతాపురం, బీఎన్‌ఆర్‌ పేట, ఆనగల్లు ప్రాంతాలలో ఇసుకను తవ్వుతున్నారు. ఉచితమైన ఇసుకను ట్రాక్టర్‌ లోడును రు.1400 కు అమ్ముతున్నారు. గుడిపాల, చిత్తూర్లకు ఇసుకను తీసుకుపోకుండా ఎక్కువ డబ్బు కోసం తమిళనాడుకు ఇసుకను తరలిస్తున్నారు. చిత్తూరు కార్పరేషన్‌ పరిధిలోని ముత్తిరేవుల రీచ్‌ వద్ద తవ్వుకుంటున్న ఇసుక వల్ల అధికారపార్టీకి చెందిన కార్పరేటర్లు ఏడాదికి రు.50 లక్షలు సంపాయిస్తున్నారు. పలమనేరు మండలంలోని కృష్ణాపురం, రామాపురం, ముసలిమడుగు, సముద్రపల్లె, పెంగరగుంట పరిధిలోని కౌండిన్య నదిలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. అలాగే గంగవరం మండలం కలగటూరు, దండపల్లె ప్రాంతం వద్ద ఇసుకదందా జరుగుతోంది. వి.కోట మండలంలోని పాలారు నదీపరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది. తమిళనాడు సరిహద్దులోని నగరి, విజయపురం మండలాల పరిధిలో కుశస్ధలీ నది ప్రవహిస్తోంది. ఇసుక బకాసురల దెబ్బకు ఏకంగా నదే కుంగిపోయింది. ఈ ఇసుకను తమిళనాడులో ఓక ట్రిప్పర్‌ను రు.40 వేలు చోప్పున, ట్రాక్టర్‌ లోడ్‌ను రు.8 వేలకు విక్రయిస్తున్నారు. బుగ్గకండ్రిగ, ఓరుగుంటాపురం ప్రాంతంలో ఇసుకను తవ్వితీయడంతో నదంతా ముళ్లకంపలే కనబడుతున్నాయి. తవణంపల్లె మండలంలోని బహాదానదిలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. స్ధానిక రైతులు ఇసుకను తవ్వడం ఆపాలని అనేక ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిత్తూరు-అరగోండ ప్రధాన రహదారిలో కట్టిన వంతెన సైతం ఇసుకను తవ్వడం వల్ల కూలిపోయే దశకు చేరుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలువురు తెదేపా నేతలు ఇసుకమాఫియాను నడిపిస్తున్నారు. వీరికి స్ధానిక మంత్రుల అండదండలున్నాయి. ఇసుక కోసం శ్మశానాలను, తాగునీటి బావులను తవ్వేశారు. శ్రీకాళహస్తి మండలంలోని చుక్కలనిడిగల్లు, పుల్లారెడ్డి కండ్రిగ, అమ్మపాళెం, తండమనాడు గ్రామపరిధిలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలోని ఇసుక బెంగుళూరు, చైన్నైలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీనికి స్ధానిక మంత్రి అండదండలున్నాయి. జిల్లాలోని చోటాతెదేపా నాయకులందరూ ఈ ఇసుక తవ్వకాల్లో నిమగ్నమయ్యిన్నారు. కృష్ణాజిల్లాలో స్ధానిక మంత్రులు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమాలు తవ్వకాలను కోనసాగిస్తున్నారు.అలాగే పెన్నులపాడు, కాసరం, చిట్టత్తూరు, బోనుపల్లి తదితర గ్రామాల్లోను ఇసుక మాఫియా విజృంభిస్తోంది. ఏర్పేడు మండలంలోని గోవిందవరం, పెనుమల్లం, వికృతమాల, చెల్లూరు, మునగళపాలెం గ్రామాలలో ఇసుకను తవ్వుతున్నారు. గోవిందపురానికి చెందిన ఇద్దరు తెదేపా నేతలు ఇసుక మాఫియా వల్ల రు.200 కోట్లు లాభపడినట్టు స్ధానికులు చెప్తున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి స్ధానికులు ఫిర్యాదు చేసిన ఫలితం వుండటం లేదు. ప్రజలు వీధిపోరాటాలకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజల సంపదైన ఇసుకను ప్రభుత్వం అందరికీ సమానంగా ఇవ్వాల్సిన అవసరం వుంది. అధికారపార్టీ నాయకులకు ప్రభుత్వాధికారులు కోమ్ము కాయడం వల్ల ఇసుక మాఫియా విజృంభిస్తోంది. ఇసుకను సరుకుగా చేసి, దాన్ని సైతం అక్రమంగా రావాణా చేస్తూ, పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్న వారిని ఆర్ధికనేరస్ధులుగా పరిగణించాలి. వీరివల్ల రాష్ట్ర ఆర్ధికవ్యవస్ధ దెబ్బతింటోంది. ప్రభుత్వానికి రావలసిన ఏటా రు.500 కోట్లను ఇసుక మాఫియానే తినేస్తుంది. ప్రజలు తిరగబడుతుంటే ప్రభుత్వమే వారిని బెదిరిస్తోంది. ఉచితం పేరుతో సాగుతున్న ఇసుక మాఫియా దందా తెదేపా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచ్చింది. తెదేపా భారీ మూల్యం చెల్లుంచుకోక తప్పని పరిస్ధితిని కల్పించింది. ప్రకృతిని కాపాడాల్సిన ప్రభుత్వమే చేతులెత్తేస్తే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రమాదముంది.

రాష్ట్రంలో ఏటా 8 వేల కోట్లు ఇసుకను అక్రమంగా తవ్వడం వల్ల ఇసుక మాఫియా సంపాయిస్తోంది. ఇది అధికారపార్టీకి ప్రధాన ఆదాయవనరుగా వుంది. దీంట్లో సంపాయిస్తున్న అక్రమ సంపాదనే రేపు ఎన్నికల్లో ప్రవహించనుంది. అధికారపార్టీకి చెందిన నాయకులే ఈ దందాను నడిసిస్తున్నారు. పోలీసులు ఇసుకమాఫియాను ఏం చేయలేకపోతున్నారు. నిజాయితీపరులైన ప్రభుత్వాధికారులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారన్న భయంతో తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఏర్పేటు తరహా సంఘటనలు రాష్ట్రంలో చాలా చోటుచేసుకున్నాయి. వీటిని పట్టించుకోవడం ప్రభుత్వం మానేసింది. ఏర్పేడు ఘటన ఇసుకమాఫియాను అరికట్టకపోవడం వల్లే జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ తరహా సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరుగకుండా వుండాలంటే ఇసుకమాఫియాను అరికట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. వేల కోట్లు ఇసుకదందా వల్ల వస్తుండటం వల్ల దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించదు. జిల్లాలో ఎర్రచందనం, ఇసుక మాఫియాకు అధికారపార్టీ ప్రత్యక్ష అండదండలున్నాయి. కాబట్టే ప్రజలే ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి.

No. of visitors : 744
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •